ఏదీ మారలేదు by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

చాలాకాలం తర్వాత సుజాత డీమార్ట్‌నుంచీ బైటికి వస్తూ ఎదురైంది. ఇద్దరం ఇంటరునించీ స్నేహితులం. అంటే నాలుగు దశాబ్దాల పైమాటే, మా స్నేహానికి.
రెండుచేతుల్లోనూ చెరొకటీ పెద్దపెద్ద సంచులున్నాయి. చాలా వస్తువులు కొన్నట్టుంది. రోడ్డువారగా నిలబడి చేతుల్లో బరువు కింద పెట్టి ఆటోకోసం చూస్తోంది. కారు స్లోచేసుకుని పక్కకి ఆపుకుని దిగాను. నన్ను చూసి తను ఆశ్చర్యపోయింది.
“ఏమిటి, ఇంత హఠాత్తుగా? ఆకాశంలోంచీ వూడిపడ్డట్టు?” అడిగింది నవ్వుతూ.
“చాలాకాలమైందికదూ, మనం కలుసుకుని?” అన్నాను నేనుకూడా నవ్వుతూ.
పెద్దవాళ్ళయ్యాక ఏర్పడే స్నేహాల్లో మర్యాదలు పాటించడం వుంటుంది. చిన్నప్పటి స్నేహాల్లో అరమరికలు వుండవు. అందుకే ఈ నవ్వులు.
“ఇంకా అప్‍డేట్ కాలేదా నువ్వు? బిగ్‍బాస్కెట్లో కొనుక్కోవచ్చుగా? ఇంటికి తీసుకొచ్చి యిస్తారు” అన్నాను, తనకి అటూయిటూ నిలబెట్టి వున్న సంచులని చూస్తూ.
“ఇక్కడైతే చవగ్గా వస్తాయటలే” అంది అది తన అభిప్రాయం కాదన్నట్టు. తన ముఖంలో నవ్వూ తరిగింది. నిజమే! మారటమనేది మనం ఒక్కరం మారితే సరిపోదు. చుట్టూ వున్నవాళ్ళుకూడా మారాలి. లేకపోతే వాళ్ళు మనకి ప్రతిబంధకాలౌతారు.
“మీయింటికా, మాయింటికా?” అడిగాను మాటమార్చి.
“ఇంట్లో మా అత్తగారుంది. మంచంపట్టింది” అంది.
“సరే ఐతే, మీ యింటికే వెళ్దాం” అన్నాను.
తను కింద పెట్టిన బేగుల్ని మార్చిమార్చి చూసుకుంటూ “మరోసారి కలుద్దాం” అంది వినీవినపడనట్టు.
“అదేం కుదరదు. నా కారుందికదా, పద వెళ్దాం… ” అంటూ వంగి ఒక బేగ్ తియ్యబోయాను. చాలా బరువుంది.
“ఇన్నేసి సామాన్లు బయటికెళ్ళి కొనుక్కుని తెచ్చుకోవటమేమిటే, డోర్ డెలివరీ పెట్టుకోక? ఎంత మిగుల్తుందేమిటి? మిగిల్తే మాత్రం?” అని కోప్పడి, తనకి సాయం చేసి రెండు బేగులూ వెనక సీట్లో సర్దాక తనని పక్కని కూర్చోబెట్టుకుని కారు ముందుకి వురికించాను. ఏదో మార్పు సుజాతలో. లోలోపలికి చూసుకుంటున్నట్టు… ఆలోచనని మించిన స్థితిలో నిమగ్నమైంది. నన్ను చూసిన క్షణంలో వున్న సంతోషం ఇప్పుడు కనిపించట్లేదు. ఏదో జరిగిందని అర్థమైంది.
“అమ్మా, నాన్నా ఎలా వున్నారు?” అడిగాను. తనేం మాట్లాడకపోవటం చూసి.
“నాన్న పోయారు. రెండేళ్ళైంది. అమ్మ వృద్ధాశ్రమంలో వుంది” అంది క్లుప్తంగా.
