ప్రజల మనిషి- రచన, వట్టికోట ఆళ్వారుస్వామి
పరిచయం యస్. శ్రీదేవి

రచయిత అతి నిరుపేద కుటుంబంలో 1915లో నల్గొండ జిల్లాలో జన్మించారు. హోటల్లో కార్మికుడి స్థాయినుంచీ ఎదిగారు. అనేక నవలలు, కథలు రాసారు. దేశోద్ధారక గ్రంథమాల అనే సంస్థను స్థాపించి, 35 పుస్తకాలను ప్రచురించారు. తెలంగాణా అనే వార్తాపత్రికను నడిపారు. నిజాముకి వ్యతిరేకపోరాటమే కాక, క్విట్ ఇండియా వుద్యమం, గ్రంథాలయోద్యమంలాంటి అనేక పోరాటాలలో పాల్గొని నాలుగేళ్ళ జైలుజీవితం గడిపారు.
“ప్రజలమనిషి” నవలని మొదటి తెలంగాణా నవలగా చెప్తారు. ఈ పుస్తకం మొదటి ప్రచురణ 1955లో దేశోద్ధారక గ్రంథమాలద్వారా జరిగింది. తరువాతి ఐదు ప్రచురణలు విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్ వేసింది. ప్రస్తుతపు ఈ ప్రతి ఆరవ ప్రచురణకి చెందినది. ముద్రించిన సంవత్సరం 2008. అప్పుడు పుస్తకం వెల రూ.60/-
అత్యంత ప్రాచీనమైన చరిత్రగల ప్రాంతాలు భారతదేశంలో అనేకం వుంటాయి. అందులో హైదరాబాదు సంస్థానం ఒకటి.
విదేశీయులు మనదేశానికి రాకముందుకూడా ఇక్కడి రాజులు పరస్పరం కలహించుకుని యుద్ధాలు చేసుకునేవారు. ఓడిన రాజుల దగ్గర కప్పం కట్టించుకుని, అతన్ని సామంతుడిని చేసుకుని గెలిచిన రాజులు తిరిగి వెళ్ళేవారు. వివాహసంబంధాలు కలుపుకోవటంకూడా వుండేది. గెలిచిన రాజ్యంలోనే కూర్చుని పాలించడం మాత్రం లేదు. వాళ్ళలో మంచివారూ చెడ్డవారూ వున్నప్పటికీ ప్రజలకీ, రాజులకీ సంస్కృతీసాంప్రదాయాల్లో సారూప్యత వుండేది. పూజించే దేవుళ్ళు వేరైనా, ఆ మతాలు పుట్టిన పొద ఒకటే. ఎక్కడినుంచో వచ్చిన విదేశీయులు భిన్నమైన జీవనవిధానాలతో ఇక్కడి రాజ్యాలని జయించడంతోపాటు ప్రజలమీద తమ పద్ధతులని రుద్దడం సంఘర్షణకి దారితీసింది. వీళ్ళంతా పాలకులే తప్ప, రాజులు కారు. ప్రజలు వారి ఆదాయ వనరులు. ఇక్కడి సంపద వారి హక్కుభుక్తం. స్త్రీ దగ్గర్నుంచీ విత్తందాకా తమదని నిర్ణయం చేసుకుని ముందుకి సాగారు. పాలనావ్యవహారాలనుంచీ సామాన్యజనజీవనందాకా తమకి అనుకూలంగా మారాలనీ, మార్చాలనీ ప్రయత్నించారు. కాకతీయుల తర్వాత తెలంగాణా ప్రాంతపు రాజకీయక్రీడారంగం గోల్కొండకి మారింది. ఖిల్జీలు, తుఘ్లక్‍లు, బహమనీలు, కుతుబ్‍షాహీలు, మొఘలులు, ఆసఫ్‍జాహీలు ఇలా అనేకులు హైదరాబాదుని పాలించారు. కథాకాలంనాటికి సంస్థానం ఆఖరి ఆసఫ్‍జాహీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో వుంది.
