ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

రష్యన్ మూలం: Anton Pavlovich Chekhov
The story was originally published in Russian in the late 1880s. and translated into English by Constance Garnett

తెల్లారి మూడుగంటల సమయం. మూడుగుర్రాలు పూన్చిన గుర్రబ్బగ్గీ పోస్టాఫీసుముందు ఆగి వుంది. డ్రైవరు ఉత్తరాల సంచులు అందులోకి ఎక్కిస్తున్నాడు. టోపీ, కోటూ వేసుకున్న పోస్ట్‌మాన్, దారిలో రక్షణకోసం ప్రభుత్వంవారిచ్చిన తుప్పు కత్తి పట్టుకుని నిలబడి, ఆ పని పూర్తైతే బయల్దేరవచ్చని చూస్తున్నాడు. అతని పేరు ఇగ్నత్యేవ్.
పోస్టుమాస్టరు, తన కౌంటరు బల్లముందు కూర్చుని నిద్రకి జోగుతున్నాడు. అలా జోగుతునే ఒక ఫారాన్ని నింపుతున్నాడు.
“నా మేనల్లుడు బస్తీలో చదువుకుంటున్నాడు. అతను వున్నపళంగా స్టేషనుకి వెళ్ళాలి. అతన్ని వుత్తరాలబగ్గీలో కూర్చోబెట్టుకుని, స్టేషనుకి తీసుకెళ్ళు. ఇలా చెయ్యడం నియమనిబంధనలకి విరుద్ధమని నాకు తెలుసు. కానీ తప్పదు. వాడికోసం డబ్బిచ్చి వేరే గుర్రబ్బగ్గీ మాట్లాడటంకన్నా, నీతో ఇలా వుచితంగా పంపించడం మేలుకదా?” అన్నాడు, పోస్ట్‌మేన్‍తో
“సిద్ధమైంది” బయటినుంచీ డ్రైవరు కేక వినిపించింది.
“సరే, బయల్దేరండి. ప్రయాణం సవ్యంగా జరగాలని భగవంతుని ప్ర్రార్థిస్తున్నాను” అని, “బండిని నడిపేదెవరు?” అడిగాడు పోస్టుమాస్టర్.
“సెమ్యొన్ గ్లాజొవ్” పోస్ట్‌మేన్ జవాబిచ్చాడు.
“రా, వచ్చి సంతకం పెట్టు” అన్నాడు పోస్టుమాస్టర్.
పోస్ట్‌మేన్ రశీదు సంతకం పెట్టి బయటికి వచ్చాడు. పోస్టాఫీసు ప్రవేశద్వారం దగ్గర గుర్రాలు, బగ్గీ యొక్క రూపురేఖలు చీకట్లో లీలగా కనిపిస్తూ, చీకటి కేన్వాసుమీద అతికించిన మరో చీకటిముక్కలా వున్నాయి. బగ్గీకి కట్టిన మూడిట్లో రెండు గుర్రాలు స్థిరంగా వున్నాయి. వాటికి అదనంగా జోడించిన మూడోది మాత్రం అసౌకర్యంగా ఓ కాలిమీంచీ ఇంకో కాలిమీదికి కదుల్తూ తల విసుర్తూ వుంది. దాని మెడలో వున్న గంట శబ్దం చేస్తోంది. బగ్గీ పక్కనుంచీ రెండు నీడలు కదిలాయి. ఒకటి పోస్టుమాస్టరుగారి మేనల్లుడు, విద్యార్థిది. అతను పెద్ద తోలుపెట్టె పట్టుకుని వున్నాడు. రెండోది డ్రైవరుది.
డ్రైవరు పైపు కాలుస్తున్నాడు. అతను నడుస్తూ వుంటే చుట్ట వెలుగు పైకీ కిందకీ, ఆ పక్కకీ, యీ పక్కకీ అతన్తోపాటు కదుల్తోంది. పోస్ట్‌మేన్ బగ్గీలో వున్న వుత్తరాల సంచీలని చేత్తో అదిమి, వాటిమీద తన కత్తి పెట్టి ఒక్క గెంతులో లోపలికి ఎక్కి కూర్చున్నాడు. విద్యార్థికూడా అలాగే ఎక్కబోయాడు కానీ పొరపాట్న అతని మోచేయి పోస్ట్‌మేన్‍కి తగిలింది.
“క్షమించండి” సిగ్గుపడుతూ బెరుగ్గా అన్నాడు.
