ఓవర్‍కోటు – 1 Translation by S Sridevi

  1. ఓవర్‍కోటు – 1 Translation by S Sridevi
  2. ఓవర్‍కోటు – 2 Translation by S Sridevi
  3. ఓవర్‍కోటు – 3 Translation by S Sridevi
  4. ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi
  5. ఓవర్‍కోటు – 5 Translation by S Sridevi
  6. ఓవర్‍కోటు – 6 Translation by S Sridevi

రష్యన్ మూలం “Shinel” by Nikolai V Gogol (in 1842)
Translated to English as “The Overcoat” by Isabel F Hapgood (in 1886) and available in Project Gutenberg in the Public domain.

దేవుడు మనుషులందరినీ ఒకేలా పుట్టిస్తాడనేది అవాస్తవం. కొందరు అందంగా వుంటే మరికొందరు కురూపితనంతో వుంటారు. కొంతమంది తెలివైనవారు, ఇంకొంతమంది మేథకులు. పుట్టుకతోటే డబ్బునవాళ్ళు కొందరైతే, పేదరికపు ఇనుపకౌగిట్లో పుట్టినవాళ్ళు మరికొందరు. ఇవికాక మధ్యలో వచ్చే అనారోగ్యాలు, జీవితక్రమంలో పుట్టే వ్యక్తిగత, సామాజిక సమస్యలు. ఏ శిశువూ అవలక్షణాలతో పుట్టించమని దేవుని కోరుకోడు. పుట్టాక ఏ వ్యక్తీ అనారోగ్యాలూ, సమస్యలూ కావాలనుకోడు. కానీ అవి అలా వచ్చేస్తాయి. వాళ్ళ ప్రమేయం లేకుండానే. అవలక్షణాలన్నీ ఒకవైపు పోగుపడి వుండటం అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన వ్యక్తి అకాకీ అకాకియొవిచ్. అలాంటివాళ్ళు ఎదుర్కొనే అదనపు సమస్యలు చుట్టూ వున్న సమాజంనుంచీ, తను అలా వుండటాన్నించీ.
జార్‍చక్రవర్తుల పాలనా కాలం. అకాకీ లీగల్ డిపార్ట్‌మెంటులో కాపీయిస్టుగా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి నాలుగువందల రూబుళ్ళు జీతం. అది ఒక మనిషి బతకడానికి ఏ లెక్కనా సరిపోదు. అలాగని జీవితేచ్ఛ చావనివ్వదు. బతుకంటే అలాగే వుంటుందనే భ్రమలో పడేస్తుంది.
ముఖంమీద స్ఫోటకం మచ్చలు, బట్టతల, రాగిజుత్తు, పువ్వేసిన కన్ను, ముడుతలుపడ్డ చెంపలు, ఎర్రటి దేహచ్ఛాయతో వుండే సాధారణమైన మనిషి అతడు. ఇక అతని వుద్యోగస్థాయి విషయానికి వస్తే, ఎలాంటి అధికారాలూ లేని, శాశ్వతచిరుద్యోగి. ఉత్తరాలని కాపీచెయ్యటం అతని పని. వయసు దాదాపుగా యాభయ్యేళ్లు. పెళ్ళి చేసుకోలేదు.
అతని వంశనామం బష్మచ్కిన్. బష్మక్ అంటే చెప్పులు. ఎప్పుడు, ఎలా, ఎందుకు వాళ్ళకీ పేరు వచ్చిందో తెలీదుగానీ అతనితోసహా, తండ్రి, తాత అందరూ ఏడాదికి రెండుమూడుమాట్లేనా అడుగు మార్చిన పాతచెప్పులు వేసుకుని తిరుగుతారు. ఇక అతని పేరు. అకాకీ అకాకియెవిచ్. అదో వింతపేరు. దూరప్రాంతాలకి చెందిన పేరులా అనిపిస్తుందిగానీ, కాదు. దాన్ని కనిపెట్టినది అతని తల్లి. అదో కథ.
అతను పుట్టినది… మార్చి ఇరవైమూడు సాయంత్రం. చక్కనైన తల్లికీ, ఒక ప్రభుత్వోద్యోగి తండ్రికీ. పుట్టిన మూడోరోజుని కొడుకుని బాప్టైజ్ చెయ్యటానికి ఏర్పాట్లన్నీ ఆవిడ చేసుకుంది. మతగురువు ఇవాన్ ఇవానొవిచ్ ఎరోష్కిన్ వచ్చాడు. అతను చాలా గౌరవనీయుడు, సెనేట్‍లో పెద్దగుమాస్తాగా పనిచేస్తున్నాడు. బిడ్డ ఆలనాపాలనా చూసేందుకు నియమించబడిన సెమ్యొనొవ్న బియలోబ్రిన్ష్కోవా కూడా వచ్చి చేరింది. ఆమె ఒక సైనికాధికారి భార్య. మంచి విలువలు పాటించే మనిషి. వాళ్ళు పిల్లవాడికోసం తల్లికి అనేక పేర్లు సూచించారు. వాటిల్లో ఏ ఒక్కటీ పిల్లవాడి తల్లికి నచ్చలేదు. చివరికి ఒక పేరు తనే తయారుచేసింది. పిల్లవాడి తండ్రిపేరు అకాకీ కాబట్టి కొడుకు పేరులో కూడా దాన్ని చేర్చింది. ఆతర్వాత “అకాకియెవిచ్” అనేసింది. మతగురువుగారు అదే నామకరణం చేసారు. పిల్లవాడు అది వినగానే పెద్దగా ఏడ్చి, తన భవిష్యత్తేమిటో తెలిసినట్టు నొసలు చిట్లించాడట.
అకాకీ ఎప్పుడు ఎలా ఈ వుద్యోగానికి వచ్చాడో ఎవరతన్ని నియమించారో ఎవరికీ గుర్తులేదు. పై అధికారులు ఎంతోమంది మారారుగానీ అతను మాత్రం అదే స్థానంలో, అదే పని చేస్తూ, అదే ధోరణిలో వుంటూ వచ్చాడు. చూసిచూసి అతను పుట్టుకతోటే బట్టతలతోటీ, యూనిఫాం‍తోటీ తను పనిచేసే కుర్చీలోనే పుట్టాడని అందరికీ అనిపించేసింది. అతనికి ఎవరూ చిన్నపాటి గౌరవం కూడా ఇవ్వరు. అతను ముందునించీ వెళ్తుంటే బంట్రోతు లేచి నిలబడడడు సరికదా, ఈగో, దోమో వెళ్ళినంత తేలిగ్గా చూస్తాడు. అధికారులది అతనిపట్ల నిరంకుశ ప్రవర్తన. ఎలాంటి గుర్తింపూ లేని గుమస్తాకూడా అతనికి కాపీపని చెప్పవలసి వస్తే ఎలాంటి సంబోధనా చెయ్యడు. తనో మెట్టు పైనున్నట్టు, “ఇది కాపీ చెయ్” అంటాడు. అకాకీ ఏమీ మాట్లాడడు. ఆ కాగితం ఇచ్చిందెవరో, తను చెయ్యాల్సిన పనా కాదా అనికూడా చూడదు. మౌనంగా దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సీట్లో కూర్చుని పని మొదలుపెడతాడు.
బలహీనులనీ ఆటపట్టించి ఆనందాన్ని పొందే ఆటకి ఎప్పుడూ సమాజంలో ఆమోదం వుందికాబట్టి తోటి వుద్యోగస్తులు అతన్ని ఆటపట్టిస్తూ వినోదాన్ని పొందుతూ వుంటారు. యువసహోద్యోగులు అకాకియెవిచ్‍ని చూసి నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. పైగా తాము చేసేవి పై అధికారుల దృష్టికి పోకుండా జాగ్రత్తపడతారు. అతను వినేలాగే అతనిమీద రకరకాల కథలు పుట్టించి చెప్తారు.
అతని ఇంటియజమాని డెబ్భయ్యేళ్ళది.
“ఈవేళ అకాకీని వాళ్ళ యింటి యజమానురాలు, డబ్భయ్యేళ్ళ ముసలిది అతన్ని కొట్టిందొహో” అంటాడు ఒకడు.
“నీ పెళ్ళెప్పుడు అకాకీ?” అని మరొకడు అడుగుతాడు.
“ఈరోజు అకాకీ పెళ్లైంది. ఇదుగో మంచు వర్షం” అంటూ కాగితం చింపి, ముక్కలు అతని తలమీద చల్లుతాడు మూడోవాడు. ఇదంతా రోజూ జరిగే ఆటలో ఒక భాగం.
అకాకీ ఒక్కమాట కూడా జవాబివ్వడు. కనీసం అక్కడ వేరే మనుషులున్నట్టే గుర్తించడు. తన పని తను చేసుకుంటూపోతాడు… ఒక్క తప్పుకూడా లేకుండా. ఇంకా హద్దుదాటి వాళ్ళు తన తలపట్టుకుని వూపుతూ పని చెయ్యనీకుండా అడ్డుపడుతుంటే మాత్రం కోపంగా అరుస్తాడు.
“నా మానాన్న నన్ను వుండనివ్వకుండా ఎందుకిలా నా వెంటపడి అవమానిస్తున్నారు? ఏమొస్తుంది మీకు?” అలా అంటున్నపుడు అతని గొంతే కాదు, ఆ మాటలుకూడా వింతగా అనిపిస్తాయి. వాటిలో ఒక నిస్సహాయత, దయనీయత కనిపిస్తాయి. అలా వేధించినవాళ్ళలో ఒకడు కొత్తగా వుద్యోగంలో చేరాడు. మితృల ప్రోద్బలంతో ఈ వింతవినోదంలో తనూ పాలుపంచుకున్నాడు. అకాకీ మాటలు అతనిలో గొప్ప కదలికని తెచ్చాయి. మనిషి పూర్తిగా మారిపోయాడు. దృక్పథం మారిపోయింది. అప్పటిదాకా మంచివాళ్ళు, చక్కటి కుటుంబాలనుంచీ వచ్చారు అనుకుని ఎవరితోనైతే కలిసి వినోదించాడో అదంతా వాళ్ళ పైతొడుగేనని గ్రహించాడు. వాళ్ళకి దూరం జరిగాడు.
ఎంతోకాలం గడిచాకకూడా ఆమాటలు మర్చిపోలేదు. అతన్ని వెంటాడుతునే వున్నాయి. “నేనూ మీలో ఒకణ్ణేకదా, ఎందుకు వేధిస్తారు?” అకాకీ అంటున్నట్టుగా స్ఫురిస్తాయి. చదువుకున్నా, వుద్యోగాలు చేస్తున్నా, మంచికుటుంబాలలోంచీ వచ్చినా కూడా మనుషుల్లో ఎంతటి కౄరత్వం! అతనికి దిగ్భ్రాంతిగా అనిపిస్తుంది.
అకాకిలా విధులకి అంకితమైన వ్యక్తిని మరొకరు వుండరు. అతను తన వృత్తిని ప్రేమించాడు. అందులోనే వైవిధ్యాన్నికూడా కనిపెట్టాడు. కొన్ని అక్షరాలు అతనికి ప్రీతిపాత్రమైనవి. మామూలుగానే ఎంతో శ్రద్ధగా కాపీ చేసే అక్షరాల్లో ఆ ప్రత్యేకమైనవాటిని రాసేప్పుడు అతని ముఖం సంతోషంతో వెలుగుతుంది. అతను చూపే శ్రద్ధకి తగిన గుర్తింపుగనుక ఇచ్చి వుంటే ఒక రాష్ట్రానికి కౌన్సిలర్ కాగలిగేవాడు. కానీ అతనికి అలాంటి వూహలుగానీ, తన ప్రస్తుత స్థితిపట్ల ఆరోపణలుగానీ లేవు. మిల్లులో గుర్రంలా పనిచేస్తూ పోవటం మాత్రమే అతనికి తెలిసినది.
ఐతే అకాకి శ్రమ పూర్తిగా వృధా అవలేదు. ఒకానొక అధికారి గుర్తించి అతనికి కాస్త మెరుగైన పని ఇవ్వదలచి ఒక విషయంమీద నివేదిక తయారుచేసి ఇమ్మన్నాడు. అదేమీ పెద్ద కష్టమైనది కాదు. శీర్షిక మార్చి, కొన్ని పదాలని ప్రథమపురుషలోంచీ వుత్తమపురుషలోకి మార్చటమే. కానీ అకాకి తడబడిపోయాడు. నుదుట చెమటలు పట్టేసాయి.
“నాకు కాపీపనే యివ్వండి” అనేసాడు చివరికి. ఆ అధికారికి అంతకన్నా మార్గాంతరం కనిపించలేదు.
