ఝరి 41-50 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

“చదవాల్సిందంతా మీరే చదివాక ఇంక మాట్లాడేందుకేం మాకేం మిగిలింది?” అంది నరేంద్ర అక్క.
“మిమ్మల్నికాదు, మాట్లాడమన్నది, వాళ్ళిద్దర్నీ మాట్లాడుకొమ్మంటున్నాను. భార్యాభర్తలు. నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఏవో ఒకటి మాట్లాడుకునేవి వుంటాయి” వాసు జవాబిచ్చాడు. ఆవిడకి మిడిగుడ్లు పడ్డాయి. నరేంద్ర లేచి మహతి వున్న గదిలోకి వెళ్ళాడు. అక్కడే పాపని ఎత్తుకుని వున్న నిర్మల ఇవతలికి వచ్చేసింది. తలుపు వెయ్యమన్నట్టు వాసు సౌంజ్ఞ చేసాడు. ఆమె దగ్గిరకి వేసింది. వాళ్ళ మాటలు ఇవతలికి వినిపించకుండా వుండేందుకు వాసు టీవీ పెట్టాడు. నరేంద్ర ఇద్దరు బంధువులూ బైట తిరిగి వస్తామని వెళ్ళారు.
“టీవీ ఎందుకు యిప్పుడు? వాళ్ళ మాటలు వినిపించవు” అంది నరేంద్ర అక్క ఆందోళనగా.
“మనం ఎందుకు వినాలి?” అడిగాడు వాసు.
దాదాపు అరగంట తర్వాత ఇవతలికి వచ్చాడు నరేంద్ర. ఆమెని వప్పించే ప్రయత్నం చేసాడో లేదోగానీ, అతని ముఖం చూస్తుంటే అర్థమైంది, మహతి ఏం జవాబు చెప్పి వుంటుందో. మహతి, మాధవ్‍తో మాట్లాడిన విషయాలు అక్షరం అక్షరం వాసుకి తెలుసు. ఆమె మనసు, ప్రేమ అన్నీ అర్థమయ్యాయి. మరి నరేంద్రకి అర్థమయ్యాయో లేదో! ఆడపిల్లలు ప్రేమించినంతగా మగవారు ప్రేమించలేరేమో!
కంప్లెయింటు వెనక్కి తీసుకొమ్మని ఎలా అడగాలో నరేంద్రకి అర్థం కాలేదు. ఇంతలో అతని అక్క అడిగేసింది.
“మహతి క్షేమంగానే వుంది. ఇందులో మా తమ్ముడు చేసిందీ ఏమీ లేదు. ఇల్లొదిలిపెట్టి వచ్చేసేంత పెద్ద విషయాలేం జరగలేదు. మీరా కాగితం వెనక్కి తీసుకుంటే” అంది.
“అలాగే తీసుకుందాం” తమాషాగా అన్నాడు వాసు. అది హామీ కాదు. ఇంకా ఏదో వుంది.
“తను రానంటోంది” అన్నాడు నరేంద్ర.
“ఆ విషయం నేనే చెప్పాను. మీరు తనకి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యలేదా?”
“వినట్లేదు”
“ఒక పని చెయ్యండి. తనకి పెళ్ళప్పుడు యిచ్చిన కట్నం మీదగ్గిరే వుంది. తన పేరుమీదికి ట్రాన్స్‌ఫర్ చేసెయ్యండి. తన బంగారం, వస్తువులు యిచ్చెయ్యండి. మీకు యిష్టమైతే కొన్నాళ్ళు వేచి చూడండి. మేంకూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం” అన్నాడు వాసు ముక్తాయింపుగా. మహతీవాళ్ళు తెగతెంపులకి సిద్ధంగా వున్నారని వాళ్ళకి అర్థమైంది. అంతకన్నా ఇంకో పరిష్కారం లేదు.
“అలాగా? ఐతే మీ పిల్లని మీరే వుంచుకోండి. మా పిల్లని మేం తీసుకెళ్తాం” అంటూ నిర్మల చేతిలోంచీ మేఘనని లాక్కున్నట్టు తీసుకుంది నరేంద్ర అక్క.
వాసు పాపని తిరిగి తీసుకుని, “అలాంటి ఆలోచనలు మీకుంటే కోర్టులో తేల్చుకుందాం. మీ తమ్ముడికి మంచీచెడూ చెప్పక భార్యాభర్తలని విడదీసారు. తల్లీకూతుళ్ళని విడదీయడానికి అప్పుడే తొందరపడకండి” అన్నాడు.
“సమస్యని మీవైపునించే చూపిస్తున్నారు బావా! నేను ఆమెని హెరాస్ చేసిందేమీ లేదు. పెళ్ళంటూ చేసుకున్నాక భార్యతో సరదాగా గడపాలనీ, పిల్లలుండాలనీ కోరుకోవడం అసహజం కాదు. జస్ట్, సహనం నశించి, తొందరపాటుతనంతో ఒక దెబ్బ వేసాను. తప్పే. మీరన్నట్టు పుట్టింటికి పంపించెయ్యాల్సింది. కొట్టి యింట్లోంచీ వెళ్ళగొట్టినట్టు కేసు పెట్టారు చూడండి, అది ఎంతవరకు సమంజసం? గవర్నమెంటు ఎంప్లాయీని. మీ అంత గొప్పవాళ్లం కాకపోవచ్చు. మాకూ పరువు వుంది. పోలీసులు నాకోసం వచ్చి వెళ్తుంటే నలుగుర్లో నాకు ఎంత చిన్నతనంగా వుంటుంది? ఆలోచించండి. మీకు బలగం వుంది, మంది మార్బలం వున్నారని ఇలా చెయ్యడం కరెక్టేనా? తనకి నాతో కలిసి వుండటం యిష్టం లేకపోతే నేనూ బలవంతం చెయ్యను. మీరన్నట్టు కట్నం డబ్బు వెళ్ళగానే ట్రాన్స్ఫర్ చేస్తాను. వస్తువులు తిరిగిచ్చేస్తాను. ఇంకో ఏడాదిదాకా వేచిచూడగలను. ఆమె వస్తే సంతోషం. లేదంటే ఆపైన మీయిష్టం. మేఘన నాకూ కూతురే. దాన్ని ఎప్పుడేనా వచ్చి చూసుకునే హక్కు నాకు వుంటుంది. మీ చెల్లెలిమీద పూర్తిగా వదిలెయ్యలేను” అన్నాడు నరేంద్ర కోపాన్ని అణచుకుని. తొమ్మిది కుటుంబాలవాళ్ళూ ఎదిగి బాగా స్థిరపడ్డారు. స్థానికులు కావడంతో బాగా పలుకుబడి పెంచుకున్నారు. వాళ్లతో తను నెగ్గలేడని అతనికి అర్థమైంది.
అక్కగారు ఏదో మాట్లాడబోతే ఆపి, “పద, వెళ్దాం” అని తీసుకెళ్ళిపోయాడు.
మగవారికి యింటాబైటా ఎన్నోరకాల సమస్యలు ఎదురౌతుంటాయి. రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ఎవరో రాంగ్‍సైడ్ వస్తారు, ఓర్చుకుంటాడు. ఆఫీస్‍లో బాస్ అందరిముందూ ఫైలు విసిరికొట్టి తిడతాడు, ఓర్చుకుంటారు. పక్కసీట్లో సహోద్యోగి బలాదూరు తిరుగుతాడు. అతని పనంతా తను చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది, ఓర్చుకుంటాడు. తను ఓటేసి గెలిపించినవాడు, పన్నులడబ్బుతో ప్రజాసేవ చెయ్యాల్సినవాడు మౌలికసదుపాయాలు చెయ్యక, ఎనిమిదిగంటలు ఆఫీసులో పనిచేసి వచ్చి బస్సెక్కితే టికెట్టు కొనుక్కున్నా సీటు దొరక్క, బైకుమీద వెళ్తుంటే రోడ్లు బాలేక, ట్రాఫిక్ నియంత్రించక ఎన్నోవిధాల అసహనాన్ని మనలో పోగుచేస్తాడు, సర్దుకుంటాడు. ఇంట్లో తండ్రి డబ్బుకోసం పీడిస్తాడు, సర్దుకుంటాడు. అక్కచెల్లెళ్ళు కానుకలు అడుగుతారు, సర్దుకుంటాడు. బావలూ, బావమరుదులూ దాష్టికం చేస్తారు, సర్దుకుంటాడు. తల్లి తన భార్యమీద నేరాలు చెప్తుంది, ఓర్చుకుంటాడు. గాడిదమీద వేసే ఆఖరి గడ్డిపరకలాంటిది భార్య. ఆమె విషయానికి వచ్చేసరికి సహనం ఫెళ్ళుని విరిగిపోతుంది. ఈ అసహనాలన్నీ అప్పటికే మొయ్యలేని బరువుగా మారిపోయి వుంటాయి.
అతను కొంత సంయమనం చూపిస్తే మహతి మారేదేమో! ఎంతకాలం? అనేది ప్రశ్న. ఎప్పటికీ మారకపోవచ్చేమో! అప్పుడు? అదీ ప్రశ్నే. ప్రయత్నం అనేది అతనివైపునించీ జరగలేదనేదిమాత్రం వాస్తవం. తనున్న ఎత్తునించీ ఒక్క మెట్టుకూడా అతను దిగిరాలేదు. అదీ వాళ్ళ బంధం తెగిపోవడానికి కారణం. నిట్టుర్చాడు వాసు.
వాళ్ళు వెళ్లగానే మాధవ్ సొసైటీ పార్కుకి వెళ్ళాడు. నీలిమ వచ్చి అతని పక్కని నిలబడింది. వాళ్ళ కొడుకు ఇంకా ఆడుతున్నాడు. ఆమె ముఖంలో స్వల్పంగా కోపం.
“వాళ్ళు వెళ్ళిపోయారా?” అడిగింది లక్ష్మి. అతను తలూపాడు. ఆవిడ ముఖంలో బాధ కనిపించింది. “ఇలా జరుగుతుందని ఎవ్వరం అనుకోలేదు. సర్దుకుపోతుందనుకున్నాం. వాళ్లనీ తప్పుపట్టడానికి లేదు” అంది.
“ఐతేమాత్రం కొడతాడా అమ్మా? అది మన యింటికి వచ్చినరోజుని నువ్వు చూడలేదు. నాకైతే చాలా బాధేసింది. ఎలా పెరిగిందమ్మా, అది?వాళ్ళు నలుగుర్లోకీ సుకుమారమైనది మహీయేకదా?”
“పిన్నీవాళ్లదే తప్పు మాధవ్. దాని పరిస్థితి తెలిసీ పంపించారు. ఇన్నేసి మందులు మింగి మొద్దులా నిద్రపోతుండే పిల్లని ఏం ఆశించి అక్కడ వదిలిపెట్టారో తెలీదు”
“మీరెందుకు వచ్చేసారు బావా? వీళ్ళిద్దరూ వున్నారుకదా? దీన్నీ ఆడించేవారు” అడిగాడు రవళి కూతురిగురించి శ్రీనివాస్‍ని. అతనికి మర్యాద చెయ్యాల్సిన అవసరం వుంటుంది. లేకపోతే ప్రభావం రవళిమీద పడుతుంది.
“అంతమందిమి అక్కడ దేనికి బావా? గోలగోలగా వుంటుంది. వాళ్ళకీ బావుండదు” అన్నాడతను. అతనికి ఫిర్యాదు ఏమీ లేదు. రెండు పడగ్గదుల యింట్లో ఇంతమంది మనుషులు సర్దుకోవడంలోని కష్టం అర్థం చేసుకున్నాడు. ముఖ్యంగా పిల్లలు తిక్క చేసి ఏడుస్తున్నారు. ఇంతమంది మనుషుల్ని బంధువులుగా, ఇంత దగ్గిరగా చూడటమే కొత్త అతనికి. వీళ్ళదే ఇంచుమించు ఆఖరి పెళ్ళి కావడంతో అందరూ ఒకచోట కలుసుకున్నది పెద్దగా లేదు. అక్కడ అవంతీపురంలో పెద్దపెద్ద యిళ్ళున్నవాళ్లంతా ఇక్కడ ఏదో ఒకమూల సదుపాయాలకోసం చూడకుండా సర్దుకోవటం మరీ వింతగా వుంది.
“చిన్నప్పట్నుంచీ మాకు అలవాటే. అలా సర్దుకుపోగలం కాబట్టే ఏకకుటుంబంగా వుండగలుగుతున్నాం” అంది రవళి, ఆమెతో అంటే.
“పదండి, వెళ్దాం” అన్నాడు మాధవ్.
“వాడింకా ఆడుతున్నాడుకదా, కాసేపు వుంటాను” అంది నీలిమ. లక్ష్మికి అర్థమైంది, వాళ్ళిద్దరిమధ్యా ఏదో గొడవ మొదలైందని. జాలిగా కొడుకుని చూసింది.
పెళ్ళితో ఆడపిల్లల జీవితమేకాదు, మగపిల్లల జీవితంకూడా మారిపోతుంది. నువ్వు, నేను అనే వలలో బంధించి వుక్కిరిబిక్కిరి చేసేస్తుంది భార్య. తను పుట్తింటి బంధాలమధ్యనుంచీ విడివడి వచ్చేసి, అప్పటిదాకా వున్న బంధాలనుంచీ అతన్నికూడా దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. తనింటి ఆడపిల్లలు అంతదాకా పెంచుకున్న అనుబంధాలు తుంచుకోలేదు. పుట్టినప్పట్నుంచీ తమతో కలిసి తిరిగిన ఈ స్నేహితులలో మార్పు వచ్చిందని వాళ్లు గుర్తించలేదు. అంతా మామూలుగా వుందనే అనుకున్నారు. అలా అనుకుందికాబట్టే ఈరోజుని మహతి అందర్నీ వదిలేసి మాధవ్‍ని వెతుక్కుంటూ ఇంతదూరం వచ్చింది. గీతకూడా పెళ్లైన కొత్తలో అలాగే వుండేది. పెళ్ళితో ఆమె జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదు. బంధువులూ వాళ్ళే, స్నేహితులూ వాళ్ళే. హద్దురేఖలు గీసుకోవాలని తెలీలేదు. ఆ యింట్లో ముద్దుగా పెరిగి ఈ యింటికి వచ్చింది. తనకీ ముద్దే. అన్నకూతురనీ, బాధ్యత ఎరిగిన పిల్లనీ అపురూపం. అందర్నీ కలుపుకుంటూ తిరిగేది. నీలిమ వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఏవో గొడవలు యింట్లో. గీతచేత కంటతడి పెట్టించింది. మాధవ్ సర్దలేకపోయేవాడు. అన్నగారి దృష్టికి యీ గొడవలు వెళ్ళకుండా చూడటానికి తను సతమతమైంది. ఆఖరికి మాధవ్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని యింతదూరం వచ్చాడు. అందరికీ దూరంగా మాధవ్‍ని తీసుకొచ్చి నీలిమ ఏం సాధించిందో తెలీదుగానీ, మాధవ్‍కూడా లోలోపల దిగులేదో పెట్టుకున్నట్టే వున్నాడు. అలాంటి దిగుళ్ళు మనిషి ప్రవర్తనలో మార్పుగా స్థిరపడిపోతాయి. ఇదివరకటి హుషారు తగ్గి, హుందాతనంగా మారిపోయింది.
కుటుంబంలో ఎన్నో మార్పులు. సుధీర్ పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. సుమంత్, సుమతి కలవడం మానేసారు. డబ్బుగర్వమేమో అనిపిస్తుంది. వాళ్లకి వున్నదీ, వీళ్లకి లేనిదీ లేదు. ఐనా వాళ్ల హోదాముందు వీళ్ళు కనిపించకుండాపోయారేమోనన్న ఆలోచన తనకే కలుగుతుంది. రాణా పనికిరాకుండా తయారయాడు. ప్రహ్లాద్, వసంత్, మాధవ్ దూరం జరిగారు. మహతికి గొడవలు. రవళికి వుద్యోగం, పాప. వాసుతప్ప ఇంకోలోకం లేకుండా అయింది గీతకి. అప్పటికీ తను కోప్పడుతునే వుంటుంది.
“ఎవరంతటివాళ్ళు వాళ్ళయ్యారు. నువ్వు ఇంకా చిన్నపిల్లలా వుంటే ఎలాగే?” అంటే నవ్వేస్తుంది.
“చిన్నపిల్లలా ఎక్కడున్నాను, ఇద్దరు పిల్లల్నేసుకుని తిరుగుతుంటేను?” అంటుంది.
ఇప్పుడు వీళ్ళిద్దరికీ మధ్య గొడవ దేనికి దారితీస్తుంది? ఈ వ్యవహారం అయేదాకా పరువుదక్కితే బావుణ్ణు!
“మీరిద్దరూ వెళ్ళండమ్మా! మేం వెనకాల వస్తాం” అన్నాడు మాధవ్. అలాగే వెళ్ళారు వాళ్ళు.
“మీరూ వెళ్లకపోయారా? వీడిని ఆడించుకుంటూ నేను ఈ నాలుగురోజులూ యిక్కడే వుంటాను” అంది నీలిమ కోపంగా. మాధవ్ అర్థంకాక చూసాడు. “ఈ టైంలో నీకు కోపం ఎందుకొచ్చింది నీలమణీ?” అడిగాడు.
“అందరూ యింట్లో కూర్చుని వుంటే పిల్లాడిని తీసుకుని నన్ను పార్కుకి పొమ్మంటావా?” నిలదీసింది.
“ఇంట్లో ఇద్దరు పిల్లలుండి, చిన్నపిల్లాడు ఏడుస్తుంటే పెద్దపిల్లకి చెప్పరా, ఆడించుకు రమ్మని?” అన్నాడతను నవ్వు ఆపుకుని. మొదట అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆమె ఎర్రగా చూసింది. నీ పని చూస్తానన్నట్టు తర్జనితో బెదిరిస్తే అతను నవ్వేసాడు.
ప్రకృతిపరమైన సంబంధాలకీ, భార్యాభర్తలబంధానికీ తేడా వుంటుంది. ప్రేమించుకునో, పెద్దలు అనుసంధానపరిస్తేనో పెళ్ళిచేసుకుని వాస్తవిక జీవితం మొదలుపెడతారు. అందులో ఒకరిమీద ఒకరికి వుండే నమ్మకానికి చాలా ప్రాధాన్యత వుంటుంది. పునాది నమ్మకం కాబట్టి చిన్న అభధ్రతాభావం వుండచ్చు. అది అవ్యక్తంగా వుంటే ప్రేమ అనిపిస్తుంది. వ్యక్తమైతే అనుమానంగా మారిపొతుంది. నీలిమకి అతను తనకి యిచ్చే విలువపట్ల ప్రతినిముషం అనుమానమే.
“కూర్చో” అని పక్కకి జరిగి చోటిచ్చి, ఆమె వెళ్ళిన దగ్గర్నుంచీ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అలా చెప్పించుకోవడం ఆమెకి యిష్టం. తామిద్దరికీ మధ్య దాపరికాలు లేవనుకుంటుంది. అందులో ఆమెకి వుపయోగపడేవికానీ, ఆమె ప్రమేయంలేక చెడిపోయినవిగానీ ఏవీ లేవు. ఆమెకి సంతృప్తి కలిగేలా అంతా చెప్పాక లేచి యింటికి వచ్చారు.
లక్ష్మి యింటికి వచ్చేసరికి ఇల్లంతా విషాదం నిండి వుంది. నిర్మల ఏడుస్తోంది.
“అంతా ఐపోయిందే. అరగంటసేపు కూర్చుని మాట్లాడాడు అతను. ఇది వెళ్ళనని తెగేసి చెప్పేసింది. మనం పెళ్ళిలో పెట్టినవన్నీ తిరిగి యిచ్చెయ్యమని అడిగాం. ఐపోయినట్టేకదూ” అని లక్ష్మిని పట్టుకుని బావురుమంది. ఇద్దరు కూతుళ్ళూ, అల్లుళ్ళూ, మనవలతో ఎంతో అందమైన కలలుకన్నది. అవన్నీ చెదిరిపోయి కనిపిస్తుంటే దు:ఖం తట్టుకోలేకపోతోంది.
“ఊరుకో నిర్మలా! మహీ కోరుకున్నదే జరిగింది కదూ? దానికిమాత్రం బాధ వుండదూ? మీ బాధకన్నా దానిది పెద్దది. ధైర్యం చెప్పండి. అందరం వున్నామన్న భరోసా యివ్వండి” అంది లక్ష్మి ఓదార్చుతూ.
“మొహంమీద పేణ్ణీళ్ళు కొట్టినట్టు చెప్పేసింది. అంతా దానిదే పెత్తనం. ఎలా బతుకుతుందో బతకనీ. ఇంక మనం ఇక్కడెందుకు? వెళ్ళిపోదాం. ఏదో ఒక రైలు దొరక్కపోదు. ఆ కంప్లెయింటేదో వెనక్కి తీసుకుంటే అతనేనా సుఖపడతాడు. దీనికెలాగా ఆ రాత లేదు” అన్నాడు నారాయణ.
“వారందాకా మీరు ఎక్కడికీ వెళ్లరు బాబాయ్. కంప్లెయింటు విత్‍డ్రా చేసుకున్నారంటే డబ్బుకోసం కోర్టులచుట్టూ తిరగాలి” అన్నాడు వాసు.
“పోతే పోనీరా! వెధవ డబ్బు. దానికోసం తగలేసినదాంట్లో ఇదెంత? అతని వుద్యోగానికి ఎసరు పెడతామా?” అన్నాడు వుక్రోషంగా.
“అది మహీకి చెందాల్సిన డబ్బు నాన్నా! వాళ్లకి ఎందుకు వదిలిపెడతాం? మెహర్బానీకి పోయి, దీనికి ఆధారంలేకుండా చేస్తావా?” అంది రవళి.
గీత వచ్చి నారాయణ పక్కని కూర్చుంది. “మీరంతా అనుకున్నట్టే చేసారుకదే?” అడిగాడు కళ్లలో నీళ్ళు నింపుకుని.
“అంత బాధ, కోపం దేనికి మామయ్యా? ఇప్పటిదాకా అది మీమాటే విందికదా? ఇకపైన తనకి నచ్చినట్టు వుండనివ్వండి. పెళ్ళి, పిల్లలు ఇవే జీవితం కాదు. మా ఆఫీసులో మణి అనే ఆవిడ వుంది. వాళ్లకి చాలా డబ్బుంది. ఐనా పెళ్ళి చేసుకోలేదు. ఎంతో సరదాగా వుంటుంది. మహీకూడా పెళ్ళి వద్దంది. మీరు వినలేదు. భయపడుతునే చేసుకుంది. అక్కడితో ఆగలేదు. తన శక్తికి మించిపోయిన బరువు అదిమాత్రం ఎంతకాలం ఎత్తుకోగలదు? మిమ్మల్ని ఎదిరించాలనీ, బాధపెట్టాలనీ మాకెవరికీ లేదు. దాని కన్నీళ్ళు మేం చూడలేకపోయాం. అది సంతోషంగా వుంటే చాలనుకున్నాం. చివరిదాకా దానికి తోడుంటాం. మిగతావాళ్ళమాట నేను చెప్పనుగానీ, మహీ యింక నా యింటి ఆడబడుచు. తులసి ఎంతో అదీ అంతే నాకు. మీకింకా ఎంత సర్వీసుంది? రిటైరయ్యాక ఆ యిల్లు అద్దెకి యిచ్చేసి యిక్కడికి వచ్చెయ్యండి. మీకూ మార్పుగా వుంటుంది. అంతదాకా మాధవ్ వీళ్ళని చూసుకుంటాడు. మేం మధ్యలో వచ్చి వెళ్తుంటాం. ఇంతపెద్ద సిటీకాబట్టి మహీకి జాబ్‍కూడా తేలిగ్గానే దొరుకుతుంది ” అని ఎంతోసేపు నచ్చజెప్పింది.
“ఇక్కడెందుకే?” అడిగాడు. ఇంతకిముందు మాట్లాడుకున్న విషయాలే. అప్పుడు వాదనలో వచ్చాయి. ఇప్పుడు తీసుకొవలసిన నిర్ణయాల్లో భాగంగా వచ్చాయి.
“అక్కడ అందర్లో దానికి ఇబ్బందిగా అనిపిస్తుందేమో! కొన్నాళ్ళు ఇక్కడే వుంటే తేరుకుంటుంది” అంది గీత.
ఆయనకి ఒక లక్ష్యం చూపించింది. రాజీ. తప్పనిసరైన రాజీ. దానివైపు నడిపించింది. ఒక ధ్యేయం చూపెట్టింది. “నాకుమాత్రం దానిమీద ప్రేమ లేదేమిటే?” అనిపించింది.


నరేంద్ర మహతి డబ్బు, బంగారం తిరిగి యిచ్చేసాకే నారాయణ కేసు వెనక్కి తీసుకున్నాడు. అది అతని మనసుని జ్వలింపచేసింది. బంగారం తిరిగి యిచ్చేముందు అతని తల్లి కొంచెం గొడవచేసింది.
