భద్రం బిడ్డా… by Tulasi Bhanu

“రవీ నా బంగారు…ఏడవబోకమ్మా… వచ్చేత్తున్నా వచ్చేత్తున్నా… ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారు… నీలాలు కారితే నే చూడలేను… వచ్చేత్తున్నా వచ్చేత్తున్నా ” అని ఏడుస్తున్న బిడ్డకు తన గొంతు వినిపిస్తూ పెద్దకూతురు సుధకోసం టిఫిన్‍బాక్స్ సిద్ధం చేసింది నిర్మల.
బాక్స్ రెడీ చేసేసి పరిగెత్తుకెళ్ళి ఉయ్యాల్లోంచి బాబుని చేతిలోకి తీసుకుని పాలు తాగిస్తోంది.
“ఓ నాన్నా! ఏడ్చి ఏడ్చి గొంతెండిపోయిందా, నా బాబే నా బంగారే, బొజ్జనిండా పాలు తాగు ” అని ముద్దుచేస్తూ బాబు కడుపు నింపింది. పాలు తాగి నిద్దరోతున్న బాబుని భుజాన వేసుకుని వీపు నిమిరి, ఓ త్రేన్పు వచ్చాక, ఉయ్యాల్లో బజ్జోపెట్టి, పక్కింటి అవ్వకి తలుపు దగ్గర కూర్చోమని చెప్పి సుధకోసం ఇచ్చిరమ్మని సందు చివర భర్త నడిపే టైలర్‍షాప్‍కి వెళ్ళి బాక్స్ ఇచ్చి వచ్చింది.
పిల్లలకోసం ఇరవైనాలుగు గంటలూ కష్టపడే నిర్మల ఏనాడూ నేను అలిసిపోతున్నా అని తిట్టుకోదు. అన్నీ చేసికూడా ఇంకా ఏమైనా పిల్లలకు లోటు జరుగుతోందా అని తరిచి తరిచి చూసుకుంటూ ఉంటుంది.
రవికి రెండేళ్ళు. తలుపులు పట్టుకుని ఊగుతూ ఆడేవాడు.
“భద్రం బిడ్డా! చేయి తలుపు మధ్య పడి నలిగేను ” అని చెప్పిన జాగ్రత్తలే చెబుతూ ఉండేది.
రవికి మూడో ఏడు. సందులో పరుగులు పెడుతూ ఆడేవాడు, బల్లలెక్కి దూకేవాడు, వచ్చీరాని ఆటల్లో దెబ్బలు తగిలించుకునేవాడు.
“భద్రం బిడ్డా! కుదురుగా ఆడుకోమ్మా, దెబ్బ తాకేను ” అని జాగ్రత్త చెప్పేది.
రవికి అయిదేళ్ళు. స్కూలుకెళ్ళి వస్తూ రోడ్డు పక్క దిబ్బలెక్కి దూకేవాడు. మట్టిలో, ఇసుకలో ఆడేవాడు, ఇంటిముందున్న ఎత్తు అరుగులు ఎక్కి దూకుతూ ఆడేవాడు. ఒక్కోసారి మూతి, ముక్కు పగిలి రక్తాలు వచ్చేవి. నిర్మల మనసు నీరుకారిపోయేది.
“నా బిడ్డా! ఎంత దెబ్బ తాకిందమ్మా నీకు? నా బంగారుతండ్రీ , నొప్పి పుడుతోందామ్మా? తగ్గిపోతుందిలే ” అని ధైర్యం చెబుతూ, “నొప్పి నొప్పి పారిపో, కాకి కాకి వచ్చిపో, మా బాబు నొప్పి తీసుకుపో, నీ నొప్పంతా హామ్ ఫట్…” అని పాటలాగా అంటూ వాడిని నొప్పినుంచి ధ్యాసమళ్ళించి, నవ్వించడానికి ప్రయత్నించేది.
“భద్రం బిడ్డా! కుదురుగా దెబ్బలు తాకించుకోకుండా ఆడుకోవాలి నాన్నా! ” అని జాగ్రత్తలు చెప్పేది.
