జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi

  1. జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi
  2. జిల్లావైద్యుడు (The District Doctor)- 2 Translation by S Sridevi

రష్యన్ మూలం: IVAN S.TURGENEV
The story was originally Published in Russian in the year 1848. and included in the story compilation, Zapiski Okhotnika in Russian in 1852 and in
“A Sportsman’s Sketches” in 1852 in English and available in Project Gutenberg in the Public domain.

ప్రతిమనిషికీ ఒక ప్రేమకథ వుంటుంది. అది విఫలమో సఫలమో ఔతుంది. రెండిటిలో ఏది జరిగినా అతనిమీద దాని ప్రభావం వుంటుంది. అలాంటి ఒక ప్రేమకథ జిల్లాడాక్టరు ట్రిఫాన్ ఇవానిచ్‍ది. అతనితో ఎటువంటి పూర్వపరిచయం లేని నేను దాన్ని నేను అతని నోటమ్మటే వినటం చాలా తమాషాగా జరిగింది.
అతను కథ చెప్తూ మధ్యలో నశ్యం పీలుస్తాడు. అదికూడా ఘాటైన బెరిజోవ్ నశ్యం. అది తీసుకున్నాక అతని గొంతు కొంచెం పీలగా మారుతుంది. సర్దుకున్నాక కథని కొనసాగిస్తాడు. చెప్పటంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు టీ తాగుతూ కొద్దిగా కాలయాపన చేస్తాడు. కొన్ని విషయాలైతే ముక్కలుముక్కలుగా చెప్పినప్పుడు అతను చెప్తే అర్థమైనదానికన్నా నేను కృషిచేసి గ్రహించినదే ఎక్కువ. ఇదంతా కథ చెప్పడంలో అతను అనుభవించిన ఇబ్బందిని అధిగమించడానికేనని గ్రహించాను.


శరదృతువులో ఒకరోజు నేను దేశంలోని మారుమూల ప్రాంతంనుండి తిరిగి వస్తుండగా జలుబు చేసి అస్వస్థతకు గురయ్యాను. అదృష్టవశాత్తూ ఆ సమయానికి నేను జిల్లాకేంద్రంలోని సత్రంలో బసచేసి వున్నాను. ఫిజీషియన్‍కోసం కబురు పంపాను. జిల్లాడాక్టరు అరగంటలో వచ్చేసాడు. పొట్టీపొడుగూ కాని మధ్యస్థపు ఎత్తులో వున్న సన్నని, నల్లటిజుట్టు గల వ్యక్తి. నాకు సూడోరిఫిక్ అంటే చెమటబాగా పట్టడానికి వుపకరించే సాధారణమైన మందు ఇచ్చి, తెల్లావాల ప్లాస్టర్ వేసుకొమ్మన్ని సూచించాడు. ఐదు రూబుళ్ళు ఫీజు. నేను నోటు ఇవ్వగానే దాన్ని చాలా నేర్పుగా జేబులోకి తోసేసాడు. ఆ పని చేస్తున్నప్పుడు అతను నా ముఖంలోకి చూడకుండా వేరేవైపు చూస్తూ, ఇబ్బందికరమైన పొడిదగ్గులు దగ్గి, ఆపై ఇంటికి వెళ్ళడానికి లేచాడు. ఏదో చెప్తూ మాటల్లో పడి మళ్ళీ ఆగిపోయాడు.
అప్పటికి నేను జ్వరంతో బాగా అలిసిపోయి వున్నాను. రాత్రికి నిద్రకూడా పడుతుందనుకోవట్లేదు. కాసేపు కబుర్లు చెప్పుకోవటానికి ఒక మంచి నేస్తం దొరికాడని సంతోషపడ్డాను. టీ తెప్పించాను. తాగుతూ కబుర్లలో పడ్డాం ఇద్దరం. డాక్టరు చాలా సరదాయైన మనిషి. హాస్యం జతచేస్తూ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
ప్రపంచంలో వింతైన విషయాలు జరుగుతుంటాయి. కొంతమందితో మనం చాలాకాలమే గడిపి వుండచ్చు. వాళ్ళతో స్నేహసంబంధాలే నెరిపి వుండచ్చు. ఐనాకూడా వారితో మనసు విప్పి ఒక్కసారికూడా మాట్లాడి వుండం. ఇంకొందరితో మనకి పెద్దపరిచయం వుండదు. ఐనా మన మనస్సు అట్టడుగుపొరల్లోని రహస్యాలన్నీ ఒక ధారలాగా వారిముందు వొలికిపోతాయి. ఈ డాక్టరు మితృడికి ఇంత చిన్న వ్యవధిలోనే నామీద ఎలా నమ్మకం కలిగిందో తెలీదు. తన జీవితంలోని రహస్యాన్ని నాముందు పరిచేసాడు.