కాపీపనికన్నా అతనికి మరేదీ ప్రాధాన్యత కలిగినట్టు అనిపించదు. దుస్తులు వెలిసిపోయి, దుమ్మూ ధూళీ అంటుకుని వుంటాయి. అతని మెడ పొడవైనది కాకపోయినా పాతబడి నలిగిపోయిన కాలరులోంచీ ఎత్తుగా పొడుచుకుని వచ్చినట్టుంటుంది. రోడ్డుమీద నడిచేప్పుడుకూడా ఇళ్ళకి దగ్గరగానూ, కిటికీలకిందినుంచీనూ నడిచే వింత అలవాటు వుండటం చేత అపార్టుమెంట్ల కిటికీల్లోంచీ పడేసే చెత్తంతా అతని టోపీమీదే వుంటుంది. తోటివాళ్ళంతా చుట్టూ ఏం జరుగుతోందో గమనించుకుంటూ నడుస్తుంటే ఇతనికి ఆ స్పృహే వుండదు. పైగా ఏవేనా దృశ్యాలు అతని దృష్టిలోపడ్డా, అవి తను రోజూ రాసే అందమైన అక్షరాల్లా అనిపిస్తాయితప్ప మరో దృష్టి వుండదు. ఏ గుర్రానికో, బండికో అడ్డంపడ్డప్పుడు మాత్రమే అతనికి తను రోడ్డుమీద వున్నానన్న ఎరుకవస్తుంది.
ఇల్లు చేరుకోగానే బల్లముందు కూలబడి కేబేజి సూపు తాగుతూ బీఫ్‍ని వుల్లిపాయతో తినటం క్రమం తప్పని అలవాటు. అదికూడా ఎవరో తరుముకొస్తున్నట్టు పూర్తిచేస్తాడు. వాటి రుచీపచీగానీ, శుచీశుభ్రంగానీ ఏదీ పట్టించుకోడు. కడుపునిండాక ఆఫీసునుంచీ తెచ్చుకున్న కాగితాలని కాపీచెయ్యటం మొదలుపెడతాడు. అలా చెయ్యాల్సినదేమీ లేకపోతే, ఎవరేనా ప్రముఖునికి రాసిన వుత్తరాలేవైనా తన ఫైళ్ళలో వుంటే వాటిని తనకోసం కాపీచేసుకుంటాడు. సాయంత్రమయ్యేసరికి వుద్యోగులంతా తప్పనిసరి విధులనుంచీ బయటపడి వూపిరిపీల్చుకుని ఎవరి తాహతుకీ, ఆసక్తికీ, సరదాకీ తగినట్టు వాళ్ళు తిని, తిరిగి, స్నేహితులతో గడిపి, పార్టీలకి వెళ్ళి లేదా విస్ట్ ఆడుతుంటే అకాకీ మాత్రం తనగదిలో, తనకిష్టమైన ఈ కాపీపని పూర్తిచేసుకుని సంతృప్తిగా నిద్రపోతాడు. అతనికి ఎలాంటి సరదాలూ లేవు. అతన్ని బయటి ప్రదేశాల్లోనూ పార్టీల్లోనూ చూసినవారే లేరు.
నాలుగువందల రూబుళ్ళ జీతంలో ఎంతో సంతృప్తిగా బతుకుతున్న అకాకీ మరే వొడిదుడుకులూ లేకుండా వుండినట్టైతే జీవితాంతందాకా అలాగే గడిపేసేవాడు. కానీ అలా జరిగితే అది అతనిలాంటి చిరుద్యోగి జీవితం అవదు. అలాంటి చిరుద్యోగులందరికీ ప్రబలశతృవు వుత్తరంగాలి.
ఉదయం తొమ్మిదింటికి…
రహదారులన్నీ ఆఫీసులకి వెళ్ళే వుద్యోగులతో క్రిక్కిరిసి వున్నప్పుడు మొదలౌతుంది ఈ వుత్తరపుచలిగాలి ప్రభావం. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరి ముక్కులనీ సూదుల్లా పొడుస్తుంది. తలనొప్పి వచ్చేస్తుంటుంది. పెద్దపెద్ద పదవుల్లో వున్నవారికే ఈ బాధ తప్పదు. ఇంక ఈ చిరుద్యోగుల విషయం చెప్పడానికే వుండదు. బాధకి కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తూ వుంటాయి. వారు వేసుకునే పాతబడి పల్చబడ్డ ఓవర్‍కోటుకి చలి ఏమాత్రం ఆగదు. గడ్డకట్టుకునిపోయే చలిని తప్పించుకోవటానికి వీలైనంత తొందరతొందరగా ఆఫీసు చేరుకోవటం ఒకటే మార్గం. ఎలాగోలా ఆఫీసు చేరుకుని కాస్త స్థిమితపడి, గడ్డకట్టుకుపోయిన వాళ్ళ మెదళ్లనీ, నైపుణ్యాలనీ వెచ్చబెట్టుకుని పనిలోపడతారు.