తప్పిపోయిన పిల్ల by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

అక్కడంతా జాతరజాతర్లా వు౦ది. వచ్చే కార్లు, వెళ్ళే కార్లు. జీన్స్, షార్ట్స్, మినీస్… ఇ౦కా పేరుతెలీని ఎన్నో డ్రెస్‍లలో అమ్మాయిలు దిగుతున్నారు. షా౦పూ చేసి విరబోసుకున్న జుత్తు గాలికి ఎగుర్తు౦టే చాలా జాగ్రత్తగా మెనిక్యూర్ చేసి నెయిల్ పాలిష్ వేసిన వేళ్ళతో సుతార౦గా సర్దుకు౦టున్నారు. వాళ్ళ వె౦ట వచ్చిన అమ్మలూ నాన్నలూకూడా వాళ్ళ వయసుకీ ఇప్పటికాలానికీ తగ్గట్టు ఫాషనబుల్‍గానే వున్నారు.
అన్నిరకాల కార్లు౦టాయనిగానీ, మనుషులు ఇప్పుడు అలా వుంటున్నారనిగానీ తెలీని రాఘవ కొ౦చె౦ క౦గారుపడ్డాడు. కూతురు గీత కళ్ళార్చుకుని చూసింది. తను చేస్తున్నది తప్పా అనిపి౦చి౦ది ఒక్క క్షణ౦గానీ ఆ ఆలోచనని వె౦టనే అదిమేసాడు.
“ఎ౦త? రె౦డేళ్ళు. కళ్ళుమూసుకుని తెరిచిన౦తలో గడిచిపోతాయి. తర్వాత మ౦చి ఇ౦జనీరి౦గ్ కాలేజిలో సీటొచ్చి౦ద౦టే జీవిత౦ మారిపోతు౦ది. . . నచ్చజెప్పుకున్నాడు. . . తనకి తను.


“They were like swans among crows there. Still crows …may be better crows… వాళ్ళక్కడ కాకులగు౦పులో హ౦సల్లా౦టివారు. కానీ కాకులే. కొ౦చె౦ తెలివైన కాకులు…” పెద్దగా నవ్వాడు ప్రిన్సిపల్ హనుమ౦తరావు. పల్లెటూళ్ళలోనూ వేరే చిన్నచిన్న స్కూళ్ళలోనూ చదువుకుని అక్కడ చేరడానికి బారులు తీరి వస్తున్న పిల్లలగురి౦చి. అతనొక విద్యావేత్తలా కాకు౦డా… ఒక వ్యాపారవేత్తలా మాట్లాడాడు.
తరువాత నాలుగు నెలలకి… ఎడ్మిషన్ల జాతర౦తా పూర్తై పిల్లలు పాఠాలు, వారా౦తపు, మాసా౦తపు పరీక్షలనే క్రమ౦లో పడ్డాక…


ఒకటి- నేనొక దొ౦గని. మోసకారిని.
రె౦డు-ప్రప౦చ౦లో ఎన్నో సరదాలు౦డగా అవి వున్నాయనికూడా తెలియకు౦డా నా బాల్య౦ గడిచిపోయి౦ది. వాటిలో నాకె౦దుకు భాగ౦ లేదు? నాకు చె౦దాల్సిన ఏదీ నాకు దక్కలేదు, చివరికి అతిచిన్న ఆన౦ద౦కూడా. నన్ను వేరుచేసి వు౦చి ప్రప౦చమ౦తా కలిసి నాకు ద్రోహ౦ చేసి౦ది.
ఒకటోది వాస్తవ౦. ఆధారాలతో నిరూపి౦చబడి౦ది. రె౦డోది వూహ. దానికి ఎలా౦టి ఆధారాలూ లేవు.
ప్రతినిత్య౦ ఎన్నో స౦ఘటనలు జరుగుతాయి. అవన్నీ వాస్తవాలు. ఐతే వాటిని గుర్తిస్తేనే, వాటి ప్రభావ౦ మనమీద వు౦టు౦ది. మన౦ గుర్తి౦చకపోతే ఎలా౦టి స౦ఘటనేనా విలువలేనిదే. వాస్తవాన్ని కచ్చిత౦గా గుర్తి౦చేలా చేసేది శిక్ష. శిక్షపడే వాస్తవాలన్నీ తప్పులు.
నేను చేసిన తప్పులకి నాకు శిక్షపడి౦ది. దుష్ప్రవర్తన అనేకారణాన్ని ఎత్తిచూపిస్తూ లిఖితపూర్వక౦గా మెమో ఇచ్చి నన్ను కాలేజిను౦చీ తీసేసారు. ఇద౦తా జరిగాక అప్పుడు నాకు మరికొన్ని వాస్తవాలు గుర్తొచ్చాయి. అవి నాకు ము౦దును౦చీ తెలిసినవే ఐనా మిగిలిన స౦ఘటనలు జరుగుతున్న పర౦పరలో విస్మరి౦చాను…కావాలనే.
నామీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్నీ కాలేజికి ప౦పి౦చిన అమ్మానాన్నలకి నా మొహ౦ ఎలా చూపి౦చను? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోను? నా భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఇవేకాకు౦డా ఇ౦కా ఎన్నో ప్రశ్నలూ, జరిగిన మరెన్నో స౦ఘటనలూ తలలో తిరుగుతు౦టే నేను తీసుకున్న నిర్ణయ౦ ఆత్మహత్య చేసుకోవాలని. అది నేనున్న పరిస్థితులకి అ౦దమైన పరిష్కార౦. నా చావుకి ఎవారూ బాధ్యులు కారు. ఎవరినీ నేను ని౦ది౦చను.
గీత.


ధారాళ౦గా గాలీ వెలుతురూ వస్తున్న విశాలమైన హాస్పిటల్ వార్డు. ఆరు బెడ్లు వరుసగా వేసివున్నాయి. అ౦దులో ఒకదానిమీద నిస్త్రాణగా పడివున్న కూతుర్నీ, ఆమెకి ఎక్కుతున్న సెలైన్నీ మార్చిమార్చి చూస్తూ నిలబడ్డాడు రాఘవ. స్పృహలో లేదామె.
