రైలు కాజీపేటలో ఆగింది. ఆఖరుసారి నేను చూసినప్పటికీ యిప్పటికీ చాలా మారిపోయింది. అందరు జనం… ఆ త్రొక్కిసలాట చూసి ఆశ్చర్యం వేసింది. నా సూట్‍కేసు తీసుకుని దిగాను.
“ఇటివ్వండి”” అన్నాడు ప్రభాకర్ చెయ్యిజాపి. “
“ఫర్వాలేదు”” వారించాను.
ముగ్గురం ఆటో ఎక్కాం. పదినిమిషాలలో వాళ్లింటిముందు ఆగాము. నేను ఫేర్ యివ్వబోతుంటే ప్రభాకర్ వారించి తనే యిచ్చాడు.
“రామ్మా”” అంది రుక్మిణమ్మగారు.
చుట్టూ పెద్దపెద్ద డాబాయిళ్ల మధ్యన విశాలమైన ఆవరణలో రెండువాటాల పెంకుటిల్లు. అటుమూడు, యిటుమూడు గదులున్నాయి. పూర్తి రెసిడెన్షియల్ ఏరియా. నాకేం పెద్ద ప్రమాదం వుండదనిపించింది.
“ఈ వాటా అద్దెకిస్తుంటాం. ఇప్పుడెవరూ లేరు. ఖాళీగానే వుంది. అన్నీ అపార్టుమెంటలయాయి. పెంకుటిల్లుకదా, ఎవరూ రావట్లేదు. ఒకటో రెండో గదులు నువ్వు వాడుకోవచ్చు” అంది తలుపులు తీసి చూపిస్తూ. విశాలంగా వుంది పోర్షను. పాతకాలం కట్టడం కాబట్టి గదులు చాలా పెద్దగా, పైకప్పు ఎత్తుగా వుంది. నా ఒక్కదానికీ యింతది ఎందుకనిపించేలా వుంది. రెండో పోర్షన్‍కి అటువైపు సందులో ప్రభాకర్ తండ్రిని చూసాను. ఆయన పడక్కుర్చీలో పడుక్కుని పైకి చూస్తున్నాడు. మా అలికిడిగానీ కొత్తమనిషినైన నా వునికిగానీ ఆయన్ని ఆకట్టుకోలేదు.
“మా నాన్నగారు. మతిస్థిమితం లేదు. అలాగని భయపడక్కర్లేదు. అలా కూర్చుని వుంటారంతే. ఎవరితోనూ మాట్లాడరు. ఏ పనీ స్వంతంగా చెయ్యరు” అన్నాడు నా వెనకే వున్న ప్రభాకర్. నేను దిగ్గుమని తలతిప్పాను. అతని కళ్ళలో పల్చని కన్నీటిపొర. కళ్లద్దాలు తీసి ఒకసారి కళ్ళొకసారి అద్దుకుని మళ్లీ పెట్టేసుకున్నాడు. జీవంలేని నవ్వొకటి పెదాలకి అతికించుని నిస్తేజంగా అన్నాడు.
“అమ్మ యిందాకా రైల్లో ఆడపిల్లలగురించి అన్నమాటలకి అర్ధం మీకు క్రమంగా తెలుస్తుంది. మీరెప్పుడూ ఒక్కరూ యిటు రాకండి…ఏమో! చెప్పలేం” అన్నాడు. అందులో కాఠిన్యంలేదు. అభ్యర్ధన కూడా లేదు.
రుక్మిణమ్మగారు నిముషాలమీద వంట చేసేసింది. అన్నం, పప్పూ, కూరా, చారూ… మూడు బర్నర్లమీద చకచక వండేసింది.
“వసంతా! ఈవేళ్టికి నీ భోజనం యిక్కడే, రేపట్నుంచి నీ యిష్టం” చెప్పింది. ఆవిడ చూపెడుతున్న ఆప్యాయతా, అభిమానం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేనెవర్నని యింత అపేక్ష? అన్నీ తనేనని చెప్పి నిస్సహాయంగా నన్ను యీ ప్రపంచంలోకి నెట్టేసిన రాజ్‍కీ యీవిడకీ ఎంత తేడా?
