ఓన్లీ వన్ by Shailaja Ramshaw

  1. స్ఫూర్తిప్రదాత by Maddala Sakunthala Devi
  2. నిను తలచి – నను మరచి by Rakesh Yallamilli
  3. భూమిపుత్రుడు by Sailaja Ramshaw
  4. మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao
  5. నాణెం రెండో వైపు!! by Savitri Ramanarao
  6. నా దారిలోనే నేను!! by Savitri Ramanarao
  7. బిందువు by Sailaja Ramshaw
  8. ఓన్లీ వన్ by Shailaja Ramshaw
  9. బీజం by Sailaja Ramshaw
  10. పనిమనిషి by Mangu Krishna Kumari
  11. నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao
  12. చెద by Sailaja Ramshaw

(ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక, జూన్ 2003)
“రశ్మీ! రశ్మీ! క్విక్ పద, హాస్పిటల్‍కి వెళ్ళాలి. అమ్మని జాయిన్ చేశారట” అని తొందరగా బయలుదేరదీశాడు మాధవ్.
“అమ్మకేమైంది నాన్నా! ఒంట్లో బాగోలేదా?” కళ్ళనిండా నీళ్లతో అడుగుతున్న రశ్మిని దగ్గరగా తీసుకున్నాడు.
“ఏం లేదమ్మా! అమ్మకేం కాదు. మనకో బుజ్జిపాపాయిని ఇవ్వడానికి హాస్పిటల్లో ఉంది. అంతే!” అని సముదాయించి రశ్మిని తీసుకొని బయలుదేరాడు.
లేట్ ప్రెగ్నెన్సీ అవ్వడం వలన, చాలా జాగ్రత్తగా ఉండాలంటే, ఆరునెలలనుండి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది కాంతి. ఎలా అవస్థపడుతోందో ఏమో? తనసలు ఇప్పుడు పిల్లలేంటి, వద్దనే అన్నాడు. కానీ ఆమే పట్టుదలగా రెండోబిడ్డకోసం ఎదురుచూసింది. ఈ తొమ్మిదినెలల్లో తాను పడే అవస్థ ఎవరికీ తెలియకూడదని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. తరచుగా వచ్చి చూసి బాధపడొద్దని కూడా చెప్పింది. ఆమె మనసులో ఏముందోగానీ ఏ ప్రమాదమూ వాటిల్లకుండా సుఖప్రసవం జరిగి క్షేమంగా ఇంటికి చేరితే అంతే చాలు. ఆ ఆలోచనలోనే హాస్పిటల్ చేరారు. హాస్పిటల్ ముందు కారు ఆపి రశ్మిని తీసుకుని లోపలికి నడిచాడు మాధవ్. కాంతి తండ్రి ఎదురొచ్చాడు.
“కాంతికి ఎలా వుంది మామయ్యా! మీరేంటి అలా ఉన్నారు?” అని అడగగానే –
“ఫర్వాలేదన్నారు బాబూ, ఇంకో గంట పట్టవచ్చునన్నారు” అంటూ భుజం తట్టి లోపలికి తీసుకువచ్చాడు. లోపలికి వెళ్లిన రశ్మి, మాధవ్‍లకు కాంతి తల్లి లేబర్‍రూమ్‍ముందు దిగులుగా కూర్చుని కనబడింది .
“అమ్మమ్మా!” అని దగ్గరకు వెళ్లిన రశ్మిని దగ్గరకు తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది ఆవిడ.
రెండుగంటల నిరీక్షణ తరువాత లేబర్‍రూమ్‍లోనుండి పసిపాప ఏడుపు వినిపించింది. నర్స్ బయటకు వచ్చి “పాప పుట్టిందండీ” అని చెప్పేసి, మళ్ళీ హడావుడిగా లోపలకు వెళ్లిపోతుంటే “కాంతి ఎలా ఉంది?” అనడిగాడు మాధవ్. “ఆమె కూడా బాగున్నారు” అనేసి లోపలకు వెళ్ళిపోయింది.
అరగంట తరువాత పువ్వులా ఉన్న పాపని తీసుకొచ్చి చూపించింది నర్స్. మగతగా ఉన్నా కాంతిని వార్డుకి షిఫ్ట్ చేశారు.
డాక్టర్ బయటకు వచ్చి మందులు రాసిచ్చి “ఆమె చాలా నీరసంగా ఉంది. అంతేతప్ప భయపడాల్సింది లేదు. ఆపరేషన్ అవసరమౌతుందేమో అనుకున్నాము. కానీ ఇంకేమీ కాంప్లికేషన్స్ లేకపోవడంవలన నార్మల్ డెలివరీ అయ్యింది. ఇంక ప్రాబ్లెమ్ ఏమీ లేదు.” అనగానే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు.
