మనుష్యరేణువులు by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

“ఏందే, వూకే పక్కలొ మెసుల్తున్నావు? నిద్రొస్తలేదా?” రాత్రి పదకొండుగంటల వేళ భార్యనడిగాడు యుగంధర్.

” మనూరు పోయిరావాల్నని వుంది””జవాబిచ్చింది పద్మ.
“మనూరా?”” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఏం, వరంగల్ మనూరు కాదా?””
“వరంగలా? గక్కడ మనకేమున్నది? ఇల్లు, భూమి అమ్ముకున్నం. ఈ సిటీలకొచ్చినం. మా అన్న, మీ అక్కగూడ ఇక్కడనే వుండబడ్తిరి””
“కాని అది మనూరేగద? నేను పెట్రోల్‍పంపు స్కూల్ల చదివిన. పింగిళీ విమెన్స్ కాలేజుకు వెళ్లిన. శివరాత్రికి వెయ్యస్తంబాలగుడిల పూజలు చేసిన. బతుకమ్మలు పేర్చి, పద్మాక్షి చెర్ల కలిపిన. భద్రకాళి దేవతకు మొక్కులు మొక్కిన. ఇంకేం గావాలె?”” అంది. ఆమె గొంతులో ఏదో దు:ఖం సుళ్ళు తిరుగుతోంది.
“…”
“ఆర్నెల్లక్కడ, ఆర్నెల్లిక్కడ. అక్కడో కాలు, ఇక్కడో కాలన్నట్టుంది. ఈ నడిమ ఎప్పుడో అన్ని రుణాలు తీరిపోతయనిపిస్తది”” అంది.
యుగంధర్‍కి గుండె చిక్కబట్టినట్టైంది. “”అట్లనకు పద్మా! నీకేమైతది? ఏంగాదు. నేనున్న… వరంగలేకద? ఆదివారం పోదం”” అన్నాడు.
వాళ్ళిద్దరిదీ ఇప్పటిదో అప్పటిదో కాదు అనుబంధం. పన్నెండేళ్ళకి పెళ్ళై, పధ్నాలుగేళ్ళకి కాపురానికి వచ్చిందామె. అతనామెకన్నా ఎనిమిదేళ్ళు పెద్ద. ఆ లేతవయసులో ముడిపడ్డ బంధం ఒకరిలో ఒకరు కలిసిపోయినంత బలంగా మారిపోయింది. ముగ్గురు పిల్లలు. కొంచెం ఆలస్యంగా పుట్టారు. ఇద్దరు మగ, ఒకరు ఆడ. అంతా అమెరికాలోనే వున్నారు. వీళ్ళు వెళ్తుంటారు. వస్తుంటారు. మొదట్లో అంతా సరదాగానే అనిపించినా ఎక్కడో ఏదో కోల్పోతున్న భావన కలుగుతోంది ఈమధ్య పద్మలో.
“నా దోస్తు సుధేష్ణ ఎరికేగదా నీకు?” ” ఆడిగింది.
“గ కాపోల్లామెగాదు?”” గుర్తు తెచ్చుకున్నాడు.
“ఆ< గామెనే. ఈడికి వచ్చేముందు కలుద్దమనుకున్న. తీరలే. అట్లనే పదేండ్లు గడిచిపోయినయ్. లాసేంజిల్స్‌ల గామె బిడ్డ కలిసింది. గప్పుడు చెప్పింది, సుధేష్ణ కేన్సరొచ్చి పోయిందంట. మూడేళ్ళాయె””
“అయ్యో!”” అన్నాడు యుగంధర్.
ఇద్దరూ పుట్టిందీ పెరిగిందీ వరంగల్లోనే. పిల్లల చదువులకోసం అన్నీ అమ్మి హైదరాబాదు వచ్చారు. వచ్చిన కొత్తలో చాలా దిగులుపడింది. ఇప్పుడు మళ్ళీ అదే దిగులు చూస్తున్నాడు ఆమెలో. అమెరికా వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్నీ వదిలి వెళ్తున్నానని దిగులు. తిరిగొచ్చేటప్పుడు అక్కడ అందర్నీ వదిలి వస్తున్నానని దిగులు.


