ఐదోది by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

యుద్ధం ఎప్పుడూ న్యాయబద్ధమైన కారణాలతోనే మొదలౌతుంది. న్యాయం రెండువైపులా వుంటుంది. అలాంటి ద్విపక్షన్యాయంతో ఏ వొక్కరూ తగ్గకుండా రెండుదేశాలూ ఏడాదిగా యుద్ధం చేస్తున్నాయి. ఊరంతా ధ్వంసమైంది. బాంబులతో దద్దిరిల్లి, అలసిపోయిన ఆ ప్రాంతంలోకి నేను అడుగుపెట్టాను జ్ఞాపకాలని వెతుక్కోవటానికి. అక్కడే పుట్టి పెరిగినా నాకు ఆ శిథిలాల్లో నా యింటిని గుర్తుపట్టడానికి కాస్త కష్టమైంది.
“అది డిబి మామ యిల్లు… ఇది విపిడి పిన్ని యిల్లు… ఆ పక్కది క్యుబికె తాతది…” అంటూ ఆనవాళ్ళు వెతుకుతూ నడుస్తున్నాను. అలా దాదాపు పది యిళ్ళు దాటాక గడిచిపోయిన జ్ఞాపకంలా మాయిల్లు… మూడొంతులు కూలిపోయి కనిపించింది. కూలిపోయినా అది యిల్లేగా?
మా యిల్లు… అమ్మా, నాన్న, అన్న, ఇద్దరు తమ్ముళ్ళు నాతో కలుపుకుని ఆరుగురం. యుద్ధం రాకపోయి వుంటే నేను నడిచిన దారంతా మాలాంటి పిల్లల్లో కొందరు నవయౌవనపు విరితూపుల్నీ, మరికొందరు ఉరుకులూ పరుగుల్తో కూడిన బాల్యపునవ్వులనీ నింపుతూ వుండేవారు. అమ్మలు దోసిళ్ళనిండా కబుర్లని తుంచి పోస్తుండేవారు. నాన్నలు శ్రమ విత్తనాల్ని పిల్లలకోసం వాకిళ్ళలో నాటేవారు. అదొక ఆగని ప్రవహంలా సాగిపోయేది.
కానీ యుద్ధం వచ్చింది. జేబులోంచీ తీసి భూకంపాన్ని మామీద పడేసినట్టు శతృదేశం మామీద దాడికి దిగింది. అప్పుడుకదా, జీవితాలు తలకిందులైంది! డిబి మామ, విపిడి పిన్ని, క్యుబికె తాత… అందరిళ్ళమీదా బాంబులు పడ్డాయి. ఇప్పుడు ఆ దారుల్లో నవ్వులూ పువ్వులూ ఏవీ లేవు. కాసిని ఇటుకకుప్పలు, కొన్ని రాళ్ళగుట్టలు, కూలిన గోడలు, విరిగిన తలుపులు… మధ్యమధ్యలో వచ్చి జ్ఞాపకాలని వెతుక్కునే మనుషులు. ఇప్పుడు వాళ్ళలో నేను.


అతన్ని మొదటిసారి నేనొక రక్షణశిబిరంలో చూసాను.
మా ప్రాంతంలో బాంబులు పడ్డప్పుడు చాలామంది చచ్చిపోయారు. కొంతమందికి తీవ్రమైన గాయాలయ్యాయి. వాళ్ళని అలాగే వొదిలేసి మిగిలిన కొద్దిమందీ చెల్లాచెదరుగా పరిగెత్తాం. అలా పరిగెత్తి చివరికి ఒక మెట్రోరైల్వేస్టేషన్లో తలదాచుకున్నాం. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. అతనుకూడా. ఒక స్తంభానికి ఆనుకుని నేలమీద ముడుచుకుని కూర్చున్నాడు. ముఖంలో ఇంకా భయం కనిపిస్తోంది. గాల్లోకి అలా చూస్తూ వున్నాడు. అతని పక్కన కొద్దిగా చోటుంటే ఇరుక్కుని కూర్చున్నాను. సర్దుకుంటూ నాకేసి అభావంగా చూసాడు.
అక్కడున్న చాలామంది ఏడుస్తున్నారు. యుద్ధాన్నీ, శతృదేశాన్నీ తిడుతున్నారు. అతనలా వుండటం భయాన్ని కలిగించింది.
స్వచ్చందసేవకులు మాకు కొన్ని సదుపాయాలు చేసారు. అంటే తినటానికి మనిషికో రొట్టే, తాగటనికి నీరూ ఇచ్చి వెళ్ళారు.
నాకు ఇల్లు గుర్తొస్తోంది. అమ్మ, నాన్న, అన్న, ఇద్దరు తమ్ముళ్ళు… బాంబులు పడే సమయానికి నేను ఇంట్లో లేను. క్యుబికె తాత పిల్లలతో కలిసి పొలానికి వెళ్ళాను. అలా బతికిపోయాను. బాంబుదాడిలో మా యిల్లుకూడా కూలిపోయిందని అనుకుంటున్నాను. మావాళ్లెవరేనా కనిపిస్తారేమోనని శిబిరం అంతా తిరిగి చూసాను. తెలిసినవాళ్ళుకూడా ఎవరూ కనిపించలేదు వివరం చెప్పడానికి.
రెండురోజులు గడిచాయి. పూటకో చప్పటి రొట్టెతో కాలం గడుస్తోంది. తర్వాతేమిటనేది నాకేమాత్రం తెలీని గ్రీకుభాషలో రాసి వున్నట్టుంది.
అతనికీ నాకూ మధ్య ఒక బంధం ఏర్పడింది. అతను లేచినప్పుడు నేనూ, నేను లేచినప్పుడు అతనూ మా స్థలాలని కాపలా కాసుకుంటున్నాం. ఏమీ మాట్లాడుకోలేదు. అందరూ ఒకేలా అనుభవించిన విషాదాన్నిగురించి చెప్పడానికి మౌనంకన్నా గొప్ప భాషేం వుంటుంది?
శతృసైనికులు వూరంతా తిరుగుతున్నారట. బయటికి వెళ్ళి చూసి వచ్చినవాళ్ళు చెప్తున్నారు. కొత్తగా వచ్చినవాళ్ళు ఇంకా వివరంగా చెప్తున్నారు. బాంబుదాడుల్లో వంటరిగా మిగిలిపోయినవాళ్ళని తీసుకెళ్తున్నారట… తిరుగుబాటుదారులనుంచీ తమని తాము కాపాడుకునే మానవకవచాలుగా వాడుకోవటానికి… వాళ్ళతో అంతకన్నా వుపయోగం ఏముంటుందనేది వాళ్ళ ఆలోచన. భార్యాభర్తలపై మాత్రం వాళ్ళు చూపించేది మానవత్వమట.
మూడోరోజు… మనుషులు వస్తునే వున్నారు. దు:ఖాన్నీ భయాన్నీ నింపుతున్నారు. శిబిరం అంతా మనుషుల భావాల వాసన. ఎంతకాలం ఇలా? గ్రీకులో రాయబడిన అదే భవిష్యత్తు. ఇంకా ఎవరూ విడమరిచి చెప్పట్లేదు.
ఇంకోరోజు… శతృసైనికులు శిబిరంలోకి వచ్చారు. అందర్లో భయం. మామధ్యలోంచీ నడిచారు. మమ్మల్ని పరీక్షగా చూడటానికి మరోసారి అటూయిటూ తిరిగారు. వంటరిగా వున్నవాళ్లని తమతో తీసుకెళ్తారట. మగపిల్లల్ని సైన్యంలోకీ, ఆడపిల్లల్ని… చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు.
అసభ్యకరమైన ప్రశ్నలు వేస్తున్నారు. ఆడవారంతా తలలు దించుకుంటున్నారు. మగవాళ్ళ ముఖాలు నిస్సహాయతతో ఎర్రబడుతున్నాయి.
నేను అతన్ని చెయ్యి పట్టుకున్నాను.
“నీ భార్యనని చెప్పు” అన్నాను.
“ఎలా?”
“నాకు కుడివైపు చాతీమీద నల్లటి పుట్టుమచ్చ వుంది. వాళ్ళడిగితే చెప్పు”
“నమ్ముతారా?”
“నమ్మించు. మీ నాన్న మీ అమ్మగురించి ఎలా మాట్లాడతాడో అలాంటి భాష… మొరటైనవాళ్లమధ్య వుండేలాంటి భాష అది మాట్లాడు… నన్ను తిట్టు…” నా కళ్ళలో నీళ్ళు నిండాయి. అతను చలించాడు.
“రెక్కలు విరిగిన పావురాయి కాలికి చుట్టుకున్న బంధమా, నిన్ను కాపాడతాను” అన్నాడు.
ఆ తర్వాత మాయిద్దరిమధ్యా భయంకరమైన గొడవ మొదలైంది. అతను భర్త, నేను భార్య. తన తండ్రి స్థానంలో అతను. నాకు తెలీని అతని తల్లి స్థానంలో నేను నిస్సహాయంగా నిలబడ్డాను. చాలా తిట్లు తిట్టాడు. నేను మూర్ఖురాలినట. తెలివితక్కువదాన్నట. నా పుట్టింటివాళ్ళు అతన్ని గౌరవించలేదట. ఇలా మాలో మేము వాదులాడుకున్నాము.
“చాలా ఇది?” మధ్యలో ఆగి అడిగాడు.
“మీ నాన్న మీ అమ్మని ఇలాగే…?!” ఆశ్చర్యంగా అడిగాను.
