నా కళ్లు అటు తిరిగాయి. ప్రమీలాదేవి!
నేను ఫొటోలో చూసినట్టే వుంది. పెద్ద అందంగా లేదు. ఆకర్షణీయంగా వుంది. ఆడంబరంగా కూడా వుంది. చేతులకి ఆరేసి బంగారు గాజులు, వాటికి ఒకవైపున రాళ్లగాజులు వున్నాయి. ఒక్కోచేతికీ రెండేసి వుంగరాలున్నాయి. వాటిలో ఒకటి దాదాపు లక్ష రూపాయలు చేసే వజ్రపు వుంగరం. రాజ్ నాకూ అలాంటిది కొంటానంటే వద్దన్నాను. ఆమె మెళ్లో నిండా బంగారమే. అదంతా సహజంగా యిమిడిపోయి వుంది తప్ప ఎబ్బెట్టుగా లేదు. కట్టూబొట్టూలో కూడా అంతా ధనాధిక్యతే కనిపిస్తోంది. చూపులు చాలా స్థిరంగా ఆజ్ఞాపిస్తున్నట్టు వున్నాయి. నాకన్నా వయసులో ప్రస్ఫుటంగా తెలిసేంత పెద్దది. నన్ను పలకరించే ప్రయత్నమేదీ చెయ్యకుండా వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంది.
రాజ్‍మోహన్ చిరునవ్వుతూ మా యిద్దర్నీ చూడసాగాడు. దుర్భరమైన నిశ్శబ్దం ఆ గదిలో పరుచుకుంది. అప్పటిదాకా నేనూ, రాజ్ చేసిన అలికిడిలో కలిసిపోయినట్టున్న గోడగడియారం ముళ్లూ, ఏసీ, పైన తిరుగుతున్న ఫ్యానూ, అన్నీ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి.
“చెప్పారా?” ఉన్నట్టుండి రాజ్‍ని అడిగింది ప్రమీలాదేవి. అతను లేదన్నట్టు తలూపాడు. ముఖంలోని చిరునవ్వు కూడా మాయమైంది. ప్రమీలాదేవి నాకేసి సూటిగా చూసింది.
“చూడు, యింతవరకూ అంటే రాజ్ ఆరోగ్యంగా వున్నంతవరకూ ఏం జరిగాయో నాకనవసరం. చేతినిండా డబ్బుండి ఆరోగ్యం, యవ్వనం వున్న మగవాడేం చేస్తాడో యితనూ అదే చేసాడని సరిపెట్టుకున్నాను. ఇప్పుడింక అలాంటివి సాధ్యపడవు. ఎలాంటి టెన్షన్లూ లేకుండా ప్రశాంతంగా వుండమన్నారు అతన్ని. నీ ఫ్యూచరేం ప్లాన్ చేసుకున్నావు?”” ఉపోద్ఘాతమేమీ లేకుండా అడిగింది. గొంతు చాలా తీవ్రంగా వుంది. అయిష్టమైన విషయాన్ని తప్పనిసరై మాట్లాడుతున్నప్పుడు వుండే పదును కూడా వుంది. ఆమె చూపులు నన్ను నఖశిఖ పర్యంతం పరీక్షిస్తున్నాయి. నేను కట్టుకున్న షిఫాన్‍చీర, మెళ్లోని వంటిపేట గొలుసు, యింకా నా నిరాడంబరత… ఏవైతే రాజ్‍కి నాలో ఆకర్షణలనిపించాయో అవి- ఆమెకి నవ్వు తెప్పిస్తున్నాయేమో! నేను కోరుకుని వుంటే ప్రపంచాన్నంతటినీ తెచ్చి నా ముందు నిలిపేవాడేమో, నాకెప్పుడూ అలాంటి కోరిక కలగలేదు.
“డబ్బుచూసి నీ వెంటపడ్డానని అందరూ అన్న మాటల్ని నిజం చేస్తావా? నువ్వొప్పుకుంటే నా తిండికూడా నేను సంపాదించుకోగలను. కానీ నా వూపిరి మాత్రం నీ ప్రేమే” అనేదాన్ని. అలాంటి ప్రేమ యీ క్షణాన్న ప్రశ్నార్ధకమై నిలిచింది మా మధ్యన. తలెత్తి అతన్ని చూసాను. తలదించుకున్నాడు. ప్రమీలాదేవి గొంతు ఖంగుమంది.
