ఇరవైమూడో యేడు by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

ఇరవైమూడో యేడు!
ఇప్పటి ఆడపిల్లల జీవితంలో అతి ముఖ్యమైనది. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తయి అటు వుద్యోగంకోసం, యిటు పెళ్ళికోసం ఏకకాలమందు ఆరాటం మొదలౌతుంది. అలాంటి యిరవైమూడోయేడు మలయసమీరంలా వచ్చి నన్ను సుతారంగా స్పృశించింది.
ఎప్పటిలాగే ఆరుగంటలకి తెల్లవారింది నాకు. మంచం దిగి కిటికీ దగ్గరకెళ్ళాను. బయటంతా పొగమంచు దట్టంగా కమ్మేసి వుంది. అడుగుదూరంలో వున్న నైట్‍క్వీన్ మొక్కకూడా కనిపించడం లేదు. అవంతీపురంలో యిలాంటి దృశ్యం చాలా అరుదుగాబట్టి వుత్సాహంగా అనిపించింది.
ఈరోజు…ఎంతో యిష్టమైనరోజు, అమ్మ గర్భంలోంచి భూమ్మీదపడి నాకంటూ ఒక అస్థిత్వాన్ని ఏర్పరుచుకున్న రోజు. హాస్పిటల్లో అమ్మ పక్కలో వున్న నన్ను చూసి అత్తయ్యలు, పిన్నిలూ, బామ్మ, అమ్మమ్మ అంతా వాళ్ళవాళ్ళ పోలికలు వెతుక్కోవటం మొదలు పెట్టారట.
“ఆ కళ్ళు చూడు, మా పెద్దచెల్లి రాజ్యానివే!” అని పెద్దత్త.
“ఆ ముక్కు చూడవే, కోటేరు తీర్చినట్టు ఎంత సూటిగా వుందో! అంతా నీ పోలికేనే!” అని అమ్మమ్మ పిన్నితో.
“చెవికి చిన్నసొట్ట వుందేవ్ రాధా! అది నీ మేనకోడలేనే” అని బామ్మ ముచ్చటపడిపోతే అమ్మమ్మ రంగొచ్చిందని రాధత్తయ్యంటే…
“ఆ నల్లటినొక్కుల జుత్తు నీదేనమ్మాయ్” అందట అమ్మమ్మ ఆమెతో.
ఇలా వాళ్ళలో వాళ్ళు వంతులుపోతూ వాళ్ళవాళ్ళ పోలికలు వెతుక్కుంటుంటే అమ్మ చిన్నబుచ్చుకుని, “కష్టపడి కన్నది నేను. నా పోలిగ్గానీ మీపోలిగ్గానీ ఒక్కటేనా లేదా?” అని నాన్నతో దిగలుపడి అన్నదట. ఒక సారెప్పుడో పెద్దత్తయ్యే యివన్నీ చెప్పింది. నా ప్రతి పుట్టినరోజుకీ ఆ మాటలు గుర్తొస్తూనే వుంటాయి.
“ఇంకా లేవలేదా సిరీ?” అమ్మ లోపల్నుంచీ పిలుస్తుంటే ఆలోచనల అగాథంలోకి గులకరాయిలా దొర్లుకుంటూ వెళ్ళిపోయిన నేను మళ్ళీ మనసునై మనిషినై వెనక్కొచ్చాను.
“లేచానమ్మా! చాలాసేపైంది. వస్తున్నాను” జవాబిచ్చి పక్క సర్ది వంటింట్లోకి వెళ్ళాను. “ఇరవైరెండు వెళ్తాయి. అబ్బా! ఎంతలో ఎంత దానివయ్యావే?” అంది అమ్మ.
“ప్రీతి ట్యూషన్నించి యింకా రాలేదా?” అడిగాను.
“లేదు. ఎందుకో లేటైంది. దార్లో వుందేమో!”
బ్రష్‍మీద పేస్టు వేసుకుని పెరట్లోకి వెళ్ళాను. తిరిగొచ్చేసరికి నాన్న ఎప్పుడొచ్చారోగానీ అమ్మతో అంటున్నారు, “సిరి చదువైపోయింది. ఇంక పెళ్ళి చెయ్యద్దూ?” అని. నా గుండె ఝల్లుమంది. నిల్చున్నచోటే ఆగిపోయాను. “ఏవో వుద్యోగాలకి అప్లై చేసిందిగా, తేలనివ్వండి. ఉద్యోగం వస్తే కట్నం తగ్గుతుంది” అంది అమ్మ.
“అనుకోగానే కుదుర్తాయా పెళ్ళిళ్ళు? ప్రయత్నాలు మొదలు పెడదాం.”
“అదీ నిజమే” వప్పుకుంది అమ్మ.
“ఏదది? ఏం చేస్తోంది?” అని అడుగుతూ నేనున్న వైపు తలతిప్పారు నాన్న. లోపలికి వెళ్ళాను.
అమ్మ మా యిద్దరికీ కాఫీ యిచ్చింది. “ఆ< సిరీ! మా యీయీగారొస్తున్నారు. ఆఫీసుకి తొందరగా వెళ్ళాలి. గుడికి నువ్వు, అమ్మా, చెల్లీ వెళ్ళండి. సాయంత్రం అందరం పిక్చర్‍కి వెళ్లాం. టిక్కెట్లు తెస్తాను” అన్నారు నాన్న. తనలా అంటుండగానే ప్రీతి వచ్చింది.
“నువ్వు లక్కీ. చక్కగా రెండోతారీఖుని పుట్టావు. పర్సు ఫుల్లుగా వుంటుంది. ఏదంటే అది కొనిచ్చేసి, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోతారు నాన్న” అంది అలకగా. నేను నవ్వాను. తన పుట్టినరోజు మే ముప్ఫై. ఈ ఒక్కరోజూ గడిస్తే రేపు జీతాలొచ్చేస్తాయనే మూడ్‍లో వుంటారు నాన్న మరి!
“నీకేం తక్కువైందీ? అసలేదైనా తక్కువ చేస్తే వూరుకుంటావు కూడానా?” దెప్పింది అమ్మ. “తొందరగా స్నానం చేసి రావే సిరీ! గుడికెళ్ళొచ్చేద్దాం. ఆలస్యమైతే వంట లేటైపోతుంది” అంది నాతో.
