ఓవర్‍కోటు – 3 Translation by S Sridevi

  1. ఓవర్‍కోటు – 1 Translation by S Sridevi
  2. ఓవర్‍కోటు – 2 Translation by S Sridevi
  3. ఓవర్‍కోటు – 3 Translation by S Sridevi
  4. ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi
  5. ఓవర్‍కోటు – 5 Translation by S Sridevi
  6. ఓవర్‍కోటు – 6 Translation by S Sridevi

రష్యన్ మూలం “Shinel” by Nikolai V Gogol (in 1842)
Translated to English as “The Overcoat” by Isabel F Hapgood (in 1886) and available in Project Gutenberg in the Public domain.

అకాకీకి ఒక అలవాటు వుంది. తను ఖర్చు చేసిన ప్రతి రూబుల్‍కీ లెక్కగా ఒక గ్రోషెన్ నాణాన్ని గల్లాపెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. ఆర్నెల్లకోసారి వాటిని లెక్కవేసి పెద్ద నాణెంగా మార్చుతాడు. అలా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు. నలభైరూబుళ్ళదాకా పోగుపడి వుంటుంది. నలభై రూబుళ్ళు… అదే అతనికి కొంత వూరటనిచ్చింది. మరి మిగతాది?
పొదుపు… అదొక్కటే మార్గం. కనీసం ఏడాదిపాటు.
సాయంత్రం టీ మానేసాడు. రాత్రులు కొవ్వొత్తులు వెలిగించకుండా ఏదేనా ముఖ్యమైన పని వుంటే ఇంటామె దగ్గర కూర్చుని చేసుకునేవాడు… ఆమె చికాకుపడ్డా పట్టించుకోలేదు. బూట్లు అరగకుండా చాలా జాగ్రత్తగా నడిచేవాడు. ఇంటికి రాగానే ఆఫీసు బట్టలు మార్చుకుని పాతబడ్డ నూలుదుస్తులు వేసుకునేవాడు, వాటిని వుతికించే అవసరాన్నీ చాకలి ఖర్చునీ తగ్గించేందుకు. మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డా తను తీసుకున్న నిర్ణయాలకి క్రమంగా అలవాటుపడ్డాడు అకాకీ. డబ్బు తొందరగా సమకూర్చుకోవటంకోసం ఒకొక్కప్పుడు రాత్రివేళ తిండికూడా మానేసేవాడు. కొత్తకోటునిగురించి కలలుకంటూ మనసునీ, ఆకలినీ జోకొట్టేవాడు. కొత్తకోటు అతని వూహల్లో ఒక జీవనసహచరిలా, ఇంట్లో వున్న మరొక వ్యక్తిలా, చిరపరిచితుడైన మితృడిలా ఐపోయింది.
చాలా దృఢంగా వుండే కోటు… ఊహల్లోకొచ్చి అతన్ని మైమరపించేది. అతని వ్యక్తిత్వంలోనే ఒక మార్పు. ఒక నిర్దుష్టగమ్యంవేపు ప్రయాణం చేస్తున్నట్టు గంభీరంగా మారిపోయాడు. అతని కళ్ళలో మెరుపు. కుట్టించుకోబోయే కోటు ఎలా వుండాలనేదానిపై కొన్ని ఆలోచనలు. మార్టిన్ ఉన్ని కాలరు పెట్టించుకుంటేనో? ఏ రంగు బావుంటుంది? బట్ట ఎక్కడ తీసుకోవాలి? ఇలా ఆలోచిస్తూ ఒకొక్కసారి చేసే పనిలో తప్పులుకూడా దొర్లించేవాడు. మళ్ళీ ఈలోకంలో పడి, నాలిక్కర్చుకుని సరిదిద్దుకునేవాడు. ప్రతీనెలా ఈ విషయాలపై పెట్రొవిచ్‍తో చర్చించి, సలహాలు తీసుకుని సంతృప్తిపడి తిరిగొచ్చేవాడు. ఇద్దరూ కలిసి బజారంతా తిరిగి ధరలు తెలుసుకునేవారు. కష్టపడుతున్నా, తగ్గ ఫలితం దొరకబోతోందని సంతోషపడేవాడు అకాకీ.