“అతనిప్పుడు నీకోసం ఏమీ చెయ్యడు, చెయ్యలేడు. నీకన్నా అతనికి తన జీవితం ముఖ్యం. నేనూ, నా పిల్లలూ, ఆస్తీ ముఖ్యం. ఐతే నీగురించి కూడా కొంత బాధ వుందనుకో. ఆ బాధ లేకుండా వుండాలని అతనిష్టంతోటే నిర్ణయించాను. ఇద్దరాడపిల్లలు కదూ? వాళ్లు మా పిల్లలుగా పెరుగుతారు. బోర్డింగు స్కూల్లో వేసి బాగా చదివిస్తాను. చదువదీ అయ్యాక సంబంధాలు చూసి, పెళ్లి కూడా చేస్తాను. నువ్వింక వాళ్లని మర్చిపో… మరో విషయం. నీకు కొంత డబ్బి స్తాను. ఈ వూరొదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్లు. అంటే రాజ్ జీవితంలోంచీ శాశ్వతంగా… వెళ్లి, కొత్త జీవితాన్ని ప్రారంభించు”
నా ముఖంలోకి వెచ్చటి రక్తం ఒక్కసారి ఎగజిమ్మింది. శరీరంలోని అణువణువూ రగిలిపోయింది. నేను… పిల్లల్ని వీళ్లకొదిలేసి వెళ్లిపోవాలా? ఇదేనా, ఈమె నిర్ణయించినది? అదీ రాజ్ యిష్టంతోటి? నేనతని ముఖంలోకి తీక్షణంగా చూసాను. అలాగే తలదించుకుని వున్నాడు. చివాల్న లేచి నిల్చున్నాను.
“నీకు ముందూవెనుకా ఆలోచన లేకుండా ఆవేశపడిపోవడం మాత్రమే వచ్చనుకుంటా”” ప్రమీలాదేవి గొంతులో అంతులేని హేళన.
“వసంతా! వెళ్లకు. కూర్చో” రాజ్ గొంతు వినిపించింది. పాలిపోయి, నిస్సహాయంగా వాలిపోయిన అతని ముఖానికి ఆ గొంతు సమతూకంగా వుంది. అందులోని అభ్యర్ధన నన్నాపింది. అయిష్టంగా మళ్లీ కూర్చున్నాను.
“నేను చెప్పినట్లు చెయ్యకపోతే నీ పిల్లల్ని తీసుకుని ఈ రాత్రికే వూరొదిలేసి వెళ్లు. వెళ్లి వాళ్లనీ నీలాగే పెంచి, ఏ డబ్బున్నవాడికో వల విసురు”
చివ్వుమని గుచ్చుకుంది ఆ వ్యంగ్యం.
“వెళ్లకపోతే?” రోషంగా అడిగాను.
“ఎలా పంపించాలో నాకు తెలుసు”
రాజ్ చప్పున కలగజేసుకున్నాడు.
“వసంతా! ఇక్కడ గొడవ చెయ్యకు. నా పరిస్థితి చూస్తున్నావు. ఒక్కదానివీ ఏం చెయ్యగలవు? వాళ్లని ఏదో ఒకలా పెంచుతావు సరే, పెళ్లి చేస్తావు? కుటుంబచరిత్ర చూడకుండా ఎవరు చేసుకుంటారు? వాళ్ల జీవితాలు పాడుచేస్తావా?”” కొంచెం కోపంగానూ యింకొంచెం అనునయంగానూ అడిగాడు.
“ఇది చెప్పడానికేనా, నన్ను రమ్మన్నావు?” కఠినంగా అడిగాను. ఎంత ఆరాటపడి వచ్చాను! అది తలుచుకుంటే దుఃఖం వస్తోంది.
“వాళ్ల మంచి నేను కోరకూడదా? ఇంతకన్నా అసలెవరైనా చేస్తారా? ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ల గురించి ఆరాటపడుతుంటే అర్థం చేసుకోవెందుకు?” రాజ్ నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంటే ప్రమీలాదేవి ముఖం చిట్లించుకుంది.
అతని మాటలు వింటుంటే నాకు తల గిర్రుమని తిరిగిపోయింది. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు! నేనూ, తనూ వేరన్నట్టు, పిల్లల క్షేమం నాకన్నా తనకి ముఖ్యమన్నట్టు చెప్తున్నాడు. అతని తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, స్నేహితులు అంతా యింటిమీదికి వచ్చి, నన్ను ద్వేషించి, దూషించినప్పుడు కంచుకోటలా నన్ను చుట్టేసి, బలపర్చి, నేనూ-తనూ వేరు కాదని ప్రేమకి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి… తనకో చిన్న కష్టం రాగానే పనికిరాని వస్తువుని విసిరిపారేసినట్టు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడన్న వాస్తవాన్ని హరాయించుకోలేకపోతున్నాను. మనుషులు ఎలా దగాపడుతుంటారనేదానికి నేను ప్రత్యక్ష ఉదాహరణ. నేను నా ప్రేమని ఉపయోగించుకొని అతన్నుంచీ కొంత డబ్బు సంపాదించుకుని, ఆస్తి రాయించుకుని వుంటే ఈరోజున ఈ సంఘటనలింత అనూహ్యంగా జరిగేవికాదు. నాకూ కొంత పట్టు వుండేది. ప్రమీలాదేవితో సమానమైన స్థానంకోసం పోరాడి వుంటే ఈరోజున నేనున్న పరిస్థితిలో ఆమె వుండేది. డబ్బుపూత లేని ప్రేమ ఎంత డొల్లగా వుంటుందో గుర్తించిన మొదటి క్షణం అది.
“చూడు… మా యిళ్లలో మగవాళ్లకి యిలాంటివి చాలా సాధారణం” నిర్లజ్జగా చెప్పింది ప్రమీలాదేవి. “మా తాతగారికి ముగ్గురుండేవారు. మా నాన్నకీ వుండేవారట. వాళ్లంతా అదే వృత్తిగా బతికేవారు. మా తాతనేగానీ, నాన్ననేగానీ డబ్బుకోసం పీడించేవాళ్లు, మాయమాటలు చెప్పి ఆస్తి రాయించుకునేవాళ్లు. ఇళ్లూ పొలాలూ దక్కించుకునేవాళ్లు. నీగురించి తెలిసినప్పుడు నా విషయంలో కూడా చరిత్ర పునరావృతమవుతోందని ఏడ్చాను. బాధపడ్డాను. నువ్వు చదువుకున్నదానివనీ, యితన్ని ప్రేమించి వచ్చావనీ, నీకు డబ్బు అదీ అక్క ర్లేదనీ తెలిసి నవ్వాలో ఏడవాలో తెలీలేదు.”
“బహుశా మీకు రాజ్‍తో వుందీ అనుకుంటున్న అనుబంధం అతనితో కాకపోవచ్చు. అతని ఆస్తితో కావచ్చు. కానీ నేనతన్ని చాలా నిజాయితీగా ప్రేమించాను” పదునుగా అన్నాను. ఆమె నన్ను పోల్చిన ఉపమానానికి చాలా అవమానంగా అనిపించింది. రాజ్ నన్నెప్పుడూ అలాంటివాళ్లతో పోల్చలేదు. తక్కువగా చూడలేదు. అతని సమక్షంలో నేనెప్పుడూ ఇబ్బంది. ఫీలవలేదు. మా అనుబంధాన్ని ఆమె యింకో దృష్టితో విశ్లేషిస్తుంటే రక్తం వుడుకుతోంది. మనసు జ్వలిస్తోంది.
“ప్రేమా? ఏమిటి ప్రేమంటే?”” ప్రమీలాదేవి గొంతులో అంతులేని హేళన. “మనమేం ఫ్రీ లవ్ సొసైటీలో లేమే? ఎవరి భర్తనో యింకొకరు ప్రేమిస్తే… అతని భార్య మరొకర్తో పోవటానికి?”” అలా అనడం నచ్చనట్టు రాజ్ ముఖంలో మారిన రంగులు వ్యక్తపరిచాయి.
“ఎంతో కష్టపడి, భార్య, భర్త, పిల్లలు- అనే కట్టుబాటు చేసుకుని కుటుంబవ్యవస్థని ఏర్పరచుకున్నాం. నీదికాని వస్తువుని, నీకు చెందని వ్యక్తిని యింకెవరికో కట్టుబడివున్నవాడిని నువ్వెలా చూడగలిగావు? ఎలా కోరుకోగలిగావు? ఏ అధికారంతో స్వంతం చేసుకోవాలనుకున్నావు? చిన్నప్పట్నుంచీ… అంటే ఊహ తెలీకముందునుంచీ ఒక అజ్ఞాతవ్యక్తిని గురించి నిబద్ధతని నిర్దేశించి పెంచారు నన్ను. పద్దెనిమిదేళ్లొచ్చాక ఆ తెర తొలగింది. రాజ్‍మోహన్ని నాకు భర్తగా చూపించారు. తెల్లకాగితంలాంటి నా మనసుమీద అతన్ని ముద్రించుకున్నాను. అతనే ఇంక నా సర్వస్వం అనుకున్నాను. కష్టసుఖాలు, సుఖసంతోషాలు, అతని అలవాట్లు, దురలవాట్లు, నాలో వున్న చెడ్డతనాలు… వీటన్నిటితోసహా ఒకరినొకరం వప్పుకున్నాం. అలాంటి వ్యక్తిని నీ వశం చేసుకున్నావు. పగలూ, రాత్రీ నీ ధ్యాసే అతనికి. నీ పిల్లలే లోకం. అంటే… అతన్ని చేసుకున్న నేను తెలివితక్కువదాన్నా? మన సాంప్రదాయాలు అర్థరహితమైనవా? లేక యీ వ్యవస్థే పూల్స్ ప్లేయా?” ఆవేశంగా అడిగింది.