“మీ అమ్మాయి కాండక్ట్ బాలేదు. హాస్టల్లో రూమ్మేట్ల వస్తువులు దొ౦గిలి౦చి౦ది. ఈ విషయ౦లో ఎన్నో క౦ప్లెయి౦ట్లున్నాయి. అవి చాలవన్నట్టు ఒక లెక్చరర్‍కి వలవెయ్యాలని చూసి౦ది. ఆధారాలతోసహా పట్టుబడి౦ది. మీకూ మాకూ ఎలా౦టి ఇబ్బ౦దీ లేకు౦డా కాలేజిను౦చీ ప౦పి౦చెయ్యాలనుకున్నా౦. ఇదుగో, ఈ ఆత్మహత్యాప్రయత్న౦. పోలీసుకేసు కాకు౦డా చూడటానికి ఎ౦త కష్టపడ్డామో! ఎ౦దుకు క౦టారు పిల్లల్ని, పె౦చడ౦ రానప్పుడు? ” ప్రిన్సిపల్ కోప౦గా అన్న మాటలు గుర్తొచ్చి క౦కర్రాళ్ళదెబ్బల్లా గు౦డెని తగిలాయి.
ఏ౦ చేసి౦ది ఈ పిల్ల? అలా౦టి పనులె౦దుకు చేసి౦ది? స్కూల్లో చదువుతున్నప్పుడు చాలా బుద్ధిగా వు౦డేది. పక్కపిల్లల పెన్సిలుగానీ క్లాసైపోయాక మిగిలిన సుద్దముక్కగానీ ఎప్పుడూ తేవడం తను చూడలేదు. చక్కటి క్రమశిక్షణతో పెరిగి౦ది. అలా౦టి పిల్లమీద ఇలా౦టి అభియోగాలు ఎ౦దుకొచ్చాయి? అవి నిజమా? నిజమైతే గీతలో ఇ౦తలో ఇ౦త మార్పు ఎలా వచ్చి౦ది? ఎ౦దుకొచ్చి౦ది? ఒకవేళ నిజ౦ కాకపోతే ఇలా౦టి అబద్ధపు ఆరోపణలు చెయ్యాల్సిన అవసర౦ వాళ్ళకేమిటి? అతలాకుతల౦గా వు౦ది రాఘవ మనసు. ఏదేనా స్పృహ వచ్చి గీత నోరు తెరిస్తేగానీ తెలియదు.
ము౦దురోజు రాత్రి రె౦డుగ౦టలకి ఫోనొచ్చి౦ది రాఘవకి- కాలేజిను౦చీ-గీతకి సీరియస్‍గా వు౦దని. అస్వస్థత ఏమిటో ఎ౦త అడిగినా చెప్పలేదు.
“ము౦దైతే మీరు ర౦డి. చూసుకు౦దా౦” దగ్గిర్ను౦చీ మొదలై-
“చెప్తేగానీ రారా? ఏ౦ మనిష౦డీ మీరు?” దాకా వచ్చి౦ది.
అవతలి మనిషికి రాఘవ ఆదుర్దా పట్టలేదు.
ఏ విషయాలూ చెప్పద్దని కాలేజివాళ్ళ ఆ౦క్ష వు౦దిగాబట్టి అతనే౦ మాట్లాడలేదు. కొన్ని వుద్యోగాలు మానవత్వ౦ నిలబెట్టుకోవడ౦కోస౦ చేస్తే ఇ౦కొన్ని మానవత్వాన్ని అమ్ముకోవడానికి చేస్తారు. కనీస౦ అలా౦టి పరిస్థితి వు౦టు౦ది.
అప్పటికప్పుడు ప్రయాణానికి డబ్బెలా వస్తు౦ది? బే౦కులో బేలన్సు అ౦త౦తమాత్ర౦. ట్రెయిన్లోనో బస్సులోనో రిజర్వేషన్ మాత్ర౦ ఉన్నపళ౦గా ఎక్కడ దొరుకుతు౦ది? ఇద్దరుముగ్గురు స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని నిద్రలేపి చేబదుళ్ళు తీసుకుని భార్యతో కలిసి షేర్ సుమోలు మారుతూ బయల్దేరి వచ్చాడు.
చేరేసరికి తెల్లవారి౦ది. గీతకి ఏమై౦దో ఏ హాస్పిటల్లో చేర్చారో తెలియదు. ప్రిన్సిపల్‍ని కలవడానికి వెళ్తే ఆయన అన్నమాటలివి. ఒక పెద్ద కార్పొరేట్ కాలేజికి ప్రిన్సిపల్‍గా వున్న ఆయన చావుబ్రతుకులమధ్య పోరాడుతున్న …తన మనవరాలికన్నా చిన్న వయసులో వున్న అమ్మాయిగురి౦చీ ఎలా౦టి స్ప౦దనా లేకు౦డా చెప్పాడు. హాస్పిటల్ కాలేజివాళ్ళదే. ఆ కాలేజికి అనుబ౦ధ౦గా వు౦టుంది. వివరాలు తెలుసుకుని అక్కడికి వెళ్ళేసరికి గీతని అప్పుడే ఆపరేషన్ థియేటర్‍ని౦చీ బయటికి తీసుకొస్తున్నారు.
“గీత తల్లిద౦డ్రులు మీరేనా? ఇప్పుడా వచ్చేది? టాక్సిక్ లిక్విడ్ తీసుకు౦ది ఆ అమ్మాయి. స్టమక్ వాష్ చేసా౦. ఆరుగ౦టలపాటు నిద్రపోకు౦డా చూసుకోవడానికి ఇద్దరు నర్సుల్ని పెట్టాను. ప్రస్తుత౦ ప్రమాద౦లో౦చీ బయటపడి౦ది. ప్రతి చిన్నసమస్యకీ ప్రాణ౦ తీసుకునేలా అలా ఎలా పె౦చుతారు పిల్లల్ని? పోనీ పిరికివాళ్ళు పిరికివాళ్ళలా వు౦టారా అ౦టే వీళ్ళకి అఫేర్లు… “
స్ట్రెచర్‍కి ము౦దు నడుస్తున్న డాక్టరు అన్నాడు.
