తిరస్కృతులు – 6 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

ఉదయం ఐదయ్యుంటుంది. పెరట్లో హడావిడికి మెలకువ వచ్చింది. ఈ ఇంటికీ, ఇక్కడి వాతావరణానికీ పూర్తిగా అలవాటుపడలేదు. ఏ మధ్యరాత్రో వున్నట్టుండి లేచేస్తాను. ఎక్కడున్నానో కొద్దిసేపటిదాకా అర్ధమవదు. అర్ధమయాక కమ్మటి కల కరిగిపోయిన భావన కలుగుతుంది. ఆ తర్వాత పిల్లలకోసం తపన… కన్నీటి వర్షం. అసలుకి ఎక్కడినుంచీ మొదలుపెట్టాలి నేను? ఏం చేస్తే వ్యవహారంలో కదలిక వస్తుంది? పిల్లల్ని లాక్కుని నన్ను వెళ్ళగొట్టేసారన్నది అలా జరగడంలో రాజ్ పాత్ర వుందనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అక్కడినుంచీ రావటం తప్పు చేసానా? అక్కడే వుండి పోరాడాలా? రాజ్‍కోసం ఎదురుచూడాలా? మళ్ళీమళ్ళీ అవే ప్రశ్నలు. అవే జవాబులు.
లేచి మంచంమీద కూర్చున్నాను. పెరట్లో లైటు వెలుగుతోంది. ఇద్దరు ముగ్గురు మనుషులు అటూ యిటూ తిరుగుతున్న అలికిడి వెళ్లాను. గచ్చుమీద రకరకాల కూరగాయలు కుప్పలు పోసి వున్నాయి. ప్రభాకర్ మరో అబ్బాయి వాటిని కవర్లలోకి నింపుతున్నారు. అలాగే చూస్తూ నిలబడ్డాను. మధ్యలో ఎందుకో తలెత్తి చూసిన అతను చిన్నగా నవ్వి “గుడ్ మార్నింగ్” అన్నాడు తొలి పలకరింపుగా.
తనకి మరో శుభోదయాన్ని బదులిచ్చి “ఏమిటివన్నీ? ఏదైనా ఫంక్షనా” అడిగాను కుతూహలంగా.
“ఫంక్షనని ఎవరన్నారు? ఇక్కడికి కూరగాయల మార్కెట్ బాగా దూరం వసంతా! బళ్లమీద తెచ్చి అమ్మేవాళ్లూ, బడ్డీ దుకాణాలవాళ్లూ బాగా ధరలు చెప్తారు. తాజాగా వుండవు. వంటవేళకి రావు. కావల్సినవి దొరకవు. అందుకని నేనే కొనుకొచ్చి డోర్ డెలివరీ చేస్తాను” అన్నాడు.
“ఎంతొస్తుంది?”” కుతూహలంగా అడిగాను.
ఇల్లు తప్ప వేరే ఆస్థి లేదట. మాటల సందర్భంలో చెప్పింది రుక్మిణమ్మగారు. ఆవిడ హైదరాబాద్‍నుంచీ చవగ్గా చీరలు కొనుకొచ్చి వాయిదాల్లో యిక్కడ అమ్ముతుంది. పూర్తి దిగువ మధ్యతరగతి వ్యవహారాలు… మొదట్నుంచీ నాకు కొత్తే.
“మనది సిటీకల్చర్ కాదు వసంతా! నాలుగు డబ్బులు పడేస్తే సుఖపడవచ్చునని వాళ్లనుకుంటే ఆ కాస్త కష్టం మనమే పడితే ఇంకో నాలుగు డబ్బులు మిగుల్తాయని అనుకుంటాం. ఐతే మనకీ సుఖం కావాలి. మనకి ఖర్చవకుండా ఎదుటివాడి కష్టంమీద. ఇంచుమించు మార్కెట్ రేటుకే యిచ్చినా, అలా నాద్వారా కొనడం ఎంత సౌఖ్యంగా వున్నా నేనెంత మిగుల్చుకుంటున్నానో అనే అనుమానంతో చూస్తారు. ఖాళీగా వుండటం దేనికని యీ పని చెయ్యడం”” నిరాసక్తిగా అన్నాడు.
నా కర్థమైంది. మనిషి వ్యక్తిగా కష్టపడితే గుర్తింపూ ప్రయోజనం వుండవు. వ్యవస్థగా ఎదగగలిగితే ఆ రెండూ పొందగలుగుతాడు. అక్కడినుంచీ వచ్చేసాను. పేపరొచ్చింది. చదువుతూ కూర్చున్నాను. ఒక చిన్న వార్త… ప్రాధాన్యం లేనిదే… నన్ను బాగా ఆకర్షించింది. ఇరవయ్యెనిమిది ప్రైవేటు కంపెనీలు జాబ్ కార్నివాల్ పెడితే నలభై ఎనిమిదివేలమంది ఇంజనీర్లూ, ఎంసియ్యే, ఎంబియేలూ వచ్చారని. అర్థమైంది. నా పోరాటం నేను చెయ్యాల్సిందేతప్ప, ఎక్కడినుంచీ ఎలాంటి అవకాశం దొరకదని.
