చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao

  1. నీల by Nandu Kusinerla
  2. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  3. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  4. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  5. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  6. బలిపశువు by Pathy Muralidhara Sharma
  7. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  8. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  9. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  10. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  11. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  12. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  13. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  14. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  15. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  16. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  17. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  18. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

కాలింగ్‍బెల్ మోగేసరికి బద్ధకంగా టీవీముందునుంచి లేచి వెళ్లి తలుపుతీసి ఎవరు వచ్చారు అన్నది అయినా చూడకుండా మళ్లీ వెళ్లి సోఫాలో కూలబడింది స్మిత.
తలుపు వేసి లోపలకి వస్తూ, “ఆ టీవీ వాల్యూం తగ్గించు” అన్న తండ్రి మాటకి రిమోట్‍తో వాల్యూం తగ్గించింది .
ఎర్రటి ఎండలో వచ్చాడేమో శేఖర్ సింక్ దగ్గరకి వెళ్ళి మొఖం కడుక్కుని ఓ గ్లాస్ చల్లనినీళ్లు తాగి బెడ్‍రూమ్‍లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని బయటికి వచ్చి “తలనొప్పి మాత్రలు ఏమైనా ఉన్నాయేమో చూడు!” అని కూతురిని అడిగి మళ్ళీ వెళ్ళి మంచంమీద పడుకున్నాడు.
ఇక తప్పదన్నట్లు లేచి ఫ్రిజ్‍మీద మందులపెట్టిలో ఓసారి చూసి “లేవు డాడీ!” అని బయటినుండే గట్టిగా అనేసి టీవీ ముందు సెటిల్ అయిపోయింది.
స్మిత బీటెక్ కంప్యూటర్స్ రెండోసంవత్సరం చదువుతోంది. ఒక్కర్తే సంతానం.
కాలేజీకి వెళ్ళి రావటం వీలయినంత టైం టీవీముందు, ఫోన్‍మీదా ఉండటం తప్ప ఇంట్లో మరేవిధమైనవాటిమీద దృష్టిపెట్టదు. శేఖరం తనదైన వ్యాపారం చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురిని అరచేతిలో పెట్టి పెంచుకుంటున్నాడు. ఆపిల్ల కా-అంటే-కా, కీ-అంటే-కీగా ఎదుగుతోంది .
ఇక స్మిత తల్లి లలిత. బాంక్‍లో మేనేజర్. ఇంటా, బయటా అన్నీ తానే చూసుకుంటుంది. కలిగినవాళ్ళ బిడ్డ అయిన శేఖర్ ఆర్థికంగా బాగా తక్కువస్థాయినుండి వచ్చిన తన జూనియర్ అయిన లలితని ఆమె అందం, తెలివితేటలు, సౌజన్యానికి ముగ్ధుడై ప్రేమించి వివాహం చేసుకున్నాడు. శేఖర్‍కి తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి పునర్వివాహంచేసుకోలేదు .
శేఖర్‍ని భర్త పోయి పుట్టింటికి చేరిన పిల్లలు లేని తన అక్క సహాయంతో పెంచి పెద్దచేసాడు అతని తండ్రి. అంతేకాక తన కుటుంబవ్యాపారం సమర్ధవంతంగా నిర్వహిస్తూ అందులో మెళకువలు అన్నీ శేఖర్‍కి నేర్పాడు.
శేఖర్‍కూడా చదువుకున్నప్పటికీ తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ వ్యాపారంలో వ్యవహారాలన్నీ శ్రద్ధగా నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తరవాత అతని వ్యాపారం ఇప్పుడు తానే నిర్వహిస్తున్నాడు.
లలిత పీజీ అయ్యాక ప్రొబేషనరీ ఆఫీసర్‍గా సెలెక్ట్ అయి బాంక్ ఉద్యోగంలో చేరి తన పుట్టింటివారికి అన్నివిధాలా అండాదండాగా ఉండేది. చెల్లెలికి, తమ్ముడికి చదువులకు, పెళ్ళిళ్ళకి సహాయం చేసి, తలితండ్రుల ఆర్ధిక అవసరాలను ఆదుకుంటూ అత్తింటిని, పుట్టింటిని చక్కగా సంబాళించుకుంటుంది.
స్మితకి పదేళ్ల వయసులో శేఖర్ మేనత్త కూడా వెళిపోయింది.
ఇంటివారు చేసే గారంకితోడు,ఈరోజుల్లో అందరూ యువత పోయే పోకడలు అన్నీ కలిపి పోతపోసిన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్మిత. లలిత మందలిస్తూనే ఉంటుంది కూతుర్ని.
“పోనిద్దూ! తరవాత తనే తెలుసుకుంటుంది. ప్రతి చిన్నవిషయానికి తనని ఏమీ అనకు” అని శేఖర్ వెనకేసుకొస్తాడు. తండ్రి అండ చూసుకు స్మిత తల్లి మాట లక్ష్యపెట్టదు.
శేఖర్, లలిత ఉదయం పదిగంటలకల్లా వారివారి వృత్తిపరమైన బాధ్యతలకి బయలుదేరిపోతారు ఎవరి కార్లో వాళ్ళు. ఆఫీసు దగ్గరే కావటంవలన మధ్యాహ్నం శేఖర్ ఇంటికి వచ్చి భోజనం చేసి కాసేపు పడుకుని నాలుగుగంటలకు లేచి టీ తాగి మళ్లీ వెళిపోతాడు.
ఉదయం టూవీలర్‍మీద కాలేజ్‍కి వెళ్ళే స్మిత సాధారణంగా సాయంత్రానికిగాని ఇంటికి రాదు . ఇప్పుడు వేసవి సెలవులు కావటం వలన ఇంట్లో ఉంది. ఇంట్లో వున్నా ఏమీ పట్టించుకోదు. ఫ్రెండ్స్, టీవీ, ఫోన్, సరదాలు తప్ప ఆ పిల్లకి మరో ధ్యాస ఉండదు.
పనిమనిషి ఉదయం వచ్చి లలిత ఉన్నంతసేపు ఉండి వెళిపోయి మళ్ళీ లలిత వచ్చి ఫోన్ చేసేకా వస్తుంది. ఇంటితాళాలు ఎవరివి వాళ్ళదగ్గర ఉండేట్లు ముగ్గురూ ఏర్పాటుచేసుకున్నారుకాబట్టి ఎవరి టైం వాళ్ళది , ఎవరి ప్రపంచాలు వాళ్ళవి అయినా ఇబ్బంది లేకుండా ఉంటోంది వాళ్ళకి.
స్మిత తినేటప్పుడుకూడా ప్లేటులో పదార్ధాలు వేసుకు టీవీ చూస్తూ మారు కావలిస్తే డైనింగ్ టేబుల్ దగ్గరికి మధ్యమధ్య వెళ్ళి వేసుకుంటూ ఇలా తింటుంది లలిత ఇంట్లో లేకపోతే. అసలు భోజనాలు చేసేటప్పుడు టీవీ ఆపమని ఎంత చెప్పినా వినిపించుకోదు. బయట చేసిచేసి వచ్చిన లలితకు ఇంట్లో ప్రశాంతత లేకుండా ఆ టీవీగోల అంటే చిరాకు. ఏమిటో ఈ పిల్లకి జ్ఞానం ఎప్పుడు వస్తుందో. ఒక్కమాటకూడా వినకుండా తయారైంది అని దిగులు పడుతూ ఉంటుంది. అందులో చక్కని సంబంధబాంధవ్యాలు, ప్రేమాభిమానాల విలువ తెలిసిన నేపధ్యంనుండి రావటం మూలాన లలితకి స్మిత తీరు చాలా ఆందోళన కలిగిస్తుంది.
ఆ మాటే భర్తతో అంటే, “ఈరోజుల్లో పిల్లలంతా అలాగే వుంటున్నారు. ఊరికే అతిగా ఆందోళన పడకు” అనేస్తాడు. ఐనా అలా వదిలెయ్యలేక సమయం వచ్చినప్పుడల్లా స్మితకు మంచి,చెడు చెబుతూనే ఉంటుంది.
ప్రతితల్లి, కూతురు కథే. తల్లి చెప్పటం, కూతురు పెడచెవిని పెట్టటం. చిన్న చిన్న ఘర్షణలు, అలకలు, కోపాలు మళ్ళీ తియ్యారించటాలు. మొత్తంగా ఇదీ ఆ ఇంటి రామాయణం.
టీవీలో ప్రోగ్రాం అయిపోగానే లేచి తన గదిలోకి వెళిపోయి ఫ్రెండ్స్‌తో ఆన్‍లైన్ చాట్‍చేస్తూ అలాగే నిద్రపోయింది స్మిత. ఆ పడక పడక ఆరుగంటలవరకు తెలివి రాలేదు. అప్పుడు తెలివి వచ్చి చూస్తే అది ఉదయమో సాయంత్రమో కూడా తెలియలేదు. లేచి బద్ధకంగా వొళ్ళువిరుచుకు వచ్చి సోఫామీద ఇందాక పడేసిన రిమోట్ తీసి టీవీ ఆన్‍చేసి అదే సోఫామీద కూచుంది. అప్పుడే లలిత ఇంట్లో అడుగుపెట్టింది.
“ఏమిటి, ఇంట్లోనే ఉన్నావా? ఇందాక ఫోన్‍చేస్తే తియ్యలేదు. నీకు డాడీకి మొబైల్స్‌కి, ల్యాండ్‍లైన్‍కి చేస్తే రింగ్ అవుతున్నాయి కానీ ఇద్దరూ ఎత్తటం లేదు” అంటూ బెడ్‍రూమ్‍వైపు నడిచి అక్కడ మంచంమీద పడుకుని ఉన్న భర్త ను చూసి…
“డాడీ ఆఫీస్‍కి వెళ్లలేదా?” అని అడిగింది, కూతుర్నే.
“వెళ్ళలేదా? నేను చూడలేదు. నిద్దర పట్టేసింది నాకు” అంది స్మిత.
“బావుంది. పగటిపూటకూడా అంత మొద్దునిద్ర. ఇంట్లో మనిషి ఉన్నాడో బయటికి వెళ్ళాడో తెలియకుండా. ఇప్పుడు ఆరు అవుతోంది. కనీసం కాఫీకూడా పెట్టుకున్న ఛాయలు లేవు. పెరుగు బయట వదిలేసారు. పులిసిపోతుంది, భోజనాలు అవగానే ఫ్రిజ్‍లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను మీ ఇద్దరికీ? ఇలాటివన్నీ గుర్తుచేద్దాం అనే ఫోన్‍చేస్తాను మూడు నాలుగు గంటల మధ్య. ఫోన్ చేస్తే ఎత్తవు. ఆయన రోజూ ఫోన్ తీస్తారు. ఈరోజు ఆయనా లేపలేదు. ఇంట్లో ఉన్నపుడయినా కాస్త చేయాల్సినవాటిమీద దృష్టిపెట్టవు. ఎంతసేపు ఆ ఫోన్, టీవీతప్ప మరోధ్యాస లేదు” అంది అసహనంగా.
పెరుగుగిన్నె ఫ్రిజ్‍లో పెట్టటానికి వెళ్ళి అక్కడే ఉన్న రైస్‍కుక్కరులో గిన్నె చూసి, “అన్నీ ఇలా డైనింగ్‍టేబుల్‍మీద వదిలేస్తారు తప్ప తీసిన వస్తువు తీసినచోట పెట్టాలని, భోజనాలు అయ్యాక మిగిలిన పదార్ధాలు ఇమ్ముగా సర్దాలి అని కానీ అనుకోరు. రోజూ చెప్పినా తలకి ఎక్కదు మీకు” అంటూ రైస్‍కుక్కరు గిన్నె ఎత్తేసరికి అది బరువుగా ఉంది. మూత తీసి చూస్తే అందులో చాలా అన్నం ఉంది.
“ఇంత అన్నం ఉండిపోయిందేమిటి? సరిగా అన్నాలు తినలేదా మీరిద్దరూ!” అడిగింది స్మితవైపు విసుగ్గా చూస్తూ.
“నేను తిన్నాను. డాడీ తలనొప్పి అని పడుకుండిపోయారు. మరి తరవాత తిన్నారో లేదో నేను చూడలేదు” టీవీతెరమీదనుంచి కళ్ళు తిప్పకుండా అంది స్మిత.
“సెహ్బష్! ఇంట్లో ఉండి నాన్న తిన్నారో లేదో చూడలేదు. బొత్తిగా చుట్టుపక్కల ఏమి జరుగుతోందో చూడకుండా తయారవుతున్నావు. ఇది మన ఇల్లు .ఈఇంట్లో మనుషులు నావాళ్లు. వాళ్ళపట్ల నా బాధ్యతలు కొన్ని ఉంటాయి అని స్పృహ లేకుండా ఎదుగుతున్నావు. బావులేదు నీ పద్ధతి” అని చిరాకుపడింది.
“అబ్బా ! ఏమిటి మమ్మీ! ఈరోజు ఇంట్లో వున్నాను కాబట్టి నన్ను అంటున్నావు. రోజూ నేను మాత్రం ఈ టైంకి ఇంట్లో వుంటానా?” అని విసురుగా జవాబు ఇచ్చింది స్మిత రిమోట్‍తో చానెల్స్ మారుస్తూ.
“చాల్లే! ఏమైనా అంటే మాటకి మాట సమాధానం చెప్తావు” అని, బెడ్‍రూమ్‍లోకి వెళ్లి లైట్ వేసి “ఏమండీ! ఆరు దాటింది. ఇక లేవండి. కాఫీ తాగుదురుగాని” అని వంటగదిలోకి కాఫీ పెట్టటానికి వెళ్ళింది.
మూడుకప్పుల బ్రూ కలిపి ట్రేలో పెట్టుకు వచ్చి ఒకటి స్మితకిచ్చి మిగతా రెండు పట్టుకు తిరిగి బెడ్‍రూమ్‍లోకి వెళ్ళింది.
“ఏమండీ, ఇంకా లేవలేదు? కాఫీ చల్లారిపోతుంది. లెండి. తాగేసి రిఫ్రెష్ అవుదురు” అన్నాక కూడా శేఖర్ కదలకపోవటంతో, “ఒక్క పిలుపుకి లేస్తారు. లైట్ ఉంటే తీసేవరకు నిద్రపోరు. అలాటిది లైటేసినా లేవకుండా పట్టపగలు ఇంత మొద్దునిద్రపోతున్నారేమిటి ఈరోజు? ఇంతలా ఇప్పుడు పడుకుంటే మళ్లీ రాత్రి నిద్రపట్టదు. వంట్లో ఏమిటి బావులేదు?” అంటూ కాఫీ ట్రే పక్కనున్న బల్లమీద పెట్టింది ఆందోళనగా.
శేఖర్ దగ్గరకు వెళ్ళి కుదిపి లేపుదామని ఒంటిమీద చేయి వేసేసరికి శరీరం చల్లగా తగిలింది.
“ఇదేమిటి ఇంత చల్లబడిపోయారు? ఏసీ మరీ తక్కువ టెంపరేచర్ పెట్టుకుంటారు. చెప్పినా వినరు” అంటూ ఎంత కదిపినా శేఖర్ లేవకపోవటంతో కంగారుపడింది.
“ఏమిటో! ఆకలికాగలేరు. భోజనం మానేసి పడుకున్నారు. నీరసం వచ్చింది. ఇంట్లో ఎదిగిన పిల్ల ఉండి ఏం ప్రయోజనం? కనీసం ఇన్ని పాలయినా వేడి చేసి తండ్రికి ఇయ్యాలని ఆ పిల్లకి తోచలేదు. మీరు అయినా అడగవచ్చుకదా. ఇలా నీరసంతో నీరుకారిపోకపోతే? అయినా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది అని పిల్లలని ఇలా బాధ్యతా, స్పందనా అనేవి తెలియకుండా పెంచుతున్నాం. అవసరం వచ్చినపుడు అన్నీ అవే వస్తాయి, తనని ఏమీ అనకు, ఊరుకోమని అన్నిటికీ నా నోరు మూయిస్తారు. ఫలితం ఆ పిల్ల ఇలా ఏదీ పట్టించుకోకుండా తయారైంది… అయినా స్మితా, డాడీ అన్నం కూడా తినకుండా పడుకున్నారు. ఏమైందో ఓసారి చూదాం, పాలో, నీళ్ళో ఇద్దాం, మమ్మీకి ఫోన్‍చేసి ఆ విషయం చెప్దాం అనేనా అనిపించలేదా నీకు? ఆ ఫోన్ ఇలా అందుకో. రఘు అంకుల్‍కి ఫోన్ చేస్తాను. నాన్న ఎంత లేపినా లేవటం లేదు. నీరసం వచ్చేసిందేమో అన్నం తినకపోవటంవలన. జ్వరం వచ్చినా భోజనం మానరు నాన్న ఎప్పుడూ!” అంటూ భయం, కోపం ,ఆందోళన, విరక్తి ,నిస్సహాయత అన్నీ కలగలిపి అప్పటి తన మానసికస్థితిని మాటల్లో వెళ్ళగక్కింది.
స్మిత ఫోన్ తెచ్చి తల్లికి ఇచ్చి మళ్ళీ టీవీ ముందుకు వెళిపోయింది.
లలిత తన డాక్టర్ ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పి “నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే రా! ” అంటూ ఇంచుమించు ఏడుపు గొంతుతో చెప్పింది.
“కంగారుపడకు. ఇప్పుడే వస్తున్నాను” అని అన్నా అతను వచ్చేవరకు లలిత మనసు మనసులో లేదు.
అప్పుడు మనసుకు తట్టి శేఖర్ ముక్కుదగ్గర చేయిపెట్టి చూస్తే అతను ఊపిరి తియ్యటం లేదు. లలితకు అర్ధం అయిపోయినా రఘు వస్తే ఏమైనా చేస్తాడేమో అని ఆశ. మరోలా అనుకోవడానికి అంగీకరించని మనసు. రఘు వచ్చేవరకు నరకయాతన అనుభవించింది. కానీ స్మితకు ఇది ఏమీ తెలియదు.
అన్నట్లుగానే అరగంటలో రఘు వచ్చి చూసి, “లలితా నువ్వు ధైర్యం చిక్కబట్టుకో! శేఖరం ప్రాణం పోయి రెండుగంటలయి ఉండవచ్చు. కార్డియాక్ అరెస్ట్” అని చెప్పాడు.
ఘొల్లుమంది లలిత.
తల్లి ఏడుపు బయటకి వినపడటంతో ఏమి జరిగిందో అర్ధంకాని స్మితను పిలిచి జరిగింది రఘు చెప్పాడు. స్మితకు మతిపోయింది. రెండుగంటలు అంటే తాను టీవీ కట్టి రూమ్‍లోకి వెళ్ళటానికి పదినిముషాలు ముందే. ఒక్కసారి డాడీ ఎలా ఉన్నారో చూసి డాక్టర్ అంకుల్‍ని పిలిచి ఉంటే, మమ్మీకి పరిస్థితి చెప్పి ఉంటే డాడీ బతికి వుండేవారేమో. మమ్మీకేసి కళ్ళెత్తి చూడలేకపోయింది. తాను ఇంట్లో ఉండికూడా డాడీకి ఏమీ చేయలేకపోయింది అన్న బాధ, నాన్న ఇక లేరు అన్న భావన రెండూ మనసును మెలిపెడుతుంటే ఏమి చేయాలో తెలియని అయోమయంలో స్థాణువులా ఉండిపోయింది.