డ్రైవరు పైపు ఆరిపోయింది.
పోస్టుమాస్టరు బయటికి వచ్చాడు. వంటిమీద పెద్దగా ఏమీలేవు. మీద వేస్ట్‌కోటు, కాళ్ళకి చెప్పులు… అంతే. చలికి బిగుసుకుపోతున్న గొంతుని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ, బగ్గీ పక్కనుంచీ నడుస్తూ వచ్చి, మేనల్లుడితో అన్నాడు. “మీ అమ్మ మిహైలోకి నా ప్రేమని తెలియజెయ్యి. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు” అని, ” ఇగ్నత్యేవ్, పార్సెల్‍ని బిస్త్రెత్సోవ్‍కి ఇవ్వడం మర్చిపోకు” అంటూ పోస్ట్‌మే‍న్‍కి గుర్తుచేసాడు.
“ఊ< ఇంక బయల్దేరండి” అన్నాడు. డ్రైవరు తన సీటుమీద సర్దుకుని కూర్చుని గుర్రాలని పరిగెత్తించాడు. బగ్గీ కీచుమని కదిలింది.
“అందర్నీ అడిగానని చెప్పు…” పోస్టుమాస్టరు మరోసారి మేనల్లుడితో చెప్పాడు.
బగ్గీవాడు ఒకమాటు లేచి, వున్నచోటే నిలబడి, మూడోగుర్రాన్ని చెర్నాకోలాతో రెండుదెబ్బలు వేసి మళ్ళీ కూర్చుని సర్దుకున్నాడు. కిర్రుమని శబ్దం చేస్తూ, దుమ్ము రేపుతూ బగ్గీ ముందుకి సాగుతోంది. గుర్రాల మెడల్లోని గంటలు ఒకదాంతో ఒకటి వూసులాడుకుంటునట్టూ, ఒకదాన్నొకటి పరిహాసం చేసుకుంటున్నట్టూ మోగుతున్నాయి. ఊరంతా ఆ సమయాన గాఢనిద్రలో వుంది. బాటకి అటూయిటూ వున్న యిళ్ళూ, చెట్లూ చీకటిముసుగు కప్పుకుని వున్నాయి. ఎక్కడా చిన్న దీపంకూడా వెలగడంలేదు. ఆకాశం నక్షత్రాలతో నిండి వుంది. అక్కడక్కడా మబ్బులు వాటిని కప్పేస్తున్నాయి. ఇంకాసేపట్లో తెల్లవారుతుందనటానికి సూచనగా చంద్రుడు క్షీణిస్తున్నాడు. పెద్దగా వెలుగు లేదు. వాతావరణం తేమగా చల్లగా వుంది. శరదృతువు చక్కగా ప్రకటితమౌతోంది.
తనని బగ్గీలో ఎక్కించుకుని ఇంత సాయం చేస్తున్న వ్యక్తితో మాట్లాడకపోతే బావుండదనిపించింది విద్యార్థికి. నెమ్మదిగా మాట కలిపాడు.
“ఎండాకాలంలోనైతే ఈపాటికి తెల్లవారుతుంది” అన్నాడు మర్యాదాపూర్వకంగా. ఆకాశాన్ని పరిశీలనగా చూస్తూ,” ఆకాశాన్ని చూస్తేనే అర్థమౌతుంది మనకి ఇది, శరదృతువని. కుడివైపుకి చూడండి… ఒకదానిపక్కన ఒకటి కనిపిస్తున్న ఆ మూడునక్షత్రాలూ ఓరియన్ రాశికి చెందినవి. మనకి సెప్టెంబర్లో మాత్రమే కనిపిస్తాయి…” అనికూడా అన్నాడు.
పోస్ట్‌మాన్ చలికి వణుకుతూ, చొక్కా చేతుల్ని కిందికి గుంజుతూ వాటిల్లో అరచేతుల్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చెవుల్లోకి గాలి పోకుండా కోటుకాలర్ని పైకెత్తుకున్నాడు. అతనికి పోస్ట్‌మాస్టరు మేనల్లుడు చెప్తున్న ఆకాశంమీదా, నక్షత్రాలమీదా ఏమాత్రం ఆసక్తి కలగలేదు. అసలు అతనికి నక్షత్రాలేమీ కొత్తకాదు. ఇంకా చెప్పాలంటే వాటిని చిన్నప్పట్నుంచీ చూసిచూసి విసిగిపోయి వున్నాడు.
