“రోజా…ఎక్కడున్నావ్… ఎప్పుడూ పిల్లల గురించే, నా గురించి అక్కర్లేదు నీకు. హాయిగా నాలుగురోజులు నేను లేకుండా సంబరాలు చేసుకోండి నువ్వూ నీ పిల్లలు …” అన్నాడు మానస్ కోపంగా.
“ఊ< చెప్పండి ఇప్పుడు, పాపం ఏం చేసారు నా చిట్టిచిట్టి పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని ? ఆ…” అంటూ తెచ్చిపెట్టుకున్న కోపం చూపించాలనుకుంటున్నా నవ్వొచ్చేసింది రోజాకి.
మానస్ మనసు బాగోనట్టు మొహం ముడుచుకుని కూర్చుని సూటిగా ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె వెళ్ళి అతని జుట్టుని మృదువుగా నిమిరింది , అంతకంటే మృదుస్వరంతో చెప్పింది.
“అయిదేళ్ళ సాకేత్, రెండేళ్ళ సేజల్ , శాన్వీ… వారికి అన్నీ మనమేగా చూడాలి? వారికి వారు చేసుకోలేరుగా? అదే ఈ పెద్దబుజ్జాయి మానస్ అయితే అన్నీ చేసుకోగలడుకదా? అందుకే ఎక్కువ పట్టించుకోలేను” అంది సంజాయిషీగా.
” నేను బెంగుళూరు వెళ్తున్నానుకదా? నీతో కాసేపన్నా మాట్లాడకుండా వెళితే నాకు అక్కడ నువ్వే గుర్తొస్తుంటావు. పని పూర్తి చేయకుండా రాలేక , అక్కడ ఉండలేక నాకు నరకం” అన్నాడు నిందిస్తున్నట్టు.
“పిల్లలకు, మనం ఇద్దరం, కలిసి చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటే బావుంటుంది కదా? పిల్లల పనులూ అవుతాయి , మన కబుర్లూ సాగుతాయి. ” అంది రోజా పరిష్కారం చెబుతూ.
“నువ్వే చూడు రోజా , పిల్లలకు చేసిచేసి ఎలా అయిపోయావో! వాడికి అది వండాలి, పాపలకి ఇది చేయాలి అంటూ ఇరవైనాలుగు గంటలూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. నీరసంగా కనిపిస్తుంటావు. ఒకప్పుడు మేనేజర్‍గా పనిచేసి ముప్పైవేలు తెచ్చుకున్న నువ్వు సాకేత్ పుట్టిన పదోనెలకే ఉద్యోగం వదిలేసావు. తోడుగా అమ్మాయిని పెట్టుకో అంటే వినవూ…” అంటున్న మానస్‍ని మధ్యలోనే ఆపేస్తూ,
“మన పిల్లలని మనకంటే బాగా ఎవరు చూస్తారు చెప్పు? నీకు మాత్రం ఏం లోటు చేస్తున్నాను?” అంది.
“నిజమే కానీ, వాళ్ళని అమ్మ దగ్గరో , అత్తమ్మ దగ్గరో వదిలి నాతో ఈ నాలుగురోజులు బెంగుళూరు రమ్మంటే , అమ్మో నా పిల్లలూ అంటూ రానే రావూ…” అని నిందించాడు.
“అమ్మకి, అత్తమ్మకి చేతకావట్లేదుగా మానస్? వారి ఆరోగ్యాలే అంతంతమాత్రం. చిన్నపిల్లల అవసరాలు ఉన్నట్టుండి మారుతుంటాయి ఒక్కోసారి. నేనైతే ఓపికగా మారే అవసరాలకి తగినట్లుగా పని చేసేసుకుంటాను. అమ్మావాళ్ళవల్ల అది అంత సులువుగా సాధ్యపడకపోవచ్చు, అప్పుడు పెద్దవాళ్ళకి, పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది కదా?” అంది బతిమాలుతున్నట్టు.
“మాటల్లో నిన్ను నేను గెలవగలనా? సరే చెప్పు, ఏ కలర్ శారీ తెచ్చిపెట్టాలి నీకు? ” అన్నాడు ప్రేమగా నవ్వుతూ ఆమె బుగ్గన ముద్దు పెడుతూ.
” నువ్వే చెప్పు ” అంది రోజా సరదాగా.
“ఊ< ఊ<” అని అంటూ ఆలోచించి , “పసుపురంగుమీద చిన్నచిన్న ఎర్రని రోజాపూలు ఉంటే , ఆ చీర నువ్వు కట్టుకుంటే భలే ఉంటావు” అన్నాడు మానస్.
