అమ్మమ్మ చదువు- సుధామూర్తి
పరిచయం యస్. శ్రీదేవి

రచయిత్రి కర్ణాటకవాసి. కంప్యూటర్ సైన్సెస్‍లో ఎమ్‍టెక్ చదివి, అధ్యాపకురాలిగా చేసారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చెయిర్‍పర్సన్‍గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. గొప్ప సంఘసేవకురాలు. అనేక పుస్తకాలు రచించారు. రచయిత్రి రాసిన How I Taught My Grandmother To Read And Other Stories అనే పుస్తకాన్ని ద్వారకా తెలుగులోకి అనువదించగా అలకనంద సంస్థ ప్రచురించింది. ఇప్పుడు ఈ పుస్తకం వెల Rs 200/-
ఈ పుస్తకంలో 35 కథలున్నాయి. వీటిని పూర్తిగా కథలని అనడానికి లేదు. రచయిత్రి స్వానుభవాలు. అలాగని రచయిత్రి ఆత్మకథ కూడా కాదు. కుటుంబం మనిషికి ఇచ్చే అతిగొప్ప సంపద సంస్కారం, సాంప్రదాయం. ఈ సంపద రచయిత్రికి అవధుల్లేనంతగా లభించింది. అది ఆమె రచనల్లో ప్రతిబింబిస్తూ వుంటుంది. దశాబ్దాల జీవితంలో అనేక అనుభవాలు ఎదురౌతాయి. అలాగే విస్తృతంగా పరిచయాలు కలిగినప్పుడు అనేకరకాల వ్యక్తులు కలుస్తుంటారు. కొన్ని అనుభవాలకీ, జ్ఞానానికీ కారణమౌతారు. వాటినే కథలుగా అందించారు రచయిత్రి. తెలుగు అనువాదం చక్కటి సరళమైన భాషలో, బాగా కలిసిపోయిన కొన్ని పదాలు తప్ప, పరభాషాపదాలు వుపయోగించకుండా చేయడంతో ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రతికథా పాఠకులకి ఒక సూచననో దాన్ని మించి రచయిత్రి ఆకాంక్షనో తెలియజేస్తాయి. తప్పక చదవాల్సిన పుస్తకాలలో ఒకటిగా దీన్ని చెప్పుకోవచ్చు.
మొదటిది అమ్మమ్మ చదువు. బడిముఖం కూడా చూడని అరవయ్యేళ్ళ మహిళ క్రిష్ణక్క. ఆ వయసులో ఆవిడ తన మనుమరాలైన రచయిత్రి వద్ద చదువు నేర్చుకుంటారు. ఈ నేర్చుకోవడం గురుశిష్య సంబంధంతో. మరొకటి ఉపాధ్యాయ దినోత్సవం. పిల్లలకి ఏ సెలవు ఎందుకు వచ్చిందో దాని నేపథ్యం ఏమిటో తెలీకుండా పెంచడంలోని బాధని రచయిత్రి తను అనుభవిస్తూ పాఠకులకీ పంచిచ్చారు. రష్యాలో వివాహం అనే కథలో, మూడు యుద్ధాలని గెలిచిన రష్యా, తాము ఈరోజుని స్వతంత్రగాలులు పీల్చుతూ నిశ్చింతగా బతకడానికి కారకులైన సైనికులని గుర్తు చేసుకోవటానికి చేసే ప్రయత్నం అభినందించదగ్గది, మనంకూడా ఆచరించవలసిన అవసరం ఎంతేనా వుంది. మరోకథలో ఆటోమొబైల్ ఇంజనీంగ్ వుద్యోగంలో ఆడవారికి అర్హత లేదన్నందుకు తను జేఆర్‍డీ టాటాతోనే సవాలు చేసి వుద్యోగం తెచ్చుకున్న వైనం వివరిస్తారు రచయిత్రి. నే సాధిస్తా! అనే కథలో ఐఐటీలో సీటు వచ్చి కూడా ఆర్థికకారణాలచేత చదివించలేకపోయిన తండ్రిని అర్థం చేసుకుని నారాయణమూర్తిగారు స్వయంసిద్ధుడిగా ఎదిగిన వైనం తెలియజేస్తారు. పెళ్ళి అనే కథమాత్రం కొంచెం అసంబద్ధంగా అనిపించింది. పోలిక అనేది సరివాళ్ళమధ్యన వుంటుంది. బాగా ధనికురాలైన అమ్మాయి పెళ్ళయాక సంతోషంగా వుండదు. భర్త ప్రవర్తన ఆమెని బాధ పెడుతూ వుంటుంది. ఆమె దు:ఖాన్ని తనకి తారసపడిన బిచ్చమెత్తుకునే భార్యాభర్తల బంధంతో పోల్చారు రచయిత్రి. ఏది కష్టమో, ఏది సుఖమో అన్నీ తెలిసిన వ్యక్తికీ, జీవితంలో ఏదీ అనుభవంలోకి రానివాళ్ళకీ మధ్య పోలిక వుండదు. బిచ్చమెత్తుకునే భార్యాభర్తలు అరమరికల్లేకుండానూ సంతోషంగానూ వుండచ్చు. అది అజ్ఞానంనుండీ ఏదీ తెలీనితనంనుండీ వచ్చిన సంతోషం. అలాగే నీ చేతుల్లోనే నీస్వర్గం అనే కథ. శాంతి వుద్యోగం చేస్తూ వుంటుంది. ఆమె పై బాస్ మంచివాడు కాదు. కింది వుద్యోగులని కించపరుస్తూ బాధపెడుతుంటుంది. శాంతి వుద్యోగం మానెయ్యాలనుకునే స్థితికికూడా వెళ్ళిపోతుంది. కొంతకాలానికి ఆ బాస్ మారి వేరే అతను వస్తాడు. శాంతి సమస్య తీరుతుంది. ఇందులో శాంతి చేతుల్లో వున్నదేమీ లేదు.
కొన్ని చిన్నచిన్న అసంతృప్తులు తప్ప ప్రతికథా ప్రత్యేకంగానే అనిపిస్తాయి. మన సమాజంలో జరిగే పెళ్ళిళ్ళు, వాటి అసలు ప్రయోజనాన్ని దాటిపోయి, అవి ఇప్పుడు సృష్టిస్తున్న సమస్యలు, వైవాహిక జీవితంలో చాలామంది ఆడవారు అనుభవిస్తున్న బాధలు, సమాజాన్ని గురించి మనిషికి వున్న బాధ్యత, పిల్లల పెంపకం, మనుష్యుల మనస్తత్వాలు, జీవితంలో వచ్చే సమస్యలని ఎదుర్కోవడం ఇలా అనేక విషయాలగురించి చర్చించిన ఈ కథలని చదువుతూ వున్నప్పుడు రచయిత్రితో నేరుగా సంభాషిస్తున్న భావన కలుగుతుంది.