Youtubers please WhatsApp to 7382342850
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1/2/2007)
కుటుంబం ఏర్పడుతూ ఉండే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరినొకరు కావాలనుకుంటారు. పెళ్లిచేసుకుని ఒకటవుతారు. వాళ్ల మనసుల్లో ఇంద్రధనుస్సులు విరుస్తాయి. జీవితాల్లోకి వసంతం వస్తుంది. కాంక్షలు నులివెచ్చని మంటల్ని రగుల్చుతాయి. ఆశలు చిగురిస్తాయి. పిల్లలు పుడతారు. కాలంతోపాటు అంతా కదుల్తారు.
ఆ తర్వాత?… ఈ ప్రశ్నకి జవాబులా ఆమె.
నేను భోజనం చేసి సిటౌట్లో కూర్చోగానే అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు వచ్చినా ఎదురుగా మెట్లమీద కూర్చుంది. నన్నేదో అడగాలని ప్రయత్నిస్తూ అడగటానికి సంకోచపడుతోంది.
“చెప్పండమ్మా!” అన్నాను.
సన్నగా నల్లగా ఉండే మనిషి, బాగా పాతబడ్డ చవకరకం సింథటిక్ చీర కట్టుకుంది. ముతక జాకెట్టు వేసుకుంది. జుత్తుకి నూనె రాసి నున్నగా దువ్వుకుని వేలుముడి చుట్టుకుంది. చేతులకి రెండేసి వెండిగాజులు, మెళ్లో పూసలదండ. తెల్లగా పేసి గీతలు పడ్డ చర్మం. సుమారైన దేహదారుఢ్యం. కష్టాల రూపురేఖలు ఆమె ముఖంలో ప్రతిబింబిస్తున్నాయి. నాకన్నా బాగా పెద్దదే వయసులో. నేనలా గమనిస్తున్నంతసేపూ ఆమేం మాట్లాడలేదు బహుశః నా చూపులు ఆమెలో సంకోచాన్ని పెంచాయేమో!
ఆమె కూతురూ, అల్లుడూ మా ఔట్‍హౌస్‍లో అద్దెకి ఉంటారు. అతనికి జూట్ మిల్లులో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. అంతా రెండు గదుల్లో సర్దుకుంటున్నారు. కొద్దిరోజులక్రితం అనారోగ్యకారణంగా ఈమె వాళ్లింటికి వచ్చింది. అలా రావటం వాళ్లకిష్టం లేదని వాళ్ల ప్రవర్తన వలన తెలిసింది. ఆమెకూడా ఈ విషయం తెలిసినట్టే దూరదూరంగా మసలుతోంది. అతనింట్లో ఉన్నప్పుడు కాంపౌండులో తిరుగుతుంది. మరీ ఎండగా ఉంటే కారుషెడ్డులో కూర్చుంటుంది.
మొదట్లో మొక్కలకి కుదుళ్లు చేసి నీళ్లుపెట్టేది. నా భార్య వప్పుకోలేదు. “అన్నీ వేలు పోసి కొన్న పారిన్ ప్లాంట్స్, ఆమెకేం తెలుస్తుంది, వాటి పెంపకం?” అంది.
తను మొదుట్నుంచీ సిటీలో పుట్టి పెరిగింది. మొక్కల గురించి ఏమీ తెలీదు. కానీ పెంచాలని సరదా. తెలీదుగాబట్టి ట్రెయిన్డ్ మాలీమీద ఆధారపడుతుంది. రిస్కెందుకన్న భయం. అందుకే ఆమెని ముట్టుకోనివ్వలేదు.
మనుషులు చేత్తో పనులు చేసుకుంటూ బతుకుతున్నప్పటి రోజుల్లో అందరూ తలొక పనీ చేసుకుంటూ ఇంత తిండి తినగలిగేవారు. యంత్రసహాయం వచ్చాక అన్ని పనులూ ఒక్కరే చేసుకోగలుగుతున్నారు. కొందరికి పని లేకుండా అయింది. అంటే వాళ్ల అవకాశాలు కబ్జా చేయబడ్డాయి. పనుల్లేవని వాళ్ల అవసరాలు ఆగలేదు. ఆకలి పుడుతునే ఉంది. అది తీరే దారే లేదు. ఆదారి లేకే ఈమె కూతురి దగ్గరకి వచ్చింది.
“ఏమిటమ్మా?” మరోసారి అడిగాను.