“పెళ్ళిలో మేం పెట్టిన గొలుసు మాకే చెందుతుంది. మేఘన పెళ్ళిలో యిస్తాం” అంది.
“ఆడపిల్లకి పెళ్ళిలో పెట్టినవన్నీ తనవే ఔతాయి. మేమిచ్చినదాంట్లోంచేకదండీ, చేయించారు? తన డబ్బు తీసుకుని ఇన్నాళ్ళూ దాచారు, ఇప్పుడు బంగారం దాస్తారా?” అన్నాడు వాసు. అక్కడితో గొడవ చెల్లు.
మరో మూడునాలుగేళ్లకి గృహహింసా చట్టం వచ్చి దేశాన్ని పెద్ద కుదుపు కుదిపింది. వాసు వాడిన పద్ధతులే వాడారు చాలామంది తల్లిదండ్రులు. సమస్య ఏవైపునించీ వచ్చినా, భార్యాభర్తలు విడిపోవాలంటే కొన్ని కుయుక్తులు తప్పట్లేదు. అనుభవానికీ చట్టానికీ మధ్య వుండే వెల్తి అలాంటిది.


వచ్చినవాళ్లంతా వెళ్ళిపోగా అమ్మమ్మా, మనవరాలూ మాధవ్ యింట్లో మిగిలారు. మహతికి తలమీంచీ పెద్ద బరువు దిగిపోయినట్టుంది. ఎనభయ్యేళ్ళ వయసులోకూడా పెద్దావిడ ఓపిగ్గానే వుంది. మునిమనవల్ని చూసుకుంటోంది. వీలుకుదిరినవాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. రోజూ మాత్రం ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు.
ఇలా ఎంతకాలం? అనే ప్రశ్న నీలిమలో మొదలైంది.
మహతి ఎక్కువ వ్యవధి తీసుకోలేదు. అపార్ట్‌మెంట్లలో ప్రతివారం వుచితచలామణీలో వుండే ప్రకటనల పేపరు చూసి కొన్నిచోట్ల డాటాఎంట్రీ ఆపరేటరు పోస్టులకి అప్లై చేస్తే ఇంటర్వ్యూలకి పిలుపు వచ్చింది. దగ్గర్లో వున్న ఒక ఆఫీసులో ఎంపిక కాగానే, జీతం తక్కువైనా చేరిపోయింది. ఆమె దారి ఎంచుకోగానే మాధవ్ తనవంతు సాయం తనూ చేసాడు.
వెంట వుండి యింటర్వ్యూకి తీసుకెళ్ళాడు. తెలిసినవాళ్లద్వారా రికమెండ్ చేయించాడు. నిజానికి ఆ వుద్యోగం అతనికి నచ్చలేదు. కానీ ముందైతే ఏదో ఒకటి అని వూరుకున్నాడు. ఒక్కర్తీ కూర్చోవడం, దిగులుపడటం తగ్గుతాయని ఆలోచించాడు. చదువొచ్చిందని చదువుకుందిగానీ మహతి పెద్ద బ్రిలియంట్ కాదు. మాధవ్‍తోపాటు రాసిన బేంకు పరీక్షల్లోనూ, గ్రూప్స్‌లోనూ నెగ్గలేకపోయింది. ఇప్పుడు పరీక్షలు రాసే ఆసక్తి అసలే లేదు.
ఉద్యోగం రాగానే అదే సొసైటీలో వేరే ఫ్లాటు వెతుక్కుంది. ఆమె వెతికినది చాలా చిన్న సింగిల్ బెడ్రూం ఫ్లాటు. నారాయణ, నిర్మలతో కలిసి వస్తానన్నాడు. వచ్చి అడ్వాన్సు యిచ్చి, కావల్సిన వస్తువులు అమర్చి వెళ్తామని చెప్పాడు. మాధవ్ బాధపడ్డాడు.
“ఇక్కడే వుండచ్చుకదా మహీ! వేరే వెళ్లడం దేనికి? అమ్మమ్మ పెద్దదైంది ఒక్కర్తీ పాపని పెట్టుకుని ఎలా వుంటుంది?” అన్నాడు.
“ఎంతకాలం మాధవ్? నాయిల్లు నాకు వుండాలి. మా ఆఫీసులో క్రెష్ వుంది. మేఘనని నాతో తీసుకెళ్ళి అందులో వదిలిపెడతాను. వస్తూ తీసుకొచ్చుకుంటాను. అమ్మా నాన్నా వస్తున్నారు. వాళ్లతో ఆవిడ్ని పంపేస్తాను” అంది.
ఇంత ఆలోచించే చురుకు ఆమెకి ఎక్కడిదా అని ఆలోచించాడు మాధవ్. స్క్రిప్టంతా గీతది అయుండచ్చనిపించింది. నీలిమని దృష్టిలో వుంచుకుని సలహా యిచ్చి వుంటుంది. మహతి తనకి స్వంత అక్క కాదు. ఈ విషయం తను అనుకోకపోయినా నీలిమకి కచ్చితంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు తనకి సపోర్టు యిచ్చిందంటేనే గొప్పవిషయం. గీతలో కనిపించిన ప్రత్యర్థిత్వం మహతిలో కనిపించకపోయి వుండచ్చు. ఆ కారణాన్న గొడవచెయ్యలేదేమోగానీ తమ ప్రైవసీ తగ్గినందుకు నీలిమలో కొద్దిగా అసహనం మొదలైంది. ఇంకా బైటపడలేదు. ఆ మార్పు నిశితంగా గమనిస్తే తెలుస్తోంది. అందుకే గట్టిగా మహతిని ఆపలేకపోయాడు.
“నువ్వన్నట్టు వేరే యిల్లన్నావు, సరే. నాకింకా ఓపిక వుంది. మేఘనని నేను చూసుకోగలను. చూసుకోవడానికేం వుంటుంది? కడుపునిండా ఇంత అన్నం పెట్టి, నాలుగు బొమ్మలు ముందు వేస్తే ఆడుకుంటుంది. మీ నాన్న రిటైరయ్యి, ఇక్కడికి వచ్చేదాకా నేను నిన్ను వదిలిపెట్టను. వాళ్లు నిన్ను నాకు వదిలి వెళ్ళారు” అంది విజ్జెమ్మ.
“అదంతా మీ యిష్టం. మీకెలా నచ్చితే అలా చెయ్యండి” అంది మహతి.
తను చేసింది తప్పా, వప్పా అనేది చాలా పెద్ద సందిగ్ధం. చేసిన పనియొక్క పర్యవసానం జీవితకాలం అంతా వెంట వస్తూ వుండేప్పుడు, జీవితగతిని మార్చేదైనప్పుడు ఈ సందిగ్ధం మరీ బలంగా వుంటుంది. మహతిలో అంతర్గతంగా పెద్ద పోరాటం జరుగుతోంది. రెండు పరస్పర వైరుధ్యాలమధ్య. ఎంతోమంది స్త్రీలకి నిరంతరశృంగారం లేని ప్రేమ కావాలి. అంతేమంది మగవారికి ప్రేమ అంటేనే శృంగారం. ఇది వాళ్ల శారీరక వ్యవస్థల్లో వుండే తేడావల్ల పుట్టే బేధం. నరేంద్రని వదులుకోవడానికీ, కావాలనుకోవడానికీ మధ్య వుండే సంఘర్షణ మహతికి ఎడతెగనిది. అది మనసులో చెలరేగుతున్నంతకాలం మరో ఆలోచన బలంగా సాగలేదు. అంతా నిరాసక్తమే.


నారాయణా, నిర్మలా వచ్చారు. పదకొండు నెలల అద్దె అడ్వాన్సుగా యిచ్చి రెంటల్ అగ్రిమెంటు సంతకం పెట్టాడు నారాయణ. నిర్మల యింటికి కావల్సిన పాత్రలవీ వెంట తీసుకొచ్చింది. కొన్ని ముఖ్యమైనవి యిక్కడ కొన్నారు. ఎవరికీ మనసులో సంతోషంగా లేదు.
“మరోసారి ఆలోచించుకో మహీ! నువ్వు సరేనంటే వాళ్ళ కాళ్ళుపట్టుకోవడానికేనా మీ నాన్న, నేను సిద్ధంగా వున్నాం. వాసుకూడా జరిగినదానికి కోపం వచ్చి అలా మాట్లాడాం అని క్షమార్పణ చెప్పడానికి సిద్ధంగానే వున్నాడు” అంది నిర్మల. మహతి తల్లి భుజమ్మీద తలవాల్చి చాలాసేపు ఏడ్చింది.
“వద్దమ్మా!” అంది చివరికి. ఆవిడ నిట్టూర్చింది.
ఇల్లు మారేరోజుని మహతి నీలిమ పక్కని కూర్చుని చాలాసేపు మాట్లాడింది.
“చిన్నదానివైనా చాలా పెద్దమనసుతో సహాయం చేసావు నీలిమా! మా మాధవ్‍కి తగ్గ భార్యననిపించావు. ఇద్దరూ ఎప్పటికీ యిలాగే ఒక్కమాటమీద వుండాలి. నీలాంటి పిల్ల దొరికినందుకు వాడు అదృష్టవంతుడు” అంటూ తన వేలికి వున్న వంటిరాయి వుంగరం ఆమె చేతికి తొడిగింది. ఆ మాటలు మనస్ఫూర్తిగా అంది.
“అయ్యో! ఇదేంటి?” నీలిమ కంగారుపడింది.
“దీన్ని ఎప్పుడు చూసినా, మీ యిద్దరూ కలిసి ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టిన విషయం గుర్తుకు రావాలి” అంది మహతి.
“మహీ! ఏమిటిది? మనమధ్య కృతజ్ఞతలేమిటి?” మాధవ్ బాధపడ్డాడు.
“అలా ఎందుకనుకోవాలి? నా మరదలికి నేను యిచ్చుకున్నాను” అంది. ఇదంతా గీత స్క్రిప్టు, డైరెక్షను.
“నీలిమ మంచిదేగానీ, అన్నిటా తనకి ప్రాధాన్యత వుండాలనుకుంటుంది. మనందరికన్నా తనొక మెట్టు పైన వున్నానన్న గర్వంకూడా వుంది. చిన్నచిన్న విషయాలకి గొడవపడుతుంది. పూర్తిగా చెడ్డదైతే కాదు. వాళ్లకి దగ్గరగా వుంటున్నావు, ఏదో ఒక అవసరం వుండకుండా వుండదు. తనకి ఏదేనా చిన్న గిఫ్ట్ ఇచ్చి, కాస్తంత పొగిడితే సంతోషపడిపోతుంది. మంచి చేసుకోవడంలో తప్పు లేదుకదా? మనలో మనం చేసుకోవడం వేరు, తను మనకి చెయ్యడం వేరుకదు మహీ?” అంది.
నిజమే అనిపించింది మహతికి. ఆరోజుని నీలిమ వద్దని గట్టిగా అనుంటే మాధవ్ ఒక్క అడుగుముందుకి వెయ్యగలిగేవాడు కాదు. వేస్తే గొడవలయ్యేవి. తనకి ఆశ్రయం యివ్వటమేకాకుండా తనకోసం వచ్చినవాళ్ళందరికీ మర్యాదలు చేసి పంపింది. ఇవన్నీ గుర్తుంచుకుని ప్రశంసించాల్సిన విషయాలు. ఉంగరం నిర్మలతో పంపించింది గీత.
“నువ్వెందుకే? నేను కొంటాను” అంది మహతి.
“అంత ఖరీదైన వస్తువు యిమ్మని నీకు నేను చెప్పలేను మహీ! ముందు నువ్వు నిలదొక్కుకో. మాధవ్ భార్యకేగా, ఇచ్చేది? మా డబ్బు మాయింట్లోనే వుంటుంది. బైటికేమీ పోవట్లేదు” అంది.
నీలిమ మహతికి చీర పెట్టి పంపింది.
నారాయణకి యింకో ఏడాది సర్వీసుంది. ఆయనకి బీపీ షుగరు వున్నాయి. ఆగం మనిషి. ఒక్కడూ వుండలేడు. విజ్జెమ్మని ఒక్కదాన్నీ వదలడం యిష్టం లేకపోయినా, తప్పదు. ఆవిడని వుంచి, మధ్యలో అక్కచెల్లెళ్ళూ, పిల్లలూ వచ్చి చూసి, ఎవరి వీలునిబట్టి వాళ్ళు కొద్దిరోజులు వుండి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సమస్యనేది పదిమంది చేతులుపడితే చాలా చులాగ్గా తేలిపోతుంది. అలాగే మహతి ఆర్ధికభారంకూడా. మనిషికి కావల్సింది గుప్పెడు అన్నంమాత్రమే ఐతే ఆపాటి డబ్బు ఆమెకే వుంది. నరేంద్ర తిరిగి యిచ్చేసిన డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసారు. దానిమీద వడ్డీ వస్తుంది. జీతం వుంది. నారాయణ కొద్దోగొప్పో పెట్టగలడు. ముంబైలో బతకాలంటే ఇది చాలదు. బాధ్యతలని మోస్తూ ఒక మనిషి ముందుకి సాగాలంటే నిరంతరం ఎదగాలి.


“నేను రిటైరయ్యేదాకా నీకు టైము యిస్తున్నాను. అప్పటికి నువ్వు ఏదో ఒకదాంట్లో కుదురుకోవాలి. లేకపోతే అక్కడికి వచ్చెయ్యాలి. నీకూ వుద్యోగం లేక, నాకూ లేక, పెన్షను డబ్బులమీద ఇంత పెద్దవూళ్ళో బతకలేంకదా? కాస్త బుర్రపెట్టి ఆలోచించు” అన్నాడు నారాయణ వెళ్ళేముందు. మహతి తలూపింది.
“మహీని ఎలాగేనా నిలబెట్టాలి” అనే సంకల్పంతో ఎలీట్ లెవెనందరూ కదిలారు. వాళ్ళ సేటిలైట్లు కూడా. ఆ బాధ్యత పదిపదిహేనుమంది సంపాదనపరులైనవాళ్ళ మధ్య పంపకమై, యాభైవేలదాకా పోగుచేసి మాధవ్ చేతిలో పెట్టారు.
“ఇంకా కావాలంటే కూడా తయారుచేద్దాం. కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని స్వంతంగా కంప్యూటర్ కొనుక్కుంటే మహీ ఆ వర్కేదో ఇంట్లోంచే చేసుకుంటుంది” అన్నాడు సుధీర్.
“ముందు కొద్దిరోజులు బైట వుద్యోగం చెయ్యనిద్దాంరా! మనుషుల్లో పడుతుంది. ఏది ఏమిటనేది తెలుస్తుంది”అన్నాడు మాధవ్.
“కంప్యూటరంటే చాలా ఖరీదు వుండదూ?” అడిగింది నీలిమ.
“బ్రాండెడ్‍ది కొనలేం. అసెంబుల్డ్ సెట్ తక్కువలో వస్తుంది. సాఫ్ట్‌వేర్ రాదు. బైట వేయించుకోవాలి. అందరూ చేస్తున్నది అదే” వివరించాడు.
మార్పనేది ఒకసారి మొదలైతే అది పరుగులు పెట్టిస్తుంది. వైఫల్యం అనేది ఆడా మగా అందరికీ ఒక్కలానే వుంటుంది. తన కాళ్లమీద తను నిలబడాలన్న ఆలోచనైతే మహతికి వుందిగానీ, ఉత్సాహం లేదు. నిలకడ వుండట్లేదు. తండ్రి మాటలు హెచ్చరిస్తూ వుంటాయి. రెండుమూడు వుద్యోగాలు మారింది. రోజూ పరుగులు పెట్టలేక, అంతంతసేపు చెయ్యలేకా వదిలేసింది. నిస్సహాయత ఆమెని కుంగదీస్తోంది. ఎందుకు తనకీ పరిస్థితి ఎదురైంది? అన్నివిధాలైన ఓటమి అంచుని వుందా, తను? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, అప్పుడప్పుడు వినిపించే అతని విషయాలు వింటూ, బాధని అణుచుకుంటూ బతకడమేనా? అక్కడికి వెళ్ళాక అతన్ని చూడకుండా వుండగలదా? ఇక్కడ తను వెతుకుతున్న వైవిధ్యం ఎందుకు కనిపించట్లేదు?


ప్రమీల వచ్చింది తల్లిని చూడటానికి. వెంట గురుమూర్తికూడా వున్నాడు. మహతిని చూసి చాలా బాధపడింది ప్రమీల.
“ఒక్కదానివీ ఇక్కడెందుకు మహీ? అక్కడికి వచ్చెయ్యమ్మా! అందరం వుంటాం. నాన్న తిడతాడనుకుంటే మాయింట్లో నా దగ్గిరుండు. నీకూ బావుంటుంది. అమ్మ ఎంత బెంగపెట్టుకుంటోందో తెలుసా?” అని బతిమాలింది.
“ఏదీ చెయ్యలేక పూర్తిగా ఫెయిలైతే అదే చేస్తాను ఆమ్మా? ఇంక చెయ్యడానికి ఏం మిగిలుంటుంది?” అంది మహతి.
“గీతని చూసి నేర్చుకోవే. కిందపడ్డా, మీదపడ్డా తనదే గెలుపంటుంది. నీకిప్పుడు ఏం కష్టం వచ్చిందని మహీ, ఇంత హైరానపడిపోతూ ఇక్కడుండటం? అతన్ని వద్దనుకున్నావుసరే, మా అందర్నీకూడా వద్దనుకున్నావా? మేమెవ్వరం నీకేం కామనుకుంటున్నావా? అసలు మీ జెనరేషన్ పిల్లలకి ఏ విషయం చెప్పలేకపోతున్నాం” అని గురుమూర్తికూడా అన్నాడు.
“నాతో దానికి పోలికెందుకు పెద్దనాన్నా?” జవాబిచ్చింది మహతి.
“ఎవరం ఎంత చెప్పినా వినట్లేదు” అంది విజ్జెమ్మ.
సుధీర్ అత్తవారిది అదే వూరు. వీళ్ళు వచ్చారని తెలిసి వియ్యంకుడూ, వియ్యపురాలూ చూడటానికి వచ్చారు. ఆవిడ పేరు సరళ. హోమియోడాక్టరు. ఆయనది వ్యాపారం. ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికీ పెద్దచదువులు చెప్పించి, మంచి సంబంధాలు చూసి, విదేశాలకి పంపించిన దర్పం వుంటుంది ఆవిడలో. గర్వం కాదు. ఎవరినీ తక్కువ చెయ్యదు. ప్రమీల కొలీగ్‍ద్వారా ఈ సంబంధం వచ్చింది.
“స్నేహితుల్లా సంబంధం కలుపుకుంటున్నాం. కలుసుకునేదీ, వేడుకలు చేసుకునేదీ మనమే. పిల్లలు మనదగ్గిర లేనూ లేరు. స్నేహితుల్లా వుందాం. వరసలు వద్దు. పేర్లు పెట్టి పిలుచుకుందాం” అనుకుని అలాగే పిలుచుకుంటారు.
“ఎంత యూత్‍ఫుల్‍గా వుంటాయి ప్రమీలా, మీ యింట్లో ఫంక్షన్లు? మా రమ పెళ్ళి వీడియో చూస్తే సినిమా చూసినట్టు వుంటుంది” అంటుంది. చిన్నతనంలోనే భర్త పోయినా, తొమ్మండుగురు పిల్లలు, మనవలు, మునిమనవలతో పెద్ద పూలవనంలా విస్తరించి వున్న విజ్జెమ్మని చూసినా వాళ్లకి అంతే సంతోషం. అందరినీ వాళ్ళింటికి ఆహ్వానించి వెళ్ళారు. మర్నాడు కారు పంపిస్తామని కూడా చెప్పారు. వద్దన్నా వినలేదు.
“నీ ప్రిస్క్రిప్షన్సవీ తీసుకోవే. వెళ్తున్నాంకదా? ఆవిడకి చూపిద్దాం. ఏమంటుందో చూద్దాం” అంది ప్రమీల మహతితో. వాళ్ళు వెళ్ళగానే. ఆమె తలూపింది. మహతికి ఇంకా ఫోన్ లేదు. మాధవ్ యింట్లో కూర్చుని సరళతో మహతి విషయం కూలంకషంగా చర్చించింది ప్రమీల ఆ సాయంత్రమే. ఎదురుగా చెప్తే మహతిని బాధపెట్టే విషయాలు వుండచ్చు. ముఖ్యంగా నరేంద్ర విషయం. అది నలుగుర్లో కూర్చుని చర్చకి పెట్టుకునేది కాదు.
మరుసటిరోజు స్నానాలూ, కాఫీ-టిఫెన్లు అయేసరికి ఠంచనుగా కారు వచ్చేసింది. ఇందరికి చాలదని వాళ్ళ కారుతోపాటు టాక్సీకూడా బుక్ చేసి పంపించారు. మాధవ్ తనకి ఆఫీసులో పనుండటంతో వీళ్లతో వెళ్ళలేకపోయాడు. సాయంత్రం నేరుగా అక్కడికే వస్తానని చెప్పి, అడ్రస్ వివరాలు తీసుకున్నాడు. మిగిలినవాళ్ళంతా బయల్దేరారు.
మనుషుల్లో పైకి కనిపించే పలుచటి అహంభావపు పొరని తొలగించి చూస్తే సాటిమనుషుల సహచర్యంకోసం, స్నేహంకోసం పడే తపన కనిపిస్తుంది. ఎక్కువమంది పిల్లల్ని కనకుండా ఇద్దరూ ముగ్గురూ పిల్లలతో సరిపెట్టుకుని, పిల్లల చదువులవీ వున్నరోజుల్లో వాళ్ళ చదువులకి ఆటంకం అని సామాజికబంధాలని కుదించివేసుకోగా, ఆ ప్రహసనం అంతా అయేసరికి వాళ్లకి స్నేహితులు లేక, వీళ్ళకి సాటివాళ్లతో అనుబంధాలు పలచబడి, అప్పుడు మొదలౌతుంది మనుషులకోసం వెతుకులాట. రెండుతరాలవాళ్లలోనూ. సరళ యిప్పుడు అలా తపించిపోతోంది. వాళ్ళది మొదటే చిన్నకుటుంబం. ఇప్పటి తరంలో వుండే క్లుప్తత వాళ్ళింట్లో ఒకతరం ముందే చోటుచేసుకుంది. ఆవిడకి ఒక అన్న. ఆయనకి ఒక్కరు, ఈవిడకి ఇద్దరు, మొత్తం కలిపి ముగ్గురు పిల్లలు.
ఆవిడ భర్తకి ఒక చెల్లి. ఆవిడకి ఒక కూతురు. రాకపోకలు తక్కువ. పెట్టుపోతలు భారీగా చెయ్యదనీ, మర్యాదలు నెరపదనీ వదినగారితో గొడవపడుతుంది ఆమె. సరైన ఆదాయాలు లేక, ఇద్దరు పిల్లల చదువులకోసం వీళ్ళు కష్టపడేవారు. కూతుళ్లకి చదువులై, వుద్యోగాలు వచ్చాక కొంచెం నిలదొక్కుకుని వేరే ఆస్తులు అమ్ముకుని ఈ ఫ్లాట్ కొనుక్కున్నారు. అది ఆమెకి కన్నెరుపు.
సరళకోసం అక్కడినుంచీ కంచిపట్టుచీర కొని తెచ్చింది ప్రమీల. దార్లో పళ్ళూ, స్వీట్సూ కొనుక్కుని ఆర్భాటంగా బయల్దేరారు. భార్యాభర్తలిద్దరూ ఆత్మీయంగా ఆహ్వానించారు. మహతిని ముందురోజు చూసారు. నీలిమని ఇప్పుడు పరిచయం చేసింది ప్రమీల.
“నీలిమ అక్కనీ, చెల్లెల్నీకూడా మా చెల్లెళ్ల పిల్లలకే యిచ్చారు” అని వివరించింది.
“పెద్దపెద్ద కుటుంబాలు వుంటాయని వినడమేకానీ ఇంత దగ్గరగా చూడలేదు. రిసెర్చి చెయ్యచ్చు మీ కుటుంబంమీద. తక్కువమంది పిల్లలున్నవాళ్ళలో ఉన్న ఆ ఇద్దరో ముగ్గురోకూడా గొడవలుపడి ముఖముఖాలు చూసుకోనివాళ్ళు తెలుసుకానీ ఇలా కలుపుగోలుగా తిరిగేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను” అంది సరళ. “వీళ్ళెందరు? ఇంకో టీమ్ తయారైనట్టే వుంది. ఈ పిల్లలందర్నీ కలుపుతూ వుండండి ప్రమీలా! ఎక్కడెక్కడ పెరిగినా, ఒక కుటుంబంనుంచి వచ్చామని తెలిస్తే చాలా బావుంటుంది” అంది పంకజ్‍నీ, మేఘననీ చూసి మురిపెంగా. ఇద్దరు ఆడపిల్లలు చేతుల్లో పిల్లల్తో కనిపించేసరికి సరళకి చాలా ముచ్చటగా అనిపించింది. ఎత్తుకుందామని చేతులు చాస్తే ఎవరూ వెళ్ళలేదు.