నేను స్నానం చేసి వచ్చేసరికి గంధంరంగుకి నీలం ప్రింటున్న కాశ్మీర్‍సిల్కుచీర, జాకెట్టు రెడీగా వున్నాయి. చీర కట్టుకోవడం అంత బాగా రాదు నాకు. ఇప్పటిదాకా అన్నీ పంజాబీడ్రెస్‍లే. ప్రీతి కుచ్చెళ్ళు సరిచేసింది. అమ్మ జుత్తు బాగా తుడిచి, జడేసి, పువ్వులదండ పెట్టింది.
“ఈ చీరలో ఎంత బావున్నావే!” అంది ప్రీతి. ఎప్పుడూ తన కాంప్లిమెంట్స్ మామూలుగా తీసుకునే నేను ఈవేళ నాన్న తెచ్చిన పెళ్ళి ప్రస్తావనతో యిబ్బందిపడ్డాను. ఆ మాటల్ని ప్రీతి కాకుండా యింకెవరో అజ్ఞాతవ్యక్తి అంటున్నట్టు అనిపించి వుక్కిరిబిక్కిరయ్యాను.
గుడికెళ్ళి వచ్చేసాం.
ఇన్నాళ్లూ కాలేజీ చదువు, ట్యూషన్స్ వీటితో వూపిరాడనంత బిజీగా వుండేదాన్ని. ఇప్పుడేమో రోజుకి యిరవైనాలుగ్గంటలు ఎక్కువనిపిస్తోంది. లక్కీగా వీధి చివరే లైబ్రరీ వుండటంతో రోజూ వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటున్నాను. ఆ వొక్క కాలక్షేపమూ చాలదనిపిస్తోంది. ఎవరేనా స్నేహితుల యిళ్ళకి వెళ్తే?
అమ్మకిష్టం వుండదు. ఎందుకు వాళ్ళిళ్ళకీ వీళ్ళిళ్ళకీ వెళ్ళటం? వాళ్ళెవరేనా మనింటికొస్తున్నారా, అంటుంది. లలిత, రేష్మ, మౌనిక..అంతా ఏమైపోయారో! అమ్మ అన్నట్టు ఒక్కరేనా రావచ్చుగా?
గోపీకృష్ణ గుర్తొచ్చాడు. గుర్తు రావడానికి అతనేం దూరంగా లేడు. తరుచుగా కలుస్తూనే వుంటాడు. ఇంటికి కూడా వస్తుంటాడు. ఇంటర్లో నాకు క్లాస్‍మేటు. ఆ స్నేహం యింకా అలానే వుంది. పుస్తకాలని సీరియస్‍గా చదవటం ప్రారంభించినరోజుల్లో ఆధునిక రచయితల పుస్తకాలే ఏరుకునేదాన్ని. గంటా రెండుగంటల్లో చదివేసేదాన్ని. అందులో అర్ధంకాకపోవటానికిగానీ ఆలోచించటానికిగానీ పెద్దగా ఏమీ వుండేది కాదు.
గోపీకృష్ణ నాకు సాహితీలోకానికి కొత్తద్వారాలు తెరిచి చూపించాడు. నాకన్నా ఎక్కువ చదివి, ఎంతో నాలెడ్జి వున్న అతనంటే నాకు గొప్ప గౌరవభావం. సాదాగా బట్టలు వేసుకుని, సాత్వికంగా వుండే అతనంటే అమ్మకీ నాన్నకీ కూడా యిష్టమే.
ప్రీతి అభిప్రాయం మరోలా వుంది. “ఇరవైనాలుగ్గంటలూ పుస్తకాలు తప్పించి మరో ఆలోచనలేనివాడిని చేసుకుని ఏ ఆడపిల్ల సుఖపడుతుందే? ఇతనుగానీ పెళ్ళి శుభలేఖ యిస్తే ఆ అమ్మాయి అడ్రెస్ అడిగి తీసుకుని నాలుగు వోదార్పుమాటలు చెప్పాలి” అంటుంది.


గోపీకృష్ణ సాయంత్రంవేళప్పుడు రావడం, అందరం యింటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం రోజూ అలవాటుగా మారిపోయింది. ఈరోజు అతను రెండు వార్తలు చెప్పారు.
మొదటిది తనకి లైబ్రేరియన్ పోస్టింగ్ వచ్చిందని అపాయింటుమెంట్ ఆర్డరు తీసి చూపించాడు. అతని అభిరుచికి తగిన జాబ్. అందరం మనస్ఫూర్తిగా ప్రశంసించాము.
“బైదబై నా పెళ్ళి కూడా కుదిరింది. నిజానికి ఎప్పట్నుంచో అనుకుంటున్న సంబంధమేకానీ వుద్యోగం వచ్చేదాకా చేసుకోకూడదనుకున్నాను” అన్నాడతను శుభలేఖ యిస్తూ. అప్పుడే గుర్తొచ్చినట్టుగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
కారణం ఏదైనాగానీ, నేనింకా పెళ్ళి ప్రహసనం ప్రారంభించనే లేదు, ఇతను శుభలేఖలదాకా వెళ్ళటం నన్ను కొద్దిగా అప్సెట్ చేసింది. ఐతే ఆ కలవరం నా ముఖంలో కనిపించకుండా జాగ్రత్తపడ్డాను.
“కట్నం ఎంత?” అమ్మ మామూలుగా అడిగేసింది. అలా అడిగినందుకు అతనేమనుకుంటాడోనని భయపడ్డాను. కానీ అలాంటిదేం జరగలేదు. అంతే మామూలుగా జవాబిచ్చాడు. “ఆరు లక్షలండీ. అందులో సగం నగలకీ పట్టుచీరలకీ అమ్మాయికే వెళ్ళిపోతుంది. కట్నం కాక నాకు హీరోహోండా, అమ్మకీ యిద్దరు చెల్లెళ్ళకీ లాంఛనాల క్రింద తలో యాభైవేలూ యిస్తున్నారు” అని లెక్కలన్నీ చెప్పేసాడు.
నేను షాకయ్యాను. ఇన్ని పుస్తకాలు చదివిన అతనికి కట్నం తీసుకోవటం తప్పని తెలీదా? నేనింతకి అమ్ముడుపోతున్నానని ఎంత నిర్లజ్జగా చెప్పుకుంటున్నాడు!
గోపీకృష్ణ ఎక్కువసేపు వుండలేదు. అమ్మ పెట్టిన స్వీటు తిని, అందర్నీ తప్పకుండా పెళ్ళికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా అతను చెప్పిన వార్తల మీద చర్చ జరిగింది. ఉద్యోగం గురించి తక్కువా, పెళ్ళి గురించి ఎక్కువ.