ఆ రోజుకి ఇంటికి తిరిగివచ్చినా, అప్పుడే అరవిరిసిన పువ్వులా ఉన్న పాప మొహం ఒకవైపు, నలిగిపోయి సొమ్మసిల్లినట్టుగా ఉన్న కాంతి మొహం మరోవైపు మాధవ్‍ని నిద్రపోనివ్వలేదు. ఎంతచెప్పినా వినకుండా రెండవసారి గర్భవతైంది కాంతి. ప్లానింగ్ పిల్స్ లాస్ట్ ట్రిప్‍లో భీమిలి సముద్రంలో పడేసింది. ఇప్పుడు ఎంత అవస్థపడింది? ఆమెకేదైనా అయితే తనను తను క్షమించుకోగలిగేవాడా? ఇప్పుడు అంతా బాగానే ఉందిగా! అని అనుకున్నా ఆమె శారీరకంగా ఎంత బాధపడిందో తనకు తెలుసు. పిచ్చిపిచ్చి కలలతో, ఊహలతో, ప్రసవసమయంలో ఏ వార్త వినాల్సివస్తుందోనని చాలా భయపడ్డాడు. పరోక్షంగా కడుపున పడ్డ చిన్నదాన్నికూడా విసుక్కొనేవాడు. క్షేమంగా ప్రసవం అయితే చాలునని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకొనేవాడు. ఈ నీరసం తగ్గి మళ్ళీ హుషారుగా ఎప్పుడు ఇంట్లో తిరుగుతుందో ఏమో! చాలా స్ట్రిక్ట్‌గా ‘ఓన్లీ వన్’ అని అనుకొనే రశ్మిని కన్నారు. సడన్‍గా పదిసంవత్సరాల తరువాత ఈ ఆలోచన ఎందుకు కలిగిందో తెలియదు. డెలివరీ అయితేగానీ తన నిర్ణయం వెనుక కథ చెప్పనంది. ఒక పెళ్ళయిన యువతిగా మరో బిడ్డను కనాలనుకోవడం తప్పు కాదని వాదించేది. ఏది ఏమైనా కాంతి కోరిక తీరింది అంతే చాలు అనుకుంటూ నిద్రలోకి ఒరిగాడు మాధవ్.


డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంటే ఇద్దరినీ పిలిచి డాక్టర్ ప్రత్యేకంగా చెప్పింది బలమైన ఆహారం, మందులు వాడమని, రెగ్యులర్‍గా వచ్చి చెకప్ చేయించుకోమని, మూడు నెలలు బరువు పనులు చేయకుండా రెస్ట్‌గా ఉండాలని. అన్నీ విని డాక్టర్‍కి థాంక్స్ చెప్పి బయటకు వచ్హారు దంపతులిద్దరూ.


పాపని ఒళ్ళో పెట్టుకొని మంచం మీద కూర్చుంది కాంతి. మొహంలో నీరసం కనిపిస్తున్నా నలుగు పెట్టి స్నానం చేయించారేమో పట్టుచీరలో మెరిసిపోతోంది. రశ్మి తల్లి దగ్గరే కూర్చొని పాప గులాబీబుగ్గలని, వత్తయిన నల్లనిజుట్టుని ఏదో అద్భుతంలా పరికించి చూస్తుంటే “చిన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉండేదానివి తెలుసా?” అంది.
ఆ మాటలకి రశ్మి తల ఎత్తి “నిజంగానా అమ్మా!” అని అడిగింది.
“నిజం రా! ఇన్ ఫాక్ట్ నువ్వు ఇంకా బాగుండేదానివి” అంటూ తల ఎత్తి చూసిన కాంతికి ఎదురుగుండా మాధవ్, అతని తమ్ముడు రాజీవ్, తోడికోడలు రమ కనిపించారు.
“లోపలికి రండి” అని ఆహ్వానించింది.
“నాన్నా! పాప నిద్రలో నవ్వుతోంది తెలుసా? పిన్నీ, చూద్దువుగానీ రా!” అని రమని మంచం దగ్గరకు లాక్కెళ్ళింది.
“నాకివ్వండి అక్కా!” అని పాపని తీసుకొని పక్కమీద పడుకోబెట్టి, “కొంచెం సౌకర్యంగా కూర్చోండి” అని దిళ్లు సర్దింది రమ. రాజీవ్‍కూడా పాపని చూసి “రశ్మి చిన్నప్పుడు ఇలానే ఉండేదికదా వదినా!” అంటూ దగ్గరికి మోడా లాక్కుని కూర్చున్నాడు.