ప్రేమకి హద్దులుండవనే నా నమ్మకం కొద్దిగా సడలింది. నేను వాళ్లిద్దరి మధ్యకీ వచ్చానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా రాక ఆమెని కొద్దిగా బాధించి వుండచ్చు. ఆమె జీవితాన్ని ప్రభావితం చేసి వుండ వచ్చు. నాకు వస్తుప్రేమ లేదుకాబట్టి కొద్దిపాటి సంయమనంతో అంతా సర్దుబాటవుతుందని అనుకున్నాను. ఒక తండ్రి తన పిల్లలందర్నీ ప్రేమించినట్టు, మనుషులు సాటి మనుషుల్ని ప్రేమించినట్టు మగవాడు యిద్దరు స్త్రీలని ప్రేమిస్తే తప్పేమిటని అప్పుడు సమాధానపడ్డాను. పురాణాల్లోనూ, యితిహాసాల్లోనూ ఎందరు లేరలా? నేను ప్రేమించిన వ్యక్తి…. నా అంతరంగాన్ని తాకి, నాలోని స్త్రీత్వాన్ని తట్టి లేపిన వ్యక్తి… నాకు తటస్థపడేసరికే అతను వివాహితుడై వుంటే అతను లేని జీవితాన్ని రసహీనంగా, వంటరిగా బ్రతకడమో లేక యింకెవరికో పంచివ్వటమో అనే వూహ భరించలేకపోయాను. ఇది మనుషులకీ, అంతరంగాలకీ మాత్రమే సంబంధించిన విషయం. దీనికి బాహ్యప్రపంచంలోని విలువలతో ఎలాంటి సంబంధం లేదు. ప్రమీలాదేవి చెప్తున్నవి వాస్తవికమైన విలువలు, హక్కులూ, బాధ్యతలూ అనే పరిధిలోకి వస్తాయి. నేనింకా అర్థం చేసుకునే ప్రయత్నంలోనే వున్నాను. ఆమె తిరిగి మొదలుపెట్టింది.
“నువ్వంటున్న అలౌకికమైన ప్రేమ మామధ్యన లేకపోవచ్చు. నువ్వే యింతకుముందు అన్నట్టు మేం ఒకరి ఆస్తులని ఇంకొకరం ప్రేమించుకుని వుండచ్చు. నువ్వెవరివి, అడగటానికి? నువ్వెవరు, మామధ్యకి వచ్చి, దూరాన్ని పెంచి, జీవనగతుల్ని మార్చడానికి? సంఘం నిర్దేశించిన కట్టుబాట్లని వదిలిపెట్టేసిన నువ్వు… నాకు లైఫ్ స్టైల్ నేర్పుతావా?” ఆమె కళ్లు ఎరుపెక్కాయి. కోపాన్ని నిగ్ర హించుకోలేకపోతోంది. రాజ్ నివ్వెరబోయి చూస్తున్నాడు.
ముందుగా తేరుకున్నది నేనే. “
“నేను… ఎలాంటి భేషజాలూ లేకుండా మనుషులు మనుషుల్లా బ్రతకడాన్ని గురించి ఆలోచిస్తాను. మీరు చెప్పే విలువలన్నీ నా దృష్టిలో అవాస్తవికమైనవి, నేనీ సంఘం ఏర్పరిచిన చట్రంలో యిమిడేదాన్నైతే యీరోజున మనిద్దరం యిలా కలుసుకుని వుండేవాళ్లంకాదు. జరిగినదంతా మీకు బాధ కలిగించిందంటున్నారు. కానీ ఏ బాధ, ఏ తపన, ఏ వెతుకులాట రాజ్‍ని నా దగ్గరికి చేర్చిందో ఆలోచించడంలేదు. ఐనా సరే, మీరు చెప్పినట్టే… మీరు కోరినట్టే నేను మీ యిద్దరికీ దూరంగా వెళ్లిపోతాను. పిల్లలతో, జాబ్ వెతుక్కోనివ్వండి” నాది అభ్యర్ధన కాదు, బేరం.
ఆమె తల అడ్డంగా వూపింది.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.