రవికి పదేళ్ళు. చెట్టెక్కి పడటాలు, చెరువులో వద్దన్నా ఈత కొట్టటాలు, ఆవులమంద మధ్యలో పరుగెట్టటాలు, ఎన్నో చిత్రాలు చేసేవాడు. దెబ్బలు షరామామూలే.
“ఏంటి కన్నా, ఎన్నిసార్లు చెప్పినా ఇలా దెబ్బలు కొట్టించుకుంటావు? భద్రం బిడ్డా! జాగ్రత్తగా ఉండమ్మా, దెబ్బలు తాకకుండా ” అని కళ్ళనీళ్ళు పెట్టుకునేది నిర్మల.
“సరే అమ్మా! ” అనేవాడు రవి, తల్లి బాధపడుతుంటే చూడలేక.
ఏ వయసులో అయినా తల్లి భద్రం బిడ్డా… అని చెబుతూనే ఉండేది, రవి తనతీరులో తాను సరదాలు చేస్తూ, గాయాలు తగిలించుకుంటూ ఉండేవాడు. భద్రం బిడ్డా అనే జపం మాత్రం నిర్మల వదిలేది కాదు.
కాలేజీలో చేరాడు రవి.
హుషారు ఎక్కువే.
మొదటి సంవత్సరంలో, మొదట్లో సీనియర్లు ఏడిపించినా రవి చలాకీతనానికి తమలో కలిపేసుకున్నారు.
రవి ఫ్రెండ్ వెంకట్ యూత్ లీడర్. ప్రిన్సిపల్ ఎంత వద్దన్నా కాలేజీలోకి రాజకీయాలు తెచ్చేవాడు. రవిని ప్రచారానికి బాగా వాడుకునేవాడు.
అతనికి అప్పుడప్పుడూ ఒక గ్లాసు మందు తాగించేవాడు. ఇలాంటివి తెలిస్తే తల్లి బాధ పడుతుంది అనిపించినా, చుట్టూ స్నేహితులు-
“ఏయ్, తాగరా!” అంటే తాగేసేవాడు.
ఒక వయసొచ్చాక అమ్మమాట కాదు వినాల్సింది, పక్కనున్నోళ్ళ మాట. వినకపోతే తనను కలుపుకోరేమో అనిపించి, వెంకట్ వాళ్ళతో కలిసిపోయి తిరిగేవాడు. కాకపోతే చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, అమ్మావాళ్ళను బాగా చూసుకోవాలి అని మంచిబుద్ధే ఉంది. కాకపోతే స్ధానబలం అనుసరించి ప్రవర్తిస్తాడు. అమ్మ దగ్గర కొడుకులా, తోటి యువకులతో విలాసంగా.
సంవత్సరం తరువాత వెంకట్, నీరజని ప్రేమించమని బలవంతపెడుతున్నాడు, నీరజకు ఇలాంటివి నచ్చవు, ముందంతా సహనంగా మంచిమాటలతో తిరస్కరించింది, ఆరోజు వెంకట్ మితిమీరి మాటలు తూలాడు. నీరజ చున్నీ పట్టుకుని లాగాడు.
అంతే నీరజ కోపం కట్టలు తెగింది,” బుద్ధిలేని పశువా! కాలేజీకి చదువుకోవటానికి కాదురా, నువ్వొచ్చేది? సిగ్గులేకుండా ఒక అమ్మాయి వద్దు అంటే వెంటపడి వేధిస్తావెందుకు? ఈసారి తిట్లతో వదిలేస్తున్నా. ఇంకోసారి నా జోలికొస్తే, చెంప పగులుతుంది జాగ్రత్త ” అని చెప్పింది నీరజ.
అంతే! కోపంతో ఊగిపోయాడు వెంకట్ మూర్ఖంగా-
” రేపు మాఅన్నకోసం కాలేజీలో ర్యాలీ చేస్తున్నాను. క్లాసు క్లాసు తిరిగి గట్టిగా మా అన్నకోసం ప్రచారం చేస్తాను. రేపటిరోజు నేను, నా బ్యాచ్ ఏది చేసినా చూసీచూడనట్లు ఊరుకోమని ఇప్పటికే మా అన్న ప్రిన్సిపల్‍కి చెప్పేసాడు. ఇదే అదును. మనకి కోపం ఉన్నవాళ్ళని చితకబాదుదాము. ఎలాగో, అప్పుడే ఈ నీరజ మొహంమీద ఆసిడ్ పోసేస్తా. దానికి అంత పొగరా?” అని నీచంగా మాట్లాడాడు.