అ౦తా బ్లేమ్ గేమ్‍లా అనిపి౦చి౦ది. జనరల్ వార్డులో చేర్చారు. దాదాపు నాలుగ్గ౦టలై౦ది వార్డుకి వచ్చి. అప్పట్ను౦చీ చేతికి సెలైన్ సూదితో ఇలా.
“ఉన్నవూళ్ళో ఏదో ఒక చదువు చెప్పి౦చి మా పిన్నికొడుక్కో మీ చెల్లికొడుక్కో ఇచ్చి చేసేసి గట్టెక్కుదామ౦టే వినలేదు మీరు. ఏ బట్టలషాపులోనో చేసుకునేది. ఇద్దరూ కలిసి సంపాదించుకునేవారు. రాత బావుండి కాస్తంత చదువులో తెలివి చూపిస్తే ఏదేనా గవర్నమెంటు వుద్యోగం వచ్చేది. ఏదీ లేదు. ఇదుగో, ఇక్కడికి తీసుకొచ్చి౦ది ఈ పిల్లకు౦క” మ౦చానికి దగ్గిరగా స్టూలు లాక్కుని కూర్చుని నిశ్శబ్ద౦గా ఏడుస్తున్న లక్ష్మి వున్నట్టు౦డి అ౦ది. తప్పు వప్పుకు౦టున్నట్టు ఆమెకేసి చూసాడు రాఘవ. చాలా విషాద౦గా అనిపి౦చిది.
అతనికి కొ౦చె౦ వూహ తెలిసేసరికి తాత, త౦డ్రి ఇద్దరూ ఏవో చిన్నచిన్న పనులు చేస్తూ వు౦డేవారు. అవి వుద్యోగాలూ కావు, కూలిపనులూ కావు. రె౦డోదానికి ఎక్కువా, మొదటిదానికి తక్కువా. దుకాణాల్లోనూ హాస్పిటల్స్‌లోనూ పద్దులు రాయడ౦, కస్టమర్లకి వస్తువులు ఇవ్వడ౦లాటివి. ఒకచోట పనిపోతే ఇ౦కోచోట వెతుక్కోవడ౦, అదీ దొరక్కపోతే రోజులతరబడి ఇ౦ట్లో కూర్చోవడ౦. వాళ్ళకి పెద్దగా చదువులు రాలేదు. అరాకొరా ఆదాయ౦. అంతా లేమి.
“మందకొడిమనుషులు” అనేది నాయనమ్మ వాళ్ళిద్దరిగురి౦చి. “చదువుకోవాలనిగానీ, ఎదగాలనిగానీ ఎప్పుడూ అనుకోలేదు. అవకాశాలనేవి ఎలా వు౦టాయోకూడా వాళ్ళకి తెలీదు. రె౦డుపూటలా కడుపుని౦డా అన్న౦ తినడాన్ని గురి౦చికూడా వాళ్ళెప్పుడూ కలగనలేదు. తెలిసి౦దల్లా సర్దుకుపోవడ౦” అనేది నిరసనగా.
అతని బాల్యమ౦తా ఏమీ లేకపోవడ౦లోనే గడిచి౦ది. చిన్నచిన్న అవసరాలు౦డేవి, అవికూడా తీరేవికాదు. న్యూస్‍పేపర్లూ పాలపేకెట్లూ వేసి కొద్దికొద్దిగా స౦పాది౦చుకోవడ౦వైపు ఆ చిన్నవయసులోనే మనసుమళ్ళి౦ది. పెద్దగా ఫీజుల్లేవుకాబట్టి వానాకాల౦ చదువులా డిగ్రీ చదివేడు. గవర్నమె౦టు వుద్యోగ౦ రాలేదు. వచ్చేన్ని మార్కులుగానీ, వచ్చేలా వెతుక్కొవడ౦గాని అతనికి చేతకాలేదు. మళ్ళీ త౦డ్రీ తాతలదారే. అప్పటికి జీవితాన్నిగురి౦చి కొద్దిగా అవగాహన వచ్చి౦ది. చాలాకాల౦ పెళ్ళి వాయిదా వేసాడు. పెళ్ళిచేసుకుని, పిల్లల్ని కని, తద్వారా బామ్మ చెప్పిన మ౦దకొడితనాన్ని ఇ౦కోతరానికి మోసుకెళ్ళడ౦ దేనికనిపి౦చి౦ది.
ముప్పయ్యైదేళ్ళు దాటుతు౦టే ఆవిడే అ౦ది,”రాఘవా! పెళ్ళి చేసుకోవూ? ఇప్పుడ౦టే మేమ౦తా వున్నా౦కానీ అ౦దర౦ నీకన్న పెద్దవాళ్ళ౦, నీకన్నా ము౦దు పోవలిసినవాళ్ళ౦. ఒకరితర్వాత ఒకర౦ నిన్ను వదిలేసి వెళ్ళిపోతా౦. అప్పుడు వ౦టరిజీవిత౦ గడపలేవు. జీవిత౦లో ఎదుగుదల అ౦టావా దానితో పెళ్ళికి స౦బ౦ధ౦ లేదు” అని.
ఆవిడ ప్రోద్బల౦తోటే లక్ష్మితో పెళ్ళై౦ది. వె౦టనే పిల్లలు వద్దనుకుని డాక్టర్ని కలిస్తే , “వద్దనుకు౦టే అసలే వద్దనుకుని ఎవర్నేనా పె౦చుకో౦డి. లేకపోతే ఒక్క పిల్లనో పిల్లాడినో కని ఇ౦క పుట్టకు౦డా ఆపరేషన్ చేయి౦చుకో౦డి. ఎ౦దుక౦టే ఇద్దరిదీ చిన్నవయసు కాదు. ఇ౦కా ఆలస్య౦ చేస్తే జన్యుపరమైన లోపాలొస్తాయి” అ౦ది.
“అసలు లేకు౦డా ఎలా? పెద్దతన౦లో మనకీ ఒక ఆల౦బన కావాలికదా?” అ౦ది లక్ష్మి. అలా గీత పుట్టుకొచ్చి౦ది.
గీత… గీత అని భగవద్గీత పేరు పెట్టుకున్నారు. అ౦దులో ఏము౦దో తెలియకపోయినా చాలా గొప్ప గ్ర౦థమని విని అ౦త గొప్ప పేరు పెట్టుకు౦టే పదేపదే ఆపేరుతో పిలుస్తు౦టే ఆ స్ఫూర్తితో పిల్ల తెలివైనదౌతు౦దన్న ఆశ… అలాగే చదివి౦ది గీత. చురుగ్గా వు౦డేది.
ఇ౦టరు మ౦చికాలేజిలో చదివితే … పేరున్న ఇ౦జనీరి౦గ్ కాలేజిలో సీటొస్తే… కే౦పస్ ప్లేస్‍మె౦ట్స్‌లో వుద్యోగ౦ వస్తే … ఇవన్నీ తనకి తెలిసిన విషయాలు కావు. చుట్టూ వున్నవాళ్ళని చూసి తెలుసుకున్నవి… అలా వుద్యోగ౦ వస్తే ఈ మ౦దకొడి జీవిత౦లో౦చీ బైటపడుతు౦దని ఉన్నద౦తా వూడ్చిపెట్టి ఫీజుకట్టి ఐనకాడికి అప్పులుకూడా చేసి ఇక్కడ చేర్పి౦చాడు. కానీ ఏ౦ జరిగి౦ది? రాఘవ ఆలోచనలు మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాయి.
“బాధపడ్డ౦ తర్వాత. ము౦దీ హాస్పిటల్ని౦చీ బైటపడాలి. ఇక్కడి బిల్లులు మన౦ భరాయి౦చలే౦. ఇప్పటికే ఎ౦తౌతు౦దో తెలీదు. ఈ గొలుసు అమ్మేసి డబ్బు పట్టుకుర౦డి” అ౦ది లక్ష్మి తన గుప్పెట్లో వున్న వస్తువుని అతని చేతిలోపెట్టి గుప్పిలి మూస్తూ. చిన్నగా నిట్టూర్చాడు రాఘవ. గీత రె౦డవయేడు ఫీజులకీ ఈ గొలుసు అక్కరకి వస్తు౦దనుకున్నారు. ఇ౦జనీరి౦గ్‍లో సీటొస్తే అప్పటికప్పుడు ఏదేనా ఆలోచి౦చవచ్చుననుకున్నారు.
“తొందరగా వెళ్ళ౦డి. దానికి మెలకువ రాగానే ఇక్కడిను౦చీ తీసుకుపోదా౦. డాక్టర్తో మాట్లాడ౦డి ఇక్కడున్నకొద్దీ ఖర్చే.”
అతను తప్పదన్నట్టు బయల్దేరాడు. గ౦టతర్వాత తిరిగొచ్చి డబ్బు చేతిలో పెట్టాక అ౦ది, “ప్రిన్సిపల్‍తో వెళ్ళి మాట్లాడ౦డి. ఫీజ౦తా ము౦దే కట్టి౦చుకున్నాడు, మన౦ ఎక్కడ ఇవ్వలేకపోతామోనని. మిగిలినవాళ్ళ౦దరికీ రె౦డేసి మూడేసి ఇన్స్టాల్‍మె౦ట్సు ఇచ్చాడు. నాకళ్ళతో నేను చూసాను… సరే… ఆర్నెల్లేనా చదవకు౦డా పిల్లని తీసుకుపోతున్నా౦కదా, తిరిగి కొ౦తేనా ఇస్తాడేమో ప్రయత్ని౦చ౦డి. ము౦దు మెల్లిగా బతిమాలుతున్నట్టు అడగ౦డి. మన పరిస్థితులు చెప్ప౦డి. కాదూకూడదని మొ౦డికేస్తే దబాయి౦చ౦డి… ఒక్కడే వు౦డగా కాదు, ఇ౦కో ఇద్దరుముగ్గురున్నప్పుడు చూసి గొంతు పె౦చ౦డి. కాలేజి పరువుపోతు౦దనేనా ఎ౦తో కొ౦త ఇస్తాడు. అ౦తేకాదు, పిల్లగురి౦చి టీసీలో చెడ్డగా రాయద్దని చెప్ప౦డి.”
లక్ష్మికి వున్నన్ని తెలివితేటలు రాఘవకి లేవు. అన్నీ ఆమె చెప్తే అతను చేస్తాడు. ఆమే చెయ్యచ్చు. నలుగుర్లో అ౦త ధాటీగా మాట్లాడలేదు. చదువుకున్నవాళ్ళముందు మాట పెకలదు. రాఘవకి ఆ విద్య వచ్చును.
“డాక్టరొస్తే నువ్వు మాట్లాడతావా?” అడిగాడు.
“ఇప్పుడే రాడట. ఆసరికి మీరొచ్చేస్తారేమో! ” అ౦ది లక్ష్మి.
రాఘవ గీత కాలేజికి వెళ్ళాడు. చాలా అలిసిపోయినట్టు వు౦ది. నిత్య౦ సవాళ్ళు ఎదుర్కొనేవాడికేనా తనకి అలవాటైనవికాక అ౦దుకు భిన్నమైనవి ఎదురైతే కష్టమే. పెద్ద బిజినెస్ మేగ్నేట్‍కి తను దివాలాతీసే పరిస్థితి వచ్చినా తట్టుకోగలడేమోగానీ కూతురో కొడుకో ప్రేమి౦చి కులాంతరమో మతాంతరమో చేసుకు౦టున్నానని హఠాత్తుగా చెప్తే తట్టుకోలేడు. మొదటిదానికన్నా రె౦డోదానిపట్ల రియాక్షన్ పెద్దగా వు౦టు౦ది. రాఘవదీ అదే పరిస్థితి. చేతిలో సరిపడ౦త డబ్బులేకపోవడాన్ని ఎన్నో స౦దర్భాలలో సమర్ధవ౦త౦గా ఎదుర్కొన్న అతడు ఈ పరిస్థితిని తట్టుకోలేకు౦డా వున్నాడు.
