ఈస్థటిక్ సెన్స్ – By Vanaja Tatinei – Review by S Sridevi

ఇది వనజా తాతినేనిగారి కథల సంపుటి. ఇందులో 14 కథలు వున్నాయి. ఇవన్నీ ఇంతకుముందు ఎక్కడా ప్రచురించబడనివి. ముందుమాట శంకరగిరి నారాయణస్వామిగారు రాయగా, ఒకొక్క కథనీ ఒకొక్క సమకాలీన రచయిత/రచయిత్రి సమీక్షించారు. పుస్తకం వెల 240 రూపాయలు. నేరుగా రచయిత్రివద్దనుంచీ తెప్పించుకోవచ్చు. “రాయికి నోరొస్తే” , “కులవృక్షం” అనే కథాసంపుటాలు, “వెలుతురు బాకు” అనే కవితాసంపుటిని ఇప్పటివరకూ ప్రచురించారు.
మధ్యతరగతి సమాజంలో అధునాతనంగానో, అందంగానో కనిపించే పైపై పొరలని తొలగించుకుంటూ వెళ్ళి లోపల ముతగ్గా వున్న జీవితాలని పరిచయం చేసే కథలు ఇవన్నీ. స్త్రీల అణీచివేత, వుద్యోగినుల సమస్యలు, మగవారి అసమర్ధత, స్త్రీల ఇతర అవసరాలు ఇలాంటి ఎన్నో విషయాలని మనముందు వుంచుతాయి.
వాతాపి జీర్ణం, విముక్తం, దృశ్యభూతం, ప్రేమే నేరమౌనా? అనే కథలు వుద్యోగినులైన స్త్రీలచుట్టూ తిరుగుతాయి. వాళ్ళకి భర్తలనుంచీ ఎదురైన సమస్యలనీ, వాటిని దాటేందుకు తీసుకున్న నిర్ణయాలనీ చర్చిస్తాయి. భార్యాభర్తలిద్దరూ వుద్యోగం చెయ్యటం ఈరోజుల్లో సర్వసాధారణం. పిల్లలు పుట్టాక వాళ్లని చూసుకోవటానికి మూడోమనిషి అవసరమౌతుంది. అలాంటి మూడోమనిషిపట్ల మగవాడి అనుచితప్రవర్తన జీవితాలని ఎలా మార్చేస్తుందో మొదటి రెండు కథల్లోనూ వుంటుంది. దృశ్యభూతం కథలో ఆ మూడోమనిషి చేసిన చెయిల్డ్ అబ్యూజ్‍గురించి రాస్తారు. ఇది ఒక అనూహ్యకోణం. ప్రేమే నేరమౌనా అనేది ఇంకొంచెం భిన్నమైన కథ. కుటుంబపోషణకోసం భార్యాభర్తలిద్దరూ వుద్యోగం చెయ్యటం, పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకోవటంకోసం భార్య వుద్యోగం వదిలెయ్యటం సాధారణంగా జరిగే విషయాలు. ఐతే భర్తే పిల్లలని చూసుకోవటానికి ముందుకి వచ్చినప్పుడు జరిగే పరిణామాలు ఎలా వుంటాయో ప్రేమే నేరమౌనా అనే కథలో చర్చిస్తారు. ఉద్యోగం చెయ్యటంకోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చిన స్త్రీ యింకెన్ని కోల్పోతోందో చూస్తాం.
ఊహలమడుగులో ఒక వికలాంగురాలి మనస్సునీ, కోకిలతల్లిలో మగవాడిద్రోహానికి బలైన స్త్రీ అంతరంగాన్నీ ఆవిష్కరిస్తే, ఋణబంధాలు కథ చిన్న అప్పు అనేది సంస్కారంగల మనిషిని ఎలా బాధపెడుతుందో తెలియజేస్తుంది. కుబుసం వెన్నెముక లేని మగవాడికి తనే వెన్నెముక అయి నిలబెట్టిన స్త్రీ కథ. రెండులక్షలు అలాంటి మగవాడివలన స్త్రీ భార్యగా, కూతురిగా ఎంత నష్టపోతుందో చూపిస్తుంది. చెరగని గీత ఎంతో ఆధునిక దేశాలలోకూడా మనుషులమధ్య వున్న హద్దుగీతల్ని పరిచయం చేస్తుంది. ఈస్తటిక్ సెన్స్‌లో మగవాడి ప్రాపకంకోసం స్త్రీ ఎలా కొలతల్లోకి తన శరీరాని ఇముడ్చుతోందో చదువుతుంటే బాధ కలుగుతుంది. మొత్తమ్మీద కథలన్నీ వినూత్నమైన వస్తువుతో చక్కటి వొడుపుతో నిర్మించబడినప్పటికీ పైడిబొమ్మ, ఔనా అనే కథలు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి.

2 thoughts on “ఈస్థటిక్ సెన్స్ – By Vanaja Tatinei – Review by S Sridevi”

Comments are closed.