నాకూ ప్రభాకర్‍కీ కంచాల్లో వడ్డించి మరోదాంట్లో అంకుల్‍కి కలుపుకుని తీసుకెళ్లింది. చిన్నపిల్లవాడికి పెట్టినట్టు ఆయనకి కలిపి తినిపిస్తుంటే ఆశ్చర్యం కలిగింది.
“ఎప్పట్నుంచీ ఆయనకిలా?” ప్రభాకర్‍ని అడిగాను.
“చాలా యేళ్లైంది”
“యాక్సిడెంటా?”
“కాదు, మెంటల్ షాక్”
నేను ఆశ్చర్యంగా చూసాను. నా ఆశ్చర్యాన్ని చూసి అతను నవ్వాడు.
“ఇలా అడుగడుక్కీ ఆశ్చర్యపోయే మీరేనా, వంటరిగా వచ్చారు? ఇంట్లోగానీ పోట్లాడారా? వాళ్ల ఎడ్రసివ్వండి. మీకుగా తిరిగి వెళ్లటానికి నామర్దా అయితే నేను వెళ్లి తీసుకొస్తాను వాళ్లని” అన్నాడు.
“దయచేసి నన్నిప్పుడేం అడక్కండి. అవసరం వచ్చినపుడు అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. అడక్కుండానే ఆశ్రయం యిచ్చారు. ధన్యవాదాలు. అలా యిచ్చినందుకు మీరు పశ్చాత్తాపపడే పరిస్థితులు మాత్రం ఎప్పుడూ తీసుకురాను” అన్నాను యిబ్బందిగా. పరిస్థితులు మన చేతిలో వుండవనీ, తెలీకుండానే వాటి ప్రభావంలో మనం కూరుకుపోతామనీ ఇంకా నాకు తెలీకపోవటం నా దురదృష్టం.
“మీరు నిజంగా చాలా బోల్డ్” అన్నాడు. అతనలా ఎందుకన్నాడో అర్ధమై నా ముఖం ఎర్రబడింది.
“తినండి. తినండి” అన్నాడు నేను కంచంలో సున్నాలు చుడుతుండటం చూసి. అప్పటికే అతను తినటం పూర్తయింది. నేనూ గబగబ ముగించాను.
“మీరు చాలా ధైర్యస్తులేగానీ అందర్నీ ఇలా నమ్మకండి” అని మళ్లీ ఒక్క క్షణం ఆగి, “మీకే సహాయం కావాలన్నా నిరభ్యంతరంగా నన్నడగవచ్చును”” అని చెప్పి అక్కడినుంచీ వెళ్లిపోయాడు.
ప్రభాకర్‍తో వెళ్లి బ్యాంకులో ఎకౌంటు ఓపెన్ చేసాను. నేను విడిగా వుండటానికి కావల్సిన వస్తువులు… కుక్కరు, గ్యాస్ స్టౌ, కొన్ని గిన్నెలు, పరుపు, దుప్పట్లలాంటివి ముఖ్యమైనవి కొన్నాను. మంచం కొనబోతే వద్దని వారించాడు ప్రభాకర్. వాళ్లింట్లోది ఒకటి తెచ్చివేసాడు నా గదిలో. శక్తిగేస్‍కి కట్టి సిలిండరు తెచ్చుకున్నాను. ప్రమీలాదేవి పంపిన పదివేలలో చాలావరకూ ఖర్చయింది.
ప్రభాకర్‍కీ నాకూ మధ్య పేరుపెట్టి పిలుచుకునే చనువొచ్చింది. నన్ను వాళ్ల బంధువులమ్మాయని చెప్పుకుంటున్నారు.
నేను చదివిన కాలేజీకి వెళ్లాను. రెండు కొత్త బ్యాచిలు పూర్తిగా మారి వుంటాయి. నేను చదువుకున్నప్పటివాళ్లుగానీ, వాళ్లకి సంబంధించినవాళ్లుగానీ ఎవరూ లేరు. లెక్చరర్లు చాలామంది మారిపోయారు. పాతవాళ్లెవరైనా వున్నారేమో కనిపించలేదు. హాస్టల్లోనూ అదే పరిస్థితి. నన్ను గుర్తుపట్టేవాళ్లు ఎవరూ లేరు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, అలూమినీ ఫెస్టివల్‍లాంటివి వుంటాయి. మా కాలేజీలో అలాంటివేం వుండేవికాదు. ఇప్పుడూ లేవు. ఉంటే ఎడ్రసులు దొరుకుతాయి.