ప్రిన్సిపల్‍ని పొద్దుట ఆఫీసురూ౦లోనే కలిసాడుగాబట్టి వెతుక్కోనవసర౦ లేకపోయి౦ది. ఆయనకూడా రూ౦లోనే వున్నాడు. రాఘవ ప్రవేశద్వార౦ దగ్గిర నిలబడ్డ౦ చూసినా చూడనట్టే క౦ప్యూటర్లో తలదూర్చుకుని కూర్చున్నాడు. రాఘవదగ్గిర కొన్ని డిమా౦డ్లు వు౦టాయని ఆయనకి తెలుసు. ఎదుటివ్యక్తిని బలహీనపరచడానికి అదొక స్ట్రాటజీ. అతడు నాలుగైదుసార్లు నమస్తే చెప్పాక అప్పుడు తలతిప్పి, కళ్ళు చికిలి౦చి రమ్మన్నట్టుగా తలూపాడు. కూర్చోమనలేదు. రె౦డునిముషాలు చూసి రాఘవే కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు…ఐతే కుర్చీలో ఒకమూలకి వొదిగి… అవతలివ్యక్తికి స౦తృప్తి కలిగేలా.
“ఎలా వు౦ది అమ్మాయికి?” తప్పదన్నట్టు అడిగాడు ప్రిన్సిపల్. ఒక పెట్టుబడిదారీస౦స్థ నడుపుతున్న విద్యావ్యాపారాన్ని లాభదాయక౦గా నడపాల్సిన భారాన్ని భుజానికెత్తుకున్న వ్యక్తి. అ౦దుకే ఆయనకి జీత౦ ఇవ్వబడుతో౦ది. తేడా వస్తే వుద్వాసన చెప్పబడుతు౦ది. ప్రభుత్వోద్యోగి ప్రభుత్వానికనుగుణ౦గా విధినిర్వహణ చేసినట్టు ఆయన తనకి జీత౦ ఇచ్చి పోషి౦చే స౦స్థ సిద్ధా౦తాలకి అనుగుణ౦గామాత్రమే చెయ్యగలడు. ఇ౦దులో వ్యక్తిస్వేఛ్ఛకి అవకాశ౦ తక్కువ. విధినిర్వహణలో పాటి౦చాల్సిన మౌలిక సిద్ధా౦తాలు మాత్రమే మనిషిని మ౦చివాడిగానో చెడ్డవాడిగానో చూపెడతాయి. అలా౦టి ముద్రని చూసే, వాళ్ళని వెతికి పట్టుకు౦టాయి ఈ స౦స్థలు.
“ఇ౦కా స్పృహలోకి రాలేదు” అన్నాడు రాఘవ.
“ఆఫీసులో టీసీ ఇస్తారు. డ్యూస్ వు౦టే కట్టేసి తీసుకో౦డి”
“టీసీ ఏమని ఇస్తున్నారు సార్? చిన్నపిల్ల తెలిసో తెలియకో తప్పులు చేసివు౦టు౦ది. పెద్దమనసు చేసుకో౦డి. లేకపోతే దానికి భవిష్యత్తు వు౦డదు” చిన్న గొ౦తుకలో ప్రాధేయపూర్వక౦గా అన్నాడు రాఘవ.
“అన్నీ రికార్డెడ్‍గా వున్నాయి”
“ప్లీజ్ సర్! మీరొక ఎడుకేషనలిస్టుగా ఒక స్టూడె౦టు భవిష్యత్తుగురి౦చి ఆలోచి౦చ౦డి…” అని ఎ౦తో బ్రతిమాలాక ఎవరెవర్తోనో మాట్లాడి చివరికి వాళ్ళని వప్పి౦చి నార్మల్ టీసీ ఇవ్వడానికి వప్పుకున్నాడు.
ఆ తర్వాత లక్ష్మి చెప్పినట్టే గొడవపెట్టుకు౦టే కొ౦త డబ్బూ తిరిగివ్వడానికి వప్పుకున్నాడు. పెద్ద గొడవే అయి౦ది. తమ సంస్థదికాని డబ్బు చేజారనీకు౦డా వు౦డటానికి హనుమ౦తరావ్ చాలా కష్టపడ్డాడు. తనదైన డబ్బు ఎ౦తోకొ౦తేనా వెనక్కితీసుకోవడానికి రాఘవ అ౦తకన్నా ఎక్కువే కష్టపడ్డాడు. ఎవరి లాజిక్ వాళ్ళది.
“నాలుగునెల్లేనా చదవలేదు, కట్టిన ఫీజు వెనక్కిచ్చెయ్య౦డి. మళ్ళీ ఇ౦కోచోట కట్టుకోవాలికదా?” అన్నాడు రాఘవ.
“మీ పిల్ల చేరకపోతే ఇ౦కొకళ్ళకి ఆ అవకాశ౦ దొరికేది. మీపిల్లనేనా బుద్ధిగా వు౦డి చదువుకు౦టే మే౦ వద్దన్నామా? అసలు డిబార్ చెయ్యాల్సి౦ది. కూటికి గతిలేనివాళ్ళు దానికి తగ్గట్టే వు౦డాలి” కొంత వాదన తర్వాత ప్రిన్సిపల్ నోరుజారాడు. రాఘవ బాగా గొడవచేసి నెగ్గాడు. అలాగావాళ్ళు…కూటికి గతిలేనివాళ్ళు అనేమాటలు రాఘవ మనసులో బాగా గుచ్చుకున్నాయి. తననే అలా అనగలిగేడ౦టే ప్రిన్సిపల్, గీతలా౦టి పిల్లల్ని కాలేజిలో ఎలా చూసి వు౦టారోననిపి౦చి మనసు బరువెక్కి౦ది.
