నిను తలచి – నను మరచి by Rakesh Yallamilli

  1. స్ఫూర్తిప్రదాత by Maddala Sakunthala Devi
  2. నిను తలచి – నను మరచి by Rakesh Yallamilli
  3. భూమిపుత్రుడు by Sailaja Ramshaw
  4. మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao
  5. నాణెం రెండో వైపు!! by Savitri Ramanarao
  6. నా దారిలోనే నేను!! by Savitri Ramanarao
  7. బిందువు by Sailaja Ramshaw
  8. ఓన్లీ వన్ by Shailaja Ramshaw
  9. బీజం by Sailaja Ramshaw
  10. పనిమనిషి by Mangu Krishna Kumari
  11. నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao
  12. చెద by Sailaja Ramshaw

“నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే”” అని తనకు చెప్పాలని ఉంది.
నేను అంటే ’‘తను లేని నేను‘” అని అందరికీ విడమరచి చెప్పాలని ఉంది.
తాను నాలో నింపిన ఆత్మవిశ్వాసం. నన్ను నన్నుగా ఇష్టపడ్డ తన వ్యక్తిత్వం దూరమై ఏదో తెలియని వెలితితో జీవిస్తున్నాను. ఆ వెలితిని నింపే వెలుగురేఖ తనే ! అని గొంతెత్తి అరవాలని ఉంది. తను రాసిన ఉత్తరం చూడనంతవరకూ నాలోని భావాలు ఇవే. నాలో కట్టలు తెంచుకుంటున్న భావావేశానికి తన ఉత్తరం అడ్డుకట్ట వేసింది.
తన ప్రేమను పొందాల్సిన వయస్సులో, తనతో నడవాల్సిన రోజుల్లో భవిష్యత్తు- బంధాలమధ్య చిక్కుకుని, బాధ్యతలు తలకెత్తుకోవాల్సిన వయసులో తన జ్ఞాపకాల బరువును మోస్తూ నిర్జీవంగా జీవించాను ఇప్పటివరకు.
పుస్తకాల పేజీలమధ్య దొరికిన ఈ ఉత్తరం నా గుండెలోతుల్లో దాగున్న ప్రేమలా ఎక్కడా చెక్కుచెదరలేదు. అది ఈ రోజెందుకో ఇరవైసంవత్సరాలక్రితం ఏర్పడ్డ గాయాన్ని తిరిగి రేపింది. అప్పుడు తనని ప్రేమించాను. అందరిలానే మనసిచ్చాను. ప్రేమిస్తున్నానని తనే చెప్పేంతవరకు ఎదురుచూశాను. అదృష్టం ఒక్కో వయసులో ఒక్కోలాగా కనిపిస్తుంది . నాకు ఆమె ప్రేమ దొరకడం అదృష్టం గా అన్పించింది. ఒక ప్రేమికుడిగా ఇంకేం కావాలి? నాకు తెలిసిందల్లా ప్రే”మించడమంటే” ప్రేమలో ఒకరినొకరు “మించిపోవడమే”! జాబ్ రాగానే పెళ్లి చేసుకోని తనను సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ తనకు నాకంటే ముందు ఉద్యోగం వచ్చేసింది.
తను, “పెళ్లి మాటేమిటి?” అని అడిగింది.
“పెళ్ళికి తొందరేం ఉంది?” అన్నాను. “నాకు రెండు సంవత్సరాలయినా పడుతుంది జీవితంలో స్థిరపడటానికి” చెప్పాను.
తన స్థానంలో ఉండి ఆలోచించలేకపోయాను. తను నిర్ణయాధికారం లేని ఆడపిల్ల అని తెలుసుకోలేకపోయాను. మన భావాన్ని వ్యక్తం చేయడం కూడా ఒక కళే. అ కళను ప్రదర్శించడంలో తడబడ్డాను. తాను తప్పుగా అర్థం చేసుకుంది. నాకు ప్రేమ విలువ తెలియదంది. దూరం జరిగింది. ఏముందిలే మళ్ళీ తనే సర్దుకుంటుందని పొరపడి, పట్టుదలతో ఉద్యోగవేటలో పడ్డాను.
