పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

ఆమె అతన్ని పండూ అని పిలుస్తుంది. అతనికి ఆమె బుజ్జి. పెళ్ళికిముందు ఆమెని పుట్టింట్లో అలానే పిలిచేవారు. అది పట్టుకుని ఏడిపించడంతో మొదలై, ఆమె రిపార్టీ ఇవ్వడంతో ఆ పిలుపులు స్థిరపడిపోయాయి. వాళ్ళకో ఆర్నెల్లబాబు. వాడిని క్యూటీపై అంటారు. చిటికేస్తేనూ, పిలిస్తేనూ తల తిప్పి చూస్తాడు. నోరంతా తెరిచి నవ్వుతాడు. ఇప్పటికే భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులు. పెద్దైతే వాడినీ తమ మిత్రబృందంలో కలిపేసుకుంటారు. అలాంటి సులువైన జీవితం.


లాప్‍టాప్ మూసేసి అలసటగా కుర్చీలో వెనక్కి వాలాడు కళ్యాణచక్రవర్తి. అతన్నే భార్య పండూ అని పిలిచేది. ఒక మల్టీనేషనల్ బ్రాండ్‍వేర్ కంపెనీ మార్కెటింగ్ వింగ్‍కి అతను హెడ్. పొద్దున్నే జపానువాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ వుంటుంది. మధ్యాహ్నం దాటాక యురోపియన్ దేశాలతో, ఆఖర్న యూయస్‍తో. ఎవరికివాళ్ళు ఫ్రెష్‍గా మొదలుపెడతారుగానీ, మొదటి రెండు సెషన్సూ అయేసరికి అతను అలిసిపోతాడు. ఇక్కడ రాత్రౌతూ వుంటే అక్కడ యూయస్‍లో మొదలౌతుంది. గంటో రెండుగంటలో వుంటాయి కాల్స్. అప్పటికి రాత్రి పదికి తక్కువవదు. ఆ తర్వాత బ్రాంచెస్‍నుంచీ స్టాట్స్ తెప్పించుకుని వాటిని అనలైజ్ చేసి వేరే డిపార్టుమెంటుకి పంపాలి. జీతం బాగానే వుంటుంది. దానికి సరిపడ్డ మోతాదులోనే వత్తిడికూడా. ఇదివరకు జీతానికి తగ్గ పని అనేవారు, ఇప్పుడు జీతానికి తగ్గ వత్తిడి అనాలి.
కొద్దిరోజుల్లో తాము ఎదుర్కోవలసిన సమస్య ఒకటి ముందు వుంది. దాని గురించి ఆలోచించే టైమే వుండట్లేదు.
క్యూటీపైకి ఆరునెలలు నిండుతాయి. అన్నప్రాశన అయింది. ఘనాహారానికి కొద్దిగా అలవాటుపడుతున్నాడు. సమీరకి లీవు పూర్తౌతోంది. మెటర్నిటీలీవుపైన ఇంకోరెండునెలలు కూడా తీసుకుని ఇంట్లో వుండిపోయింది. ఇప్పుడిక వాడిని ఎక్కడ వుంచాలి, ఎవరు చూస్తారు అనేవి తక్షణం ఎదురుగా వున్న సమస్యలు.
