స్ఫూర్తిప్రదాత by Maddala Sakunthala Devi

  1. స్ఫూర్తిప్రదాత by Maddala Sakunthala Devi
  2. నిను తలచి – నను మరచి by Rakesh Yallamilli
  3. భూమిపుత్రుడు by Sailaja Ramshaw
  4. మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao
  5. నాణెం రెండో వైపు!! by Savitri Ramanarao
  6. నా దారిలోనే నేను!! by Savitri Ramanarao
  7. బిందువు by Sailaja Ramshaw
  8. ఓన్లీ వన్ by Shailaja Ramshaw
  9. బీజం by Sailaja Ramshaw
  10. పనిమనిషి by Mangu Krishna Kumari
  11. నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao
  12. చెద by Sailaja Ramshaw

ఉదయం ఇంటినుండి బయలుదేరేటప్పుడు ఆకాశం తేటగానే వుంది. మబ్బులూగట్రా ఏమీ లేవు. కాకినాడలో దిగగానే ఆకాశం మేఘావృత్తమైంది. అలాగే పి.ఎఫ్. ఆఫీసుకి వెళ్ళేను. పని కాలేదుగానీ, ఆఫీసులోనుండి ఇవతలకు రాగానే ముసురుపట్టి వాన మొదలైంది. చుట్టుపక్కల ఆటోలు కూడా ఏమీ లేవు.
వానకి తడవకుండా ఎదురుగా ఉన్న బస్‍స్టాపు వద్ద నిలబడ్డాను. ఒకవేళ ఆటో దొరికి బస్‍స్టాండుకి వెళ్ళినా తుని వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు. ఎవరైనా తెలిసినవాళ్ళు కన్పిస్తే బాగుండుననిపించింది. నా ఆలోచనల్లో నేనుండగా, “సుశీలా!” అన్న పిలుపు
వినిపించింది. ప్రక్కకు చూశాను. నా ప్రక్కన యశోద నిలబడి వుంది.
“అరె మీరిక్కడ?”” కాస్త ఆశ్చర్యంగానే అడిగి, “నేను పెన్షన్ ఆఫీసుకి వచ్చాను. మరి మీరో?” అని అడిగింది
“నేనూ డిటో” అన్నాను. “ఈరోజు క్లర్క్ శెలవులో ఉన్నాడట. రేపు ఉదయం రమ్మన్నారు. మిమ్మల్నీనా?””
“అవును” అంది.
“ఇంత వానలో రాత్రి తుని వెళ్ళి, మళ్ళీ పొద్దున్నే రావడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. వయసు మీదపడుతోంది కదా!”
“నిజమే. మీరు చెప్పినట్లు ఇప్పుడు తుని వెళ్ళి, మళ్లీ ఉదయం రావటం కష్టమే” అంది యశోద. ఆవిడకు పాపం మోకాళ్ళ నొప్పులు కూడా. నేను డెబ్భై దగ్గరలో ఉన్నానేమో, చీకటిలో కళ్ళు సరిగా కనిపించవు. ఆడవాళ్లం కావడంతో రాత్రి హోటలులో ఉండటానికి భయం వేస్తుంది. నేను అదే మాట యశోదతో అన్నాను.
“సుశీలా! మీరు కంగారుపడకండి. కామాక్షిగారని నాకు తెలిసిన ఒక రిటైర్డ్ టీచరు ఉన్నారు. వాళ్ళింటికి వెళ్ళి ఈ రాత్రి ఉందాము”
“ఫరవాలేదా? ఆవిడేమీ అనుకోరా? పోనీ ఫోను చేసి అడుగుదామా?” ఆ మాటలకి నిశ్చింత వచ్చినా, ఏదో మొహమాటం.”
“ఫర్లేదు. పదండి. వెడదాము” అంటూ ఖాళీగా పోతున్న ఆటోను ఆపి “”రండి” అంది.