ఆదివారం అనుకున్నట్టుగానే కార్లో బయల్దేరారు. పద్మ పొద్దున్నే లేచి పప్పు, బియ్యం వేసి, హాట్‍పేక్‍లో సర్దింది.
“తొవ్వల హొటల్స్ లెవ్వానె? ఊకే పరేషాన్ కాకు”” అని కోప్పడి, ఇంకే ప్రయత్నాలూ చెయ్యకుండా ఆపాడు. ఆకుపచ్చ బోర్డరున్న ఆరెంజిరంగు పెద్దగద్వాల చీరకట్టుకుని పగడాల సెట్టు పెట్టుకుని తయారైన భార్యని చూసి, “”పెండ్లికిగిన పోతున్నవే?” ” అని పరిహాసం చేసాడు యుగంధర్.
తెలతెలవారుతుండగా బయల్దేరారు. ఉప్పల్ దాటేసరికి ఐదున్నరైంది. తొందరగా వెళ్తే సాయంత్రం తిరిగిరావచ్చని ఆలోచన. అనుకున్నట్టుగానే ఏడున్నరకల్లా కాజీపేట్ చౌరస్తా చేరుకున్నారు.
పద్మ రెప్పలార్చుకుని చూసింది. హైదరాబాద్, లాస్‍ఏంజిల్సు చూసిన కళ్ళతో చూసినా అందంగానే అనిపించింది. ఊరు పెద్దగా ఏమీ మారలేదుగానీ, కొన్ని కొత్తకొత్త కాలనీలు వెలిసాయి. అపార్ట్‌మెంటు కల్చరు వూపందుకుంది.
“ముందుగాల మనిల్లు చూసి పోదాం”” అంది పద్మ. అతను అటువైపు కారు వురికించాడు.
పదేళ్ళైంది, ఇల్లమ్మేసి. కాలనీ బాగా డెవలపైంది. అప్పట్లో ఖాళీగా వున్న ప్లాట్లలో కొత్తగా ఇళ్ళో అపార్టుమెంట్లో వచ్చాయి. కట్టినప్పుడు వూరు వదిలిపెట్టి తాము హైదరాబాదు వెళ్తామనీ, పిల్లలు ఆ యెల్లకూడా దాటేసి దేశాంతరమే వెళ్తారనీ ఆలోచనలేవీ లేవుకాబట్టి, దిట్టంగానే, ఆరు బెడ్రూముల్తో కట్టించాడు. కొన్నతనుకూడా ఇల్లు చూసి ముచ్చటపడ్డాడు.
ఇద్దరి దృష్టీ తాము వదిలిపెట్టిన ఇంటికోసమే వెతుకుతోంది. కానీ కనిపించిన దృశ్యం వేరు. ఆ స్థానంలో నాలుగంతస్తుల బిల్డింగు వుంది. ఆర్సీసీ స్ట్రక్చరు, వందేళ్ళు తిరిగి చూడక్కర్లేదన్నాడు కట్టిన మేస్త్రి. అలాంటి యిల్లు… కూల్చేసి… తల గిర్రున తిరిగిపోయింది యుగంధర్‍కి. ఎన్నో లెక్కలు కళ్ళముందు కదిలాయి.
తాజ్‍మహలుకు రాళ్ళెత్తిన కూలీలెందరన్నాడు శ్రీశ్రీ. ఎంతమంది కష్టం చేసారు యీ యింటికోసం? అదంతా ఏమైపోయింది? మనిషికి డబ్బు ఎక్కువైందా లేక అహం ఎక్కువైందా? క్రిమినల్ వేస్టంటే ఇదేకదా? జీర్ణించుకోలేకపోయాడు
“ఇగ చూసెటందుకేమున్నది? పా, పోదాం”” అంది పద్మ. ఆమె పెదవులు వణుకుతున్నాయి.