మేమేమీ వీధిలోనో, కాలేజీలోనో తారసపడి ప్రేమించుకున్నవాళ్ళం కాదు. తను నాకు ఒక పత్రికలో కలం స్నేహంద్వారా పరిచయం అయ్యింది. కలంస్నేహం అంటే ఇప్పటి ఫేస్‍బుక్‍లాంటిది. కొత్తవాళ్ళతో స్నేహం చేయాలనుకునేవారు తమ అడ్రసును పత్రికకు పంపిస్తే అది ప్రతివారం ప్రచురిస్తుంది. దానిలోని వయసు చదువునుబట్టి ఎవరైనా స్నేహితులను ఎంపిక చేసుకోవచ్చు.
మా స్నేహం మొదలయ్యేసరికి మేమిద్దరం తొమ్మిదోతరగతి చదువుకుంటున్నాం. చిన్నగా మొదలైన మా స్నేహం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఇంచుమించు నేను డిగ్రీ అయ్యేదాక సాగింది. మేమెప్పుడూ చూసుకోలేదు. అలాంటి అవసరం కూడా రాలేదు. అప్పట్లో ఉత్తరాల ద్వారా నే మాట్లాడుకునేవాళ్ళం. తన ప్రేమను వ్యక్తపరిచిన తరువాత మాలో కవులు కవయిత్రులు, ఉద్భవించారు.
ఉద్యోగం సాధించి ఆమెకు కనపడాలి అని అనుకున్నాను. తాను నేను తనతో ఉంటే చాలునకుంది. తను కుటుంబాన్ని పోషిస్తానంది. తన తల్లిదండ్రులతో మాట్లాడి వేడుకుంది…
ఉద్యోగం లేని నాకు అహం అడొచ్చింది. అటువైపు ఉత్తరాలు మా ఇంటివైపు రావడం మానేశాయ్. ఉద్యోగం వచ్చిన తరువాత చాలాసార్లు మళ్ళీ ఉత్తరాలు రాశాను ఒక్కదానికీ జవాబు రాలేదు. రిజిస్టర్డ్ ఉత్తరం పంపితే కానీ తెలియలేదు, అ అడ్రస్‍లో వాళ్ళు లేరని. ఎక్కడని వెతకను, చేజార్చుకున్న ప్రేమని.
కాలక్రమంలో నా వయసుకు పెళ్ళయింది. మనసు బ్రహ్మచారిగానే ఉండిపోయింది. ఈమధ్యే ప్రమోషన్‍మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి నాకు సంబంధించినవన్నీ సర్దుకుంటున్నాను. తను చివరిగా రాసిన ఉత్తరం కనపడింది. బహుశా నేను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటుంది . నేను చూసుకోలేదు. అంతా నా మంచే కోరుకుంటూ ఇక ఉత్తరాలు రాయొద్దని, తన కుటుంబాన్ని తాను ప్రేమిస్తున్నానని, తనని మర్చిపోయి జీవితంలో స్థిరపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించమని, అదే తనకు నేనిచ్చే గొప్పబహుమతి అని కోరింది. ఇంతవరకు కుటుంబానికి బాధ్యతనే తప్ప ప్రేమను పంచని నాకు ఆమె మాటలు గుండెకు గునపాల్లా గుచ్చుకున్నాయ్. ఆమె కోరిన ఒక లక్ష్యాన్ని అయితే చేరుకున్నాను కానీ కుటుంబానికి ప్రేమను పంచడంలో విఫలమయ్యాను. మా ప్రేమ స్వచ్చమైనదో కాదో నాకు తెలియదు. కానీ తను నాకు చెప్పిన రెండో మాట కూడా పాటించాలని ఉంది..
నేను సర్దిన పెట్టెను మోయలేకమోస్తున్న నా భార్యను చేయిపట్టుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంటే, నేను దూరం వెళ్ళిపోతున్నందుకు ఆమె కనుపాప మాటున సప్తసముద్రాలు సుడులు తిరుగుతూ కనపడ్డాయ్. చెమర్చిన నా కళ్ళు మాత్రం ఆమెను క్షమించమని అడుగుతున్నాయ్. ఆప్యాయత నిండిన ఆ కౌగిలినుండి బయటకు రావాలనిపించడం లేదు.