“బాగా వున్నవాళ్ళనుకుంటాను. అందుకే అంతంత కట్నాలు. మనిషిని చూస్తే అలా అనిపించడు” అంది అమ్మ.
“పల్లెటూళ్ళో పదెకరాల పొలం వుందంటే తక్కువలో తక్కువ పాతికలక్షలున్నట్టే” అన్నారు నాన్న. నిజమే! ఈమధ్యకాలంలో స్థిరాస్ధులు మనిషి విలువని పెంచుతున్నాయి.
రాత్రి పడుకునే ముందు ప్రీతి అడిగింది. “గోపీకృష్ణకి పెళ్ళంటే షాగ్గా లేదక్కా?” నేను తన ముఖంలోకి యథాలాపంగా చూసి నివ్వెరబోయాను. ఎంతో మార్పు! అన్నీ కోల్పోయినట్టు వుంది. కళ్ళు వర్షించడానికి సిద్ధంగా వున్నాయి. “అతను పెళ్ళి చేసుకుంటున్నందుకు నీకేం బాధగా లేదూ?” అంది. నాకింకా అందీ అందనట్టుగానే వుంది తన మనసు.
“నాకెందుకే బాధ?” అడిగాను.
“నీకతనిపట్ల ఎలాంటి ఫీలింగ్సూ లేవా?” తను మరింత వివరంగా అడిగాక నన్ను నేను శోధించుకున్నాను. నేనతన్ని ప్రేమించానా? అలాంటి భావన నాకెప్పుడూ కలగలేదు. ప్రీతిలాగా, నాకు దగ్గరగా వచ్చిన ఎందరో అమ్మాయిల్లాగా అతనూ అనిపించాడు. కాకపోతే కొంచెం పురుషాహంకారంలాంటిది… కచ్చితంగా అలా అనలేం… కానీ ముందుముందు అలాంటి రూపాంతరం చెందేది… అది కనిపించేది. అతని ఆలోచనాసరళి కొంచెం భిన్నంగా వుండేది. నా శోధన ముగిసేసరికి ప్రీతి కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ సుడిగుండాల వెనుక తన మనసప్పుడు నా ఆలోచనల గాలానికి చిక్కింది.
“ప్రీతీ! నువ్వతన్ని ప్రేమించావా?” విభ్రాంతిగా అడిగాను. తను తలదించుకుంది. కళ్ళు వర్షించసాగాయి.
“అలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకే. నీకు దగ్గరగా వచ్చిన మొదటి మగవాడతను. అందుచేత ఆకర్షణ. అతని స్థానంలో యింకెవరున్నా నువ్విలాగే ఆలోచించేదానివి. దీన్ని ప్రేమ అనరు. ఇలాంటివాటికి లొంగిపోతే యింక ఏదీ సాధించలేం” మందలింపుగా అన్నాను.
“ప్రీతీ! సిరీ!” అమ్మ గొంతు వినిపించింది. ఇద్దరం వులిక్కిపడ్డాం. అమ్మ మా సంభాషణంతా విన్నట్టుంది. వచ్చి మా దగ్గరగా కూర్చుంది.
“సిరి కరెక్టుగా ఆలోచిస్తోంది. నాలుగ్గోడలమధ్యనుంచి అవతలికి అడుగుపెట్టి వుద్యోగం చేస్తున్న తరం మీది. బయటి ప్రపంచంలో ఎన్నో ప్రలోభాలుంటాయి. అన్నిటికన్నా పెద్ద ప్రలోభం స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ. తరతరాలుగా బైటి ప్రపంచంలో తిరుగుతున్న మగవాడు యిలాంటి ప్రలోభాలని జయించాడు. ఇప్పుడు ఆడపిల్లల వంతు. అప్పుడే సమాజంలో సమతూకం వుంటుంది. ఒక్కసారి ఆలోచించు. ప్రేమలో భంగపడ్డా మగవాళ్ళు సర్దేసుకుని కొద్దికాలానికే మామూలుగా అయిపోతారు. ప్రాక్టికల్‍గా ఆలోచించడం నేర్చుకోవాలి ముందు. నేను అమ్మాయిని, అతను అబ్బాయి అనే భేదభావాన్ని మర్చిపోవాలి. మేమిద్దరం వ్యక్తులం అనే భావన పెంచుకుంటే ఎన్నో సమస్యలు, ముఖ్యంగా సిరి అన్న ఆకర్షణలు అసలు వుత్పన్నం కావు. ప్రీతీ! స్త్రీలో వుండే భావసౌకుమార్యాన్ని ఎంతగానో యిష్టపడే మగవారు. ఆమె తనంతట తను ప్రేమిస్తున్నానని చెప్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపెయ్యడానికి సంకోచించరు. అది మగ మనస్థత్వం. సమాజరీత్యా అతనికి ఏర్పడిన ప్రవృత్తి అది. దాన్ని మార్చలేం” అని,
“మగవాడిని చూసి సిగ్గుతో మెలికలు తిరిగే అమ్మాయికి గౌరవం వుండదని మా అమ్మ చెప్పేది. మేం నిన్నలా పెంచలేదని నా నమ్మకం. ఇకపోతే పెళ్ళి! పెళ్ళికి మనసులు కలవటం ఒకటే కాదు కావలసినది. అమ్మా, నాన్నా, పుట్టి పెరిగిన వాతావరణం, బంధువులు, బాంధవ్యాలు, కులం, గోత్రం యింకా ఎన్నో… అవన్నీ వదులుకోవడానికి నువ్విష్టపడ్డా అవతలి వ్యక్తికి యిష్టం వుండకపోవచ్చు. ఒకవేళ అలా యిష్టపడి ముందుకొచ్చినా, ఎంతకాలం అతన్ని అలా హోల్డ్ చెయ్యగలవు? ఏదేనా ఒకరోజుకి మీ బంధం పల్చబడితే, అతన్ని అతనివాళ్ళు స్వీకరిస్తారేమోగానీ, నువ్వొదిలిపెట్టి వెళ్ళినవన్నీ నీకోసం ఎదురుచూస్తూ వుండవనేది కచ్చితమైన నిజం. కఠోరమైన వాస్తవం” అమ్మ చెప్పటం పూర్తయేసరికి ప్రీతి ముఖం తేటగా ఉంది. “ఏంటో అలా అనిపించింది” అనేసింది తేలిగ్గా


గోపీకృష్ణ జీవితంలో సంభవించిన అద్భుతాలు రెండూ నాకూ అతి తొందర్లోనే సంభవించాయి. ముందు వుద్యోగానికి యింటర్వ్యూకి పిలిచారు. చాలా టెన్షన్ పడ్డాను. అమ్మా, నాన్నా ధైర్యం చెప్పారు. ఇంకా నాలుగురోజులుంది. టైపూ, కంప్యూటర్సు, జీకేలో టెస్టుంటుందట. మొదటిరెండిట్లో వోకే నేను. కరెంటు అఫేర్స్‌లో దాదాపు నిల్. మూడురోజులు నిద్రాహారాలు మానేసి చదివి కొంత వంటబట్టించుకున్నాను.