“చాలా చల్లగా వుంది. ఇక తెల్లారుతుందనుకుంటాను. సూర్యోదయం ఎప్పుడౌతుందో మీకేమైనా తెలుసా?” విద్యార్థి కొద్దిసేపు ఆగి, అడిగాడు.
“ఏంటీ?” అడిగాడు పోస్ట్‌మాన్.
“సూర్యోదయం ఎప్పుడౌతుందని అడుగుతున్నాను”
“ఐదూ ఆరూ మధ్యన” జవాబు డ్రైవరు చెప్పాడు.
బగ్గీ ఇప్పుడు వూరు దాటేసింది. ఇప్పుడింక పెరటితోటల కంచెలు, అక్కడక్కడా ఒకటో అరో విల్లోచెట్లూ అంతే. కంటిముందంతా చిమ్మచీకటి. ఈ వూరిబయట… ఆరుబయల్లో కుంగుతున్న చంద్రుడూ, చుక్కలూ వూళ్ళోకంటే కాస్త ఎక్కువ వెలుతురునిస్తున్నట్టు అనిపించింది.
ఉన్నట్టుండి తేమగాలి ముఖాలని కొట్టింది. పోస్ట్‌మాన్ తన కోటులోకి ఇంకా కుదించుకుపోయాడు. పాదాల దగ్గర మొదలై, వుత్తరాల సంచులమధ్యగుండా చేతుల్నీ, ముఖాన్నీ స్పృశిస్తూ చల్లటిగాలి విద్యార్థి లోలోపలకి చేరుకుంది. నీళ్ళు చిళ్ళుతున్న శబ్దం… బగ్గీ చక్రాలకిందనుంచీ, గుర్రాల కాళ్ళకించీ నాట్యం చేస్తున్నట్టు పైకి చిళ్ళుతున్న నీళ్ళలో ఆకాశంలోని నక్షత్రాలు ప్రతిబింబిస్తున్నాయి.
ఇంకో పదినిముషాలు గడిచాయి. పైని ఆకాశంలోని నక్షత్రాలుగానీ, చంద్రుడుగానీ కనిపించనంతగా చీకటి పెరిగిపోయింది. అడవిలోకి ప్రవేశించారన్నమాట. ఎత్తుగా పెరిగిన ముళ్ళకంపలు విద్యార్థి టోపీని రాచుకుంటున్నాయి. సాలెగూడొకటి అతని ముఖానికి అతుక్కుపోయింది. బగ్గీచక్రాలూ, గుర్రాలగిట్టలూ బలంగా నేలపైకి పెరుగిన చెట్లవేర్లని తంతున్నాయి. అలా తన్నినప్పుడల్లా కుదుపులు. దాంతో తప్పతాగినవాడి నడకకిమల్లే బగ్గీ అటూయిటూ వూగడం మొదలుపెట్టింది. ఇది మొదటి వణుకు.
“బాట వదిలిపెట్టేసావేం?” పోస్ట్‌మేన్ కోపంగా అడిగాడు. “చూసి నడుపు. నా మొహమంతా గీరుకుపోయింది. …కుడివైపుకి తీసుకో…” అంటూనే వున్నాడు, పెద్ద ప్రమాదం ఎదురైంది. బగ్గీ హఠాత్తుగా మూర్చరోగిలాగా వణకడం మొదలుపెట్టి, కీచుమన్న శబ్దంతో ముందు కుడికీ, తర్వాత ఎడమలకీ బాగా వంగిపోయి, ఆ తర్వాత విపరీతమైన వేగంతో ముందుకు దూసుకెళ్ళింది. గుర్రాలు దేనికో బెదిరిపోయి పరుగుతీస్తున్నాయి.
“ఏయ్… ఆగండి… ఆగండి, దయ్యపుముఖాల్లారా…” అరిచాడు డ్రైవరు.
విద్యార్థి హడిలిపోయాడు. ముందుకు వంగి, నిలదొక్కుకోవడానికీ, బగ్గీలోంచీ బయటకి పడిపోకుండా వుండడానికీ పట్టుకోసం ప్రయత్నం చేసాడు. ఉత్తరాల సంచీలు తోలువి. వాటి నునుపుదనం ఎక్కడా పట్టుచిక్కనివ్వడంలేదు. బెల్టేదో దొరికితే అందుకుందామని చూసాడు. అది డ్రైవరు బెల్టు. కానీ అతడే స్థిరంగా లేడు. బగ్గీ కుదుపులకి గాల్లోకి లేస్తూ కిందకి పడుతున్నాడు. అంత చప్పుడులోనూ పోస్ట్‌మేన్‍ కత్తి ఖణేలుమని కింద పడ్డ శబ్దం వినిపించింది. ఆ తర్వాత బగ్గీ వెనుకవైపునించీ దబదబమని ఏవో కిందపడ్డ చప్పుడు రెండుమాట్లు వినిపించింది.