“అబ్బో! వీళ్ళదీ పెద్దటీమే వుంది. ఫంక్షన్స్‌కి తీసుకెళ్తునే వుంటాం. మా తమ్ముళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళకింకా పెళ్ళివయసు లేదు. మిగిలినవాళ్ళందరికీ పెళ్ళిళ్ళయాయి. అందరికీ ఒకళ్ళూ యిద్దరూను. అంతా ఇంతంత లిట్టిలిట్టిపిల్లలు. వీళ్ళ ఏడుపులతోటీ అల్లరితోటీ తోచదు. ఒక్కళ్ళూ దించినచోట వుండరు. పెట్టిన వస్తువు పెట్టినచోట వుండనివ్వరు ” ప్రమీల జవాబిచ్చింది.
సుధీర్ పిల్లల బొమ్మలు వుంటే వాటిని యిచ్చింది ఆడుకోవడానికి. పెద్ద ట్రిపుల్ బెడ్‍రూం ఫ్లాటు వాళ్లది. ఇల్లంతా తిప్పి చూపించింది. ఆ యింట్లో ఒకటో రెండో సుధీర్ వస్తువులు, కొన్ని బట్టలు, మదిలో కదిలే జ్ఞాపకాల్లా. వింతగా అనిపించింది ప్రమీలకి. ఏదో దు:ఖంగా అనిపించింది లోలోపల. మనుషులనా, వాళ్ళ జ్ఞాపకాలనా మనం ప్రేమించేది?
అక్కడ మరీ రాత్రి కాకపోవటంతో సుధీర్, రమ వీడియోకాల్ చేసి అందరితోటీ మాట్లాడారు. విజ్జెమ్మ మనవడి బొమ్మ కదుల్తుంటే చూస్తూ మాట్లాడ్డానికి తత్తరపడింది. అత్తవారిముందు బైటపడకూడదని తల్లిదండ్రులతో మామూలుగా మాట్లాడాడుగానీ సుధీర్‍కి వాళ్లమీద ఇంకా కోపం పోలేదు. అతన్నీ, రమనీ, వాళ్ళ పిల్లలనీ చూడటం తన పాపనీ, మాధవ్ కొడుకునీ చూపించడం మహతికి కొత్త అనుభవం. ఫోన్లలో ఎస్టీడీ కాల్స్, అరుదుగా ఐయస్‍డీ కాల్స్ చేసుకోవడం వేరు, ఇలా ఎక్కడో వున్న మనిషిని చూస్తూ మాట్లాడ్డం వేరు. ఎన్నో సందర్భాలలో కలిసినా, చూసినా నీలిమకి సుధీర్‍తో పెద్దగా పరిచయం లేదు. బావగారని మాట్లాడ్డానికి బెరుకుపడింది.
“మాధవ్ భార్యేమిటి, ఇలా మొహమాటపడటమేమిటి? వాడు అందర్నీ ఎలా ఏడిపించేవాడో తెలుసా? నీకు సరిగ్గా ట్రెయినింగ్ యివ్వలేదైతే” అన్నాడు సుధీర్ నవ్వి. మహతి అతన్లో ఏదో మార్పుని పసిగట్టింది. అదేమిటో అర్థం కాలేదు. ఫోన్ కాల్ అయ్యాక అంతా సర్దుకున్నారు. విజ్జెమ్మని సౌకర్యంగా వుండే కౌచ్‍లో కూర్చుండబెట్టారు.
సాధారణ పరామర్శలు అయ్యాయి. అంటే “మీ చెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, వాళ్ళ పిల్లలూ అంతా బావున్నారా?” అని. తర్వాత ప్రత్యేక పరామర్శలు. “సుమతి, అల్లుడు, మనవలు ఎలా వున్నారు? సుమంత్ ప్రాక్టీసు ఎలా వుంది? కోడలు, వాళ్ళ పాప బావున్నారా? వస్తుంటారా? మీరీమధ్య వెళ్ళారా?” అలాంటివి. ప్రమీలకూడా ఆవిడ రెండోకూతురిగురించి అడిగింది. అన్నీ అయ్యాక ఆల్బమ్స్ ముందు పెట్టుకుని కూర్చున్నారు. వీడియోకన్నా, ఫోటోలు చూసి విజ్జెమ్మ చాలా సంతోషపడింది. పదేపదే ఆ బొమ్మలమీద వేలితో రాస్తూ ముచ్చటగా చూసుకుంది. మనవల కబుర్లు ప్రవాహంలా సాగాయి. తల్లులుగా వున్నప్పుడు ఇంటిపనులు, బాధ్యతలతో సతమతౌతూ తమ పిల్లల బాల్యాన్ని పెద్దగా ఆస్వాదించలేరు స్త్రీలు. అందుకే మనవలతో యింత అనుబంధం పెంచుకుంటారు.
మధ్యమధ్యలో కాఫీలు, చిరుతిళ్ళు, జూస్‍లు, పిల్లలకి బిస్కెట్లు. వంటకీ, పనికీ ఒకమ్మాయి వుంది వాళ్లకి. చురుగ్గా చేస్తోంది.
గురుమూర్తి, సరళభర్త కబుర్లలో పడ్డారు.
“మీ అన్నయ్యగారి కూతురు బాగా గుర్తుండిపోయింది. ఒకసారి వెంటబెట్టుకుని రాకూడదూ? రెండురోజులు వుంచుకుని పంపేస్తాను. అలాంటివాళ్ళతో మాట్లాడితే మన వయసు సగం తగ్గిపోతుంది. నాకైతే ఆ పిల్ల చాలా నచ్చేసింది. ఏదో ప్రత్యేకత వుంది తనలో. ఇటు వీళ్ళ పెళ్ళినీ, అటు ఆ అమ్మాయినే చూస్తూ వుండిపోయాను ఆరోజు. వీళ్ల పెళ్లప్పటికి తనకి ఐదోనెలో ఆరోనెలో కదూ? ఐనా ఎక్కడా కగ్గలేదు. గిలకలా తిరుగుతూ అన్నీ చక్కబెట్టింది. ఇప్పటి పిల్లల్ని చూస్తేనే చిరాకేస్తుంది. ఇలా నెల తప్పిందనగానే సొక్కిపోవడం, సోలిపోవడం, మోసేవాళ్ళుంటే వాళ్లమీద వాలిపోవడం, అమ్మలని కాల్చుకు తినేస్తున్నారు” ఉన్నట్టుండి అంది సరళ. వాళ్ల మాటలు వింటూ మధ్యలో మహతితో మాట్లాడుతున్న నీలిమ ఒక్కసారి ఆగిపోయింది. ప్రమీల ముఖం కొద్దిగా కళతప్పింది. అదికూడా నీలిమ గమనించింది.
“దానికా? రావడానికెక్కడ కుదురుతుంది? ఉద్యోగం, ఇద్దరు పిల్లలు, ఇంట్లో రెండువైపులా పెద్దవాళ్ళు. ఐనా చెప్పి పంపిస్తానులే” అని మాటదాటేసింది. గీత విషయంలో కోపాలంటూ ఏమీలేవుగానీ ఎక్కడో సన్నటి ముల్లులాంటిది కదుల్తూ వుంటుంది. దాన్ని తీసెయ్యలేకపోతున్నారు భార్యాభర్తలు. అసలు పెళ్ళే చేసుకోనన్నవాడు, సుధీర్ పెళ్ళి చేసుకుని ఇప్పుడే కుదురుకున్నాడు. ఇలాంటి సమయంలో గీతని వీళ్ళకి దగ్గరచేసి కొడుకుని ఇరుకునపెట్టడం యిష్టం లేకపోయింది.
మహతిని లోపలికి తీసుకెళ్ళి చాలాసేపు మాట్లాడింది సరళ. రిపోర్ట్సవీ చూసింది. బాగా మందులు వాడుతోంది మహతి. ముందు ఆ వలయంలోంచీ బైటపడెయ్యాలి. సాధారణంగా దీర్ఘకాలంపాటు బాధపడుతున్నవాళ్ళు అలోపతీ మందులమీద విసుగొచ్చినప్పుడు హోమియోకి వెళ్తారు. హోమియో మందులు వెంటనే గుణం చూపించవు. ఆపైన కొన్ని నియమాలు వుంటాయి. దాంతో నాలుగురోజులు వాడేసి, మళ్ళీ అలోపతీకి వెళ్ళిపోతారు చాలామంది. జీవితం చాలా వేగవంతం ఐపోయింది. జ్వరం వస్తే లంఖణంచేసి, పథ్యంతిని తగ్గించుకునే పద్దతిగానీ, వంట్లో ఏదేనా తేడా వస్తే నిదానంగా కూర్చుని ఆలోచించుకునే అవకాశంగానీ వుండట్లేదు. శరీరం అదో యంత్రంలాగా, వేసుకునే మందులు అది పని చెయ్యనప్పుడు చేసే మరమ్మత్తులాగా మారిపోయాయి. మహతికూడా అంతే. ఒకటికి ఒకటి తోడై మందులు పెరిగిపోయాయి. హోమియో ఎన్నోసార్లు మొదలుపెట్టి మానేసింది.
“ఎక్స్‌ట్రా బేగేజి వద్దనుకుని వదిలేసావు. ఇంక దానిగురించి ఆలోచించకూడదు. ఇప్పటిదాకా నీ జీవితమ్మీద గోల్స్ నిర్ణయించుకున్నది మీ అమ్మానాన్నలు, నీ భర్త. ఇప్పుడింక నీకోసం నువ్వు బతక్క ఎందుకు మహతీ, ఈ దిగులు?” మెత్తగా అడిగింది సరళ. ఈ కొత్తపరిచయాలలో, పాతమనుషులనే కొత్తగా కొత్తచోట కలుసుకోవడంలో మహతికి కొన్ని ముడులు విడుతున్నాయి. ఆవిడ మాటలుకూడా ఏదో ఒక ముడిని వదులుచేసాయి.
ఎక్స్‌ట్రా బేగేజి. ఆ మాటలు రెండూ ఆమెలో ఏదో అలజడి రేపాయి. ఆ రెండు పదాలనీ పదేపదే అనుకుంది తనలో తను.
“కొన్ని మందులు ఆపుదాం. మిగిలినవి వేసుకుంటూ నెమ్మదిగా హోమియోకి మారు. యోగాసనాలు వెయ్యటం అలవాటు చేసుకో. మనశ్శాంతి నిలబెట్టుకోమ్మా! బరువు తగ్గడానికి ప్రయత్నించు. రోజూ కొద్దిసేపేనా పచ్చటి చెట్లమధ్య గార్డెన్లో తిరుగు. సంతోషం లోపల్నుంచీ రావాలి. ఎవరో తెచ్చి యివ్వలేరు. నువ్వు ఇన్నేళ్ళు పడ్డ కష్టానికి ఫలితంగా చక్కటి పాప వుంది నీకు” అని ప్రేమగా చెప్పింది. నిజమే. సంతోషం లోపల్నుంచీ రావాలి. అది ఒక బీజంలాగా మనిషి గుండెల్లో నిక్షిప్తమై వుంటుంది. దానంతట అది పెల్లుబికి రాదు. చుట్టూ వున్నవాళ్ల ప్రేమ, కరుణ, దయ, సహానుభూతిలాంటి ఎన్నోవిధాల రసవృష్టి జరగాలి. అప్పుడు మొలకెత్తుతుంది. ఆ వృష్టి నిరంతరంగా వుండాలి. అది పెరుగుతూ వుంటుంది. మళ్ళీ ఇద్దరూ హాల్లోకి వచ్చారు. భోజనాలు చేసాక వియ్యంకులిద్దరూ బైటికి వెళ్ళారు. విజ్జెమ్మ నిద్రలోకి జారుకుంది. పిల్లలిద్దరూకూడా నిద్రపోయారు.
“మీరుకూడా కాసేపు బైట తిరిగివస్తారా? క్లబ్‍హౌసుకి వెళ్లండి. బావుంటుంది. లైబ్రరీ, అక్వేరియం, జిమ్ వున్నాయి. బోర్డ్‌గేమ్స్ ఆడుకోవచ్చు అక్కడకూడా టీవీలు వున్నాయి. వీళ్ళు లేస్తే మేం చూసుకుంటాం. ఈలోగా మీరు తిరిగిరండి” మెంబర్‍షిప్ కార్డు ఇచ్చి పంపించింది సరళ వదినామరదళ్లని.
“అసలు కష్టాన్ని దాటేసింది. పెద్దసమస్యేం లేదుగానీ జాగ్రత్తగా చూసుకోండి మహతిని. అతని జ్ఞాపకాలు బలహీనపడేదాకా యిలానే వుంటుంది. మీతో వస్తుందేమో నచ్చజెప్పి తీసుకెళ్లండి. రానంటే బలవంతం చెయ్యొద్దు. ఒకదారి ఎంచుకుందికదా, అందులోనే ముందుకి వెళ్లనివ్వండి” అంది ప్రమీలతో. ఆ తర్వాత ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. విజ్జెమ్మ లేచింది. ఆవిడ చెప్పే కబుర్లు ఆవిడ చెప్పింది. పిల్లలు లేచే టైముకల్లా వచ్చేసారు నీలిమ, మహతి. అమ్మయాక అంతే. పంజరం తెరిచి వుంచినా వదిలిపెట్టి ఎంతోసేపు, ఎంతోదూరం వెళ్ళలేరు.’
సాయంత్రం కాఫీ ఫలహారాలయ్యాయి. మరికాసేపాటికి మాధవ్ వచ్చాడు. అదే వూళ్ళో వుంటూ ఒక్కసారేనా కలుసుకోకపోవటం గురించి ఆక్షేపించాక, అప్పుడప్పుడు వస్తుండమని చెప్పింది సరళ.
“ఇప్పుడు వెళ్ళి ఏం వండుకుంటారు?” అనడంతో రాత్రికూడా భోజనాలుకూడా అక్కడే అయ్యాయి. పెద్దవాళ్లకి బట్టలు పెట్టి, నీలిమకీ, మహతికీ చెరో పుస్తకం, పిల్లలిద్దరికీ చెరో బొమ్మా చేతిలో పెట్టారు. తిరుగుప్రయాణానికి మళ్ళీ కారు యిస్తానంటే, వద్దన్నాడు మాధవ్.
“వద్దండీ! అంతదూరంనించీ ఖాళీగా రావాలి. పెట్రోలు దండగ. టాక్సీల్లో వెళ్ళిపోతాం” అని వారించాడు.
ఇంటికి వెళ్లగానే అందరినీ నిలబెట్టి వుప్పు తిప్పి పడేసింది విజ్జెమ్మ. “ఏమిటమ్మా, మీ చాదస్తం?” అన్నాడు గురుమూర్తి. నిజానికి అలాంటప్పుడే తనకన్నా మరొకళ్ళు పెద్దవాళ్ళు వున్నారన్న విషయం గుర్తొచ్చి, వయసు తగ్గినట్టు అనిపించేది. మనసులో మార్దవం పెరిగేది.
తమ యింటికి వెళ్ళాక మాధవ్‍తో అంది నీలిమ, “ఇంట్లోవాళ్ళేకాక బైటివాళ్ళుకూడా ఆవిడ స్తోత్రమే”
“ఎవరు, గీతగురించా?” వంగి తాళం తీస్తున్నవాడు ఆగి అడిగాడు, ఏం జరిగిందో అర్థంకాక.
“మీ అన్నయ్య పెళ్ళిలో ఆరునెలల ప్రెగ్నెన్సీతోకూడా చాలా యాక్టివ్‍గా తిరిగిందట. అన్నీ చక్కబెట్టిందట. మీ ఆమ్మకూడా చిన్నబుచ్చుకుంది ఆ మాటలకి. ఈవిడ కూతుర్ని వదిలేసి ఇంకెవర్నో పొగిడితే ఎలా వుంటుంది? ఇన్నాళ్ళు నాదే తప్పనుకుని బాధపడ్డాను” అంది. మాధవ్ జవాబివ్వలేదు. కొద్దిగా అసహనంగా అనిపించింది. సరళగారు గీతగురించి అంటే ఆమ్మెందుకు చిన్నబుచ్చుకుంది? వాసు పెళ్ళితర్వాత యింట్లో వచ్చిన మార్పుల్లో ఇదొకటా? అర్థమవ్వలేదు.
“గీతకి వదిలెయ్యండి. చూసుకుంటుంది. దాన్నడిగితే చెప్తుంది” తమ యింట్లో చాలా మామూలుగా వినిపించే మాటలు. అందరూ యిష్టంగా అనే మాటలు. అలాంటిది గీత ప్రసక్తి ఇప్పుడెందుకు ఆమ్మకి బాధ కలిగించింది? ఆమ్మకేనా? మిగిలిన అందరికీనా? కుటుంబం అంటే ఆషామాషీగా సాగిపోదు. ఎంతో ప్రణాళిక, క్రమశిక్షణ వుండాలి. మామయ్య అలా కుటుంబాన్ని నడుపుకొచ్చాడట. ఆయన్ని చూసి నేర్చుకుంది గీత!
ఎప్పుడూ ఏవో ఒక ఫంక్షన్లు. పెళ్ళిళ్ళు, బారసాలలు, గృహప్రవేశాలు. వేడుకలన్నీ పెద్దమేనమామ, అమ్మమ్మ అధ్వర్యంలో జరుగుతాయి. వాళ్ల పక్కనే తనూ వుంటుంది. పని ఎంత పెద్దదైనా, ఎలాంటిదైనా సూక్ష్మంగా విడగొట్టి, యాక్షన్ ప్లాను ముందుపెడుతుంది. ఎవరెవరు ఏ వస్తువులు తేవాలో, ఎవరెవరు ఏ పనుల్లో వుండాలో అన్నీ రెండుమూడుగంటల చర్చల్లో తేల్చేస్తుంది. అంతమందిమీద తమని పట్టించుకోలేదనీ, ప్రాధాన్యత యివ్వలేదనీ అలకలూ కోపాలూ లేకుండా, ఎలాంటి గొడవలూ తలెత్తకుండా ఫంక్షను జరిగిపోతుంది. పెద్దవాళ్లతో సమానంగా అన్నీ చూసుకుంటుంది. ఇద్దరు పిల్లల్ని వెంటేసుకుని, వాసుని పక్కని పెట్టుకుని చురుగ్గా తిరుగుతుంది. ఆ నవ్వులు, పలకరింపులు, ఆ పిల్లలు, ఆ జంట, వచ్చినవాళ్ళందరికీ పెద్ద ఆకర్షణ. ఫంక్షను అయ్యాకకూడా వాళ్లని గుర్తుపెట్టుకుంటారు.
వాళ్ళ పెళ్ళితో మొదలుపెట్టి చాలా పెళ్ళిళ్ళు జరిగాయి. అంతకి అంతా ఒడుగులు, బారసాలలు, ఇంకా చిన్నాపెద్దా ఫంక్షన్లు జరిగాయి. చిన్నమామయ్యల పిల్లలు నలుగురుతప్ప అందరి పెళ్ళిళ్ళూ అయాయి. అవసరం తీరిపోయిందిగాబట్టి గీతని పక్కకి పెట్టే ప్రయత్నమా? గీత యింక తమ విషయాల్లో కలిగించుకోకుండా దూరంగా వుండాలని అనుకుంటున్నారా? తమ యింట్లోకూడా రాజకీయాలా? చేదు తిన్నట్టు అనిపించింది మాధవ్‍కి. తామంతా పెద్దైపోయారా? బాల్యం తమని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? గీతనికూడానా? ఈ విషయం గీతకి ఇంకా అర్థమవలేదా? ఎలా చెప్పాలి తనకి? గొప్ప విషాదం కలిగింది. కళ్ళు చెమర్చాయి. ఏ చుట్టరికాలు ఎలా వున్నా, గీత తనకి వదిన. అన్న భార్య. తనకి చిన్నప్పటి స్నేహితురాలు. మిగిలినవన్నీ ఆ తర్వాతే. గీతని తక్కువ చేస్తే తనూ తగ్గడు.
ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. అతని ముఖం గంభీరంగా వుండటం, కళ్ళలో ఎర్రజీర కనిపించడం చూసి, ఇంకేమీ అనలేదు నీలిమ.
సరిగ్గా అందుకు భిన్నమైనదారిలో సాగుతున్నాయి మహతి యింట్లో గురుమూర్తి ఆలోచనలు.
లక్షల్లో ఏ ఒకటో రెండోతప్ప మనం సాధించే విజయాలన్నీ వ్యక్తిగతమైనవే అయుంటాయి. వాటి ఫలితం ఆ కుటుంబానికిమాత్రమే పరిమితమౌతుంది. చుట్టూ వున్నవాళ్ళు దాన్ని అనుభూతి చెందుతారు, ప్రశంసిస్తారు. స్ఫూర్తి పొందుతారు. కాస్తైన తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది. పిల్లలు ముగ్గురూ చదువుల్లో బాగా పైకి వచ్చారనే గర్వం గురుమూర్తిలో వుండేది. అందరికన్నా ఒక మెట్టు పైన వున్నాననుకునేవాడు. ఆయన పిల్లలని అందుకోవడం, వాళ్ల కుటుంబంతో వియ్యం అందటం గొప్పవిషయాలని నమ్మేవాడు. ఆ నమ్మకాన్ని తృణప్రాయంలా తీసిపారేసింది గీత. అవకాశానికీ, దాన్ని అందుకోవడానికీ మధ్య వుండే చిన్నవిభజనరేఖ విజ్ఞత. ఆ వేర్పాటురేఖని దర్శింపజేసింది. కళ్లముందు పుట్టి పెరిగిన పిల్ల నేర్పిన ఈ పాఠాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అంతకన్నా పెద్దపాఠం కని, పెంచి, తల్లిదండ్రులు తీర్చిదిద్దిన జీవితాన్ని ఆ పిల్లకోసం సుధీర్ తలకిందులు చేసుకోబోవడం. గీత నేర్పినది గట్టి పాఠమైతే, ఇది లోతైన గాయం.
ఒకానొక విషమసమయంలో తలెత్తిన ప్రశ్న. ఉజ్వలమైన జీవితాన్ని అమర్చిపెట్టిన తల్లిదండ్రులని తోసిరాజన్న కొడుకుని కన్న తనకన్నా, అంతటి భవిష్యత్తుని ఆయనకోసం తృణప్రాయంగా తోసిపారేసిన కూతురున్న రామారావు గొప్పవాడా అని. అప్పుడే మొదలైంది ఆయనలో వుపేక్షాభావం. వీళ్ళంతా ఎవరు? తనకేమీ కారు. వీళ్ళతో ఎలాంటి రక్తసంబంధం లేదు. కేవలం భార్యద్వారానే చుట్టరికం అనిపించి దూరం పెంచుకున్నాడు. కానీ ఫంక్షన్స్‌కి వెళ్ళక తప్పేది కాదు. ఎంత అంటిముట్టనట్టు వుందామనుకున్నా గీత ఏదో ఒక వుచ్చు విసిరేది. ఈ పని నీది, ఈ బాధ్యత నీది, అంటూ ఏవో చెప్పి, గారాలుపోయి చేయించుకుని, ఇంటికి పెద్దల్లుడివని అన్నిచోట్లా అగ్రతాంబూలం ఇప్పించేది.
కళ్ళు సగం మూతబడే ఆమె నవ్వే పెద్ద ఆకర్షణ. గీత, ఆమె పిల్లలు, పక్కని వాసు, చూడ్డానికి రెండుకళ్ళూ చాలవనిపించేవి. పైపిల్ల కాదు, తను ఎత్తి పెంచినదేకదా అనే మమకారం దూరాన్ని చెరిపేసేది. సుధీర్ని కాదందని సుమతికి కోపం. ఆ కోపాన్ని బానే చూపించేది గీతమీద. ఒక ప్రాణంలా తిరిగినవాళ్ళు ఇద్దరూ మాట్లాడుకోవడం మానేసారు. ఆయనకిమాత్రం సుధీర్‍మీదే కోపం వచ్చేది. తనకేం కావాలో స్పష్టంగా తెలుసుకుని, దాన్నే అందుకున్న గీతకి వున్న తెలివి అతనికి లేదేమని.
ఈ రెండిటితోనే ఆయన సమాధానపడలేకపోతుంటే కొత్తగా మహతి సమస్య. భర్తనీ కాపురాన్నీ వద్దనుకునే నిర్ణయం తనంతట తను తీసుకుంది. తమ చేతుల్లో పెరిగిన ఈ పిల్లలకి, చిట్టిచిట్టి పాదాలతో తమని ఎక్కి తొక్కుతూ పెద్దైన వీళ్ళకి స్వంతజీవితాలూ, సమస్యలూ మొదలయ్యాయి. వాటికి తాము ద్రష్టలే తప్ప పరిష్కర్తలు కాదు. ఎవరి కష్టం వాళ్ళది. అలాగని వదిలేస్తే ఏదో ఐపోతారు. వైఫల్యాలకి చిరునామాగా మిగిలిపోతారు.
