తిరస్కృతులు – 20 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

“నిజమే… ప్రమీలకిగానీ, నువ్వు చేసుకోబోయే అతనికిగానీ వీళ్ళు ఏమీ కారు. ఈ బంధానికి ఒక కొస మనకి అంటుకుని వుండి రెండోకొసని వాళ్ళూ వున్నారు కాబట్టి, ఈ కొద్దిపాటి కావాలనుకోవటమేనా. అందుకే యీ కృతజ్ఞతలూ, జాగ్రత్తలూ. నీ అమాయకత్వంమీద నాకు అపారమైన నమ్మకం వుంది. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నీకోసం చేసుకో. అంతేగానీ పిల్లలకోసం మాత్రం చేసుకోకు. రెండోది- వాళ్లకి తల్లి ప్రేమా, తండ్రి రక్షణా రెండూ కావాలి. తల్లి ప్రేమ లేకపోయినా బతగ్గలరేమోగానీ తండ్రి రక్షణ లేకుండా అది అసాధ్యం. ముఖ్యంగా మనిద్దరం వున్న స్థానంలో. మనం మనుష్యులమైనా ఎంత అభ్యుదయం సాధించినా మౌలికంగా మారకుండా వుండే లక్షణాలు కొన్ని
వుంటాయి. వాటి ప్రకారం ఎంత చెడ్డ వ్యకైనా ఆ చెడ్డతనం భార్య విషయంలోనూ యితరుల విషయంలోనూగానీ పిల్లల విషయంలో కాదు. నేను నీకే చెడ్డవాడిని వాళ్లకి కాదు” అన్నాడు తినడం ముగించి లేస్తూ.
“అన్నీ నువ్వే నిర్ణయించి చెప్పడానికి నేను వెనకటి వసంతని కాదు. నువ్విచ్చే ప్రేమమీద, రక్షణమీద నాకు నమ్మకం పోయింది. అవి తుమ్మితే వూడిపోయే ముక్కులాంటివి. నా విషయంలోగానీ వాళ్ల విషయంలోగానీ నువ్వు తలదూర్చకుండా వుంటే మంచిది” అన్నాను జవాబుగా.
అతను నా మాటలని ఎంతమాత్రం పట్టించుకోలేదు.
“నేనిప్పుడు బెంగుళూర్ వెళ్తున్నాను. వారం పడుతుంది తిరిగి రావడానికి. వాళ్లని యిక్కడ వదిలిపెట్టి వెళ్లిపో. తిరిగి వెళ్తూ నాతో తీసికెళ్తాను. పాతజీవితాన్ని మర్చిపోయి హాయిగా సెటిలవ్వు. సుఖంగా బతుకు. మీ అమ్మమ్మగారితో నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడనా?” అన్నాడు.
అతని మొండితనానికి నాకు కోపమొచ్చింది. నా మాటలకి ప్రాధాన్యతనివ్వడం లేదని వుక్రోషం కూడా వచ్చింది. విసురుగా అతని ముందునుంచీ వెళ్లిపోయి సుధా, సుమలు వున్న గదిలోకి వెళ్లి తలుపేసుకుంటూ గట్టిగా అరిచి చెప్పాను. “
“కష్టమైనా సుఖమైనా నాకు వాళ్లతోటే. నేను పెళ్లి చేసుకున్నా వాళ్లకోసమే. మానుకున్నా వాళ్ళకోసమే. వాళ్లు లేకుండా నేను లేను. వాళ్లని వద్దన్న వ్యక్తి నాకేమీ కాడు. అర్థమైందా?””
కొద్దిసేపటి తర్వాత అతను అమ్మమ్మతో చెప్పడం వినిపించింది. “” వసంత మీకు ఏం చెప్పిందో నాకు తెలీదు. జరిగినదేమిటో యీపాటికి మీకు కొంతైనా అర్థమయ్యే వుంటుంది. ఆమెకి అర్థమయ్యేలా మీరు చెప్పండి. తన జీవితం, తనిష్టం. నేను కాదనటంలేదు. మధ్యలో పిల్లల్నెందుకు బాధపెట్టాలి? వాళ్లని నాతో తీసుకెళ్లిపోతాను. ఆమెకి సరైన నిర్ణయాలు తీసుకోవడం రాదు. కాబట్టి యీ విషయంలో మీరు కూడా ఆలోచించి చెప్పండి” అన్నాడు. అమ్మమ్మ జవాబేం చెప్పిందో నాకు వినరాలేదు. రాజ్ వెళ్లిపోయినట్టు కొద్దిసేపటికి నిర్ధారించుకున్నాను. ఐనా గదిలోంచీ యివతలికి రాలేదు.
రాత్రంతా నాకు నిద్రపట్టలేదు.
“మీకు పిల్లలు పుడితే?”” రాజ్ ప్రశ్న పదేపదే చెవుల్లో మార్మోగుతోంది. ఔను. పెళ్లన్నాక పిల్లలు పుట్టకుండా వుండరు. నాకెందుకో ఆ ఆలోచన నచ్చలేదు. నేను, ప్రభాకర్… మళ్ళీ పిల్లలు… వీళ్లు … వీళ్లు దాన్నెలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్లతో పోలిస్తే వీళ్లకి మా దగ్గిర వుండే హక్కులుగానీ వీళ్లు పొందగలిగే ఆప్యాయతలుగానీ ఏముంటాయి? సుధని నేనూ రాజ్ కిందకి దింపకుండా పెంచాము. తర్వాత సుమ పుట్టింది. అప్పుడు సుధకి జరిగిన ముద్దు సహజంగానే తగ్గింది. అదొక మామూలు విషయంలా జరిగింది. నేను సుమని ఎత్తుకుంటే అది అలిగేది… రాజ్ నచ్చచెప్పేవాడు. బుజ్జగించేవాడు. సుమని తన కాళ్ళమీద కాసేపు పెట్టి తను కాపలాకాసేవాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ పెరిగేలా చెయ్యటానికి, ఎన్నో చేసేవాడు. ఇలాంటివి ప్రభాకర్ దగ్గిర ఎలా సాధ్యపడతాయి? అతనికి వీళ్లపట్ల అంత కన్సర్న్ ఎందుకు వుంటుంది? రాజ్ అప్పటికే యిద్దరు పిల్లల తండ్రైనా అతనికి నాతో అనుబంధం కొత్తది. ఆడపిల్లలంటే అతనికి ప్రాణం. దానికి సరిపడ్డట్టు అతను స్పందించాడు. ఆనందాన్ని పొందాడు. బాధ్యతలు ఎత్తుకునేందుకు సిద్ధపడ్డాడు. అలాంటివాడుకూడా సమస్య రాగానే ఆ బంధాల్లోంచి ఈ బాధ్యతల్లోంచీ బైటపడాలనే ప్రయత్నించాడు. ఇప్పుడు మళ్లీ నా చుట్టూ తిరుగుతున్నాడంటే అది మరొక ప్రయత్నం చెయ్యటమే ఔతుందిగానీ మరేదీ కాదు. ఏరకంగా ఆలోచించినా ప్రభాకర్‍కి నా పిల్లలతో వుండగలిగే అనుబంధం పైపైదేగానీ లోతైనదనిపించడం లేదు. అతనికి నేను రాసిన వుత్తరం సరైనదేనని మరోసారి నిర్ధారించుకున్నాను. ఇలా పదేపదే నిర్ధారించుకోవటం ఎందుకు?
“నాన్న.. నాన్న…” నా పక్కని నిద్రలో కూడా కలవరిస్తోంది సుమ తండ్రిని. ఏవో చెప్తోంది. నాకు కళ్లమ్మట గిర్రుమని నీళ్లు తిరిగాయి. దాన్ని దగ్గిరకి తీసుకున్నాను. నాకు కావల్సినదేమిటో, నేను చెయ్యాల్సినదేమిటో అర్ధమై క్రమంగా నా ఆలోచనలు ఒక దిశగా ప్రయాణించాయి. అప్పటిదాకా పంజరంలో పెట్టి బంధించినట్టు గిజగిజలాడిపోయిన నా మనసు స్వేచ్చగా రెక్కలిప్పుకుని రెపరెపలాడింది. ఇన్నిరోజుల సంఘర్షణా అలజడీ తగ్గి నిశ్చింత చేకూరింది.
రాజ్‍కీ నాకూ మధ్య బిగుసుకున్న ముడిని ఇంకా బిగించకుండా నేనే వదిలేస్తే దానంతట అవే రెండుకొసలూ విడిపోతాయేమో!


మధ్యాహ్నం వేళ… రాజ్ వచ్చి నాలో సంచలనం రేపి కొద్ది గంటలైంది. భోజనంచేసి చాప పరుచుకుని పడుకున్నాను. అమ్మమ్మ కూడా యిక్కడే వుంది. సుధ ఇంగ్లీష్ బుక్ తీసి పదాలు చదువుతోంది. సుమతో ఎబిసిడీలు అనిపిస్తున్నాను. అమ్మమ్మ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఏం చెప్తుంది?
రాజ్‍తో వెళ్లిపొమ్మంటుందా? లేక వీళ్లని అతనితో పంపించేసి ప్రభాకర్‍ని చేసుకొమ్మంటుందా? ఇంటి ముందు తలుపు చప్పుడైంది సుధ చప్పుని
పరిగెత్తుకెళ్లి మళ్లీ గోడక్కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. చేతిలో శుభలేఖ వుంది. చూసాను. ప్రభాకర్‍ది. ప్రభాకర్ వెడ్స్ గీత అని వుంది. దానితోపాటే చిన్న వుత్తరం. అతనింత తొందరగా నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు. నేనింకా మారుఆలోచనలు చేస్తున్నాను. అతన్ని వదిలేసి రావటం సరైనదేననే సమర్ధింపులోనే వున్నాను. విషయం పూర్తిగా వదిలెయ్యలేదు. ఎక్కడో చిన్న ప్రలోభం కొండకి గడ్డిపోచ కట్టి లాగినట్టు లాగుతునే వుంది. అది యింకా తెగిపోలేదు. అతనికి బాగా కోపం వచ్చివుంటుంది.
నాలో ఒక విరక్తిలాంటిది చోటుచేసుకుంది. ఇకమీదట ఒంటరిగానే జీవన పోరాటం సాగించాలంటే ఆ మిగిలి వున్న జీవితం అగాధమంత లోతుగానూ, ఆకాశమంత అనంతంగానూ కనిపించి భయం వేస్తోంది. పిల్లల్ని రాజ్‍కి యిచ్చేసి నేను చచ్చిపోతే? రోజంతా అదే ఆలోచన. నా మనసు చదివినట్టు అమ్మమ్మ నన్ను వదిలిపెట్టి ఒక్కక్షణం కూడా వుండటం లేదు. నాదగ్గిరే పడుకుంటోంది. నామీద చెయ్యేసి దగ్గిరకి తీసుకుని చిన్న పిల్లని బుజ్జగించినట్టు బుజ్జగిస్తోంది.
“వ్యక్తిగా వుండడానికి మీరు సంఘంతో సంఘర్షిస్తున్నారు వసంతా! ఎప్పట్నుంచో వస్తున్న సాంప్రదాయాలని కాదనుకుని కొత్త ప్రయోగాలు చెయ్యబోతే ఆ ప్రయోగాలకే జీవితం సరిపోతుంది. పొరపాట్లు చెయ్యటం…. సరిదిద్దుకోవటం… ఇంక మీరు ఆనందాన్ని అనుభవించేది ఎప్పుడు?” అంది.
నాకు వాస్తవం అర్థమౌతోంది. అందరిలాగే నేనూ పెళ్లి చేసుకుని వుంటే నా కాళ్లకింద కొంతనేల వుండేది. ఇప్పుడు నేనెవరికీ చెందక, అలా చెందకుండా వుండలేక అవస్థపడుతున్నాను.
అమ్మకీ నాన్నకీ ఫోన్ చేసిందట అమ్మమ్మ. వాళ్ళు ముందు నమ్మలేదట. నేను వచ్చిన వెంటనే ఎందుకు చెప్పలేదని అమ్మ దెబ్బలాడిందట. వెంటనే బయల్దేరి వస్తున్నామని చెప్పారు. అన్నట్టుగానే ఆదివారం మధ్యాహ్నం రెంటెడ్ కార్లో దిగారు. ఇద్దర్లోనూ ప్రస్ఫుటమైన మార్పు! అమ్మ వయసుకన్నా పదేళ్లు పైబడ్డదానిలా కనిపిస్తోంది. ఇదివరకూ చీర మడత నలగనిచ్చేది కాదు. తలకి రెగ్యులర్‍గా డై, హెన్నా… చాలా బావుండేది. అలాంటిది చీర వంటికి చుట్టుకున్నట్టుంది. తలకి రంగు వెయ్యటం ఉన్నట్టుండి మానేసినట్టుంది, పంచరంగుల్లో కనిపిస్తోంది జుత్తు. కళ్లకింద నల్లటి చారలు… షుగరూ బిపీ వున్నాయట… బలహీనంగా కనిపిస్తోంది.
నాన్న సరేసరి. లిక్కర్‍మీదే వున్నారు. మనిషి కట్టెపుల్లలా సన్నగా వున్నారు. లివరు ప్రాబ్లమ్ వున్నట్టుంది, పొట్ట కనిపిస్తోంది. వాళ్లిద్దరూ నాకేమాత్రం పరిచయం లేని వ్యక్తుల్లా అనిపించారు. అలా చూస్తుంటే వెరపులాంటిది కలిగింది.
“నీకేం ఖర్మ పట్టిందనే, రెండోపెళ్లివాడిని వెళ్లి కట్టుకున్నావు? అక్కకి చేసినట్టే నీకూ ఏదో ఒకటి చూసి చేసేవాళ్లంగా? మేము చచ్చేమనుకున్నావా? అంత చెయ్యలేని వాళ్లమనుకున్నావా?” అని రాగానే నామీద ఎగిరింది. ఆ స్తోత్రం చాలాసేపు అలాగే సాగింది.
అమ్మమ్మ వూరుకోలేక కలగజేస్తుంది. “దాన్నెందుకే అంటావు? పిల్లల్ని కన్నారుగానీ ఒక్కసారేనా దగ్గిరకి తీసుకుని వాళ్ల మంచి చెడ్డలు చూసారా? మూడునెలలప్పట్నుంచీ క్రెష్, ఆ తర్వాత హాస్టల్లోనూ పడేసారు. ప్రేమకోసం చల్లటి మాటకోసం పరితపించిపోయి అతగాడు చెప్పిన మాయమాటకి లొంగిపోయింది” అంది కోపంగా.
“ఔను. వీళ్లని హాస్టల్లో వేసింది మేము వూరేగడానికి. ఇద్దరివీ టూరింగ్ జాబ్స్, లోన్లీగా ఫీలౌతారని వేసాము. వీళ్లిలా వుద్దరించారు. దానికి… ప్రశాంతకేం వచ్చింది? వెధవది… డబ్బుకోసం ప్రాణాలు తీసుకోబోయింది. మేమేనా సంపాదించినది వీళ్లిద్దరికోసం కాదా? మాతో కట్టకట్టుకుని తీసుకుపోవడానికా? అతగాడు తిరిగివ్వనన్నాడే అదంత పనెందుకు చెయ్యాలి? అంతా నా ఖర్మ… పిల్లల్ని కంటాముగాని వాళ్ల తలరాతల్ని కాదు” అని తలకొట్టుకుని ఏడ్చింది.
“చదువు మధ్యలో ఆపేసి లేచివెళ్లిపోయేంత వయసు నీకెక్కడిదే? అంతకన్నా నేను చదువుకోను, నాకు చదువుమీద ఇంట్రస్టు లేదంటే ఆ
పెళ్లేదో మేమే చేసి పంపేవాళ్లంకదా?” అని గాలి మళ్లీ నామీదకి తిప్పింది.
ఆవిడ మాటల్లో స్థిరత్వం లేదు. ఒకదాంట్లోంచీ మరోదాంట్లోకి వెళ్లిపోతోంది. మా యిద్దరిమీదా చాలా ఆశలుండేవి. జీవితంమీద చాలా
మమకారం వుండేది. ఎన్నో సాధించాలన్న తపన… ఏవేవో ఆకాంక్షలు వుండేవి. వాటన్నిటికీ డబ్బే మూలం అనే పొరపాటు ఆలోచన వ్యతిరేకకోణంలోంచీ పనిచేసి చూపించింది. ఎదురుదెబ్బల్ని తట్టుకోలేకపోతోంది. ప్రతిదానికీ ఏడుస్తోంది. మొదట నన్ను చూసి ఏడింది.
తర్వాత సుధ, సుమల్ని దగ్గిరకి తీసుకుని ఏడ్చింది.
“నా పిల్లల బతుకునే చక్కదిద్దలేకపోయాను. ఇంక వీళ్లకి నేనేం చెయ్యగలను?”” అంది ఏడుస్తూనే. అమ్మమ్మ విసుగ్గా తల పట్టుకుంది.
“అబ్బబ్బ! ఆపవే నీ ఏడుపు. పిల్లలు హడిలిపోతున్నారు… సుధా, సుమా! ఆవిడ మీ అమ్మమ్మ. చీమ కుట్టినట్టు అలా ఏడుస్తూ వుంటుంది. భయపడకండి. వెళ్ళి ఆడుకోండి. ఇదో, వసంతా! ఇందుకేనే మీ అమ్మానాన్నల్ని యిప్పటిదాకా రమ్మననిది. వచ్చి చేసేదేం వుండదు. తోచకుండా గొడవ తప్పించి”” అంది.
సుధనీ, సుమనీ హాల్లోకి తీసుకెళ్లి బొమ్మలముందు కూర్చోబెట్టి వచ్చాను.
నాన్న నిర్వికారంగా జరుగుతున్నది చూస్తున్నారు. నన్ను పలకరించలేదు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నేనే వెళ్లి ఆయన కుర్చీ పక్కన
కూర్చుని వళ్ళో ముఖం దాచుకున్నాను. ఆయన నా తలమీద చెయ్యేసి నిమిరారే తప్ప అప్పుడుకూడా ఏమీ మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడటానికి సంకోచిస్తున్నారు. ఆయన సమాజానికి చెడ్డవ్యక్తేగానీ కానీ చెడ్డతండ్రి మాత్రం కాదు. నాకాయన్ని చూస్తే కోపంగానీ, అసహ్యంగానీ వెయ్యలేదు. యుద్ధంలో వోడిపోయిన మహరాజుని చూసిన భావన కలిగింది.
మానవసమాజంలోని అరాచకతకి కారణం బహుశ: యిదే అయుంటుంది. ఏ మనిషీ ఎల్లవేళలా, సర్వులతోనూ చెడ్డగా వుండడు. కొందరితో దుర్మార్గంగానూ ఇంకొందరితో మంచిగానూ ప్రవర్తిస్తాడు. అతనిలోని మంచినీ చెడునీ విడదీసి చూడటం చూసేవాళ్ళ దృక్పథానికన్నా ఎక్కువగా ఆ యిద్దరిమధ్యా వున్న అనుబంధంమీద ఆధారపడి వుంటుంది. ప్రమీలాదేవికి నాలో చెడు కనిపించింది. నాకు నాన్నలో దుర్మార్గం కనిపించలేదు. ఆమెకి రాజ్‍ది బలహీనతగానూ, నాకు నాన్నది ప్రలోభాన్ని ఎదిరించలేని దుర్బలత్వంగానూ కనిపించాయి.