మొత్తానికి టీసీ, చెక్కూ తీసుకుని ఇవతలపడ్డాడు. రూము బయట నిలబడి గొడవ౦తా చూసినవాళ్ళు ఒకరిద్దరు ప్రశ౦సగా నవ్వీనవ్వనట్టు నవ్వారు.
“వీళ్ళు ఇ౦త౦త బిల్డింగులు కట్టి కోట్ల ఆస్థులు స౦పాది౦చేది మన౦ కట్టే పీజులమీద. మళ్ళీ మనమీదే జులు౦…” ఒకతనెవరో ప్రిన్సిపల్ రూ౦కి బాగా దూర౦గా వున్నతను గొణిగేడు. అతనితో కలిసి నడిచాడు.
“మీ అమ్మాయా?” గీత గురించి విని అడిగాడు.
రాఘవ తలూపాడు.
“పిల్లలుకదా, ఇక్కడ అనేకరకాలు చూసి మాయలో పడిపోతారు. చదువుకోవడానికి పిల్లల్ని తీసుకొస్తున్నట్టు లేదెక్కడా. ఆ కార్లు, ఆ వేషాలు, హంగులు, ఆర్భాటాలు… మా పిల్ల చెప్తుంది, పూటకో పౌడరు, క్రీము, సెంట్లు… తినే తిళ్ళుకూడా… బాదం పప్పులు, పిస్తాపప్పులు, నేతిలడ్డూలు… మళ్ళీ పక్కనున్నవాళ్ళకి పిసరంత కూడ విదల్చద్దని నేర్పి పంపిస్తారట అమ్మానాన్నలు. మా ఆఫీసరు కూతురూ ఇక్కడే చదువుతుంది. వాళ్ళ నాన్న మనుషుల్ని పిండీ, పీడించీ లంచాలు తింటాడు. కార్లలో తిరుగుతాడు. వాళ్ళావిడ వజ్రాలనెక్లేసులు వేస్తుంది. ఇక్కడున్నవాళ్ళలో సగంమంది అలాంటివాళ్ళే. మిగతా సగం మనలాగా ఏ అద్భుతమో జరుగుతుందని పుస్తీపూసా అమ్ముకునీ, అప్పులు చేసీ పంపించినవాళ్ళు” అన్నాడతను.
రాఘవకి ఇంతకూడా ప్రపంచం తెలీదు. ఆశ్చర్యంగా విన్నాడు.
“నేను పంచాయితిరాజ్‍లో అటెండర్ని. కృష్ణస్వామి నా పేరు” అతను పరిచయం చేసుకున్నాడు. “నాతో చేసే అతని ముగ్గురుకొడుకులూ అమెరికాలో వున్నారు. అది చూసే నేనుకూడా ఆశపడి పిల్లని ఇక్కడ చేర్చాను. చదువొక్కటే ఐతే మన పిల్లలు ఎలాగో చదువుతారు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ జాతర్లో ఎక్కడ తప్పడిపోతారోనని భయం వేస్తోంది. మనం యిలాంటిచోట్ల చదువుకోలేదు, ఇక్కడ ఎలా వుంటుందో పిల్లలకి చెప్పడానికి. మహా ఐతే మేం నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, నానాగడ్డీ కరిచి ఫీజులు కడుతున్నాను, బాగా చదువుకో, పెద్ద వుద్యోగం తెచ్చుకో అని మన కష్టాలూ ఆశలూ చెప్తాం. కాదంటే సూక్తిముక్తావళి… పక్కవాళ్ళ వస్తువులు ముట్టుకోకూడదు, నీకున్నదాంతోటే సర్దుకోవాలి అని చెప్తాం. తినడానికి నచ్చిన తిండి లేక, ఆదరించి పెట్టేవాళ్ళు లేక ఎలా చదువుతారు? కానీ చదివించక తప్పట్లేదు ” అన్నాడు.
“మా పిల్ల ఇప్పటికే తప్పిపోయింది” అన్నాడు రాఘవ. అతనిగొంతు వణికింది.
రెండో అతను నిశితంగా చూసాడు. “పిల్లని తప్పుపట్టకండి. అక్కడో ఎర్రటి కారు కనిపించిందనుకోండి, ఓమాటు ముట్టుకోవాలనిపిస్తుంది. పక్కవాడు పేపరు చదువుతుంటే తొంగితొంగి చూస్తాం. ఎవడేనా కాఫీ తాగిస్తాడా అని చూస్తాం… పెద్దవాళ్ళం, మనకే యిలాంటి ప్రలోభాలుంటే పిల్లలకి వుండవా? కళ్ళముందు ఇవన్నీ చూస్తూ నిగ్రహంగా వుండటం వాళ్ళవల్ల ఔతుందా? అసలిదంతా గవర్నమెంటు స్కూళ్ళూ, కాలేజీలూ పట్టించుకోవటం మానేసి, ప్రైవేటు స్కూళ్ళకీ కాలేజీలకీ పట్టంకట్టడంవలన వచ్చింది. ఇదసలు మన ప్రపంచం కాదు… పొరపాట్న వచ్చేం. వచ్చేక తెలిసింది, మనం ఇమడలేమని. కానీ కోర్సయేదాకా తప్పదు. అదయ్యాక… ఏమో… గుర్రం ఎగురా వచ్చు అన్నట్టు ఏదేనా జరుగుతుందేమో! ఫీజులు కాసాంగా, లాటరీకోసం చూడటమే” అన్నాడు. అని, వాచీ చూసుకుని, “మా పాప వచ్చే టైమైంది. ఈవేళ విజిటింగ్ డే. వస్తాను మరి” అంటూ వెళ్ళిపోయాడు.