“ఒకసారి ఏం జరిగిందో మీకు తెలీదు…”అంటూ మొదలుపెట్టాడు. చెప్తూ ఎలాంటి కల్తీలేని బెరిజోవ్ నశ్యం పీల్చాడు. నశ్యం ఘాటుకి అతని గొంతు చాలా బలహీనంగా వణికింది.
“ఇక్కడ న్యాయనిర్ణేతగా ఎవరున్నారో మీకు తెలుసా? పావెల్ లూకిచ్… అతను మీకు తెలుసా? అఫ్‍కోర్సు… మీకు అతను తెలిసినా తెలీకపోయినా పెద్ద తేడా ఏమీ వుండదనుకోండి” అంటూ గొంతు సవరించుకున్నాడు. తరువాత ఒకమాటు కళ్ళు రుద్దుకున్నాడు. ఆ తర్వాత కథ మొదలుపెట్టాడు.


చాలా కచ్చితంగా చెప్పాలంటే ఆ సంఘటన లెంట్‍లో… మంచు కరుగుతూ వున్న కాలంలో జరిగింది. పావెల్ లూకిచ్ ఇంట్లో ప్రిఫరెన్స్ ఆడుతున్నాం. మనిషి చాలా మంచివాడు. అతనికి ఆ ఆటంటే చాలా యిష్టం.
“ఎవరో పరిచారకుడు మీకోసం వచ్చి ఎదురు చూస్తున్నాడు” ఇంట్లోవాళ్ళు చెప్పారు.
“ఏం కావాలట?” అడిగాను.
“ఏదో వుత్తరం పట్టుకుని వచ్చాడు. బహుశ: ఎవరేనా రోగినుంచీ కావచ్చు”
“ఏది, ఆ వుత్తరం?” అడిగి తీసుకున్నాను.
నిజమే. పేషెంటు దగ్గర్నుంచీ వచ్చిన వుత్తరమే. ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. వాళ్ళేకదా, మాకు తిండి పెట్టేది? ఆట ఆసక్తికరంగా వున్నా, ఆపి వుత్తరాన్ని చదివాను. ఒక వితంతు స్త్రీ దాన్ని రాసిందని అర్థమైంది. ఆవిడ కూతురు చావుబతుకుల్లో వుందట. నన్ను తీసుకెళ్ళడానికి గుర్రపుబండి పంపించింది. అప్పటికే అర్ధరాత్రైంది. ఒకవైపు కరుగుతున్న మంచు. మరోవైపు ఇరవై మైళ్ళదూరం. ఆమె ధనికురాలేమీ కాదు. రెండు వెండి రూబుళ్ళనిమించి ఏమీ రాదు. అదికూడా ఇవ్వలేదేమో… ఒక లైనెన్ వస్త్రపు తానో ఓట్‍మీల్ బస్తానో ఇస్తుందేమో! చెప్పలేను. కానీ విధినిర్వహణ అనేది నన్ను నిలవనివ్వలేదు. సాటిమనిషి చావుబతుకుల్లో వుందన్న ఆలోచనముందు ఇంకేవీ కనిపించలేదు. వెంటనే పేకముక్కలు కల్లియోపిన్ అనే మరో మితృడికి ఇచ్చేసి లేచాను. అతడు ప్రావిన్షియల్ కమిషన్లో సభ్యుడు. ఇంటికి వచ్చేసరికి చవకరకపు గుర్రపుబగ్గీ గుమ్మంముందు ఎదురుచూస్తూ వుంది. బండివాడు నన్ను చూడగానే గౌరవంగా లేచి నిలబడి టోపీ తీసి చేత్తో పట్టుకున్నాడు. నేను వెళ్ళబోయేచోట పరిస్థితి ఏమిటో అర్థమైంది. ఇలాంటి యోచన ఎవరికేనా నవ్వు తెప్పించవచ్చు. కానీ నాలాంటి ఒక పేద డాక్టరు అన్నీ ఆలోచించుకోవాలికదా? బండి ఎటువంటిదైనా బండివాడు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా విధినిర్వహణ తప్పదు. ఇంటిలోపలికి వెళ్ళి అవసరమైన మందులు తీసుకుని బయల్దేరాను.