నిజామాబాద్ జిల్లాలోని దిమ్మెగూడెం అనే పల్లెటూరు. రామ్‍భూపాలరావు వూరికి దొర. అతని కూతురికి పెళ్ళై, మొదటిసారి అత్తగారింటికి వెళ్తుంటే వూళ్ళోవారంతా దొర అడిగినవన్నీ సమకూర్చుతూ వుంటారు. కోటయ్య అనే వ్యక్తి తన ఆవునీ దూడనీ పంపిస్తాడు. అతడి కొడుకు కొమరయ్య. ఎన్నో యేళ్ళకిందట వూరు వదిలేసి దేశాలు పట్టిన బ్రాహ్మణకుటుంబం తాలూకు భూమి వుంటే దాన్ని కోటయ్య కౌలుకి చేస్తుంటాడు. కౌలు డబ్బు రామ్‍భూపాలరావు జమలోకి చెల్లిస్తుంటాడు. కోటయ్య చనిపోయాక భూమిని వెనక్కి తీసుకుని దొంగసాక్ష్యాలతో తన పేరుమీద రాయించుకుంటాడు.
రఘునాథాచార్యులు వూళ్ళోని వైష్ణవాచార్యులు. అతనికి ఇద్దరు కొడుకులు- వేంకటాచార్యులు, కంఠీరవం. రామ్‍భూపాలరావు కూతురి పెళ్ళిలో తలెత్తిన చిన్న వివాదంలో రఘునాథాచార్యులు చేసుకుంటున్న భూమిని వెనక్కి తీసుకుంటాడు దొర. శిష్యసంచారానికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వస్తుంది రఘునాథాచార్యులుకి. ఇక్కడ కథ మొదలౌతుంది. ఒక పిల్లవాడు ప్రజలమనిషిగా మార్పు చెందిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది.
కొన్నిరోజులకి రఘునాథాచార్యులు చనిపోతాడు. అతను చనిపోయాక ఇంటిపెత్తనం అన్న చేతికి వెళ్తుంది. అతను ధూర్తుడు. రామ్‍భూపాలరావు అనుచరవర్గంలో చేరతాడు. అన్నతో గొడవపడి కంఠీరవం యింట్లోంచీ పారిపోతాడు. కష్టపడి నిజామాబాదు చేరుకుంటాడు. తండ్రి పేరు చెప్పగానే అక్కడ ఆశ్రయం దొరుకుతుంది. కొంత చదువు సాగుతుంది. అక్కడి గ్రంథాలయాభివృద్ధికి కృషి చేస్తాడు. స్వగ్రామంలో మతమార్పిడి జరుగుతున్న విషయం తెలిసి, అక్కడికి వెళ్తాడు. మతమార్పిడులని నిరసించినందుకు రాజద్రోహనేరంకింద అరెస్టై, జైలుశిక్ష పడుతుంది. జైల్లో వున్నప్పుడు బషీర్ అనే దొంగతో పరిచయమౌతుంది. అతడు ముస్లింగా పరివర్తనం చెందిన వైశ్యుడు. ఇద్దరూ ఒకేరోజు విడుదలైతే అతన్ని వెంటబెట్టుకుని నిజామాబాదు వస్తాడు. అక్కడ వేంకటేశ్వర్లు అనే లాయరుతో పరిచయమౌతుంది. కొమరయ్యనుంచీ రామ్‍భూపాలరావు ఆక్రమించుకున్న భూమి అతనిదేనని తేలుతుంది. పల్లెటూళ్ళలోని అప్పటి పరిస్థితులు, గొడవలు, జైలుకి వెళ్ళడం, దొర అక్రమంగా భూములు దఖలుచేసుకోవడం, మతమార్పిడులు, మతం మారినా బతుకుల్లో ఎలాంటి మార్పూ రాదని ప్రజ తెలుసుకోవటం, మతం మారినవారిని ఆర్యసమాజం తిరిగి మతంలోకి తీసుకురావటం, కోర్టులు, జైళ్ళు, జైళ్ళలో వాతావరణం, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభలు… ఆ సభల్లోకి దొరల చొరబాటు, దొర చేసిన తప్పు ఆధారాలతో చూపించినా, కేసు పెట్టడానికి యిచ్చగించని తహసీల్దారు, ఇలా విశ్వభ్రమణం చేయించారు రచయిత. ఈ విషయంమీద ఎన్నో నవలలూ, సినిమాలూ వచ్చినా, ఇది తొలి తెలంగాణా నవల కావడం విశేషం.