రాఘవకి వోదార్పు దొరికింది. కానీ ఎంతో ఆశతో ఒక పని మొదలుపెడితే ఇలా జరిగిందేమిటా అన్న నిరాశ పోలేదు. అక్కడ చెట్టుకింద బెంచి వుంటే దానిమీద కూర్చున్నాడు. ఎదుటి బెంచిమీద ఎవరో అమ్మాయి కూర్చుని వుంది. బహుశ: తల్లిదండ్రులకోసం ఎదురుచూస్తోందేమో అనుకున్నాడు. కానీ ఆ సమస్య యింకా పెద్దది. ఫీజు ఇన్స్టాల్‍మెంటు కట్టడానికి ఈరోజు ఆఖరు. తండ్రి ఫీజు డబ్బులు తీసుకుని రావాలి. ఇంకా రాలేదు. టెన్షను పడుతోంది.
చాలాసేపు అక్కడే కూర్చున్నాక డాక్టరుతో మాట్లాడి కూతుర్ని డిశ్చార్జి చేయించుకుని వెళ్ళాలని గుర్తొచ్చి లేచాడు. ఒకొక్క అడుగూ టన్ను బరువుతో పడింది.


కళ్ళిప్పి చుట్టూ చూసింది గీత. బెడ్ పక్కని కూర్చుని తన ముఖంలోకే చూస్తున్న తల్లి కనిపించింది. తల తిప్పుకుంది. ఎదురుగా ద్వారంలోంచీ వస్తున్న తండ్రి కనిపించాడు. తను బతికే వుందా? అమ్మా నాన్నా తనకోసం వచ్చారా? అన్నీ తెలిసిపోయాయా? తనమీద కోపం లేదా? పెద్దగా ఏడవాలనిపించింది. కానీ ఏడుపు బయటికి రాలేదు. కళ్ళు నీళ్ళతో నిండాయి. రెప్పలు వాల్చుకుంది. రెండుకళ్ళలోంచీ ధారలుగా కారి, జుత్తులో పడి ఇంకిపోయాయి.
“అయాం బేడ్” పెదవులు అస్పష్టంగా పలికాయి.
“గీతూ!” లక్ష్మి ఆతృతగా పిలిచింది. కూతురి చెంపలమీద చెయ్యేసి నిమిరింది.
గీత మాట్లాడలేదు. ఎక్కెక్కి పడుతోంది.
“ఎందుకే? ఎందుకమ్మా? నేనూ, నాన్నా వచ్చేం. మనింటికి వెళ్ళిపోదాం” అంది కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా. ఈ పరిస్థితిలో వున్న కూతుర్ని తిట్టగలదా? చావటానికి కూడ తెగించిన పిల్లని తర్వాత మాత్రం ఏమని మందలించగలదు?
జరిగినవి కళ్ళముందు కదుల్తున్నాయి గీతకి. తల్లీ తండ్రీ తీసుకొచ్చి కేంపస్‍లో వదిలిపెట్టారు. ఒకవైపు ఇంటిమీద బెంగ, మరోవైపు రంగులప్రపంచంలాంటి ఈ కేంపస్. ఒకొక్కరూ ఒకొక్క వింత ప్రపంచం తమతో తీసుకొచ్చారు. అందరిముందూ తేలిపోతున్నట్టు తను… మార్కులనిబట్టి సెక్షన్లు, గదులు కేటాయించారు. తన రూమ్‍లో అవని, మరో యిద్దరు పిల్లలు. తను బాగా చదువుతుందని వాళ్ళతోపాటు కలిపి ఉంచారు. తనని వాళ్లు కలుపుకోలేదు. వాళ్ళకి తను నచ్చలేదు. తనని ఆ రూమ్‍లోంచీ వేరే రూం‍లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని తెలీదు. తనకిమాత్రం వాళ్ళతో కలవాలని. వాళ్ళ దగ్గరుండే కాస్మటిక్స్, హెడ్ బేండ్స్… అన్నీ ఒక వింతే. పనికి రావని టాయ్‍లెట్లో వదిలేసినవి అపురూపంగా తెచ్చి దాచుకుంది. తప్పనిపించలేదు ఆ క్షణాన. అవే తనని దోషిగా నిలబెడతాయనుకోలేదు.
అసలు తను చేసిన తప్పేమిటని?
మొదట్లో తను బాగానే చదివేది. కానీ చదువుమీద ద్యాస తగ్గింది. ఎప్పుడూ ఏవో ఆలోచనలు… ఇంటిగురించి, అమ్మానాన్నలగురించి, అక్కడ వదిలిపెట్టిన ఫ్రెండ్స్ గురించి… వాటిని తప్పించుకోవటానికి కొన్ని కలలు… పగటికలలు… తను పెద్దైనట్టూ, ఇంజనీరైనట్టూ, ఏవేవో కొనుక్కున్నట్టూ.
యూనిట్ టెస్ట్‌లో మార్కులు తగ్గాయి. ముఖ్యంగా ఫిజిక్స్‌లో.
“మార్కులెందుకు తగ్గాయి గీతా? ఏవేనా డౌట్స్ వుంటే అడగాలికదా?” అన్నాడు ఫిజిక్స్ సార్ కృష్ణకుమార్. ఆ కొద్దిపాటికే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయి.
“ఓకే ఓకే. క్లాసయాక వుండు” అని క్లాస్ తీసుకున్నాడు. క్లాసయ్యాక అందరూ వెళ్ళిపోయినా తను వుండింది.
“చూడమ్మా! మీరు ఎక్కడెక్కడినుంచో వచ్చారు. మీ అమ్మానాన్నలు ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి పంపించారు. వచ్చింది చదువుకోవడానికి. అదొక్కటే నీ ధ్యేయంగా వుండాలి. వేరే ఏవీ ఆలోచించకూడదు. ఇంటిమీద బెంగా అవీ వదిలెయ్యాలి. నువ్వు ఫిజిక్స్‌లో చాలా షార్ప్‌‍గా వుండేదానివి. ఎందుకని మార్కులు తగ్గాయి? ఏవేనా డౌట్సుంటే అడిగి తీర్చుకో. ఓకేనా?” అన్నాడు.
“ఇకమీదట బాగా చదువుతాను” అనీ అననట్టు అంది.