“మరి నువ్వూ ఓ షర్ట్ తీసుకో మానస్!”
“కలర్ ?”
“ఆరెంజ్ కలర్”
బెంగుళూరునుంచీ కాల్స్ చేసాడు మానస్..
పిల్లలను నిద్రపుచ్చి తానూ పడుకోవాలని, డిస్టర్బ్ అవకూడదని ఫోన్ సైలెంట్‍లో పెట్టి పడుకుంది రోజా. మధ్యాహ్నం మూడింటినుంచీ అయిదింటివరకూ ఏడు కాల్స్ చేసాడు. రోజా ఫోన్ తీయలేదు. అతనికి కోపం వచ్చింది. ఇహ ఇల్లు చేరేవరకూ ఆమెతో మాట్లాడకూడదని మొండిపట్టుదల పట్టుకున్నాడు. మర్నాడు అతను హైదరాబాద్ వస్తాడు అనగా శాన్వీకి వాంతులు మొదలయ్యాయి, జ్వరం వచ్చింది.
రోజా హైరానా పడుతోంది.
సేజల్‍ని సాకేత్‍ని అమ్మ దగ్గర వదిలి శాన్వీని హాస్పిటల్‍కు తీసుకెళ్ళింది. అక్కడ చాలా జనం ఉన్నారు. ఇరవయ్యవ నంబర్ శాన్వీది. పాప ఏడుస్తూ ఉంది, మధ్యమధ్య వాంతి చేస్తోంది. పాపను శుభ్రం చేసుకుంటూ ఊరుకోబెడుతూ రోజాకి చాలా అలసటై పోయింది. డాక్టర్ చెక్ చేసి “వైరల్ ఫీవర్ , ఇప్పుడు చాలామంది పిల్లలకి ఈ జ్వరాలు ఉన్నాయి” అని చెప్పి మందులు రాసిచ్చింది. కాబ్‍లో ఇంటికి వెళుతూ భర్తతో పంచుకోవాలని ఫోన్ చేసింది. మానస్ పంతంగా ఫోన్ తీయలేదు. ఓ మూడుసార్లు ప్రయత్నించి జవాబు రాక ఊరుకుంది. అయినా పిల్లల విషయంలో విసుగే తప్ప పట్టించుకోడుకదా, సహనం తక్కువ మనిషి అని తనకు తనే సర్ది చెప్పుకుంది.
అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి సాకేత్, సేజల్ ఇద్దరూ ఏదో గొడవపడి ఒకరినొకరు కొట్టుకుని చెరోవైపూ ఏడుస్తూ కూర్చుని ఉన్నారు. రోజాకి ప్రాణం కొట్టుకుపోయింది.
“ఏంటర్రా, అలా అయితే ఎలా?” అంటూ ఇద్దరినీ దగ్గరకు తీసుకుని కన్నీరు కారిన చెంపలను తన మెత్తని కాటన్ చున్నీతో తుడిచి చెరో ముద్దూ పెట్టి తల్లి , చేతికిచ్చిన పొంగలి ప్లేట్ తీసుకుని పిల్లలు ఇద్దరికీ తినిపిస్తూ తానూ ఇంత తిని అలా నడుం వాల్చింది. అత్తగారి ఇంటినుంచీ ఫోన్.
“అమెరికానుంచీ సరితావాళ్ళూ వచ్చారు, ఒకసారి పలకరించి వెళ్ళు. అసలే మానస్‍కూడా ఊళ్ళో లేడాయే” అని అత్తగారి శాసనం. పైగా ఇంటికొచ్చిన ఆడపిల్లకి మంచిచీర ఒకటి పెట్టాలి, షాపింగ్‍కూడా చేసి రమ్మని సలహా కూడా ఇచ్చారు.
ఇదీ పరిస్థితి అని వివరించేకంటే చెప్పిన పని చకచకా చేసెయ్యడమే బెటర్ అనుకుని, తల్లికి పిల్లల అప్పగింతలు పెట్టి, ఒకటికి నాలుగుసార్లు పిల్లలగురించి జాగ్రత్తలు చెప్పి గబగబా అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది రోజా. పిల్లల అవసరాలన్నీ చూసి, తిండికూడా తినే ఓపిక లేక అలా మంచంపైన వాలిపోయింది.