అర్ధరాత్రి అందర్నీ నిద్ర లేపి మహతిని వెతకడానికి పంపింది గీత. ఆ పిల్ల యిక్కడుందని తెలిసాక, అందరూ హడావిడిపడుతూ ప్రయాణాలు కడితే, “అందరం ఒక్కసారి వెళ్లడం దేనికి? ముందు మేం వెళ్ళి ఏం జరిగిందో చూస్తాం మీరంతా ఫోన్లు చేసి మాట్లాడుతూ వుండండి” అని ఆపింది. పరిస్థితిని చేతుల్లోకి తీసుకుంటుందా? చక్కదిద్దుతుందా? తనే ఎందుకు? పెద్ద సందిగ్ధం.
రాణా భార్యకి ప్రెగ్నెన్సీలో సమస్యలు వచ్చాయి. ఖరీదైన ఇంజక్షన్లు అవసరమయ్యాయి. అతనికి సరైన వుద్యోగం సంపాదనా లేవు. ఆ అమ్మాయి పుట్టింటివాళ్ళు లేనివాళ్ళు. వీళ్ళే ముందుపడి డబ్బుసర్దారు. ముందుపడి సాయం చెయ్యడం అంటే? అందరిలోనూ సంకల్పం వున్నా, ఎవరో ఒకరు వాళ్లు ఇచ్చే రిసోర్సెస్‍ని కూడగట్టాలి. లేకపోతే దప్పికతో వున్నవాడిముందు నీళ్ళు విదిలించినట్టౌతుంది. విదిలించిన చుక్కలు నీళ్ళచుక్కలే ఐనా దప్పిక తీర్చలేవు. గీత దగ్గరుండి సుమంత్‍‍కి తెలిసిన గైనిక్ ద్వారా వైద్యం చేయించింది. వీళ్ళలో వీళ్ళు అనుకుని చేసారు. పెద్దవాళ్ళెవరికీ పూర్తిగా వివరాలు తెలీవు. గీత… తనే ఎందుకు? అప్పుడూ ఇదే ప్రశ్న ఎదురైంది.
“మహీ అక్కడే వుంటానంటోంది. మాధవ్ యింట్లో ఎంతకాలం వుంటుంది? వేరే ఫ్లాట్‍లోకి మారింది. మామ్మ తనకి తోడుగా వుంది. ఆవిడ పెద్దది. ఇప్పుడు ఒకొక్కళ్ళూ వెళ్ళి ఎవరికి కుదిరినన్ని రోజులు వాళ్ళదగ్గిర వుండండి. మహీవాళ్ళ నాన్న రిటైరయ్యేదాకా మేనేజి చేస్తే సరిపోతుంది” అంది. ఇల్లొదిలేసి మాధవ్ దగ్గరికి వచ్చేసిన మహతిని జాగ్రత్తగా చిటికెనవేలు పట్టి నడిపించినట్టు ఒక గూట్లో స్థిరపరిచింది. అంతా నిదానించింది. జడివాన కురిసి, వెలిసినట్టైంది.
ఆత్మహత్యకి ప్రయత్నించి బైటపడి, ఆ తర్వాత అసలు పెళ్ళే చేసుకోనన్న సుధీర్‍లో వచ్చిన మార్పు వెనకకూడా గీతే వుందా? ఆ ఆలోచనతో ఉక్కిరిబిక్కిరయాడు. వీళ్ళంతా ఒకళ్లకొకళ్ళు ఏదో ఒకటి ఔతారు. ఎవరిళ్ళలోనూ యింత గట్టి చుట్టరికాలూ, ఒకళ్లకోసం అందరూ నిలబడటాలూ లేవు. ఎక్కడా లేనివి యిక్కడ వున్నాయి. ఆ వుండటం వెనుక బలమైన సంకల్పం వుంది. అది గీతదా? వాసుదా? అంతా కావాలనుకోవడంలోనూ, వద్దనుకోవడంలోనూ వుంటుంది. తనకేనా అంతే. ఎందుకు తనకి కోపం? సుమతికీ చెప్పాలి. ఆయన ఆలోచనలు ఆగాయి.
“నిద్రపోతున్నారే?” అని లోపలికి చిన్నగా కేకపెట్టాడు. ప్రమీల యివతలికి వచ్చింది.
“అలా నడుద్దాం పద” అన్నాడు చెప్పులేసుకుంటూ.
“ఇంతరాత్రా?” ఆశ్చర్యపోయింది.
“ముంబై నెవర్ స్లీప్స్‌ట”
ఆమె నవ్వి తనూ చెప్పులు వేసుకుని వచ్చింది. ఇద్దరూ నిశ్శబ్దంగా నడవసాగారు. చాలా పెద్ద సొసైటీ అది. ఇంకా మనుషులు తిరుగుతునే వున్నారు. ఇద్దరూ చాలాసేపు నడిచి, స్నాక్‍బార్‍లో చెరో టీ తాగి, తిరుగుముఖం పట్టారు.
“చాలా తెలివైనది” అన్నాడు.
“ఎవరు?” అడిగింది ప్రమీల.
“ఎవరిగురించి అన్నానో నీకు తెలుసు”
“చెప్పందే ఎలా తెలుస్తుంది?”
“పూర్తిగా చెప్తాను విని వూహించుకో” అన్నాడు గురుమూర్తి. “ఒక మంత్రగత్తెలా పెనుతుఫాన్ని పిల్లిపిల్లని చేసి గూట్లో దాచిపెట్టి నిబ్బరంగా వెనక్కి వెళ్ళి కూర్చుంది. అక్కడ కూర్చుని మంత్రదండం చూపించి ఆడిస్తోంది. మహతి విషయంలో వీళ్ళంతా కలిసి ఏదో చేస్తున్నారు. దాన్నలా రోజుకో వుద్యోగం చేసి సంపాదించుకొమ్మని వదలరు. వదలనివ్వదు”
ప్రమీల నిట్టూర్చింది.
“అప్పుడు సుధీర్‍మీదా మంత్రదండం ఆడించి వుంటుందని నా అనుమానం”
ఆమె జవాబేమీ చెప్పలేదు. ఇల్లు చేరారు.
మరుసటిరోజు మాధవ్ వచ్చి ఆయన్ని తనతో తీసుకెళ్ళాడు. అతని కోపాలూ, అలకలూ అన్నీ లోపల్లోపలే దాగిపోయాయి. పెద్దనాన్నంటే వున్న గౌరవం వెనక వదిగిపోయాయి. తన ఆఫీసు చూపించాడు. లీవు పెట్టి యివతలికి వచ్చి చాలాచోట్ల తిప్పాడు. గురుమూర్తి కుటుంబానికి ముంబై కొత్తకాదు. సుధీర్ పెళ్ళయాక చాలాసార్లే వచ్చారు. ఐనా మాధవ్‍తో అలా తిరగడం చాలా సంతోషాన్నిచ్చింది.
“మన పిల్లలు మనదగ్గిర వుండటానికి వీలుకుదరనప్పుడు దగ్గిరకి ఎవరొస్తే వాళ్ళనే మన పిల్లలనుకోవాలి. ప్రపంచం ఏమూలనించో ఓ పిల్ల అమ్మమ్మా అనీ, ఓ పిల్లాడు మామ్మా అనీ పలకరిస్తారు. ఆ పిలుపుల్ని అందుకోవాలి. లేకపోతే మనకి ఎవరూ వుండరు” అంటుంది ప్రమీల.
“మహీ విషయం ఏం చేస్తున్నార్రా? ఇక్కడుండి ఏం చేస్తుందట? అక్కడికి వచ్చేస్తే అందరం వుంటాంకదా?” అన్నాడు.
“ఇంకా ఏమీ అనుకోలేదు పెద్దనాన్నా! తనేమో ఇక్కడే వుంటానంటోంది. ఇల్లుకూడా తీసేసుకుంది. రిటైరయ్యాక వాళ్ళ నాన్ననే ఇటు రమ్మంది”
“అంత తేలికేమిట్రా, ఇల్లూవాకిలీ అలవాటైన వూరూ వదిలిపెట్టి రావటం? నారాయణ తెగ హైరానపడిపోతున్నాడు. ఐనా ముప్పయ్యేళ్ళు దాటాక ఏం వుద్యోగాలొస్తాయిరా? ఎమ్మే చదివిందిగానీ అది పెద్ద తెలివైనదికూడా కాదు”
“డాటా ఎంట్రీ వర్కేదో చేస్తోంది. నవల్లు దంచేస్తూ వుంటారుకద పెద్దనాన్నా వీళ్లంతా, మహీకి ఇంగ్లీషుమీద మంచి గ్రిప్పుంది. డీటీపీ వర్కు నేర్చుకుంటే మంచిదన్నాడు సుధీర్. భవిష్యత్తు కంప్యూటర్స్‌దే. అలాంటిదే ఫుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వుద్యోగాలు చెయ్యడం సాధారణమైపోయింది. చిన్న వూళ్ళలోనైతే పర్వాలేదు. ఇలాంటి పెద్దసిటీస్‍లో అలా ఇద్దరూ ఇంతంత దూరాలు తిరిగి వుద్యోగాలు చేసుకుంటూ వండుకుని తినడం కష్టమౌతుంది. ఫుడ్ ఔట్‍లెట్స్‌కోసం వెతుక్కుంటున్నారు. మన శక్తినిబట్టి ఈ రెండు ఫీల్డుల్లో అవకాశాలు వుంటాయి”
“మీ రింగ్‍లీడరు ఏమంటోంది?”
“వదినా?” చురుగ్గా అడిగాడు మాధవ్. వెంటనే సర్దుకున్నాడు. “ఫుడ్ ఔట్‍లెట్ అంటే మహీ ఒక్కర్తివల్లా కాదు. పెట్టుబడికూడా చాలా కావాలి. బాబాయ్ వచ్చాక ఆలోచించవచ్చు. రాణానికూడా కలిపేస్తే అందరూ సెటిలౌతారని వదిన ఆలోచన. ఇప్పటికైతే అందరం కలిసి తలో కొంతా వేసుకుని కంప్యూటరు, ప్రింటరు, సీడీ రైటరు అలాంటివేవో కొనిద్దామనుకుంటున్నాం పెద్దనాన్నా! కొన్నిరోజులు ఏదేనా యిన్స్టిట్యూట్లో చేరి నేర్చుకుంటే బైట చిన్నచిన్న వుద్యోగాలు చెయ్యనక్కర్లేకుండా యింట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆఫీసులన్నీ కంప్యూటరైజ్ ఔతున్నాయి. చాలా పని వుంటుంది. పార్ట్‌టైమ్ వర్కర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఐతే అందరికీ ఇవ్వగలిగినన్ని కంప్యూటర్లు అన్ని ఆఫీసుల్లోనూ వుండవు. స్వంత కంప్యూటరు వుండటం మహీకి ప్లస్ పాయింటౌతుంది. పని యింటికే తెచ్చుకుని చేసుకోవచ్చు” అన్నాడు. ఒక్క క్షణంలో తల తిరిగి చేతికొచ్చింది గురుమూర్తికి. ఈ ముడి ఇలా వేస్తుంది గీతని ఆలోచించలేదు.
నారాయణకి మగపిల్లలు లేరు. చేదోడువాదోడుగా తిరిగిన పెద్దల్లుడితో సంబంధం తెగిపోయింది. చిన్నల్లుడు పెద్దగా పట్టించుకోడు. తాడూ-బొంగరం లేకుండా వున్న రాణాని యిటు కలిపితే మాధవ్ మహతి బాధ్యతనుంచీ బైటపడతాడు. అతను స్థిరపడితే సంధ్యా, భర్తా సంతోషిస్తారు. వాసుకి రాణాతో ఏదో గొడవైందని చూచాయగా తెలిసింది. ఒకేవూళ్ళో వుంటూ గొడవలుపడటంకన్నా వాడిని అక్కడినుంచీ తప్పిస్తే వాసుకీ గొడవ తప్పుతుంది. తామంతా తమ యిళ్ళకీ, కుటుంబాలకీ పరిమితమైతే గీత ఈ అన్ని కుటుంబాలనీ కలిపి ఆలోచిస్తోంది. వాళ్ళనాన్న ప్రభావం కావచ్చు.
“దాన్ని భూమ్మీద పెడితే పంటలుండవు, ఆకాశంలో పెడితే వానలుండవు” అన్నాడు పెద్దగా నవ్వి.
“గీత భూమ్మీదే వుంది పెదనాన్నా! పంటలూ, వానలూ అన్నీ బానే వున్నాయి” అన్నాడు మాధవ్ తనూ నవ్వి.
ఇద్దరూ బైటే భోజనం చేసి రాత్రిదాకా వూరంతా తిరిగారు. సుధీర్, సుమంత్‍లకోసం ఆయన బెంగపడుతున్నాడనిపించింది మాధవ్‍కి. తనూ వాసూ గీతలనీ, అమ్మనీ అలాగే మిస్ చేస్తున్నాడు. ఎదిగిన మగపిల్లలు వెంటవెంట తిరగాలని తండ్రికి వుంటుంది. కానీ వాళ్ళని చదివించిన చదువులు ఆ అవకాశాలని యివ్వవు. మనసుల్లో ఈ వెల్తులు నిండిపోయి వంటరితనపు దు:ఖాన్ని పీల్చుకుని అవి చెమ్మగిల్లిపోతున్నాయి. సుధీర్ యూయస్‍లో వున్నాడు. గీతా వాసుల పెళ్ళప్పుడు వాళ్ళింట్లో గొడవలయ్యాయి. చిన్నచీలిక వచ్చింది. సుధీర్ని పైకి చదివించి గీతని యిమ్మని అడిగిందట ఆమ్మ. మామయ్యని అలా చదివించమని అడగడం తప్పని వాదించాడట సుధీర్. ఆ చీలిక అలాగే వున్నట్టుంది. అతని యింటికి వెళ్ళినా ఇమడలేక వచ్చేస్తారు వీళ్ళు. సుమంత్‍ ప్రాక్టీసుతో బిజీ. తండ్రికి విలువా గౌరవం ఇవ్వడనేం కాదు. సమయం యివ్వలేడు. అతని భార్య ఒక్కర్తే కూతురు కావడంతో అత్తవారివైపూ చూసుకోవాలి. ఒక్కొక్క జీవితానికీ ఎన్నెన్ని ముళ్ళో!
సరిగ్గా పదిరోజులుండి వెళ్ళిపోయారు ప్రమీల, గురుమూర్తి. మాధవ్ వెళ్ళి రైలెక్కించాడు. వాళ్ళు వెళ్ళగానే సుమతి దిగింది. తల్లిదండ్రులు అక్కడ వుండగానే రావాలనుకుంది, కానీ కుదరలేదు.


వెళ్ళేరోజు గురుమూర్తి చాలా గుంజాటనపడ్డాడు. ఇక్కడ నలుగురు మనుషులమధ్యనుంచీ వెళ్లటమంటే వెలుతుర్లోంచీ చీకట్లోకి వెళ్తున్నట్టుగా అనిపించింది. దిగులు తోచింది.
“పిల్లలిద్దరికీ బొమ్మలేవేనా కొనరా!” అని మాధవ్ చేతిలో వెయ్యిరూపాయలు పెట్టాడు. వద్దన్నా వినలేదు.
“పెద్దాపేరక్కలా ఆ చీరలేమిటే? సుమతి అవేవో డ్రెస్సులు వేసుకుంటోంది. నువ్వూ కొనుక్కో” అన్నాడు మహతితో.
“ఉన్నాయి పెద్దనాన్నా! నువ్వేమంటావోనని వేసుకోవట్లేదు” అంది మహతి. పెద్దవాళ్ళందరూ వస్తున్నారని నీలిమా బైటికి తియ్యట్లేదు. మహతికి ఐదువేలు చేతిలో పెట్టాడు.
“ఎందుకు పెద్దనాన్నా? నా దగ్గిర వున్నాయి” అంది ఆమె బిడియంగా.
“చిన్నప్పుడు మీకు లేదనే నా దగ్గిర చాక్లెట్లు తీసుకున్నావా?” అని కోప్పడ్డాడు.
“మీకేదో పెత్తనం యిచ్చారని వూరికే అటూయిటూ తిరిగెయ్యకండి. పెద్దవాళ్ళయ్యారు. జాగ్రత్తగా వుండాలి. పడితేనూ చేస్తేనూ ఈ వయసులో కష్టం” అని అత్తగారికి జాగ్రత్తలు చెప్పాడు. ఆవిడకన్నా పదమూడేళ్ళు చిన్నవాడు ఆయన. అంతే. అలా జాగ్రత్తలు చెప్పినందుకు సంతోషపడింది. తలూపింది. ఇన్నీ చేసినా మనసు నిండలేదు గురుమూర్తికి. ఏదో వెలితి. గీతగురించిన ఆలోచనతో మొదలైన వెలితి క్రమంగా మనసంతా నిండుతోంది. ఆలోచనలు పొంతన లేకుండా సాగుతున్నాయి. ఏ సంఘటన ఎలాంటి జ్ఞాపకాలతుట్టెని కదుపుతుందో తెలీదు.
ఏమిటి తన జీవితం? చిన్నప్పుడే తండ్రి మశూచితో పోతే వారాలు కుదుర్చుకుని చదువుకున్నాడు. చిన్నవుద్యోగం సంపాదించుకున్నాడు. త్రిమూర్తులి దృష్టిలో పడి, ప్రమీలని యిచ్చి చేసారు. ఆమె తన చెయ్యి అందుకోవటమే గొప్పవిషయం అనుకుంటే వుద్యోగంకూడా సంపాదించుకుంది. పేదవాడికి దొరికిన పెన్నిధి. ప్రమీలని బుజ్జగించో భయపెట్టో, ఆమె జీతం డబ్బులు బావమరిది తీసేసుకుంటాడేమోననే భయం వుండేది. అలా ఎప్పుడూ జరగలేదు. ప్రమీలనుంచి పైసా తీసుకోలేదు రామారావు. చాలా నిక్కచ్చైన మనిషి. క్రమక్రమంగా అతనింట్లో అందరికీ పెళ్ళిళ్ళయాయి. అలా ఎలా చేసాడో తనకి ఆశ్చర్యమే.
మొదట్లో అందరివీ చిన్నచిన్న జీతాలు. అవంతీపురం పల్లెటూరిలా వుండేది. అద్దెలు చాలా తక్కువ. ఇద్దరి జీతాలు కావడంతో తను అక్కడ యిల్లుకూడా కొనుక్కున్నాడు. తర్వాత అమ్మేసాడు. ఆఫీసులు దూరమైనా, పిల్లలకి చదువులకి అన్నీ దగ్గర్లో వున్నాయని అన్ని కుటుంబాలవాళ్ళూ ఆ చుట్టుపక్కల చేరారు. డబ్బుగురించిన భయం నిరంతరం వెంటాడుతునే వున్నా ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ వుండటం, తమకి పెద్దరికం యిచ్చి గౌరవించడం బాగానే వుండేవి. అందులోనూ పిల్లలు. ఇంటినిండా చిన్నాపెద్దా పిల్లల గుంపు. సందడిసందడిగా బావుండేది. తనకీ పిల్లలంటే యిష్టం. ఇక్కడ కేరంబోర్డూ, చెస్‍, చైనీస్ చెకర్ వున్నాయని పిల్లలంతా వస్తూ వుంటే గొప్పగా అనిపించేది. తర్వాత పిల్లల చదువులు. మరిప్పుడు?
గురుమూర్తి యిల్లని ఎవరూ వెతుక్కుంటూ రారు. రావడానికి సందర్భాలేం మిగిలి లేవు. తనేనా వెళ్తే సుధీర్ యిల్లు, సుమంత్ యిల్లు, సుమతి యిల్లు, మూడు కొత్తయిళ్ళు పుట్టుకొచ్చాయా? ఉన్న యిల్లు నాలుగ్గా చీలిపోయిందా? ఈ ప్రశ్నల వెనుక ఆయన మనసులో కదులుతున్నది గీత.
కుటుంబం నాలుగుగా చీలిందని తను బాధపడుతున్నట్టే చిన్నప్పటి స్నేహాలు విడిపోతున్నాయని గీత బాధపడుతోందా? ఏమిటీ పోలిక? ఆయనకి కలవరంగా అనిపించింది. పిల్లలే ఏమీ కాకుండాపోతున్నరోజుల్లో స్నేహితుల్ని కలిపి వుంచడం సాధ్యపడుతుందా? ఇప్పుడు తను పొందుతున్న శూన్యాన్ని గీత ముందే వూహించి, అనుభవించి, బాధని వాయిదా వేస్తోందా?
“చాలా తెలివితక్కువది” రైల్లో ఎక్కి కూర్చున్నాక అన్నాడు.
ఈసారి ఎవరని అడగలేదు ప్రమీల. “గీత తాళం పట్టించారేం?” అడిగింది నవ్వుతూ.
“హాయిగా పెళ్ళిచేసుకుంది. అందర్లా దాని బతుకేదో అది బతక్క, ఈ పెత్తనాలు దేనికి? ఈరోజుని చేస్తోందిగాబట్టి చేయించుకుంటారు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఏదేనా తేడా వస్తే అడగరా? అవసరం తీరాక? మనుషుల్ని ప్రేమించడం అనేది పులిస్వారీలాంటిది” అన్నాడు.
“ప్రేమ మత్తులాంటిది, ఎక్కితే దిగదని అంటారు?”


తల్లిదండ్రులిద్దరి వుద్యోగాలతో డబ్బుకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా, ఇద్దరు అన్నదమ్ముల ప్రేమతో అపురూపంగా పెరిగింది సుమతి. తనతో నవ్వుల్నీ సరదానీ తిప్పుకుంటుంది. వెళ్ళినచోటల్లా కాసిని వదిలిపెడుతుంది. కొత్త వుల్లాసాన్ని పోగుచేసుకుంటుంది. గీత పెళ్ళైన వెంటనే ఆమె పెళ్ళి జరిగింది. సుధీర్, స్నేహితుడి అన్నకి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, వివరాలు తెలుసుకుని తండ్రికి చెప్పాడు.
“ఎండీ చేసి, ప్రాక్టీసు పెట్టాడు. చాలా బాగుంటాడు. కుటుంబం మంచిది. దగ్గిర్నుంచీ చూసాను. మీరు వెళ్ళి మాట్లాడండి” అన్నాడు.
సుమతి అప్పుడే పెళ్ళేంటని గొడవచేసింది. మాస్టర్స్ అవగానే రిసెర్చి మొదలుపెట్టాలని ఆమె కోరిక. కొన్నేళ్లక్రితం పద్మ ఎదుర్కొన్న ప్రశ్నలనే ఆమెనీ అడిగాడు సుధీర్.
“నీకిప్పుడు ఇరవైమూడు. రిసెర్చికి ఎంతలేదన్నా ఇంకో నాలుగైదేళ్ళు. ఇరవయ్యేడు యిరవయ్యెనిమిదేళ్ళకల్లా చాలామంది మగపిల్లలకి పెళ్ళిళ్ళైపోతాయి. మిగిలినవాళ్ళలో ఎక్కువమంది జుట్లు నెరిసి, పలచబడి, అందం, ఆకర్షణ తగ్గిపోయి వుంటారు. నీకు ఎంపిక అవకాశం తక్కువ వుంటుంది. నువ్వు చేసే రిసెర్చి దేనిమీద? షెల్లీ సాహిత్యం, షేక్స్పియర్ సాహిత్యం, వీటిమీదేకదా? దేనికి వుపయోగపడుతుంది? సర్టిఫికెట్టు గోడకి తగిలించుకోవడానికేకదా? ఇంతా చేసి, ఎమ్మేలు, పీహెచ్‍డీలు చేసినవాళ్లందరికీ ప్రొఫెసర్ పోస్టులు వస్తున్నాయా? లేదు. క్లర్కులుగానూ, ఆఫీసర్లుగానూ ఏ వుద్యోగం దొరికితే దాంట్లో చేరిపోతున్నారు. దానికోసం పెళ్ళి వాయిదావెయ్యడం అవసరమా? నీకు లిటరేచర్‍మీద అంత అభినివేశం వుంటే చదవడం ఆపక్కర్లేదు. కావల్సినన్ని పుస్తకాలు కొనిస్తాను. చదువుకుంటూ హాయిగా గడపు” అన్నాడు. ఇరవయ్యేళ్ళ వయసులో విడీవిడని అమాయకత్వంతో పెళ్ళిపీటలమీద కూర్చున్న గీత రూపు అతని కళ్ళముందునించీ చెదిరిపోవట్లేదు.
“సుమా! జీవితం అన్నాక రెండిట్లో ఒకచోట రాజీపడక తప్పదు. పెళ్ళిదగ్గిరో, కెరీర్ దగ్గిరో. ఒకటి ప్రాకృతికమైనది, దాంతో ఎన్నో ముడిపడి వుంటాయి. ఇంకోటి వస్తుసంబంధమైనది. అది నీకు ఆనందాన్ని యివ్వగలదేమోగానీ, జీవితంలోని మౌలికతని పరిపుష్ఠం చెయ్యలేదు” ప్రమీలకూడా చెప్పింది. డాక్టరు సంబంధం అనేసరికి గురుమూర్తి ఇంకేం ఆలోచించలేదు. పెళ్ళికొడుకు పేరు విని మళ్ళీ గొడవచేసింది సుమతి.