వెనుకటి అమ్మమ్మలు, నాయనమ్మల తరం కాదు ఇప్పుడున్నది. మనవల్ని పెంచడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఎవరి కారణాలు వాళ్ళకే వున్నాయి. లెక్కేస్తే కనీసం వందకి పైన. తన తల్లికి ఇంకా పదేళ్ళ సర్వీసుంది. వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
“ఇప్పుడేకదా, బాధ్యతలన్నీ తీరి, జీతాలు పెరిగి వుద్యోగాన్ని ఆస్వాదిస్తున్నది? కంప్యూటర్లొచ్చాయి. పని తగ్గింది. ఏళ్ళతరబడి చేసిన గాడిదచాకిరీకి ఫలితం కనిపిస్తోంది. కావాలంటే మీయిద్దర్లో ఒకరు మానేసి వాడిని చూసుకోండి. మీకు మళ్ళీ కావాలంటే వుద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ నన్ను కానేదెవరు?” అంది. పిల్లలని పెంచే కళకూడా ఆవిడకి పెద్దగా రాదు. కావలిసినవి అమర్చటం, బాగా చదువుతున్నారో లేదో చూసుకోవడం తప్ప, తమతో ఆడటం, కబుర్లుచెప్పటం చేసేది కాదు చిన్నప్పుడు. కాస్త తీరిక దొరికితే టీవీముందు కూర్చునేది. తమ చిన్నతనంలో అమ్మమ్మ తీసుకెళ్ళి పెంచింది. ఇష్టమో, కష్టమో, అప్పుడు పెంచడానికి ఎవరో ఒకరు ముందుకి వచ్చారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు.
ఇక సమీర తల్లి… ఆవిడకి కేన్సరు వచ్చి తగ్గింది. పువ్వుని చూసుకున్నట్టు చూసుకుంటాడు మామగారు. అన్నీ ఆయన చేస్తే పక్కని నిలబడి మమ అనటం తప్ప ఇంకేదీ చెయ్యలేదు. సమీరని డెలివరీకి తీసుకెళ్ళినా ఆయన అక్కగారు వచ్చి వుండి అన్నీ చూసుకుంది. ఇంకెవరున్నారు, వాడిని చూసుకుందుకి?
ఎంతకీ తెగని ఆ ఆలోచన అక్కడితో ఆపి, లేచి బెడ్‍రూమ్‍లోకి వెళ్ళాడు. ఆదమరిచి నిద్రపోతోంది సమీర. పక్కని కొడుకు కూడా.
బెడ్‍లాంపు మసక వెలుతుర్లో ప్రపంచంలోని మమకారం అంతా ముద్దచేసి ఆ చిన్ని ప్రాణిలో నిక్షిప్తం చేసినట్టనిపించింది కళ్యాణ్‍కి. మృదువుగా వాడి బుగ్గలు నిమిరి, వాడికి రెండోవైపుని పడుకున్నాడు. ఇంకాసేపైతే వీడు లేచేస్తాడు.
“వాడికి పాలు పట్టడం, నేపీలు మార్చడం వీటితోటే పగలూ రాత్రీ గడిచిపోతోంది పండూ! చదువుకున్న చదువూ, చేసిన వుద్యోగం, చూపించిన తెలివీ అన్నీ దండగే. వీడిని హేండిల్ చెయ్యటానికి ఏవీ పనికిరావు. మా అమ్మమ్మనీ నానమ్మనీ చూసి నేర్చుకోవలసిందే” అంటుంది సమీర అలసటగా నవ్వుతూ. ఎప్పుడు చూసినా ఆమె కనురెప్పలు వాలిపోయే వుంటాయి.
తనదొకరకం అలసట… ఆమెది మరోరకం అలసట. ఎవరు మానెయ్యాలి వుద్యోగం? అతని ఆలోచనలు నెమ్మదిగా ఒకదార్లో పడటం మొదలయ్యాక నిద్రలోకి జారుకున్నాడు.


“మన ముగ్గుర్లో ఎవరో ఒకరం వుద్యోగం మానాల్సినప్పుడు అత్తయ్యగారిని మానమనడం సరైనది కాదు. ఆవిడ చెయ్యాల్సిన త్యాగాలూ, పడాల్సిన కష్టాలూ మీ చిన్నప్పుడు పడే వుంటారు. అమ్మనికదా, నేను మానేస్తాలే. తప్పదు” అంది సమీర. ఆమె మాటల్లో ఎంతో నిరాశ. కెరీరింకా ప్రారంభంలోనే వుంది. ఏవో సాధించాలన్న తపనకి మొదటి అడుగు పడకముందే పెళ్ళవటం. కొడుకు పుట్టడం జరిగేయి. పిల్లలకోసం కొన్నాళ్ళు ఆగాలనుకున్నారు. కాని అటు తల్లినీ, ఇటు అత్తగారినీ చూస్తే యాభయ్యేళ్ళింకా రాకముందే ఇద్దరూ బాధ్యతలు తీర్చేసుకుని వడ్డుని పడ్డారు. మరోవైపుని చూస్తే ముప్పైలు దాటాక పిల్లల్ని కని ఇంకా వాళ్ళ చదువులనీ, వుద్యోగాలనీ, హైరానపడుతున్నవాళ్ళు చుట్టూ కనిపిస్తున్నారు. చాలా ఆలోచించుకున్నాక తల్లీవాళ్ళవైపే అడుగు పడింది. ఫలితం క్యూటీపై.