“ఇల్లమ్మేసినం. కొనుక్కున్నాయన ఏమన్న చేసుకుంటడు” అన్నాడు యుగంధర్.
“అంతగనం ఇల్లు నచ్చనోడు ఎందుకు కొనుక్కోవాలి? ఖాళిజాగా తీస్కుని కట్టుకుంటే పొయ్యేదానికి? నచ్చినోడే కొనుక్కునెటోడు””
ఇంతలో గేటు తీసుకుని ఇంటాయన బయటికి వచ్చాడు. గుర్తుపట్టి నవ్వాడు.
“యుగంధర్ సార్! మీరేనా? బాగున్నారా? ఇంటిముందు ఇంతసేపు కారు ఆగి వుంటే ఎవరో చూద్దామని వచ్చాను. వచ్చుడు మంచిదైంది. లోపలికి రండి”” అన్నాడు అభిమానంగా.
“లేదులేదు. ఇంక చానా దిక్కుల పోవాలె. ఇటొచ్చినంగదాని ఆగినం. ఇల్లసలు పోలిక పట్టనీకి లేకుండ అయింది”” అంది పద్మ.
“మీరు బాగున్నరా?”” అన్న యుగంధర్ మాటలు ఆమె మాటల్లో కలిసిపోయాయి.
“మీయిల్లేనా చూసుకోరా?”” అంటే ఇంక తప్పనిసరై దిగారు. సమూలంగా కూలగొట్టి కట్టించారు. గ్రౌండ్‌ఫ్లోరంతా తిప్పి చూపించాడు. పై ఫ్లోర్లుకూడా అదే డిజైనట. ఆయన భార్య వచ్చి పలకరించింది.
వాళ్ళకి ముగ్గురు కొడుకులు. ముగ్గుర్లో ఇద్దరు ఇక్కడే వున్నారు. ఒకతను అమెరికాలో వుంటాడు. పెద్దకొడుకు వాటాకి వచ్చిందట ఈ యిల్లు. పాతమోడలని అతని పిల్లలు గొడవచేస్తే కూలగొట్టి కట్టించాడట.
“ఏంజేస్తడు మీ పెద్దకొడుకు?”” అడిగింది పద్మ.
“ఆబ్కారీలో చేస్తాడు”” ఆవిడ జవాబు.
ఇంకేం? మస్తు పైసలు అనుకుంది పద్మ. పదినిముషాలు కూర్చుని లేచారు పద్మా, యుగంధర్. అక్కడినుంచీ వెయ్యిస్తంబాల గుడికి వెళ్ళారు. నాట్యమండపం కూలిపోయింది. ఆ రాళ్ళన్నీ నేలమీద పరిచి వున్నాయి. “”ఎప్పటికైతదో? అసలుకి ఐతదో లేదో?”” అంది పద్మ దిగులుగా.
ఇద్దరూ దేవుడిని దర్శించుకుని ఇవతలికి వచ్చారు. అక్కడినుంచీ భద్రకాళి గుడికి. గుడి ఆవరణలో ఒక రాతిమీద మరొకటి నిలబెట్టినట్టుండే కొండరాళ్ళని చూస్తూ నిలబడింది. ఆ రాళ్ళు దొర్లిపోతే ఏమౌతుందా అని ఆమెకి ఎప్పుడూ అనుమానమే. కానీ ఇప్పటిదాకా అలా జరగలేదు.
“గీడనేమో అమ్మవారు… కురివిలోనేమో అయ్యవారు… దేవుళ్ళకుగూడ తప్పని తిప్పలు”” అంది. అతను నవ్వాడు.
“ఇట్లసుత బతకాల్నని చెప్పుడేమో!”” అంది తనే మళ్ళీ.
అక్కడ్నుంచీ వరంగల్ కోట చూసారు. టూరిస్టులకోసం చాలా డెవలప్ చేసారు.
“గిక్కడో కోట, కోటల రాణీగారు, ఇదంతా మనుషులు వుండెటోళ్ళంటె గమ్మత్తనిపిస్తలేదు?”” అంది పద్మ. చిన్నపిల్లలా ఆనందపడింది. అక్కడినుంచీ నేరుగా హోటల్‍కి వెళ్ళి భోజనం చేసారు.
