వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

“ఎందుకే ఆ పురుగునలా గుచ్చుతున్నావు? “కూతురు చేస్తున్న పని చూసి కోప్పడింది వసుధ.
“దాన్ని చూస్తే అసహ్యమేస్తోంది”
“చీపురుతో అవతలికి తోసెయ్. అంతేగానీ అలా చెయ్యకూడదు. పాపం వస్తుంది”
“పాపం అంటే?”
” దేవుడికి కోపమొస్తుంది”
తల్లీకూతుళ్ల సంభాషణ పేపరు చాటునించీ వింటున్న భాస్కర్, పేపరు పక్కని పడేసి, “దేవుడూ లేదు దెయ్యం లేదు. దానికిలాంటి కబుర్లు చెప్పకు”” అని భార్యని కోప్పడి-
“సింధూ! ఇలారా!” అని కూతుర్ని పిలిచాడు.
“అన్నయ్య నిన్ను గిచ్చితే ఎందుకేడుస్తావు?” అనడిగాడు.
““నొప్పెట్టదా?”
” అలాగే ఆ పురుగుకీ నొప్పెడుతుందన్నమాట!”
” పెడితే పెట్టనీ. నాకదంటే అసహ్యం”” నిర్లక్ష్యంగా అంది సింధు. ఖంగుతిన్నాడు భాస్కర్
వసుధ కలుగజేసుకుంది. “మీ “నాస్తికవాదాన్నీ, హేతువాదాన్నీ మీ దగ్గరే వుంచుకోండి. మంచీ చెడూతెలిసే వయసొచ్చేదాకా పిల్లలకి
యిలాంటి భయాలుంచక తప్పదు”” అంది.
అని, “”చెప్పానుగా, దేవుడికి కోపమొస్తుందని?”” కూతుర్ని గద్దించింది.
“దేవుడున్నాడా?” ఆ పిల్ల ప్రశ్న.
“ఉన్నాడు”
“ఎక్కడ?”
“స్వర్గంలో”
“అదెక్కడుంది?”
“మనకి కనిపించనంత దూరాన.అక్కడికి వెళ్లలేము”
“ఎందుకు?
“సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా? అలాగే స్వర్గానికి వెళ్ళలేం”
“ఎవరా దేవుడు?”
“రాముడు” తనకి నమ్మకం వున్న పేరు చెప్పింది వసుధ.
“అల్లా, జీసస్ అనే దేవుళ్ళు కూడా వుంటారట”
“వాళ్ళే కాదు, ఇంకా చాలామంది వుంటారు”
“వాళ్ళెక్కడుంటారు?”
“స్వర్గంలోనే”
“అందరికీ ఒకటే స్వర్గమా? వేరువేరు దేశాల్లాగా వేరువేరు స్వర్గాలు లేవా? వాళ్లు మాట్లాడుకుంటారా? రాముడిది మాత్రమే సంస్కృతం. ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళకి యింగ్లీషు వచ్చా?” కూతురడిగిన ప్రశ్నలకి వసుధ తల గిర్రుమని తిరిగిపోయింది.
సింధు చాలా తెలివైన పిల్ల. అప్పుడప్పుడు అల్లరి పనులు చేస్తుంది. చీమల్నీ పురుగుల్నీ చంపుతుంది. పక్కపిల్లల దగ్గర తనకి నచ్చినవి వుంటే తెచ్చేస్తుంది. ఆ పిల్లకి మంచీ చెడూ చెప్పాలని భార్యాభర్తలిద్దరికీ వుంది. కానీ యిద్దరి ఎప్రోచ్ వేరు. వసుధ దేవుడి పేరు చెప్పి భయపెడ్తుంది. భాస్కర్ రీజనింగ్ చెప్పబోతాడు.
ఆ పిల్ల తల్లి మాటలకే కొద్దిగా భయపడుతుంది. తండ్రి హేతువాదం ఆమెకి అల్లరి చేసేధైర్యాన్నిస్తుంది.
“నన్ను గిచ్చితే అన్నయ్య మీద దేవుడికి కోపంరాదా?” అడిగింది సింధు.
“వస్తుంది. అందుకేగా నిన్ను కొట్టి పొద్దున్న గడప తట్టుకుని పడ్డాడు?”
“ఊహు.. పాపమంటే ఏమిటి?” మళ్ళీ అదే ప్రశ్న.
“తప్పు పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుంది. మనని శిక్షిస్తాడు”
“ఏం చేస్తాడు?”
“కళ్ళు పోతాయి”
“అమ్మో!!”
అప్పటికి తను కావాలనుకున్న ఎఫెక్టు సింధులో తేగలిగింది వసుధ. మనుషుల మనస్తత్వాలు పుట్టినప్పట్నుంచీ వెల్లడౌతూనే వుంటాయి. కొందరిలో స్వార్థం, యింకొందరిలో ప్రేమ, మరికొందరిలో కపటం..యిది వస్తుతః వుంటూ పరిసరాలనీ పరిస్థితులనీ బట్టి మరుగునపడటమో వ్యక్తమవటమో జరుగుతుంటుంది. సింధులో స్వార్థం ఉంది. అది స్వార్ధమని తెలీని పసితనం. తన కూతురనే మమకారపు ముసుగులోంచీ కూడా వసుధ దాన్ని గుర్తించింది. ఇదివరకు మనిషిని ఇల్లూ, తల్లిదండ్రుల సాన్నిహిత్యం ప్రభావితం చేస్తే ఇప్పుడు బైటివెన్నో తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. టీవీ ముఖ్యంగా. ఏది తప్పో, ఏది వప్పో తెలిసే వయసు, విచక్షణ వచ్చే లోగానే అవి మనిషి మీద తమ ముద్రని వేసేస్తున్నాయి. ఆ ముద్ర నేపథ్యంలోంచే ఏ విలువేనా ఆవిష్కరించబడేది.
