సరైన న్యాయం by Tulasi Bhanu

  1. తోడబుట్టిన బంధం by Tulasibhanu
  2. సరైన న్యాయం by Tulasi Bhanu

న్యాయమూర్తి ప్రకాశరావుకి, ఆ రాత్రి పూట నిద్ర పట్టక ఉయ్యాలకుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. మనవడి వయసుండే సంజయ్, మనవరాలి వయసుండే మీనా ఇద్దరికీ సరైన న్యాయం జరగాలికదా అని. తగిన శిక్ష అనుకుని సంజయ్‍కు ఏడేళ్ళ కారాగారవాసం విధిస్తే, నవయవ్వనంలో ఉన్న అతడు ఓ ఏడేళ్ళు లోకానికి దూరంగా కారాగారంలో మగ్గిపోవాల్సిందేగా అని కాస్తంత ఆలోచనలో ఉన్నాడు.
కానీ సంజయ్ మానసికరోగంవలన మీనా నరకం చూసింది. మీనాపరంగా చూస్తేకూడా సంజయ్ శిక్షార్హుడే అని బలంగా అనిపిస్తోంది.
కొంతకాలంక్రితం మీనా, సంజయ్ ఒకేచోట ఎదురుబొదురు బ్లాక్స్‌లో ఉండే ఫ్లాట్స్‌లో ఉండేవాళ్ళు. మీనా బెడ్‍రూమ్, బాల్కనీ సంజయ్
ఫ్లాట్‍కి కనపడేవి. సంజయ్ బైనాక్యులర్స్‌తో, ఫోన్ జూమ్ చేసుకుని మీనాను రకరకాలుగా వివిధతరహాల్లో చూస్తూ ఆనందిస్తూ, ఫోన్‍లో వీలయినన్ని ఫొటోలు వీడియోలు తీస్తూ ఉండేవాడు.
ఫ్లాట్స్‌కింద కనబడినపుడూ, ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కనపడినప్పుడు మీనా, సంజయ్‍లు హాయ్ హెలో అని పలకరించుకుని, స్నేహంగా ఒకరి మంచీచెడూ ఒకరు తెలుసుకునేవారు. అలాంటప్పుడు అస్సలు మీనాకి సంజయ్‍మీద ఏ సందేహమూ రాలేదు. అతనొక సైకో తరహా వ్యక్తి అనుకోలేదు.
కొన్నిరోజులకు వారిద్దరి స్నేహం బలపడుతుండగా సంజయ్ మీనాని ఫోన్ ఝూమ్ చేసి వీడియో తీసి, ఆ వీడియోని మీనా మొహంమాత్రం ఆమెదే ఉంచి శరీరంపరంగా వేరే అశ్లీలవీడియోలో రీమిక్స్ చేసి, వాట్సప్‍లో పంపాడు.
అది చూసిన మీనా ఉలిక్కిపడి ఫోన్ విసిరేసింది ముందు. తరువాత సంజయ్‍కు ఫోన్‍చేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసింది.
దానికి సంజయ్ బదులు చెపుతూ ” మీనా! నీ మాటలు ధారాళంగా నా చెవిన పడుతుంటే, ఎంత హాయిగా ఉందో తెలుసా? ఏదోరకంగా అయినాసరే నీ మాటలు వినపడుతూ, నువ్వు కళ్ళముందు కనపడుతూ ఉంటే చాలు నాకు, పండుగే పండుగ” అన్నాడు నవ్వుతూ. వెకిలిగా…
మీనాకి ఇవాళ, యీ క్షణాన ఒక కొత్త సంజయ్ తెలుస్తున్నాడు.
ఇంతలోనే మళ్ళీ మరో వీడియో పంపించాడు ఆమె వాట్సాప్‍కి. ఇహ ఆమెకి వళ్ళు వణికిపోయింది భయంతో, మనసు పాడయిపోయింది చిరాకుతో, బుర్ర తిరుగుతోంది స్నేహితుని యొక్క చిరాకైన ప్రవర్తనను చూస్తుంటే… ఏమి చేయాలో తోచక భయంతో, బాధతో మంచంమీద ఉండలాగా పడివుంది.
స్నేహితురాలు జ్యోతి వచ్చి మీనాని అలా చూసి పరిస్థితి తెలుసుకుంది.
వెంటనే నిర్భయ చట్టంకింద ఫిర్యాదు చేసింది, కేసు నమోదు చేసేసింది. అరగంటలోపే షీటీమ్‍వారు అప్రమత్తమై మీనావాళ్ళ అపార్ట్‌మెంట్స్‌కి వచ్చేసి, సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు.
వారం తరువాత కేసు న్యాయమూర్తి ప్రకాశరావు దగ్గరికి వచ్చింది.
మర్రోజు తీర్పు ఇవ్వాల్సి ఉండగా ఆ రాత్రి నిద్ర పట్టడంలేదు ప్రకాశరావుకి.
సరే, జరగబోయే వాదప్రతివాదనలు విని సరైన నిర్ణయం తీసుకుంటాను- అని నిర్ణయించుకున్నాడు.
మర్రోజు కోర్టులో సంజయ్‍ని ఏది అడిగినా వెకిలినవ్వొకటి నవ్వుతూ నుంచుని వున్నాడు.
మీనా చెప్పింది
“ఒక ఆడపిల్ల తట్టుకోలేని నరకం చూపించాడు, ఈ పాపాత్ముడు నాకు. వీడిని శిక్షించండి సార్” అని మీనా వేడుకుంది.
ఇంతలో సంజయ్ తండ్రి సూరయ్య, “నా బాబుకి పాపం, పుణ్యం తెలియదు. అమాయకుడు వాడు. వాడి మానాన వాడు చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడినేమి చేయొద్దు” అని గట్టిగా అరుస్తున్నాడు.
ఆర్డర్ ఆర్డర్ అంటూ ప్రకాశరావు ఆదేశించి-
“బోన్‍లోకి వచ్చి చెప్పండి, ఏది చెప్పాలన్నా” అన్నాడు. సూరయ్య బోన్‍లో నుంచుని “అయ్యా! నా బిడ్డకు ఏమీ తెలియదు. ఈ అమ్మాయే మా అబ్బాయిని వలలో వేసుకోవాలని చూసింది. మా అబ్బాయి పెళ్ళికి ఒప్పుకోలేదని ఇలా రచ్చరచ్చ చేసి మా అబ్బాయిని సాధించాలని చూస్తోంది” అని కొడుకుని మించి నటిస్తున్నాడు.
“మీ అబ్బాయే మానసికరోగి అనుకుంటే, నువ్వు అంతకుమించి స్వార్ధపరుడిలా ఉన్నావు. మీ అబ్బాయి వయసు చిన్నదే, భవిష్యత్తు పాడవుతుందనే బాధ నాకూ ఉంది. కానీ ఒక అమ్మాయిని తన బాధపెట్టే హక్కు అతనికి ఏ మాత్రమూ లేదు. మీనా సంజయ్‍వలన నరకం చూసింది. ఇది ఆ అమ్మాయి జీవితానికీ కోలుకోలేని దెబ్బ. మీ అబ్బాయి శిక్షకాలంలో కారాగారంలో ఉన్నప్పటికీ, అతనికి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది, అతనికి పై చదువులు చదువుకునే అవకాశం ఇవ్వబడుతుంది. సరైన మనిషిగా మారగలిగే అన్ని అవకాశాలు కల్పించబడతాయి. బయటన ఉండే మీరూ అమ్మాయిలపట్ల మీ చెడు దృక్పధాన్ని మార్చుకోండి” అని తండ్రికి సమాధానం సూటిగా చెప్పి- సంజయ్‍కు ఏడేళ్ళ కఠిన కారాగారశిక్ష అని నిర్ణయించాడు ప్రకాశరావు.

1 thought on “సరైన న్యాయం by Tulasi Bhanu”

Comments are closed.