ఎక్కి కూర్చుంది. చేసేది లేక నేనూ ఎక్కేను. కానీ మనసులో నాకు చాలా సంకోచంగా వుంది. యశోద చెప్పిన కామాక్షిగారు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో? ఇంతకీ ఇంట్లో ఉందో లేదో? నా మనస్సులోని శంకలను ఆవిడముందు వుంచక మునుపే ఆటో ఓ ఇంటిముందు ఆగింది. తలుపులు వేసి వున్నాయి. యశోదమ్మ ఆటోవాడిని పంపేసి, “ఫరవాలేదు, నాతో రండి” అంటూ కాలింగ్ బెల్ వత్తింది. సుమారు ఓ యాభై సంవత్సరాల వయస్ను ఆవిడ తలుపు తీసి “అమ్మా! మీరా? రండి” అంటూ మమ్మల్ని లోనికి ఆహ్వానించింది.
“వెంకటలక్ష్మీ! అమ్మగారు లేరా?” అని అడిగింది యశోద.
“అమ్మగారు పనుందని బయటకు వెళ్ళేరమ్మా! ఒక గంటలో వస్తానన్నారు. ముందు మీరలు తలలు తుడుచుకోండమ్మా” అంటూ మాకు టవల్సు తెచ్చి ఇచ్చింది. ఇంతలో మా మాటలు విని ఇంకో ఇద్దరు మహిళలు సుమారుగా మా వయస్సు వాళ్ళే ఇవతలకు వచ్చేరు.
“అరె యశోదా, మీరా! ఈ వానకి మీరు కూడా ఇక్కడ ఆగిపోయారా?” అని వాళ్ళు అడుగుతుంటే యశోద నన్ను వాళ్ళకు పరిచయం చేసింది. వాళ్ళలో ఒకావిడ పేరు జమున, మరొకామె పేరు శ్యామల.
“అమ్మా! మంచినీళ్ళు తీసుకోండి. టీ పెట్టమంటారా? కాఫీయా?” అడిగింది వెంకటలక్ష్మి.
“టీ అయితే ఈ వానలో బాగుంటుంది కద, శ్యామలా” అంది యశోద.
“అమ్మా! వీళ్ళతోపాటు మీకు కూడా టీ తేనా?మళ్ళీ తాగుతారా?” అడిగింది వెంకటలక్ష్మి జమునా, శ్యామలావాళ్ళని.
“ఏం! మేమేం పాపం చేసుకున్నాం? ఒకసారి వుదయం త్రాగితే మళ్ళీ టీ తాగకూడదా? వంట అయ్యేటప్పటికి ఎలాగూ ఓ గంట పడుతుంది. వాన కూడా పడుతోంది. రాత్రి… ఈ చలిలో టీ తాగితే భలే మజాగా వుంటుంది. అందరికీ తీసుకురా వేడి వేడి టీ” తలుపు తోసుకుని లోపలికి వచ్చి, చెప్పులు, గొడుగు పక్కన పెట్టి కుర్చీలో పెట్టి అంది అప్పుడె వచ్చిన మరో స్త్రీ. ఆవిడా మా వయసుదే.
“కామాక్షీ! మేము పెన్షన్ ఆఫీసుకు వచ్చాము. పనికాలేదు. అందుకే ఈ రాత్రి ఇక్కడ ఉందామని వచ్చాం. ఇదుగో, తను సుశీల. ఈ పెన్షను పనులమీదే పరిచయం” చెబుతూ ఆవిడకు నన్ను పరిచయం చేసింది యశోద.
“ఫరవాలేదు. ఒక్కరాత్రి కాకపోతే రెండు రోజులుండండి. మీ పని పూర్తి చేసుకొని మరీ వెళ్ళండి” అంది కామాక్షి మనస్ఫూర్తిగా.
అంతా అయోమయంగా అనిపించింది.
ఏమిటి? ఇదేమైనా హాస్టలా?” రకరకాల అనుమానాలు నా మనసును చుట్టుముడుతున్నా అడగడం సభ్యత కాదని ఊరుకున్నాను. వెంకటలక్ష్మి యిచ్చిన వేడివేడి టీ తాగుతూ అందరం కబుర్లలో పడ్డాం. ఇంతలో యశోద లోపలికి వెళ్ళి “వెంకటలక్ష్మీ! ఈ వేళ కూరేం వండుతావు?” అని” అడిగి చిక్కుడు కాయలు తెచ్చింది. అందరం కలిసి చిక్కుళ్ళు బాగు చేసి ఇచ్చాము. వంట పూర్తయ్యేలోగా రకరకాల విషయాలమీద మామధ్య చర్చలు జరిగాయి.
జమున అంది, ““ఏమైనా అనుకోండి కామాక్షీ! నా మనసులో మాట చెబుతున్నాను… మీ ఆలోచనలు, మీ పనులు చాలా ఉదాత్తంగా ఉంటాయి””
“అంతంత పెద్ద మాటలు వద్దు. సమాజంపట్ల ప్రతీ ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తించాలి. ఆడవాళ్ళం, మనలో చాలామంది వంటరివాళ్ళం. పెద్దైపోయాం. ఏదో నాకు చేతనైన సాయం చేస్తున్నాను” అంది కామాక్షి. అప్పటివరకూ అర్ధమయీ అవనట్లు ఉన్న పజిల్ విడిపోయింది.
“ఇలా ముఖపరిచయం కూడా లేనివాళ్ళకు ఆశ్రయం ఇస్తే వాళ్ళు మోసం చెయ్యరా?” అడిగాను సస్నేహంగా.
“ఎందుకు చెయ్యరూ? రెండుసార్లు అలాగే జరిగింది కూడా. కట్టుకుందుకు ఇచ్చిన చీరతో సహా అందిన వస్తువులు తీసుకొని అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఒకామె ఉడాయించింది” నవ్వుతూ జవాబిచ్చింది. “అప్పటినుండి నేనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంక ఒకచీరో దుప్పటీయో అంటే అవసరం ఆ పని చేయిస్తోందనుకోవాలి. మీకూ తెలుసును. అయినా ఎవరో ఏదో చేశారని మనకు చేతనైన సహాయం ఇతరులకు చెయ్యక పోతే ఎలా? వంట చేస్తూంటే చెయ్యికాలిందని నిప్పు వెలిగించడం మానెయ్యలేము కదా? చెయ్యి కాలడానికి మన అజాగ్రత్తే కారణమని అనుకొని ఇంకొంచె జాగ్రత్తగా ఉంటాం కదా? దేవుని దయవల్ల నాకు తిండికి లోపం లేదు. నా కొడుకులు బాగానే సంపాదించుకొంటున్నారు. వాళ్ళకి నేను కూడబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా మనందరం కలిసి ఇంత ఆనందంగా గడిపిన ఈరోజు ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది?”
ఇంతలో వెంకటలక్ష్మి వచ్చి వంట అయిందని, అందరినీ భోజనాలకు లేవమని చెప్పింది.
“అన్నట్టు నాకు తగ్గట్టే ఈ వెంకటలక్ష్మి కూడా. ఇంటికి వచ్చిన అతిథులకు అన్నీ ఆదరంగా చేస్తుంది” నవ్వుతూ ఆమె వైపు చూసింది కామాక్షి.
““ఊరుకోండమ్మా! నాలాంటి ఒంటరిదానికి ఆశ్రయమిచ్చారు. మీ ముందు నేనెంత?”
“ఒకళ్ళనొకళ్ళు పొడుగుకుంటూ రాత్రి తెల్లవార్లూ ఇలాగే కూర్చుందామా? పద పద…”” డైనింగ్‍హాలువైపు నడిచింది కామాక్షి. అంతా అనుసరించాం.
ఆ రాత్రి నాకు చెప్పలేని ఒక అనుభూతిని మిగిల్చింది. రిటైరయిననాటినుండి ఏవైనా సేవాకార్యక్రమాలలో పాల్గొని సమాజసేవ చెయ్యాలని అనుకునేదాన్ని. కానీ ఏదీ చెయ్యలేకపోయాను. ఏదైనా చేద్దామంటే ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు. ఇప్పుడు కామాక్షి నాకు స్ఫూర్తిప్రదాతగా నిలిచింది.
చెయ్యగలిగిన సాయం… చిన్నదైనా… స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ అన్న గురజాడ సూక్తి నాకు గుర్తుకొచ్చింది.
(ఆంధ్రభూమి 11.7.2006)