“నెక్స్ట్?”” అడిగాడు యుగంధర్.
“అంకిరెడ్డి డాక్టరు, వకీల్‍సాబ్, సుధేష్ణావాళ్ళిల్లు…”” ప్రోగ్రాం చెప్పింది.
ముందు సుధేష్ణ ఇంటికి వెళ్ళారు. ఆమె భర్త వున్నాడు. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఇంతదూరం వెతుక్కుంటూ వచ్చినందుకు సంతోషపడ్డాడు.
“ఈ వయసులో పెళ్ళేంటనుకోకు చెల్లెమ్మా! మాటతోడు, మనిషితోడు. ఈ పెద్దతనంలో ఒకరికొకరం తోడు”” అన్నాడు. అతని భార్య పెద్దదే, పద్మ వయసే వుంటుంది. దమయంతిట ఆమె పేరు. మొహమాటపడుతూ మాట్లాడింది. సుధేష్ణ వున్నప్పుడైతే స్వంతింటిలా వుండేది వాళ్లిల్లు. ఇప్పుడేంటో పరాయిగా అనిపించింది.
ఆరోజుకి వుండిపొమ్మని బలవంతం చేసాడు.
“మళ్ళొచ్చినప్పుడొస్తం”” అంది పద్మ.
“అమెరికా వెళ్ళినా నీమాట మారలేదు పద్మా! పిల్లలు వూరుకుంటున్నారా?”” నవ్వాడతను.
“మస్తు లొల్లిపెడ్తరు. చిన్నప్పటిసుంది వున్నది. ఎట్ల మారతది?ఎందుకు మారాలె? కానీ మందికోసం తప్పదు”” అంది.
“ఇంగ్లీషు ట్యుటోరియల్స్ తీసుకుంది. గీ మాట్లాడుడు స్టాలిన్‍గారి కుక్క అమెరికా వచ్చినప్పుడు మొరిగినట్టు”” అన్నాడు యుగంధర్.
ముగ్గురూ నవ్వుకున్నారు. దమయంతి నవ్వలేదు. పద్మ ఏమనుకుంటుందోనని.
“మీరిద్దరూ హైద్రాబాదు రాండ్రి!”” అని వాళ్ళని ఆహ్వానించి బయల్దేరారు.
“ఉండమంటే వుంటలేరు. ఏదేనా పనిమీద వచ్చారా? వాపస్ పోవుడేనా?”” అడిగాడు సుధేష్ణ భర్త.
“పనంటూ ఏమీలేదు. అందర్నీ ఒకసారి చూసిపోదామని వచ్చాం”” అన్నాడు యుగంధర్. “చానామందిని కలవాలి. మళ్ళీ ఎప్పటికౌతుందో తెలీదు. అంకిరెడ్డి డాక్టరు ఇంకా ప్రాక్టిసు చేస్తున్నాడా?”” అడిగాడు.
“ఆయన ఇక్కడ లేడు. కొడుకులిద్దరూ దుబాయ్‍లో డాక్టర్లు. అంకిరెడ్డికూడా భార్యతో అక్కడికే వెళ్ళిపోయాడు””
“దావఖనా?”” చప్పుని అడిగింది పద్మ.
“మొత్తం కూలగొట్టించి మడిగలు కట్టించి కిరాయికిచ్చేసాడు. ఏడాదికొకమాటు వచ్చి చూసుకుని వెళ్తాడు” “
పద్మకి ఎక్కడో గుండె ధడుక్కుమంది. అంకిరెడ్డితో వాళ్ళ అనుబంధం చిన్నది కాదు. ఆయన భార్య గైనకాలజిస్టు. భార్యాభర్తలిద్దరూ మాటమన్ననగలవారు. తక్కువ కన్సల్టేషన్ ఫీజు తీసుకునేవారు. ఐదూ పదీ అంతే. ముగ్గురు పిల్లల డెలివరీలనుంచీ అనారోగ్యాలన్నీ ఆయనదగ్గరే అయాయి.