“అమ్ములూ! తిని పడుకోమ్మా, లే!” అంటూ అమ్మ అన్నంలో పప్పేసి బాగా నెయ్యి పోసి కలిపి, పక్కన ఆవకాయ, బెండకాయ వేపుడు నంచుకునేందుకు వేసి ఉన్న కంచం చేతికందించింది.
“అమ్మా, ఓపిక లేదే!” అంటే , ఆవిడే ముద్దలు చేసి నోటికందించింది. తల్లి చేతికి చెంపను ఆనించి, “మా అమ్మకి పిల్లలమీద ఉన్న ప్రేమే నాకూ వచ్చినట్టుంది” అనుకుని అమ్మ చెంపమీద అన్నం నోటితోనే ముద్దుపెట్టింది రోజా.
“ఒసి నీ ముద్దు… నీ ముద్దుతో నా చెంపంతా అన్నం రాసావు కదే” అని అమ్మ ముద్దుగా కసిరింది.
రోజా తింటూ తింటూనే మంచంమీదకి అలసటగా వాలి నిద్రపోయింది.
“ఇంకా నాలుగు ముద్దలు ఉన్నాయి , తిననైనా లేదు బిడ్డ” అనుకుని అంత పెద్దపిల్ల అయినా రోజాకు దిష్టి తీసింది అమ్మ.
మానస్ బెంగుళూరునించీ వచ్చాడు. యధావిధిగా తన పనులు తాను రోబోలాగా చేసుకుపోతాడే తప్ప పిల్లల బాగోగులు పట్టించుకోడు. ఏదో బుద్ధి పుట్టినప్పుడు కాసేపు వాళ్ళతో ఆడుకుంటాడు. తరువాత ఫేస్‌బుక్ ఛాటింగ్, టీవీ న్యూస్ తప్ప రోజాకి సాయం చెయ్యాలని తోచదు. ఒకవేళ సాయం చేయాలనుకున్నా ఏమీ చేతకాదు. రోజా ఇంక , “సరేకానీ, అతని తీరు ఇంతే” అని సామరస్యంగా స్వీకరించేసింది.
ఆరోజు సాకేత్ పుట్టినరోజు. మామూలుగానే రోజాకి చేతినిండా పని. ఇహ ఇప్పుడు అనంతమైన పని. అయినా చెక్కుచెదరని సహనంతో పార్టీకి అన్నీ సిద్ధం చేసింది. కేక్ కటింగ్ ముందు కాండిల్ ఊదాల్సింది సాకేత్. కానీ వాడికంటే ముందే శాన్వీ ఊదాలని ప్రయత్నించింది. అప్పటికే సేజల్ కాండిల్ ఊదేసింది. ఉక్రోషంతో శాన్వీ ఏడుపు.
“పర్లేదు, పర్లేదు. ఏడవకు” అని రోజా మళ్ళీ కాండిల్ వెలిగించి శాన్వీకి, సేజల్‍కి చెప్పింది, “సాకేత్ ఊదాలి , మీరు కాదు” అని. సరే అన్నట్టు బొమ్మల్లాగా తలూపుతూనే ఈసారి శాన్వీ సేజల్‍కంటే ముందు కాండిల్ ఊదేసింది పోటీగా. లక్కీగా సాకేత్ అదంతా తమాషాగా అనుకుని నవ్వేస్తున్నాడు పొట్టపట్టుకుని. కానీ గయ్యిమని సేజల్ ఏడుపు మొదలుపెట్టింది. వచ్చిన అతిధులు పిల్లల అల్లరికి సరదాగా నవ్వేస్తున్నారు. మానస్ మాత్రం, “ఏంటీ పిల్లలు ఇంత చిరాకు చేస్తున్నారు?” అన్నట్టు రోజావైపు చూసాడు.
“పిల్లలుకదా, ఓపిక పట్టు” అన్నట్టు సైగ చేసింది ఆమె.
ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.
పిల్లలు పెద్దలై పనులు తగ్గాక మానస్ పనులు నెత్తిన వేసుకుంది రోజా. కొంతమందికి అంతేనేమో, ఏదో ఒక పని చేస్తూ ఉండకపోతే తోచదేమో మరి. ఇప్పుడు మాత్రం మానస్‍కి సంతోషంగా ఉంది, రోజాకి తనగురించి పట్టించుకునే వీలుకుదిరిందని.