“అదేమిటి? ” అడిగాను. సుజాత తండ్రిది బట్టలవ్యాపారం. తనొక్కర్తే కూతురు. సిటీ సెంటర్లో షాపు వుండేది. పెద్ద యిల్లూ, పుష్కలంగా డబ్బూ… ఇంటరు చదువుతున్నరోజుల్లో కట్టిన చీర కట్టకుండా ఏడాదిపాటు కట్టగలిగేన్ని చీరలుండేవి. ఒంటిమీద రోజుకో నగ పెట్టుకొచ్చేది. అలాంటిది ఈ డీమార్టు చుట్టూ తిరగడమేమిటి? వాళ్ళమ్మ వృద్ధాశ్రమంలో వుండటమేమిటి? వ్యాపారంలో నష్టంగానీ వచ్చిందా? వచ్చినాగానీ? సుజాత భర్తది మంచి వుద్యోగమే.
“అమ్మ, అత్తగారు ఇద్దరూ బాగా పెద్దవాళ్ళయారు. ఇంతలో మా అత్తగారికి పక్షవాతం వచ్చింది. ఇద్దరికీ చెయ్యలేనన్నాను. అందుకని అమ్మని ఓల్డేజి హోముకి పంపారు” అంది నిర్లిప్తంగా.
“ఎవరు? మీవారా? మనుషుల్ని పెట్టుకోవచ్చుకదే?” అడిగాను.
“నేనున్నానుకదా, తిండి తింటున్నాను, తిరుగుతున్నాను, చాకిరీ చెయ్యకపోతే ఎవరు వూరుకుంటారు?”
నాకు గొంతుక్కి ఎక్కడో అడ్డుపడ్డట్టైంది.
“పిల్లలేం చేస్తున్నారు?” అడిగాను.
“ముగ్గురూ బాగానే స్థిరపడ్డారు. పెద్దాడు పెద్దాడు జర్మనీ, రెండు ఆస్ట్రేలియా, మూడు కెనడా” అంది.
“ఇల్లు కాక నాలుగైదు కోట్లేనా వుండదూ, మీ పుట్టింటి ఆస్థి? నువ్వొక్కదానివేకదా?” ఆందోళనగా అడిగాను.
“ఐతే?” తమాషాగా అడిగింది. ఇంతలో వాళ్ళ యిల్లొచ్చింది. సంచులు దింపుకుంది. నేను కారు పార్క్ చేస్తుంటే తను వాటిని లోపల పెట్టడానికి వెళ్ళింది. మళ్ళీ నాకోసం వచ్చేలోపు నేనే లోపలికి వెళ్ళాను. సుజాత భర్త హాల్లో కూర్చుని ఎవర్తోటో ఫోన్లో మాట్లాడుతున్నాడు.
నన్ను చూసి “మళ్ళీ మాట్లాడతాను” అని అవతలి వ్యక్తికి చెప్పి, ఫోన్ పెట్టేసి లేచాడు.
“బావున్నావా, అమ్మాయ్?” అభిమానంగా పలకరించాడు. “ఎక్కడ కలిసారు, మీరిద్దరూను?” కలుపుగోలుగా అడిగాడు. మనిషిలో ఎలాంటి మార్పూ లేదు. ఒకప్పుడెలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. మరి మారిందేమిటి?
“దా, లోపల కూర్చుందాం” అని తీసుకెళ్ళింది సుజాత. పళ్ళెంనిండా కారప్పూస పట్టుకొచ్చింది.
పెద్ద పందిరిమంచం వున్న విశాలమైన గది. ఆ మంచంమీద పక్కపక్కని పడుక్కుని ఎన్నోసార్లు ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. చదువుకున్నాం. వయసు వచ్చాక ఇద్దర్లోనూ ఉరుకులేసే వుత్సాహం తగ్గి నిండుతనం చోటుచేసుకుంది. ఇప్పుడు మాత్రం సుజాతలో అర్థంకాని మార్పు. వచ్చి పక్కని కూర్చుంది. నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. చెప్పలేకపోతోంది.
“ఏమిటే?” ప్రేమగా అడిగాను.
ప్లేట్లోంచీ గుప్పెడు కారప్పూస తీసి నా చేతిలో పోసింది. అనాలోచిత చర్య.