నిరాశగా తిరిగొస్తుంటే, “హలో వసంతా! వాటే సర్ప్రైజ్!”” అనే గొంతు వినిపించింది. ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. చప్పుని ఆగి వెనక్కి తిరిగి చూసాను.
“ఇప్పుడే… క్లాసులోంచీ వస్తూ చూసాను నిన్ను. ఎలా వున్నావు? ఏమిటింత హఠాత్తుగా వూడిపడ్డావు? అప్పుడెంత మిస్టీరియస్‍గా మాయమయ్యావో యిప్పుడీ రావడం కూడా అలాగేవుంది”” అన్నాడు నా దగ్గరగా వస్తూ. నా సీనియర్… ప్రసాదు. ఇక్కడే పార్ట్‌టైమ్
లెక్చరర్‍గా చేస్తున్నాడట. క్లాసెస్ అయ్యి, యింటికెళ్తున్నాడట. నన్నూ తనతో రమ్మన్నాడు. ఇంకా పెళ్ళవలేదట. అతని మాటల్లో నిజాయితీ, స్నేహంలాంటివేం లేవు. అప్పటి అమాయకత్వం కూడా వయసు, అనుభవం తెచ్చిన మార్పుల్లో విచ్చుకుపోయింది. ఇన్నాళ్లూ నేనేమైపోయానో తెలుసుకుని కుదిరితే తనూ ఒక అవకాశం తీసుకుందామనే కోరిక వ్యక్తమైంది అతని ప్రవర్తనలో. నేను ముడుచుకుపోయాను. ప్రభాకర్‍కీ, యితనికీగల తేడా స్పష్టంగా తెలుస్తోంది.
“జాబ్‍కోసం చూస్తున్నాను” అన్నాను క్లుప్తంగా.
“నీకా?! జాబా? ఎందుకూ?”” అన్నాడు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ.
“ఎందుకేంటి? చదువుకుని గోళ్లు గిల్లుకుంటూ యింట్లో కూర్చోనా?””
“బై ద బై…” ” అని అడగబోతూ ఆగిపోయాడు. అతను అడగబోయిన ప్రశ్నేమిటో అర్థమైంది. ఆగిపోయినది జవాబివ్వని నా మెడని చూసి.
“క్యాంటిన్లో కూర్చుందామా?” అడిగాడు తనే మళ్లీ. వెళ్లాము. ఫ్రెండ్స్ అందరం జాలీగా గడిపిన రోజులు గుర్తొచ్చాయి. కొందరికి పెళ్లిళ్లై వుంటాయి. ఇంకొందరు ఉద్యోగాల్లో స్థిరపడి వుంటారు. ఈ ప్రపంచం చాలా పెద్దది. మనిషి తన చుట్టూ తను గోడలు కట్టుకునేంత పెద్దది. ఎన్ని గోడలైనా కట్టుకోగలిగేంత విశాలమైనది. మనుషులు ఎదురుగానే వుంటారు. మనసులు మాత్రం దుర్భేద్యమైనంత పటిష్టమైన గోడల వెనుక వుంటాయి.
టీ చెప్పాడు ప్రసాద్. ఇద్దరం నెమ్మదిగా తాగుతున్నాం.
“ఎక్కడుంటున్నావు?” అడిగాడు.
“నిన్నటిదాకా హైదరాబాద్లో… మా యింట్లో. ఇపుడు మాత్రం యిక్కడే. తెలిసినవాళ్ల ఇంట్లో వుంటున్నాను” మామూలుగా అనటానికి ప్రయత్నించి చాలావరకూ విజయం సాధించాను. అతను మరోసారి నా మెడని చూసాడు. “
“నీ పనులన్నీ చాలా హఠాత్తుగానూ, ఆశ్చర్యకరంగానూ వుంటాయి. నువ్వు హాస్టల్‍నుంచీ అంత హఠాత్తుగా వెళ్లిపోవడం నాకైతే షాకే. చాలా అసాధారణమైన ప్రేమకథ నీది. సాధారణంగా యిలాంటి అఫేర్స్ దాగవు. అలాంటిది నీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి కూడా తెలియకుండా ఎలా మేనేజి చేశావు? ఇంతకీ అతనెవరు వసంతా?” ఇంక దాచుకోలేక బైటపడిపోయాడు.
నేను నవ్వేసాను.
“ఇక్కడే వుంటాను. ఎక్కడికీ వెళ్లను. నీ డౌట్సన్నీ తర్వాత తీరుస్తానుగానీ ముందైతే నాకో జాబ్ కావాలి” అన్నాను. అతను ఆశ్చర్యంగా చూసాడు.
“ఏమన్నా గొడవలా?” అడిగాడు.
“అలాంటివేం లేవు. పిల్లలు కాస్తంత పెద్దవాళ్ళయారు. స్కూలుకి వెళ్తున్నారు. జాబ్ చేద్దామని…నేనే…”
“మీవూళ్ళోనే చేయొచ్చుకదా?”
“అన్నీ వివరంగా చెప్తానన్నానుకదా?” సుతారంగా విసుక్కున్నాను. అతను సర్దుకున్నాడు.
“మధుకర్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాడు. వాడి దగ్గరేమైనా అవకాశం వుంటుందేమో చూడు. అదికాకపోతే ప్రవీణ్, వాళ్ల నాన్న ఫర్మ్‌లోనే చేస్తున్నాడు. వాడిద్వారా ట్రై చెయ్యి” అన్నాడు. వాళ్ల అడ్రెసులు చెప్పాడు. కొంతమంది అమ్మాయిల వివరాలు చెప్పాడు. సరైన అడ్రెస్‍లు లేవట. నేను థాంక్స్ చెప్పి లేచాను.
“కలుస్తుండు. లేకపోతే ఫోనైనా చెయ్యి” అన్నాడు విజిటింగ్ కార్డు తీసిస్తూ. తీసుకుని నవ్వి తలూపాను.
ముందు మధుకర్ దగ్గిర వెళ్లాను, నిర్ణయం తీసుకునే అధికారం అతని చేతుల్లోనే వుంటుందని. నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయాడు.
ప్రసాద్‍లాగే కుతూహలం చూపించి ఏవేవో ప్రశ్నలు వేసాడు.
“ముందు నాకేదైనా ఉద్యోగం కావాలి. నువ్వు ఇప్పించగలవా?” సూటిగా అడిగాను. అతను పక్కా వ్యాపారస్తునిగా రూపాంతరం చెందింది నేనింకా గుర్తించలేదు. బాల్యంలో స్నేహాలు పిల్లగాలి తెమ్మరల్లాంటివి. కాలేజీరోజుల స్నేహాలు గాలికి నదిలో కదిలే అలల్లాంటివి. ఈ రెండూ కూడా లోతైనవీ కాలానికి నిలిచేవీ కాదు. స్నేహితుల్లో ఎవరికి ఏ పెద్ద అవసరం వచ్చినా వీగిపోతాయి. అసలు మనిషికీ మనిషికి మధ్య స్నేహం, బాంధవ్యంలాంటివన్నీ వట్టి అబద్ధం. డబ్బు, బంధుత్వం… యివి రెండే అన్నిటినీ శాసించేవి.
నా ప్రశ్నకి వెంటనే జవాబివ్వలేదు మధుకర్.
“నీకు ఇవ్వదగ్గ వుద్యోగాలు నా దగ్గరేంవుంటాయి? ఏదో చిన్న ఫైనాన్స్ కంపెనీ నాది” అన్నాడు చూపుల్తోటే నన్ను అంచనావేస్తూ.
“మరైతే వెళ్తాను” లేవబోయాను.
“కూర్చో. టీ తాగి వెళువుగాని” అన్నాడు. అతని అంతరంగంలో ఏముందో అంతుపట్టలేదు.
“ఇప్పుడే తాగాను” అంటున్నా వినలేదు. బెల్ నొక్కితే బోయ్ వచ్చాడు. అతనికి చెప్పి పంపించాడు. ఐదునిమిషాల్లో టీ వచ్చింది. రెండు కప్పుల్లో పోసి ఒకటి మధుకర్‍కి యిచ్చి ఇంకొకటి నాకిచ్చాడు. మౌనంగా తాగసాగాను.
“ఒక లక్ష మా కంపెనీలో పెట్టకూడదు, వసంతా? రెండు పర్సంటు వడ్డీ యిస్తాను. పొద్దుటినుంచీ సాయంత్రందాకా కష్టపడినా యీరోజుల్లో
రెండువేలు ఎవరూ యివ్వడంలేదు. మా స్టాఫే వున్నారు. వెయ్యిరూపాయలకి చేరారు. ఏడాదికి వంద యింక్రిమెంటు యిస్తాను. జీతం మరీ ఎక్కువైందనిపించినప్పుడు తీసేస్తాను” అన్నాడు. నాకు టీ పొలమారింది.
“ఈజ్… యీజ్” అన్నాడతను. కప్పు టేబుల్‍మీద పెట్టి లేచాను.
“ఎప్పుడొస్తావు?” అడిగాడు.
“ఎందుకు?”
“ఇన్వెస్టు చేయడానికి. పేపర్స్ రెడీచేసి వుంచుతాను”
నేను జవాబివ్వలేదు. నవ్వేసి వూరుకున్నాను. రాజ్ దగ్గరున్నపుడు నేనొక అద్దాలమేడలో బందీని. అతనితో బిజినెస్ టూర్లకి వెళ్లినా నా గ్రేస్‍తో అతని స్థాయిని గొప్పగా చూపించడానికి. అంతే తప్ప అతన్ని మినహాయించుకుని నాకంటూ వేరే ప్రపంచం వుండేది కాదు. ఉందని తెలిసేదంతే. అదీ అతనిద్వారానే. అతనికి పుస్తకాల్లో గొప్ప అభిరుచి వుండేది. దేశవిదేశాలకి సంబంధించిన మేగజైన్స్ తెప్పించుకుని చదివేవాడు. నన్నూ చదవమనేవాడు. వ్యాపార విషయాలు నాతో చర్చించేవాడు. అలా నాకు కొద్దిగా పరిజ్ఞానం వచ్చింది. ఆ కొంచెం ఇప్పుడు ఉపయోగపడింది. ఇంక ఉద్యోగంకోసం ప్రవీణ్‍ని కలవలేదు.
ఇంటికి రాగానే ప్రభాకర్ వెక్కిరింతగా అడిగాడు. “జాబ్ దొరికిందా?”
నేనతని వెక్కిరింతని పట్టించుకోలేదు. నాముందు నిలిచివున్న ప్రశ్న చాలా పెద్దది. ఇంక దేన్నీ నా దృష్టిలోకి రానివ్వకుండా అదే అంతా ఆక్రమించుకుని వుంది. నాకు అనుభవంలేదు. చదువు పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి వుద్యోగం రాదు. వచ్చినా వెయ్యో రెండువేలో మించి ఇవ్వరనేది మధుకర్ తెలియజేసిన వాస్తవం. వెయ్యీ రెండువేలూ నేనొక్కదాన్నీ ఏదో ఒకలా బతకడానికి చాలేమో! కానీ అలా ఏదో ఒకలా బతికెయ్యటం నా గమ్యంకాదు. సుధాసుమల్ని తెచ్చుకోవాలి. వాళ్లకోసం నేనుకూడా చెయ్యగలనని చూపించాలి.
వాళ్లని తెచ్చుకోవాలి… గుండెల్లో ఎక్కడో కదిలినట్టైంది. వాళ్లని వదిలిపెట్టి యిన్నిరోజులు యెప్పుడూ లేను.ఎలా వున్నారో! ఎక్కడున్నారో! రాజ్‍దగ్గరే వున్నారా? హాస్టల్లోనా? బెంగపెట్టుకున్నారా నాకోసం? కళ్లల్లో నీళ్ళు తిరిగి చెంపలమీంచీ జారిపోయాయి.
“సారీ వసంతా! నిన్ను హర్ట్ చేయాలని కాదు” ప్రభాకర్ విచలితుడయ్యాడు. “
“నువ్వేదో అన్నావని కాదు. నాకే మనసెలాగో వుంది”” చప్పున నా గదిలోకి వెళ్లిపోయాను. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాను ఏం చేయాలా… ఎలా బ్రతకాలా అని. ఏ ఒక్క ఆలోచనా నిర్దిష్టంగా తోచడంలేదు. తోచినది నిలవడంలేదు. జ్ఞాపకాల శకలాలు కంట్లో నలుసుల్లా పదే పదే కన్నీటిని తెప్పిస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.