రోజాకి యాభయ్యేళ్ళు వచ్చాయి. పిల్లల ఫొటోలు ఆల్బమ్స్‌లోనూ సీడీల్లోనూ చూసుకుంటూ, వాళ్ళ చిన్నప్పటి సరదాలనూ, అల్లర్లనూ గుర్తుచేసుకుంటూ మానస్‍తో పంచుకుని నవ్వుకుంటూ కాసేపు, తడయిన కనులను తుడుచుకుంటూ కాసేపు ఉంటుంది. అతనుకూడా అప్పుడప్పుడూ పిల్లలను గుర్తుచేసుకుని దిగులుపడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు తల్లితో మాట్లాడినంత ఇష్టంగా తండ్రితో మాట్లాడరు. అది వారి తప్పుకాదని , మానస్ పిల్లలతో సరైన అనుబంధం ఏర్పరుచుకోకపోవడం అతని స్వయంకృతాపరాధమే అని మానస్ , రోజాకి ఇద్దరికీ అనిపిస్తుంది. అలా ఆలోచించి ఎప్పుడైనా మానస్ దిగాలుపడితే రోజా ఏదోరకంగా అతన్ని హుషారు చేసేదేతప్ప, ఇప్పటికే తన పొరపాటు తెలుసుకున్న అతన్ని మాత్రం సాధించేది కాదు.
“నీకింత సహనం ఎలా ఉంటుంది రోజా? నాకైతే ఊరూరికే విసుగు వచ్చేస్తుంది” అన్నాడు మానస్ నిస్సహాయంగా.
“అది ఒక్కొక్కరి తత్వం కదా మానస్! నీలా నేనుండలేను, నాలా నువ్వుండలేవు. పిల్లలకు అవసరమైన ఆర్ధికబలం నువ్విచ్చావు, వారితో అనుక్షణం ఉంటూ వారి అవసరాలను కనిపెట్టుకుని ఉన్నది నేను. ఎవరికైనా అనుబంధం ముందు గుర్తుంటుంది. రేపు వారు వారి పిల్లలకి భవిష్యత్తు నిర్మించేటప్పుడు, వారికి తండ్రిగా నువ్వు ఏమేమి చేసావో వారికీ అనుభవంలోకి వస్తుంది. అప్పుడు వారే నాన్న సాయాన్నికూడా గుర్తిస్తారు” అని చల్లని జల్లుల్లాంటి మాటలతో అతని మనసుని కుదుటపరిచింది.
మేడమీద ఈజీచెయిర్లో ఆనుకుని ఆకాశం వైపు చూస్తూ అన్నాడు మానస్ “రోజా! నువ్వు నేను పిల్లలకు చేసింది గుర్తించావు నాకు అది చాలు. పిల్లలతో నేను ఇంకొంచెం మంచిగా సమయం గడిపిఉండాల్సిందని నామీద నాకే కోపంగా ఉంది. అదే చెప్పి, నువ్వు నిందించి ఉంటే, బహుశా ఎందుకు లేనూ అని పోట్లాడేవాడినేమో! కానీ నువ్వు నీపిల్లలతో సమంగా నన్నూ సహనంగా , సౌమ్యంగా ఆదరించి భరిస్తావు. అందుకే నిజాయితీగా నా తప్పు ఒప్పేసుకుంటున్నా” అన్నాడు మానస్.
రోజా తాను అప్పటివరకూ అల్లిన మల్లెలమాలను జడలో పెట్టుకుంటూ లేచి వచ్చి మానస్ బట్టతలను తన చేతితో మృదువుగా నిమిరి, “నీ పిల్లలు కాదు మానస్, మన పిల్లలు అనాలి. ఇన్నేళ్ళకు కూడా నీ మాట మారదా చెప్పు?” అంటూ సున్నితంగా మందలించింది
“ఎంతైనా మీ అమ్మలు పిల్లలని గుండెలకు శాశ్వతంగా హత్తుకున్నట్టు మా నాన్నలు చేయలేరేమో!” అన్నాడు నిండువెన్నెలలో , చిన్నిచిన్ని ఎర్రని రోజాపూలున్న పసుపురంగు చీరలో మెరిసిపోతున్న రోజాని ఆప్యాయంగా చూస్తూ మానస్.
ఆరోజు పిల్లలు ముగ్గురూ కలిసి మానస్ షష్ఠిపూర్తి మహోత్సవం బాగా జరిపించారు. రోజాకోసం నీలంరంగు చీరకు చిన్న బంగారుజరీ అంచు ఉన్న చీరను బహుమతిగా ఇవ్వాలని ఎదురుచూస్తూ ఉన్న మానస్‍కి ఎప్పుడు నిద్రపట్టిందో కానీ కుర్చీలోనే కునికిపాట్లు పడుతున్నాడు. నిద్రలో తల కిందకు జారి మెలకువ వచ్చింది. ఈ మొద్దావతారం ఇంకా రాలేదేమిటీ అనుకుని గది బయటికి తొంగిచూసాడు.
హాల్లో మనవరాలిని తన చాపుకున్న కాళ్ళమీద బజ్జోపెట్టుకుని సోఫాకి వీపు ఆనించుకుని నేలమీద కూర్చుని ఉంది రోజా. మానస్ వెళ్లాడు దగ్గరకి. ఏదో అడగబోయాడు, విసుగ్గా కాదు మామూలుగానే. పెద్దరికానికి తగ్గట్టు కాస్త సహనం వచ్చింది అతనికి ఇప్పుడు. కానీ ఆ మామూలు మాటలు కూడా మాట్లాడద్దు అన్నట్టు నోటిమీద వేలు ఉంచి సైగ చేసింది నానమ్మ రోజా.
“నాన్నా! పాపకి గంటనుంచీ కడుపునొప్పి. తమలపాకుకి ఆముదం రాసి వేడి చేసి పొట్టకి పెడుతూ కూర్చుంది అమ్మ. ఇప్పటివరకూ ఏడ్చి ఏడ్చి ఇప్పుడే కాస్త నిద్రపోతోంది పాప” అన్నాడు కొడుకు సాకేత్ తండ్రిని పక్కకి తీసుకెళ్ళి.
మానస్‍కి అనిపించింది, “మళ్ళీ మొదలా, రోజాకి పిల్లల జంఝాటం!” అనుకున్నాడు. కానీ ఇదివరకులా విసుగు రాలేదు. వెళ్ళి ఆమె పక్కన పాప తల చిన్నగా నిమురుతూ కూర్చున్నాడు. రక్తపాశం అంటే అదేనేమో! తాత చెయ్యి తలనీ, నానమ్మ కాళ్ళు వీపుకిందా తాకుతూ వుంటే పాప హాయిగా నిద్రపోతోంది. నిద్రలో చిన్నగా నవ్వుతోంది కూడానూ. ఆ పసిదాని నవ్వు చూస్తుంటే మానస్‍కి ప్రశాంతంగా అనిపించింది.
రోజా వైపు చూసాడు. భర్త పక్కనే కూర్చుని పాపని చూసుకుంటున్నాడని ధైర్యంగా అనిపించిందేమో రోజాకి, సోఫాకి తల ఆనించి నిద్రపోతోంది. వారిద్దరినీ చూస్తూ, కాలక్షేపానికి, పక్కనే ఉన్న పత్రిక చూడబోతుంటే సాకేత్ వచ్చి కూర్చున్నాడు. తల్లిని, పాపని డిస్టర్బ్ చేయడం ఎందుకని సోఫాలో కూర్చుని ఉన్నాడు.
“పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాలిగా సాకేత్ నువ్వూ? కోడలిని చూసుకోమనకపోయావా పాపని?” అన్నాడు మానస్.
“పర్లేదు నాన్నా! పాపం తనూ పొద్దున్నుంచీ పాపను చూసుకుంటూ అలిసిపోయి ఇప్పుడే పడుకుంది. మళ్ళీ పాప లేచినదగ్గరనుంచీ తనే చూసుకుంటుంది కదా? కాసేపు పడుకోనీ అనుకున్నాను. అయినా పాపను చూసుకోవడం నా బాధ్యతకూడా కదా నాన్నా?” అన్నాడు సాకేత్.
మానస్‍కి కొంచెం ఎక్కడో, కొడుకు అన్నమాట గుచ్చుకున్నా, సత్యం పలికాడు అనుకుని కొడుకుతో చిన్నస్వరంలో మనవరాలికి, భార్యకి డిస్టర్బెన్స్ అవకుండా కబుర్లు చెప్పసాగాడు. సాకేత్ కూడా తండ్రితో చాలాసేపు మాట్లాడాడు. అతనికి మనసుకి నిండుగా అనిపించింది, తండ్రితో కబుర్లు చెప్పుకుంటుంటే. మానస్‍కి ఇప్పుడు, “పిల్లల సమక్షంలో ఇంత బావుంటుందా? పిల్లలతో అనుబంధం ఇంత మనశ్శాంతిని ఇస్తుందా?” అనిపించింది.
నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్‌బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.