అనుకున్నదానికన్నా ముందే డబ్బు సమకూరింది. అకాకీ అవసరాన్నీ, దానికోసం అతను పడుతున్న కష్టాన్నీ డైరక్టరు గుర్తించే అలా చేసాడో లేదా యథాలాపంగా జరిగిందోగానీ వూహకి అందని విధంగా అతని జీతం నెలకి అరవైరూబుళ్ళకి పెరిగింది. పెరిగిన ఇరవై రూబుళ్ళనేది చిన్నమొత్తం కాదు. మొత్తానికీ ఎనభైరూబుళ్ళూ పోగుపడ్డాయి. ఎప్పుడూ ఎలాంటి సంతోషాన్నీ ఎరగని అకాకీ హృదయం ఆనందంతో గంతులు వేసింది.
తీరిక దొరికిన వెంటనే పెట్రొవిచ్‍ని తీసుకుని కోటుకి బట్ట కొనాలని బయల్దేరాడు. చక్కటిబట్ట చవకలో దొరికింది. ఇంతకన్నా మంచిబట్ట వుండదని పెట్రొవిచ్ తీర్మానించాడు. లోపల లైనింగుకి సిల్కుకన్నా మందపాటి నూలువస్త్రం మంచిదని నిర్ణయించేడు. కాలురుకి మార్టిన్ వున్ని బదులుగా పిల్లిబొచ్చు వాడాలనుకున్నారు. పెట్రొవిచ్ ఓవర్‍కోటు కుట్టడానికి రెండువారాలు తీసుకున్నాడు. మన్నికైన సిల్కుదారాలతో రెండుకుట్లు వేసి చాలా జాగ్రత్తగా కుట్టాడు. అందుకు పన్నెండు రూబుళ్ళు తీసుకున్నాడు.
కుట్టిన కోటుని ఉతికిన పెద్ద జేబురుమాలులో చుట్టి అకాకీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చిన ఓవర్‍కోటుని జాగ్రత్తగా బయటికి తీసి, రెండుచేతుల్తో పట్టుకుని అకాకీ భుజాలకి తొడిగాడు. అకాకీ పెద్ద అనుభవజ్ఞుడిలా చేతులు దూర్చబోయాడు. పేట్రొవిచ్ సాయం చేసాడు. కోటు చాలా చక్కగా సరిపోయింది. తన పనితనాన్ని గొప్పగా చుసుకున్నాడు పెట్రొవిచ్. ఇంత నైపుణ్యానికి కుట్టుకూలిగా తీసుకుంటున్నది చాలా తక్కువనిపించింది. ఇదేగనుక తను దుకాణం ఏ నెవ్‍స్కీ ప్రాస్పెక్ట్‌లోనో పెట్టి వుంటే కనీసం డబ్బయ్యైదు రూబుళ్ళేనా తీసుకునేవాడు. తన దుకాణం సందుగొందుల్లో వుంటుంది. పెద్దమనుషులు రావటానికి అనువుగా వుండదు. దుకాణం వునికిని తెలిపే బోర్డు కూడా లేదు. అదీకాక అకాకీ తనకి ఎంతోకాలంగా పరిచయం. అందుకే ఇంత తక్కువకి కుట్టవలసి వచ్చింది. ఈ మాటలని పైకే అన్నాడు. కొత్తకోటు మురిపెంలో అకాకీ పట్టించుకోలేదు. వప్పుకున్న డబ్బులు ఇచ్చేసి పంపేసాడు. అతని జీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు. ఇదొక్కటే ఆనందపు సంఘటన.
ఉదయం తయారై ఆఫీసుకి వెళ్లబోయే సమయం. సరైన సమయంలోనే అది అకాకీకి అందింది. చలి వుదృతం కాబోతున్న స్పష్టమైన హెచ్చరికలు కనిపిస్తున్నాయి. కొత్తకోటుతోటే ఆఫీసుకి వెళ్ళాడు.
అతనికి చాలా వుల్లాసంగా వుంది. కొత్తకోటు వేసుకున్నానన్న సంతోషం ఒకవైపు, దాని అందం, అది యిస్తున్న వెచ్చదనం మరోవైపు అతన్ని వుక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఆ సంతోషంలో ఎప్పుడు ఆఫీసుకి చేరాడోకూడా గురించలేదు. కోటు ఇప్పి, అక్కడ హేంగరుకి తగిలిస్తూ జాగ్రత్తగా చూడమని అక్కడి బంట్రోతుకి చెప్పాడు. ఆఫీసులో అందరికీ విషయం తెలిసింది. అందరూ ఒక్కుమ్మడిగా వెళ్ళి కోటు చూసి, అకాకీకి అభినందనలతోపాటు, సరదాకబుర్లు కూడా చెప్పారు. అతను మొదట్లో చిరునవ్వు నవ్వాడుగానీ అభినందనల వెల్లువ పెరిగిపోతుంటే సిగ్గుపడసాగాడు.
