పిల్లలు తిరిగి వచ్చేసరికి కొన్ని ముఖ్యమైన వస్తువులు సర్దాను. నా బేంకు పాసుబుక్, చెక్కుబుక్, ముఖ్యమైన కాగితాలూ, డబ్బూ తీసుకున్నాను. సరిగ్గా రెండుగంటల తర్వాత వాళ్లని తీసుకొచ్చి వదిలాడు రాజ్. ఇప్పుడూ లోపలికి రాలేదు. రమ్మని ఇద్దరూ గొడవ. సుమైతే ఏడుపే. వాళ్లకోసం కొన్న బొమ్మలు చేతుల్లో పెట్టి బుజ్జగించి, బతిమాలి, మళ్ళీ వస్తానని ఏమార్చి వెళ్ళిపోయాడు.
“నాన్న రాలేదు…నాన్న కావాలి” సుమ గునుపు. దాన్ని ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నాను. పైకి అనకపోయినా, సుధ కళ్ళలోనూ అదే కోరిక కనిపించింది. నెమ్మదిమీద మరిపించాలి తప్ప అతన్ని మర్చిపోవటమనే ఆంక్షని రుద్దకూడదు.
“అమ్మా!” అంటూ ఏదో చెప్పబోయింది సుధ.
“ఇప్పుడు కాదు. రైల్లో చెప్దువుగాని”” అని ఆపి, ఆటో స్టాండుకి ఫోన్ చేసి ఆటో పంపించమన్నాను.
“ఊరెళ్తున్నామా?” సుధ ఆశ్చర్యంగా అడిగింది.
“నాన్న దగ్గరకా?” సుమ ఆరాటంగా అడిగింది. నాకు నవ్వొచ్చింది. “
“ఇప్పుడేకదే, అతని దగ్గిర్నుంచీ వస్తున్నావు?”అనడిగాను. నా మనసులో ఒక విధమైన రిలీఫ్ చోటుచేసుకుంది. చాలాసేపు ఆలోచించాను అది యేమయ్యుంటుందాని. తోచలేదు.
ఆటో వచ్చింది. పిల్లల సూట్‌కేసులు, నాదొకటితో కదిలాము. ఇంటికి తాళం వేస్తుంటే మనసు లాగింది. నేను వెళ్లిపోతే కన్సల్టెన్సీ మూతపడుతుందని. ప్రభాకర్‌ని చేసుకోమన్న మైకేల్ అభ్యర్ధన గుర్తొచ్చింది. కన్సల్టెన్సీ బాగా నడవటానికీ, లాభాలు రావటానికీ నా గ్రేసే కారణమని వాళ్లు అనటం కూడా గుర్తొచ్చింది. నేనిప్పుడా గ్రేస్‌ఫుల్ వసంతని కాను. నాకో జీవితం వుంది. దానికి కొన్ని సమస్యలు ముళ్ళపొదలా చుట్టుకుని వున్నాయి. అవి ముందు పరిష్కరించాలి. ఇక కన్సల్టెన్సీ… ఎవరేనా దారి చూపించగలరుగానీ గమ్యం చేరేదాకా చెయ్యిపట్టి నడిపించరు.
టక్మని తాళం వేసేసాను. ఒక సమస్యని పరిష్కరించిన సంతృప్తి కలిగింది. లోకం దృష్టిలో ప్రేమనేదే లేనప్పుడు నా నిర్ణయానికి అతడు బాధపడతాడనేది వట్టిమాట. ఏదో చెయ్యాలనుకుని అది చెయ్యలేకపోయిన నిరాశ వుండకుండా వుండదు. ఆ కోరిక పొరలుపొరలుగా విడిపోయి, తనకి బాధ ఎందుకు కలిగిందో గుర్తించాక అది సర్దుకుంటుంది. ఆటోలో కూర్చున్నప్పట్నుంచీ రైల్వేస్టేషన్ చేరుకునేదాకా సుధ ఎడతెరిపి లేకుండా మాట్లాడింది. వచ్చీరాని మాటలతో సుమకూడా ఏదో ఒకటి అంటూనే వుంది.
రాజ్‌తో ఎక్కడెక్కడికి వెళ్లారో ఏమేం చేసారో అన్నీ చెప్తున్నారు. నేనవన్నీ ప్రశాంతంగా వింటుంటే వాళ్లకి సంభ్రమంగా వుంది. ప్రభాకర్ బాధపడతాడని వీళ్లని తండ్రి గురించి మాట్లాడనిచ్చేదాన్ని కాదు.