“మరైతే వకీల్‍సాబ్‍ని కలిసి వాపస్ పోదాం”” అంది పద్మ. ఆయన పద్మ తండ్రికి స్నేహితుడు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. అందరూ కలిసి ఆడుకున్నారు. ఆడపిల్లలు పద్మ చదివిన స్కూల్లోనే చదివారు.
“వకీల్‍సాబ్ అంటే?”” అడిగాడు సుధేష్ణ భర్త.
“బాపు దోస్తు. రఘురామయ్య వకీలు”” పద్మ చెప్పింది.
“ఆయనిప్పుడు భీమారంలో ఇల్లు కొనుక్కుని వుంటున్నాడు””
“ఇల్లెక్కడ?”” ఆతృతగా అడిగింది.
గుర్తులు చెప్పాడతను.
“పొయ్యొస్తం”” అంది పద్మ. దమయంతికి కూడా చెప్పింది. బయల్దేరారు.
“ఇంతగనం వచ్చినం. ఏమైన కొనుక్కుంటవానె?”” దార్లో అడిగాడు యుగంధర్.
“ఏం కొనిస్తవ్?”” అడిగింది పద్మ.
“ఏం గావాలె? నెక్లెసు కొనుక్కుంటవా?””
“గిప్పుడు అవుసరమా?ఫక్షన్ల్లు సుత లెవ్వు””
“ఐతేందే? నువ్వెప్పుడు పెట్టుకుంటె గా దినమే పండగ”
“సరైతె తియ్. ఔసులాయన దుకాణంకి పోదం”
“బ్రహ్మచారి దగ్గరేం మోడల్సుంటయ్? ఖజానలోనో, గోల్డ్‌ప్లస్‍లోనో తీస్కో””
“గదానికి గీడెందుకు కొనుక్కోవాలె? హైద్రాబాదులోనె కొనుక్కుంట. ఔసులాయన్ను మందలించి పోదమని””
యుగంధర్ ఇంకేం మాట్లాడలేదు. బ్రహ్మచారి తండ్రిదగ్గర పద్మ తల్లి, అత్త బంగారం చేయించుకునేవాళ్ళు. పద్మకూడా అతని దగ్గిరే చేయించేది. బ్రాండెడ్ షోరూమ్స్ వచ్చాక, పద్మ పిల్లలు కంసాలి చేసే నగలని మెచ్చటం మానేసారు. మాటల్లోనే బ్రహ్మచారి దుకాణం దగ్గరకొచ్చారు. కారు ఆపుకుని చూస్తే అతని దుకాణం వుండేచోట చెప్పులదుకాణం వుంది. ఆ షాపులో అడిగాడు. బ్రహ్మచారి దుకాణం మూసేసి, ఇంట్లోనే చేస్తున్నాడట. ఇంటికెళ్ళారు. అతను ఇంట్లోనే వున్నాడు. పలకరింపులు, పరామర్శలు అయ్యాయి.
“నీదగ్గర ఏమున్నయో చూపియ్యి బ్రహ్మంగారూ!”” అంది పద్మ.
“నా దగ్గర కొంటరా?”” ఆశ్చర్యపోయాడతను.
“దుకాణం బందు పెట్టిన్నమ్మా! పనోళ్ళు దొరుకుతలేరు. జనాలుసుత మేం చేసినవి మెచ్చుతలేరు. మాదగ్గర మూడు గుర్జల తరుగిచ్చెటందుకు కొట్లాడినోళ్ళు గిప్పుడు పదేనుగుర్జలు పోయిన ఫికర్ చేస్తలేరు. పుస్తెకు, సకినంగుండ్లకు సుత వస్తలేరు”” అన్నాడు. అంతటా, అన్నిరంగాల్లో వున్న సమస్యే. మొదట మిల్లువస్త్రాలతో మొదలైంది. ఇప్పుడు అన్నిరంగాలనీ చుట్టేసింది. వాళ్ళెంత గొప్పకళాకారులైనా, పనిమంతులైనా మిషన్ల వేగాన్నీ, నాజూకునీ అందుకోలేక వెనకపడుతున్నారు.