“ఏంటన్నా? ఛీ తప్పు. అలా ఒక ఆడపిల్లని బాధపెట్టడం తప్పు. వద్దన్నా! అలాంటి పని చెయ్యొద్దు” అన్నాడు రవి.
“ఏంట్రా నీకు అంత నచ్చిందా ఆ పిల్లా… ” అడిగాడు అసహ్యంగా వెంకట్ రవిని చూస్తూ.
“ఏంటా పిచ్చిమాటలు? కొంచెం మర్యాదగా మాట్లాడు. నేను ఒప్పుకోను, అలా నీరజమీద ఆసిడ్ పోయడానికి ” అన్నాడు రవి ధైర్యం కొనితెచ్చుకుంటూ.
“అబ్బా! ఏం చేస్తావురా… ఫోరా ఫో ” అన్నాడు వెంకట్ వెటకారంగా, చీదరింపుగా…
“రేపు కాలేజీలో నానా హంగామా చేయాలి. కాలేజీలో ఓట్లన్నీ అన్నకే అని అందరినీ ఒప్పించాలి. సాయంత్రంలోపు వీలుచూసుకుని, అదునుబట్టి నీరజకి బుద్ధి చెప్పాలి ” అనుకుంటున్నారు వెంకట్‍వాళ్ళు.
అవన్నీ వింటున్న రవికి మొదటిసారి తన గుంపు అంటే భయం వేసింది, సన్నగా వణుకు మొదలైంది.
“ఎలా ఆపాలి? ఏం చెయ్యాలి?” అనే ఆలోచనలతో బుర్ర వేడెక్కింది. మనసు పాడయ్యింది.
“అన్న జిందాబాద్!!! అన్న జిందాబాద్!!!” అని వెంకట్ బృందం, వారితో పాటూ రవి బయలుదేరారు.
రవి నాలుగువైపులా వెతుకుతున్నాడు, నీరజ కనిపిస్తే వీళ్ళకు కనపడకుండా, దొరకకుండా వెళ్ళిపోమని చెప్పాలని చూస్తున్నాడు.
ఒకక్లాసులో కొందరు అబ్బాయిలు వెంకట్‍కి ఎదురుతిరిగారు-
” మాకు మీ అన్న నచ్చలేదు. విద్యార్ధులకు ఇస్తామన్న అవకాశాలు ఇవ్వలేదు. మొండిచేయి చూపించాడు. కాబట్టి మేం మీ అన్నకు ఓటు వెయ్యము ” అని.
అంతే, వెంకట్ గ్యాంగ్ ఆ అబ్బాయిలపైన దాడిచేస్తున్నారు, కొంతమందికి పెద్దదెబ్బలు తగిలి రక్తం వస్తోంది. రవికి అయ్యో అనిపించింది. అడ్డువెళ్ళి,
“దెబ్బలాటలు వద్దు, వెంకట్” అని నచ్చచెప్పబోయాడు,
“ఏరా, నిన్నటినుంచీ నీ ఓవర్‍యాక్షన్ ఎక్కువయ్యింది?” అని పిచ్చికోపంతో వెంకట్ తన జేబులోంచీ చాకు తీసి రవి కడుపులో పొడిచాడు.
“భద్రం బిడ్డా! దెబ్బ తాకనీకు ” అన్న తల్లిగొంతు చెవుల్లో ప్రతిధ్వనించింది. అంతే. “అమ్మా! ” అని పిలుస్తూ లేచి కూర్చున్నాడు.
“అమ్మా! అమ్మా! ” అనుకుంటూ పొట్ట తడిమి చూసుకున్నాడు. తనకి వచ్చింది కల, నిజం కాదని అర్థం అయ్యింది. అమ్మ గుర్తొచ్చింది. దిగులేసింది. పర్సులో ఉన్న అమ్మ ఫొటో తీసి చూసుకున్నాడు. నిర్మలంగా వెన్నెలంత చల్లని నవ్వు నవ్వుతూ ఫొటోలో కనపడింది తల్లి.