సింధుని ఆటకి పంపించి, భర్తతో కొంచెం కోపంగానే అంది వసుధ. “”మా యింట్లో నన్ను దేవుడూ, పూజలూ, పాపపుణ్యాలనే వితరణతోనే పెంచారు. మీతో పెళ్ళయ్యాక ఓ పూజలేదు, పునస్కారం లేదు. నేను నమ్మే విషయాలు పిల్లలకి చెప్పగలనుగానీ నాకు నచ్చనివీ, తెలీనివీ ఎలా చెప్పగలను? లోకానికి భిన్నంగా వెళ్తానంటే ఎలాగండీ? అక్కడ మీ నాన్నగారూ అమ్మగారూనైతే నేనేదో మిమ్మల్ని మార్చేసాననుకుంటున్నారు. వాళ్ళిక్కడికి రారు. వాళ్ళే కాదు, మీవాళ్ళు యింకెవరేనాగానీ, మా అమ్మావాళ్ళూగానీ యిక్కడికి రారు. దేవుడి పటం లేని యిల్లు వాళ్ళకి నచ్చదు. ఎవరూ రాకుండా ఎక్కడికీ వెళ్ళకుండా పండుగలూ వేడుకలూ ఏవీ లేకుండా ఈ బతుకు నావల్లకాదు. ఇహమీదటైనా మీ పద్దతులు మార్చుకుంటే సంఘంలో కలుస్తాము”ఆమె మాటల్లో విసుగూ వేదనా వున్నాయి. నిరసన వుంది.
భాస్కర్ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళలో నీలినీడలు. ముఖంలో బాధా వీచికలు. చిరు అలల్లాంటి ఏవో జ్ఞాపకాల ప్రకంపనలు. ఏ మనిషీ తనుగా తనే తయారవడు. తయారుచేయబడతాడు. అలా తయారుచేయబడ్డ అతనికి గతం బాధాకరంగా వుంటే ఆ బాధ జీవితమంతా వెంటాడుతునే వుంటుంది. వర్తమానం ఎంత ఆహ్లాదకరమైనా, ఆ గతం అతని చర్మంలో భాగంలాగా, వంటిరంగులాగా శాశ్వతం.. భాస్కర్‍కి అలాంటి గతం వుంది.
ఆ రాత్రి అతను తింటున్నప్పుడు అన్నం మెతుకులు మేకుల్లా అనిపించాయి. సగంలోనే కంచం ముందునుంచి లేచాడు. తన మాటలతన్ని హర్ట్ చేసి వుంటాయనుకుంది వసుధ. కానీ కాఠిన్యాన్ని వదల్లేదు. తను తగ్గితే, కఠినత్వాన్ని వదిలిపెడితే అతను మారడు. కంచంలో అన్నం వదిలేసి లేచిన భాస్కర్‍కి యింక యింట్లో వుండాలనిపించలేదు. అలా బైట తిరిగొస్తానని బయల్దేరాడు. సందుమలుపులోనే యాక్సిడెంటైంది. అన్యమనస్కంగా నడుస్తున్న అతన్ని వెనకనుంచి ఆటో వచ్చి కొట్టింది. బాగానే దెబ్బలు తగిలాయి. ఇంటి దగ్గర్లోనే కాబట్టి వెంటనే తెలిసినవాళ్ళెవరో చూసి వసుధకి చెప్తే ఆలస్యం చెయ్యకుండా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.
యాక్సిడెంట్‍కి కారణం అతను దేవుణ్ణి నమ్మకపోవడం, వెంటనే వైద్య సహాయం అంది, బ్రతికి బైటపడటం తనకి దేవుడిపట్ల గల నమ్మకం వలన అని సింపుల్‌గా ఎనలైజ్ చేసుకుంది వసుధ.
స్ట్రెచర్ మీద తండ్రిని చూసి, వుదయం తల్లి చెప్పిన మాటలు గుర్తుంచుకుని, సింధు అడిగిన మొదటి ప్రశ్న, “నువ్వెవరిని కొట్టావు నాన్నా?” అని. స్పహ తప్పబోతున్న క్షణంలో భాస్కర్‍కి ఆ ప్రశ్న వినిపించింది. ఒక చిరునవ్వు పెదాల మీద కదిలింది. తర్వాత కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వసుధ కూడా ఆ ప్రశ్న వింది. తనున్న వుద్వేగపు పరిస్థితిలో పెద్దగా పట్టించుకోలేదు కానీ అదామెని నిశ్శబ్దంగా వెంటాడుతూనే వుంది. అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసికెళ్ళారు. మనసు లోపలా, చుట్టూ బయటా అలుముకున్న వంటరితనంలో ఆ ప్రశ్న తన నిశ్శబ్దపు కవచాన్ని పగలగొట్టుకుని బహిర్గతమైంది.
తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడని చెప్పింది తను. భాస్కర్ ఏ తప్పు చేసాడు? దేవుణ్ణి నమ్మకపోవటం అనే జవాబు చెప్పుకుంది. కానీ దేవుణ్ణి నమ్మిపూజలు చేసేవాళ్ళకి కూడా యాక్సిడెంట్లు ఔతున్నాయి. కష్టాలొస్తున్నాయి. అదెందుచేత?…పూర్వజన్మలో చేసుకున్న కర్మ అని ధర్మశాస్త్రాలు చేస్తాయి. ఆ జన్మలో వాళ్ళు చేసిన పాపకర్మలకి నిష్కారణంగా యింకెవరో బలౌతారు. అదెందుకంటే ఆ బలైనవాళ్ళు యింకేదో జన్మలో చేసుకున్న పాపానికి అనేది జవాబు. ఇదంతా ఎప్పటికీ సెటిల్ కాని అకౌంటు. ఎవరూ జవాబుదారీ తీసుకోని అంటే ఎలాంటి జవాబుదారీ లేని వ్యవహారం . అందుకే భాస్కర్ ఈ ఎకౌంటునీ దాన్ని నిర్వహించే దేవుళ్ళనీ నమ్మనిది. వసుధలో చిన్న కుదుపు.
” నీకు నువ్వు నిజాయితీగా ఉండు. తోటివారితో మంచిగా వుండు” అంటాడు. అలాగే వుంటాడు. వసుధకి అతడి భావప్రపంచంలోకి ప్రవేశించడానికి సన్నటి సందు దొరికింది.
భాస్కర్ డిశ్చార్జవడానికి పదిరోజులు పట్టింది. ఇంటికొచ్చాక కూడా మరో నెల రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాడు డాక్టరు. తండ్రి ఎవర్ని కొడితే యిలా దెబ్బలు తగిలాయన్న ప్రశ్నకి జవాబు వెతుక్కుంటూనే వుంది సింధు. అతడికి పూర్తిగా నయమవాలని ముక్కోటిదేవుళ్ళకి మొక్కుకుంది వసుధ. ఆ మొక్కులు తీర్చుకోవటానికి పుట్టింటికి వెళ్ళాలనుకుంది.


“ఆస్తికత్వం, నాస్తికత్వం అనేవి మనిషి నమ్మకం అనే నాణానికి రెండు ముఖాలు. ఆస్తికుల మధ్యనుంచీ నాస్తికుడు, నాస్తికుల మధ్యనుంచీ ఆస్తికుడూ పుట్టుకొస్తారు. పెచ్చుపెరిగిన కర్మకాండలని నిరసిస్తూ బుద్ధుడూ, బౌద్ధం వెర్రతలలు వేస్తున్నప్పుడు ఆదిశంకరులూ పుట్టుకొచ్చారు. ఏదైనా అతిగా వున్నప్పుడు దానిపట్ల విముఖత మొదలౌతుంది ” అన్నాడు భాస్కర్ తనకి యాక్సిడెంటైనరోజునుంచీ వసుధ పడుతున్న మధనని గుర్తించి. స్పృహ వుండీలేని స్థితిలో కూతురడిగిన ప్రశ్న స్మృతిపథంలోంచీ తప్పిపోలేదు.
“నా చిన్నప్పుడు.. అంటే మా తాతగారి హయాంలో నాన్న, పెదనాన్న, బాబాయిలు అందరం కలిసి ఒకే కుటుంబంగా వుండేవాళ్ళం.పెద్దవాళ్ళూ, చిన్నపిల్లలూ, వచ్చిపోయే బంధువులు అంతా కలిసి పూటకి నలభైయాభై విస్తర్లు లేచేవి. నిత్యాగ్నిహోత్రం వుండేది. ఎప్పటికీ ఏవోపూజలు, నోములు, వ్రతాలు. అమ్మావాళ్ళూ వంటింట్లో గాడిపొయ్యిల మీద కాగుతున్న గంగాళాల మధ్య తామూ గంగాళంల్లా వుండేవారు. తడిబట్టలతో వంట” అతను చెప్పినదాన్ని విస్మయంగా వింటోంది వసుధ. ఆమె ప్రత్యక్షంగాచూడలేదుగానీ ఎన్నో వెనకటి బ్రాహ్మణ కుటుంబాలలో యిది సర్వసాధారణ దృశ్యమని తెలుసు.