“అదేం పేరు? అంతా ఏడిపిస్తారు నాన్నా!”
“నా పేరేమేనా గొప్పగా వుందేమిటి? మీ అమ్మ చేసుకోలేదా? వాళ్ళింట్లోలాంటి మంచిపేర్లు ఎంతమందికి వుంటాయి? రవణమ్మనో, వెంకటమ్మనో పెట్టేవాళ్ళు మా యిళ్లలో. నా పేరు గురువయ్యైతే గురుమూర్తని మార్చుకున్నాను. పేరులో ఏముంది? పిల్లవాడు బాగా చదువుకున్నాడు. సంపాదించుకుంటున్నాడు. అందగాడు. పేరుమీద అతనికే లేని అభ్యంతరం నీకెందుకు?” అని నచ్చజెప్పాడు. వినలేదు.
“నీ పేరే మార్చిపారేస్తాను, ఏమనుకున్నావో! అప్పలమ్మనో, పెంటమ్మనో పెట్టేస్తాను” అని అరిచాడు చివరికి విసుగేసి. అలా పెళ్ళిచూపుల ప్రహసనం మొదలై, పెళ్ళికి దారితీసింది. ఉద్యోగం చేస్తానని గొడవచేసింది పెళ్లయాక కొన్నాళ్ళు. దానికి ఆమె అత్తగారు జవాబు చెప్పింది.
“చూడమ్మా! కుటుంబాలు చాలీచాలని జీతాలతో బీదరికంలో కొట్టుకుపోతుంటే మాతరంలో కొందరం వుద్యోగాలు చేసాం. మగాళ్లని వడ్డుని పడేసాం. ఇప్పుడు నీకా అవసరం ఏం వుంది? ఇంటికి రెండేసి వుద్యోగాలు ఇవ్వగలిగే పరిస్థితి మన ప్రభుత్వానికి లేదు. రెండుజీతాలయ్యేసరికి అవసరాలు మారతాయి. కొత్తగా పుట్టుకొచ్చే డిమాండ్లని తీర్చగలిగేన్ని రిసోర్సెస్ మన దేశానికిగానీ, ఇంకా మాట్లాడితే ఈ మొత్తం భూగ్రహానికిగానీ లేవు. డిమాండ్ పెరిగి, సప్లై లేకపోతే ధరలు పెరుగుతాయి. అంటే ఒకళ్ళు ఉద్యోగం చేసి కొనుక్కోగలిగిన వస్తువులని అప్పుడు ఇద్దరు వుద్యోగం చేసి కొనుక్కుంటారు” అంది. మరో విషయంకూడా స్పష్టంగా చెప్పింది. “నీ భర్తది ప్రైవేటు ప్రాక్టీసు. వేళాపాళా వుండదు. నీదారిన నువ్వు వుద్యోగమని వెళ్ళిపోతే రేపు పిల్లలు పుడితే ఎవరు చూస్తారు? అదికూడా ఆలోచించుకోండి”
ప్రమీల మళ్ళీ కూతుర్నే కేకలేసింది. “దేనికే నీకు వుద్యోగం? బైటికెళ్ళి సంపాదించుకుని వస్తేనే ఆడవాళ్ళు గొప్పవాళ్ళా? నువ్వు ఆదాయవనరువి అని అర్థమయ్యాక మగవాడు నిన్నింక భార్యగా చూడ్డం మానేసి, తన బరువుకొంత మోపి, తనకీ, తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళూ, పిల్లలూ వున్న కుటుంబానికీ అన్నీ సమకూర్చే మనిషిని చేస్తాడు. చెప్పుకోలేక చెప్పలేదుగానీ, మీ అత్తగారు అలాగే బతికింది. నాకు బాధ్యతల్లేవుకాబట్టి నా సంపాదన మన కుటుంబంలోనే వుండిపోయింది. ఉద్యోగం చెయ్యడం అంత తేలికకాదు, ఆడవాళ్ళకి. ఇల్లూవాకిలీ సర్దుకుని, విస్తట్లోకి నవకాయపిండివంటలూ అమర్చి, ఎవరికీ ఏలోటూ జరక్కుండా చూసుకున్నాక అప్పుడు మనల్ని వుద్యోగానికి వదుల్తారు. అక్కడేం కూచోబెట్టి జీతం యివ్వరు. నీకేనా అంతే. మీకు ఎలాంటి బాధ్యతలూ లేవు. హాయిగా తిని తిరుగు. కనీసం కొన్నాళ్ళు. పిల్లలు పుట్టి, పెరిగి, కాస్త పెద్దవాళ్లయేదాకా. లేని సమస్యలు తెచ్చుకోకు” అంది.
“గీత చేస్తోందికదమ్మా?” అంది సుమతి.
“దానితో నీకు పోలికేమిటి? నలుగురున్న కుటుంబంలో వుంటోంది. పిన్నితో కలిసి పంచుకునేవే తప్ప, ప్రత్యేకించి చేసే పనులూ బాధ్యతలూ ఏమీ లేవు. అడిగేవాళ్ళూ లేరు. పిల్లలు పుట్టినా పిన్నో అత్తో చూసుకుంటారు. వాసుదికూడా పదింటికి వెళ్ళి, ఐదయ్యేసరికి వచ్చేసే వుద్యోగం. దానికి కుదిరినట్టు నీకెలా కుదుర్తుంది? ” అంది ప్రమీల.
ఇలాంటిమాటలు విన్నప్పుడు పురుషాధిక్యతగా కనిపిస్తుంది. పెళ్ళిచేసుకోవడం, పిల్లల్ని కనటం, పెర్పెచ్యువేట్ కావడాన్ని మించి ఆడవాళ్ళకి మరో ధ్యేయం లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. సమాజం అనేది మనం చేసుకున్న ఏర్పాటు. మాతృస్వామ్యం వున్నాకూడా పిల్లని కడుపులో మోసి కనాల్సింది ఆడవాళ్ళే. ఆ శిశువుని రెండేళ్ళో మూడేళ్ళో ఎత్తుకుని తిరగాలి. ఈలోగా ఇంకో శిశువు పుడుతుంది. వీళ్ళని మనం చేసుకున్న ఏర్పాటులో ఇమడ్చడానికి మనిషి జీవితంలో వుండే క్రియాశీలకభాగమంతా ఖర్చౌతుంది. ఇప్పుడు ప్రశ్న. ఆడవాళ్ళు కన్నాక మగవాళ్ళు పెంచవచ్చుకదాని. ఇది తలెత్తే ప్రశ్నే కానీ సరైన జవాబు వున్నదికాదు. కొద్దిమందికి చెందినదికానీ అందరికీ కాదు. కాబట్టి జవాబు సార్వజనీనం కాదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్టు సిస్టంగా వుండేవారు ఒకప్పుడు. అంటే అమ్మలు, అత్తలు పిల్లని చూసుకుంటే వీళ్ళు ఆఫీసులకి వెళ్లగలిగేవారు. వాళ్లతరంలో వాళ్ళుకూడా వుద్యోగాలు చేసి అలిసిపోతున్నారు. అప్పుడు?
కొన్నిరోజుల సుదీర్ఘమైన ఆలోచన తర్వాత అర్థమైంది సుమతికి, చదువనేది కేవలం వుద్యోగం చెయ్యడానికిమాత్రమే కాదు, తనది ప్రొఫెషనల్ కోర్సు కాదు, తనకి వుద్యోగం అవసరం లేదని. చదవటం ఆపలేదు. సంతోషపడటమూ ఆపలేదు. ఆమె స్వతహాగా సంతుష్టజీవి కావడం కొంతైతే భర్తనుంచీ అంటుకున్న సంతోషం మరికొంత.
ఇద్దరు పిల్లలు. పెద్దవాడు కొడుకు. ఆరేళ్ళు. తర్వాతిది పాప. పిల్లలని వొళ్ళో పెట్టుకుని వాళ్లతోపాటు వుయ్యాలలో వూగుతూనూ, వాళ్లు పడుక్కున్నప్పుడు ఏకాంతాన్ని ఆస్వాదిస్తూనూ చదువుతుంది. ఆ రసాస్వాదనలో పడ్డాక వుద్యోగం చెయ్యాలన్న కోరిక మళ్ళీ కలగలేదు.
ఇప్పుడు మహతికోసం పసిపిల్లని వేసుకుని ఒక్కర్తీ రావటం ఆమె భర్త ప్రేమకీ, సంస్కారానికీ లిట్మస్ పరీక్షలాంటిది. మహతిగురించి చెప్పి, వెళ్తానంటే అతను వద్దనలేదు. కొడుకుని ఆయా సాయంతో తను చూసుకుంటానని హామీ యిచ్చాడు. జాగ్రత్తగా వెళ్లమని చెప్పాడు. మధ్యలో రెండు స్టేషన్లలో తెలిసినవాళ్ళు వచ్చి పలకరించి, ఆమెకి భోజనం, పాపకి పాలకి ఫ్లాస్కులనిండా వేణ్ణీళ్ళూ అందించే ఏర్పాట్లూ చేసాడు.
మాధవ్ ఆమెకోసం ప్లాట్‍ఫాంమీద ఒకొక్క కంపార్టుమెంటూ చూసుకుంటూ నడుస్తుంటే వెనక బేక్‍పాక్, ముందు బేబీ కేరియర్, చిన్నస్ట్రాలీతో ఫస్ట్‌క్లాస్ కంపార్టుమెంటులోంచీ దిగింది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోగానే వాళ్ల ముఖాల్లో వెలిగిన వెలుగు అపురూపమైనది. తల్లిని హత్తుకుపోయి, నోరు చప్పరిస్తూ, అధరామృతాన్ని కారుస్తూ, మిలమిల్లాడుతున్న కళ్లతో మబ్బుతునకలా చూస్తున్న ఆమె కూతుర్ని చూడగానే చేతులు చాపాడు మాధవ్.
“అది ఎవరి దగ్గిరకీ రాదురా. నన్ను ఎవరేనా ముట్టుకున్నా కూడా ఏడుస్తుంది” అంది సుమతి.
“సేనిటైజర్లు వేసి బాగా పామి కడుగుతున్నారేమిటే, పిల్లని? మనుషుల్ని చూసి బేక్టీరియా, వైరస్‍లనుకుంటోదేమో!”అన్నాడు పకపక నవ్వి.
“ఎంత మిస్ చేసానురా, నీ నవ్వునీ, జోక్స్‌నీ” అంది సుమతి ఆప్యాయంగా అతని మోచెయ్యి పట్టుకుని. అతను ఆమె చేతిని ప్రేమగా నొక్కి వదిలాడు. ఆక్షణాన అతని మనసులో ఎలాంటి కోపం లేదు. ప్రకటిస్తున్న ప్రేమలో భేషజం లేదు.
“ముందు మహీ యింట్లో లగేజి పెట్టి, ఫ్రెషై, దాన్ని తీసుకుని వచ్చేస్తానేం? అమ్మమ్మని చూసికూడా చాలారోజులైంది” అంది. అతను తలూపి, మహతి ఫ్లాట్‍కి తీసుకెళ్ళాడు. ఆమెని అక్కడ వదిలిపెట్టి తమ యింటికి వస్తే, నీలిమ అడిగింది, “ఏరీ ఆవిడ?” అని.
“మహీతో కలిసి వస్తానంది” చెప్పాడు. ఆమె ముఖంలో స్వల్పంగా అసంతృప్తి. మాధవ్ వివరణ యివ్వలేదు. ఆరోజు లీవు పెట్టాడు. అదికూడా నీలిమ అసంతృప్తికి కారణమైంది. మహతి సంఘటనతో లీవు బాగా వాడుతున్నాడతను. డబ్బూ ఖర్చౌతోంది. తిరిగితిరిగి కోపమంతా గీతమీదికి మళ్ళుతుంది, ఇదంతా తమకి చుట్టినందుకు. అసలు దీనంతటితో తమకి సంబంధం ఏమిటి? మాధవ్ భయానికి పైకి అనదు. గవర్నమెంటు లీవు యిచ్చేది ఏడాది కష్టపడి పనిచేసినవాళ్ళు ఆనెలా విశ్రాంతి తీసుకుని కొత్తవుత్సాహంతో తిరిగి వస్తారని. కొన్ని డిపార్టుమెంట్లలో లీవురిజర్వు స్టాఫ్‍కూడా వుంటారు. లీవురిజర్వుని తగ్గించేసి, గవర్నమెంటు లీవు అమ్ముకోవడాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాక, ఎర్న్‌డ్ లీవుని డబ్బులెక్కల్లోనే చూస్తున్నారు జనం. ఇంత వివరంగా తెలిదుగాబట్టి నీలిమకూడా డబ్బులెక్కలే వేస్తోంది.
పార్ట్‍టైమ్‍గా చేస్తుండటంతో మహతికూడా ఆఫీసుకి వెళ్లద్దనుకుంది. ముందసలు మనుషుల్లో పడితే చాలని అనుకునేవాళ్ళేగానీ ఆమె వెనుక ఇలా లెక్కలు వేసేవాళ్ళు లేరు.
దాదాపు అరగంట తర్వాత సుమతి, మహతి కలిసి వచ్చారు. తమతో సమానంగా అల్లరి చేసి, అవంతీపురం అంతా బలాదూర్‍గా తిరిగిన ఆడపిల్లలు అమ్మలుగా రూపాంతరం చెంది, జిరాఫీపిల్లని పొట్టని కరుచుకుని తెచ్చినట్టు ఒకళ్ళూ, చేత్తో ఎత్తుకుని మరొకళ్ళూ వచ్చేసరికి తమాషాగా అనిపించింది మాధవ్‍కి. నీలిమకి సుమతీ తెలుసు. ఫంక్షన్స్‌లో కలుస్తుండేవారు. ఇలా ప్రత్యేకంగా చూడటం ఇదే మొదలు. ఇద్దరూ పిల్లల్ని నేలమీద దింపి కాస్త కుదురుకున్నారు. నీలిమతో పలకరింపులయ్యాయి. కాఫీ టిఫెన్లు కాసేపటికి వాయిదా వేసారు. సుమతి కూతురు ఏడుపు మొదలుపెట్టింది. మాధవ్ ఎత్తుకోబోతే మరింత గట్టిగా కంయిమంది.
“దాన్ని వదిలెయ్యరా, బాబూ! గీతగురించి చిన్నప్పుడు అత్త అనేదే, గాడిద కూసినా వూరుకోదని, ఆ బ్రాండు” అంది.
మేఘన బిజీగా యిల్లంతా పాకేస్తుంటే మాధవ్ కొడుకు తండ్రి కుర్చీ వెనక నక్కాడు. వాడిని పిలిచి ముద్దుచేసి, తనతో తెచ్చిన బొమ్మలు యిచ్చి, మిగిలిన యిద్దరి ముందూకూడా బొమ్మలు వేసి వూపిరి పీల్చుకుంది సుమతి. ఈలోగా మాధవ్ సుమతి కూతుర్ని అమాంతం గాల్లోకి అంత ఎత్తుకి లేపేసి, అక్కడే తైతక్క ఆడించి వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ పిల్ల కాస్త తికమకపడింది. ఏడవనా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయింది. నెమ్మదిగా తల్లివైపుకి చేతులు చాపి, ఆమె వొళ్ళోకి చేరిపోయింది. మళ్ళీ కిందకి దింపబోతే దిగలేదు. అలానే తల్లి వొళ్ళో నిద్రపోయింది.
“అమ్మమ్మనికూడా తీసుకు రావల్సింది. ఆవిడ ఒక్కర్తీ అక్కడెందుకు?” అన్నాడు మాధవ్.
“కాసేపయ్యాక వస్తానంది” అంది మహతి.
“ముహుర్తమేమిటో?”
“ఆవిడ వీపుదురదంటూ వుంటుంది. ఇదేవో క్రీములు తీసుకొచ్చింది. అవన్నీ రాయించుకుని హాయిగా వుందని పడుక్కుంది”
“మీ పిల్లల పేర్లేమిటి?” అడిగింది నీలిమ.
“వాడు యశూ… యశస్వి, ఇది తుషార” సుమతి జవాబు.
“బావున్నాయి పేర్లు. ఇదో వీడికి పంకజ్ వుదాస్ పేరు పెడతానన్నారు. మరీ అవంతీపురం పంకజ్ వుదాస్ అనీ, గండిపేట ఏఆర్ రహ్మాన్ అనీ పెట్టుకుంటే బావోదని దెబ్బలాడితే పంకజ్ దగ్గిర ఆగారు” చెప్పింది నీలిమ.
“ఎలా వున్నాడే మీ జోగేశ్వర్రావు?” అడిగాడు మాధవ్ వేళాకోళంగా.
“జో” అంది కోపంగా.
“అది నీకు. ఐనా నువ్వు జో జో అంటూ వుంటే అతను జోలపాడినట్టు నిద్రపోక ప్రాక్టీసెలా చేస్తున్నాడే? “
“డాక్టర్ కేజే రావ్” అంది ఇంకా కోపంగా.
“పేషేంట్లకి. మాకు జోగేశ్వర్రావే. ఏమే మహీ, పెళ్ళిపత్రికలో అలానే వుందికదా?”
“మహీ ఏం చూడలేదు. చూసినా చెప్పదు. మర్చిపోయింది. పోరా, పోయి, మీ నీలమ్మకి చెప్పుకో” అంది.
“నీలమ్మ… నీలూ! ఇదేదో బావున్నట్టుందే” అన్నాడు మాధవ్ పెద్దగా నవ్వి.
“ఉరుము వురిమి మంగలంమీద పడ్డట్టు ఇద్దరూ నా పేరుమీద పడ్డారేంటి?” నీలిమ చిరుకోపంగా.
“నీ గొడవ కాస్త ఆగి చూద్దాం. అసలు విషయం ఇంకొకటి వుంది” అని ఆమెని ఆపి, “ఇన్నిరోజులైంది మేం యిక్కడికి వచ్చి. ఒక్కసారికూడా మా యింటికి రావాలనిపించలేదే, నీకు?” నిలదీసాడు మాధవ్, సుమతిని.
“సుధీర్ పెళ్లైన కొత్తలో ఇక్కడికి బానే వచ్చాం. అప్పటికి మీరు ఇంకా రాలేదు. ఆ తర్వాత వాళ్ళు స్టేట్స్ వెళ్లడంతో ఆ పరుగులూ అవీ ఆపి, వూపిరి పీల్చుకునేసరికి పిల్లలు, హడావిడి. ఇప్పుడేనా హైకమాండ్ ఆర్డర్స్. బాబాయ్‍వాళ్ళూ షిఫ్టవడానికి పదమూడునెలలు పడుతుందని లెక్కేసుకుంది. మహతికి తోడుగా మామ్మ అక్కడ వుండిపోయింది, ఒకొక్కళ్ళూ నెలేసి రోజులు మీ అమ్మదగ్గర వుండి పండగ చేసుకోండని సీనియర్స్‌కి బంఫర్ అఫర్ యిచ్చింది. మిగిలిన నాలుగునెలలూ మామధ్య సర్దుబాటు చేసింది. రాక తప్పుతుందా?” అంది సుమతి.
“గీతకోసం వచ్చావుగానీ, నాకోసం కాదన్నమాట” అంది మహతి.
“ఏం ఫిట్టింగ్ పెట్టావే?” అంది సుమతి.
“పోవే. నీ మాటలు. నువ్వసలు గీతతో మాట్లాడుతున్నావూ?” అడిగింది మహతి.
“మాట్లాడకపోతేనేం? తను చెప్తేనేకదా, నేను యిక్కడికి వచ్చింది?”
“అసలు మీమధ్య గొడవేంటి సుమతీ? ఎందుకు మాట్లాడుకోరు?” అడిగాడు మాధవ్.
“గొడవ వుంటేనే మాటలు మానేస్తారా? లేకుండా కూడా మానెయ్యచ్చు. ఆదిదంపతులిద్దరూ ఆరేళ్ళు మానేసి చూపించలేదూ? ” అంది. ఆమె మాట దాటేస్తోందని అర్థమైంది మాధవ్‍కి. భార్య ఎదురుగా వద్దని తనూ వూరుకున్నాడు.
“ఎలా భరిస్తున్నాడే, ఇంత తిక్కలమేళాన్ని మీ జోగేశ్వర్రావు?” అడిగాడు నవ్వుతూ.
“నీలమ్మోవ్! ఇప్పుడు నీ కాఫీ టిఫెన్లేవో ఇస్తే తినిపెడతాం” అంది సుమతి.
నీలిమ లేవబోయి మళ్ళీ కూర్చుంది. “ఖర్మ. మీరే పేరుతో పిలిస్తే దానికే పలికేస్తున్నాను. ఇంకాసేపు మీ యిద్దరిమధ్యనా కూర్చుంటే నా పేరు మర్చిపోయేలా వున్నాను. మీ నీలమ్మెవరో ఆమెని పిలుచుకుని యిప్పించుకోండి” అంది.
“పేరు, పేరని ఇందాకట్నుంచీ ఒకటే గొడవ చేస్తున్నావు, నీ సర్టిఫికెట్లు తెచ్చుకోవే! అసలు నీ పేరేంటో చెక్ చేద్దాం” అన్నాడు మాధవ్.
“పేరేంటో తెలుసుకోకుండానే పెళ్ళి చేసేసుకున్నావా?” అడిగింది మహతి నవ్వుతూ.
“అంత ప్రేమలో పడిపోయాను” అన్నాడు మాధవ్. నీలిమ ముఖం చిరుసిగ్గుతో ఎర్రబడింది. అక్కడినుంచీ లేచి లోపలికి వెళ్ళింది. మహతి కాస్త యిబ్బందిపడింది. అతనికి పొరపాటు అర్థమైంది. భార్యాభర్తల మధ్య వుండే సరసాలు వాళ్ల ఏకాంతాన్ని దాటకూడదు. వెంటనే సర్దుకున్నాడు.
“బావకి కలుపు. మాట్లాడదాం” అన్నాడు సుమతితో. ఆమె ఫోన్ కలిపింది.
“చేరావా?” అడిగాడతను.
“మాటల్లో పడి ఫోన్ చెయ్యడం మర్చిపోయాను” అందామె. ఇద్దరూ రెండోవాళ్లదగ్గిరున్న పిల్లలగురించి అడిగి, తెలుసుకుని నిశ్చింతపడ్డారు. మాధవ్ మాట్లాడాడు.
“మీరూ రావలిసింది బావా! సరదాగా గడిపేవాళ్లం. చాలాకాలమైంది మిమ్మల్ని చూసి” అన్నాడు మాధవ్.
“సుమతి వున్నట్టుండి బయల్దేరింది. అలా రావడం నాకు వీలవదు. నా ప్రొఫెషన్ అనుమతించదు. మీకు తెలుసుగా? ఈసారి ప్లాన్ చేద్దాం” అన్నాడతను. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసారు. నీలిమ వంటింట్లోంచీ ప్లేట్లు తెచ్చి టీపాయ్‍ అందరికీ దగ్గరగా జరిపి, దానిమీద పెట్టింది. మాధవ్ వెళ్ళి నీళ్ళ జగ్, గ్లాసులు తెచ్చాడు. పిల్లలకి బిస్కెట్లు ఇచ్చింది.
“సో, ఎలా వుంది లైఫ్?” అడిగాడు మాధవ్. డబ్బు, ఆస్తులు ఎంత వున్నాయనేదాంతో సంబంధం లేకుండా ప్రమీల పిల్లలు ముగ్గురిదీ వీళ్ళందరికీ పూర్తిగా భిన్నమైన జీవితం. గీతకి వాళ్లది డబ్బుగర్వం అనిపించేది అదే. సుధీర్, సుమంత్‍ల జీవనశైలి కొంచెం అర్థమైనా, సుమతి ఎలా వుంటుంది, ఏం చేస్తుంటుందనేది వీళ్ళందరికీ కుతూహలం.
“ఉండటానికీ, క్లినిక్కీ కలిపి ఒకటే ఇల్లు లీజుకి తీసుకున్నాం. వంటకి మనిషుంది. పొద్దున్నా, సాయంత్రం వచ్చి వండి వెళ్తుంది. ఇంటిపని చేసి, పిల్లల్ని చూసుకుని, రోజంతా వుండటానికి యింకొకళ్ళున్నారు. యశూ స్కూలికి వెళ్ళేదాకా అందరం హడావిడిపడుతూ వుపగ్రహాల్లా వాడిచుట్టూ తిరుగుతాం. ఆ తర్వాత బావ తయారై క్లినిక్కి వెళ్ళేదాకా ఆయన చుట్టూ. ఆ లోకంలోకి తను వెళ్ళారంటే ఇవతలికి రావడం కష్టమే. మొదట్లో మధ్యమధ్యలో వచ్చేవారు. ఇప్పుడు ప్రాక్టీసు బాగా పెరిగిపోయింది. అక్కడికీ లెక్కగానే చూస్తారు పేషేంట్లని. కానీ మొహమాటాలుంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు. వీళ్ళంతా తన పర్సనల్ టైమ్‍లోకి చొరబడిపోతారు” అంది సుమతి.
“మరి రోజంతా నువ్వేం చేస్తావే? అసలు టైమెలా గడుస్తుంది?” అయోమయంగా అడిగింది మహతి.