“మీకిద్దరు కొడుకులు కద, ఏం చేస్తున్నరు? చదివిపించిన్రా?”” మాట మార్చాడు యుగంధర్.
“బాగనే యాదున్నది సారుకు. పెద్దోడప్పుడు నాకు తెల్వలే. సాదా డిగ్రీ చదువు చదివించిన. పన్లో పెట్టిన. చిన్నోడు బీటెక్ చదివిండు. సాఫ్ట్‌వేర్‍ల చేస్తున్నడు. చెన్నైల. దుకాణం తీసేసినంక పెద్దోడు జ్వెల్రీడిజైను కోర్సు చేసిండు. రాజస్తాన్‍ల పోల్కీ వర్కు నేర్చుకున్నడు. గిప్పుడు ఫిలిగ్రీ నేర్చెటందుకు కటక్ పొయిండు. ఎక్కడొకచోట నౌకరు దొరుకుతది. మారినకాలంతో మనంసుత మారాలె”” అన్నాడు.
“ఆకులొక్కలున్నాయా?”” అనడిగింది పద్మ. ఎందుకోననుకుని రెండు తమలపాకులు, ఒక పోకచెక్క తెచ్చిచ్చాడు బ్రహ్మచారి. భర్త దగ్గిర ఐదువందలనోట్లు రెండు తీసుకుంది. తమలపాకుల్లో పెట్టి బ్రహ్మచారి చేతిలో పెట్టింది.
“మూడుగుర్జల తరుగుకోసం నీతో నేనుసుత కొట్లాడిన. గిప్పుడు వెయ్‍లువెయ్‍లు షోరూమ్‍లల ఇస్తున్న. ఎవ్వరం సంతోషంగ లేముగని. వున్నమనుకుంటున్నం”” అంది.
అతను దణ్ణం పెట్టాడు.
“ఇప్పటి పిల్లలకు గిట్లొక ఔసులాయన ఇంట్లనో దుకాణంలనో కొలిమ్ముందు కూసుని నగలు చేసెటోడనికూడా తెల్వది”” అన్నాడు.
అక్కడినుంచీ నేరుగా వకీల్‍సాబ్ ఇంటికి వచ్చారు. దార్లోనే అంకిరెడ్డి హాస్పిటలు. ఇప్పుడంతా షాపింగ్ కాంప్లెక్స్‌గా మారిపోయింది. రెప్పలార్చుకుని పద్మ ఏదో వెతుక్కుంటుండగానే కారు దాటేసింది.
వీళ్ళు వెళ్ళేసరికి రఘురామయ్య వకీలు ఇంటిముందు లాన్లో కుర్చీవేసుకుని కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. భార్య భారతమ్మ అక్కడే అరుగుమీద కూర్చుని తనూ ఏదో చదువుతోంది. ఆయన్ని చూస్తుంటే తన తండ్రిని చూసినట్టే అనిపించింది పద్మకి. వాళ్ళుకూడా సంతోషపడ్డారు.
“ఎంతకాలానికి పద్మా! పిల్లలూ అంతా బాగున్నారా? వదినమ్మ బాగుందా? నువ్వెట్లున్నవు యుగంధర్? రిటైరయ్యావా?”” ఆత్మీయంగా కుశలప్రశ్నలు వేసాడు రఘురామయ్య. యుగంధర్ ఆయన్తో మాటల్లో పడ్డాడు.
“పెళ్ళిళ్ళలో కల్సుకొనుడు. పైపైన మాట్లాడుకొనుడే. ఎట్లున్నవ్ బిడ్డా?”” పద్మని దగ్గరకి తీసుకుంది భారతమ్మ.
చాలాసేపు మాట్లాడుకున్నారు. మధ్యలో ఆవిడ లేచి వెళ్ళి టీ, కజ్జికాయలు జంతికలు ప్లేట్లలో పెట్టుకుని వచ్చింది. అందరూ తలో కజ్జికాయ తీసుకున్నారు.