“మధ్యాహ్నం ఏ రెండింటికో మూడింటికో పూజలయేవి. మగవాళ్ళు మొదట భోంచేసేవారు. తరువాత తినేవాళ్ళకి వుందో లేదోననేనా
చూడకుండా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడూ సుష్టుగా భోంచేసేవారు. తర్వాత పిల్లలవంతు. అడుగు బొడుగూ వూడ్చి మాకు వేసాక అమ్మావాళ్ళకి ఏం మిగిలేవో నాకైతే తెలీదు. మాలో కొందరు పిల్లలం నచ్చినదేదైనా వుంటే యింకా వెయ్యమని అడిగేవాళ్ళం. కాస్త మంకు కూడా చేసేవాళ్ళం. అమ్మావాళ్ళూ ఏం చెయ్యలేక మా వీపులు పగలగొట్టేవారు. తర్వాతి అధ్యాయం ఏమిటో తెలుసా? కిందపడి దొర్లుతూ ఏడ్చి గొడవ చెయ్యటం”
భాస్కర్ గొంతు వణికింది. అతని చూపులు బాహ్య ప్రపంచాన్ని వదిలి పెట్టిమనో దృష్టిననుసరించి గతాన్ని అన్వేషించటం మొదలుపెట్టాయి. వసుధ మనసు విహ్వలమైంది.
“ఒక్కో పండుగ వస్తే అప్పటిదాకా నిండుగా వుండే అమ్మల మెడలు బోసిపోయేవి. పసుపుకొమ్ము కట్టుకుని పుస్తెలు తీసిస్తే వాటిని తాకట్టుపెట్టి పూజలు చెయ్యటం ఈ మౌఢ్యానికి పరాకాష్ఠ. పూజలు మానేస్తే నలుగురూ ఏమైనా అనుకుంటారనేగానీ, పుస్తెలమ్మి వీళ్ళు చేసే పూజలు మరింత నగుబాటనిగానీ, అలా వీళ్ళు పెట్టే నైవేద్యాలు దేవుడు స్వీకరిస్తాడాని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు”
వసుధకి కఠినంగా రాయిలా వుండే అత్తగారి ముఖం గుర్తొచ్చింది. ఎన్ని చేదు అనుభవాలు ఆవిడనలా మార్చేయోననిపించింది.
“ఇల్లెప్పుడూ జాతరలా వుండేది. ఇంట్లో ఎవరికీ చదువుల్లేవు. అనువైన వాతావరణం, ప్రోత్సాహం, అవకాశాలు లేక చదువులు రాలేదు. చదువుల్లేక వుద్యోగాల్లేవు. ఆదాయం లేదు. వందల ఎకరాలు తరిగి తరిగి పదుల్లోకి దిగి యింకా శుష్కించిపోయాయి. అమ్మల వంటిమీద వుండే కంటెలూ, కాసులపేర్లూ వాళ్ళ పుట్టిళ్ళవాళ్ళు ఇచ్చినవి… నిస్సిగ్గుగా కాళ్ళొచ్చి కదిలిపోయాయి. ఎన్ని కన్నీళ్లు.. ఎన్ని వేదనలు.. ఎంత దు:ఖం? ఎన్ని జ్ఞాపకాలు? వసుధా! ఈ రోజున మనింట్లో ఒక్క దేవుడిపటం పెడితే ముక్కోటిదేవుళ్ళని తోడ్కొని వచ్చి వాళ్ళకి ఘనంగా సేవలు చెయ్యటానికి మావాళ్ళంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ భక్తి ప్రభంజనంలో నువ్వూ నేనూ గడ్డిపరకల్లా కొట్టుకొని పోవాల్సిందే!”
“…”
“నాకప్పుడు పదహారేళ్ళేమో! ఒక చెల్లి వుండేది. స్వంత చెల్లి కాదు. పెద్దమ్మ కూతురు. రెండేళ్ళుదానికి. వాళ్ళకి పెళ్ళైన ఎన్నో యేళ్ళకి, ఎన్నో ఎబార్షన్ల తర్వాత పుట్టింది. చాలా బలహీనంగా వుండేది. కానీ దాని కళ్ళెంత అందంగా వుండేవో తెలుసా? నవ్వుతుంటే మెరిసేవి. నాకు అదంటే చాలా యిష్టం. వదలకుండా ఎత్తుకుని తిరిగేవాడిని. కానీ దానికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం”
వైవాహిక జీవితంపట్ల అవగాహన లేని, ఫామిలీ ప్లానింగ్ తెలీని ఆరోజుల్లో, అధికసంతానం, అబార్షన్లు, అలాంటి పిల్లలు చాలా కామన్. అలాంటి అల్పాయుష్క శిశువుల్లో ఏదో ఒక బలమైన ఆకర్షణ వుండటం… వాళ్ళు జీవితకాలపు జ్ఞాపకాలుగా చుట్టూ వున్నవారిని వెంటాడటం సృష్టి వైచిత్రి. ఆ పసిదాని ప్రభావం భాస్కర్ మీదా వుందా? ఎంతవరకు? వసుధ అతన్ని లోతుగా చూసింది.
“ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. వ్రతం పూర్తయ్యేసరికి మూడైంది. తాతయ్యావాళ్ళ భోజనాలయ్యేసరికి యింకో గంట. అందరూ ఆకలికి నకనకలాడుతున్నాం. పిలవగానే భోజనాలకి పరిగెత్తాం. చెల్లి నిద్రపోతోంది. ఎప్పుడు నిద్రలోంచి లేచి పాకుతూ వచ్చిందో కిందపడ్డ మెతుకుల్ని ఏరుకుని తింటోంది. తాతయ్య ఏదో మూలనించీ చూసి వచ్చి, అమాంతం దానివీపుమీద ఒక్కటి చరిచాడు. అంత దెబ్బ.. అది బిక్కచచ్చిపోయింది. ఏడవాలని తెరిచిన నోరు చాలాసేపటికిగానీ మూతపడలేదు. గుక్క తప్పింది. పెద్దమ్మ మడి. ఎక్కడో వుంది. నేను వడుగైన వాడిని. కంచం ముందునుంచీ లేవకూడదు. వసుధా! అది ఆరోజునే చచ్చిపోతుందనుకున్నాం. కానీ బతికింది. ఐతే ఎన్నాళ్ళో బతకలేదు. మూడోయేట చచ్చిపోయింది. దానిమీది బెంగతో మంచంపట్టి పెద్దమ్మ మరో ఆర్నెల్లకి పోయింది. పెద్దనాన్న యిల్లొదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు మొదలైంది. నాలో ఆలోచన”
అనారోగ్యం వలన బలహీనంగా వున్న అతని శరీరం భావోద్వేగాలని తట్టుకోలేకపోతోంది.నుదురంతా చెమటలు పట్టాయి. కళ్ళు అలసటగా
వాలిపోయాయి. అతన్ని తాకి చూసిందామె. చల్లగా వుంది శరీరం. తరతరాల మూరత్యం. జీర్ణించుకుపోయిన సంస్కృతినుంచీ తనని తాను కాపాడుకుందుకు అతను తన భావాలన్నీ ఘనీభవింపజేసుకున్నాడు. ఇప్పుడా ఘనీభూతశిల కొద్దిగా కరగటం ప్రారంభించేసరికి అలా వున్నాడు.
“ఎవరీ రాముడు? ఎవరీ దేవుడు? ఆయన్ని కొలవాలంటే ఈ ఆర్బాటమంతా అవసరమా? అతడి అనుగ్రహంకోసం యింత క్షోభపడాలా? మనిషి శరీరంలో వుండే ఆత్మారాముడిని యింతగా బాధించాలా? ఇంతమంది యిన్ని విధాల బాధపడుతుంటే పుణ్యం వస్తుందా? వస్తే అదెలాంటి పుణ్యం? దాన్నిచ్చే దేవుడెలాంటివాడు? పగలూ రాత్రీ చెల్లి జ్ఞాపకాలే” భాస్కర్ కళ్ళలోంచీ కన్నీళ్ళు కారుతున్నాయి.
“అన్నా! దా…దా…” అని తన చిట్టిచేతుల్తో నన్ను పిలుస్తున్నట్టే వుండేది. దాన్ని ఎత్తుకున్న స్పర్శ.. దాని జ్ఞాపకాలు.. నన్ను నిరంతరం వెంటాడేవి. నేనిలా వుంటే నాకేదో గాలీ ధూళీ సోకాయని యింట్లో పూజలు మొదలయాయి. ఎదుటిమనిషి బాధనీ కష్టాన్నీ అర్ధం చేసుకోలేని… బాధాపరితప్తుడికి స్వాంతన యివ్వలేని ఆ పూజల, మంత్రతంత్రాల చదువులెందుకు? లేకలేక పుట్టిన ఆ పిల్లని పెద్దమ్మా, పెదనాన్నా గుండెల్లో దాచుకుని అపురూపంగా పెంచుకుని వుంటే అది బాలారిష్టాల్లోంచీ బైటపడి వుండేదేమో! ప్రతిక్షణం ఈ రకమైన ఆలోచనల్తో సతమతమయ్యేవాడిని. స్థలం మారిస్తే నాలో మార్పొస్తుందని నా మేనమామలు వచ్చి నన్ను తీసికెళ్ళారు. వాళ్ళెవరికీ మానాన్నన్నా, తాతయ్యన్నా గౌరవం లేదు. కుటుంబగౌరవం చూసి మా అమ్మనిచ్చారు. ఇచ్చాక పశ్చాత్తాపపడేవారు. ఆడపిల్లని ఎంత అపురూపంగా పెంచుకున్నా పని నేర్పకుండా వుండరు. కానీ అదెలాంటి పని? మనసుకి ఆహ్లాదాన్నివ్వాలి. శరీరానికి దారుఢ్యాన్నివ్వాలి. అర్ధవంతంగా వుండాలి. జీవితాన్ని ప్రగతివైపు, పరిపక్వతవైపుకి తీసుకెళ్ళాలి.అలాంటివేవీ లేని పని యంత్రంగా మారిపోయిన అమ్మని చూసి వాళ్ళు దుఃఖపడేవారు” భాస్కర్ ఆగాడు.
భాస్కర్ కూడా మారాడు. మారటానికి సంఘర్షించాడు. మారాక వసుధకి పరిచయమయ్యాడు. అప్పుడు ఆకర్షణలా కనిపించిన మార్పు ఇప్పుడు సమస్యగా కనిపిస్తోంది. అతని శైలితో ఆమె యిప్పుడు సంఘర్షిస్తోంది.