నా మనసుకి కొత్తగా వచ్చిన రిలీఫేమిటో యిప్పుడు అర్థమైంది. రాజ్‌ని ప్రేమించడం, ద్వేషించడం నాకు మాత్రమే సంబంధించిన విషయం. పిల్లలకి కాదు. అలాగే ప్రభాకర్ నాకు ముఖ్యుడుగానీ వీళ్లకి కాదు. ఈ ప్రేమలూ ద్వేషాలూ ఒకరు చెప్తేనో నేర్పిస్తేనో వచ్చేవికావు. రక్తంలోనే వాటి అంకురం వుంటుంది. మన ప్రయత్నం వలన జరిగేది, నిద్రాణంగా వున్నదాన్ని జాగృతం చెయ్యటం. నిన్నటిదాకా అతనూ నేనేగా పెరిగిన పిల్లలకి ఒక్కసారి తండ్రిని మర్చిపోవాలంటే ఎలా సాధ్యం? ఇంత చిన్న విషయం ఇంతపెద్ద వొరిపిడి తర్వాతగానీ నాకు గ్రహింపుకి రాలేదు.
ఆటోఫేర్ చెల్లించి, విజయవాడకి టిక్కెట్లు తీసుకున్నాను. రైలు సిద్ధంగా వుంది. నేను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదోననే విషయంలో అనుమానం లేదుగానీ నేను వెళ్లేచోట నాకు ఆశ్రయం దొరుకుతుందా లేదా అనేది సందిగ్ధమే. ఇన్నేళ్ళ తర్వాత అక్కడ ఎవరేనా వున్నారో లేదో!
విజయవాడలో ట్రెయిన్ దిగి సబర్బన్ బస్టాండుకి వెళ్లాను. బస్సు రెడీగావుంది. ఎక్కి కూర్చున్నాను. కదిలింది. దాదాపు అరగంట ప్రయాణం
తర్వాత నేను దిగాల్సిన వూరొచ్చింది. కొండపల్లి…
మనసంతా వుద్విగ్నంగా వుంది. సుమ నడవలేకపోతుంటే ఎత్తుకున్నాను. లగేజి మొయ్యటానికి ఎవరేనా వున్నారేమోనని చూస్తుంటే ఒకతను ముందుకొచ్చాడు.
“ఎవరింటికమ్మా?” అడిగాడు, సూట్‌కేసులు నెత్తికి ఎత్తుకుంటూ. చెప్పాను. అతను గబగబ నడుస్తుంటే నేను ఒకచేత్తో సుమని ఎత్తుకుని మరో చేత్తో చీర కుచ్చెళ్లనీ సుధచేతిని పట్టుకుని నడవలేకపోతుంటే-
“పాపని ఇవ్వండమ్మా!” అని సుమని కూడా అతనే తీసుకున్నాడు. ఇదికదా, ఆడవారి పరాధీనత్వం. విమానాశ్రయాల్లోలాగా చిన్నదైనా పెద్దదైనా ప్రతి బస్స్టాండులోనూ, రైల్వేస్టేషన్‌లోనూ పిల్లలనీ, సామాన్లనీ కూర్చోబెట్టి కాస్త దూరం సులువుగా తోసుకుంటూ వెళ్ళగలిగే ట్రాలీల ఏర్పాటు, వాటిని తిరిగి కలెక్ట్ చేసుకునే వ్యవస్థా వుంటే చాలా బావుంటుంది.
నేను వెళ్లాలనుకున్న యిల్లు… పెద్దపెద్ద అరుగుల యిల్లు…. వచ్చింది. నా చిన్నతనంలో యిక్కడ చాలా ఆనందంగా గడిపేదాన్ని. ఈ అరుగులమీద ఆడుకునేదాన్ని. ఇప్పుడొక అపరిచితురాలిలా ఆశ్రయం వెతుక్కుంటూ వస్తున్నాను. ఇంట్లో ఎవరున్నారో!
నా ఆలోచనలిలా సాగుతుంటే నాతో వచ్చినతను సామాను దింపి పైసలకోసం చెయ్యి చాపాడు. వెంటనే తేరుకుని డబ్బిచ్చాను. అతను వెళ్లిపోయాక నెమ్మదిగా తలుపు తట్టాను. లోపల్నుంచీ ఎలాంటి అలికిడీ వినిపించకపోవడంతో గొళ్లెం చప్పుడు చేసాను.
“ఎవరూ?” అన్న గొంతు వినిపించింది. అది అమ్మమ్మది! గుర్తుపట్టాను. గుండెల్నిండా అనిర్వచనీయమైన సంతోషం నిండిపోయింది.
ఒక అమృతధార ఒలికినంత స్పష్టమైన జీవచైతన్యం.
“అమ్మమ్మా!””అన్నాను.
“ఎవరు? ఎవరే? వసంతా!” లోపల్నుంచీ వేగంగా వస్తున్నట్టు అడుగుల సవ్వడి వినిపించింది. ఆవిడ నాపేరు పలకడం నాకు విస్మయాన్ని కలిగించింది. నేను వస్తానని ఆవిడ ముందుగానే వూహించిందా? నా విషయాలు వీళ్లకి తెలుసా? ఎలా?
