Bankerupt – by Ravi Subramaniyan
పరిచయం యస్. శ్రీదేవి

రచయిత ఐఐఎమ్ బెంగుళూరులో చదివి, గ్లోబల్ బేంకింగ్ సెక్టార్లో పనిచేసారు. వీరి మొదటి నవల If God Was A Banker. 2008లో రచించారు. ప్రస్తుతపు నవల ఐదవది. భాష, శైలి సరళంగా వున్నాయి. అమెరికాలోని గన్ కల్చర్, ఒక కార్పొరేట్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, ఎంఐటీలోని అంతర్గత రాజకీయాలు, వీటితో సంబంధం వున్న కొన్ని హత్యలు ఇలా అనేక విషయాల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన ఈ నవలని 2013లో పెంగ్విన్ పబ్లిషర్స్ ప్రచురించారు. అప్పటి దీని వెల రూ. 299/-
కొత్తరచయితలు, పెద్దపెద్ద విద్యాసంస్థలలో చదువుకున్నవారు సాహితీరంగంలోకి రావటంతో వస్తువైవిధ్యం ఏర్పడి, సమాజం కొత్తవిలువలతో మనముందు నిలుస్తోంది. ఇవి మధ్యతరగతి సమాజం సాధించిన విజయమో, అపజయమో మాత్రం అర్థమవదు.
నవలలో శిరీష అనే పేరుని C అక్షరంతో మొదలుపెట్టడంతో ఆ పేరు కనిపించిన ప్రతిసారీ నవల చదివే వేగానికి అంతరాయం కలుగుతుంది.
బోస్టన్ పార్కులో ఒక జాగర్ నడుస్తూ నడుస్తూ చనిపోవటంతో అసలు కథ మొదలౌతుంది. అది హత్యని బయటడి, ఆ హత్యకి దారితీసిన కారణాలు వెల్లడికావటంతో నవల దాదాపుగా ముగుస్తుంది. సాటిమనిషి యొక్క దురాశ, అవకాశవాదం, మోసం వీటిని ఎదుర్కోవాలనే మనస్తత్వంగల వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితి ఇది.
శిరీష కోయంబత్తూరుకి చెందిన నారాయణన్ అనే వ్యాపారి కూతురు. ఎంఐటీ బోస్టన్‍లో రిసెర్చి అసోసియేట్‍గా చేస్తోంది. ఆమె సహ అసోసియేట్ రిచర్డ్. వీరిని కార్డోజా, జేమ్స్ డియల్స్ అనే ప్రొఫెసర్లు హైర్ చేసుకుంటారు. ఆ యిద్దరు ప్రొఫెసర్లూ ఎంఐటీ ప్రొవోస్ట్ పదవికోసం పోటీపడుతుంటారు. వారిద్దరి తెరవెనుక జీవితం చూస్తే, ఉన్నతచదువులు, ఉన్నతస్థానాలు సమాజానికి మేలు చెయ్యటంతోపాటు మనిషిలోని చెడ్డతనాన్నికూడా ప్రభావితం చెయ్యగలవని అర్థమౌతుంది. దేన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటారనే విషయం సమాజహితాన్ని ప్రభావితం చేస్తుంది. రిచర్డు ఎంఐటీలో టెన్యూర్ పొజిషన్‍కోసం పోరాడుతుంటాడు.