“నీకంటూ ఒక్క రూపాయ చేతిలో లేకుండా, ఒక బేంకు అకౌంటు లేకుండా వుండే స్థితిని ఎపుడేనా వూహించుకున్నావా? ” అడిగింది.
నా సాలరీ అకౌంట్ ఏటీయెమ్ కార్డు నాదగ్గిరే వుంటుంది. నా జీతం నేనే ఖర్చుపెడతాను. నా జీతంమీది పూర్తి హక్కు నాదేనన్న జ్ఞానమో, నేను దూబరా చెయ్యననే నమ్మకమో, సహజాత సంస్కారమో… విశాల్ ఎప్పుడూ నన్ను లెక్కలు అడగలేదు. చెప్పే పరిస్థితి నేనూ తెచ్చుకోలేదు. సహృద్భావంతోనే ఇంటి ఆర్థికలావాదేవీలు నడిచిపోతుంటాయి. ఈ విషయాలగురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. సుజాత ఎందుకలా అడిగింది?
“నాన్న వున్నంతకాలం నాకేమీ అనిపించలేదు. గొడుగులా ఆయన కాపాడతాడనే భ్రమలో వుండేదాన్ని. కానీ ఆయన … ఆస్తంతా అల్లుడి పేర రాసారు”అంది నెమ్మదిగా. తన గొంతులో అంతు చిక్కని దు:ఖం. తన వొళ్ళో చిక్కుపడ్డ మా యిద్దరి చేతివేళ్లనీ చూస్తున్న నేను దిగ్గుమని తలెత్తి చూసాను.
“అతను చెడ్డవారనీ నన్ను చూడరనీ కాదు… నేనెప్పుడూ సంతోషంగా లేను. కిరాణాకొట్టుకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవటం, రైతుబజారుకి వెళ్ళి గీసిగీసి బేరమాడి కూరలు తెచ్చుకోవడం, పైసపైసా లెక్కేసుకుంటూ గడపడం… ఎంత పొదుపు చేస్తే అంత గొప్ప. వీటి చుట్టే జీవితం నడిచింది. మాకు డబ్బుందన్న భావనని తప్పిస్తే డబ్బుని మేం ఎప్పుడూ అనుభవించలేదు… చేస్తే అమ్మకీ అత్తగారికీ నేనే చెయ్యాలి. మనుషుల్ని పెట్టి చేయించడంలో బాధ్యత తప్ప ప్రేమ వుండదట. ఇద్దరికీ చెయ్యలేనన్నానని అమ్మని పంపించేసారు. రేపు అత్తగారికో తనకో చెయ్యలేని పరిస్థితి వస్తే నన్నూ అలాగే పంపేస్తారా? ఇతనుకూడా పిల్లలకే రాసేస్తాడా ఆస్తి? మరి నేను? ముందే పోతే సమస్య లేదు. కాకపోతే? పిల్లలు… వాళ్ళు మాత్రం నన్ను చూస్తారా? అదంతా కాదు, నాన్నకి నేను బాధ్యతనే తప్ప మరేమీ కానా? నాకెలాంటి హక్కుగానీ, కోరికగానీ వుండదా? నాన్న అలా చెయ్యకపోతే నాకిలాంటి ఆలోచనలేవీ వచ్చేవి కాదు. ఆస్థిని అమ్మ పేరిట పెట్టినా, వాటాలు వేసినా అది సహజంగానే అనిపించేది. కానీ మా యిద్దర్నీ కాదని… మొత్తం అంతా ఇతని పేర్న పెట్టడం…అవమానంగా అనిపిస్తోంది. నాన్న ఎందుకలా చేసారు? మనసుకి సర్దిచెప్పుకోలేకపోతున్నాను” తన గొంతు వణుకుతోంది. నా చెయ్యి తన చేతి చుట్టూ బిగుసుకుంది.
ఆస్థి చుట్టూఎన్ని కథలు, ఆలోచనలు, జీవితాలు!