“మీరు అమెరికా వెళ్లి వస్తుంటారు కదా?” అడిగింది.
తలూపాను. నా ఇద్దరు కొడుకులూ అక్కడుంటారు. కూతురిది ముంబాయి. ఇవన్నీ నాకు సంబంధిచిన వివరాలు. ఈమె అమెరికా విషయం ఎందుకడిగినట్టు? నా సందేహం వెంటనే తీరింది.
“మా అబ్బాయి… పేరు రాజోలు శ్రీనివాసులు. వాడూ అక్కడే ఉంటాడు”
నేను షాకయ్యాను. కంటిరెప్ప వెయ్యటం, శ్వాస తీసుకోవటంలాంటి అసంకల్పిత చర్యల్ని కూడా మర్చిపోయాను.
“మీరెప్పుడేనా వాడిని చూశారా? ఎక్కడేనా కనిపించాడా? నల్లగా చెయ్యెత్తు మనిషి, సన్నగా ఉండేవాడు. అక్కడికెళ్లాక లావయ్యాడేమో!!” అంది.
కొడుకు అమెరికాలో ఉండగా ఇక్కడ యీమెకేమిటీ దురవస్థ? అతనికి సంపాదన లేదేమో! ఇంకా స్థిరపడలేదేమో!
“నాలుగేళ్లయింది, వాడక్కడికెళ్లి. ఒక్కమారు కూడా రాలేదు. ఎందరితోనో కబురుపెట్టాను. కన్నతల్లినీ తోబుట్టువునీ మర్చిపోయాడు వాడు” ఆమె కళ్లలో నీళ్లు నిలిచాయి.
“అతను అమెరికాలో ఉండగా మీరేమిటమ్మా, ఇక్కడిలా?” అతిప్రయత్నం మీద అడిగాను.
నా పెద్దకొడుకు అప్పుడింతా ఇప్పుడింతా చొప్పున ఇరవై లక్షలు పంపాడు. చిన్నవాడు ఏకమొత్తంగానే పంపాడు. ఇల్లూ, కారు కొనుక్కున్నాం.
నాకు పెన్షన్స్తుంది. రిటైర్మెంటు బెనిఫిట్సు అలాగే ఉన్నాయి. వాడలేదు. ఆ అవసరం రాలేదు. కూతురిదీ మంచి ఉద్యోగం. ప్రేమవివాహం. మతాంతరం చేసుకుంది. కొంత బాధనిపించినా ఎదిగిన పిల్లల స్వేచ్ఛని మనం అరికట్టలేమని వదిలేశాం. మేమే మనసు సరిపెట్టుకుని రాజీపడ్డాం. అందుకు పశ్చాత్తాపపడే అవసరం ఎప్పుడూ రాలేదు. భార్యాభర్తలిద్దరూ ఒకరికోసం ఒకరన్నట్టు బతుకుతున్నారు. హెచ్చుతగ్గులూ, అరమరికలూ లేవు. అతని తల్లిదండ్రులనీ మమ్మల్నీ ఒకేలా చూస్తారు.
“ఉద్యోగం లేదామ్మా?” మళ్లీ నేనే అడిగాను.
“ఏడాదికి అరవై డెబ్బై వేలొస్తుందట. డాలర్లేమో! వాడిని కలిసినవాళ్లు చెప్పారు” ఆమె చీరకొంగులో ముఖం దాచుకుంది. ఏడుస్తోందని గ్రహించాను. కొద్దిసేపు గడిచాక సర్దుకుంది. తన కుటుంబ పరిస్థితులు చెప్పుకొచ్చింది.
“మొదట్లో మాది కలిగిన కుటుంబమే బాబుగారూ! నలభయ్యెకరాల మెట్టా, పదెకరాల తరీ ఉండేవి. నా భర్తావాళ్లూ ఐదుగురన్నదమ్ములు. చాలాకాలందాకా కలిసే వున్నాం. కలిసున్నప్పుడు అందరం బాగానే ఉన్నాం. జొన్నలు తినేవాళ్లం. వరి అమ్ముకుని అవసరాలు తీర్చుకునేవాళ్లం. మా మామగారు పోయాక వేర్లుపడ్డాం. ఇంటాబైటా ఎన్నో మార్పులు. అంతా తెల్లన్నానికి అలవాటు పడ్డారు. హెచ్చులు నేర్చారు. జొన్నలు పండించినా కొనేవాళ్లు లేరు. బోర్లకింద వ్యవసాయం. వానల్లేక బోర్లెండిపోయాయి. అడుగోబొడుగో కొన్ని నీళ్లున్నా కరెంటు లేక అని బైటికి రావు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. పంటమీద పంట నష్టం. అప్పులయ్యాయి. తలకు మించాయి. పత్తి వేసి భారం దించుకోవాలనుకున్నాం. పత్తి నెత్తిన మొత్తింది. మనసు చెదిరి ఆయన పురుగుల మందు తాగేశాడు”
నేను దిగ్భ్రాంతిగా విన్నాను. కుటుంబాలు చెదిరిపోయిన వార్తలు పేపర్లలో వస్తుంటాయి. చదువుతుంటాం. టీవీల్లో వస్తుంటాయి. చూస్తుంటాం.
మనసుకి బాధనిపిస్తుంది. కానీ కదిలించవు. ఎందుకంటే అవి వార్తలు. ప్రాణం లేనివి. ఇప్పుడీమె సజీవప్రతిమ. తన మనసునీ అనుభవాన్నీ నాముందు పరిచింది. నేను కదిలిపోయాను.
“కలిసిరాని వ్యవసాయం దేనికని ఐనకాడికి అన్నీ అమ్మి అప్పులు తీర్చాను. వీడిని చదువులో పెట్టాను. తెలివైనవాడు. స్కాలర్షిప్పులొచ్చేవి. చదువుకున్నాడు. వాళ్ల ప్రొఫెసరు అమెరికా వెళ్తూ వీడినీ తీసుకెళ్ళాడు” చెప్పింది.
నేనింకా ముందు కలిగిన ఆశ్చర్యంలోంచీ తదుపరి కలిగిన బాధలోంచీ తేరుకోలేదు. రాజోలు శ్రీనివాసులు… ఆ పేరు గల వ్యక్తి నాకు ఏ తెలుగు అసోసియేషన్లోనే తారసపడ్డాడేమో గుర్తు తెచ్చుకుందుకు ప్రయత్నించాను. అక్కడికెళ్లాక మన పేర్లు మన పేర్లలా ఉండవు. మరి ఈ శ్రీనివాసులు ఏమిగా రూపాంతరం చెందాడో!
“పల్లెటూరివాళ్లం… అమ్మాయికి చిన్నప్పుడే అందివచ్చిన సంబంధం చేసేశాం. వీడి చదువు గురించి అప్పట్లో అంత ఆలోచనలు లేవు. తనకి అన్నీ సరిగా చెయ్యలేదని దానికి కోపం. అల్లుడిది మొదట్లో టెంపరరీ ఉద్యోగం. ఈమధ్యనే పర్మినెంటైంది. గుట్టుగా గడుపుకొస్తున్నారు. నేను రావటం ఇద్దరికీ ఇష్టం లేదు.
“నిజమేకదండీ బాబుగారూ, వంశోద్ధారకుడినని వున్న కాస్తా వూడ్చుకు తిన్న కొడుకుండగా కూతురెందుకు చూస్తుంది? కష్టమో నష్టమో పోనీ పదో పరకో పంపిస్తే వీళ్లు సంతోషిస్తారనుకుంటే అదీ లేదు. అసలిక్కడికి రాకనే పోదును. ఏదో ఒక పని చేసుకుంటూ మా ఊళ్లోనే బతికేద్దామనుకుంటే పనుక్కడివి బాబుగారూ? మీరు కాస్త వాడికి నచ్చచెప్పండి” అంది ముక్తాయింపుగా.
నాకా రాజోలు శ్రీనివాసులు అనే వ్యక్తిమీద కాస్త కోపం వచ్చింది. ఉన్నవాళ్లుంటారు, లేనివాళ్లుంటారు. ఎవరైనా తల్లి తల్లి, కొడుకు కొడుకే.
బాధ్యత తప్పించుకు తిరిగితే ఎలా?
“నా కొడుకులిద్దరికీ ఈనేళే చెప్తాను, మీ అబ్బాయి తెలిస్తే మా ఇంటికి మాట్లాడించమని” చెప్పాను.
ఆమె వెళ్లిపోయింది. నేను ఆ రాత్రే పిల్లలకి ఫోన్ చేసి చెప్పాను రాజోలు శ్రీనివాసులి విషయం. పెద్దవాడికి అతను పరిచయమట.