“అమ్మే యెందుకు? నాన్న కాకూడదా?” అడిగాడు కళ్యాణ్ కొంచెం సందిగ్ధంగా.
“పండూ??!” ఆశ్చర్యంగా అడిగింది సమీర.
“ఔను బుజ్జీ! ఎల్‍కేజీతో మొదలెట్టిన ఈ పరుగు ఆపి, కొంచెం ఆపి, వూపిరి పీల్చుకోవాలనుకుంటున్నాను”
“కానీ… నీ గ్లోబల్ పొజిషన్… చాలా కష్టపడ్డావుకదా, ఈ స్టేజి చేరుకోవటానికి?” ఆమెకి ఏం చెప్పాలో అర్థమవలేదు.
“అక్కడినుంచీ దిగిపోవాలనిపిస్తోంది. కొన్ని ప్రశ్నలు… ఎందుకింత విశ్రాంతిలేని వుద్యోగం? మనకి అనువుగా లేని వేళలు? డబ్బుకోసమా? నలుగుర్లో గర్వంగా కనిపించేందుకా? ప్రతినిముషం పోటీ పడుతూ, అందుకోసం బాడీనీడ్స్‌ని పక్కని పెడుతూ… ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాను. చాలా అలసటగా వుంది. హాయిగా రాత్రి పదింటికి పడుకుని, పొద్దున్నే ఆరింటికి లేచి, నిదానంగా గడిపే జీవితం కావాలనిపిస్తోంది. కనీసం కొంతకాలం. బ్రేక్ తీసుకుంటాను. అందుకు ఒక కారణం … చూసేవాళ్ళకి ఐడియల్‍గా కనిపించే కారణం కావాలి. సొసైటీ మారుతోంది. పిల్లాడిని పెంచడంకోసం బ్రేక్ తీసుకున్నానంటే ఆహా ఓహో అంటార్లే. వీడిని స్కూల్లో వేసేదాకా ఆగి మళ్ళీ చూసుకోవచ్చు జాబ్” అన్నాడు.
ఆమె యింకా అర్థం చేసుకోలేకపోతోంది. క్యూటీపైకోసం ఇంకేవేనా మార్గాలున్నాయా అని వెతుకుతోంది. “పోనీ డేకే‍ర్‍లో వేద్దామా?”
“నోవే, బుజ్జీ! అమ్మానాన్నలు, ఇద్దరు తాతయ్యలు, అమ్మమ్మ, బామ్మ ఇంతమంది బలగం వున్న పిల్లాడిని ఎవరో పెంచడం నాకిష్టంలేదు. వాడి చిన్నతనాన్ని ఎంత మిస్సౌతామో తెలుసా? నేను లేనప్పుడు వాడు చేసిన అల్లరి నువ్వింట్లో వుంటే నువ్వు నాకు చెప్తావు, నేనింట్లో వుంటే నేను నీకు చెప్తాను. డేకేర్‍లో పదిమంది పిల్లలమధ్య వీడూ ఒకడు. ముగ్గురం ఎన్ని మిస్సౌతామో తెలుసా? వాడు బోర్లాపడినప్పుడు నువ్వు పంపించిన పిక్ చూసి ఎంతసేపు బాధపడ్డానో! నేను ఆ మూమెంటు చూడలేకపోయానని. వెధవ… ఆదివారమేగా, బోల్తాపడింది… నాకు ఎంత కన్సెషనిచ్చాడో… ఐనా కేంపులో వుండటంతో చూడలేకపోయాను. వాడు పాకడం, కూర్చోవడం, నిలబడ్డం, అడుగులెయ్యడం ఇదివరకూ వీటన్నిటికీ ఫంక్షన్లు చేసేవారట… “
“కానీ వుద్యోగస్తులంకదా! అత్తయ్యే ఒకసారి నాతో అన్నారు, జాబ్ చేస్తుండటంచేత ఎన్నో సరదాలు వదిలిపెట్టేసానని… తప్పదు”
“క్యూటీపై ప్రతి అడుగులో మనిద్దర్లో ఒకరం వాడి వెంట వుండాలి బుజ్జీ! కెరీర్ విషయంలో నువ్వింకా ఫ్రెష్‍గా వున్నావు. నువ్వు చెయ్యి. నేను బ్రేక్ తీసుకుంటాను. ఇల్లూ, కారు, అన్నీ కొన్నాళ్ళు వాయిదా వేసేద్దాం. ’ప్లీజ్ బుజ్జీ! ఆలోచించు” అన్నాడు బతిమాలుతున్నట్టు.