“అలా బాధపడొద్దే! అతనెవరు? నీ భర్తేకదా? అన్నాను ఓదారుస్తూ. నా మాటలు నాకే డొల్లగా అనిపించాయి. ఆమెవరు, నా భార్యే కదా, అనగలడా మగవాడు ఇలాంటి సందర్భం వస్తే?
“గట్టిగా చెప్పు. మా అమ్మకి మనిషిని పెట్టుకుంటాను, మీ అమ్మకి కావాలంటే నేనే చేస్తానని. డబ్బంతా లాక్కుని ఆవిడ్ని వెళ్లగొట్టడం తప్పుకదూ?” అన్నాను నేనే మళ్ళీ.
“నేను చూడనని మొండికెయ్యటంతో ఆవిడ్ని పంపించారట. అందరికీ అర్థమయ్యేలా చెప్పిన మాట. ఆవిడా అదే నమ్ముతోంది, అంతా లాక్కుని భార్యాభర్తలం ఆవిడ్ని వెళ్ళగొట్టేమని. ఇక్కడేకదూ, మనం స్వతంత్రం కావాలని కోరుకునేది? చేతిలో డబ్బుంటే ఏదేనా చెయ్యగలమనుకునేది? ” అంది. “ఆడమనిషికి ఎంత శక్తి వుంటుంది? తను పెద్దైనట్టే నేనూ పెద్దయ్యానుకదా, అది అర్థమవ్వట్లేదు. తను చెయ్యలేకపోతున్న పనులన్నీ నాతో దబాయించి చేయిస్తున్నారు. అంతా అగమ్యగోచరంగా వుంది”
ఎవరు పరిష్కరించగలరు ఇలాంటి సమస్యల్ని? మాయింట్లోనూ ఇలాంటిదే ఒక సమస్య. నలుగురు అక్కచెల్లెళ్ళమీద ఒక తమ్ముడు. మగపిల్లాడనేది అతనికి అదనపు కిరీటం. నాన్న పెద్దదే ఇల్లు కట్టించాడు. దాదాపుగా కోటి చేస్తుంది. అది తమ్ముడికి ఇవ్వాలన్నది ఆయన కోరిక. స్వార్జితంగాబట్టి విల్లు రాసేసాడు. అక్క వితంతువు. బావకి పెన్షను లేదు. ఆవిడకి ఒక కొడుకు. కోడలికీ అత్తకీ పడదు. విడిగా వుంటుంది. కొద్దొగొప్పో కొడుకు పంపిస్తాడు. దానితో రోజులు వెళ్ళదీస్తోంది. ఎంతో కొంత తనకీ ఇవ్వమని నాన్నతో గొడవపడుతుంది.
“పెళ్లప్పుడే నీకు ఇవ్వాల్సిందేదో యిచ్చేసాను. ఇంక నేనేమీ యిచ్చేది లేదు” అంటాడు నాన్న.
“వెళ్ళి కోడల్ని మంచి చేసుకో. మామీద పడితే ఏం లాభం? వాడిని ప్రశాంతంగా బతకనివ్వు” అంటుంది అమ్మ.
“కోటి చేసే యిల్లు నీకు కలిసొస్తున్నప్పుడు ఐదులక్షలో పదిలక్షలో దానిపేర్న రాయరా? దాని పరిస్థితి బాగాలేక కదా ఆ గొడవ?” అని నేను తమ్ముడికి సర్ది చెప్పబోతే,
“ఐదులక్షలూ, పదిలక్షలూనా? ఏమైనా చెట్టుకి కాస్తున్నాయా? ఎవరికి ఏం యివ్వాలో నాన్నకి తెలుసు. నువ్వు అనవసరంగా తలదూర్చకు. ఐనా దాని కొడుక్కి పెద్ద వుద్యోగం వుండనే వుంది. ఇంకా నాకు పడి ఏడుపెందుకు?” అన్నాడు.
ఆ గొడవ తెగదు. అక్క పరిస్థితి చూసి జాలేసి వెయ్యో రెండువేలో చేతిలో పెట్టబోతే తీసుకోదు.