“కొట్టేవాడుకూడా” క్లుప్తంగా అన్నాడు. నాకా స్త్రీపై జాలి కలిగింది. యుద్ధం ఆమెకి విముక్తి కలిగించిందా లేక అలవాటైపోయిన ఆ జీవితాన్ని విడవటానికి ఆమె బాధపడి వుంటుందా?
సైనికులు మమ్మల్ని గమనిస్తున్నారు. వాళ్ళకింకా నమ్మకం కలిగి వుండదు. వాళ్ళవైపు చూసిన అతనిలో వున్నట్టుండి రౌద్రం. నా జుత్తు పట్టుకున్నాడు. గుంజిగుంజి వూపుతూ తిడుతున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. భార్యాభర్తలుగా వుండటం ఇంత దుర్మార్గంగా వుంటుందా? జుత్తు అలాగే పట్టుకుని గోడకేసి తల కొట్టబోతుంటే పక్కనున్నవాళ్ళు ఆపారు.
“మూర్ఖుడా! ఆ పిల్లని చంపేస్తావా ఏమిటి?” ఎవరో నా పక్షాన మాట్లాడారు.
సైనికుడొకడు మా దగ్గరికి వచ్చాడు.
“ఏంటి గొడవ?” గర్జించినట్టే అడిగాడు.
“భార్యాభర్తల తగాదా” ఇంకెవరో జవాబిచ్చారు.
అతనింకా రొప్పుతునే వున్నాడు. నాకు అతన్ని చూస్తుంటే భయం వేసింది. పక్కన కూడా కూర్చోవాలనిపించలేదు. కానీ ఎలా?
సాయంత్రానికల్లా శిబిరం ఖాళీ చేయించారు.
సైనికులతో వెళ్ళినవాళ్ళు వెళ్ళగా మిగిలినవారితో ఇద్దరం బయటికి వచ్చాము.
“క్షమించు. నొప్పెట్టిందా?” అడిగాడు. నాకు కన్నీళ్ళతోపాటు కోపంకూడా వచ్చింది. తల తిప్పుకున్నాను. అతన్ని అక్కడే వదిలిపెట్టి నాదారిన నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను.
“ఆ ఎర్రముఖం సైనికుణ్ణి చూస్తుంటే కోపం పట్టలేకపోయాను… ఈ పరిస్థితులకి వాళ్ళేగా, కారణం?”
“ఐతే నేనేం చేసాను?”
“మా ప్రాంతంలో ప్రతిమగవాడూ జీవితంలో కనీసం పాతికసార్లేనా శతృదేశాధినేతని కొడతాడట, మా నాన్న చెప్పాడు. వాళ్ళ చిన్నప్పుడుకూడా ఇలాగే యుద్ధం”
“అదేమిటి?”
“ఆయనకి కోపం వచ్చినప్పుడల్లా అమ్మలో వాడే కనిపిస్తాడు మరి!”
నాకు నవ్వొచ్చింది, కానీ ఆపుకున్నాను.
“నిజంగానే నన్ను క్షమించు” అతను చాలా బాధతో అన్నాడు.
క్షమించక తప్పలేదు. ఇతను వెంటలేకపోతే ఎక్కడో ఒకచోట సైనికులకి చిక్కిపోతాను.
అతని పెదాలమీద చిన్ననవ్వు. శరీరానికేనా, మనసుకేనా అయిన ఏ గాయమూ అలాగే వుండిపోదు. మనిషి అక్కడే ఆగిపోడు. బతకాల్సిన అవసరం ముందుకి నెడుతుంది. అందుకే ఈ ప్రపంచంలో ఇన్నివేల యుద్ధాలు జరిగినా, యుద్ధాలపేరిట ఇంత మారణహోమం జరిగినా ఇంకా
మనుషులు బతికే వున్నారు. బతుకుతునే వున్నారు. రేపెప్పుడో ఈ రెండు దేశాలూ కూడా ఒకదాన్నొకటి క్షమించుకుని సంధి వొప్పందం చేసుకుంటాయి. అప్పుడొక ప్రశ్న తలెత్తుతుంది. దేశమంటే అధినేతలు, వాళ్ళ అహాలు, వాళ్ళు గీసిన హద్దురేఖలు మాత్రమేనా, ప్రజలు కాదా అని. దాన్ని వుద్దేశ్యపూర్వకంగా కప్పిపెట్టేస్తారు. ప్రజలకి అందమైన యిళ్ళు కట్టించి ఎన్నో తాయిలాలిచ్చి, అన్నీ మర్చిపోవాలంటారు. ప్రజలు మర్చిపోరు. వదిలేస్తారు. ఇంకోయుద్ధానికి మరో తరాన్ని తయారుచేసేవైపుగా నడక సాగుతుంది. వాళ్ళకి తెలీకుండానే.