“డ్రైవింగ్ నేర్చుకున్నాను. కారు చేతిలోనే వుంటుంది. ఎక్కడికి వెళ్ళినా వద్దనరు. పుస్తకాలు బాగా చదువుతానని ఎన్ని కొన్నా కాదనరు. పెద్ద కలెక్షన్ చేరింది నా దగ్గిర. టీవీ, సీడీ ప్లేయరు, సినిమా వీడియోలుకూడా చాలా వున్నాయి”
“ఒక్కళ్ళూ కూర్చుని సినిమాలేం చూడగలరు? పుస్తకాలు ఎంతకని చదవగలవు? అన్నిటితోపాటు సినిమాలు, పుస్తకాలుగానీ, అవే కాలక్షేపంకాదుకదా?
“సరదాగానే వుంటుంది మహీ, జీవితం. అప్పుడప్పుడు జో ఫ్రెండ్స్‌తో పార్టీలు. ఇద్దరం వెళ్తాం. ప్రెండ్సని అనను, నా సర్కిల్లో నాకు కిట్టీపార్టీలు. కొత్తకొత్త నగలు, చీరలు కొనుక్కుని చూపెట్టుకోవడం, ఇంకా లేటేస్ట్‌వి ఎక్కడొచ్చాయో తెలుసుకుని పోటీలుపడి కొనుక్కోవడం. చిన్నప్పుడంతా చూసిచూసి కొనుక్కునేవాళ్ళంకదా, ఇలా నచ్చినవన్నీ కొనుక్కోవడం థ్రిల్లింగ్‍గానే వుంటుంది. పుస్తకాలమీద నాలాగా ఆసక్తి వున్నవాళ్ళు నలుగురైదుగురు పరిచయం అయ్యారు. రీడింగ్ సర్కిల్ ఏర్పరుచుకుని చదివిన పుస్తకాలగురించి చర్చించుకుంటాం. అంతా వడిగా సాగిపోతున్న మధ్యలో ఒక్కసారి హఠాత్తుగా అనిపిస్తుంది, ఎక్కడో కొత్తచోటికి వచ్చాను, ఇంక తిరిగి వెళ్ళిపోవాలని. నా జీవితమే యిదని అర్థమయ్యాక తెల్లబోతాను. మీ అందరూ బాగా గుర్తొస్తారు. చిన్నప్పుడు ఏదేనా అందరం కలిసి చేసాము. ఇప్పుడేమిటో ఎవరికివాళ్ళం ఏడేడు సముద్రాల దూరాన వున్నట్టు, కలిసినా, మాట్లాడుకున్నా ఇంకా చెప్పాల్సింది చాలా మిగిలిపోయి వుండగానే అర్ధాంతరంగా ముగిసిపోయే కలయికలు. అవంతీపురంలో చిన్నప్పుడు చూసిన యిళ్ళలో చాలా యిళ్ళు అపార్టుమెంట్లుగా మారిపోతున్నాయి. కొన్నిటికి పక్కని వెనుకటి డాబా యిల్లుంటుంది. కానీ ఆ యింటికి యీ యిల్లు పొరుగిల్లు కాదు. రెండిళ్ళూ పక్కపక్కనే వున్నా కలవనంత దూరం. నాకు అలా అనిపిస్తుంది” సుమతి గొంతు చిన్నగా వణికింది.
మహతికీ, మాధవ్‍కీ గుండె లోపల్లోపల్లెక్కడో కదిలింది. నీలిమ ఆశ్చర్యపోయింది. మాధవ్‍కీ ఇలానే వుంటుందా? మగవాడు. పెళ్ళయ్యాకకూడానా?
“పెద్దవాళ్ళం అయాం. ఎవరిళ్ళు, జీవితాలూ వాళ్లవి. అలా దిగులుపడితే ఎలానే?” అనునయంగా అడిగింది మహతి, తనున్నచోటినుంచీ లేచి సుమతి పక్కని కూర్చుని , అనునయంగా దగ్గరికి తీసుకుని. ఆమె భుజంమీద తలవాల్చింది సుమతి. రెండు కన్నీటిచుక్కలు జారిపడ్డాయి.
“బావ బానే వుంటారా, సుమా? ఇందాకా ఏవో పార్టీలన్నావు, వెట్ ఈవెంట్సా?” సందిగ్ధంగా అడిగాడు మాధవ్. సుమతి చప్పుని సర్దుకుని కూర్చుంది. కళ్ళు తుడుచుకుంది.
“ఛ. అలాంటిదేం లేదురా! ఫెండ్స్ ఎంత బలవంతపెట్టినా తను తీసుకోరు”
“నువ్వు లేనప్పుడు?”
“అతన్నేమైనా అంటే కళ్ళు పోతాయ్. చెంపలేసుకో” అంది సుమతి నవ్వేస్తూ.
“మరింక ఏడుపు దేనికే? బావ మంచివాడు. చక్కటి జీవితం. సంతోషంగా వుండాలికదా?” మృదువుగా అడిగాడు మాధవ్.
“ఆక్సిమొరాన్లు ఇలానే వుంటాయి”
“నేను వెళ్ళి ఆవిడ్ని తీసుకొస్తాను. ఒక్కర్తీ బయల్దేరుతుందేమో” లేచాడు మాధవ్. అతని మనసులో ఆలోచనలు సాగుతున్నాయి.
తమ యింట్లో మొదట ఆరుగురు ఆడవాళ్ళు అన్న చూపించిన దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టారు. అప్పుడు మనుషులందరి కోరికలూ, ఆలోచనలూ ఒకేలా వుండేవి. ఏదో ఒకలా వుద్యోగం సంపాదించుకుని, పెళ్ళిచేసుకుని పిల్లల్ని కని బాధ్యతగా వుండటం మగవాళ్ళకీ, భర్త సంపాదించి తెచ్చినదేదో పొదుపుగా ఖర్చుపెట్టుకుని, సంసారాన్నీ, పిల్లల్నీ పైకి తెచ్చుకోవడం ఆడవాళ్ళకీ జీవితాశయాలుగా వుండేవి. ఆమ్మనుంచీ ఆఖరి పిన్నిదాకా పెద్దగా తేడా లేకుండా అలానే గడిపారు. అటుతర్వాత తమ బేచిలో నలుగురు ఆడపిల్లలు నాలుగుదారుల్లో ప్రయాణం మొదలుపెట్టారు.
గీత బంధాలమధ్య చిక్కుకుని వుంది. మహతి వైఫల్యాన్ని దాటే ప్రయత్నంలో వుంది. సుమతి అంత:పురంలో రాకుమారి. రవళి జీవనపోరాటంలో వురుకులూ పరుగులూ పెడుతోంది. ఆ తరువాత కదిలినవాళ్ళు ముగ్గురు- తమింట్లోంచీ తులసి, ప్రహ్లాద్ చెల్లెలు ప్రవల్లిక, వసంత్ చెల్లెలు సమీర. అందులో ఇద్దరు చిన్నాపెద్దా వుద్యోగాలు చేస్తున్నారు. సంపాదించుకుంటూ, ఖర్చుపెట్టుకుంటూ, ఏవో కొనుక్కుంటూ గడిపేస్తున్నారు. ఇంకో ముగ్గురు ప్రయాణానికి కొంచెం దూరంలో వున్నారు. వీళ్ళంతా సంతుష్టంగా వున్నారా అంటే సందిగ్ధమే. సమూలంగా మారవలసిన అవసరం ఎంతవరకూ వాళ్ళని రాజీకి తెచ్చిందో తెలీదు. మగపిల్లలకి ఈ కుటుంబంలో అనేకాదు, మొత్తం సమాజంలోనే చిన్నచిన్న సర్దుబాట్లు తప్ప, మౌలికమైన మార్పులు వుండవు. స్థిరమైన, నిలకడైన పరిస్థితి తమది. తమ యింటి ఆడపిల్లలనేకాదు, బయటినుంచీ వచ్చిన వాళ్లకికూడా ఈ స్ట్రగుల్ వుంటుంది. అందుకే నీలిమదగ్గిర అంత సామరస్యం చూపిస్తాడు. కానీ, నీలిమకి గీతతో పడదు. అదే పెద్ద విషాదం. మహతి మరోవిషాదం అనుకుంటే ఇప్పుడు సుమతికూడానా? తను సంతోషంగా లేదా? ఎందుకు ఏడ్చింది? అదేదో తేల్చుకోవలసిన విషయమేననిపించింది.
మాధవ్ వెళ్ళేసరికి విజ్జెమ్మ తాళం వేసుకుని బయల్దేరుతోంది.
“అనుకున్నాను, నువు బయల్దేరేస్తావని” అంటూ ఆవిడ చెయ్యిపట్టుకుని తనతో నడిపించుకు వెళ్ళాడు. వెళ్ళేసరికి సుమతి మామూలుగానే నవ్వుతోంది. నవ్వులూ, పరిహాసాలూ రువ్వుతోంది. ఐనా అతనికి స్థిమితంగా లేదు. తెలుసుకోవలసినది మిగిలినట్టే వుంది. ఆరోజు సాయంత్రందాకా అక్కడే వున్నారు. సుమతి కూతురు కొద్దిగా మాధవ్‍కి చేరికైంది. ఎత్తుకోనిచ్చింది. మిగతావాళ్ళనిమాత్రం తనని ముట్టుకున్నందుకు, తనకేసి చూసినందుకుకూడా బాగా కోప్పడింది.
“ఇక్కడే వుండిపోండి” అన్నాడు మాధవ్.
“మహీతో చాలా మాట్లాడాలిరా! ఎంతోకాలమైంది ఇద్దరం కలుసుకుని. మళ్ళీ ఎప్పటికి యిలా కలుస్తామో! రేపు మళ్ళీ వస్తాం” అంది సుమతి. మహతికికూడా ఆమెని నిలదీసి అడిగే విషయాలు వున్నాయి. నీలిమకి చురుక్కుమంది.
పిల్లలిద్దర్నీ పడుక్కోబెట్టాక అక్కచెల్లెళ్ళిద్దరూ తెల్లారేదాకా మాట్లాడుకున్నారు.
“ఇంక పడుక్కోండే! అర్ధరాత్రైంది”
“తెల్లారిపోతుంది”
“రేపంతా ఏం చేస్తారు?” అంటూ విజ్జెమ్మ అప్డేట్స్ ఇస్తున్నా ఆగలేదు వాళ్ల కబుర్లు. చిన్నప్పట్నుంచీ మొదలుపెట్టి ఎన్నో విషయాలు దొర్లాయి. ఎన్ని సరదాలు, ఎన్ని విహారాలు…
ఇక్కడికి వచ్చేముందు మహతి సమస్యని భర్తతో చర్చించింది సుమతి. అతను కొన్ని ప్రశ్నలు చెప్పి అడిగి తెలుసుకొమ్మన్నాడు. ఎలా అడగాలో, జవాబులు ఎలా రాబట్టాలో నేర్పించి పంపాడు. భార్యాభర్తలిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి విముఖత లేనప్పుడు కలపడంలో తప్పులేదని అతని ఆలోచన. అవి గుర్తుతెచ్చుకుంటూ ఏదో అడగబోయింది సుమతి.
“పుస్తకాన్ని తెరిచి చూపించినట్టు అందరిముందూ చెప్పేసాను. ఇంక చెప్పడానికేం లేదు. మనిద్దరం మాట్లాడుకోవాలంటే భర్తలూ, సంసారాలూ పిల్లలూ తప్ప ఇంకేమీ లేవా? ఇవేవీ, వీళ్ళెవరూ మన జీవితాల్లో లేనప్పుడు, మనంతప్ప మరెవరూ మన ఆలోచనల్లోకి రానప్పుడు ఎంత హాయిగా వుండేవాళ్ళం? ఇప్పుడేమిటో ఏదో తప్పు జరిగినట్టు, కష్టాలేవో ముంచుకొచ్చి మీదపడ్డట్టు అందరూ ఒకటే గుంజాటన పడుతున్నారు. నాన్నేమో అక్కడికి రమ్మంటాడు. ఆయన రిటైరయ్యేలోపు నేను వుద్యోగం తెచ్చుకోవాలట. లేకపోటే తట్టాబుట్టా సర్దెయ్యాలట. ఏమే? అక్కడికి వస్తే ఏం జరుగుతుంది? మేఘన అందుబాటులోనే వుంటుందికాబట్టి చీటికీమాటికీ వాళ్ళొచ్చి చూడటం, నేనేదో తప్పు చేసినట్టు దాని మనసులో ముద్రపడటం, ఇవన్నీ అవసరమా? ముప్పయ్యేళ్ళొచ్చాకేనా నా బతుకు నన్ను బతకనివ్వచ్చుకదా? ” అంది మహతి.
“పిల్లని యివ్వకపోతే?”
“ఎందుకివ్వరు? కోర్టులూ చట్టాలూ వున్నదెందుకు? న్యాయం చెయ్యడానికి కాదా? ఇచ్చేదాకా పోరాడతాను. అప్పుడు మీరంతా నాకు సపోర్టివ్వండి”
“కోర్టులూ చట్టాలూ అన్నీ వుంటాయి. కానీ నిరపేక్ష న్యాయం అనేది వుండదు. మనది మగవాళ్ళు అధికంగా అధికారంలో వుండే సమాజం. న్యాయాలన్నీ వాళ్ల కోణంలోంచే చూడబడతాయి. కొద్దోగొప్పో ఆడవాళ్ళున్నా, వాళ్ళుకూడా చాలావరకూ అలానే ఆలోచిస్తారు”
“పసిపిల్లని తల్లినుంచీ విడదీయమని ఏ చట్టం చెప్పదు. ఏ మనిషీ చెప్పడు. ఆ పిల్లకి తనంతట తను ఆలోచించుకునే వయసు వచ్చేదాకా ఆగుతారు. అప్పటి విషయం అప్పుడు చూడచ్చు. మీయింట్లో అంతా మెడికల్ ఫీల్డులో వున్నవాళ్లు. ఎలా చేస్తే పాప నాదగ్గిర వుంటుందో ఆలోచించండి. నాకు ఆరోగ్యం బాలేదని చెప్పి అవకాశంతీసుకుంటారేమో నరేంద్రావాళ్ళు” అంది. ఆమె అన్నీ లోతుగా ఆలోచించుకుందని అర్థమయ్యాక సుమతి ఇంకేం మాట్లాడలేకపోయింది.
“ఇవన్నీ సరేనే, నువ్వు గీతతో ఎందుకు మాట్లాడ్డంలేదు?” అడిగింది మహతి. ఎదురుచూసిన ప్రశ్నే. మొదట మాధవ్ అడిగాడు. అక్కడ నీలిమ వుండటంతో మాటదాటేసింది. ఇప్పుడిక చెప్పక తప్పదు.
“ఎప్పుడో ఒకప్పుడు నువ్వో గీతో అడుగుతారని తెలుసు. దాంతో ఎందుకు మాట్లాడాలి?” అంది.
“తను చాలా బాధపడుతోంది తెలుసా?”
“దేనికి బాధపడటం? కోరుకున్నవాడినే చేసుకుందికదా?”
“మనంమాత్రం చేసుకోలేదా?”
“రెండూ ఒకటేనా?”
“కాదా?”
“కాదు” స్థిరంగా వుంది సుమతి జవాబు. “మాఅమ్మ అడిగినదానికి ఎక్కడ వాళ్ల నాన్న వప్పేసుకుంటాడోనని కంగారుపడిపోయి వాసుని యిష్టపడుతున్నట్టు చెప్పేసింది. అంత చెడ్డవాళ్ళమా, మేం? అడగబోయేది స్వంత అన్నా, సుఖపడేది ఆయనకూతురూకాబట్టి అమ్మ ఒక ప్రతిపాదన తెచ్చింది. మామయ్య ఖర్చుపెట్టలేకపోతే పీడించి లాక్కునేవాళ్లలా కనిపించామా తనకి? ఎందుకే దానికా తొందర?” తీవ్రంగా వుంది ఆమె స్వరం.
“వాళ్ళిద్దరూ ఒకళ్లనొకళ్ళు ఇష్టపడ్డారు సుమా! వాసుని చేసుకుంటానని మొదటే చెప్పిందట”
“కొన్నేళ్ళపాటు వాళ్ళసలు మాట్లాడుకోనే లేదు. ప్రేమేమిటి? మామయ్యకి కష్టం వుండకూడదని తీసుకున్న ఛాయిస్ కావచ్చు. పెద్దవాళ్ళు చూసుకోవలసిన విషయంలో తను పెత్తనం చేసింది. ఈరోజు నీకు చెప్తున్నాను. ఈ విషయాలు బైటికి రాకూడదని చాలా జాగ్రత్తపడ్డాం. బైటికొస్తే వాళ్ళ నలుగురి జీవితాలూ తలకిందులౌతాయని భయపడ్డాం”
“??”
“సుధీర్‍కి తనంటే ప్రాణం. మాకసలు తెలీనే తెలీదు, వాడికి అలాంటి ఆలోచన వుందని. గీత పెళ్ళి కుదిరందని మామయ్య మాయింటికి వచ్చి చెప్పినరోజు చాలా గొడవైంది. చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. అమ్మని ఎన్నో మాటలన్నాడు. నాన్న తలదించుకున్నారు. అహర్నిశం కష్టపడి, వాళ్ల సొంత సుఖసౌఖ్యాలని మర్చిపోయి, మేము పైకి రావడమే జీవితాశయం అనుకున్నారు వాళ్లు. ఇద్దర్నీ బాధపెట్టాడు. చచ్చిపోవాలని ప్రయత్నం చేసాడు. ఏదో ఇంజెక్షన్ చేసేసుకుంటుంటే టైముకి సుమంత్ చూసాడు. ఆతర్వాతకూడా వాడిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నామో తెలుసా? ఇరవైనాలుగ్గంటలూ వంతులు వేసుకుని కాపలాకాసాం. అమ్మతో ఈరోజుకీ వాడు సరిగ్గా మాట్లాడడు. ఇండియా వచ్చినా, ముంబైలోనే వుండిపోతాడుగానీ అక్కడికి రాడు. వాళ్ళ పెళ్ళైన కొత్తలో రమ ఎన్నోసార్లు నన్నడిగింది, సుధీర్ ఎందుకలా మూడిగా, డల్‍గా వుంటాడని. సర్ది చెప్పాను. ఈ విషయం బైటపడితే తను కాపురం చేస్తుందా? వాసుమాత్రం గీతతో కలిసి వుండగలడా?” ఆవేశంగా అడిగింది. ఈ గొడవలు ఇంత వివరంగా తెలీదు మహతికి. అపార్ధాలు చోటుచేసుకున్నాయని అనుకున్నారు. అవి యివని యిప్పుడే తెలిసింది.
“సుధీర్‍ గీతని యిష్టపడుతున్నాడన్న విషయం మీకెవరికీ తెలీదన్నావు. గీతావాసుల విషయంకూడా అంతేకదా?” అడిగింది సున్నితంగా. సుమతి కంగుతింది ఆ ప్రశ్నకి. కొంత సమయంపట్టింది తేరుకోవడానికి.
“అదీ యిదీ ఒకటేనా?”
“వాసూగీతలు ఒకళ్ళనొకళ్ళు యిష్టపడ్డారనేది వాళ్ళ పెళ్ళప్పుడు బయటికి వచ్చిన విషయం. వరసైన ఏడుగురు మగపిల్లలమధ్య తనని చాలా బేలన్స్‌డ్‍గా పెంచారు. ఒక్కమాటు గుర్తుతెచ్చుకో. ఫంక్షన్సూ అవీ జరిగినప్పుడు అందరం వరసగా పక్కలేసుకుని మాట్లాడుకుంటూ పడుక్కునేవాళ్ళం. నువ్వు పక్కని లేకపోతే నిద్రపట్టట్లేదే అని ఏదో ఒక టైంలో గీతని మామయ్య పిలుచుకు వెళ్ళిపోయేవాడు. తనని ఎవరింట్లోనూ వదిలేవాళ్ళు కాదు. ఎంతరాత్రైనా వచ్చి తీసుకెళ్ళేవాడు. అందరూ వరసైన పిల్లలు దానికి. అందుకే అంత జాగ్రత్తగా పెంచారు. మనకి అర్థమయ్యేదికాదు. నాన్నకూచి అని వెక్కిరించేవాళ్ళం. అలాంటి క్రమశిక్షణ వుండటంచేతే వాళ్ళిద్దరూ ఒకళ్ళమీద ఒకళ్ళకి వున్న యిష్టాన్ని దాచుకున్నారు, సుధీర్‍లాగే. ఆ టైం వచ్చినప్పుడు చెప్పచ్చనుకుని వుంటారు”
“దాన్ని భలే సమర్ధిస్తావు నువ్వు”
“ఇందులో సమర్ధించడానికేం వుందే? సుధీర్ తనకోసం ప్రాణాలు తీసుకోబోయాడన్నది ఇప్పుడు నువ్వు చెప్తేకదా, నాకు తెలిసింది? వాళ్ళిద్దరి విషయం అంతే. మన మధ్య వున్నప్పుడు వాళ్ల ఇమోషన్స్ బైటపడతాయని భయపడి మాట్లాడుకోవడం మానేసారేమో! “
“…”
“ఒకరోజూ రెండురోజుల పరిచయాలు కావుకదా, మనవి? పుట్టినప్పట్నుంచీ కలిసి తిరిగాం. రెండుమూడు విషయాలు. వాళ్ళిద్దరిగురించి. మనందరం కలిసి తింటున్నప్పుడు వాసు ఎప్పుడు తినడం ఆపి, మంచినీళ్ళు తాగుతాడో గీతకి తెలుసు. వాడు నీళ్ళగ్లాసుకోసం వెతుక్కోవడానికి ముందే తను వాడిముందుకి తోసేది. నేను, ప్రహ్లాద్ ఒక ఆటలా గమనించేవాళ్ళం. అందరం ఎక్కడికేనా వెళ్ళినప్పుడు మగపిల్లలు వేగంగా నడిచేసి, మనం వెనకబడ్డామని ఆగేవారు. గీత పెత్తనాలు చేస్తూ నడిచేది. తన అడుగులచప్పుడు మాకు కలిసేదాకా వాసు ఆగిపోయేవాడు. గీత రాలేదని వీడికెలా తెలుస్తుందే, వీపుకి చెవులూ, కళ్ళుగానీ వున్నాయా అని విసుక్కునేది రవళి. అంత సునిశితంగా ఇద్దరూ ఒకళ్ళొకళ్ళకి తెలుసు. ఇవన్నీ సాధారణ విషయాలే కావచ్చు. మామూలు పరిశీలనో, అలవాటో, కాకతాళీయమో కావచ్చు. ప్రేమరంగు అద్దితే దృశ్యం మారిపోతుంది”
సుమతి ఈ కోణంలోంచీ ఎప్పుడూ ఆలోచించలేదు. తల్లిదండ్రులు బాధపడ్డారన్న కోపం, తను నమ్మిందే నిజమన్న మంకుతనం, ఆ కోణాన్ని పూర్తిగా మూసేసాయి. ఇప్పుడుకూడా ఆ కోణాన్ని ఆవిష్కృతం చెయ్యడానికి మనసు వప్పుకోలేదు.
“నువ్వన్నదే నిజం అనుకుందాం. వాసుకీ గీతకీ మధ్యని పెళ్ళికిముందు ఏమీలేదు. వాసుతో పోలిస్తే సుధీర్ చాలా మంచి మేచి తనకి. త్రాసుముల్లుమీద నిలబెడితే మనలో ఎవ్వరమేనా సుధీర్‍వైపే మొగ్గుతాం. సుధీర్ని చేసుకుని వుంటే ఈరోజుని అమెరికాలో వుండేది గీత. కాకపోయినా, నీలాగా హైసొసైటీలో తిరిగేది. వాళ్ల నాన్నమీది ప్రేమతోనే అనుకుందాం, వద్దనుకుంది. అది గొప్ప విషయం కాదూ? మనం ఎవ్వరం చెయ్యని పని అది. ఆ కోణంలోంచీ చూస్తే త్యాగంమాత్రమే కనిపిస్తుంది. వాసుకోసం వదులుకుంది అనుకుంటే అదొక గొప్ప ప్రేమకావ్యమౌతుంది. ఆ సౌందర్యం తను ఆస్వాదించడంలో తప్పేం వుంది?” అడిగింది మహతి.
“నువ్వు చెప్పినంతగా నేను ఆలోచించలేదు మహీ! తన పెళ్ళి మా కుటుంబంమీద చూపించిన ప్రభావం తక్కువది కాదు. గీతని చూసినా, తనతో మాట్లాడినా అవే విషయాలు గుర్తొచ్చి మనసు కలతబారుతుంది. వాళ్ళ పెళ్లయ్యాకకూడా అందరం చాలాసార్లు కలిసాం. ఫంక్షన్లకి రాకపోతే పెద్దవాళ్ళు వూరుకోరు. కారణం అడుగుతారు. చెప్పాలికదా? ఒకసారి, రెండుసార్లు… ప్రతీసారీ వెళ్ళకుండా వుంటే బావోదు. మొదట్లో వాసుముందు బైటపడకూడదనీ, తర్వాత రమకూడా వుందనీ ఎంత కంగారుపడేవాళ్లమో! సుధీర్ని రావద్దని చెప్పలేకపోయేవాళ్లం. వాడు రాకుండా వుండేవాడుకాదు. గీతని చూడటంకోసం. వాడి మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. కానీ దాన్ని వదల్లేనితనం. అది పరాయిదని వప్పుకోలేకపోయేవాడు. మనం ఆడపిల్లలం. మనమధ్య పెళ్ళిళ్ళైనా స్నేహం కొనసాగుతుంది. కానీ వాళ్ళిద్దరిమధ్యా అలాకాదుకదా?”