“పాతకోటుకి కేప్ అని పేరు పెట్టినట్టే ఈ కొత్తదానికికూడా నామకరణం చెయ్యాలి. పార్టీ ఇవ్వు” అందరూ చుట్టుముట్టి అడిగారు. అకాకీ మరీ సిగ్గుపడిపోయాడు. ఇదేమీ కొత్తదికాదనీ, కేప్‍నే మార్చి కుట్టించుకున్నానని అనేసాడు.
ముఖ్యగుమస్తా కింద పనిచేసే ఒక వుద్యోగి. వీళ్ళందరికన్నా కొంచెం పైమెట్టుమీద వున్నవాడేగానీ అందరితో కలుపుగోలుగా వుంటాడు.
“అతన్నెందుకు ఇబ్బందిపెడతారుగానీ, నేనిస్తాను, మీరడిగిన పార్టీ. ఈరోజు నేను బాప్టైజ్ ఐనదినం” అన్నాడు.
అంతా అతనికి శుభాకాంక్షలు చెప్పారు. అకాకీ పార్టీకి తను రానన్నాడు. వాళ్ళు వదిలిపెట్టలేదు. పైకి అలా రానన్నాడుగానీ రాత్రికూడా మరోమాటు కోటు వేసుకోగలందుకు అతనికి లోలోపల సంతోషంగానే అనిపించింది. ఆరోజంతా ఒక పండుగలా చాలా సంతోషంగా గడిచింది అకాకీకి. ఇంటికొచ్చి, కోటు ఇప్పి గోడకి తగిలించాడు. మరోసారి దాని అందాన్ని పరికించాడు. పాతకోటు తీసుకొచ్చాడు. రెండిటినీ పోల్చి చూసుకున్నాడు. పాతదాన్ని చూస్తుంటే నవ్వొచ్చింది. తర్వాత భోజనం చేసాడు. ఆరోజుకి రాతపనేం పెట్టుకోలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని, చీకటిపడ్డాక పార్టీకి బయల్దేరాడు.
సెయింట్‍పీటర్స్‌బర్గ్ సందులన్నీ గజిబిజిగా వుంటాయి. అతిథ్యం యిచ్చే చిన్నగుమస్తాగారి యిల్లు ఆ సందుగొందుల్లో ఎక్కడో వుంటుంది. నగరాలెప్పుడూ రెండు రకాలుగా విస్తరిస్తాయి. బీదాబిక్కీ, చిరుద్యోగులూ నివసించే ప్రాంతం ఒకవైపుకీ, కాస్తనుంచీ బాగా సంపన్నవర్గాలవారు వుండే యిళ్ళు మరోవైపుకీ వుంటాయి. రెండుప్రాంతాలనీ విడదీస్తూ నిర్మానుష్యంగా వుండే ప్రదేశాలూ, కొన్ని కూడలులూ వుంటాయి. మొత్తానికి అకాకీ వెళ్ళవలసిన చోటు అతని యింటికి బాగా దూరం.
మసకదీపాల వెలుతుర్లో జనసమ్మర్దం అసలే లేని సందుల్లో నడిచాక సంపన్నుల ప్రాంతానికి వచ్చాడు. దీపాల వెలుతుర్లో కూడా తేదా వుంది. ఇక్కడన్ని దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఖరీదైన దుస్తుల్లో అనేకమంది స్త్రీపురుషులు, గుర్రపు బగ్గీలు, కనిపించాయి. ఇదంతా అకాకీకి కొత్త. వింతగా చూసాడు. కొన్ని సంవత్సరాలుగా అతను వీధుల్లోకే రాలేదు. ఒక దుకాణం ముందు ఆగాడు. అక్కడ అతనికి ఒక చిత్రపటం కనిపించింది. ఒక అందమైన యువతి ఒక కాలిచెప్పు విసిరేసి నిలబడి వుంటే చక్కటి మీసకట్టు, గెడ్డంతో వున్న యువకుడు వెనకగదిలోంచీ తొంగిచూస్తున్నాడు. ఆ చిత్రపటం చూడగానే అకాకీకి నవ్వొచ్చింది. అలా నవ్వుకుంటూనే ముందుకి సాగాడు. ఎందుకలా నవ్వొచ్చిందో అతనికే తెలీదు. అందరికీ నచ్చినట్టే ఆ చిత్రపటం అతనికీ నచ్చింది. అందుకు సూచనగా నవ్వొచ్చింది.
మొత్తానికి ఆ చిన్నగుమస్తా వుండే అపార్టుమెంటుకి చేరుకున్నాడు. చాలా అందమైన భవనం అది. చిన్నగుమస్తా బస రెండోఅంతస్తులో వుంది. మెట్లమీద దీపం వెలుగుతోంది. మెట్లెక్కగానే వున్న వసారాలో మంచునించీ కాపాడే రబ్బరుబూట్ల పెద్దవరుస కనిపించింది. దాటి గదిలోకి వెళ్తే అందమైన సమొవార్, అందులో మసులుతూ పొగలు చిమ్ముతోన్న తేనీరు అతని దృష్టిని ఆకర్షించాయి.. గోడకి రకరకాల కోట్లు, వోవర్‍కోట్లు వేలాడుతున్నాయి. బీవర్‍బొచ్చు కాలర్లు, వెల్వెట్ అంచులూకూడా వున్నాయి కొన్నిటికి. లోపల్నుంచీ మాటలు వినిపిస్తున్నాయి. సేవకుడొకడు ఖాళీగ్లాసులు, క్రీము జగ్గులు, చక్కెరకప్పులు వున్న ట్రే తీసుకుని అకాకీ వున్న గదిలోంచీ వెళ్ళాదు. మిగిలినవాళ్ళంతా చాలాసేపటిక్రితమే వచ్చి వున్నారని అర్థమైంది.
అకాకీ తన కోటునికూడా గోడకి వేలాడదీసి, లోపలికి ప్రవేశించాడు. ఒక్కసారి కళ్ళముందు ఎన్నో శబ్దాలు, దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. దేదీప్యమానమైన దీపాలు, పైపు తాగుతున్న అధికారులు, పేకాటబల్లలు… వాళ్ళ సంభాషణలు… అక్కడ కూర్చున్నవాళ్ళు చోటు మారినప్పుడు కుర్చీలు, బల్లలు కదిలిన చప్పుళ్ళు వీటన్నిటితో అతడు తికమకపడ్డాడు. ఏం చెయ్యాలో తోచక గది నడిమధ్యలో నిలబడిపోయాడు. అతని రాకని అంతా గమనించారు. పెద్దగా కేకలువేస్తూ కోలాహలంగా అతనిచుట్టూ గుమిగూడారు. మరోమాటు ముందుగదిలోకి వెళ్ళి అతని
ఓవర్‍కోటు నాణ్యతనీ అందాన్నీ ప్రశంసించి వచ్చారు. కొంచెం ఇబ్బందిపడినప్పటికీ అకాకీ నిష్కల్మషహృదయంతో అదంతా ఆస్వాదించాడు. ఆ తర్వాత అతన్ని వదిలిపెట్టి, పేకాట బల్లలదగ్గర మళ్ళీ స్థిరపడ్డారు. షాంపేన్ వచ్చింది. అది తాగటంతో అతని మనసు తేలికపడింది. కానీ ఒక అయోమయం. తనెక్కడున్నాడు, ఎలా నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి, కూర్చున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలి ఇలాంటి అనేక సందేహాలు. చివరికి ఒక పేకాటబల్లముందు కూర్చున్నాడు. పేకముక్కలని, ఆటగాళ్లముఖాలనీ మార్చిమార్చి చూసాడు. కొంతసేపు ఆసక్తికరంగా అనిపించినా, నెమ్మదిగా అలసట మొదలైంది. అప్పటికి చాలా సమయం గడిచింది. ఆసరికల్లా అతను మంచినిద్రలో వుంటాడు.
అతను ఇంక సెలవుతీసుకోవాలనుకున్నాడు. వాళ్ళు వెళ్ళనివ్వలేదు.
“నీ కొత్తకోటు గౌరవార్థం షాంపేను తాగాల్సిందే” పట్టుబట్టారు.
ఇంకో గంట పట్టింది రాత్రిభోజనం రావటానికి. కూరగాయల సలాడ్, చల్లని దూడమాంసం, పేస్ట్రీ, మిఠాయిలు, మళ్ళీ షాంపైన్. అకాకీ ఇంకో రెండుగ్లాసుల షాంపైన్ పట్టించాడు. పన్నెండైందని అతని మనసులో మెదుల్తునే వుంది. ఇంక వుండాలనిపించలేదు. ఎవరూ చూడకుండా నెమ్మదిగా జారుకుని ముందుగదిలోకి వచ్చాడు. తన కోటుకోసం వెతికాడు. అది కిందపడి వుంది. చాలా దు:ఖం కలిగింది. దాన్ని తీసుకుని దుమ్ముదులిపి భుజమ్మీద వేసుకుని మెట్లు దిగి రోడ్దుమీదికి వచ్చాడు.