“వదినా, ఒక్క మాట అడగనా? ఏమీ అనుకోవుగా!” అనగానే –
“అడుగు రాజీవ్, నన్నేదయినా అడగడానికి నువ్వు పర్మిషన్ అడగాలా?” అన్నది కాంతి.
“బయటకు వెళ్లి ఆడుకో రశ్మి” అని దాన్ని బయటకు పంపి వదిన వైపు తిరిగాడు రాజీవ్.
“మీ ముచ్చట్ల మధ్య మేం ఉండొచ్చా?” అని నవ్వుతూ అడిగాడు మాధవ్.
“ఉండు అన్నా! నువ్వు లేకుండా ఎలా?” అన్నాడు రాజీవ్.
“తొందరగా అడగవోయ్, చాలా సస్పెన్స్‌గా ఉంది” అంది కాంతి.
ఒక నిముషం మౌనంగా ఊరుకొని “వదినా! నిన్ను బాధపెట్టాలని కాదు. నీ ఆరోగ్యం సహకరించదని తెలిసీ, ఇప్పుడు ఈ బిడ్డని ఎందుకు కన్నావు? వన్ ఆర్ నన్ అని అనేదానివి కదా! అదీకాక ప్రెగ్నెన్సీ గూర్చి మాకెవ్వరికీ తెలియనీయవద్దన్నావుట. ఒంట్లో బాగుండలేదు అంటే వద్దామని అనుకున్నాం. వెళ్లి చూస్తాను అంటే తనని డిస్టర్బ్ చేయవద్దంది అన్నాడు అన్న. సడన్‍గా హాస్పిటల్లో ఉన్నావని, పాప పుట్టిందని తెలియగానే అందరం ఆశ్చర్యపోయాం. నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటావని, దాన్ని ఇంత రహస్యంగా అమలుచేస్తావని అనుకోలేకపోయాం. దీని వెనుక కారణం ఏమిటి?” అడిగాడు రాజీవ్.
ఆలోచనలో పడ్డట్టుగా అయిదునిముషాలు ఆగి మొదలుపెట్టింది కాంతి. “మొదట రెండవభాగానికి జవాబు చెపుతాను. ప్రెగ్నెన్సీ టైములో ఈ బిడ్డ గురించి వాదోపవాదాలు వినడం నాకిష్టం లేకపోయింది. లేట్ ప్రెగ్నెన్సీ అవడం వలన అయితేనేం, నా అజాగ్రత్త వలన అయితేనేం నా ఆరోగ్యం కొంతవరకు దిగజారింది. దానికి ఈ బిడ్డే కారణం అని దూషిస్తారేమో అని భయపడ్డాను. అందువల్లనే ఎవ్వరికీ తెలియనివ్వద్దన్నది. ఇంక దీన్ని కనడానికి కారణం మాత్రం వేరే ఉంది.”
“…”
“ఒక్కక్కొరూ ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క దృష్టితో చూస్తారు. ఒక వారంరోజులు నువ్వు రాకపోతే ఇంట్లో అందరూ డిస్ట్రబ్ అయిపోతారు. రశ్మి అయితే ఏకంగా ఏడుస్తుంది, బాబయ్య రాలేదని. విశ్వమానవ సౌభ్రాతృత్వం, పాపులేషన్ ఎక్సప్లోషన్ అని ఏవో ఆదర్శాలతో ఒక్క బిడ్డ చాలని అనుకున్నాను. కానీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి, స్వేచ్చగా తగవులాడుకోవడానికి ఏదైనా శృతిమించినా మళ్ళీ హృదయానికి హత్తుకోవడానికి రక్తసంబంధీకులు ఉండాలి. నీకు గుర్తుందో లేదో, ఒకసారి నీకు జ్వరం వస్తే దగ్గరుండి బ్లడ్ టెస్టులన్నీ చేయించి టైఫాయిడ్ అని తెలిసాక మందులు వేసి, డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లి, నీ దగ్గరే గడిపారు మీ అన్న. మరి రశ్మికేదైనా అయితే, దానికంటూ ఎవరైనా ఉన్నారా ? పిలిస్తే పలకడానికి, పరుగెత్తుకు రావడానికి తోడబుట్టిన వాళ్ళు ఉండక్కర్లేదా?”
“…”
“భూమికి ఆవలి వైపు ఉన్నా, ఏకోదరులైతే ఒక్క ఫోన్ కాల్ దూరమేగా, ఎలా ఉన్నావే అని ఫోన్ వస్తుంది. జబ్బో, జ్వరమో అయితే, రాగలిగిన దూరమైతే తప్పకుండా పరిగెత్తుకు వస్తారు. ఎన్ని మనస్ఫర్ధలు ఉండనీ, పిలవగానే పలికేది తోడబుట్టినవాళ్ళే. అది ఒంటరిగా ఉండకూడదని నా కోరిక. పాలవ్వనీ, నీళ్లవ్వనీ కలసి పంచుకొంటారు. సుఖాలైనా, దుఃఖాలైనా సమానంగా అనుభవిస్తారు.”