“నీకు ఓకేనైతే నాదేం లేదు” అంది సమీర.
“మీ యిద్దరికీ ఎలాంటి ఆక్షేపణా లేకపోతే మధ్యలో నేనెందుకు కాదంటాను?” అంది కళ్యాణ్ తల్లి. “కానీ ఒక్కమాట కళ్యాణ్! ఆడపిల్ల వుద్యోగం చేస్తుంటే మగవాడు ఇంట్లో కూర్చోవటమనేది మన సొసైటీ అలవాటుపడని విషయం. అనేకమంది రకరకాలుగా అనచ్చు. దానికి మీరిద్దరూ మనసులు పాడుచేసుకుని గొడవలు పెట్టుకోకూడదు. భార్యాభర్తల సంబంధం చాలా పెళుసైనది. ఇద్దరూ పరస్పరం గౌరవించుకుంటేనే అది నిలుస్తుంది, మనసుకి ఆనందాన్నీ, జీవితానికి నిండుతనాన్నీ యిస్తుంది. ఏదేనా ఒక సంఘటన జరిగినా, ఇద్దర్లో ఎవరేనా ఒకమాట అనుకున్నా, అక్కడితో వదిలెయ్యాలి, అంతేగానీ భూతద్దాల్లో పెట్టుకుని చూసుకోకూడదు” అని హెచ్చరించింది.
అంతేకాక, వియ్యపురాలికి ఫోన్ చేసి, “వదినగారూ! వీళ్ళు తీసుకున్నది కొంచెం అరుదైన నిర్ణయం. కళ్యాణ్‍కి నేను చెప్పాను. మీరుకూడా మీ అమ్మాయికి చెప్పండి. నేను చెప్పినకన్నా, మీరు చెప్తే మనసుకి పడుతుంది” అంది.
ఇదంతా చూసి, కళ్యాణ్ తండ్రి, “వాళ్ళనెందుకే, తిప్పలు పెడుతున్నావు? నువ్వు వీఆర్ తీసుకుంటే క్యూటీపైగాడిని తెచ్చేసుకుని మన దగ్గిరే పెట్టుకుందాం” అన్నాడు.