“అమ్మా! చిన్నప్పటినుంచీ భద్రం బిడ్డా అని జాగ్రత్త చెబుతూనే ఉండేదానివి. ఆ మాట, ప్రేమ నిండిన ఆ రక్షరేకు నన్ను వెంటాడుతూ, కాపాడుతూ ఉంటుంది. నీ కొడుకు భద్రంగానే ఉన్నాడమ్మా! భద్రంగానే ఉంటాడు. అమ్మా! అమ్మా!! ” అనుకున్నాడు.
మొహంనిండా చెమటలు పడితే, తనవెంట తెచ్చుకున్న అమ్మ పాతచీరను బీరువాలోంచీ తీసుకుని చెమటలు తుడుచుకున్నాడు. మెత్తటి అమ్మచీర మృదువుగా తాకి-
“ఏరా, నాన్నా!” అని అమ్మ పలకరించినట్లుగా అయ్యింది. దిగాలుగా, భయంగా వున్న మనసు కుదుటపడింది.
అంతే! ఆ తెల్లవారుఝామున బయలుదేరి ప్రిన్సిపల్ దగ్గరకి వెళ్ళాడు. వెంకట్ ఆలోచనలు ఎలా ఉన్నాయో, మర్రోజు జరగబోయే ఘోరాలు ఎలా ఉండవచ్చో వివరించి ప్రిన్సిపల్‍కి చెప్పాడు. ప్రిన్సిపల్ హాస్టల్‍కి అన్నివైపులా తాళాలు వేయించాడు, స్వయంగా తానే అన్ని దారులూ మూసి ఉన్నాయా, లేవా అని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకున్నాడు.్
రవికూడా బందిఖానాలోనే ఉండిపోయాడు, తనకేమీ తెలియనట్లు… తనేమీ చేయనట్లు…
పొద్దున్న బయటకు వెళ్ళలేక వెంకట్ రచ్చరచ్చ చేసాడు. అతను చేయాలనుకున్న, అతని అన్నగారి ప్రచారం విఫలమయ్యింది. ప్రిన్సిపల్‍ని బెదిరించాడు, తన అన్నకు తెలిస్తే ఊరుకోడని.
తెల్లవారుఝామున పెద్ద బ్యాచ్ ఒకటి హాస్టల్‌లో దూరబోయిందని, వారి వలన వెంకట్‍వాళ్ళకి ప్రమాదం అని ముందుజాగ్రత్తగా హాస్టల్‌ బంద్ ఉంచానని, ఒక్కడుకూడా లోపలికి రాలేక వెనక్కిపొయ్యారని, సర్దిచెప్పాడు ప్రిన్సిపల్.
వెంకట్, అవునో కాదో అనే సంశయంలో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఆ రోజు సాయంత్రంకల్లా వెంకట్ పేరెంట్స్‌కి, అతని గుంపులోనివారి తల్లిదండ్రులకీ ప్రిన్సిపల్ కబురు పంపించాడు. తల్లిదండ్రులు వచ్చి, వారివారి పిల్లలకు నయానో భయానో నచ్చచెప్పుకుని, ఇంక రాజకీయాల జోలికి పోమని మాటతీసుకుని వెళ్ళారు.
ఆరాత్రి ప్రిన్సిపల్ రవిని మెచ్చుకున్నాడు. నీరజ భవిష్యత్తుని, మరికొందరు స్టూడెంట్స్ భవిష్యత్తుని రవి కాపాడాడని మెచ్చుకున్నాడు. ఇలానే ఆదర్శవంతంగా ఉండాలని కోరుకున్నాడు.
అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ పడుకున్న రవి, “అమ్మా! భద్రం బిడ్డా… అని నువ్వు నా చెవుల్లో ఇల్లు కట్టుకుని చెప్పిన మాట, ఈ రోజు నన్నూ, నాతోటివారినీకూడా కాపాడింది.అమ్మంటే అమ్మే” అనుకుని , శెలవలకు రోజులు లెక్కేసుకున్నాడు, అమ్మని చూడటానికి వెళ్ళటానికి.