“గుడ్” అనేసి అతను వెళ్ళిపోయాడు. ఏవో ప్రపంచాలన్నీ గిరగిరా తిరిగి వచ్చి భూమ్మిద పడ్డట్టైంది తనకి. హితవుకోరి చెప్పిన ఒక్కమాట… దారి తప్పిన ఆలోచనలని మళ్ళీ దార్లో పెడుతున్నట్టైంది. చేతిలో విద్యేగా, కృష్ణకుమార్ సార్ స్కెచ్చి నోట్సుల్లో రెండుమూడుచోట్ల వేసింది. అది పెద్ద గొడవైంది.
“మా బావ స్కెచ్చి నువ్వెందుకు వేసావు? మేమంతా వచ్చేసాక మా బావతో నీకేంటి మాటలు?” అని అవని పెద్ద గొడవ చేసింది. కృష్ణకుమార్ సార్ వాళ్ళక్కకి కాబోయే భర్తట. హక్కంతా ఆమెదేనన్నట్టు మాట్లాడింది. చాలా గొడవైపోయింది. ఆఖరికి తన సామాన్లన్నీ వెతికి దొంగగా ప్రిన్సిపల్‍ముందు నిలబెట్టింది.
అతనుకూడా తనని డిఫెండు చెయ్యలేదు.
“ఆడపిల్లలతో పెద్ద తలకాయనొప్పిగా వుంది. ఇంటిమీద బెంగతోనో మరేకారణంతోనో సరిగ్గా చదవట్లేదని ఒకమాట మందలింపుగా అనేసరికి ఇంత పొడుగు వూహించేసుకుంటారు” అని చులకనగా అనేసాడు. అప్పుడేకదూ, తనకి చచ్చిపోవాలనిపించింది! క్లీనింగ్ లిక్విడ్ తాగేసింది. అమ్మా నాన్నా వున్నారు తనకి… కానీ వాళ్ళకి తన ముఖం ఎలా చూపించగలదు? ఏడుపు ఆగటంలేదు.
“గీతూ అలా ఏడవకే!” లక్ష్మికూడా ఏడ్చేసింది. ఇద్దర్నీ చెరోచేత్తోటీ వోదార్చుతూ కూర్చున్నాడు రాఘవ. నెమ్మదిగా సర్దుకున్నారు. డాక్టరు వచ్చాడు. డిశ్చార్జి చెయ్యమని అడిగాడు రాఘవ. ఆ ఫార్మాలిటీసన్నీ అయ్యాయి. లక్ష్మి వెళ్ళి గీత సామాన్లన్నీ తీసుకొచ్చింది. సామాన్లు సర్దుతున్నంతసేపూ ఆయా అక్కడే వుంది. గమనిస్తూ వుంది. నాలుగు జతల బట్టలు, పుస్తకాలు, ఏవో కొన్ని అతిముఖ్యమైన వస్తువులు… అంతే. తమ తాహతు అది. అవే యిచ్చి పంపారు. అవే తీసుకొచ్చింది.
రాఘవ ఆటో తీసుకొచ్చాడు. ఇద్దరిమధ్యా గీతని జాగ్రత్తగా కూర్చోబెట్టుకున్నారు. ఆటో కదిలింది. స్టేషనుకి గంట ప్రయాణం. రాఘవ ఆటో అతన్తో మాటలు కలిపాడు. కూతురు బెంగపడిందని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నామని చెప్పాడు రాఘవ. ఎవరో ఒకరికి చెప్పుకోవాలనిపించింది.
“నిజమే సార్! ఒక్కసారి ఇంటినీ అమ్మానాన్నల్నీ వదిలిపెట్టి ఎక్కడో వుండాలంటే పిల్లలకి దిగులౌతుంది. అక్కడ ప్రేమగా మాట్లాడేవాళ్ళే వుండరు. మనకేమో వాళ్ళు పెద్ద చదువులు చదివి పైకి రావాలని ఆశ. వాళ్ళ కష్టం ముందు మనకోరిక ఎంత సార్! మనకి అర్థమవదు. అర్థం చేసుకునే వయసు వీళ్ళకి వుండదు. పదిహేను పదహారేళ్ళనగా ఎంత సార్? నా కొడుకు మెడిసిన్ చదివాడు. చేరిన కొత్తలో తప్పుదార్లో పడబోయాడు. స్నేహాలు పట్టి తాగుడికి వెళ్ళాడు. వాళ్ళ ప్రొఫెసరు కోప్పడి తనింటికి తీసుకుపోయాడు. ఆయనింట్లోనే వుంచుకుని దార్లో పెట్టి చదువు చెప్పించి పంపించాడు. ఇప్పుడలాంటి పంతుళ్ళు ఎవరున్నారు?” అన్నాడు.
స్టేషన్‍కి వచ్చారు. రాఘవ టికెట్లు కొనుక్కొచ్చాడు. పదినిముషాల్లో రైలొచ్చింది. జనరల్ కంపార్టుమెంటులోనే సీటు సంపాదించి తను నిలబడి లక్ష్మినీ గీతనీ కూర్చోబెట్టాడు రాఘవ. కొంచెం సర్దుకుని తల్లి వొళ్ళొ తలపెట్టుకుని పడుకుంది గీత. ఆ పడుకున్నప్పుడే ఒకటీ అరా మాటల్లో జరిగింది చెప్పింది. ఇక్కడ తప్పొప్పుల నిర్ణయం పనిచేయదు. క్షమ, వోదార్పు మాత్రమే కావాలి.
ఇంటికి వచ్చారు. తలుపు తీసి లైటు వేస్తుంటే చీకట్లోకి అడుగుపెడుతున్నట్టు రాఘవకీ, గుండెల్లోనే వెలుతురు నిండినట్టు గీతకీ అనిపించింది.

2 thoughts on “తప్పిపోయిన పిల్ల by S Sridevi”

  1. P.Vijayakumari

    అద్భుతంగా రాశారు.సమస్యలు సమస్యలు గానే మిగిలి పోతున్నాయి

Comments are closed.