నా శ్రమ వృధా కాలేదు. మొదటి అభ్యర్ధిగా ఎంపికయ్యాను. కానీ కలగాల్సినంత సంతోషం కలగలేదు. “నీకిష్టమైతేనే చేరు”” అన్నారు నాన్న నిర్ణయాన్ని నాకే వదిలేస్తూ.
ఇప్పుడంతా కంపెనీ వుద్యోగాల ట్రెండు నడుస్తోంది. టేలెంట్సుని గుర్తించి ప్రోత్సహించే జీతాలు. సెంట్రల్ గవర్నమెంట్లో క్లర్కు జాబ్ అంటే ఎలాగో వుంది. అన్నీ కలుపుకుని ఏడువేల జీతం. ఎబ్బెట్టుగా అనిపించింది. అదీ యింటికి అరవైకిలోమీటర్ల దూరాన యింకో వూళ్ళో.
“ప్రస్తుతం ఖాళీగానే వున్నావుకదా, వదులుకోవడం దేనికి? ఇంతకన్నా మంచిది వస్తే అప్పుడాలోచించవచ్చు” అంది అమ్మ. “మరైతే ఎక్కడ వుంటావు? వర్కింగ్‍వుమెన్స్ హాస్టల్లో వుంటావా?” అడిగింది. అదే మంచిదనిపించింది. నాన్న అయిష్టంగా వప్పుకున్నారు.
చేరిపోయాను. ఉద్యోగంలోనూ, హాస్టల్లోనూ. నాన్న దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. చేరినరోజే అనిపించింది ఎంతోకాలం చెయ్యలేనని. నా చదువుకీ, నాలో వున్న సృజనాత్మకతకీ ఎలాంటి విలువాలేని వుద్యోగం.


ప్రైవేటు హాస్టల్. బేంకు, ఎల్లైసీ వుద్యోగులు, టీచర్లు వుండేవారు. తొందరగా మరో జాబ్ వెతుక్కోవాలనే కోరికకూడా మొదలైంది. నా రూమ్మేట్లలో ఎవరికీ జీవితం పట్ల పెద్ద సీరియస్‍నెస్ లేదు.‍ “జీతం రాగానే షాపింగ్… చీరలు కొనుక్కో వడం, డ్రెస్‍లు కుట్టించుకోవడం… బట్టలషాపులు, టైలర్స్ ఎక్కేదుకాణం, దిగే దుకాణం. మాకు కామన్ యింట్రెస్ట్స్‌కూడా ఏమీ లేవు. అవసరార్ధం కలిసి వుండటమే.
గోపీకృష్ణ నాకు చేసిన గొప్ప అలవాటు, మంచి పుస్తకాలు చదవటం. అది నాకిక్కడ వుపయోగపడింది. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవటం నా దినచర్యలో అనివార్యభాగమైంది.
నా రూమ్మేట్స్‌లో రమ చాలా బావుంటుంది. ఇక్కడికింకా దూరంగా వున్న పల్లెటూళ్ళో టీచరు. ఆమెకోసం రాజు అనే అతను తరుచుగా వచ్చేవాడు. రోజూ వుదయాన్నే అప్పుడే కోసిన గులాబీలా వెళ్ళి తోటకూరకాడలా వడిలిపోయి తిరిగొచ్చే ఆమె అతనితో వచ్చినప్పుడు అప్పుడే విచ్చుకున్న గులాబీలా వుండేది. ముఖంలో ఒక వింత కాంతి కనిపించేది. కొత్త అందమేదో దోబూచులాడేది. వాళ్ళిద్దరి గురించి రకరకాలుగా అనుకునేవారు హాస్టల్‍మేట్స్.
“అంత తప్పుగా ఎందుకనుకోవాలి? ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకుంటారేమో” అన్నాను. అలాంటి మాటల మధ్య నేను యిరుక్కుపోయి వున్నప్పుడు.
వాళ్ళు నవ్వి “పెళ్ళా? రాజు భార్య?” అన్నారు. నేను నివ్వెరబోయాను. అతనికి పెళ్ళైందా? పెళ్ళైనవాడితో… అది తెలిసికూడా ఆమె ప్రేమలోపడటం.. ఆమె తల్లిదండ్రులకి ఈ విషయం తెలీదా? తెలిస్తే వూరుకుంటారా? రమ నా కళ్ళకి ప్రీతిలాగే అనిపించింది. మందలించాలనుకున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. అప్పటికే తను ప్రెగ్నెంట్. నాకింక ఆ హాస్టల్లో వుండాలనిపించలేదు.
“చాలామంది షటిల్ చేస్తుంటారు. నేనూ కొన్నాళ్ళు చేస్తాను. అందర్నీ వదిలిపెట్టి వుండాలంటే ఎలాగో వుంది” అన్నాను నాన్నతో. అమ్మతోమాత్రం రమ విషయం క్లుప్తంగా చెప్పాను. రూమ్ ఖాళీ చేద్దామని నేను వెళ్ళినప్పుడు రమ అక్కడే వుంది. స్కూలుకి సెలవు పెట్టిందట. చాలా బలహీనంగా పాలిపోయి వుంది. బాధనిపించింది.
“రమా! తెలిసితెలిసి ఎందుకింత పిచ్చిపని చేసావు? మీవాళ్ళకి తెలిస్తే ఏమంటారు?” అనకుండా వుండలేక పోయాను.
“మా యింట్లో తెలుసు శిరీషా! నా సంపాదన కావాలిగాబట్టి ఏమీ అనకుండా వూరుకున్నారు. ఇప్పుడిది నా వొక్కదాని సమస్యే” అంది. ఇప్పటిదాకా మేమిద్దరం సన్నిహితంగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు.
“తెలిసి కూడా మీవాళ్ళేమీ అనలేదా?” తెల్లబోయాను.
“మావాళ్ళకి నా జీతం కావాలి”
“ఐతే?”