చాలా భయంకరమైన ప్రయాణం అది. రోడ్డు నరకంలా వుంది. మంచు, అది కరుగుతున్న నీరు, ఆ నీటి ప్రవాహాలు… ఒకటేమిటి? ఒకచోట నీటిగుంట పొంగిపొర్లుతోంది కూడా. ఎలాగైతేనేం, గమ్యస్థానానికి చేరుకున్నాను. చిన్న పూరిల్లు వాళ్ళది. నాకోసం ఎదురుచూస్తున్నట్టున్నారు, కిటికీలో దీపం పెట్టి వుంచారు. నన్ను చూడగానే ఒక వృద్ధురాలు ఎదురొచ్చింది. తలమీద టోపీ ధరించి వుంది. చూడగానే నాకు గౌరవం కలిగింది.
“నా కూతుర్ని కాపాడండి. చాలా అనారోగ్యంగా వుంది” అంది.
“కంగారుపడకండి. నేను చూసుకుంటాను. ఎక్కడుంది?” అడిగాను.
“నాతో రండి” అంటూ నన్నో గదిలోకి తీసుకెళ్ళింది. గది చిన్నది. పరిశుభ్రంగా వుంది. ఒకమూల దీపం వెలుగుతోంది. గది మధ్యగా మంచం వుంది. దానిమీద ఇరవయ్యేళ్ళ యువతి వళ్ళు తెలీని జ్వరంతో పడి వుంది. ఉచ్వాశనిశ్వాసాలు చాలా బరువుగా వున్నాయి. ఆ యువతి చెల్లెళ్ళిద్దరూ కూడా అక్కడే వున్నారు. చాలా కంగారుపడుతున్నారు. అందులో ఒకమ్మాయి చెప్పింది.
“నిన్నంతా తను బాగానే వుండింది. భోజనంకూడా చక్కగా చేసింది. ఈరోజు వుదయం తలనెప్పంది. సాయంత్రమయ్యేసరికి ఇదుగో, ఇలా వుంది పరిస్థితి… ” ఆమె కళ్ళలో కన్నీళ్ళు.
“కంగారుపడకండి” మరోసారి చెప్పాను. పేషెంటుకి ఎలా వున్నప్పటికీ చుట్టూ వున్నవాళ్ళకి ధైర్యం చెప్పడం డాక్టరు విధి. పేషెంటు శరీరం మీద చిన్న గాయం చేసాను. ఆవపిండిపట్టీ వెయ్యమని చెప్పాను. మందుకూడా ఇచ్చాను. ఈ హడావిడంతా అయ్యాక నింపాదిగా రోగి ముఖంలోకి చూసాను. విస్మయం కలిగింది. ఎంత అందంగా వుంది! సౌందర్యానికి మారుపేరులా వుంది ఆమె ముఖం. తీరైన కనులు, చెక్కినట్టున్న ముక్కు, పల్చటి చెక్కిళ్ళు… ఆమెకి ఇంత అనారోగ్యం… నా మనసు జాలితో నిండిపోయింది.
కాలం నెమ్మదిగా గడుస్తోంది. నా వైద్యం పనిచేసింది. ఆమెలో గుణం కనిపించింది. జ్వరం కాస్త దిగజారింది. వళ్ళంతా చెమటలు పట్టాయి. స్పృహలోకి వచ్చింది. నెమ్మదిగా కళ్ళిప్పి చుట్టూ చూసింది. చిన్న చిరునవ్వు పెదాలమీద నిలిచింది. చేతుల్లో ముఖాన్ని కప్పుకుంది. అక్కడే వున్న ఆమె చెల్లెళ్ళు వెంటనే ముందుకి వంగి, “ఎలా వుంది నీకిప్పుడు?” అని ఆతృతగా అడిగారు.
“బానే వుంది” ఆమె జవాబు. అంటూ నెమ్మదిగా పక్కకి తిరిగింది. నేను ఆమెకేసి చూసాను. అప్పటికే మళ్ళీ నిద్రలోకి జారిపోయింది.
“పేషెంటుకి ఇప్పుడు బాగానేవుంది. ఇంతమందిమి ఇక్కడ వుండటం మంచిది కాదు. ఆమెని కొద్దిసేపు వంటరిగా వదిలిపెట్టడం మంచిది” అన్నాను. అందరూ సమ్మతంగా తల వూపారు. ఒకవేళ రోగికనుక పిలిస్తే పలకడానికి ఒక పరిచారికని అక్కడుంచి అందరం అతిజాగ్రత్తగా శబ్దం చెయ్యకుండా గదిలోంచీ బయటికి వచ్చాము. సిట్టింగ్ రూంలో బల్లమీద సమోవార్ వుంది. పక్కనే ఒక రమ్ము సీసాకూడా. ఈ రెండూ లేకుండా డాక్టర్లకి జీవితం వుండదు. వాళ్ళు ముండుగా నాకొక కప్పు టీ యిచ్చారు.
“ఇంత రాత్రివేళ తిరిగి ఎలా వెళ్తారు? తెల్లవారేదాకా ఇక్కడే వుండిపొండి” అన్నాక, నాకూ అదే మంచిదనిపించింది. రావటమంటే వచ్చానుగానీ, ఇప్పుడున్న వాతావరణపరిస్థితుల్లో వెంటనే తిరిగి వెళ్ళటం దుస్సాధ్యం. ముసలావిడ చిన్నగా నిట్టూర్చింది. అలాగే నిలబడిందేగానీ కదల్లేదు.
“ఏమైందమ్మా? ఆమెకేం ఫర్వాలేదు. ప్రాణభయం తప్పింది. ఇప్పటికే రెండైంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి”అన్నాను.
“అవసరం వస్తే లేపుతారుకదూ?” అని అడిగి నేను సరేనన్నాక పడుకోవడానికి వెళ్ళింది. సిట్టింగ్‍రూంలోనే నాక్కూడా పడక ఏర్పాటు చేసి మిగిలిన యిద్దరుకూతుళ్ళూ వెళ్ళారు. పడకమీద వొరిగాను. అంత అలిసిపోయి వున్నా, నిద్ర రాలేదు. పేషేంటు గురించిన ఆలోచన మనసులోంచీ పోలేదు. ఒకమాటు ఆమెలా వుందో చూసి వస్తే నిశ్చింతగా వుంటుందనిపించి లేచాను. నేనున్న గదికి ఆనుకుని వుంటుంది ఆమె గది. లేచి చప్పుడవకుండా ఆమె గదితలుపులు తోసి చూసాను. పరిచారిక చక్కగా పడుక్కుని గురకపెడుతూ నిద్రపోతోంది. పేషెంటు నేనున్నవైపుకే తిరిగి పడుకుని వుంది. రెండు చేతులూ విసిరేసినట్టు చెరోవైపుకీ పడి వున్నాయి. దగ్గరగా వెళ్ళి మొహంలోకి చూసాను. అలికిడికి వెంటనే కళ్ళిప్పి నాకేసి వింతగా చూసింది.
“ఎవరు? ఎవరది?” కంగారుగా అడిగింది అప్పుడే గుర్తించినట్టు.
“భయపడకండి. నేను డాక్టర్ని. మీకెలా వుందో చూద్దామని వచ్చాను” అన్నాను.
“డాక్టరా?!!”
“ఔను. మీ అమ్మగారు నన్ను పిలిపించారు. టౌనునుంచీ వచ్చాను. మీకు గాయం కూడా చేసాను… ఆవపిండిపట్టీ వెయ్యడానికి. ఒకటిరెండురోజుల్లో నయమైపోతుంది. లేచి తిరగ్గలుగుతారు. ప్రస్తుతానికి హాయిగా పడుకోండి” అన్నాను.
“ఓహ్! డాక్టరుగారూ! నాకు బతకాలని వుంది. నన్నెలాగేనా బతికించండి”
“ఎందుకలా మాట్లాడుతున్నారు? మీకు నయమౌతుంది” అంటూనే వున్నాను, ఆమెని జ్వరపుతెర మళ్ళీ కమ్మేసింది. చెయ్యి పట్టుకుని నాడి చూసాను.
“నేనెందుకు బతకాలనుకుంటున్నానో మీకు చెప్పాలి… వింటారా? దయచేసి వినండి. ఇప్పుడు మనిద్దరమే వున్నాం. చాలా మంచి అవకాశం…” అంది.
నేను వంగాను. ఆమె తన ముఖాన్ని… నోటిని… పెదవులని నా చెవులకి దగ్గరగా తెచ్చింది. కెరటాల్లా జాలువారుతున్న ఆమె జుత్తు నా చెంపలని తాకుతోంది. నాకు తల తిరిగిపోతున్నట్టనిపిస్తోంది. ఆమె లోగొంతుకతో గుసగులాడుతున్నట్టు చెప్తోంది. తను మాట్లాడుతున్నది రష్యను కాక మరేదో భాషన్నట్టుగా వుంది చెప్తోన్న ఆ వేగానికి. మొత్తానికి చెప్పేసింది. చిగురాకులా వణికిపోతూ దిండుమీద వొరిగిపోయింది.
“డాక్టర్… గుర్తుంచుకోండి… ఈ విషయాన్ని మీరు ఇంకెవరికీ చెప్పకూడదు” తర్జని చూపించి బెదిరించింది. ఆమెని సముదాయించి, తాగాటానికి కొద్దిగా టీ యిచ్చి, మెయిడ్‍ని లేపి ఇవతలికి వచ్చాను.
మొదటిరోజు చూపించిన గుణం ఆపూటతో సరి. పేషెంటు పరిస్థితి కొంచెంకూడా మెరుగవలేదు. చాలా ఆలోచించినమీదట నేనింకో రోజో రెండురోజులో అక్కడే వుండాలని నిర్ణయించుకున్నాను. నా యితర పేషెంట్లు నాకోసం ఎదురుచూస్తుంటారనే విషయం గుర్తొచ్చింది. నేనిక్కడ వుండిపోవటం నాకూ ఇబ్బందే. కానీ తప్పదు. ఇక్కడీమె పరిస్థితి అలా వుంది. అదీకాక ఆమెతో నాకేదో తెలియని అనుబంధం ఏర్పడిపోయింది. అంతేనా? మొత్తం కుటుంబం అంటే యిష్టం మొదలైంది. డబ్బులేనివాళ్ళైతేనేమి, చాలా సంస్కారవంతులు. ఆ యింటాయన రచయిత. ఇప్పుడు లేడు. పేదరికంలోనే బతికి, పేదరికంలోనే చనిపోయాడు. కానీ పిల్లలకి చక్కటి చదువు నేర్పించాడు. ఇంటినిండా పుస్తకాలు… ఆయన వున్నప్పుడు కొన్నవి… ఇల్లంతా స్వేచ్చగా తిరుగుతున్నాను. పేషెంటుని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకో, మరెందుకోగానీ వాళ్ళుకూడా నన్ను ఇంటిమనిషిలాగే చూస్తున్నారు.
ఇటు చూస్తే రోడ్లన్నీ దరిద్రంగా తయారయ్యాయి. దగ్గర్లో వున్న టౌనుకి రాకపోకలన్నీ ఆగిపోయాయి. పేషెంటుకి కావల్సిన మందులు అతికష్టమ్మీద తెప్పించగలిగాను. ఆమెలో ఎలాంటి మార్పూ లేదు. ఒకొక్కరోజూ గడుస్తోంది.
కొంచెం ఇబ్బందిగా అనిపించే విషయం జరిగింది. నా పేషేంటు నాతో ప్రేమలో పడింది.
ఆ విషయం నాకెలా తెలిసింది? నాకే కాదు, ఎవరికేనా అలాంటి విషయం ఎలా తెలుస్తుంది? అసలది ప్రేమేనా?
మగవాడు తనని తను ఎక్కువగా వూహించుకోకూడదు. ఆమె బాగా చదువుకున్న యువతి. తెలివైనది. నేనైతే ఒక్క యీ వైద్యం తప్ప మిగతావన్నీ మర్చిపోయాను. ఇక రూపం విషయానికి వస్తే… నన్ను నేను చూసుకుని చూసుకుని విషాదంగా నవ్వుకున్నాను. ఇక్కడకూడా నాగురించి గొప్పగా ఏమీ లేదు. అలాగని దేవుడు నన్ను మూర్ఖుడిగానైతే పుట్టించలేదు. విషయాలని యథాతాథంగా గుర్తించే తెలివిని ఇచ్చాడు.
అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న … ఆ అమ్మాయి… తనకి… బహుశ: నాపట్ల వున్నది ప్రేమ కాకపోవచ్చు. వట్టి స్నేహభావం కావచ్చు. గౌరవం కావచ్చు. దాన్నే ఆమె ప్రేమనుకుని పొరపాటుపడిందేమో! ఆమెకి నాపట్ల కలిగిన భావం పేరు ఏదైనా, ఆమె నన్ను తననుకుంటున్న ప్రేమభావనతోనే చూసింది.
నా పేషేంటు పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. రోగం నయంచెయ్యలేనప్పుడు డాక్టరుకి కలిగే ఆందోళన ఎవరికీ అర్థం కాదు.
తనమీద తనకి నమ్మకం పోతుంది. మాటల్లో చెప్పలేనంత పిరికితనం వచ్చేస్తుంది. తనకున్న పరిజ్ఞానం అంతా మర్చిపోయినట్టనిపిస్తుంది. పేషెంటుకి తనమీద నమ్మకం లేదేమో,
పేషెంటు చుట్టూ వున్నవాళ్ళు తను శ్రద్ధ చూపించట్లేదనుకుంటున్నారేమో,
వాళ్ళు రోగియొక్క లక్షణాలనీ, వేదననీ మరింత విసుగ్గా, వివరంగా బోధపర్చుదామని చూస్తున్నారేమో,
తన శక్తిమీదా తను చూపించే శ్రద్ధమీదా వారికి అనుమానం వస్తూ వుంటుందేమో,
ఇదంతా బైటికి అనకుండా వాళ్ళలోవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారేమో,
ఈ రోగానికి తను ఆచరిస్తున్నది కాక వేరే వైద్యం, మందూ వున్నాయేమో,
అవేవో తనకి తెలీదేమో…
ఇలాంటి రకరకాల ఆలోచనలు చుట్టుముడతాయి.
వాడుతున్న మందు గుణం చూపించకుండానే దాన్ని మార్చేస్తాడు. అది పనిచెయ్యట్లేదనుకుంటాడు.
ప్రిస్క్రిప్షన్సన్నీ రాసి వుంచే పుస్తకం తీస్తాడు. అందులో ఏదో తగులుతుంది. అదృష్టం బావుంటే… అనుకుంటాడు.
అక్కడ పేషెంటు చావుబతుకులమధ్య వూగిసలాడుతుంటుంది. మరో డాక్టరెవరేనా ఐతే బతికిస్తాడేమో! ఇంకో డాక్టరు అభిప్రాయం తీసుకుంటే మంచిదేమోననిపిస్తుంది!
ఏదైనా తేడా వస్తే ఆ బాధ్యత మొత్తం తనే ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించుకుంటాడు.
ఇలాంటి సందర్భాలు మొదట్లో బాధ కలిగిస్తాయి. క్రమంగా అలవాటౌతుంది. రోగి చనిపోయినా మొదట్లో వున్నంత బాధ కలగదు. నియమనిబంధనలకి అనుగుణంగానే వైద్యం జరిగింది, అందులో తన తప్పేం లేదని సరిపెట్టుకుంటాడు. ఐనా అంతరంగంలో ఎక్కడో సలుపుతుంది. రోగికీ బంధువులకీ తనమీద వున్న గుడ్డి నమ్మకం… నిజానికి తను దానికి అర్హుడు కాదని తనకే తెలుస్తూ వుండగా…
ఇదంతా నా లోలోపలి సంఘర్షణ.