గుంపులతో కలిసి నడుస్తున్నాం. దారీ గమ్యం లేని నడక. స్వంతదేశంలోనే కాందిశీకుల్లా రక్షణశిబిరాలకోసం వెతుకులాట.


జ్ఞాపకాలని వెతుక్కోవటానికి నేను మా యింటికి వెళ్ళాను. అతన్ని వదిలేసి. వంటరిగా. మొదటిసారి. దేశద్రిమ్మరుల్లా తిరిగి తిరిగి మళ్ళీ మావూరే రావటంతో సాధ్యపడింది.
నాలుగు అస్తిపంజరాలు… తొలగించడానికి పక్కని పెట్టినవి. ప్రాణం వున్నప్పుడు అమ్మ, నాన్న, అన్న, బుజ్జితమ్ముడు… ఆ చిన్నిది వాడిదేకదా? మరి యింకొకడు ఎక్కడ? వాడూ నాలాగే తప్పించుకున్నాడా? లోలోపల చిన్న సంతోషం. రావల్సిన ఏడుపుని తోసుకుని ముందుకి వచ్చిన ఆ సంతోషాన్ని చూస్తే అనిపించింది, భవిష్యత్తు ఒక్కటే కాదు, జీవితమే అర్థంకానిదని.
నా యిల్లనుకున్న ఆ ప్రదేశంలో శిథిలాలమధ్య, ఛిద్రమైపోయిన జ్ఞాపకాలు వెతుక్కుంటూ అటూయిటూ తిరిగాను. నావి కాకుండా ఇంకేవో అడుగుల చప్పుడు… వినీ వినిపించనట్టు. వగర్పు… వినిపించకుండా ఆపుకుంటున్నట్టు. భయం వేసింది. ఒక వస్తువు తీసుకుని వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. సగం కూలిన గోడకి వున్న అలమరలో చెయ్యి పెట్టాను. అది అక్కడే వుండాలి… దుమ్ము పట్టేసిన ఎర్రటి కొయ్యబొంగరం. నేను అందుకోబోతుంటే నాకన్నా ముందు వేగంగా మరో చెయ్యి దాన్ని అందుకుంది.
“అది నాది” ఆ చెయ్యి తాలూకూ గొంతు.
తలతిప్పాను.
నా పక్కనే ఒక చిన్నిమనిషి. కనుచీకట్లో ఏవో అస్పష్టమైన పోలికలు… పుట్టీపుట్టగానే నా చూపుడువేలు పిడికిట్లో పెడితే గట్టిగా పట్టుకుని తన లేలేతస్పర్శతో నువ్వు అక్కవి అని మొదటిసారి తెలియజెప్పిన… నా కాళ్లమీద పడుకుని తన చిన్నిచిన్ని కాళ్ళూచేతులూ ఆడించిన… పెద్ద బుజ్జిపిల్లాడివా? నా పెద్దతమ్ముడివా?
నేను ఆ అస్తిపంజరాలకేసి చూసాను.
“ఐదోది నావొంట్లో వుంది” నా వెతుకులాటకి జవాబు. అంతేకదా? వాడికి ఐదోది నా వొంట్లో వుంది.
“నువ్వు…”
“వాళ్ళు వెంటాడుతున్నారు. కనిపిస్తే వదలరు. ఇక్కడినుంచీ వెళ్ళిపో”
“అంటే నువ్వు…”
బయట బరువైన వాహనం ఏదో ఆగినట్టు శబ్దం. వాడు నన్ను పక్కకి చీకటిగా వున్నవైపుకి తోసేసి వెళ్ళిపోయాడు. ఆ వాహనం వెళ్ళిపోయింది.
నాగుండె ఆక్రోశించింది. నా ఐదోది వాడి వొంట్లో ఎంతకాలం వుంటుందో తెలీదు. భవిష్యత్తు గ్రీకుకన్నా జటిలమైన భాషలో కనిపించింది.
అతను…
“నీకోసం వెతుకుతూ ఇటొచ్చాను. పాపం ఒక పిల్లాడిని పట్టుకున్నారు వాళ్ళు. ఇదే యింటిదగ్గర. వాడు కావాలనే దొరికిపోయినట్టున్నాడు… నువ్వేమిటి ఇక్కడ? … ఆ పిల్లాడు?” అతనికి అర్థమయ్యీ కానట్టు అయోమయం. నా కన్నీళ్ళు… ఆపుకోలేని నా దు:ఖం…వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు.
“అందరూ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనమూ వెళ్దాం. దూరాన ఒక దేశం వుంటుందట. అక్కడ యుద్ధాలూ, బాంబులూ ఏవీ వుండవట. మనుషులు పెళ్ళి చేసుకుని మనవలూ, మునిమనవలదాకా బతుకుతారట. అలాంటిచోటికి వెళ్దాం” అన్నాడు.