“నిజాయితీని మించిన దేవుడు లేడు. మానవత్వాన్ని మించిన పూజ లేదు. దేవుడేనా చెప్పేది అదేగా? ఎందరు ఆచరిస్తున్నారు? ఆచరించనివాళ్ళకీ పూజలెందుకు? ఆత్మవిశ్వాసం లేనివారికి ఎవరిదో సాయం కావాలి. తప్పులు చేసేనాడికి పరిహారం స్వీకరించి క్షమించేవాడు కావాలి. బాధ్యతలుగలవాడికి వాటినించి తప్పుకోవడానికి అనువైన పలాయన మార్గం కావాలి. వీళ్ళంతాఒక మిస్టర్ నోబడీని సృష్టించుకున్నారు.”
“అంటే దేవుడే లేడంటారా?”వుక్రోషంతో అడిగింది వసుధ.
అతనికి కొన్ని చేదైన అనుభవాలు వుండవచ్చు. కానీ ఆ అనుభవాలతో సిద్దాంతీకరణ చేస్తే ఎలా? అని ప్రశ్నించుకుంది. ఐతే భాస్కర్ ఆమె వుక్రోషాన్ని పట్టించుకోలేదు. సింధు ప్రశ్న నేపధ్యంలో మృత్యుముఖం దాకా వెళ్ళి వచ్చిన అనుభవాన్ని తనకున్న జ్ఞానంతో విశ్లేషిస్తున్నాడు. ఎప్పట్నుంచో బంధించి వుంచిన భావాలు పంజరంలోంచీ బైట పడ్డ పక్షుల్లా అతని గొంతులోంచి బైటికొచ్చేస్తున్నాయి. ఆ క్షణాన అతను వాటి మీద అదుపుని కోల్పోయాడు.
“నాకు యాక్సిడెంటవటానికి కారణం, లక్షలు పెట్టి యిల్లు కట్టించుకున్న మనం మన సేఫ్టీ కోసం అడుగు డ్రైనేజీ కాలువా, ఐదడుగుల పేవుమెంటూ వేసుకోకుండా ప్రభుత్వం వచ్చి వెయ్యాలని ఎదురుచూడటం. సమయానికి వైద్య సహాయం అందటం అదృష్టం కాదు. అలాంటి వ్యవస్థని ఏర్పరుచుకోకపోవటం మన దురదృష్టం. హాస్పిటల్లో నన్ను జేర్చి నువ్వు అన్ని మొక్కులు మొక్కడానికి కారణం డాక్టర్లపట్ల నీలో విశ్వాసం లేకపోవటం. వసుధా! ఇకపోతే దేవుడు.. వున్నాడు. నీ కష్టాలకీ బాధలకీ ఆయన్ని బాధ్యుడిని చేయకు. నీలోని అంతర్గత బలంగా నిలుపుకో. ఏడ్చేవాళ్ళ కన్నీళ్ళు తుడు.. నీలోనే నీకు కనిపిస్తాడు ఆ దేవుడు. నా చెల్లిలాగా ఆదరణకి నోచుకోని ఎందరో పిల్లలు…” అని ఆగిపోయాడు. అలసటగా దిండుమీదికి వరిగిపోయాడు. కనుకొలుకుల్లోంచి నీళ్ళు జారి దిండులో పడి ఇంకిపోయాయి. ఎప్పుడో చనిపోయిన ఆ పసిపిల్ల రూపం అతని కళ్ళముందు కదిలింది. ఆతృతగా చెయ్యి చాపాడు. చేతులకేమీ అందలేదు. మనోదృష్టికీ, బాహ్యదృష్టికీ గల భేదం స్పష్టమైంది.
వసుధ అతన్ని వోదార్చాలనుకుంది. ఎలా వోదార్చాలో తెలీలేదు. అతని చెల్లెల్ని తెచ్చివ్వగలదా? ఆ పిల్ల మరణం అతని గుండెకి చేసిన గాయాల్ని మార్చగలదా? శుష్కప్రియాలెందుకనిపించి వచ్చి కారిడార్లో నిలబడింది. ఆమె గుండెల్లోకూడా ఆవేదన ఏదో సుళ్ళు తిరగడం ప్రారంభమైంది. నీతిగా నిజాయితీగా వుండమని కోరుకుంటున్నాడతను. నిష్కపటంగా హేతుబద్ధంగా వుండమంటున్నాడు. కొంత వోపికతో పిల్లలకి అతని భావాలని ఎందుకు పరిచయం చెయ్యలేకపోతోంది? సింధు అడిగిన ప్రశ్నకి జవాబేది? జవాబుకోసం దాన్ని మరింత మూఢత్వంలోకి నెట్టాలా? దాని ప్రశ్న అతన్నెంతగా బాధపెట్టిందో. అందుకే ఎప్పుడూ లేనిది మనసంతా తెరచి తనముందు పరిచాడు!


భాస్కర్ తల్లిదండ్రులు అతన్ని చూడటానికి రాలేదు. అతనే తగ్గాక వసుధనీ పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. సగం కూలిన ఆ యిల్లూ..ఆ యింటి మొండిగోడలూ వసుధని తీవ్రంగా కదిల్చాయి. శిధిలమైనది ఆ యిల్లొకటే కాదు, తమ సంస్కృతి కూడా అనిపించింది.