“మా నాన్న ఎల్డీసీ. ఆస్తులేవీ లేవు. పై ఆదాయం ఏమీ వుండదు. ఇంట్లో ఖర్చులకి ఆయన జీతం చాలదు. చెల్లెలూ, యిద్దరు తమ్ముళ్ళూ వున్నారు. తమ్ముళ్ళు బాగా చిన్నవాళ్ళు. ఇంటరూ, పదీ చదువుతున్నారు. మూడేళ్ళనుంచీ వుద్యోగం చేస్తున్నాను. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని. ఫస్టు రాగానే నా జీతం తీసేసుకుంటారు మా నాన్న. లేకపోతే గడవదు. ఎంతకాలం ఇలా?”
వింటున్న నాకు చాలా యిబ్బందిగా అనిపించింది.
“నీకు తెలీదు శిరీషా! నా జీతంకోసం మానాన్న ఎంత ఆరాటంగా చూస్తాడంటే…నా కనీసావసరాలేమిటని కూడా చూడకుండా అంతా లాక్కుంటాడు. దొంగతనంగా కొంత తీసి దాచుకోవలసిన పరిస్థితి.”
“చాలామంది మనిషికీ మనిషికీ మధ్యని డబ్బు తప్పించి ఇంకేదీ లేదన్నట్టు ప్రవర్తిస్తారు. దాంతో అపార్థాలు చోటుచేసుకుంటాయి. కానీ ఒకటి చెప్పు. నిన్ను చదివించింది మీ నాన్నే. నీకంటూ ఏ సంపాదనా లేనప్పుడు ఆయన సంపాదన మీ అందరిదీ. నీకు స్వంతంగా సంపాదన రాగానే నువ్వు వేరైపోయావా?” అన్నాను మృదువుగా మందలిస్తూ.
మనుషులు కుటుంబాలుగానే వుంటున్నా బాంధవ్యాలు ఒక్కో కుటుంబానికీ ఒక్కోలా వుంటాయనే విషయం నాకు తోచకపోవటానికి కారణం నాలో పరిణతి రాకపోవటమేననేది నిర్వివాదాంశం.
“నీకు ప్రపంచం తెలీదనుకుంటా శిరీషా! అమ్మానాన్నల చేతిలో అనేకాదు, అత్తమామలు, భర్త, నీ పై ఆఫీసర్లు… ఎవరేనా మనని మోసం చెయ్యచ్చు. చాలా నష్టపోతావు. నలుగురు పిల్లల్ని కన్న నా తల్లిదండ్రులకి మాయింట్లో ప్రత్యేకంగా గది వుంటుంది. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో వూహించగలిగే వయసొచ్చిన పిల్లలు హాల్లో వుండగా వాళ్ళు విడిగా పడుకుంటారు. చూసే సినిమాల్లోనూ, వినే పాటల్లోనూ చదివే పుస్తకాల్లోనూ అంతా ప్రేమగురించి వర్ణనే. పురుషసాన్నిహిత్యం గురించి మనకి అర్థమౌతూ వుంటుంది. ఎంతకాలం మన మనసులు వికసించకుండా వుంటాయి? ఎంతకాలం కోరికలు చిగురించకుండా వుంటాయి? ఎలా వాటిని అణుచుకోగలం? చదువయేదాకా ఆగటాన్ని క్రమశిక్షణ, నైతికత, నిబద్ధత అంటారు. ఆ తర్వాత? ఉద్యోగం వస్తుంది. సంపాదిస్తూ వుంటాం. కానీ మనకంటూ ఎవరూ వుండని వంటరితనంలో ఎలా బతగ్గలం? మా తమ్ముళ్ళు ఎప్పటికి ప్రయోజకులవ్వాలి?” తన మాటల్లో తల్లి, తండ్రి, కుటుంబం అనేవాటి కొత్తఅర్థాలు ఆవిష్కరించబడ్డట్టైంది.
“ఏం చేద్దామనుకుంటున్నావు?” బలహీనమైన గొంతుతో అడిగాను.
“ఎబార్షన్ చేయించుకొమ్మంటున్నాడు”
“తర్వాత?’”
“అదే తెలీటం లేదు”
ఏం చెప్పాలో నాకూ తెలీలేదు. సాయంత్రం హాస్టల్లోంచీ వెళ్ళిపోతున్నానని చెప్పేసి నేను ఆఫీసుకి వెళ్ళిపోయాను. ఆఫీసయేసరికి నాన్న వచ్చారు. సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాను. ఎప్పుడలాంటి నిర్ణయం తీసుకుందో మరి, రమ విషం తీసుకుంది. ఆ రాత్రికే తను చనిపోయింది. మర్నాడు ఆఫీసుకి వెళ్ళినప్పుడు తెలిసింది. నిలువునా కదిలిపోయాను. ఇంటికెళ్ళేసరికి జ్వరం వచ్చేసింది. ఆ బెదురులో తను నాతో అన్నవన్నీ అమ్మతో చెప్పేసాను.
“నిజమేనేమో! పిల్లలు చదువుకోవాలి, వుద్యోగాలు చెయ్యాలి అని మన ఆకాంక్షలన్నీ వాళ్ళద్వారా నెరవేర్చుకోవడానికి చూస్తాంగానీ వాళ్ళ మనసులు వికసిస్తాయని ప్రకృతి సహజమైన కోరికలకి వాళ్ళు అతీతులు కాదనీ అనుకోం. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు నమ్మకాన్ని కలిగించలేకపోయారు. పెద్ద తమ్ముడు అంది వచ్చి పెళ్లవాలంటే ఇంకో ఐదారేళ్ళేనా ఆగాలి. అప్పుడేనా తండ్రి చేస్తాడో లేదో! ముప్పైలు దాటుతాయి. తోటివాళ్ళందరికీ పెళ్ళిళ్ళౌతూ తనొక్కర్తీ వుండిపోతే అదొక చిన్నతనం. మంచికో చెడుకో ఈ సంఘటన మనకో పాఠం నేర్పింది. ఇంక సిరికి సంబంధాలు చూస్తేనే బావుంటుంది” అని తర్వాత ఒకసారి అమ్మ నాన్నతో అనటం విన్నాను. నేను తనతో అవన్నీ చెప్పకూడదని అప్పటికి అర్థమైంది.
సంజయ్‍తో నాకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసారు. నాన్న స్నేహితుడి కొడుకతను. చాలా బావున్నాడు. అతనికి నేనంటే ఎప్పట్నుంచో యిష్టమట. కళ్ళలో ఆరాధన వ్యక్త మౌతోంది. ఆరులక్షలట అతని జాబ్ మార్కెట్ విలువ. ఇంకా పెరిగే అవకాశం వుందని చెప్పాడు. నాన్న రెండులక్షలు తనంతట తను కట్నం ఇస్తామన్నారు. వాళ్ళు నవ్వి వూరుకున్నారు. నాకు మాత్రం ఎక్కడో చురుక్కు మంది.