క్రమంగా నా ఆలోచనలొక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోసాగాయి. పెన్నూ పేపరు అందుకుని ప్రాజెక్టు తయారుచేసాను. మధుకర్ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టడంకన్నా ప్రవీణ్ దగ్గరో మరెవరి దగ్గరో వెయ్యికో రెండువేలకో చేయడంకన్నా అన్నిటికీమించి ఏమీ చెయ్యకుండా వుండటంకన్నా రిస్కు లేని పని. ప్రభాకర్ తన పని ముగించుకుని వచ్చేదాకా రాసినదానికి మార్పులూ చేర్పులూ చేస్తూ వుండిపోయాను.
“ఏమిటి?” అన్నాడు ప్రభాకర్ నా చుట్టూ నలిపి పడేసిన కాగితం వుండలని చూసి.
“కూర్చో, నీతో మాట్లాడాలి. ఇంకేం పని లేదుగా?” అడిగాను. అతను కూర్చున్నాడు.
“చెప్పు” అన్నాడు. “
“ఒక సర్వీస్ కన్సల్టెన్సీ తెరవాలనుకుంటున్నాను”” అన్నాను. “ఉద్యోగం కోసం తిరగడం, రాలేదని నిరుత్సాహపడటం, ఒకవేళ వచ్చినా సరిపడినంత జీతం లేదని అసంతృప్తిపడటం వుండవు”
“వివరంగా చెప్పు”” కుతూహలాన్ని వ్యక్తపరిచాడు. నేను చెప్పసాగాను. “
“ఆడవాళ్లు వుద్యోగం చెయ్యడంతో జీవనసరళి మారింది. పైసపైన మిగుల్చుకుని, అన్ని పనులూ తమే చేసుకోవాలనే సాంప్రదాయిక మనస్తత్వం కూడా మారింది. వీలైనంతదాకా సుఖపడాలనే ప్రతివాళ్లూ అనుకుంటున్నారు. చేసే ప్రతి పనిలో తమకి ప్రాధాన్యం వుండాలనుకుంటున్నారు. జీవితం బిజీగా మారింది. కాలానికి అపారమైన విలువ ఏర్పడింది. అప్రధానమైన చిన్నచిన్న పనులకి కొంత విలువలాంటిది చెల్లించేసి కాలాన్ని మిగుల్చుకుందామనుకుంటున్నారు. సరిగ్గా యిక్కడే నేను బిజినెస్ చెయ్యలనుకుంటున్నాను” అన్నాను.
“ఏం చదివేవు వసంతా నువ్వు?” విస్మయంగా అడిగాడు.
“దీనికి పెద్ద చదువక్కర్లేదు. కొంత అనుభవం, యింకొంత పరిశీలన వుంటే చాలు” అన్నాను. “
“పోనీ యిదేనా చెప్పు. ఎవరమ్మాయివి?””
“అన్నీ సందర్భం వచ్చినపుడు చెప్తాను. నేనేమీ దిల్‍సేలో మనీషా కోయిరాలాని కాను” చురుగ్గా అన్నాను.
“ఛ… అలాగని కాదు”” కంగారుపడ్డాడు.
నాకు కోపం రావడం, నేను వుదాశీనంగా వుండటం అలాంటివి అతనికి నచ్చవట. తనే చెప్పాడు ఒక సందర్భంలో. తుంచివెయ్యలేకపోయాను. అది నా బలహీనత కాదు. నిస్సహాయత. నా గురించిన ఏ నిజం చెప్పుకోలేని నిస్సహాయత. కొద్దిసేపు మౌనంగా వున్నాక మళ్లీ మామూలుగా మొదలుపెట్టాను.
“ఎక్కువలో ఎక్కువ ఒక ఉద్యోగికి పదిహేను సెలవులుంటాయేమో! అతి ముఖ్యమైన పనులకీ, పెళ్లిళ్లూ యితర సందర్భాలకీ వాడుకోవాలనుకుంటారు. కాకపోతే సెలవుపెట్టి ఎటైనా వెళ్లి సరదాగా గడపాలనుకుంటారు. అంతేగానీ పిల్లల స్కూలుఫీజులు కట్టడం, వాళ్లకి బస్‍పాసులు తీసుకోవడం, కరెంటు బిల్లు, ఫోను బిల్లు, డాక్టరు టోకెను, చిన్నచిన్న వస్తువులకోసం బజారుకెళ్లడం, నెలసరి సరుకులు తెచ్చుకోవడం, వీటికోసం లీవులు పెట్టాలని ఎవరికీ వుండదు. ఉన్నవాళ్ళైతే ఒక మనిషిని పెట్టుకుంటారు. పెద్ద సిటీస్‍లోనైతే యిలాంటి ఏ పని కావాలన్నా చేసిపెట్టడానికి కన్సల్టెన్సీలుంటాయి”
“ఇక్కడ అలాంటివేం లేవు” వెంటనే జవాబిచ్చాడు ప్రభాకర్.