“మీకెందుకండీ, ఈ గొడవలు? వాళ్లకీ వాళ్లకీ మధ్యని ఎన్ని గొడవలేనా ఉండచ్చు. మనమెందుకు తలదూర్చడం?” అని కోప్పడ్డాడు చిన్నవాడు.
వారంరోజుల్లో జవాబొచ్చింది. రాజోలు శ్రీనివాసులు నాతో మాట్లాడాడు. అతను మాట్లాడుతున్నాడని చెప్పగానే అతని తల్లీ, అక్కా వచ్చి
కూర్చున్నారు. స్పీకర్ ఆన్ చేశాను. నా పెద్దకొడుకు ముందుగానే నన్ను హెచ్చరించాడు.
“మీ మాట కాదనలేక అతన్ని కలిశాను. అతనుకూడా మాట్లాడటానికి వప్పుకున్నాడు. చెప్పింది విని వాళ్లకి చెప్పండి. అంతేగానీ, సలహాలివ్వకండి. మీరు పెద్దరికం అనుకునేదానికి ఇక్కడే విలువా లేదు” అని.
నేనందుకు వప్పుకున్నాకే రాజోలు శ్రీనివాసులుకి కనెక్ట్ చేశాడు. పరిచయాలయ్యాయి. సాధారణమైన సంభాషణ జరిగింది. తర్వాత విషయంలోకి వచ్చాను. అతను తన అభిప్రాయాలని చాలా స్పష్టంగా చెప్పాడు.
“ఆమె నా తల్లంటేనే చిన్నతనంగా ఉంది. మొదటిది… ఆమె నా చదువుకి ఖర్చుపెట్టిందేమీ లేదు. అంతా ఫైనాన్షియల్ ఎయిడ్ మీదే జరిగింది. కాబట్టి ఆమెకి నేను ఏవిధంగానూ రుణపడిలేను. యామై క్లియర్? రెండోది… మా నాన్న చనిపోయిననాటికి మాకు పదెకరాల భూమి, ఇల్లూ ఉండేవి. ఈ రోజున సెంటు భూమి కూడా మిగల్లేదు. పిత్రార్జితమైన భూమిని అమ్మే హక్కు ఆవిడకెవరిచ్చారు? ఆ డబ్బంతా ఏమైంది? అప్పులు తీర్చానంటుంది. రైతుల రుణాలు మాఫీ చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ఈమెకి అంత తొందరపడి తీర్చాల్సిన అవసరం ఏమిటి? మా నాన్నకి కాంపన్సేషను ఇచ్చి ఉండాలి. అదేమైంది?” అతను శ్వాస తీసుకోవటంకోసం ఆగాడు. నేను వినడానికి ఊపిరి బిగపట్టాను. అతను కొనసాగించాడు.
“ఇండియాలో ఆమె ఒక్కదానికీ ఎంత ఖర్చవుతుంది? ఐదు వందలో వెయ్యో! అంటే పదిరవైడాలర్లు, ఆ డబ్బుకోసం నన్నిక్కడ నానా యాగీచేస్తోంది. ఆ పదిరవైడాలర్లూ నేనిక్కడ్నుంచీ పంపాలా? తన డబ్బు పెట్టుకుని తను బతకలేదా? బతకలేదే అనుకుందాం. అక్కకి ఆమెపట్ల బాధ్యత లేదా? తనకీ తల్లే కదా? కట్నకానుకలిచ్చి పెళ్ళి చేసారుకదా?” అతని గొంతు తీవ్రంగా ఉంది.
నేనేమీ మాట్లాడకూడదుగాబట్టి మాట్లాడలేదు.
“ఇక్కడ నేను బేబీ సిట్టర్‍కి యిచ్చేది ఎంతో తెలీదా, మీకు? ఆపాటి సర్వీస్ ఆమె అక్కకి చెయ్యట్లేదా? ఇంకా ఎక్కువే చేస్తుండవచ్చు. తనని కూర్చోబెట్టి అన్నీ అమర్చిపెట్టే వ్యక్తికి ఇంతన్నం పెట్టలేదా తను? అంటే?… నేనిక్కడేవో డాలర్లు పోగుచేసుకుని ఉన్నానేకదా? అయాం సారీ సర్. నేను వాళ్లకే డబ్బూ పంపలేను. నాదగ్గరున్నా ఇవ్వాలని లేదు. ఇది అమెరికా. ఇక్కడలా ఎవరూ ఇవ్వరు. అయాం ఫీలింగ్ ఇన్సెక్యూర్. ఇల్లు లేదు. స్థిరమైన ఉద్యోగం లేదు. భవిష్యత్తేమిటో తెలీదు. అక్కడేవో కొన్ని ఆస్తులున్నాయంటే అదో ధైర్యం. అదీ లేదు. పరాయిదేశంలో బతుకుతున్నాను. నాకూ భార్యా పిల్లలున్నారు. వాళ్ల బాధ్యతలు న్నాయి” అన్నాడు.
అతని తల్లి నిశ్శబ్దంగానూ, ఆశ్చర్యంగానూ నింది. అతని అక్క అలా విని ఊరుకోలేకపోయింది.
“పిల్లల కోసం బేబీసిట్టర్‍నీ, నాకోసం హౌస్‍కీపర్‍నీ పెట్టుకుని చేయించుకుని తీరిగ్గా కూర్చుని తినేంత స్థోమతగానీ, మరో మనిషిని కూర్చోబెట్టి
పోషించే శక్తిగానీ లేవు. నాదే పరాధీనపు బతుకు. అమ్మకి ఆశ్రయం ఎక్కడివ్వగలను? బావ ఒప్పుకోరు. ఎదగడానికి నీకిచ్చిన అవకాశాలు నాకివ్వలేదు. తెలిసీతెలీని వయసులో దొరికిన సంబంధమేదో చేశారు. బావ తప్ప నాకు మరో ఆధారం లేదు. ఆయన పెట్టే తిండి తింటూ ఆయన బతకమన్నట్టు బతుకుతున్నాను. అమ్మ పొలంలో నాకూ వాటా ఉంది. కాబట్టి నీకు లెక్కైనవన్నీ నాకూ లెక్కే. నువ్వే చెప్పు, ఏం చెయ్యమంటావ్?” అంది.
“అది, ఆవిడ ఆలోచించుకోవాలి. నేనేమీ చెయ్యలేను. ఇంకోసారి నాకు ఫోన్ చేయవద్దు. నన్ను కలవద్దు. మీతో కాంటాక్ట్స్‌కి నా భార్య వప్పుకోదు. అయాం సారీ” అతను పెట్టేశాడు.
నేను దిగ్భ్రాంతుడినయ్యాను. ఎంత నిర్ణయుడీ కొడుకు? తల్లికి పిడికెడన్నానికి ఇంత చర్చ తర్వాత కూడా కాదన్న వ్యక్తి…
“ఇల్లు గడవడంకోసం ఆయన చేసిన అప్పులు తీర్చడం నా బాధ్యతనుకున్నానుగానీ తప్పనుకోలేదు. ఐనా ఎప్పుడో ప్రభుత్వం ఏదో చేస్తానంటే అప్పటిదాకా అప్పులిచ్చిన వాళ్లేందుకూరుకుంటారు? ఇంటిమీదకొచ్చి గొడవ చేస్తారు. అయ్యా! అప్పులు తీర్చని ఇంట్లో ఆడామెని వడ్డీలకిచ్చినవాళ్ళు ఎలాంటిమాటలంటారో దేనికి పిలుస్తారో మీయిండ్లలో తెలీదు. వాటిని భరించడం రక్తమాంసాలున్న వాళ్ళెవరికీ సాధ్యం కాదు” నాతో అని, కూతురితో, “అదలా ఉంచి మనిషి చచ్చిపోయేదాకా చూసి అప్పుడిచ్చే సాయం కోసం ఎదురుచూసేంత కిరాతకురాలిలా కనిపిస్తున్నానటే, నేను?”” అంది అతని తల్లి.
“ఐనా నాది తప్పేనమ్మా! కొడుకు జీవితం, కూతురిల్లూ ఈ రెండూకూడా మనవి కావని తెలుసుకోలేకపోయాను. మనకి అందులో ఆశ్రయం దొరకదు. అరవయ్యేళ్లో డబ్బైయ్యేళ్ళో బతకాల్సిన అవసరం ఉన్న మనిషి తన గురించి తను కాక ఇంకెవరో ఆలోచిస్తారనుకోవడం పొరపాటు” అంది తనే మళ్లీ.
వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ తల్లీకూతుళ్ళిద్దరూ వెళ్లిపోయారు.
“బాగానే ఉంది గొడవ. ఎవరూ చూడకపోతే ఈ ముసలమ్మెలా బతుకుతుందట?” అంది నా భార్య.
“ఒకటి చెప్పు. కన్నతల్లికి తిండి పెట్టనివాడొకడుండగా మనకి పిల్లలు ఇంతంత డబ్బెందుకు పంపిస్తున్నారంటావు?” అడిగాను.
“మనకి తిండీ అవసరాలు తీరుతున్నాయిగాబట్టి అదొక పెట్టుబడిలా వాళ్లు పంపిస్తున్నారు. మీరు ఖర్చు పెట్టటం మొదలుపెట్టండి. వాళ్ళు
లెక్కలడుగుతారు” తన జవాబు. నా గుండెల్లో ఎక్కడో వాడిగా దిగబడ్డాయి ఆ మాటలు. నిర్విణుడినై చూశాను. అం…తే…నా?
ఆరాత్రి మా ఔట్‍హౌస్‍లో బాగా గొడవైంది. జరిగిన విషయం తెలిసి, రాజోలు శ్రీనివాసులి అక్కని ఆమె భర్త బాగా తిట్టాడు. ఆమె వుక్రోషంతో తల్లిని తిట్టింది. ముసలామె ఏడుస్తూ ఇవతలికొచ్చింది. రాత్రంతా ఏడుస్తూనే ఉందనుకుంటా. ఓ మధ్యరాత్రివేళ ఎందుకో మెలకువ వచ్చి కిటికీ తెరలు తప్పించి చూస్తే మా వరండాలో చీరకొంగు కప్పుకుని ముడుచుకుని పడుకుని ఉందామె.
అక్కడ అమెరికాలో రాజోలు శ్రీనివాసులి టీఖర్చుపాటి చెయ్యదు ఆవిడ జీవిక. ఐనా అతను ఖర్చుపెట్టలేకపోతున్నాడు. ఇక్కడ కూతుర్ని కూర్చోబెట్టి పనంతా చేస్తోంది. కూతురికి కావల్సింది అది కాదు. తను సుఖపడే మార్గం కాదు. ఆపాటి కష్టం ఆమె పడగలదు. కొంత ఖర్చు తగ్గే మార్గం. ఆమె భర్తది బావమరిది పట్టించుకోవట్లేదనే నిస్సహాయతలోంచీ పుట్టుకొచ్చిన ఉక్రోషం.
ఒక పరిస్థితి. మనిషి వంట్లో శక్తి ఉంటుంది. చెయ్యడానికి పని ఉండదు. ప్రకృతి మొత్తాన్నీ తన అధీనంలోకి తెచ్చుకున్న ఈ సమాజం మనిషి జీవికకి ఎలాంటి హామీ ఇవ్వదు. వృద్ధులని చూసుకోవాలని చట్టాలున్నాయి. కొడుకు అందనంత దూరంలో ఉన్నాడు. అతన్ని దాని పరిధిలోకి లాక్కొచ్చే శక్తి ఈమెకుందా?
అసలెందుకని, ఈ కుటుంబ సంబంధాలిలా మారిపోతున్నాయి? పిల్లలకి తల్లిదండ్రులూ, తల్లిదండ్రులకి పిల్లలూ ఏమీ చేసుకోలేని ఈ పరిస్థితి యేమిటి? రాజోలు శ్రీనివాసులి తండ్రి ఆత్మహత్య చేసుకోకుండా ఉంచగలిగే పరిస్థితులు ఎందుకు లేవు? ఆయన నిస్సహాయతని అర్థం చేసుకుని తల్లి చర్యని క్షమించగలిగే విచక్షణ ఇంత చదివిన ఆ యువకుడిలో ఎందుకు లోపించింది? నిస్సహాయురాలైన తల్లికి ఆశ్రయం ఇవ్వలేనంత పరాధీనురాలిగా రాజోలు శ్రీనివాసులి అక్కని మార్చిన ఈ వివాహవ్యవస్థ అంతిమరూపం ఎలా ఉంటుంది?
ఆమెకి ఏదైనా చెయ్యగలనా అని ఆలోచించాను. కొంత డబ్బు ఇవ్వటం తప్పించి ఇంకేమీ చెయ్యలేనని అర్థ మైంది. అలా ఎంతకాలం? ఎటూ తోచలేదు. కాస్త డబ్బు కట్టి ఏదైనా ఓల్డేజ్ హోంలో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకున్నాక నిద్ర పట్టింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.