“ఎందుకివ్వాలి, వాళ్ళకంత డబ్బు?” అని అంతా వెళ్ళిపోయాక దెబ్బలాడాను. డబ్బు సరిపోదని అమ్మానాన్నా చంపుకున్న ఎన్నో సరదాలు గుర్తొచ్చాయి. నా ఆలోచనలు యిలావుంటే నాన్న చాలా సీరియసయ్యారు. “చూడు సిరీ! చిన్నపిల్లలా మాట్లాడకు. అతని తండ్రి కట్టించిన యింట్లో వుంటావు. వాళ్ళిచ్చే ఆస్తిని అనుభవిస్తావు, నీదంటూ ఏమీ తీసుకెళ్ళకుండానే…” అన్నారు.
“అతనికి వండుతాను. ఇల్లు చూసుకుంటాను” ఇంకా ఏదో అనబోతుంటే ఆపి, నాన్న అన్నారు.”అతని గోత్రాన్నీ, యింటిపేరునీ మోస్తావు. ఇంకా అతనికి పిల్లల్ని కంటావు. కానీ నువ్వతనికి వంటమనిషివో, పనిమనిషివో కాదు. పెళ్ళి అతనికెంత అవసరమో నీకూ అంతే అవసరం. ఇల్లరికం రమ్మంటే అతనికెంత పౌరుషమో. కోడరికం వెళ్ళటానికి నీకూ అంతే వుండాలి. కానీ ఎవరో ఒకరు వెళ్ళకపోతే పెళ్ళనేది సాధ్యపడదు. రెండు కుటుంబాలూ కలవకపోతే మానవసంబంధాలు బలహీనపడతాయి. అందుకని ఆడపిల్లకి ఆ బాధ్యత యిచ్చారు. సిరీ! నాలుగురోజులు బంధువులిళ్ళకి వెళ్తేనే వాళ్ళవి ఏవీ వాడుకోకూడదని, సబ్బు, పేస్టుతోసైతం అన్నీ తీసుకెళ్తావు. భర్తమీద మాత్రం అన్నిటికీ ఆధారపడతానంటావేమిటి?”
నాన్న హర్టయ్యారని గ్రహించాను. నేను సగటు ఆడపిల్లలా తమని పరాయిగా చూస్తూ, ఎక్కడో వుంటూ యింకా నా జీవితంలోకి అడుగుపెట్టని వ్యక్తిని స్వంతంగా భావిస్తున్నానని తననుకుంటున్నారు.
“అతనిమీద ఎందుకాధారపడతాను నాన్నా, నాకు వుద్యోగం వుండగా?” అన్నాను.
“నేను కట్నంగా అతనికివ్వటం లేదు. అలాంటివి యిష్టం వుండవట. స్త్రీధనంగా నీకిస్తాను. సరా?”
“ఉందనో, ముందుగా ప్లాన్ చేసుకునో మీరిస్తారు. దాన్ని స్త్రీధనం అన్నా, వరకట్నం అన్నా ఆడపిల్ల తండ్రికి భారమేకద నాన్నా! ఎంతమంది ఆడపిల్లలు కట్నానికి ఆహుతౌతున్నారు? ఎందరు ఆడపిల్లలు కట్నాల భయానికి పుట్టకుండానే చచ్చిపోతున్నారు?” అన్నాను. అప్పటిదాకా మా వాదన వింటూ కూర్చున్న అమ్మ అంది. “ఔను. ఎంతమంది ఆడవాళ్ళు కనలేక చచ్చిపోతున్నారు? వాళ్ళని చూసి మిగిలిన ఆడవాళ్ళంతా కనడం మానెయ్యచ్చుకదా? రోడ్డుమీదికెళ్తే ఎన్నో యాక్సిడెంట్లు. మరి నువ్వు స్కూటీలేందే యిల్లు కదలవు. సిరీ! సమస్య వ్యక్తిగతం. ఏదీ కూడా సామాజికం కాదు. కానీ సమస్యని ఎదుర్కొనేటప్పుడు అందరూ కలవాలి” అంది. నేను తెల్లబోయాను.
“వరకట్నం దురాచారం కాదని నేనెప్పుడూ అనను. కానీ కట్నంచావుల్లో సింహభాగం బాధ్యతమాత్రం ఆడపిల్ల తల్లిదండ్రులదే. ఆడపిల్లని చదివించి ఆర్ధిక స్తోమత కల్పించకపోవటం, తాహతుకి మించిన సంబంధం తేవటం, వప్పుకున్న కట్నం యివ్వలేకపోవటం, అత్తగారింట్లో గొడవలున్నాయని తిరిగొచ్చిన అమ్మాయిని ఆదరించి, మరో ఆధారం చూపించకపోవటం, అన్నిటికీమించి ఆ అమ్మాయిని పుట్టినప్పట్నుంచే పరాయింటి పిల్ల అనుకోవడం. ఇంకా చాలా వున్నాయి. మేం మాత్రం మా పిల్లలు కష్టపడకూడదని అనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వున్న స్థాయినుంచీ ఇంకో మెట్టు పైకి వెళ్ళానని కోరుకుంటున్నాం” అంది.
తన మాటలు నాలో ఆలోచనని రేకెత్తించాయి. ఇదంతా నేనెప్పుడూ ఆలోచించని పార్శ్వం. ఆడపిల్ల ఒక వ్యక్తి. ఆమె అవసరాలన్నీ చూసి అత్తవారింటికి పంపటం తమకి ప్రీతికరమైన బాధ్యతంటున్న అమ్మా నాన్న, నాకు సిరి అంటే చిన్నప్పట్నుంచీ యిష్టమంటున్న సంజయ్ నన్ను నాకే భిన్నంగా చూపించారు.


నిశ్చితార్ధం. బంధువులంతా వచ్చేసారు. ఇల్లంతా హడావిడి.
“చాలా బావున్నాడే నీ హీరో” స్నేహితులు, కజిన్స్ ఏకగ్రీవంగా నిర్ధారించారు. ఆ మాటలు సంజయ్‍కి వినిపించాయేమో, నన్ను చూసి అల్లరిగా
నవ్వుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా నన్ను వాళ్ళవైపు బంధువులకి పరిచయం చేస్తున్నారు.