ఆవిడ తలుపు తెరిచింది. నన్ను అపనమ్మకంగా చూసింది.
“నువ్వేనటే? ఏదో నోటికొచ్చిన పేరల్లా అంటూ వుంటాను. ఈ మధ్యనెందుకో నీమీదికి ధ్యాసపోతోంది. నీ పేరే నాలిక చివర ఆడుతోంది. అందరికన్నా నువ్వు నాకెక్కువ మాలిమికదా! అందుకేనేమో!” అంది నన్ను దగ్గరికి తీసుకుంటూ. ఇన్నిరోజుల ఎడబాటు మామధ్య లేనట్టు, అసలేమీ జరగనట్టు. ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాకూ ఏడుపొచ్చింది. ఆవిడ భుజమ్మీద తలవాల్చి ఏడ్చేసాను. మేమిద్దరం
అలా ఏడుస్తుంటే సుధ బిత్తరపోయింది. సుమ ఏడుపందుకుంది. సుధ శృతి కలిపింది.
అమ్మమ్మ నన్ను దూరం జరిపి-
“ఏడుపెందుకే?” అని నన్ను కోప్పడి తనూ కళ్లు తుడుచుకుంది.
“మీరెందుకే, ఏడుస్తున్నారు? అదేదో చుట్టరికంలాగా?” అంటూ పిల్లలిద్దర్నీ చెరో చేత్తోటీ దగ్గరగా తీసుకుంది మురిపెంగా చూస్తూ. ఏమీ అడగలేదు. ఎంత విజ్ఞత!
“ఎప్పుడు బయల్దేరారో ఏమో! ముందు స్నానాలు కానిచ్చి భోజనాలకి కూర్చోండి”” అంది హడావిడి పడుతూ.
అప్పటికే సాయంత్రమవుతోంది. పిల్లలు తండ్రితో వెళ్ళి ఏవో తినివచ్చారు. దార్లోకూడా బిస్కెట్లవీ తిన్నారు. నేనే బాగా ఆకలిగా వున్నాను. పొద్దుటిది చింతచిగురు పప్పూ, కొద్దిగా అన్నం వున్నాయట. అవి అందరికీ చాలవని మళ్ళీ అన్నం పప్పూ కుక్కర్లో పెట్టింది. వడియాలు వేయించింది.
పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి పంపాను. వాళ్లకావిడ అన్నం పెడుతుంటే నేనుకూడా స్నానం కానిచ్చి వచ్చాను. అన్నాలు తిని కొద్దిసేపు ఆడుకుని వాళ్లు నిద్రకి పడ్డారు.
“నువ్వూ రావే!” అంది మా యిద్దరికీ కంచాలు పెట్టి. అన్నం తింటుంటే ఎన్నో విషయాలు చెప్పింది.
“నువ్వు లెటర్ రాసి హాస్టల్లోంచి వెళ్లిపోయాక మీ నాన్న చాలా బాధపడ్డాడే వసంతా! అందులో నువ్వు ఎవరికీ యిష్టం లేని పెళ్లి చేసుకుంటున్నానని రాసావేగానీ అతన్ని గురించి యింకే వివరాలు రాయలేదు. మీ నాన్న ఆ వుత్తరం పట్టుకుని నిన్ను వెతుక్కుంటూ వెళ్లాడు”” అంది.
“నాన్న అక్కడికొచ్చారటనా?”” విస్మయంగా అడిగాను. వాళ్లు నన్నొదిలేసుకున్నారనే యిన్నాళ్లూ అనుకున్నాను.
“ఆ వూరిదాకా వచ్చాక తెలిసిందట, అతని గురించి. కలవడానికి అవమానమనిపించి తిరిగొచ్చేసాడు. తల్లడిల్లిపోయాడు””
కొద్దిసేపలాగే వూరుకుని అడిగాను,“”రెండోపెళ్లివాడిని చేసుకోవటం అంత తప్పా, అమ్మమ్మా?”
“అన్నీ జరిగాక యిప్పుడు తప్పొప్పుల ప్రస్తావన ఎందుకుగానీ, తర్వాత నీ గురించి మాకు ఎలాంటి సమాచారమూ తెలీలేదు. అసలిక్కడి పరిస్థితులు కూడా బాగోలేవులే”
“అంటే?”
“నాన్న ఉద్యోగం పోయింది. నీక్కూడా యిక్కడి సంగతులేం తెలీవా?”
నా చేతిలో ముద్ద జారిపోయింది. “ఎలా?”” అతి కష్టమ్మీద నన్ను నేను కూడదీసుకుని అడిగాను.