“మీరు రిటైరయ్యేగా, వున్నారు? నేనుకూడా ఎందుకు? శుభ్రంగా వాడిని తెచ్చుకోండి. వాళ్ళు పంపించమంటే అక్కడే వుండి పెంచి రండి” అంది ఎర్రగా చూసి. ఆయన మళ్ళీ మాట్లాడలేదు. ఆపాటి ఆవిడకి తెలీకా కాదు, చెయ్యలేకా కాదు. ఎవరో ఒకళ్ళు వుద్యోగం మానల్సినప్పుడు తల్లో తండ్రో ఆ పని చేస్తారు. తనెందుకు చెయ్యాలి? వాళ్ళని కనీ, పెంచీ, చదువులకోసం అప్పులు చేసీ, అప్పులు తీర్చుకునీ, ఇళ్ళూవాకిళ్ళూ అమర్చీ, ఇంకా వాళ్ళ పిల్లలకోసంకూడా త్యాగాలు చెయ్యాలా? అలా త్యాగాలు చేస్తేనే ప్రేమ వున్నట్టా? వాళ్ళకి బాధ్యత ఎలా తెలుస్తుంది? అదీకాక, చీర వుయ్యాల కట్టి, అందులో వేసి, మధ్యమధ్యలో వూపుతూ మన పని మనం చేసుకోవడం కాదు. ఇరవైనాలుగ్గంటలూ పిల్లవాడిని కనిపెట్టుకుని వుండి డయపర్లు మార్చుకుంటూ, వాడి బట్టలు మార్చుకుంటూ వుండటం ఎవరివల్ల ఔతుంది? ఆవిడకీ లోలోపల చాలా అల్లకల్లోలం జరిగింది.


కళ్యాణ్ ఇంట్లో వుండిపోయాడు. సమీర ఆఫీసుకి వెళ్తోంది. వాళ్ళ నిర్ణయం ఆఫీసులోనూ, బయటాకూడా వాళ్ళ పరిచయస్తుల్లో ఎంతోమంది మనసులని ఎక్కడో ఒకచోట కుదిపింది.
“మొదట్లో బాగానే వుంటుంది సమీరా! ఉద్యోగం వదిలేసి రోజంతా ఇంట్లో వుండటం, బాబుని చూసుకోవటం, ఇవన్నీ మనకిలాగే అతనికీ కొన్నాళ్ళకి విసుగనిపిస్తుంది. ఎప్పుడేనా బరస్టవచ్చు. నువ్వు చాలా సంయమనం చూపించాలి. సరదాకికూడా అతనికి జాబ్ లేదన్నమాట అనద్దు. మనం తీసుకున్నంత తేలిగ్గా మగవాళ్ళు తీసుకోలేరు. ఎంతకాదన్నా మన మూలాల్లోనే మేల్ డామినెన్స్ వుంటుంది” అని హెచ్చరించింది సమీర స్నేహితురాలు.
“చాలా మంచిపని చేసావు కళ్యాణ్! ఇలాంటి నిర్ణయం నేను తీసుకోకపోవటంచేత మేము డివోర్స్ దాకా వెళ్ళాము. అప్పట్లో నా భార్యది మంచి పొజిషన్. నేనింకా కెరీర్లో నిలదొక్కుకోవటానికి స్ట్రగుల్ చేస్తున్నాను. తనని జాబ్ వదిలిపెట్టమని నేనుగా చెప్పడం చాలా పెద్ద తప్పు. మేల్ ఇగో…” కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నచ్చి, వాళ్ళ బాస్ అన్నాడు. “నీకు ఎప్పుడు మళ్ళీ చేరాలన్నా, నన్ను కాంటాక్ట్ చెయ్యి. నా పరిధిలో వున్న హెల్ప్ చేస్తాను” అన్నాడు.
ఈ యిద్దరు వ్యక్తులు చెప్పిన మాటలూ కళ్యాణ్, సమీరా చాలా శ్రద్ధగా విన్నారు. మనసుకి ఎక్కించుకున్నారు.