ఫంక్షనైపోయింది. వచ్చినవాళ్ళంతా చాలావరకూ వెళ్ళిపోయారు. చాలా ముఖ్యమైనవాళ్ళు మాత్రం మిగిలారు.
“సిరీ!” ప్రీతి నన్ను పక్కకి పిలిచింది. “బావ నీతో మాట్లాడతాడట. ఏదో అడగడం మర్చిపోయాడంటే పెరట్లో జాజిపందిరి దగ్గర నిలబెట్టి వచ్చాను” అంది. నాకేం అర్ధమవలేదు. “నువ్వూ రావే” అన్నాను బెరుగ్గా. తెలిసిన మనిషే. ఇప్పుడేంటో ఇలా.
“నేనొస్తే తంతానన్నాడు” అని వెళ్ళిపోయింది.
చేసేదేంలేక ఒక్కదాన్నే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అతన్ని అంత దూరాన్నించి చూడగానే నా అడుగులు తడబడిపోయాయి. చీర కుచ్చిళ్ళు పాదాలకి అడ్డుపడుతుంటే దూరాన్ని కొలుస్తున్నట్టు నెమ్మదిగా నడుస్తున్నాను. అతను చిరునవ్వుతో నా రాకని గమనిస్తున్నాడు. చిన్న జీరోబల్బు మాత్రమే వెలుగుతోందక్కడ. పైన ఆకాశం, నక్షత్రాలు, వాటిమధ్య చంద్రుడు… రాలిన జాజిపూలమధ్య ఇతనూ అలాగే…
ఆ డిమ్‍లైట్లో అతని ముఖంలో వింత అందం కనిపిస్తోంది. నేను పందిరి కిందికి రాగానే బలంగా తీగని వూపాడు. పువ్వులు వర్షంలా జలజలా రాలాయి.
“స్వాగతం” రెండు చేతులూ చాపుతూ అన్నాడు. అతను నడిచొచ్చి నన్ను అందుకున్నాడో, నేనే వెళ్ళి అతని చేతుల్లో వాలిపోయానో గ్రహించేలోపే అతని చేతుల్లో వున్నాను.
“సిరీ! నీకో కానుక యివ్వాలి”
“ఏమిటి?”
అతని పెదవులు నా చెక్కిలిమీద ఒక అద్భుతమైన ముద్దుని ముద్రించాయి. నా మనసంతా నక్షత్రాలతో నిండిన నీలాకాశం అయింది. అదే క్షణంలో దూదిపింజలా తేలిపోయే నీలిమేఘమై, సముద్రాంతాన వుదయించే సూర్యబింబంగా మారి, నేనెంతో యిష్టపడే అన్నిటిగానూ మారిపోయింది.
“నేను నీకు నచ్చానా?”” కొద్దిక్షణాల తర్వాత గుసగుసగా అడిగాడు.
“ఇప్పుడా అడగటం?”
“అప్పుడే అడిగితే నచ్చలేదనేస్తే?”
ఇద్దరం క్రమంగా బాహ్యప్రపంచంలోకి వచ్చాము. నా మనసింకా మత్తులోనే తూగుతోంది. అతని స్వరం మంద్రంగానే అయినా, స్పష్టంగా ధ్వనిస్తోంది.
“అంకుల్ కట్నం యిస్తానన్నారు. చాలా మామూలుగా అనేసారు. చదువుకున్నవాళ్ళమైనా మనం దానికి ఎలా అలవాటుపడిపోయామో అని ఆ క్షణాన బాధనిపించింది. పెళ్ళి మనిద్దరి అవసరం. అందుకే పెళ్ళిచేసుకోవటానికి డబ్బు అనే కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. వద్దన్నాను. నీకు స్త్రీధనంగా యిస్తానన్నారు. ఆ విషయంలో నేనేదీ చెప్పలేను. మనది కమ్యూనిస్టు దేశం కాదు. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకి వస్తుంది. అలా ఏ తల్లిదండ్రులేనా యివ్వకపోతే వాళ్ళు తమని తృణీకరించినట్టుగా పిల్లలు భావిస్తారు. బాధపడ్తారు. ఇలాంటి నేపథ్యంలో మీ నాన్నగారిదగ్గర్నుంచీ నీకూ కొన్ని ఆశింపులు వుండచ్చు. కాబట్టి నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఆయన యివ్వగలరా, ఎంత యివ్వగలరు? తీసుకోవటం అవసరమా? ఇప్పుడే తీసుకోవాలా? అనే విషయాలు నీకే తెలుస్తాయి” అన్నాడు. “నువ్వేమీ తీసుకోవద్దనుకున్నా కూడా, నీకు మా యింట్లో జరిగే అగౌరవం ఏమీ వుండదు”
అతని అభిప్రాయం చాలా స్పష్టంగా అర్థమైంది. అతను మరొకసారి నన్ను దగ్గరగా హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఈమాటు నుదుటిమీద. అందులో కాంక్ష, తమకం లేవు. అనురాగం వుంది. “చీకటి, అలవాటు లేని చీర. జాగ్రత్తగా వెళ్ళు” అన్నాడు చీకట్లో కలిసిపోతూ.
ఒక్కక్షణంలో నా మనసు మత్తులోంచీ బైటికొచ్చింది. భయంకరమైన వంటరితనంలోకి జారిపోయాను. రమ గుర్తొచ్చింది. రాజుతో ఆమె పంచుకున్న తొలిక్షణాలు కూడా యింత అద్భుతమైనవేనా? జవాబు కోసం వెతికాను. దొరకలేదు. హృదయపు అట్టడుగున ఎక్కడో దు:ఖపు చెమ్మ తగిలింది. ఇంక నిలబడలేకపోయాను. ఒక్క పరుగుని యింట్లోకి వచ్చి, వంటింట్లో ఏదో సర్దుతున్న అమ్మని వెనుకనుంచీ అల్లుకుపోయి మెడవంపులో తలదాచుకున్నాను. దుఃఖపుకెరటాలు ఎగిసెగిసి పడుతున్నాయి, నన్ను వుక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
“సిరీ! సిరీ! ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఐనా యిలాంటివేళ నిన్నెవరుమాత్రం ఏమంటారు?” అమ్మ కంగారుగా నాకేసి తిరిగి అడిగింది.
“రమ… రమ గుర్తొస్తోందమ్మా! తనకికూడా అన్నీ ఇలా జరగాలని కోరుకుని వుంటుందా? ఎందుకమ్మా యీ ప్రపంచంలో అందరికీ అన్నీ లభించవు? కొందరికోసం కొన్నే వుంటాయి?” ఉద్వేగంగా అడిగాను.