“గీతకికూడా మీ యింట్లో జరిగినవి తెలీవు. మీ సంబంధం వద్దన్నందుకు మీకు కోపం వచ్చిందనుకుంటోంది”
“…”
“గీత సుధీర్ని చేసుకుని వుంటే ఇలాంటి విషయాలే నేనూ మాధవ్ మాట్లాడుకునేవాళ్ళం. వాసుకూడా గీతని అంతగానూ యిష్టపడ్డాడు. వాళ్ళ పెళ్లై పదేళ్ళైంది. జరిగినదాన్ని తిరిగి రాయగలిగే అవకాశం ఎంతమాత్రం లేదు. అలాంటప్పుడు ఈ కోపాలు దేనికి? తన జీవితం తనకి నచ్చినట్టు గడుపుతోంది. మనందరికీ వున్న స్వతంత్రం తనకీ వుంటుందికదా? తన నిర్ణయాన్ని గౌరవించే అవసరం మనకి లేదా? ఎప్పుడూ విడిపోకూడదని ఒట్లు పెట్టుకున్నాం. పోనీలే నాన్నా, అది తెలివితక్కువదని ఒక్కమాట అనేస్తే పెద్దనాన్న కాదంటాడా? ఆమ్మ కాదంటుందా?” అంది.
సుమతి ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని మృదువుగా పెదాలకి తాకించుకుంది. ఆమె మనసు ఇప్పుడు ప్రకాశవంతంగా వుంది.
“ప్రేమంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది” అంది ఫక్కుని నవ్వి. “జో ఎప్పుడు మంచినీళ్ళు తాగుతాడో గమనించుకోవాలి. నేను నడకలో వెనకబడ్డప్పుడు తను నాకోసం ఆగాడో లేదోకూడా చూసుకోవాలి”
“పదోతరగతిలో లెక్కలుకూడా బట్టిపట్టి రాసిన బేచి మనది” అంది మహతి.
వీళ్ళు నలుగురూ చదువులు అలాగే చదివారు!! కాస్త వెనకాముందూగా. ఒకళ్ళనొకళ్ళు ఆదర్శంగా తీసుకుని. వీళ్ళకి పరీక్షలంటే మగపిల్లలంతా స్కూలు చుట్టుపక్కలా, గోడలెక్కి దూకుతూనూ, తప్పించుకుంటూనూ వుండేవాళ్ళు. చిట్టీలు అందించడానికి.
“మీ మొద్దుమొహాలేవైనా ఎగ్జామ్స్ రాస్తున్నాయేమిట్రా, మీరంతా ఇక్కడ చేరారు?” అని వేళాకోళం చేసేవాళ్ళు తెలిసినవాళ్ళు. ఇవి పిల్లలకి సంబంధించిన రహస్యాలుగానే వుండిపోయాయి.


మహతి అంత చెప్పాక సుమతికి మనసు కాస్త తేలికపడిందిగానీ, వైమనస్యం పోలేదు. దాన్ని అలాగే పట్టి వుంచే బలమైన కారణాలు వున్నాయి. మాట్లాడుతూనే ఇద్దరూ నిద్రపోయారు. మర్నాడు మాధవ్ ఆఫీసుకి వెళ్ళి సెలవు పెట్టి చార్జి యిచ్చి వచ్చాడు. అతనిక్కూడా సుమతితో గడపాలనుంది.
“ఇలా తోచినప్పుడల్లా సెలవు పెడుతున్నారు, ఉద్యోగం వుంటుందా అసలు?” అని దబాయించింది నీలిమ.
“ఉద్యోగం ఎక్కడికీ పోదు. నీకా భయం అక్కర్లేదు. మహా ఐతే రాజస్థాన్ బ్రాంచికి వేస్తారు. చల్ మోహనరంగా అని వెళిపోదాం” అన్నాడు.
“బానే వుంది!” అని, “మీ అక్కగారు ఏకంగా వుద్యోగమే మానేసినట్టుంది?” అడిగింది మహతిగురించి.
“తను డెయిలీ వేజెస్‍మీద పనిచేస్తోంది. అది మానేసినా వాళ్ళు వదులుకోరు. టైపులో మంచి స్పీడుంది. డిజిటైజేషన్ ఔతోందికదా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిచేసేవాళ్ళు కావాలి గవర్నమెంటుకి”
నాలుగురోజులు ముంబాయంతా చెడతిరిగేసారు. విజ్జెమ్మ తిరగలేనని యింట్లో వుండిపోయింది. ఆవిడకి వండిపెట్టి, తాము తినేసి బయల్దేరేవారు. మాధవ్ ఖర్చులు పెట్టబోతే సుమతి వప్పుకోలేదు. “చిన్నప్పట్నుంచీ ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడూ అంతే. అలాగైతేనే ఎంజాయ్‍మెంటు వుంటుంది” అంది కచ్చితంగా. నలుగురూ కలిసి తిరగడం అందరికీ చాలా వుత్సాహాన్నిచ్చింది. నీలిమకి వాళ్ళ చిన్నప్పటిరోజుల్లోకి తొంగిచూస్తున్నట్టో కాలు పెట్టడానికి సందుదొరికినట్టో అనిపించింది.
“సుధీర్ అత్తగారింటికి వెళ్ళాలి. వాళ్ళు వచ్చే నెల్లో యూయస్ వెళ్తున్నారు. అక్కడికి పట్టుకెళ్లడానికి కొన్ని వస్తువులు ఇచ్చి రావాలి” అంది సుమతి వెళ్ళే ముందురోజు.
“ఈమధ్యనే వాళ్ళింటికి అందరం వెళ్ళివచ్చాము. మళ్ళీ బెటాలియనంతా కదిల్తే బావోదు. మనిద్దరం వెళ్ళొచ్చేద్దాం” అన్నాడు మాధవ్. అలాగే అతన్తో వెళ్ళి వస్తూ షాపింగ్ చేసి వచ్చింది. నీలిమకీ, మహతికీ, పిల్లలకీ డ్రెస్సులూ, విజ్జమ్మకి చీరా తీసుకుంది.
“ఇన్ని బట్టలు ఎందుకే, నాకు?” అంది మహతి మొహమాటంగా.
“బైటికి వెళ్తావు, మంచిడ్రెస్సులు వుండాలి. బస్సులు, లోకల్ ట్రెయిన్లూ ఎక్కి దిగేప్పుడు చీరలైతే కాళ్లకి బంధాలు పడతాయి. ఇవి ఫ్రీగా వుంటాయి. నాన్నకూడా చెప్పారు ఈ విషయం. మహీ! నువ్వు నిలదొక్కుకుని మళ్ళీ ఎప్పట్లా కనిపించాలి. అందరం అందుకే ఎదురుచూస్తున్నాం” అంది దగ్గిరకి తీసుకుని.
నీలిమ చీరపెడితే, “ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం” అంది నవ్వేసి. నీలిమకూడా నవ్వింది. సుమతి ఆమెకి చాలా నచ్చింది. గీత- రవళి- మహతిలకన్నా, భిన్నంగా వెలుగులు చిమ్ముతున్నట్టు. కనిపించే వస్తువు, చూసే చూపునిబట్టి భావాన్ని అద్దుకుంటుందని ఆమెకి తెలీదు. సుమతికి తిరుగుప్రయాణానికి టికెట్టు వుంది. మాధవ్ తనుకూడా చేయించుకుని బయల్దేరాడు. ఆమె రావడం ఎంత ఒక్కర్తీ వచ్చేసినా, అలా తిరిగి పంపడం మర్యాద అనిపించలేదు. విజ్జెమ్మకూడా సమర్ధించింది.
“అమ్మని తీసుకొస్తాను. రెండుమూడు నెలలుంటుంది” అన్నాడు.
“మరి పిల్లలు?” అడిగింది నీలిమ.
“వాళ్ల స్కూలికీ వీళ్ళు రావడానికీ గంట తేడా వుంటుంది. అమ్మ ఎక్కడికేనా వెళ్తే ముందుగదికి విడిగా తాళం వేసి తాళంచెవి మయూఖ్‍కి మొలతాడుకి కట్టేస్తారు. వాడికి తాళం తీసుకోవడం వచ్చు. అక్కడే బట్టలూ, తినడానికీ పెడితే పెరట్లోకి వెళ్ళి, కాళ్ళూ చేతులూ కడుక్కుని, బట్టలు మార్చేసుకుని స్నాక్స్ తినేసి ఆటలకి వెళ్ళిపోతారు”
“భలే పెంచుతోందిరా, మీ వదిన వాళ్లని” అంది సుమతి.
“ఆవిడెవరు?” చురుగ్గా అడిగాడు మాధవ్.
“వాళ్ల పెళ్ళిలోనేగా మనందరికీ తాఖీదులు జారీ అయ్యాయి, ఇంక వరసలు పెట్టి పిలుచుకోవాలని” ఆమె తగ్గలేదు.
“వాసుని చేసుకుని వదిన్నని దబాయిస్తోంది. అందరికంటే తనే చిన్నది” అన్నాడు కోపంగా. సుమతి నవ్వేసింది ఆ కోపం చూసి.
“అంటే?” అడిగింది నీలిమ ఆరాగా. ఇంతకుముందుకూడా ఎందర్నో ఎన్నోసార్లు అడిగితెలుసుకుంది ఆ విషయాన్ని. ఇప్పుడుకూడా లెక్కలేమీ మారలేదు.
“వసంత్, రవళి, గీత. ఇదీ వరస. నెలలు తేడా వాళ్లకి. ఎప్పుడూ రెండో మూడో వుయ్యాలలు వూగుతూ వుండేవి, మా మామయ్య యింట్లో. హాల్లో వాసానికేసి చీరల్తో కట్టేవారు వుయ్యాలలు. ఇప్పుడు వీళ్ళకంటే స్టాండు వుయ్యాలలు కొంటున్నాంగానీ, అప్పుడన్నీ అవే” అంది మహతి. చెల్లెలి భర్త, వసంత్‍కంటే కూడా గీత చిన్నదవడం నీలిమకి డైజెస్టవదు.
“సరిగ్గా మూడురోజులే నీలూ! రెండువైపులా ప్రయాణం, అమ్మని తీసుకుని రావడం. అంతే. మహీ, అమ్మమ్మా, ఇక్కడికి వచ్చేస్తారు. మేనేజి చెయ్యగలవుకదూ? ఏ అవసరం వచ్చినా దేశపాండేకి ఫోన్ చెయ్యి. ఎంత? మూడురోజులు. చూసుకోగలవుకదూ? ” అని తెగ జాగ్రత్తలు చెప్తూ వుంటే-
“ఏమిట్రా, నీ చాదస్తం? నాన్నా, మీరు పెళ్ళిళ్ళు చేసుకోకముందునించీకూడా మేం బతికే వున్నాం. స్వతంత్రంగా పనులు చేసుకున్నాం” అంది సుమతి విస్తుబోయి.
“ఇద్దరు పసిపిల్లలూ, ఒక పెద్దావిడా కదే?” అన్నాడు మాధవ్.
“మహతికూడా వుంటుందికదరా?”
మహతికి ఎందుకో ఇంక అక్కడ వుండాలనిపించలేదు. మాధవ్ నీలిమపట్ల చూపిస్తున్న ప్రేమా, జాగ్రత్తా కలవరపెడుతున్నాయి. ఇలాంటి ప్రేమా, అనునయం తనకీ నరేంద్రకీ మధ్య పెద్దగా ఎప్పుడూ లేవు. ఇంట్లో అతని తల్లిది పెత్తనం. డైరెక్షను అతని అక్కది. తమది చాలా పరిమితమైన స్పేస్. రెండేళ్ళు కనురెప్పలమీద నిలిచి కరిగిపోయిన స్వప్నంలా గడిచిపోయాయి. ఆ తర్వాత? మసగ్గా వుండే బెడ్‍లాంప్ వెలుతుర్లో కాంక్షతో నిండిన అతని కళ్ళు, ఆశించినది దొరక్క అతని కోపం, అది మనసులో పెట్టుకుని తెల్లారి లేచినదగ్గర్నుంచీ సూటిపోటిమాటలనడం, పిల్లిమీదా ఎలకమీదా పెట్టి తిట్టడం. ఆఖరికి కొట్టడం. కళ్లలో పల్చటి కన్నీటి పొర కదిలింది.
“అమ్మమ్మ ఒక్కర్తే వుంది. నేను వెళ్తున్నాను” అని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది.
“ఏమైందే? అక్కడేమైనా అనుకున్నారా?” ఇంటికి వచ్చి, మంచానికి అడ్డంపడి, కళ్ళమీద మోచెయ్యి ఆనించుకుని కన్నీళ్ళు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే విజ్జెమ్మ అడిగింది. అదేం లేదన్నట్టు మహతి తల అడ్డంగా వూపింది. ఆవిడ వెళ్ళి వాకిలి తలుపు పెట్టేసి వచ్చింది.
“మరింక ఈ ఏడుపు దేనికి? వెళ్ళి ముందు మొహం కడుక్కుని రా! వాళ్లెవరొచ్చినా బావుండదు” అంటే లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది.
“చూడు, నువ్వు అడుగుపెట్టింది ముళ్ళదారిలో. వంటరితనం, చుట్టూ వున్నవాళ్ళు నవ్వుతూ తిరుగుతుంటే మనసులో కలుక్కుమనటం, నేనెందుకిలా అని ప్రశ్నించుకోవడం, జవాబు దొరక్క అసహనం, కోపం, ఇవన్నీ కాళ్లకింది పల్లేరుకాయలు. వాటిని నవ్వుతూ తీసెయ్యగలగాలి. నువ్విలా ఏడవటం ఎవరేనా చూసారనుకో, వాళ్లని చూసి అసూయపడుతోందంటారు. నీ బాధ ఎవరికీ అర్థం కాదు. అక్కర్లేదుకూడా. నీ కళ్ళలోంచీ కారే కన్నీళ్ళకిమాత్రం అర్థాలు తీస్తారు. నువ్వో వుంగరం చేతిలో పెట్టి, నాలుగు మంచిమాటలు అనేసరికి మురుసుకుంటోంది నీలిమ, తనే అంటుంది”
“మాధవ్ పైవాడా అమ్మమ్మా! వాళ్ళిద్దర్నీ చూస్తే సరదాగానే వుంటుంది. అసూయదేనికి? ఎవరి ప్రాప్తం వాళ్లది. ఎందుకో ఒక్కసారి నిస్సత్తువగా అనిపించింది” అంది మహతి.
“నేను చెప్పిందీ అదే. నీకింకా ఈ ప్రపంచం ఏమీ తెలీదు. ఎంత బాధైనా మనసులోనే దాచుకుని నవ్వుతూ తిరగడం నేర్చుకో. మరీ అవతలివాళ్ళు ఇబ్బందిపెడితే చురకపెట్టడం కూడా రావాలి. అది గీతని ఎంత రాచి రాపాడిందో తెలుసా? అక్కచెల్లెళ్ళు ముగ్గురూ ముగ్గురే. వాళ్లమ్మ మంచిదే పాపం. వీళ్ళే ఇలా. ఇటు దీన్ని అదుపుచెయ్యలేక అటు గీత కన్నీళ్ళు చూడలేక మాధవ్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చేసాడు. గొడవలేమిటంటే ఏమీ లేవు. వడ్లగింజలో బియ్యపుగింజ. అది ఏం చేసినా దీనికి నచ్చదు. చిన్నప్పట్నుంచీ అది మనింట్లో ముద్దుకదూ? దాని మాటలకీ పనులకీ సంతోషపడేవాళ్ళే అందరూను. ఈ పిల్ల ఓర్చలేదు. అది తిండిపుష్ఠిగల మనిషి. దీనికి వెటకారం. సుమతి మాత్రం? నాకు నువ్వెంతో అదీ అంతేకదా? కాస్త సిరి అందుకునేసరికి కళ్ళు నెత్తికెక్కాయి. గీతకి లేనిదేమిటి, వీళ్ళకి వున్నదేమిటి? రెండిళ్లకి మహారాణీ అది. ఇంటిని ఆనుకుని వున్న ఆరుసెంట్ల స్థలం దానికి రాసాడు మామయ్య. పొలాలు కొన్నారు. రెండు జీతాలు. ఉన్న వూళ్ళో ఇద్దరికీ వుద్యోగాలు. చక్కగా ఇద్దరు పిల్లలు. రాజభోగం అనుభవిస్తోంది అది” అంది అక్కసుగా. ఆవిడకి మనవరాలంటే గీతే. మిగిలినవాళ్ళు ఆమె తర్వాతే.
“అదేం లేదు అమ్మమ్మా! సుమ ఏమీ మారలేదు. సుధీర్ని కాదందని గీత విషయంలో కొంచెం కోపం అంతే. నిన్న చాలాసేపు నచ్చజెప్పాను. నాది తప్పే. ఇలా బైటపడకూడదు. నీలిమతో జాగ్రత్తగానే వుంటాను” అంది మహతి.
కాసేపటికి సుమతి వచ్చింది.
“అదేంటే అలా వచ్చేసావు?” అడిగింది, కూతుర్ని కింద దింపి. ఆ పిల్ల మేఘనతో కలబడింది. “దీని అఘాయిత్యం కూలా!” అని విజ్జెమ్మ నవ్వసాగింది. మహతి ఇద్దర్నీ విడదీసింది.


సుదీర్ఘమైన ఏకాంతం మాధవ్‍కి, సుమతితో. అడగాల్సినవీ, మాట్లాడాల్సినవీ ఎన్నో వున్నాయి అతనికి. కూపేకాబట్టి ఇద్దరే వున్నారు. తుషారని సీటుమీద దింపాక నిమ్మళంగా కూర్చుంది సుమతి.
“ఇప్పుడు చెప్పవే, అసలు గీతతో గొడవేంటి మీకు? వాళ్ల పెళ్ళై పదేళ్ళైంది. సుధీర్ పెళ్ళికూడా అయింది. ఇద్దరికీ పిల్లలు. ఇంకా అదే కోపాన్ని చూపిస్తున్నారా?” అడిగాడు.
“ఆ విషయం తేల్చుకోవడానికే ఇంత ఖర్చుపెట్టుకుని నాతో వస్తున్నావా? గీత చెప్పిందా?” అడిగింది సుమతి.
“ఖర్చేమీ లేదు. ఎల్టీసీ పెట్టాను. గవర్నమెంటు ఇచ్చేస్తుంది. నిన్నొక్కదాన్నీ పంపడం యిష్టంలేక వస్తున్నాను. అలాగే అమ్మనికూడా తీసుకురావాలి. ఇద్దరమే వున్నాంకాబట్టి అడిగాను. దిగెయ్యమంటే దిగేస్తాను”
“నిన్నరాత్రంతా మహీ ఇదే చెప్పింది నాకు. ఇప్పుడు నీ వాయింపా?”
“వద్దైతే. చెప్పకు. అలా కోపాలు చూపించుకుంటూ అమ్మమ్మలూ, అవ్వలూ, తాతమ్మలూ ఐపోండి. మనమధ్య కోపాలేమిటి సుమా, ఎప్పుడో జరిగిపోయినవాటికి?”
“కోపమని నేను చెప్పానా? ? మా అమ్మ అనవసరంగా బ్లేమైందని బాధ తప్పిస్తే?”
“కౌంటర్ బ్లేమ్ గీతమీదకూడా పడిందికదా?”
“నిజంకాదా?”
“ఏ నిజం?”
“రవిమామ యింట్లో గీత ఏం చెప్పింది? మేం ఎక్కువ కట్నం అడుగుతామంది. వాళ్ళ నాన్న ఇవ్వలేడని చెప్పింది. తన పెళ్ళికోసం ఇల్లమ్మడం యిష్టం లేదంది. ఇవన్నీ అయాకకదా, వాసుని చేసుకుంటానన్నది? వాడంటే ప్రేమ వున్నదైతే మొదటే ఆ విషయం చెప్పాలి. వాసుని తప్ప ఇంకెవర్నీ చేసుకోనని తెగేసి చెప్పాలి”
“రవిమామకీ గీతావాళ్ల నాన్నకీ పడదు. ఆ విషయం నీకూ తెలుసు. పెద్దమామయ్యమీద అటాక్‍తో ఆయన ఆట మొదలుపెట్టివుంటాడు. గీత వాళ్ళ నాన్నమీద ఈగకూడా వాలనివ్వదు. అది డిఫెన్స్‌తో ఆట పూర్తిచేసింది. అప్పటికే వాళ్ళ నాన్నకి చెప్పిందట వాసు విషయం. రవిమామకీ చెప్పింది. మాకింకా తెలీదు. ఇక్కడ మాయింట్లో వాసుని పెళ్ళిచేసుకొమ్మంటే వాడు గీతని చేసుకుంటానన్నాడు. తనని సుధీర్‍కి ఇస్తారన్న అనుమానం మాకూ వుండేది. అలా జరిగితే నువ్వింక ఆ విషయం మర్చిపోవాలన్న కండిషన్ పెట్టి అమ్మ మామయ్యని అడిగింది. ఈ మొత్తంలో గీత తప్పేమిటో నాకు అర్థమవట్లేదు”
“అమ్మ సుధీర్ని చదివించమందనేకదా, గీత అలాంటి నిర్ణయం తీసుకుంది? అదేదో మామయ్యద్వారా బైటికి వచ్చివుంటే బావుండేది. పెద్దవాడుకదా, ఆయన చెప్తే అమ్మా, నాన్నా అంత బాధపడేవారు కాదు”
“ఏ విషయాన్నేనా మొదటిసారి చెప్పినప్పుడు మాత్రమే సంకోచాలూ, తడబడటాలూ, టైమింగ్ చూసుకోవటాలూ వుంటాయి. ఆ తర్వాత అది అన్ని విషయాల్లాగే మామూలుదైపోతుంది”
“అంటే?”
“మాయింట్లో గొడవలు నీకు కొంతవరకేనా తెలుసనుకుంటాను. మానాన్న మొదట్లో బానే వున్నా తర్వాత భక్తిలోపడి యిల్లూ అదీ పట్టించుకోవడం మానేసారు. ఒకసారి యిల్లొదిలిపెట్టి వెళ్లిపోయారు. త్రిమూర్తులుగారి సాయంతో మామయ్య ఆయన్ని వెతికించి తీసుకొచ్చాడు. ఆ సమయంలో మామయ్య మాయింటికి తరుచుగా వచ్చేవాడు. ఆయనతో గీతకూడా వచ్చేది. తను వాసు వెంటవెంట తిరిగేది. చిన్నతనంకాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కొంచెం పెద్దవాళ్లమయ్యాకకూడా గీత మాయింటికి వచ్చేది. వాసుగదిలో కూర్చుని ఇద్దరూ మాట్లాడుకునేవారు. వాడలా మంచంమీద మఠం వేసుకుని కూర్చుని వుంటే ఇది మంచానికి ఎదురుగా వున్న పెద్ద కిటికీలో మోకాళ్ళమీద తలాన్చుకుని ముడుచుకుని కూర్చుని వుండేది. ఏం మాట్లాడుకునేవారో తెలీదు. ఇద్దరే అలా గదిలో కూర్చోకూడదు, ఇవతలికి వచ్చి అందరిమధ్యనా కూర్చుని మాట్లాడుకోండి అని అమ్మ చూసి ఒకటిరెండుసార్లు కోప్పడింది. అది వాళ్లకి ఎలా అర్థమైందో, వాళ్ళిద్దరూ ఏమనుకున్నారోగానీ, మాటలు మానేసారు. చాలారోజుల తర్వాత వాసు దగ్గిర గీత ఫోటో చూసాను. ఇంటరు ఎగ్జామ్స్‌కోసం తీయించుకున్న ఫోటో. పర్సులో రహస్యంగా దాచుకున్నాడు. వాళ్ళు బాహాటంగా చెప్పుకోలేదుగానీ, నిజంగా వాళ్లమధ్య హాస్యాలూ, పరిహాసాలూ వుంటే మనకి ఎంత ఇబ్బందిగా వుండేది? ఇంత ఆరోగ్యకరమైన స్నేహం సాధ్యపడేదా?”