“మనం తెరుద్దాం”
“నీ ఆలోచన బాగానే వుంది వసంతా! కానీ…””
“ఆశ లేకుండా ఏ పనీ మొదలుపెట్టలేం. మొదట కొంత నమ్మకాన్ని పోగుచేసుకుని ఆ ఆధారంమీద నిలదొక్కుకోవాలి. అంతే! ఒకప్పుడు మనిషికి యిన్ని వ్యాపకాలు, యిన్నిరకాల పనులు వుండేవి కాదు. ఉన్న కొద్దిపనులకీ దేనికి దానికి మనుషులుండేవారు. ఇప్పుడలా లేదు పరిస్థితి. ఆడవాళ్లు ఉద్యోగాలకి వెళ్తున్నప్పటినుంచీ మారిపోయింది” నాకు అమ్మ గుర్తొచ్చింది. నాన్న ఏదీ పట్టించుకోక యింటాబైటా పనుల్తో సతమతమయ్యేది.
“నువ్వు చాలా హైఫైగా ఆలోచిస్తున్నావు. కూరగాయల డబ్బులే సరిగా యివ్వరు నాకు” అంతా విన్నాక నిరుత్సాహంగా అన్నాడు.
“ఇళ్లలో వుండే ఆడవాళ్లంతే” చెప్పాను.
“నీ యిష్టం. ఐతే ఏమేం కావాలి?””
“ముందు పాంప్లెట్లు కొట్టించాలి… ఒకరిద్దరు చురుకైన కుర్రాళ్లు కావాలి చేతికిందకి”


మైకేల్‍ని పరిచయం చేసాడు ప్రభాకర్. మైకేల్ ప్రభాకర్ ఫ్రెండు. నేను చెప్పిందంతా వోపిగ్గా విన్నాడు.
“మీకు ప్రయోగాలు చేసే ఆసక్తీ, తీరికా వున్నాయేమోగానీ నాకుమాత్రం లేవు. ఉద్యోగం వెతుక్కుంటున్నాను. ఇంటర్వ్యూలకి తయారౌతున్నాను. తీరికవేళల్లో మాత్రమే మీకు సాయం చేస్తాను” అన్నాడు నిర్మొహమాటంగా.
“మీ టైమ్ నేను వేస్ట్ చెయ్యను. ఎంత యిమ్మంటారో చెప్పండి”
“మీ యిష్టం”
“ప్రస్తుతానికి వెయ్యి. నిజంగా పని మొదలైతే బాగా పెంచుతాను” అన్నాను.
అతను అపనమ్మకంగా చూసాడు “ఎడ్వాన్సిస్తారా?”” నవ్వుతూ అడిగాడు. వెంటనే చెక్కు రాసిచ్చాను. “
“బౌన్సవదు”” కొంచెం కోపంగా చెప్పాను. అతనేమీ రియాక్టవలేదు.
“చెప్పండి పనులేమిటో!” అన్నాడు దాన్ని మడిచి జేబులో పెట్టుకుని.
“ప్రస్తుతానికి నిర్దిష్టంగా ఏమీ లేవు” “
“కన్సల్టెన్సీ ఎప్పుడు తెరుస్తారు? ఫంక్షనూ, షామియానా?”
“అలాంటివేం వుండవు”
“మరి?””
“పాంప్లెంట్లు రాగానే”
“ఇంక నేను వెళ్లచ్చా?””
తలూపాను.


కన్సల్టెన్సీ చాలా నెమ్మదిగా నడుస్తోంది. దాని భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. స్పష్టత లేని ఈ గమ్యం నాలో పట్టుదలని పెంచుతోంది. కన్సల్టెన్సీ నడిస్తే ఏమేం చెయ్యొచ్చో ఏమేరకి దాన్ని విస్తరించవచ్చో నా దగ్గర పెద్ద పెద్ద ఆలోచనలు వున్నాయి. కానీ అసలుదే సందిగ్ధంగా వుంది.