“ఆ అప్రాచ్యుడెందుకొచ్చాడట?” అన్నాడు భాస్కర్ తండ్రి అనటమే కాదు, “”వాడున్నంతసేపూ నేనింట్లో వుండను. వెళ్ళాక కబురు చెయ్యి వస్తాను” అని భార్యని కేకేసి చెప్పి బైటినుంచీ బైటికే వెళ్ళిపోయాడు. ఆయనలో కాఠిన్యం తప్ప కరుణ, వాత్సల్యం అనేవి ఏ కోశానా కనిపించలేదు. మృత్యువుని స్పృశించి వచ్చిన కొడుకు మీద కూడా కోపమేనా? ఒక్కసారి పలకరిస్తే అతనికెంత ఓదార్పుగా వుంటుంది? బాధనిపించింది.
“అప్రాచ్యుడంటే ఏమిటి నాన్నా? ” అని పట్టుకుంది సింధు.
భాస్కర్ నవ్వి చెప్పాడు. “”మనది ప్రాచ్యసంస్కృతి. పూజలూ, దేవుళ్ళూ అవీ వుంటాయి. అమెరికా, యింగ్లాండులాంటి దేశాలు పశ్చిమదేశాలు. పశ్చిమం అంటే ప్రాచ్యం కానిది. నేను పూజలవీ చెయ్యనుగా, అందుకే అలా తిట్టాడు””
భాస్కర్ తల్లి అతన్ని దగ్గరగా తీసుకుని “”ఇప్పుడు నీ ఆరోగ్యం సరిగా వుందట్రా?”” అని అడిగి, “వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నాను నీకేమీ కారాదని”” అంది గద్గదస్వరంతో.
తర్వాత వసుధతో,” కనీసం దేవుడికి దీపమేనా పెట్టుకోమ్మా!” అంది బాధపడూ. వసుధ తల దించుకుంది. మనవడినీ మనవరాలినీ దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకుందావిడ.
నిత్యపూజలూ సంస్కారాలతో తిరిగే మిగిలిన కొడుకులకన్నా భాస్కర్ ఆమెకి భిన్నంగా అనిపించి, అతన్లో ఏదో ఆకర్షణ కనిపించింది. అన్నిరోజుల అనారోగ్యం తర్వాత కూడా అతన్లో కనిపిస్తున్న చురుకుదనం, కళ్ళకాంతీ ఆవిడని చకితురాలిని చేసాయి. ఇతడు తన కొడుకేనా అన్న దిగ్ర్భాంతీ, అతడి మార్గమే సరైనదేమోనన్న ఆలోచనా ఆవిడని వుక్కిరిబిక్కిరి చేసాయి. తండ్రీకొడుకుల మధ్య గల వైషమ్యాల వలన కొడుకుని ఈ మధ్యకాలంలో యింత దగ్గరగా చూసుకోలేదు. మనసు పులకించిపోయింది. తనే వెళ్ళి వాళ్ళకి మంచినీళ్ళు తెచ్చిచ్చి, వంటప్రయత్నాలు మొదలు పెట్టింది.
పక్కింట్లోంచీ చాటుగా బియ్యం అప్పు తీసుకురావటం వసుధ దృష్టిని దాటిపోలేదు. భాస్కర్ చూసాడో లేదో ఆమెకి తెలీదు. వంటైంది. కలుగుల్లోని ఎలకల్లా ఆ యింటి మొండిగోడల మధ్యనుంచీ బిలబిల్లాడుతూ అంతా వచ్చేసారు. వాళ్ళంతా భాస్కర్‍కి అన్నదమ్ములూ,వాళ్ళ పిల్లలూ, యింకా బంధువులు. పల్లెటూరి పెంపకాలు. వదినలు భాస్కర్ని అంటీముట్టనట్టు పలకరించారు. వసుధే చొరవ తీసుకుని వాళ్ళతో మాట్లాడింది. భోజనాలయ్యాయి. అంతా మామూలుగానే తిన్నారు. వసుధకి ముద్ద దిగలేదు. అప్పు తెచ్చుకుని వండుకున్న బియ్యపు అన్నం.. మెతుకులు మేకుల్లా మారి గొంతులో గుచ్చుకుంటున్న భావన.
“ఏం చేస్తున్నావురా?” తమ్ముడిని అడిగాడు భాస్కర్. అతడు తలెగరేసాడుగానీ జవాబివ్వలేదు.
“ఇంటరు రెండుసార్లు తప్పేడు”” ఇంకెవరిదో జవాబు.
“పద్యాలు, పాటలు పాడుకుంటూ పూజలు చేసుకుంటూ తిరిగితే బతగ్గలిగే రోజులు కాదురా యివి. కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టు. పైకొస్తావు” భాస్కర్ తమ్ముడికి నచ్చజెప్పబోయాడు.
“అన్నీ నువ్వొదులుకున్నావు చాలదా? వాడిని కూడా ఎందుకు చెడగొడ్డావు? జంధ్యం తెంపుకున్నవాడివి. నీకు మమకారాలేం తెలుస్తాయి? మేమంతా వుండి వాడినొదిలేస్తామా? మాలాగే వాడూనూ”” దెబ్బలాడాడు భాస్కర్ పెద్దన్న.
“నమ్మకం లేక నేను వదులుకున్నాను. నమ్మకం వుంటే అదీ యిదీ కూడా నడుస్తుంది” అన్నాడు భాస్కర్. ఇంక చర్చ సాగలేదు.
సాయంత్రం తిరుగు ప్రయాణమయారు. అంతసేపూ అతని తండ్రి యింటికి రాలేదు. అన్నం తినలేదు. ఆయన తినకుండా తను తినలేనని భాస్కర్ తల్లీ తినలేదు. వసుధ మనసునిండా అసంతృప్తి. బస్ ఛార్జీలకి వుంచుకుని జేబులో వున్న డబ్బంతా తీసి తల్లి చేతిలో పెట్టాడు భాస్కర్.
“నువ్వొక్కడివి ప్రయోజకుడివయావు ” అందావిడ కళ్ళనిండా నీళ్ళతో. “నెలంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు… నీ భార్యాపిల్లలకి చెందాల్సినదానిని ఈ గుండంలో పోస్తున్నావు”” ఆవిడ కళ్ళలో నీళ్ళు చెంపలమీదికి జారాయి. “”వద్దనీ అనలేను. ఊర్నిండా అప్పులు. బతికి చితికిన వాళ్ళమని దయతల్చి యిస్తున్నారు. తిరిగిస్తే తీసుకుంటున్నారు. లేకపోయినా అడుగరు. అంతకన్నా యాచన మేలు. అలాగని యాచనకి దిగజారలేముగా?” అని కన్నీళ్ళు తుడుచుకుంది.
వసుధ వంగి ఆవిడ కాళ్ళకి నమస్కరించింది. ఆవిడ బొట్టు పెట్టి ఎవరో యిచ్చినని రెండు అరటిపళ్ళు బుట్టలో వుంటే తెచ్చి యిచ్చింది.
బస్టాండుకొచ్చి కూర్చున్నారు. వసుధ మనసు బరువెక్కింది. అలాంటి బరువుకి అలవాటుపడ్డ భాస్కర్ పైకి ప్రశాంతంగానే వున్నాడు.
బస్టాండంతా చీదరగా వుంది. వసుధకి కడుపులో దేవింది. ఇద్దరు ముష్టిపిల్లలు వచ్చి కాళ్ళకి చుట్టుకున్నారు. భాస్కర్ జేబులో చెయ్యి పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అతడి భావం అర్ధమైన వసుధ అత్తగారిచ్చిన అరటిపళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ అలా చేసినందుకు అతనేమైనా అనుకుంటాడేమోనని భయపడింది. అతని ముఖం ఎర్రబడింది. అందుకు కాదు.
“ఈ దేశంలోని సోమరిపోతులందరికి తిండిపెట్టేది యిలాంటి పసికూనలే” వ్యంగ్యంగా అన్నాడు. “”తాతలిచ్చిన వందల ఎకరాలని దర్జాగా ఖర్చు చేసి చేతులు దులుపుకుని కూర్చున్నాడు మానాన్న. మిగిలినవాళ్ళం దాని పర్యవసానాన్ని అనుభవిస్తున్నాం. ఆర్గనైజింగ్ కెపాసిటీ వున్నవాళ్ళ దగ్గర డబ్బు పోగుపడ్తుంది. దాన్ని ప్రొడక్టివ్ యిన్వెస్టుమెంటు చెయ్యాలి. అలాంటి స్కిల్ లేని పాతికమంది బతుకుతారు. బిర్లాలూ, అంబానీలు భజన్లు చేస్తూ కూర్చునుంటే దేశం సన్యాసుల మఠమయేది. నూటికి ఒకరో యిద్దరో ప్రొడక్టివ్ వర్కు చేస్తూ వుంటే మిగిలినవాళ్ళు వాళ్ళ కష్టాన్ని స్పెక్యులేట్ చేసుకుని బతుకుతూ ఆ పాపాన్ని కడుక్కోవడానికి గుడికెళ్తున్నారు. ఏ కోరికా లేకుండా గుడికెళ్ళే వాళ్ళెందరో చెప్పు?”” అన్నాడు.
“ఐతే మాత్రం?” అడిగిందామె. “భక్తి మన జీవితంలో భాగం. అది వుంది కనుకనే పాపపుణ్యాలకి ఆగుతున్నాం”
అతనే కొంచెం తగ్గాడు. “”ఇదంతా ఎందుకు?దేవుడు అక్కడెక్కడో అందంగా స్వర్గాన్ని నిర్మించుకుని హాయిగా వుంటున్నాడే అనుకుందాం. మనని రానిస్తాడంటావా? చుట్టూ వున్న ఈ చిన్ని ప్రదేశాన్నే అందంగానూ ఆహ్లాదంగానూ వుంచుకోలేని మనని ఎన్ని పూజలు చేసి ఎంత వేడుకున్నా కానీ? ఆయన స్వర్గం పాడైపోదూ?” అన్నాడు గొంతు తగ్గించి పరిహాసంగా.
వసుధ నవ్వేసింది.
“నాన్నా, ఐతే మనని దేవుడు స్వర్గానికి రానివ్వడా?” అడిగింది సింధు చప్పుని.
“ఇలా వుంటే… ” అని చుట్టూ చూపించి, “అలా ఆ పిల్లలని వదిలేస్తే ఎలా రానిస్తాడు?” అంది వసుధ సగం అతని దార్లోకి వచ్చి.
(ఆంధ్రభూమి 2005)