“ఉత్తరాల సంచీలు పడిపోతున్నట్టున్నాయి. ఆపు వాటిని” వెనక్కి తిరిగి అరిచాడు డ్రైవరు. ఆ అరుపు ఏమీ పనిచెయ్యలేదు. మొదటి కుదుపుతో విద్యార్థి మొహం డ్రైవరు సీటుకి బలంగా కొట్టుకుంది. రెండో కుదుపులో అంతే వేగంతో బగ్గీ అంచుకి వెన్నెముక తాకింది. తను పడిపోతున్నాడన్న విషయం అతనికి స్ఫురించింది. అదే సమయానికి గుర్రాలు అడవిలోంచీ బైటపడి, కుడివైపుకి బలమైన మలుపు తీసుకుని, అక్కడున్న కర్రదుంగల వంతెనమీద కొంచెం పరిగెత్తి, ఒక్కసారి ఆగిపోయాయి. అవి అంత హాఠాత్తుగా ఆగిపోవడంతో కింద పడాల్సిన విద్యార్థి మళ్ళీ ముందుకి కొట్టుకున్నాడు. మొత్తానికి బగ్గీ ఆగింది.
తీరా చూస్తే డ్రైవరుకీ, విద్యార్థికీ ఇద్దరికీ కూడా వూపిరి ఆగిపోయినంత పనైంది. బగ్గీలో పోస్ట్‌మేన్ లేదు. కత్తి, విద్యార్థియొక్క తోలుసంచీ, ఒక వుత్తరాల సంచీతోపాటు అతనూ పడిపోయాడు.
“వెధవా! ఆగు…” అడవిలోంచీ అరుపులు వినిపించాయి. “దొంగవెధవా! ప్లేగురోగం నిన్నెత్తుకుపోనూ!” పెద్దగా అరుస్తూ శాపనార్ధాలు పెడుతూ పోస్ట్‌మేన్ వస్తున్నాడు. అతని గొంతులో కోపం, దు:ఖం రెండూ పోటీ పడుతున్నాయి. పిడికిలి బిగించి బగ్గీవాడిమీదిమీదికి వెళ్ళాడు.
“దొరా! నన్నేం చెయ్యమంటారు! నామీద దయచూపండి” అంటూ, నెపాన్ని అక్కడున్న గుర్రాలమీదికి నెట్టేసాడు. “అదుగో, ఆ మూడోగుర్రంవల్లనే అంతా జరిగింది. అది జీనుకెక్కి వారమైంది. అంతా బాగానే వుంటుందిగానీ దిగువదారిన గొడవచేస్తుంది. దాన్ని మూతిదగ్గర నిమిరి బతిమాలి, బుజ్జగించాలి… అప్పుడు వింటుంది…దరిద్రగొట్టుది…” అంటూ సగం సంజాయిషీగానూ, మిగతాసగం ఫిర్యాదుగానూ చెప్పాడు. గుర్రాలని మళ్ళీ బగ్గీకి సరిగా కట్టి, బండిలోంచీ కింద పడిపోయిన వస్తువులకోసం వెళ్తూ వున్నంతసేపూ పోస్ట్‌మేన్ అతన్ని శాపనార్ధాలు పెడుతునే వున్నాడు. డైవరు పడిపోయిన సామాన్లు తెచ్చి మళ్ళీ బగ్గీలో పెట్టి, మూడోగుర్రాన్ని తిడుతూనే నడుస్తూ కాస్తదూరం బగ్గీని నడిపించి, బగ్గీలోకి ఎక్కాడు.
ఈ ప్రయాణం విద్యార్థికి చాలా సరదాగా అనిపించింది. రాత్రంతా, అదీ వుత్తరాలబగ్గీలో ప్రయాణం చెయ్యడం అతని జీవితంలో అదే మొదటిసారి. ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నీ … తన నడుముకి తగిలిన దెబ్బతోసహా అతనికి సాహసోపేతంగా అనిపిస్తున్నాయి. సిగరెట్ అంటించుకుని, చిన్న చిరునవ్వుతో, పోస్ట్‌మేన్‍తో అన్నాడు.