“ఎలాగేమిటి? లంచాలు తినేవాళ్లందరివీ ఎలా పోతాయో అలాగే పోయింది. అతడితో చేతులు కలిపినవాళ్లంతా కలిసి ముంచేసారు. ఏసీబీ
రైడ్‌లో దొరికిపోయాడు. అసలైతే జైలుకి పోవలసినవాడు. అదృష్టం బావుండి ఆ మర్యాదొక్కటీ జరగలేదు. సంపాదించినదంతా జప్తుచేసి ఒక్క పైసా యివ్వకుండా పంపించారు. కొద్దిలో కొద్దేనా దక్కాలని యిల్లూ రెండు స్థలాలూ అక్కవని దొంగకాగితాలు సృష్టిస్తే దాని భర్త తిరిగివ్వనని మొండిచెయ్యి చూపించాడు. అదా అవమానం భరించలేక నిద్రమాత్రలు మింగేసింది. అటు కట్టుకున్నవాడు, యిటు కన్నతండ్రి… ఎవరికి చెప్పగలదు? రెండురోజులు మృత్యువుతో హోరాహోరీ యుద్ధం చేసిబతికి బైటపడింది పిచ్చితల్లి” అమ్మమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అమ్మమ్మకి ఇద్దరు కూతుళ్ళు. నలుగురు మనవలు. మేమిద్దరం, పెద్దమ్మకి కొడుకూ, కూతురూ. అందర్లోకీ నేనే చిన్న. పెళ్ళయ్యాక పెద్దనాన్నగారికి అవకాశం వచ్చి పెద్దమ్మావాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. జీవనప్రమాణాలు, నైతికవిలువల విషయంగా అనుకుంటా, మాకూ వాళ్ళకీ బాగా ఎడం వచ్చేసింది. మనకన్నా ఎదుటివాళ్ళు ఏమంత గొప్పగా బతకరు. వాళ్ళలోనూ ఏవో లోపాలు వుంటాయి. ఐతే మానవీయమైన కొన్ని విషయాలు మనిషికీ మనిషికీ మధ్యని గీత గీస్తాయి. అక్కడ వాళ్ళు విడిపోతారు.
బ్రిటిష్‌వారు ప్రపంచాన్ని ఆక్రమించుకుంటూ వెళ్తున్నప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాలాంటిచోట్ల అక్కడి స్థానికులని పరిమార్చి, ఖాళీ కేన్వాసులా చేసుకుని, తమకి అనువుగా నగరాలని నిర్మించుకున్నారు. భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ అప్పటికే వున్న జనసాంద్రత, వాతావణం, వేలయేళ్ళగా వున్న నాగరీకత, కోటలు, గుళ్ళు, నగరాలు, పట్టణాలు వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అందుకని మనదేశంలో జనజీవనం వారి ప్రమాణాలకి అనువుగా వుండదు. ఈ అనువులేనితనం మనం వారితో పోల్చుకోవటంవలన, మన అవసరాలని పెంచుకోవటంవలన వచ్చిందేగానీ కొత్తగా వచ్చినదీ, అకారణమైనదీ కాదు. మొదట్నుంచీ మనం ఇక్కడే వున్నాం, ఇలాగే వున్నాం. ఇలా వుంటూ కూడా సుఖంగానే వున్నాం. అది పెద్దమ్మ గుర్తించలేదు. మరోకోణంలోంచీ అమ్మానాన్నలకికూడా.
మొదట్లో పెద్దమ్మ అమ్మమ్మకోసం వచ్చేదిగానీ తర్వాత రావటం తగ్గించింది.
వీడియోకాల్స్‌లో చూసుకుంటున్నాంకదా?… ఆవిడే ఇక్కడికి రావచ్చుగా?…అక్కడేం వుంది? అలాంటి కొన్ని ఆరోపణలూ, అభియోగాలూ అపరిష్కృతంగా వుండిపోయాయి.
“ఇప్పుడదెక్కడ వుంది?” అక్క గురించి అడిగాను.”
“భార్యాభర్తలు రాజీపడ్డారు. ఇల్లు వాళ్లుంచుకుని స్థలాలు యిచ్చేసారు. ఆ తర్వాత యిల్లుకూడా అమ్మేసుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. దానికిప్పుడో కొడుకు. నీ చిన్నకూతురి వయసుంటుంది””
“ఇంత జరిగాక అతనితో అదెలా వెళ్లగలిగింది అమ్మమ్మా?”
“వెళ్లకేం చేస్తుంది? అక్కడికీ మేమెవరం దాన్ని బలవంతం చెయ్యలేదు. తనంతట తనే వెళ్ళింది. అక్కడికే నీ విషయంలో పరువుపోయి వున్నారు. ఆపైన మీ నాన్న ఉద్యోగం పోయింది. డబ్బుకోసం దాని జీవితం పాడుచెయ్యరుకదా?”
“అమ్మా నాన్నా ఎక్కడున్నారు?”

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.