“కని పెంచి పెద్దచేసిన కొడుకు వాడు. ముగ్గురు మనుష్యులం శాయశక్తులా కష్టపడితే తయారైన ప్రోడక్టు వాడు. కోడలు కొంగుని కట్టేసుకుంది. తమ్ముడిలాగే నేనూ ఆ యింట్లో పుట్టాను. నా బర్త్‌రైట్‍ని నాన్న తుడిచేసారు. ఇక మీ అందరి దయాధర్మాలమీద బతకనా? తిండికి లేకపోతే చావనేనా చస్తానుగానీ నాకు ఈ పెట్టుపోతలు అక్కర్లేదు” అంటుంది. తనని తను హింసించుకుంటుంది. కొడుకుమీదో, తండ్రిమీదో, తమ్ముడిమీదో, కోర్టుకి వెళ్ళమని ఎగెయ్యగలరా, తాము? అదొక్కటేనా, పరిష్కారం? స్వార్జితాల విషయంలో ఆడపిల్లలకి లేని హక్కులు మగవారికి ఎలా వస్తున్నాయి? ఎక్కడినుంచీ వస్తున్నాయి? పక్షపాతదృష్టి వల్లనా? ఈ దు:ఖాలని వ్యవస్థ తీర్చలేదు. చట్టాలు చెయ్యటందగ్గర ఆగిపోతుంది. వ్యక్తులే తీర్చాలి. వ్యక్తులు తీర్చరు, అవి తీరవు.
కొడుకైనా అల్లుడైనా అతనే, తనకి కర్మ చేస్తాడని భార్యాకూతుళ్ల హక్కులన్నీ సుజాత భర్తకి బదలాయించేసాడు ఆమె తండ్రి. మగపిల్లాడిమీది మమకారంతో దయాదాక్షిణ్యాలుకూడా వదిలేసాడు నాన్న. సగం యిల్లు రాసిచ్చి, మిగిలిన సగానికి సరిపడా డబ్బు ఆడపిల్లలకి ఇమ్మని తమ్ముడికి చెప్పచ్చు. ఎవరి యిల్లు వాళ్ళు కట్టుకునేలా టెరేస్ రైట్స్ ఇవ్వచ్చు. అవన్నీ అనవసరమనుకున్నాడు. ఎవరి పోరాటం వాళ్ళదే. బలవంతులతో పోరాటం. గెలుపు వుండదని తెలిసిన పోరాటం.
చాలాసేపటిదాకా ఎవరి ఆలోచనల్లో వాళ్లం వుండిపోయాం.
“చాలాసేపైంది వచ్చి. ఇక వెళ్తాను. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఏదెలా జరగాలని వుంటే అలా జరుగుతుంది” అని శుష్క వేదాంతం చెప్పి లేచాను.


మర్నాడు నాకు ఫోనొచ్చింది. సుజాత నిద్రలో పోయిందని. కార్డియాక్ అరెస్టట. కాదని నాకు తెలుసు. తండ్రి చేసిన ద్రోహం తట్టుకోలేకపోయింది.
ఇంకో గంటకి అక్క కొడుకు పోన్ చేసాడు.
“అమ్మ ఎవరింట్లోనో వంటకి వప్పుకుందట పిన్నీ! పరువు తీసేస్తోందావిడ. ఒక్క మనిషికి ఎంత కావాలి? చూసోచూడకో ఎంతోకొంత పంపిస్తున్నాను. సర్దుకోవాలి. ఇక్కడ నా భార్యతోటీ పడక అక్కడ సర్దుకోనూ సర్దుకోకపోతే ఎలా? ఉన్నదంతా పెట్టి నన్ను చదివించారు. నిజమే. వైద్యానికీ మందులకీ ఆవిడకి బాగానే ఖర్చౌతుండచ్చు. గవర్నమెంటు హాస్పిటల్‍కి వెళ్ళాలి…” అని ఏదో చెప్పబోయాడు.
“మామయ్యకి చెప్పరా, నీ సమస్యలు. నాకేం అర్థమౌతాయి?” అన్నాను వ్యంగ్యంగా. వాడు కోపంగా ఫోన్ పెట్టేసాడు.


1 thought on “ఏదీ మారలేదు by S Sridevi”

Comments are closed.