సుమతి ఆలోచనలో పడింది. నిజమే. చాలా కట్టుదిట్టాల్లో పెరిగారు తామంతా. ముఖ్యంగా గీతకి చెడ్డపేరు రాకుండా వుండేందుకు. వాసుతో ఒక్కర్తీ కూర్చుని మాట్లాడటం గురించి ఇప్పుడే తెలిసింది. సుధీర్‍తో అలా ఎప్పుడూ మాట్లాడలేదు. మరి వాడలా ఎలా అనుకున్నాడు? వాడిగురించి మాధవ్‍కి ఎలా చెప్తుంది? మహతికి చెప్పడమే తప్పు. పెదవి దాటిన రహస్యం పృథ్వి దాటుతుందంటారు. మహతి దగ్గిరే ఆపాలి దాన్ని. గీతతో సంబంధాలు పునరుద్ధరించుకోవడమంటే సుధీర్ని బాధపెట్టడమే. గీతని వాసుతో చూసి తట్టుకోలేడు వాడు. మానుతున్న గాయాన్ని రేపినట్టౌతుంది. తప్పనిసరై కలుసుకున్నరోజుల్లో నరకాన్ని చూసాడు. ఎంత అశాంతిగా వుండేవాడో, ఎన్ని కన్నీళ్ళని వొంపుకునేవాడో తనకి తెలుసు. “చిన్నప్పట్నుంచీ తెలిసిన పిల్లని, నేను ఆశలు పెంచుకున్నదాన్ని, పరాయిదాన్లా, తమ్ముడి భార్యగా, మర్యాదగా ఎలా చూడను?” అని తల్లడిల్లేవాడు.
“అదే యింట్లో వున్న మరో మనిషిని నేను. నాకూ మరదలేకదా? నాతో ఎప్పుడూ చనువుగా వుండలేదు తను. మిగిలినవాళ్లలాగే నన్నూ చూసేది. సుమా! తను చాలా బాధపడుతోంది. జరిగినవాటిపట్ల అపరాథభావన తనలో కనిపించింది నాకు. చాలా సున్నితమైన విషయం యిది. నలుగుర్లో చర్చించి తనది తప్పులేదని చెప్పి వప్పించేలాంటిది కాదు. ఎవరికివాళ్లం అర్థం చేసుకోవాలి” అన్నాడు మాధవ్.
“కొన్నికొన్ని విషయాలు పైకి కనిపించినంత సాధారణంగా వుండవురా. వాటిలో చాలా సంక్లిష్టత వుంటుంది. కొంత గోప్యంగా వుంటేనే మంచిది” అంది సుమతి నర్మగర్భంగా. “మేమెవ్వరం గీతని తక్కువ చేసి చూసింది ఎప్పుడూ లేదు. ఎప్పటికీ అది మనిళ్ళకి మహరాణీయే. పెద్దమామయ్య వారసురాలే. ఏవో సోషల్ యాక్టివిటీస్‍లో వుందికదా? పన్నెండుమంది పిల్లల్ని జెనరల్ చెకప్‍కోసం బావ దగ్గిరకి తీసుకొచ్చింది. మయూఖ్ చదివే స్కూల్లో చదువుతున్న పేదపిల్లలట. ఫీజు ఇస్తానంది. బావ కోప్పడి, వద్దన్నారు. వాళ్లకి చెకప్ జరుగుతున్నప్పుడు తను లోపలికి వచ్చి కూర్చుంది. ఒక్కమాట ఎవరమేనా అంటే మీదపడి రక్కేసినంత పనిచేసేది. పరాయిదాన్లా హాలు దాటి రాలేదు. పొడిపొడిమాటలు మాట్లాడింది. ఎందుకురా, దానికంత పొగరు? దాని పద్ధతిలో అది దెబ్బలాడెయ్యచ్చుకదా? ఎదురుపడితే చాలు, సుమంతైతే దాన్ని రెచ్చగొట్టడానికి వదినా అని పిలిచి వస్తాడు. అది పలుకుతుంది. పేద్ద డిస్టెన్స్ మెయింటెన్ చేస్తోంది. డిస్టెన్స్” అంది తనే మళ్ళీ. ఆమె మాటలు ఎంత సాదాగా వున్నా, వాటి వెనుక యింకేదో వుందనిపించింది మాధవ్‍కి. ఆ విషయం అతను గ్రహించాలనే సుమతి కోరికకూడా.
“బేగులో డబ్బులు పెట్టుకుని బయల్దేరిందంటే ఇంకో డాక్టరు దొరకడంటే, తనకి? అందరు పిల్లలని తీసుకుని ఇంతదూరం రావాలా? నిన్ను చూడాలనిపించి వచ్చి వుంటుంది” అన్నాడు. సుమతి తలదించుకుంది. కళ్ళు తడయ్యాయి. పొగమంచు కప్పేసినట్టున్న వుదయపు దృశ్యాలు నెమ్మదినెమ్మదిగా మంచు విడి కనిపిస్తున్నట్టు అన్నీ తెలుస్తున్నాయి. కానీ కాళ్లకి అడ్డుపడే బంధాలు అలానే వున్నాయి. అస్పష్టతకీ, దృశ్యమానతకీ పెద్ద తేడా కనిపించలేదు.
“మా యిద్దరి గొడవా మేం చూసుకోగలం కానీ, నీలిమకీ తనకీ మధ్యని ఏమిట్రా? చాలా విషయాలు తెలిసాయి. నీలిమ మంచిపిల్లే. సరదాగా కలుపుగోలుగా వుంది” అడిగింది కొద్దిసేపటికి సర్దుకుని. మాటమార్చి.
“థేంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. నీలూకి చెప్తాను. తను సంతోషపడుతుంది”
“ఉన్నమాటేగా, అన్నది?”
“నేనూ అదే చెప్తున్నాను. మంచిదికాబట్టే మహీ విషయంలో నిలబడగలుగుతున్నాను. చాలా కోపరేషన్ యిచ్చింది”
“మరి గీత విషయంలో?”
“దాన్ని అందరం తలోవిధంగా బాధపెడుతున్నాం” అన్నాడు.
“కాస్త అర్థమయ్యేలా చెప్పచ్చుకదా? నేనేం అనుకోను. ఎవర్నీ జడ్జి చెయ్యను. వీలైతే పరిష్కారం ఆలోచిద్దాం”
మాధవ్ చాలాసేపు మాట్లాడలేదు. ఎవరితోనూ ఈ విషయాలు ఇప్పటిదాకా చెప్పలేదు. కానీ అందరికీ ఎంతోకొంత తెలుసు. తల్లిద్వారా బయటపడి వుండచ్చు. నీలిమ అక్కచెల్లెళ్లద్వారా కూడా తెలిసి వుండచ్చు.
“అప్పటికే వున్న వ్యవస్థలోకి మనం కొత్తగా అడుగుపెట్టినప్పుడు మనకి అది నచ్చదు. దాన్ని సమూలంగా మార్చెయ్యాలన్న వూపు వస్తుంది. వ్యవస్థ అంటే మనుషులగుంపు, వాళ్ళు అలా గుంపుగా కలిసి వుండటానికి చేసుకున్న ఏర్పాట్లు. అప్పటికే మనం అందులో వుంటే వీటన్నిటిగురించీ ఏమీ ఆలోచించకుండానే పాటిస్తూ వెళ్ళిపోతాం. ఆ ప్రవాహంలో కలిసిపోయి ప్రయాణిస్తాం. గుంపుగుంపు ఒక్క మనిషికోసం మారదు, మారలేదు”
“…”
“నీలిమకి ఈ కుటుంబం, మనమధ్య వుండే అనుబంధాలూ అర్థంకావు. తన అమ్మానాన్నలు, వాళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు, చాలా క్లుప్తమైన పరిధి వాళ్ళది. ఎవర్నీ కలుపుకోరు. ఇప్పుడు పెళ్ళై వచ్చిందిగాబట్టి మా యింట్లో ముగ్గురం, మనింట్లో ముగ్గురం అని గిరిగీసుకుని కూర్చుంది. అలా ఎలా కుదుర్తుంది? ముఖ్యంగా గీతతో? మనింటికి కొత్తగా వచ్చింది నీలిమ. తను క్రమంగా మన పద్ధతులకి అలవాటుపడాలి. తనకంటూ ఒక వునికిని ఏర్పరుచుకోవాలి. దాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనిల్లుకూడా తనకోసం కొంత మారుతుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఆడపిల్లలకి అది కష్టమే. కాదనను”
“తను అనుకున్నట్టు అలా ఎలా కుదుర్తుందిరా? ఆడవాళ్ళో మగవాళ్ళో ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి. భార్యాభర్తలిద్దరే వుండేట్టైతే ఏవో తంటాలుపడతారు. వాళ్ళిద్దర్లో కూడా కొంతమంది మారగలరు. ఇంకొంతమంది సాంచీస్థూపంలా స్థిరంగా వుండిపోతారు. అలాంటివాళ్లని ఏం చెయ్యగలం? మారటానికి మనం అనువుగా వున్నప్పుడు మారలేదని రెండోవాళ్లతో గొడవపడటం దేనికి? నలుగురు కొడుకులు వుండేచోట వచ్చేకోడళ్ళకోసం అలా మారిపోతూ వుండరుకదా? ఐనా మీకేం బాధ్యతల్లేవు. ఎవరి సంపాదనలు వాళ్ళవే. పిన్నికి పెన్షనొస్తుంది. మనిళ్ళలో ఒకళ్ళనించీ ఒకళ్ళు ఆశించడం అనే పద్ధతి లేదు. ఇంటికి నలుగురూ వచ్చిపోతుంటే, నలుగుర్తో కలిసి తిరుగుతుంటే సరదాయేగానీ సమస్యేమిటి?”
మాధవ్ నవ్వేడు. “బానే వుంటుంది. ఆ వొచ్చేవాళ్ళు తనకోసం రావాలి. నాకు ప్రాధాన్యత ఇవ్వాలి”
“అర్థం కాలేదు”
“సమర్ధత వుండి, అన్నీ చూసుకుంటోందని గీతకి మనం చాలా విలువ యిస్తాం. మనందరం ఇంకా కలిసి నడుస్తున్నామంటే తను చొరవతీసుకోవడంవల్లనే. నేను, మాయిల్లు, మా అమ్మానాన్న అని కాకుండా మన తొమ్మిదికుటుంబాలనీ కలిపి చూస్తుంది. అలా ఏరియల్ పెర్స్పెక్టివ్‍తో చూడటంవలన చాలా పనులు తేలిగ్గా జరిగిపోతుంటాయి. అందులో ఒక బిజినెస్ పెర్స్పెక్టివ్‍కూడా. ఫంక్షన్లని ఒకచేతిమీద ఆర్గనైజ్ చెయ్యడం, సీజన్లో హోల్‍సేల్లో బియ్యం పప్పులు కొనుక్కుని పంచుకోవడంలాంటివి. దానివలన చాలా డబ్బు ఆదా ఔతుంది. అది అందరికీ తెలుసు. అలా చూడటం తనకిమాత్రమే వచ్చు. తన స్థానంలో బైటిపిల్ల ఎవరేనా వుందనుకో, అంతదాకా ఎందుకు, నా భార్యనే తీసుకో, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని మనందరినీ మోటివేట్ చెయ్యగలదా? గీత చెప్తే విన్నట్టు పెద్దవాళ్ళేనా, చిన్నవాళ్ళేనా తనమాట వింటారా? వినరు”
“అలా ఎలా కుదుర్తుందిరా? ఎవరి స్థానం వాళ్ళదే. ఆ అమ్మాయితో మాకు చనువేం వుంటుంది?”
“అన్నిట్లో ఈవిడ పెత్తనమేమిటి, ప్రతిదానికీ తయారైపోతుంది. నేను చూసుకోలేనా? మా అక్కచెల్లెళ్ళు లేరా- అని గొడవపడుతుంది. ఇక్కడేకాదు, ప్రహ్లాద్ యింట్లోనూ ఇదేగోల. వసంత్‍కీ ఇదే తలనొప్పి. నీకు లాభం కలిగినంతవరకూ వాడుకుని తర్వాత దూరం పెట్టడానికి వాసూగీతలు పైవాళ్ళు కాదు. మనింటి పద్ధతీ అది కాదు. దూరాలు పెరిగిపోయాయి. గీతకూడా ఎందులోనూ తలదూర్చకుండా దూరదూరంగానే వుంటుంది. తను ఇదివరకట్లా చురుగ్గా ఉండట్లేదని నందకిషోర్ బాబాయ్ చాలాసార్లు అన్నాడు. పెద్దవాళ్ళం అవట్లేదా అంటుంది. ఆ మాటల్లో వెల్తి. పెద్దవాళ్లం అవటం ఇంత బాధని కలిగిస్తుందా సుమా?”
“ఇలా గొడవలుపడటం అవసరంలేదు. గీతని కలుపుకుని వాళ్ళు నలుగురూ అక్కచెల్లెళ్ళలా వుండచ్చు”
“గీతకూడా-
నాకు అందరూ క్రాస్‍కజిన్స్. బాబాయ్‍ల పిల్లలు చిన్నవాళ్ళు. నాకో చెల్లెలు దొరికిందనుకున్నాను. దొరక్కదొరక్క దొరికిన ఈ చెల్లెలు ఇంత బాధపెడుతుందనుకోలేదు- అంది”
“…”
“అమ్మ, కోడళ్ళిద్దరినీ సమానంగా చూడట్లేదని మరో గొడవ. సమానం అంటే? గీతకి యిచ్చిన విలువ ఎవ్వరూ తనకిగానీ, తన అక్కచెల్లెళ్లకిగానీ యివ్వరని దుగ్ధపడిపోతుంది. పెళ్లై ఆ యింట్లోంచీ ఈ యింట్లోకి వచ్చింది గీత. అక్కడ తనకి ఎంత ముద్దు జరిగేదో ఇక్కడా అంతే జరిగేది. ఈ వూరు, ఈ యింటి మనుషులూ గీతకి పుట్టినప్పట్నుంచీ తెలుసు. వాళ్ళకి తనూ, తనకి వాళ్ళూ అలవాటుపడిపోయారు. తను వీటన్నిటిలో ఒక భాగం అనుకుంటుందిగానీ విడిగా చూసుకోలేదు. అంతదాకా ఎందుకు? తన ఆఫీసులో సగంమందికిపైగా మామయ్య స్నేహితులు, పరిచయస్థులు. కొత్తగా వచ్చినవాళ్ళెవరేనా వుంటే వాసు వెళ్ళి వాళ్లని పరిచయం చేసుకుని వస్తాడు. లేడీకొలీగ్స్‌ని ఇంటికి రప్పించుకుని ప్రేమగా చూస్తుంది అమ్మ. మనంతప్ప మరో ప్రపంచం తెలీకుండా పెరిగింది గీత. అందరు మంచివాళ్ళనే నమ్ముతుంది. తనతో అంతా అలానే వుంటారు. ఇలా అన్నీ అమరి వున్న మనిషిని ఎవర్నీ నీలిమ చూడలేదు. అదే సమస్య”
“గీతేమంటుంది?”
“అనడానికి ఏముంది? నీలిమని నీలిమలానే వప్పుకుంది. తను తనలానే వుంది”
“అంటే?”
“ఒకళ్ళకోసం మరొకళ్ళు మారరుకదే, సుమా! నీలిమకోసం గీత పద్దతులెందుకు మార్చుకుంటుంది? ఇది ఇంకో ఎత్తు ఎత్తింది. తను పెద్ద ఆఫీసరు భార్య, గీత-వాసులు వట్టి క్లర్కులు. తన గొప్పతనానికి వాళ్ళు పనికిరారని. దీని నోరు మూయించలేక, కొన్నిసార్లు… ఇంకా చిన్నపిల్లలానే వుంటే ఎలాగని నేనూ తననే కోప్పడ్డాను. తప్పలేదు. మనం అల్లరి చేస్తూ దెబ్బలాడుకున్నది వేరు, ఇది వేరు. వ్యవహారం చెయ్యడం వచ్చినట్టుగా జవాబు చెప్పడం రాదే గీతకి. తెల్లబోయి చూసేది. ఆ చూపుల్లో కనిపించిన షాక్‍ని అసలు వూహించలేం”
“…??!!”
“ఇక ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని ఇవతలపడటమే మంచిదనిపించింది. ఉన్న వూళ్ళో వేర్లుపడి అమ్మని బాధపెట్టలేక, అందర్లో నవ్వులపాలు అవలేక బదిలీ అడిగాను. మాకు స్టేట్‍ హెడ్‍క్వార్టర్స్‌లో మాత్రమే బ్రాంచిలు వుంటాయి. ముంబై ట్రాన్స్‌ఫరంటే గొప్పగా బయల్దేరిపోయింది. చాలీచాలని యింట్లో, అరాకొరా సదుపాయాలతో అదీ ఒక బతుకేనా అనిపిస్తుంది నాకు. నీలిమ సంతోషంగానే వుంది. పెద్దభవంతిలాంటి యింట్లో ఐనవాళ్ళమధ్య యువరాజులా బతకాల్సినవాడు నా కొడుకు, అంత పెద్దసిటీలో ముక్కూమొహం తెలీనివాళ్లమధ్య తనూ ఒక అనామకుడిలా బతుకుతున్నాడు. ఇక్కడ టెన్యూర్ అవగానే మళ్ళీ వెనక్కి వచ్చెయ్యనా? అదే వూళ్ళో వేరే వుంటే అమ్మ బాధపడుతుందా? మా యిల్లే పంచుకుని ఎవరి వాటాలో వాళ్ళు వుండటం మంచిదా? పంచుకునే వీలుకూడా లేదు. మా తాతయ్యా, మా నాన్న ఒక్కళ్ళే కొడుకులు. అందుకని ఏకవాటాగానే కట్టించారు యింటిని. రీమాడలింగ్ చేయించాలి. అందం పోతుంది. ఏమీ అర్థం కావటం లేదు”
“వచ్చెయ్యరా! ఒక్కడివీ అక్కడెందుకు? సుమంత్ వేరే వుండట్లేదా? అలాగే నువ్వూను. ఎవరూ తప్పుపట్టరు. అందరూ అర్థంచేసుకుంటారు. ఇందులో బైటివాళ్లెవరు? పిన్నికిమాత్రం తెలీదా?”
“పుట్టాక పెరిగాక వాసూ నేనూ ఒక్కసారికూడా వేరుగా లేము. వాడూ నన్ను చాలా మిస్‍చేస్తున్నాడు. మేం పండుగలకీవాటికీ వెళ్తామా, నన్ను వెంటేసుకుని తిరిగినవాడు తిరిగినట్టు తిరుగుతాడు. ఇక్కడ వాళ్ళు పెద్ద ఖర్చులేమీ లేకుండా రెండుజీతాల్తో సాఫీగా బతికేస్తుంటే అంత పెద్ద సిటీలో ఒక్క జీతంతో నేనేం యిబ్బందిపడుతున్నానోనని బాధపడతాడు. డబ్బు యివ్వబోతాడు. వాడిదీ ఒక్క జీతమైతే మిగలదు. ఇప్పుడీ ఎక్కువున్న డబ్బు వదిన జీతంవల్లనేకదా? ఆవిడ తెలివివల్లేకదా? ఆవిడ మాకు పనికిరానప్పుడు ఆవిడ డబ్బుమాత్రం పనికొస్తుందా? నీలిమకి తెలిసి రావాలని తీసుకోను. ఇంక వెళ్ళేరోజుని ఇద్దరూ స్టేషన్‍కి వస్తారు, మమ్మల్ని రైలెక్కించడానికి. మాధురీ, మానసా వస్తారు. వసంత్, ప్రహ్లాద్ వీలునిబట్టి వస్తారు. గీత నా కొడుకుని ఎత్తుకుని ముద్దుచేస్తూ నిలబడుతుంది. తనని అలా వదిలేసి, వాళ్ళు ముగ్గురూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ నిలబడతారు. నేనూ వాసూ అలా ప్లాట్‍ఫామంతా తిరుగుతూ వుంటాం. ఈలోగా రైలొస్తుంది. నీలూనీ పిల్లాడినీ ఎక్కిస్తాను. రైలు కూతకూసేదాకా కంపార్టుమెంటు బైట విండోదగ్గిర నిలబడి మాట్లాడుకుంటాం. రైలు కదుల్తుంది. నేను ఎక్కేస్తాను. వాడు కిటికీ చువ్వలు పట్టుకుని అలా నడుస్తునే వుంటాడు. నడక పరుగుగా మారాక, ఇంక అందుకోలేక ఆగిపోతాడు. అక్కడ దూరంగా గీత చెయ్యి వూపుతూ కనిపిస్తుంది. చాలా బాధనిపిస్తుందే! ఇంతంత ప్రేమలు వున్నవాళ్ళం ఎందుకు విడిపోవాలి?” ఆవేదనగా అడిగాడు.
“బాధపడకురా! బతకాలంటే దూరాలు తప్పవు. సుధీర్ అమెరికా వెళ్లలేదా? అలాగే”
“ఒకొక్కసారి వాళ్ళిద్దర్నీ అలా చూస్తుంటే కాలం వాళ్ల విషయంలో ఆగిపోయిందేమో, వాళ్లని చూడ్డంకోసం నేను వెనక్కి ప్రయాణం చేస్తున్నానేమోననిపిస్తుంది. ఆ అవంతీపురం, ఆ రెండిళ్ళు, ఆ మనుషులు, ఎలాంటి మార్పు లేని జీవితం. యాంటిక్ పీసుల్లా వాళ్ళు వాళ్ళిద్దర్నీ అలా వదిలెయ్యడమేనా? వాళ్ళ అవసరంకూడా మన కుటుంబానికి తీరిపోయిందికదూ? ముఖ్యంగా గీతది? గీతూ ఎలా చేద్దామే అని అడగడానికి సీనియర్స్‌కి ఇంకే ఈవెంట్సూ మిగిలిలేవు. దాదాపు అన్నీ ఐపోయాయి. మామయ్యల పిల్లల పెళ్లిళ్ళు తప్ప. అందరం తలోదార్లో ప్రయాణిస్తున్నాం. వెనక్కి చూసుకుని వాసు పెళ్ళిలోనో నీ పెళ్ళిలోనో ఎంజాయ్ చేసినట్టు చెయ్యగలమా?”
“బాధపడకురా! ఈ ప్రేమలు ఏ మనిషినీ స్థిమితంగా వుండనివ్వవు. అందులోనూ మనవి వట్టి చుట్టరికాలు కాదు. నీలిమ మంచిదనే అనుకున్నాను. చిచ్చరపిడుగన్నమాట! ఔను, ఇద్దరూ ఎవరి వంట వాళ్ళు చేసుకునేవారటకదా, కొన్నాళ్ళు?”
మాధవ్ దు:ఖంలోంచీ బైటపడి నవ్వేసాడు ఆ ప్రశ్నకి. “మా పరువంతా చర్చకి వచ్చిందన్నమాట? ఎవరు చెప్పారు? అమ్మా?” అడిగాడు.
సుమతికూడ తలూపి నవ్వింది. “అప్పుడేగా, మాకు తెలిసింది, గీత ప్రతాపమంతా మనమీదేగానీ, బైటివాళ్ళముందు అది పిల్లిపిల్లేనని”
“కొన్నాళ్ళేమీ కాదు, నా ట్రాన్స్‌ఫర్‍కి ముందు. వారంరోజులు”
“ఎవరి తెలివితేటలవి? గీతవా, మీ ఆవిడవా?”
“వాసు”
“వాసువా?!!”
“ఆహా! చెప్పానుకదా, నీలిమకి తను ఆఫీసరు భార్యననే విషయం బుర్రకెక్కిందని. గీతకి వుద్యోగం, పిల్లలు. వాళ్ళుకాక ఏడాదికొకళ్ళుగా పెంచుకుంటూ వీళ్ళు చదువుచెప్పించే బైటిపిల్లలు, పేరెంటు కమిటీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్. పనులన్నీ చకచక జరిగిపోవాలి. ఎక్కడా ఆగదు. ఒకళ్ళు చెయ్యాలని చూడదు. పిల్లలకి చద్దెన్నం పెట్టేసి స్కూలుకి పంపిస్తుంది. దగ్గిరే, స్కూలు. మధ్యాహ్నం యింటికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ భోజనాలు చేసేసి బాక్స్‌లో టిఫెనో, పెరుగన్నమో పెట్టుకుని ఆఫీసులకి వెళ్తారు. మాయింట్లో ఈ పద్ధతి తనే మొదలుపెట్టింది. వండుకున్నవి వేడివేడిగా తినక బాక్సుల్లో సర్దుకుని చల్లారబెట్టుకుని తినడం తనకి యిష్టం వుండదు. ఇంకోమాటకూడా అనేది.
ఆఫీసన్నాక రకరకాల మనుషులు వస్తారు. కొన్ని మొహమాటాలుంటాయి. టీ కాఫీలు తాగక తప్పని పరిస్థితి వస్తుంది. లంచిబాక్సులోది తినడానికి ఆకలి చచ్చిపోతుంది. ఇంట్లో భోజనం చేసేస్తే మధ్యాహ్నం లైట్‍గా తిన్నా సరిపోతుంది- అని.
మళ్ళీ ఆఫీసునించీ రాగానే వంట తనే చేసేస్తుంది. స్నానాలు, పిల్లల చదువులు, భోజనాలు ముగించుకుని, పదింటికల్లా నిద్రపోతారు”
“ఇంకేమిట్రా, నీలిమకి? శుభ్రంగా వండిపెడితే తినడానికి? గీత వంటకూడా బావుంటుంది”