“మీకు తెలుసా? మీ మెడ విరిగిపోయి వుండేది… నేనైతే బగ్గీలోంచీ పడిపోవలిసినవాడిని… మీరు కింద పడిపోవడం నేనసలు చూడనే లేదు… శరదృతువులో ప్రయాణం… భలే సాహసోపేతంగా వుంది”
పోస్ట్‌మేన్ ఏమీ మాట్లాడలేదు.
“ఎంతకాలమైంది, మీరీ వుద్యోగంలో చేరి?”
“పదకొండేళ్ళు”
“ఓహ్… రోజూ ప్రయాణం చేస్తారా?”
“ఔను. రోజూ. ఉత్తరాలు తీసుకుని మళ్ళీ వెంటనే తిరుగుప్రయాణమౌతాను. ఎందుకివన్నీ అడుగుతున్నావు?”
రోజూ ప్రయాణమంటే ఈ పదకొండేళ్ళలో ఇలాంటి ఎన్నో సాహసాలు చేసి వుండాలి. చక్కటి వేసవి ఎండల్లో… ఇలాంటి చీకటిరాత్రుల్లో…
చలికాలపు మంచు తుఫానుల్లో… గుర్రాలు ఇలాగే చేసి వుండచ్చు, బగ్గీ చక్రాలు బురదలో కూరుకుపోయి వుండచ్చు, దారిదోపిడి జరిగి వుండచ్చు… దారి తప్పి వుండచ్చు… పోస్ట్‌మేన్ కచ్చితంగా భయపడే వుంటాడు అలాంటి సందర్భాల్లో.
“ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగివుంటాయి ఈ పదకొండేళ్ళలో. నాకు తెలుసుకోవాలని కుతూహలంగా వుంది” అన్నాడు.
పోస్ట్‌మేన్ ఏవో చెప్తాడని విద్యార్థి ఆశించాడు. కానీ అతనేమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు. తన కోటులోకి ఇంకా వొదిగిపోయి కూర్చున్నాడు. నెమ్మదిగా తెల్లవారడం మొదలైంది. ఆకాశం అంతా వింతకాంతితో నిండింది. చీకటి యింకా విడలేదుగానీ, గుర్రాలూ, డ్రైవరూ, ముందున్న బాటా కనిపించసాగాయి. చంద్రుడు పూర్తిగా కనిపిస్తున్నాడు. చంద్రుడికింద వున్న మేఘం పేలబోయే ఫిరంగిలా వుంది. పోస్ట్‌మేన్ ముఖంకూడా ఇప్పుడు కనిపిస్తోంది. మంచుతో తడిసి, తెల్లగా పాలిపోయి, రాయిలా కఠినంగా వుంది. డ్రైవరుమీద కోపం, బాధా అందులో కనీకనిపించనట్టున్నాయి.
“అమ్మయ్య! తెల్లవారింది” అన్నాడు విద్యార్థి, పోస్ట్‌మేన్ ముఖంలోకి చూస్తూ. “నేనైతే చలికి గడ్డకట్టుకుపోయాను. సెప్టెంబర్లో చలి బాగానే వుంటుందిగానీ, తెల్లారితే అంత వుండదు. ఔను, మనం స్టేషన్ చేరేసరికి ఏ వేళౌతుంది?” అడిగాడు.
పోస్ట్‌మేన్ ముఖం చిట్లించుకున్నాడు.
“నాతో మాట్లాడటానికి ఎందుకంత వుబలాటం? ” కోపంగా అడిగాడు. “కనీసం ప్రయాణం చేస్తున్నప్పుడేనా మాట్లాడకుండా వుండలేవా?” అతని గొంతులో కటుత్వం. ఎందుకలా మౌనం పాటించాలో అర్థంకాక విద్యార్థి కాస్త తికమకపడ్డాడు. మళ్ళీ పోస్ట్‌మేన్ని మాట్లాడించే ప్రయత్నం చెయ్యలేదు.
భళ్ళుని తెల్లారిపోయింది. కానీ సూర్యుడిని మబ్బులు కప్పేసాయి… తమలో అతన్ని దాచుకున్నాయని ఎవరికీ అనుమానంకూడా రానంతగా. ఉదయపు చలీ, పోస్ట్‌మేన్‍యొక్క ముభావం విద్యార్థిలో అంతకుముందున్న వుత్సాహాన్ని చంపేసాయి. బగ్గీ ముందుకి పరిగెడుతుంటే అనాసక్తిగా పరిసరాలని చూస్తూ కాస్త ఎండ తగులుతుందేమోనని ఎదురుచూస్తూ వున్నాడు. చుట్టూ వున్న చెట్లదగ్గర్నుంచీ గడ్డిపరకలదాకా ఎముకలుకొరికేసే చలిరాత్రులని ఎలా తట్టుకుంటున్నాయో అనే ఆలోచన ఒకటి కలిగి చాలా విషాదంగా అనిపించింది. ఒక యింటిముందు కొలను కనిపించింది. అందులోని చేపలు చలిని తట్టుకుని ఎలా బతుకుతున్నాయోననే ఆశ్చర్యం కలిగింది. నెమ్మదినెమ్మదిగా సూర్యుడు పైకొచ్చాడు… అతనే చలికి వణుకుతున్నట్టు మసకమసగ్గా. సాహిత్యంలో వర్ణించేట్టు ఉదయించే సూర్యకిరణాలవల్ల చెట్ల పైభాగాలు మెరిసిపోవటంలేదు, అవేమీ వెచ్చగా భూమిమీదకు పాకడంలేదు, బద్దకంగా ఎగురుతున్న పక్షుల్లో ఆనందం యొక్క ఆనవాళ్లు తీసుకురాలేదు. చలి అలాగే ఉంది.
నిండా తెరలు కట్టి వున్న భవంతి ఒకటి దాటిపోయింది. ఆ యింట్లోవాళ్ళు వెచ్చగా పడుకుని వుండి వుదయపు నిద్రని ఆస్వాదిస్తుంటారనిపించి కొద్దిగా అసూయ కలిగింది. వాళ్ళెవరికీ తన పక్కనున్న పోస్ట్‌మేన్ కోపిష్టిముఖంలాంటి ముఖం చూడాల్సిన అవసరం వుండదు.
“పోస్టుబగ్గీలో ఎవర్నేనా ఎక్కించుకోవటం నియమనిబంధనలకి వ్యతిరేకం. అస్సలు అనుమతి లేదు. అనుమతిలేదు కాబట్టి ప్రజలూ ఆసక్తి చూపరు. ఎలాగా వెళ్ళేదేకాబట్టి ఓ మనిషిని ఎక్కించుకుని తీసుకెళ్లడంలో పెద్ద తేడా ఏమీ వుండదు. కానీ అది అనుమతించబడని విషయం కాబట్టి నాకు ఇష్టం వుండదు” అన్నాడు పోస్ట్‌మేన్ హఠాత్తుగా.
“మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు?” విద్యార్థి అడిగాడు.
పోస్ట్‌మేన్ జవాబివ్వలేదు. కానీ అతని ముఖంలో అదే ద్వేషం, కోపం. కొద్దిసేపటికి స్టేషను వచ్చింది. విద్యార్థి అతనికి ధన్యవాదాలు చెప్పి దిగాడు. మెయిల్ ఇంకా రాలేదు. ఒక పొడవైన గూడ్సురైలు మాత్రం ఆగి వుంది. దాని చోదకుడు, అతని సహాయకుడు మురిగ్గా వున్న టీ పాట్‍లోంచీ టీ తాగుతున్నారు. వాళ్ల ముఖాలు మంచుతో తడిగా వున్నాయి. ప్లాట్‍ఫారాలు, సీట్లు, అక్కడున్నవన్నీకూడా మంచుతో తడిసిపోయి వున్నాయి.
విద్యార్థి వాళ్ళతోకాకుండా అక్కడి బఫె పాయింటుదగ్గర టీ తాగుతూ నిలబడ్డాడు. పోస్ట్‌మేన్ చేతుల్ని చొక్కాస్లీవ్స్‌లో దాచుకుని, కాళ్ళకింది నేలని చూస్తూ వంటరిగా పచార్లు చేస్తున్నాడు. అదే కోపం అతని ముఖంలో. ఏవరిమీద అతని కోపం? మనుషులమీదా? పేదరికం మీదా? గడ్డకట్టించే చల్లటి శరద్రాత్రులమీదా? అతనికే తెలీదు.
విద్యార్థిమాత్రం అతనంత కోపదారి మనిషిని చూడలేదని అనుకున్నాడు. అతనికి ప్రయాణంతోపాటే సహప్రయాణీకుడూ ఒక అనుభవమే.