“మంచి సెంటర్లో ఇల్లమ్మేసి ఇక్కడుండుడేంది చిన్నమ్మా?”” అడిగింది పద్మ.
“పలిగిన జిల్లేడుకాయ యిత్తులల్లే పిల్లలు తలో దిక్కుకయిన్రు. ఎక్కడివాళ్ళక్కడ ఫ్లాట్లు కొన్నరు. ఇక్కడింత ప్రాపర్టి పెట్టుకుని అప్పులు జేసి అక్కడ కొనుడెందుకని బాబాయ్‍గారు అనబట్టిరి. పొలాలవ్విసుత ఎవరు జేస్తరు? ఎవరు చూస్తరు? రేపు అమ్మాల్నన్న వాళ్లనుండి ఐతదా? అందుకే మాకు కావల్సింది వుంచుకుని ఎవరిది వాళ్ళకు పంచిచ్చేసినం. ఇక్కడ నిమ్మళంగ వున్నం”
“అన్నలు, అక్కలు వచ్చి పోతుంటరా?” ” అడిగింది పద్మ.
“చద్దులకి అందరొస్తరు. ఎవ్వరి బిజీ వాళ్ళది. చిన్నపిల్లలైతె కారు. నువ్వే పెద్దదానివై, మనుమలనెత్తినవంటే వాళ్ళూ అంతెకద? రావల్ననిపిస్తె వాళ్ళే వస్తరు. వదిలైతే పెడ్తలేరు. ఫోన్లుచేస్తరు””
ఇంకాసేపు కబుర్లయాక వెళ్దామని లేచారు పద్మ, యుగంధర్.
“గింత రాత్రేం పోతరు? రాత్రికుండి, పొద్దుగాల పోండి”” అందావిడ.
పద్మ భర్తకేసి చూసింది. అతను అంగీకారసూచకంగా తలూపాడు. మర్నాడు పొద్దున్నే టిఫెన్ తిని బయల్దేరారు. మళ్ళీ వాళ్ళను చూస్తానో లేదో అనిపించింది పద్మకి. మరోసారి చెప్పి కారెక్కింది.
“పదేండ్లల్ల ఎన్ని మార్పులొచ్చినయ్? యాభయ్యైదేండ్ల జీవితం ఒకతీరుగ… ఈ పదేండ్లకాలమొకతీరుగ కండ్లకు కొడ్తున్నది”” అన్నాడు యుగంధర్ దార్లో. పద్మ జవాబివ్వలేదు. ఏదో పోగొట్టుకున్నానన్న భావన ఇంకా బలంగా మారింది.
ఆలేరుదగ్గర ఒక సంఘటన జరిగింది. ఒక ముసలామె గుండెలు బాదుకుంటూ రోడ్డుమీదికొచ్చి వీళ్ళ కారుకి అడ్డమొచ్చింది. యుగంధర్ సడెన్ బ్రేక్ వేసి ఆపాడు. లేకపోతే పెద్ద యాక్సిడెంటయేది. ముసలామె నేలమీద పడిపోయింది.
“ఊళ్ళను కలుపుకుంట హైవేలొచ్చినంక జనాలకు తెలుస్తలేదు. వెనుకటోలె అనుకుంటున్నరు”” అంటూ రోడ్డు దిగి కారాపుకుని తను దిగాడు. పద్మకూడా దిగింది. ఇద్దరూ కలిసి ముసలామెను లేపి, పక్కకు తీసుకెళ్ళారు. దెబ్బలేం తగల్లేదు.
“గట్ల రావొద్దమ్మా! ఎక్కడంటె అక్కడ రోడ్డు దాటొద్దు. హైవేగద, బండ్లు వేగంగ పోతయ్. టక్కరైతది”” అంది పద్మ నెమ్మదిగా.
