ధర్మచక్రం – విశ్వనాథ సత్యనారాయణగారు పరిచయం – యస్. శ్రీదేవి

విశ్వనాథ సత్యనారాయణగారి జీవితకాలం 10.9.1895 – 18.10.1976. వీరు బహుముఖప్రజ్ఞాశాలి. 57 నవలల్తోపాటుగా మొత్తం 127 పుస్తకాలు రచించారు. ఇందులో 12 గ్రంథాలు పురాణవైరగ్రంథమాలపేరిట మగథరాజుల పరంపరనీ, ఆరునవలలు కాశ్మీరరాజచరిత్రనీ, మరొక ఆరునవలలు నేపాలు రాజవంశచరిత్రనీ తెలియజేస్తాయి. వీరి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. వీరు పద్మభూషణ్ పురస్కార గ్రహీత. వీరి వేయిపడగలు గ్రంథాన్ని హిందీలోకి అనువదించినందుకుగాను పీవీ నరసింహారావుగారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి పుస్తకాలన్నీ శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ సంస్థద్వారా ప్రచురించబడతాయి. ప్రస్తుతపు పుస్తకప్రతి ప్రచురణకాలం 2006. నవలలన్నిటినీ ఒక సెట్టుగా ప్రచురించినప్పుడు కొనటం జరిగింది. ఈ నవల రచనాకాలం 1945వ సంవత్సరం.
ఈ నవల ఆంధ్ర ఇక్ష్వాకు రాజులమీద రాసినది. వీళ్ళ రాజధాని విజయపురి.
శాతవాహనసామ్రాజ్యం పతనమైన తర్వాత ఆఖరి శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణిని వోడించి పులొమావి రాజ్యం ఆక్రమించుకుంటాడు. అతన్ని ఓడించి ఆంధ్రక్ష్వాకువంశస్తుడైన వాశిష్ఠీపుత్ర బాహుబల శాంతిమూలుడు స్వతంత్రరాజ్యస్థాపన చేస్తాడు. ఇతడు శాతవాహనులకి సామంతుడు. ఇక్కడ ఒక విషయం ముఖ్యమైనది. రచయిత ఆధునిక, పాశ్చాత్య చరిత్రకారులని అనుసరించరు. వీరు యిచ్చే వివరాలు మనం చదివే చరిత్రతో సరిపోలవు. వాటిపై వాదోపవాదాలు ఈ నవలాపరిచయానికి సంబంధించిన విషయం కాదు.
శాంతిమూలుడి అక్క శాంతిశ్రీ. ఈవిడ బౌద్ధమతానుయాయి. భర్త మహాస్కందుడు. ఇద్దరు కొడుకులు- విష్ణుశ్రీ, స్కందసాగర నాగుడు, కూతురు శాంతిశ్రీ.
మహాస్కందుడి ఇంకో భార్య కామశ్రీ. ఈవిడ కొడుకు పేరు కూడా విష్ణుశ్రీ. ఈవిడది హిందూమతం.
శాంతిమూలుడి చెల్లెలు బ్రాహ్మిశ్రీ. ఈమె హిందూధర్మాన్ని ఆచరిస్తుంది. భర్త పేరు లేదు. సాధారణమైనవాడు. సంగీత సాహిత్యాలపై మక్కువగలవాడు. రాజయాక శాంతిమూలుడు అయిష్టంగా వప్పుకున్న పెళ్ళి. ఆయన చక్రవర్తి కాకముందైతే ఈ వివాహము అనుమతింపబడేదేమోనని ఒక చమత్కారం. ఈమెకి ఇద్దరు కూతుళ్ళు. బాపిశ్రీ, షష్టిశ్రీ.
శాంతిమూలుడి భార్య మాఠరీదేవి. కూతురు అడివి శాంతిశ్రీ. ఈమెకి అప్పటికే పాతికేళ్ళు. స్కంద విశాఖనాగరాజు అల్లుడు. అతడు శాతవాహనుల వారసుడేమోననే అనుమానం వుంది.