పొద్దున్నే వంటామె వచ్చి వంట చేసి వెళ్ళిపోతుంది. తర్వాత పనామె వస్తుంది. ఆమెకూడా వెళ్ళాక క్యూటీపై పనులు మొదలుతాయి కళ్యాణ్‍కి. వళ్ళంతా నూనె రాసి, టబ్‍లో కూర్చోబెట్టి, బాత్ వైజర్ పెట్టి ముఖంమీద నీళ్ళు పడకుండా స్నానం పొయ్యటం, మొహం కడగడం, తర్వాత తుడిచి, క్రీము రాసి, పాలు పట్టి, స్వాడిల్ రాప్ వేసి పడుకోబెట్టడం ఇవన్నీ చాలా శ్రద్ధగా సమీర దగ్గర చూసి నేర్చుకున్నాడు. కానీ క్యూటీపై అలా వినడు. తండ్రి నేర్చుకున్న ఆర్డర్లో చెయ్యనివ్వడు. సగం స్నానం ఔతూనే నిద్రలోకి జారుకుంటాడు. లేకపోతే పాలకోసం గగ్గోలు మొదలుపెడతాడు. అన్నం, పప్పూ, కేరటూ వేసి బాగ వుడికించి మాష్ చేసి నెయ్యేసి కలిపిన కిచిడీ బౌల్‍లో పెట్టుకుని తీసుకురాగానే ఎగిరెగిరి పడతాడు. ఆలస్యానికి దెబ్బలాడతాడు. ఇవన్నీ చూసి కళ్యాణ్ మనసు పరవశించిపోతుంది. సమీర ఇంటికొచ్చేసరికి పూసగుచ్చినట్టు మాటలు పేర్చుకుని పెట్టుకుంటాడు.
“బుజ్జీ! థాంక్సె లాట్. ఎంత ఎంజాయ్ చేస్తున్నానో వీడితో!” అంటాడు.
ఒకరోజు పెద్ద ప్రమాదం జరిగిపోయింది. మంచంమీద పడుకోబెడితే క్యూటీపై వుండట్లేదు. పాకడం వచ్చేసింది. అందుకని బెడ్‍రూమ్‍లోనే చాప పరుచుకుని కింద పడుకుంటున్నారు తండ్రీ కొడుకులు పగటివేళ. ఆడినంతసేపు ఆడేసి, నిద్రపోయాడు క్యూటీపై. వాడు పడుకోవడం చూసి తనూ నిద్రలోకి జారుకున్నాడు కళ్యాణ్. కొద్దిసేపే. నిద్రలేచేసరికి క్యూటీపై కనిపించలేదు. ఒక్క క్షణం ఏమీ అర్థమవలేదు. నిద్రమత్తంతా ఎగిరిపోయింది.
ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? అలా ఎలా వెళ్ళిపోతాడు? తనదే తప్పు. వాడిని చూసుకోవలసింది పోయి నిద్రెలా పోయాడు తను? బుజ్జి అసలు నిద్రే పోకుండా వాడిని కాసుకుంటుంది. అర్ధరాత్రి, అపరాత్రని లేకుండా వాడిని అటెండయేది. అందుకే అమ్మపని అమ్మదే. నాన్న పని నాన్నదే… అతనికి కళ్ళమ్మట నీళ్ళొక్కటే తరువాయి. వెంటనే సమీరకి ఫోన్ చేసాడు.
“మంచంకింద చూడు” అంది సమీర తొణక్కుండా.
ఆమె గెస్ కరెక్టే. మధ్యలో లేచి, ఆడుకుంటూ మంచంకిందికి వెళ్ళిపోయి పడుక్కుని నిద్రపోయాడు.
ఇంటికి వచ్చాక విరగబడి ఒకటే నవ్వు…”పండూ! పాకడం రానివాడు పారిపోయాడా?” అంటూ. అతనూ నవ్వేసాడు.


“వాడిని పొద్దున్న కొంచెం ఎండలో తిప్పాలి పండూ? లేకపోతే వైటమిన్ డీ డెఫిషెన్సీ వస్తుంది” కొంచెం సంకోచంగా చెప్పింది సమీర. ఇప్పటిదాకా అతను ఇంట్లోనే వుండి బాబుని చూసుకుంటున్నాడన్న విషయం సొసైటీలో ఎవరికీ తెలీదు. అందర్లోకీ వెళ్ళటానికి అతను ఇబ్బంది పడతాడని ఆమె సంకోచం.
“సాయంత్రంవేళల్లో తీసుకెళ్దామని నేనూ అనుకుంటున్నాను. పొద్దున్నకూడా తీసుకెళ్ళాలని నువ్వు చెప్తున్నావు. సరేమరి. అరగంట సరిపొతుందా? ” అని అడిగాడు.
అతన్ని చూస్తుంటే ముచ్చటేసింది సమీరకి.
“వాడితో మాట్లాడుతుండాలికూడా” అని మరో విషయం చెప్పింది.
“మాట్లాడ్డమా? వాడితోనా?” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఆ< ఏదో ఒకటి మాట్లాడుతూ వుండాలట. లేకపోతే మాటలు ఆలస్యమౌతాయి. మైల్‍స్టోన్స్ లేటౌతే మళ్ళీ కష్టమేకదా?”
ఆ మాట్లాడ్డమేమిటో మళ్ళీ సమీర దగ్గిరే చూసాడు కళ్యాణ్.
“క్యూటిపై లాలపోసుకున్నాడా? ఆం తిన్నాడా? పండుని బాగా ఏడిపించాడా?” అని ఆమె మాట్లాడుతుంటే వాడు పెద్దపెద్ద కేకలు వేస్తూ కేరింతలు కొడుతూ తల్లిగొంతు వింటున్న ఆమోదాన్ని తెలుపుతున్నాడు.
“పండు అనకే బాబూ! వాడూ నన్ను అలానే పిలిచేస్తాడు” బతిమాలుకున్నాడు కళ్యాణ్.
“ఇది మొదలుపెట్టిందెవరో?” గీరగా అడిగింది సమీర.


ప్రామ్‍లో క్యూటీపైని కూర్చోబెట్టి తిప్పుతుంటే చాలామంది కుతూహలంగా చూసీచూడనట్టు చూసారు. వాళ్ళలో చాలామంది సమీరకి పరిచయస్తులు. కళ్యాణ్‍కి ఇన్నాళ్ళూ వుద్యోగంచేత ఎవరూ తెలీదు. ఇప్పుడు ఒకొక్కరూ కలుస్తున్నారు. తను ఇంట్లో వుండి బాబుని చూసుకుంటున్నట్తు ఒకరిద్దరికి చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదాపుగా అందరికీ తెలిసిపోయింది. ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు చాలా ఆరాధనగా చూసారు అతన్ని. అతనిలాగే పిల్లల్ని తీసుకుని వస్తున్న అమ్మాయిల్తో మాటలూ కలిసాయి. క్యూటీపైకి ఏం పెడుతున్నారు, గ్రోత్ ఎలా వుందిలాంటి పలకరింపులతో మొదలై చాలా మామూలుగా సంభాషణ జరిగిపోయేది. వాడుకూడా అందర్నీ వాడి భాషలో పలకరించేవాడు.
అందరికీ భిన్నంగా ఒక పెద్దావిడ మాత్రం ఎవరితోటీ కలవకుండా ఒకవారగా సిమెంటు బెంచీమీద కూర్చునేది. ఎప్పుడెనా తనతో తెచ్చుకున్న పుస్తకం చదువుకునేది. లేకపోతే అలా వచ్చిపోయేవాళ్లని చూస్తూ కూర్చునేది.
కొన్ని భావాలు మౌనం వెనక వుండిపోతేనే బావుంటుంది. అవి వ్యక్తమైతే వాటికి మనుషుల ఆలోచన పునాదుల్ని కదిలించే బలం వుంటుంది.
“మీరు వుద్యోగం వదిలేసి బాబుని చూసుకుంటున్నారా? ఎందుకు? చూసేవాళ్ళు లేకనా?” అడిగింది ఆవిడ ఒకరోజు సాయంత్రం మౌనం వదిలిపెట్టి.
“బాబుని మేమే పెంచుకోవాలనుకున్నాం” కళ్యాణ్ మాటల్లో స్థిరత్వం వుంది.
“అందుకు బాబూవాళ్లమ్మ చేయొచ్చుగా, ఆ పని? మీ వ్యక్తిగత విషయాలు అడుగుతున్నాననుకోకండి. ఇలాంటి నిర్ణయం వెనక వుండే ఆలోచన తెలుసుకోవాలనుకుంటున్నాను” అంటూ తన పరిచయం చేసుకుంది. రిటైర్డ్ లెక్చరర్, విమెన్ యాక్టివిస్టట. పేరు సవిత.
