గోన గన్నారెడ్డి – రచన అడివి బాపిరాజు
పరిచయం యస్. శ్రీదేవి

అడివిబాపిరాజుగారు బహువిధప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారుడు, కవి, గాయకుడు. వీరు భీమవరంలో జన్మించారు. జీవితకాలం 8.10.1895 – 22.9.1952. ఐదు సాంఘిక, నాలుగు చారిత్రక నవలలు, (ఆరు సంపుటాలలో) 41కథలు, మూడు కవితా సంపుటాలు, ఒక ఆంగ్ల అనువాద గ్రంథము కాక, రేడియోనాటికలు, వ్యాసాలు, సాహిత్యలేఖలు అనేకం రాసారు. వీరి అముద్రిత సాహిత్యంకూడా అపారంగా వుంది.
గోన గన్నారెడ్డి కాకతీయుల చారిత్రక నవల. దీని రచనాకాలం 1946. . పలు ముద్రణలు జరిగాయి. నవచేతన పబ్లిషింగ్ హౌస్ ఈ పుస్తకాన్ని 2015లో మరొకమారు ప్రచురించింది. అప్పటి వెల నూటయాభై రూపాయలు.
కాకతీయ సామ్రాజ్యం, రుద్రమదేవి, గోన గన్నారెడ్డి – ఇది చరిత్ర వేసిన ఒక ముడి. నవలలో దీనికి సంబంధించిన వివరాలలన్నీ చాలా సూక్ష్మంగా వుంటాయి. భాష వ్యావహారిక గ్రాంథికానికన్నా సులువైనదే. రాజుల, వారి ప్రస్తావన వచ్చినప్పుడు వాడే బిరుదులు, సంబోధనలు సుదీర్ఘంగా అనిపించినా కథలో ఎక్కడా పట్టు సడలదు.
కథాకాలం క్రీ.శ. 1262కి ముందు.
వర్ధమానపురం పాలకుడు గోన బుద్ధారెడ్డి. అతడి కొడుకులు గన్నారెడ్డి, విఠలరెడ్డి(విఠల ధరణీశుడు). లకుమయారెడ్డి బుద్ధారెడ్డి తమ్ముడు. రాజ్యభారం, పిల్లల బాధ్యత తమ్ముడికి అప్పజెప్పి పిల్లల చిన్నతనంలోనే బుద్ధారెడ్డి చనిపోతాడు. లకుమయ రాజ్యప్రలోభంలో పడి అన్నకొడుకుల పోషణ పట్టించుకోడు. వారిద్దరూ గజదొంగలమౌతామని ప్రకటించి అడవుల్లోకి వెళ్ళిపోతారు. లకుమయారెడ్డి కొడుకు వరదారెడ్డి. అతనికి ఆదోని పాలకుడు కోటారెడ్డి ఏకైక కూతురు అన్నమాంబతో పెళ్ళి జరగబోతూ వున్న తరుణాన గన్నారెడ్డి పెండ్లికొడుకుని అపహరించుకుపోతాడు.
ఈ వుదంతంతో కథ మొదలౌతుంది.
అప్పటికి దక్షిణభారతదేశమంతా చిన్నాపెద్దా రాజ్యాలుగా వుంది. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ మతాలు ప్రముఖంగా వుండేవి. కమ్మ, కాపు, వెలమ, రెడ్డి మొదలైన కులాలవారు పాలకులుగా వుండేవారు. ఈ చిన్నచిన్న రాజ్యాలవారందరినీ ఏకసూత్రానికి కట్టివేయడానికి ఒక చక్రవర్తి అవసరం వుండేది. పరస్పరకలహాలు మాని, ప్రజాహితాన్ని అమలుచేసేందుకు ఒక సామ్రాజ్యంకింద ఏకత్రితంగా వుండవలసిన కాలం. ఆ అవసరాన్ని కాకతీయసామ్రాజ్యం కొంతవరకు తీర్చినా, తురుష్కుల దండయాత్రతో తన వునికిని పోగొట్టుకుంది.