“…”
“ఒక్కొక్కరోజు సాటిపిల్లలతో కలవకుండా మౌనంగా ఉండిపోవడం వెనుక, దాని ఒంటరితనం నాకు మాత్రమే కనబడుతుంది. స్కూల్లో తరిగిపోతున్న చురుకుతనం, తనలాగే మైల్డ్‌వుండే ఫ్రెండ్స్‌నే ఎంచుకునే విధానం ఇవన్నీ నన్ను చాలా భయపెట్టాయి. జీవితానికి చదువు, డబ్బు మాత్రమే ముఖ్యం కాదుగా! జబ్బుకి, జ్వరానికి మాత్రమే కాదు, ఏ విజయాన్ని పంచుకోవడానికో, ఏ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికో మనకంటూ ఒకరుండాలి. అందుకే కష్టమైనా ఇంకొక బిడ్డని కనాలి అనుకొన్నాను.”
“…”
“ఇంక పెద్దమ్మ పిల్లలు, పినతండ్రి పిల్లలు అంటావా! ఈ పరుగులు తీసే ప్రపంచంలో కజిన్స్‌కి చోటు ఉందా? మావాడికి చెల్లెలి తరువాతే ఎవరైనా? అనే తల్లి తండ్రుల స్వార్ధంలో తోబుట్టువుల ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నాకింకొక సందేహం, అసలు రశ్మి మీ పిల్లలని ప్రేమించడానికి, దానిలో అసలు ఎవరినైనా ప్రేమించాలనే భావన ఉందా? ఛారిటీ ఎలా ఇంటినుండి ప్రారంభం అవ్వాలో, అలాగే ప్రేమించడం అనే భావన కూడా పెరగాలి. ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో చూడు, కలిసి పెరుగుతారు, ఆడుకొంటారు, తగవులాడుకొంటారు. అంతలోనే ఒకటవుతారు. వేరే పిల్లలతో తగవులు వస్తే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొంటారు. ఒకరి సక్సెస్‍తో మరొకరు ఆనందం పొందుతారు. అన్నలు తెచ్చే గిఫ్ట్‌లకోసం ఎదురుచూసే చెల్లెళ్ళు, అక్కల పట్టుపరికిణి కట్టుకోవాలని ఎదురుచూసే చెల్లెళ్ళు, సింగిల్ చైల్డ్ కుటుంబాలలో ఎక్కడ ఉన్నారు? అన్నీ ఫ్రెష్ లేదా యూజ్ అండ్ త్రో. ఇదంతా నా స్వార్థం కప్పిపుచ్చుకోవడానికే అని అంటే నేనేమి చెప్పలేను. అంతెందుకు, నిన్ను నువ్వే నిజాయితీగా ప్రశ్నించుకో, నీ దృష్టిలో వదినకి, అక్కకి తేడా లేదా? అబ్సొల్యూట్లీ దేరిజ్ నో కంపారిజన్. అక్క అక్కే, అక్క తరువాతే ఎవరైనా అంటావు. రశ్మికి కూడా అలాంటి చెల్లెలో, తమ్ముడో ఉండాలని అనుకోవడం లో తప్పులేదు కదా. ఎంతో అలోచించి అవసరం అనిపించి, ఈ బిడ్డకు జన్మనిచ్చాను. ఇంక డెలివరీ టైంలో నాకేదైనా అయితేనే అని నీ సందేహం కదూ!. మీరందరూ ఉండగా రశ్మికేం లోటు? ఈ నిర్ణయం వెనుకనున్న నా మనసిది” అని ముగించి అలసటగా పక్క మీదకు వాలింది కాంతి.
అప్పటిదాకా ఆరోగ్యం గురించి పట్టించుకోలేదని కోపంగా వున్న మాధవ్ ప్రసన్నంగా మారడంతో కాంతి మొహం సంతృప్తిగా మెరిసింది. కొత్తగా వచ్చిన గెస్ట్‌ని గుండెలకి హత్తుకొని ముద్దు పెట్టుకొంది. వదిన ఇచ్చిన వివరణ నచ్చిన రాజీవ్ చిరునవ్వుతో లేస్తూ ఎవరూ చూడకుండా రమ కేసి చూసి “రెడీ కావోయ్ ఇంకో బిడ్డ కోసం” అన్నట్లు కొంటెచూపు విసిరాడు. అంగీకార సూచకంగా రమ మొహంమీద విరిసిన నవ్వులో రాజీవ్ చూపు విలీనమయ్యింది.