కళ్యాణ్ నవ్వేసాడు. కుటుంబపరిస్థితులు కొద్దిగా చెప్పాడు.
“ఎవరో ఒకరం అనుకున్నప్పుడు ఆ చాయిస్ నేను తీసుకున్నాను” అన్నాడు.
“నాకిప్పుడు ఆడవారికోసం పోరాడాలంటే ఏం పోరాడాలో అర్థమవటం లేదు. సమస్యలూ, కష్టాలూ లేవని కాదు. అవలాగే వున్నాయి. కానీ ఇప్పుడు ఈ మార్పు… అంటే మీరు తీసుకున్న నిర్ణయం వెనుక వున్న మార్పు… ఆడవారికి ఇంకేమీ మిగిలిలేకుండా చేసింది. మాతృస్వామ్య వ్యవస్థ వుండేది మొదట్లో. దాన్ని పురుషస్వామ్యానికి పరివర్తించారు. నలభైయాభైమంది సభ్యులున్న కుటుంబానికి ఆయువుపట్టుగా వుండేది స్త్రీ ఒకప్పుడు. పోషించలేక మగవాడు కుటుంబాన్ని క్లుప్తం చేసుకున్నాడు. అభిజాత్యమో, అహంకారమో, కట్టుకున్న స్త్రీని, కన్నకూతుర్నీ కూడా పోషించలేనని వుద్యోగాలకి తరిమాడు. అలాగ తను కన్నపిల్లలని మరొకరి చేతిలో వుంచి, వారి భావజాలానికి అనువుగా పెంచే పరిస్థితి వచ్చింది ఆడవారికి. వ్యాపార, వినిమయ సంస్కృతి వచ్చింది. ఆడవారిని వ్యక్తిత్వానికి దూరం చేసింది. ఇల్లూ, పిల్లలూ దూరమైనా, అమ్మకి ప్రత్యామ్నాయం లేదని ఈరోజుదాకా అనుకున్నారు. ఇప్పటితరం నాన్నలు ముందుకి వచ్చి అమ్మకి ప్రత్యామ్నాయమమయారు. అంటే మొదట కుటుంబం, తర్వాత పిల్లలూ, వ్యక్తిత్వమూ, ఇప్పుడు తన స్థానంకూడా ఆమె పోగొట్టుకుంది. కనటానికి ఒక స్త్రీ వుంటే భార్య అవసరం లేకుండా సైంటిఫిక్ మెథడ్స్‌లో పిల్లల్ని కనేసి, మగవారు పెంచుకునే రోజు రావటానికి ఇంక ఎంతోదూరం లేదు. ఇంక అప్పుడు కుటుంబమూ వుండదు, వ్యవస్థా వుండదు, వ్యక్తులే వుంటారు” అంది. ఆమె మాటల్లో నిర్లిప్తతే తప్ప ఎలాంటి వుద్వేగమూ లేదు.
ఆమె ఆ మాటలు చెప్తున్నప్పుడే కళ్యాణ్‍ని వెతుక్కుంటూ వచ్చింది సమీర. తనూ నిలబడి విన్నది. ఇద్దరి మనసుల్లోనూ ఏదో అలజడి.
అక్కడినుంచీ వెళ్ళాక భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని పెద్దగా ఏడ్చేసారు.
“నేనైతే ఆఫీసుకి వెళ్తున్నాగానీ మనసంతా వీడిమీదే. క్యూటీపైని చాలా మిస్సౌతున్నాను” అంది బుజ్జి వెక్కిళ్ళమధ్య.
“ఆవిడ జెనరల్‍గా చెప్పిందిలే, మనగురించి కాదు” ఓదార్చాడు పండు.
మార్పులు వుద్యమంగా మొదలవ్వవు. చిన్న మొలకలా ఎక్కడో వస్తాయి. ఆలోచనలని మారుస్తాయి. ఆ తర్వాత వుద్యమాలు వస్తాయి. ఐనా ఆవిడ చెప్పిందిగా, వుద్యమం చెయ్యటానికి వ్యవస్థే వుండదని!