అమ్మ సుదీర్ఘంగా నిశ్వసించింది. “”ఇంత బేలగా వుంటే ఎలా? నీకు సంబంధంలేని విషయాల గురించి ఎందుకే, మనసు పాడుచేసుకుంటావు? పూర్వజన్మఫలం అనుకుంటే పోలే?” అని, “చూడు. నువ్విలా ఏడిస్తే అంతా ఏమనుకుంటారు? అతనితో మాట్లాడి వచ్చి యిలా ఏడిస్తే, అతనేదో అన్నాడనుకోరూ? ఐనా చీకట్లో నిలబెట్టి మాటలేంటి?..నీ గదిలో కూర్చోవచ్చుగా?” నెమ్మదిగా మాట మార్చేసింది. అటుగా వచ్చిన పెద్దత్తయ్య ఆఖరిమాటల్ని మాత్రం వింది. ఆ మాటలందుకుని ఒక్కొక్కరూ ఏడిపించడం మొదలుపెట్టేసరికి నా దుఃఖం మరుగున పడిపోయింది.
పెళ్ళికింకా పదిరోజులుంది. నేను రెండుగా విడిపోయాను. ఒకటి శరీరం, మరొకటి మనసు. శరీరంతో వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నా మనసు వెళ్ళి అతని కలల్లో విహారాలు చేసి వస్తోంది. పొద్దున్న నిద్రలేచేసరికి అతని ఫిర్యాదులు.
భవిష్యత్తులో ఎప్పుడేనా అవలోకించుకుంటే నా జీవితం మొత్తంమీద అత్యంత భారంగా కదిలినవీ, నుదీర్ఘమైనవీ యీ పదిరోజులే ఔతాయి. ఏ పనిమీదా ధ్యాస లేదు. తిండి తినాలని లేదు. నిద్ర రాదు. ఆఫీసుకి ముందే సెలవుపెట్టేసాను. ఎవరేనా పలకరిస్తే వులిక్కిపడుతున్నాను.
ఇద్దరి అంతరంగాలమధ్య అంతరాలు చెరిగిపోయాయి. ప్రేమ పారస్పరికం. అందులో అర్పణ, స్వీకృతి రెండూ వుంటాయి. నన్ను నేను అర్పించుకున్నాను. అతన్ని మనసునిండా స్వీకరించాను. నేను నేనులా అని పించటం లేదు నాకే!


పెళ్ళైంది. అలగటాలూ, కోపతాపాలూ, గాయపర్చుకోవటాలూ ఏమీ లేవు. ఒక ఫేమిలీఫంక్షన్‍లా జరిగిపోయింది.
“చాలా అదృష్టవంతురాలివి సిరీ! చదువూ, వుద్యోగం, ఆస్తీ, అంతస్తూ యివేవీ యివ్వని అందం మగవాడికి సంస్కారం యిస్తుందమ్మా! ఎంతో సంస్కారవంతులు వీళ్ళు. ఎన్నో పెళ్ళిళ్ళు చూసాను. ఆడపిల్ల పెళ్ళి అనగానే చివరికి కన్నీళ్ళే మిగిలేవి. అవమానాలు తప్ప ఆనందం వుండేది కాదు” అంది అమ్మ సంతృప్తి మెరుస్తున్న కళ్ళతో.
“యుటోపియన్‍లేండ్‍లోలా జరిగిందే మీ పెళ్ళి” అన్నారు ఫ్రెండ్సంతా.
అతనితో యుటోపియన్‍లేండ్‍లో గృహప్రవేశమయే వేళ ఎక్కడిదో ఒక నల్లటి మేఘం కదిలి వచ్చి నాలుగు పెద్దపెద్ద చినుకుల్ని అక్షంతల్లా జల్లింది. తనువు తడిసింది. మనసూ తడిసింది, రమ జ్ఞాపకం హఠాత్తుగా కదిలి. ఎంత పెద్దసమస్యైనా వ్యక్తిగతమే కావచ్చు. కానీ ఒక చిన్నసంతోషం మాత్రం అలాకాదు. నీ చుట్టూ వున్నవాళ్ళు అందిస్తేనే నీకది అందుతుంది. నీకు నువ్వుగా సృజించుకోలేనిది అది. అలాగనుక నువ్వేదైనా సంతోషాన్ని పొందగలిగితే అది నీ అదృష్టమో, నైపుణ్యమో కాదు, సమాజంపట్ల నీ వుదాశీనత.
“ఓ దేవుడా! నాకోసం సృష్టించినట్టే యీ దేశంలోని ప్రతి ఆడపిల్లకోసం ఒక యుటోపియాని సృష్టించు. నేనడుగుపెట్టిన ఈ ప్రశాంతప్రపంచాన్ని మరోతరం వరకూ విస్తరించగలిగే నైతికబలాన్ని నాకివ్వు” నిశ్శబ్దంగా ప్రార్ధించాను.
గోపీకృష్ణ నన్ను అదృష్టవంతురాలివని అన్నాడు. కట్నం లేని పెళ్ళి అతనికి పెద్ద ఆశ్చర్యం.
రమ తండ్రి కూతురి ఫేమిలీపెన్షనుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్న విషయం కూడా పెళ్ళిలోనే తెలిసింది. గుండె యింకాస్త బరువెక్కింది. అనుభవం మనిషికి జ్ఞానాన్నిస్తుంది. ఒక్కొక్కసారి అది పునర్జన్మ కూడా ఔతుంది.
“నీ వయసెంత?” అనే ప్రశ్నకి
“ఇరవైమూడు” అని నిర్ద్వంద్వంగా చెప్పి,
“నీకు జీవితమంటే ఏంటో ఏ కొంచెమేనా తెలుసునా?” అనికూడా అడిగితే,
“పుట్టి యిన్నేళ్ళు గడిచింది. ఇదంతా జీవించటం కాదా?” అని ఎదురడిగే స్థాయినుంచీ యింకా ఎదిగాను.
పుట్టి ఎన్నో కొన్నేళ్ళు గడపడం కాదు, జీవితమంటే. డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం ప్రకారం అది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఔతుంది. పెద్దదో చిన్నదో ఒక అనుభవం తటస్ధించాలి. అది అప్పటిదాకా వున్న అమాయకత్వాన్ని పెళ్ళలుపెళ్ళలుగా కూల్చాలి. ఆ శిధిలాల మీద పునర్నిర్మితమ య్యేదే జీవితం. అలాంటి అనుభవం నాకు ఇరవైమూడోయేట తటస్థించింది.

(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 30/9/2004)