మొదటి నెలంతా పబ్లిసిటీకి ఖర్చైంది. ఉద్యోగస్తులు బాగానే స్పందించారుగానీ ప్రభాకర్ చెప్పినట్టు అదే మధ్యతరగతి మనస్తత్వం… రూపాయి మిగిలినా మిగిలినట్టేనని… ఆడవాళ్లదికాదు, సంపాదించే ఆడవాళ్లున్న భర్తలది. ఆడవాళ్ళకో ఇరవైనాలుగ్గంటలూ, మగవాళ్ళకో ఇరవైనాలుగ్గంటలూ ఇస్తాడు దేవుడు. ఆడవాళ్ళకి ఇంటిపనితోపాటు ఆఫీసుపనికూడా వుంటుంది. ఒకేసారి రెండు ఫుల్‍టైము వుద్యోగాల్లా. అలా అనుకోరు మగవారు. రెండు వుద్యోగాలకీ చెరో ఇరవైనాలుగ్గంటలూ వుంటాయనుకుంటారు. కూరలు తెచ్చుకోవటం, పిల్లల స్కూలుపనులు… అటువంటివన్నీ నిర్మొహమాటంగా వాళ్ళకి వదిలేస్తారు.
“ఆఫీసు టైములో పర్సనల్ పనులు చూసుకునే మనుషులం” నిరాశగా అన్నాడు ప్రభాకర్. రెండోనెల కూడా మైకేల్ జీతం పాస్‍బుక్‍లోంచే
తీసిచ్చాను.
“ఇలా ఎంతకాలం యిస్తారు?”” కొంచెం మొహమాటంగా అడిగాడు.
“మీ సర్వీసెస్ తీసుకున్నంతకాలం””
“కానీ మీకు ఆదాయమేం లేదుగా దానివలన?””
“చూద్దాం. ఇంకో నెలో రెండు నెలలో””
“ఇలా తీసుకోవడం నాకు చాలా యిబ్బందిగా వుంది””
“ఇంకొకటి రెండు నెలలు ఓపిక పట్టలేరా? నాకు అప్పటికప్పుడు మనిషి కావాలంటే ఎవరు దొరుకుతారు? అలాగని మీ ఉద్యోగ ప్రయత్నాలు మీరు మానక్కర్లేదుకదా? ఏదైనా జాబ్ వస్తే వెళ్ళిపోవచ్చు ” నచ్చజెప్తూ అన్నాను.
అతను తెలివైనవాడైతే నేనొక పజిల్‍లాగో మట్టిబుర్రయితే నేనూ యింకో మట్టిబుర్రలానో కనిపించి వుంటాను. ఆ క్షణాన నాకు తెలీని విషయం ఒకటి వుంది. ప్రేమ అనే దారానికి అతనొక కొస. ఇంకో కొస నేను కలలోనైనా వూహించనిచోట వుంది. అతని మొహాన్నీ ఆకృతినీ చూస్తే ప్రేమికుడని ఎవరికీ అనిపించదు. అలాంటి గ్రేస్ లేదు.
కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోయాడు మైకేల్. అతను జీతం తీసుకోవటానికి మొహమాటపడటంలో అర్థం వుంది. డబ్బు అవసరం అలా తీసుకునేలా చేస్తోందిగానీ కన్సల్టెన్సీకోసం అతను చేస్తున్నదేమీ లేదు. మొదట్లో ప్రభాకర్‍తో వెళ్లి పాంప్లెంట్లు ప్రింటు చేయించి తీసుకెళ్లి
న్యూస్‍పేపర్ డిస్ట్రిబ్యూటర్‍కి యిచ్చాడు. తర్వాత కన్సల్టెన్సీ రిజిస్ట్రేషన్ పని చూసుకున్నాడు. రెండు బస్‍పాసులు కట్టడం, ఒకరికి రేషన్‍షాపు క్యూలో నిలబడి గోధుమలు తెప్పించడం చేసాడు. చెయ్యనని దేనికీ చెప్పలేదు. అదే అతన్లో నాకు నచ్చిన అంశం. కన్సల్టెన్సీ అందుకుంటే ఇతనొక ఎసెట్ ఔతాడు.
ప్రభాకర్ ద్వారా అతని యింటిపరిస్థితులు తెలిసాయి. తండ్రి బాగా తాగి ఇంట్లో గొడవ చేస్తాడట. జీతమంతా ఆయన తాగుడుకే సరి. మైకేల్ కాక యింకో కొడుకు, ఇద్దరు కూతుళ్లు. పెద్దది మేరీ నర్సు కోర్సు చదువుతోంది. చిన్నది లూసీ యింటరు. మైకేల్ తమ్ముడు టెన్త్ తప్పి చిల్లరగా తిరుగుతుంటాడట. తల్లి చదువుకున్నది కాదు. ఈ కుటుంబం బాధ్యత మైకేల్‍ది. చదువుకుంటున్నప్పట్నుంచీ చిన్నచిన్న పనులు చేసి సంపాదించి తల్లికి యిచ్చేవాడట. అతనికి తల్లన్నా చెల్లెళ్లన్నా ప్రాణమని చెప్పాడు ప్రభాకర్.