శాతవాహనులు వైదికధర్మానితోపాటు బౌద్ధాన్నికూడా ఆదరించారు. అదే సాంప్రదాయాన్ని శాంతిమూలుడు పాటించాడు.
శాంతిమూలుడికి మగసంతతి లేరు. ఇంత కష్టపడి నిలబెట్టిన రాజ్యం పతనమౌతుందేమోనన్న భయంతో అతని అక్కగారు మాఠరీదేవిని మొదట గర్భవతిగానూ, తొమ్మిదినెలలు నిండాక ఒక మగశిశువు కన్నట్టుగానూ ప్రకటిస్తుంది. నిజానికి ఈ శిశువు కాళింది అనే క్షత్రియస్త్రీకి, శాతవాహనుల వారసుడైన బ్రాహ్మణవ్యక్తికీ పుట్టినవాడు. పుట్టిన వెంటనే పడవలో వచ్చి, కృష్ణానదీతీరాన శాంతిశ్రీకి అప్పగించి వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడు మాఠరీపుత్ర వీరపురుషదత్తుడు. ఇతడి జన్మించినది క్రీ.శ. 331. కూతురి తర్వాత పాతికేళ్ళకి పుట్టిన ఈ పిల్లవాడి జన్మపట్ల వదంతులు వుంటాయి. అతను రాజు స్వంతకొడుకు కాదనీ, క్షత్రియుడు కాదనీ ముఖ్యమైన వదంతులు. ఇతడికి పిల్లనివ్వడానికి క్షత్రియులు ముందుకి రారు. కాదంబరాజులని వోడించి వాళ్ల కూతురైన భట్టిదేవిని జయించి తెచ్చుకుని పెళ్ళిచేసుకుంటాడు. ప్రథమసమాగమం తర్వాత ఆమెని చూడడు. తను క్షత్రియుడు కాదుగాబట్టి భార్య తనని చులకనచూపు చూస్తోందని అనుమానం. ఆమెమీది ప్రేమ చంపుకోలేడు. తన జన్మగురించి ఎవరూ అతనికి సందేహనివృత్తి చేయరు. అవమానంతోటీ, ఆత్మన్యూనతతోటీ రగిలిపోతూ వుంటాడు. భార్యమీద కక్షతీర్చుకోవడానికి అత్తల ముగ్గురుకూతుళ్ళనీ పెళ్ళి చేసుకుంటాడు. ఉజ్జయినీ రాకుమార్తె రుద్రభట్టారికని ఆమె తండ్రి ఇచ్చి చేసినప్పుడు భట్టిదేవిమీద విజయం సాధించాననుకుంటాడు. ఈ పరంపరలో అతనికి భట్టిదేవితో తొలిసమాగమం కారణంగా ఒక కొడుకు, మలి సమాగమానికి ఒక కూతురు పుడతారు. కొడుకు వాశిష్టీపుత్ర శ్రీ బాహుబల శాంతిమూలుడు, కొడబలి శ్రీ కూతురు. ఈ పేర్లు అతను వైదికధర్మంనుంచీ బౌద్ధధర్మానికి చేసిన ప్రయాణానికి చిహ్నాలు. జన్మరహస్యం తెలిసాకగానీ అతనిలో శాంతి నిండదు.
ఒకే కుటుంబంలోని వ్యక్తులు భిన్న మతాలు పాటించడంలో వున్న సమస్యలు, రాజు ఆవేశపరుడైనప్పుడు, అతడికి మానసిక దౌర్బల్యాలు వున్నప్పుడు ఆ రాజ్యంలో ప్రజలకి కలిగే కష్టాలు, శైవాలయాలు కూలగొట్టించి బౌద్ధస్తూపాలు, ఆరామాలు నిర్మించడం, బౌద్ధాచార్యులి సైద్ధాంతికవాదనలు హైందవవాదంమూందు తేలిపోవటం, బ్రాహ్మణనిర్మూలనవంటి అంశాలు చారిత్రకకోణంలోంచీ పరిశీలించదగినవి. పాత్రలయొక్క మనోవిశ్లేషణ చరిత్రలో జరిగిన సంఘటనలకి మూలకారణాలని పాఠకునిముందు పట్టి నిలుపుతాయి.