“నీకెరికైతె ఒక్క ముచ్చట చెప్తవా దొర్సానీ! నా యిల్లేడ బోయె? ఇంటి ముంగల ఏపసెట్టుండేడిది. గా సెట్టేడబాయె? నేనేడున్న?”” అడిగింది ముసలామె ఆమె ముఖంలోకి తేరిపారచూస్తూ. ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు.
ఆమెవాళ్ళెవరేనా వున్నారేమోనని చుట్టూ చూస్తే ఒక యువకుడు పరిగెత్తుతూ వస్తున్నాడు. ఆమె కొడుకు. తిడుతుంటే అర్థమైంది.
హైవే రాకముందు ఇక్కడే ఎక్కడో గుడిసె వేసుకుని వుండేవాళ్ళట. స్వంతమే. గవర్నమెంటు ఇచ్చిన జాగాలోనే. రోడ్డుకోసం మళ్ళీ తీసేసుకుని కొంత డబ్బిచ్చారట. కళ్ళముందే తరాలతరబడి వున్న గుడిసె కూలిపోయేసరికి ఆమె మనసు చెదిరిపోయింది. పద్మ అడిగితే అతను వివరం చెప్పాడు.
ఆమెని జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పి, ఇద్దరూ బరువెక్కిన మనసుతో కార్లో కూర్చున్నారు. ఇల్లు చేరేదాకా ఎవరూ మాట్లాడలేదు. పద్మ అలసటగా పడుకుంటే యుగంధర్ స్విగీకి ఆర్డరు పెట్టాడు. ఆమె అలా డల్‍గా వుంటే అతనికి తోచట్లేదు. ఏదో మాట్లాడదామనుకుంటుంటే ఆమే నోరు తెరిచింది.
“స్పెక్ ఆఫ్ డస్ట్”” అంది.
అతనికర్థం కాలేదు.
“మనిషి”” అంది. అప్పుడర్థమైంది.
“నేనొక్కదాన్నె వున్నూరొదిలి వచ్చిన్ననుకున్న. కాని అందరట్లే వున్నరు. ఎవ్వరు వాళ్ళ వూళ్ళల లేరు. వరంగల్ల వయసుపోరగాళ్ళె లేరు. అందరు ఎక్కడెక్కడికో పోయిన్రు. ఎక్కడ నౌకర్లొస్తె గక్కడికి. ఎట్ల పోయిన్రంటే గాలిదుమారంల దుమ్ముకణం లెక్క. వాళ్ళెనుక వాళ్ళమ్మలునాన్నలు. ఇంకొన్నొద్దులకు వరంగల్ షట్‍డౌన్ ఐతదేమొ”
“…””
“పిల్లలు చదివి పైకొచ్చిన్రంటె సంతోషమే. మనం ఏం పోడగొట్టుకున్నం? పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ. మన ముచ్చట చెప్పేటివి అన్ని. ఒక ముచ్చట జెప్పన? వరంగల్ పెద్దపోస్టాఫీసంటే స్టేషన్‍కు, శివనగర్‍కు, మార్కెట్‍కు లేండుమార్కుండెడిది. మా చిన్నబాపు గదాండ్లనె చేస్తడుగద? ఆఫీసు అడ్రసుకు అమెజాన్ల ఎందో ఆర్డరిచ్చిండట. గా అమెజాన్ పోరడు పెద్దపోస్టాఫీసుకు లేండుమార్కు అడిగిండట. చిన్నబాపు ఇంటికొచ్చి చెప్పుకొని మస్తు బాధపడిండు”
“”…”
“మనకు ముగ్గురు పిల్లలు. ఐనగానీ మనం పోయినంక యుగంధర్‍సారెవరంటే చెప్పెటందుకు ఈడ ఎవ్వరుండరు. వకీల్‍సాబంటె అసుంటాయన మాకెరికలేదంటరు. ఎన్నడో జరిగేటివన్నీ ఇప్పుడే జరిగిపోయినయ్. మనం ఎక్కువకాలం బతికినమా, లేక కాలమే ఇరుకైపోయిందా?ఈ దేశంల పుట్టి తప్పుజేశినమా?” ఆమె కళ్ళలోంచీ నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి.