జిల్లావైద్యుడు (The District Doctor)- 2 Translation by S Sridevi

  1. జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi
  2. జిల్లావైద్యుడు (The District Doctor)- 2 Translation by S Sridevi

రష్యన్ మూలం: IVAN S.TURGENEV
The story was originally Published in Russian in the year 1848 and included in the story compilation, Zapiski okhotnika in Russian in 1852 and in
“A Sportsman’s Sketches” in 1852 in English and available in Project Gutenberg in the Public domain.

వాళ్ళ పిల్ల ప్రాణాపాయంలో వుందనే విషయం వాళ్ళు దాదాపుగా మర్చిపోయారు. నా చేతుల్లో పెట్టి నిశ్చింతగా వున్నారు. నేనుకూడా వాళ్ళకి భయం లేదనే చెప్పాను. అలానే నమ్మకం కలిగించాను. లోలోపల మాత్రం నాలో నేను కుంగిపోతున్నాను. మందు తెమ్మని పంపించిన బండివాడు తిరిగి రావటానికి కొద్దిరోజులే పట్టింది.
నేను పేషెంటు గది వదిలిపెట్టలేదు. ఆమెనించీ తుంచుకుని దూరం వెళ్లలేకపోయాను. ఆమెకి మంచి కథలు చెప్పాను. ఆమెతో పేక ఆడాను. రాత్రివేళంతా ఆమెని గమనిస్తూ బెడ్ పక్కనే వుండిపోయాను. ఆమె తల్లికైతే కృతజ్ఞతతో కళ్ళనీళ్ళు నిండాయి. ఇంతటి అభిమానానికి అర్హుడిని కాననే నా భావన.
నేనుకూడా నా రోగితో తలమునకలు ప్రేమలో పడ్డాను. ఆమెకి నేనంటే వున్న ఇష్టం పెరిగిపోయింది. నాతో స్వేచ్ఛగా మాట్లాడేది. నా గురించి ప్రశ్నలు వేసేది. నేనెక్కడ చదువుకున్నాను, నా జీవితం ఎలా వుంటుంది? నా బంధువులెవరు? ఇక్కడినుంచీ వెళ్తే నేను ఎవరి దగ్గరకి ఎవర్ని చూడటానికి వెళ్తాను? ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగేది. నాకు ఇబ్బందిగా అనిపించేది. కానీ అడగద్దని చెప్పలేకపోయాను.
“దుర్మార్గుడా! నువ్వేం చేస్తున్నావు?” ఒకొక్కసారి నా అంతరాత్మ నన్ను ప్రశ్నించేసేది. రెండుచేతుల్తో తల పట్టుకుని కూర్చునేవాడిని.
ఆమె నా చేతిని తన చేతిలోకి తీసుకుని నా కళ్ళలోకి లోతుగా చూసి, మళ్ళీ ముఖం తిప్పుకుని నిట్టూర్చేది. “మీరెంత మంచివారు!” అనేది.
ఆమె చేతులు జ్వరతీవ్రతతో వేడిగా వుండేవి.
“నిజంగానే చెప్తున్నాను. మా యిరుగుపొరుగువాళ్ళందరికంటే మీరు చాలా మంచివారు. దయగలవారు” అనేది.
“…”
“నిజంగానే. మీరు అందర్లాంటివారు కాదు. అసలు ఇంతకాలం మీరు నాకు పరిచయం కాకపోవటం నిజంగా నా దురదృష్టం”
“అలెగ్జాంద్రా ఆంద్రెయెవ్నా, దయచేసి ప్రశాంతంగా వుండండి. నాగురించి మీకలా ఎందుకనిపించిందో నాకు తెలీదు. ఒక డాక్టరుగా నా బాధ్యత మాత్రమే నేను నెరుపుతున్నాను. మీకు తప్పక తగ్గిపోతుంది” అన్నాను. ఆమె జవాబివ్వలేదు.
వాళ్ళ కుటుంబాన్ని గమనించాను. వాళ్ళకి ఇరుగుపొరుగువారితో పెద్దగా స్నేహసంబంధాలు లేవు. దానికి కారణం… మామూలువాళ్ళకి వీళ్ళంత చదువు, సంస్కారం వుండవు. వారి ఆత్మగౌరవం డబ్బున్నవారి దగ్గరికి వెళ్ళనివ్వదు. ఏదేమైనా వాళ్ళ పరిచయం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
ఆమె నేనిస్తేనే మందు తీసుకునేది. నా ఆసరాతో పక్కలో లేచి కూర్చునేది. నాకళ్ళలో కళ్ళు పెట్టి చూసేది. నా గుండె వడివడిగా కొట్టుకునేది. పేలిపోతుందేమోనన్నంత వుద్వేగం. ఇదిలా వుండగా ఆమె పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఎంతోకాలం బతకదనే విషయం నాకు అర్థమైపోయింది. ఆమె తల్లీ చెల్లెళ్ళతో కలిసి నేనుకూడా స్మశానానికి వెళ్ళేరోజు అతితొందర్లో వస్తుందని గ్రహించాను.
“ఎలావుంది?” ఆమె తల్లీ చెల్లెళ్ళూ ఒక్కలా నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నా మాటల్లో నమ్మకం సన్నగిల్లటం గుర్తించాను.
“పర్వాలేదు. తగ్గుతుంది”
నిజంగా తగ్గుతుందా? నా మనసు నన్ను నిలదీస్తోంది.
ఒకరోజు రాత్రి నా పేషెంటు పక్కని కూర్చుని వున్నాను. మెయిడ్ కూడా వుందిగానీ కూర్చునే నిద్రపోతోంది. ఆమెనీ తప్పుపట్టడానికి లేదు. బాగా అలిసిపోతోంది. అలెగ్జాంద్రియా ఆంద్రెయెవ్నకి సాయంత్రం చాలా జ్వరం వచ్చింది. మధ్యరాత్రిదాకా పక్కలో అస్థిమితంగా కదుల్తునే వుంది. ఎలాగో కాస్తంత కన్ను అంటుకుంది. కనీసం కొద్దిసేపు స్థిమితంగా వుండగలిగింది. గదిమూల ప్రభువుముందు దీపం వెలుగుతోంది.
ఆమె పక్కని నేను తల వంచుకుని కూర్చున్నాను. నిద్రకి జోగానేమో కూడా! ఎవరో నన్ను తాకినట్టనిపించి ఒక్కసారి వులిక్కిపడ్డాను. భగవంతుడా! అలెక్సాంద్రా నన్ను తదేకంగా చూస్తోంది. ఏదో చెప్పాలనే ప్రయత్నంలో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. చెంపలుమాత్రం జ్వరతీవ్రతతో ఎర్రబడ్డాయి.
“ఏమిటి?” అడిగాను.
“డాక్టర్! నేను చనిపోతానా?”
“దేవుడా!”
“డాక్టర్! దయచేసి నిజం చెప్పండి. నేను బతుకుతాననే అబద్దం నాకొద్దు…”
“…”
“మీకు తెలిస్తే నిజమే చెప్పండి. నిజాన్ని దాచద్దు” వూపిరి బలంగా పీల్చి వదిలింది. “నాకు ఆ విషయం స్పష్టంగా తెలిస్తే మీకు కొన్ని విషయాలు చెప్పాలి”
“అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న… దయచేసి అలా మాట్లాడద్దు”
“వినండి. నాకీ రాత్రి ఇప్పటిదాకా నిద్రే రాలేదు. కొద్దిసేపట్నుంచీ మిమ్మల్ని గమనిస్తున్నాను. భవంతునిమీద ఆన. నాకు మీమీద నమ్మకం వుంది. మీరు మంచివారు, నిజాయితీపరులు. ప్రపంచంలో పవిత్రత అంటూ ఏదేనా వుంటే దానికి మీరు ప్రతిరూపం. కాబట్టి నిజం మాత్రమే చెప్పండి. తెలుసుకోవటం నాకు చాలా అవసరం”
“అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న! మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు?”
“చెప్పకపోతే నామీద వొట్టే”
“ఒహ్హో! మిమ్మల్ని మభ్యపెట్టడం ఇక నావల్లకాదు. పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే వుంది. కానీ భగవంతుడెప్పుడూ నిర్దయుడు కాదు. మీకు నయమౌతుంది”
“లేదు డాక్టర్! నేను చచ్చిపోతాను. చచ్చిపోవాలి” వుద్వేగంగా అంది. సంతోషపడుతున్నట్టుగా కూడా వుంది. అనారోగ్యానికి విసిగిపోయి అలా అంటోందా? కానీ…ఆమె ముఖంలో ఒకవిధమైన మెరుపు. నేను వులిక్కిపడ్డాను.
“కంగారుపడకండి. నేను చావుకి భయపడటంలేదు. అసలే లేదు” అంటూ హఠాత్తుగా లేచి మోచేతిమీద ఆనుకుని కూర్చుంది.
“ఇప్పుడు చెప్తాను వినండి. హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు… మీరు మంచివారు, దయగలవారు… అంతేనా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకుకూడా”
నేను ఆమె ముఖంలోకి తెల్లబోయి చూస్తూ వుండిపోయాను. ఏదో భయంలాంటిది కలిగింది.
“విన్నారా, డాక్టర్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను”
“అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న! అందుకు నాకున్న అర్హత ఏమిటి?”
“అయ్యో! మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు…” అంటూ ఆమె హఠాత్తుగా తన చేతులని చాపి, నా తల వాటిల్లోకి తీసుకుని ముద్దుపెట్టుకుంది. ఊహించని ఈ సంఘటనకి నేను కొంచెం పెద్దగానే అరిచాను. మోకాళ్ళమీద నేలపై కూలబడి, నా తల మంచంమీద వున్న దిండులో దాచుకున్నాను. ఆమె మాట్లాడలేదు. ఆమె చేతులు నా జుత్తులో వొణుకుతూ కదలటం తెలుస్తోంది. ఆమె ఏడవటం వినిపించింది.
ఆమెని ఓదార్చసాగాను. వాస్తవంగా ఆమెతో ఆ క్షణాన్న ఏం మాట్లాడానో కూడా సరిగ్గా గుర్తులేదు.
“మెయిడ్ లేస్తుందేమో!” అన్నాను. “అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న! ధన్యవాదాలు. దయచేసి నెమ్మదించండి. ప్రశాంతంగా వుండండి”
“చాలు. ఇంకేం చెప్పద్దు” ప్రతిఘటించింది. “అవేవీ నేను పట్టించుకోను. మెయిడ్‍ని లేవనివ్వండి. ఆమే కాదు, ఇంట్లో వున్నవాళ్ళందర్నీ లేవనివ్వండి. తరవాత? ఇక్కడికి వస్తారు. రానివ్వండి. నాకేం భయంలేదు. నేను చచ్చిపోతున్నాను. ఇవన్నీ పట్టించుకోవలిసిన అవసరం నాకు లేదు… మీరెందుకు భయపడుతున్నారు? తలెత్తి నాకేసి చూడండి… మీకు నామీద ప్రేమ వుంటే నా కళ్లలోకి చూడండి. లేకపోతే నేను పొరపాటుపడ్డందుకు మన్నించండి” అంది
“అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న ! ఏం మాట్లాడుతున్నారు? నేనుకూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను”
ఆమె నా కళ్ళలోకి సూటిగా చూసింది. చేతులు విశాలంగా చాచి, ’ “ఐతే నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి” అంది.
అసలా రాత్రి నాకు మతి ఎందుకుపోలేదో అర్థం కాలేదు. అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న చచ్చిపోవాలన్న బలమైన కోరికద్వారా, చచ్చిపోతానన్న నమ్మకంద్వరా తనని తను చంపుకుంటోంది. ఆమె పూర్తి స్పృహలో లేదు. సంధిప్రేలాపన కావచ్చు. తను చావుబతుకులమధ్య వూగిసలాడుతోందన్న విషయాన్ని పూర్తిగా వుపేక్షించింది. ఆమెది నిజమైన ప్రేమ కాదు. ఒకానొక నిస్పృహ. ఇరవయ్యేళ్ళ వయసులో పురుషప్రేమన్నది అనుభవించకుండానే చనిపోతున్నానన్న నిరాశ ఆమెది. నన్ను ప్రేమిస్తున్నట్టుగా భావించుకుంది. నన్ను తన చేతుల్లో బంధించింది. కదలనివ్వదు. వెళ్ళనివ్వదు.
“దయచేసి నామాట వినండి అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న! నేను మీ డాక్టరుని. మీ పరిస్థితి తెలిసియున్నవాడిని. మీరుకూడా మీపట్ల నిర్దయగా వుండద్దు” బతిమాలాను.
“ఎందుకు? ఎలాగా చనిపోబోతున్నాను. ఇవన్నీ ఎందుకు?” ఆమె ప్రశ్న. పదేపదే విషయం అక్కడికే తెస్తోంది.”నేనొకవేళ బతికి బట్టకడితే ఇలా ప్రవర్తించినందుకు సిగ్గుపడాలి. ఇప్పుడెందుకు?”
“మీరు చనిపోతున్నావని చెప్పినదెవరు?”
“ఒహ్! ఆ విషయం వదిలిపెట్టండి. నన్ను మోసం చెయ్యాలని చూడద్దు… మీకు అబద్దం ఆడటంకుడా రాదు”
“మీరు బతకాలి అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న! నేను నయం చేస్తాను. మీ తల్లిగారి అనుమతి, ఆశీర్వాదం తీసుకుని మనం పెళ్ళిచేసుకుందాం. సంతోషంగా వుందాం”
“లేదు. మీ మాట నిలబెట్టుకోండి. నేను చనిపోవాలి. చనిపోతానని చెప్పారు. మాట మార్చద్దు”
నాకు ఆమె ప్రవర్తన దుస్సహంగా వుంది. కారణాలు ఏవేనా కావచ్చు. చిన్నచిన్న విషయాలు ఎంతో బాధపెడతాయి. నిజానికి మామధ్య జరిగినదికూడా ఏమీ లేదు. ఆమె నన్ను ప్రేమించేంత బలమైన సంఘటనలు ఏవీ జరగలేదు. మొదట్లో చాలా మామూలు విషయాలు అడిగింది. నాపేరు… ట్రిఫాన్ ఇవానిచ్… అందులోని మొదటిభాగాన్ని మాత్రమే అడిగి తెలుసుకుంది.
ఇంట్లోవాళ్ళంతా నన్ను డాక్టర్ అనే అంటారు. ఆమె మాత్రం నా పేరు అడిగింది.
“ట్రిఫాన్ మేడం” అని చెప్పాను.
ఆమె కళ్ళు చికిలించింది. ఫ్రెంచి భాషలో ఏదో అంది. అది నాకు కొంచెం గుచ్చుకున్నట్టనిపించింది. ఆ తర్వాత నవ్వింది. అదీ నాకు బాగా అనిపించలేదు. అంతే. అంతకుమించి ఏమీ లేదు.
ఆ రాత్రంతా అలాగే గడిచింది. ఇంకా అక్కడే వుంటే పిచ్చిపడుతుందనిపించి తెల్లారుతుంటే ఇవతలికి వచ్చాను. కొద్దిగా టీ తాగి, మళ్ళీ ఆమె గదిలోకి వెళ్ళాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. కొన్నిగంటల్లోనే ఆమెలో ఎంతో మార్పు. గుర్తుపట్టలేనంత మార్పు. శవపేటికలో పెట్టేవాళ్ళలోకూడా ఇంకా కొంత జీవం వుంటుంది. ఈమెలో వాళ్ళను మించిన ప్రేతకళ కనిపిస్తోంది.
ఇంక నా అనుభవం… సుదీర్ఘమైన, బహు కష్టంగా గడిచిన మూడు దివారాత్రాల తరువాతకూడా ఆమె మృత్యువు అంచుని వేలాడుతుండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రాత్రుల్లో అందరూ పడుకున్నాక ఆమె నాతో పంచుకున్న కబుర్లు… ముఖ్యంగా గతరాత్రి…
“భగవంతుడా! ఆమెని తీసుకెళ్ళిపో. ఆమెతోపాటు నన్నుకూడా… తొందరగా…” అని ప్రార్థించిన రాత్రి…
ఆమె తల్లి వున్నట్టుండి తలుపు తోసుకుని గదిలోకి వచ్చింది. అప్పటికే ఆమెకి కూతురి పరిస్థితి గురించి చెప్పి ఉన్నాను.
తల్లిని చూడగానే నా పేషెంటు వెంటనే అంది. “నువ్వు రావటం చాలా మంచిదైంది. మమ్మల్ని చూడమ్మా! మాకిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, ఇష్టం. మేం పెళ్ళికూడా చేసుకుంటాం” అంది.
పెద్దావిడ కంగారుపడింది. ” ఈ పిల్ల ఏమంటోంది డాక్టర్? నాకేం అర్థం కావట్లేదు” అడిగింది.
ఇబ్బందికరమైన ఈ పరిస్థితికి నాకు కొద్దిగా కోపం వచ్చింది. “జ్వరతీవ్రతలో ఏదో మాట్లాడుతోంది. మీరేం పట్టించుకోవద్దు” అన్నాను.
అలెక్సాంద్రా ఆంద్రేయెవ్న వెంటనే అంది,” ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పుడే మాట మారుస్తున్నారా? ఇప్పుడే కదా, మనం పెళ్ళి చేసుకుందామని నా వుంగరం తీసుకున్నారు? మా అమ్మ చాలా మంచిది. ఏమీ అనదు. నేను చనిపోతున్నానని ఆమెకు తెలుసు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఇంకేం వుంటుంది? మీ చెయ్యి ఇలా ఇవ్వండి” అంది.
నేనింక అక్కడ వుండలేకపోయాను. చప్పుని ఒక్క అంగలో ఇవతలికి వచ్చేసాను. ఆమె తల్లి ఎలా అర్థం చేసుకుందో!
అత్యంత విషాదకరంగా ఆలెక్సాంద్రా ఆ మర్నాడే చనిపోయింది. చనిపోయేముందు నాతో ఏకాంతాన్ని కోరుకుంది.
“క్షమించండి డాక్టర్! నేను మిమ్మల్నింక ఇబ్బంది పెట్టను. తప్పేదైనా వుంటే నా అనారోగ్యానిదే. కానీ ఒక్క విషయం చెప్పాలి. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమించాను. నన్ను మర్చిపోకండి. నా వుంగరం మీతోనే వుండాలి” అంది.


డాక్టరు కథ ముగించాడు. చివరి మాటలంటున్నప్పుడు డాక్టరు గొంతు వణికింది. ముఖం తిప్పుకున్నాడు. అతని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.
“ఇంకేదైనా మాట్లాడుకుందామా? పోనీ ప్రిఫరెన్స్ ఆడదాం… చిన్న స్టేక్‍కి… ఇటువంటి మానసిక బంధాలకి బాధపడటం నావల్ల కాదు. నా ముందు ఇప్పుడున్నదల్లా పిల్లలు ఏడవకుండా, భార్య నన్ను తిట్టకుండా వుండేలా చూసుకోవడం… అంటే… అలెక్సాంద్రా చనిపోయాక నా గురించి నేను ఆలోచించుకోవటం మొదలుపెట్టాను. చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్నాను… ఒక వ్యాపారస్తుడి కూతుర్ని… ఏడువేల రూబుళ్ళ కట్నం తీసుకుని. ఆమె పేరు అకులినా… ట్రిఫాన్‍కి సరిగ్గా జతయ్యే పేరు. ఆమెకి కోపం చాలా ఎక్కువగానీ రోజంతా నిద్రపోతునే వుంటుంది… ఆ< చెప్పండి . ప్రిఫరెన్స్ ఆడదామా?” అన్నాడు.
ఇద్దరం ఆట మొదలుపెట్టాము. అతను నా దగ్గర్నుంచీ రెండున్నర రూబుళ్ళు గెలుచుకున్నాడు. తన గెలుపుకి సంతోషపడ్డాడు. రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఇక్కడే వుండి అప్పుడు ఇంటికి వెళ్ళాడు.
పావెల్ లూకిచ్ ఈ విషయంలో ఏమని చెప్పివుంటాడో అనే ఆలోచనలో నేను మునిగిపోయాను.