నళిన్ సూద్ GB2 ఇన్వెస్ట్‌మెంటు బేంకు సియ్యీవో. అదే బేంకులో పనిచేస్తుంటాడు ఆదిత్యరాయ్ సింఘానియా. వీళ్ళ ఆఫీసు ముంబైలో వుంటుంది. నారాయణన్ ఎమూ పక్షుల పెంపకం పెద్దయెత్తుని చెయ్యాలనుకుంటాడు. 45కోట్ల అప్పుకోసం కూతురితో కలిసి GB2 బేంకుకి వస్తాడు. శిరీషకి ఆ విషయంలో ఆసక్తి లేకపోయినా తండ్రికోసం బోస్టన్‍నుంచీ వస్తుంది. వాళ్ళు అడుగుతున్న మొత్తం బేంకు పెరామీటర్స్ ప్రకారం చాలా చిన్నది కాబట్టి అప్పు దొరకదు. ఈ పరిక్రమంలో ఆదిత్య, శిరీషలమధ్య ప్రేమ మొదలౌతుంది. పెళ్ళిచేసుకుంటారు. శిరీష కచ్చితంగా రూల్స్ పాటించే మనిషి. ఆదిత్యది మంచిచెడుల విచక్షణ లేకుండా అవకాశాన్ని వినియోగించుకునే మనస్తత్వం. వీళ్ళ కాపురం ముంబైలో. అమెరికాకీ ఇండియాకీ మధ్య తిరుగుతుంటుంది శిరీష. బేంకు అప్పు దొరక్కపోవటంతో కొత్తపద్ధతిలో ఎమూ పక్షుల పెంపకం మొదలుపెడతాడు నారాయణన్. దానికి విపరీతమైన స్పందన వస్తుంది. డబ్బురూపంలో కోట్లు వచ్చిపడుతుంటాయి. ఆ డబ్బుని మేనేజి చెయ్యడానికి అల్లుడి సహాయం తీసుకుంటాడు. డబ్బు రుచి మరిగిన ఆదిత్య బేంకు డబ్బుల్ని దుర్వినియోగం చేస్తాడు.
శివిందర్ ఆదిత్య క్లాస్‍మేట్, స్నేహితుడు. అతడంత నమ్మదగ్గ వ్యక్తి కాదని శిరీష హెచ్చరిస్తుంది. భార్య మాటలు లెక్కచెయ్యడు ఆదిత్య. శివిందర్ స్టెప్ ఇన్ షూస్ అనే చెప్పుల కంపెనీకి సియ్యీవో. తన తరువాత వారసులెవరూ లేనందున ఆ కంపెనీ అమ్మెయ్యాలనుకుంటాడు దాని స్వంతదారు. అది చిన్న కంపెనీ కావటంతో టేకోవర్‍కి ఎవరూ ముందుకి రారు. ఆదిత్య సలహామీద అమ్మకాలు పెంచి అంకెలు తారుమారు చేసి, స్నగుల్స్ అనే కంపెనీకి అమ్ముతారు. కొత్త కంపెనీ పాతవారందరినీ కూడా తీసుకుంటుంది. పెంచి చూపించిన అంకెలు వాస్తవానికి తీసుకు రావటానికి ఒక ఫ్రాడ్ మొదలౌతుంది. దీనియొక్క చిన్న కొస ముంబైలోని ధారవిలో శిరీషకి చిక్కుతుంది.
అమెరికాలో గన్ కల్చర్ ప్రెసిడెంటు ఎలక్షన్లని ప్రభావితం చేసే స్థాయిలో వుంటుంది. గన్ కల్చరుకి మద్దతుగానూ, వ్యతిరేకంగానూ చర్చలు సాగుతుంటాయి. అనేక బేంకులు, వ్యాపారసంస్థలు ఆయుధాల వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వుంటాయి. ఎన్నార్‍ఏ అనే సంస్థ గన్ కల్చరుకి మద్దతుగా రిసెర్చి చెయ్యడానికి స్పాన్సర్ చేస్తూ ఎంఐటీ ముందుకి వస్తుంది. ఆ అవకాశాన్ని అందుకున్నవారెవరు? నైతిక కారణాలచేత తిరస్కరింకీనా వ్యక్తి నైజగుణం ఎలాంటిది?
ఒకదానితో ఒకటి ముడిపడుతూ విడుతూ చివరిదాకా వుత్కంఠగా నడుస్తుంది నవల. ఐతే ముగింపుమాత్రం ఫక్తు భారతీయ సినిమా ముగింపులా అనిపించి, కొంచెం నిరాశ కలిగించింది. అక్రమ లావాదేవీలతొ బేంకులు నిజంగానే బద్దలౌతున్నాయనేది (erupt) అనేది నవల పేరులోని వ్యంగ్యం.