వెన్నభూపాలుడనే రాజు కాకతీపురాన్ని పాలించినట్టు కథనాలు వున్నప్పటికీ, కాకతీయుల మొదటి చారిత్రక వ్యక్తి గుండయ రాష్ట్రకూటుడు. ఇతడు క్రీ.శ. 1000 కాకతీయుల పాలనకి పునాది వేసాడు. కాకతీయులు రాష్ట్రకూటులకి చెందిన దుర్జయవంశస్థులమని చెప్పుకున్నారు. వీరు మొదట రాష్ట్రకూటుల సామంతులు. వీరి పాలన మొదట మానుకోట (మహబూబాబాద్) దగ్గరి కురివినుంచీ మొదలైంది. కురివిలో గొప్ప వీరభద్రాలయం వుంది. రాష్ట్రకూటులు చాళుక్యుల చేతిలో వోడిపోయాక చాళుక్యుల సామంతులయారు. చాళుక్యులు బలహీనపడ్డాక 1262లో కాకతీయులు స్వతంత్రపాలన మొదలుపెట్టారు. కాలవశాన కళ్యాణీచాళుక్యులే వీరి సామంతులౌతారు. నిడదవోలుని పాలించే ఇందుశేఖరుడి పెద్దకొడుకు వీరభద్రుడిని (చాళుక్య వీరభద్రుడు) తదుపరి కాలంలో రుద్రమదేవి పెండ్లి చేసుకుంటుంది.
మొదటి ప్రతాపరుద్రుని (రుద్రదేవుడు) పాలనా కాలం 1158-1195. ఇతడు దేవగిరి యాదవులతో యుద్ధం చేస్తూ చనిపోతాడు. ఇతడికి పట్టపురాణి కాక ఇంకో భార్యకూడా వుంటుంది. ఆమె మహరాష్ట్రీయ స్త్రీ. ఆమెకు సారంగధరదేవుడనే కొడుకు కలుగుతాడు. రుద్రదేవుడి తమ్ముడు మహాదేవుడు. రాజ్యాన్ని అన్నతరువాత ఇతడు పాలిస్తాడు. సారంగధరదేవుడికి ఇద్దరు కొడుకులు. సారంగధరదేవుడు రాజుకి నమ్మకస్తుడేగానీ అతడి కొడుకులిద్దరికీ రాజ్యంమీద ఆశ వుంటుంది. మహాదేవుడి కొడుకు గణపతిదేవుడు. అతడికి కొడుకుల్లేరు. రుద్రమాంబ, గణపాంబ అనే కూతుళ్ళు. రుద్రమని మగవాడిలా పెంచి రాజ్యానికి వారసురాలిని చేయాలనేది గణపతిదేవుడి కోరిక. ఆమెకూడా సమర్ధురాలిగానే పెరుగుతుంది. ఆమె మగవాడనే ప్రజలకి చెప్తారు. ప్రజలని నమ్మించేందుకు ముమ్మిడమ్మ అనే బాలికతో పెళ్ళికూడా చేస్తారు.
రుద్రమ స్త్రీ అనే విషయం క్రమంగా ఒక రాజకీయ వ్యూహంగా బయటికి వస్తుంది. స్త్రీ పాలనలో వుండటానికి సామంతులు అనేకులు యిష్టపడరు. రాజ్యంలో తిరుగుబాటు మొదలౌతుంది. ఒకవైపు సన్నిహితంగానే వుంటూ ద్రోహం చేస్తున్న జన్నిగదేవుడనే మంత్రి, మరొకవైపు సారంగధరదేవుని కొడుకులు, అదును చూసుకుని యుద్ధానికి దిగిన దేవగిరి యాదవులు, కిందినుంచీ చోళులు ఈమధ్య చిక్కుకుంటుంది రుద్రమ్మ. ఒకవైపు చాళుక్య వీరభద్రుడు, మరోవైపు గజదొంగనని ప్రకటించుకున్న గన్నారెడ్డి, అతని సైన్యం, విశ్వాసపాత్రులైన సామంతులు వీరందరి సహకారంతో విజేత ఔతుంది రుద్రమదేవి. గన్నారెడ్డికి కూడా న్యాయం జరిగి, తండ్రి రాజ్యానికి పట్టాభిషిక్తుడౌతాడు.
రుద్రమ- వీరభద్రుల, గన్నారెడ్డి – అన్నాంబల, ముమ్మిడమ్మ- చాళుక్య మహదేవుల ప్రణయకథలు అంత:సూత్రంగా సాగుతూ నవల ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది.