ఝరి _ 5 by S Sridevi

  1. ఝరి _ 1 by S Sridevi
  2. ఝరి _ 2 by S Sridevi
  3. ఝరి _ 3 by S Sridevi
  4. ఝరి _ 4 by S Sridevi
  5. ఝరి _ 5 by S Sridevi
  6. ఝరి _ 6 by S Sridevi
  7. ఝరి _ 7 by S Sridevi
  8. ఝరి _ 8 by S Sridevi
  9. ఝరి _ 9 by S Sridevi
  10. ఝరి _ 10 by S Sridevi
  11. ఝరి _ 11 by S Sridevi
  12. ఝరి _ 12 by S Sridevi
  13. ఝరి _ 13 by S Sridevi
  14. ఝరి _ 14 by S Sridevi
  15. ఝరి _ 15 by S Sridevi

జరిగిన కథ
వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి, బైటపడుతుంది. విషయం తెలిసి అందరు వస్తుంటారు. గీత తండ్రి రామారావుకీ, అతని తమ్ముడు రవికీ మధ్య మాటలుండవు. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు.


తండ్రీకూతుళ్ళిద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు కొంతసేపున్నాక, రామారావు వాళ్ళిద్దరిమధ్య వున్న నిశబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు.
“అమ్మ, మామ్మ నీకు పెళ్ళి చెయ్యాలంటున్నారు” అన్నాడు.
గీత వులిక్కిపడింది. “అప్పుడేనా?” అడిగింది.
“చేసుకునే వయసు ఇదేకదా? ఒక తోడు వుంటే చిలకాగోరింకల్లా వుంటారు”
“చిలకాగోరింకలని ఎందుకంటారు నాన్నా? రెండూ ఒక జాతి పక్షులు కావుకదా?”
“నిజమే. చిలకల్లా, గోరింకల్లా అనాలేమో!” అన్నాడు రామారావు. ఎదిగిన ఆడపిల్లతో పెళ్ళి విషయం మాట్లాడటం అంత తేలికకాదని అర్థమైంది అతనికి. యశోద మాట్లాడాల్సిన విషయం. ఆమె ఎలా నిర్ణయిస్తుందోనన్న భయంచేత తను విషయం ఎత్తుకున్నాడు.
“చేసుకునేది నువ్వు. నీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను” అన్నాడు.
“నాకేం తెలుస్తుంది? మీకెలా నచ్చితే అలా చెయ్యండి” అంది గీత.
“ఉ<హు< ఏడుగురు మగపిల్లలున్నారు మన కుటుంబంలో. మీ అందరూ కలిసి పెరిగారు. వాళ్ళలో ఎవరేనా అంటే నీకు ప్రత్యేకంగా ఇష్టం వుందా?”
గీత ముఖం ఎర్రబడింది. తల దించుకుంది. రామారావుకి అర్థమైంది. ఆయన గుండె వడివడిగా కొట్టుకుంది. గీతకి ఎవరంటే యిష్టం? డాక్టరుకాబట్టి సుధీరంటేనా? విలాసవంతంగా వుంటారుకాబట్టి అరుణ కొడుకంటేనా? చలాకీగా తిరుగుతూ ఆటలవీ ఆడుతూ వుండే సంధ్య కొడుకంటేనా? వాసు ఈ పోటీలో వున్నాడా? అసలు లేడా? ఎవరికి వాళ్ళకి ఎన్నో లెక్కలున్నాయి. ఆ లెక్కలన్నీ ఆయన మనసులో కదుల్తున్నాయి.
“నేనే చెప్పాలా, నాన్నా?” అడిగింది గీత.
“చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా?”
“నాకు లక్ష్మత్తంటే యిష్టం” అంది.
ఆయనకి వెంటనే అర్థమవలేదు. కొద్దినిముషాలకి బుర్ర వెలిగింది. సంతోషం. మనసునిండా నిండిపోయింది. ఒకళ్ళమీద ఒకళ్ళకి ఇష్టాలున్నప్పుడు కొంచెం కాకపోతే కొంచెమేనా మనసులు అర్థమౌతాయి. తండ్రీపిల్లలకీ, తల్లీపిల్లలకీ, భార్యాభర్తలకీ ఎంతోకొంత సామరస్యం (రస సమత్వం) వుంటుంది. మనుష్యులు కుటుంబాలుగా కలిసి వుండగలిగేది అందుకే.
“వాసుకి మాట్లాడనా?” ఆతృతగా అడిగాడు.
ఆమె తలూపింది. ఆయన సంతోషానికి అవధుల్లేవు.
“వెళ్దామా?” అడిగాడు.
తలూపింది. వెళ్తూ ఒక కారిడార్లోంచీ నడిచారు. రాజకుమారి పెళ్ళిచిత్రాలు చూసింది గీత. అస్తమిస్తున్న సూర్యుడి వెలుతురు ట్యూబులైటుల వెలుతుర్లో కలిసిపోతూ సృష్టించిన ఒక వింతకాంతిలో. ఇంతకాలం కనిపించకుండా తనని ఆవరించుకుని వున్న వూహావ్యక్తి ఇప్పుడు పీటలమీద తన పక్కని కనిపించాడు.
ఇద్దరికోసం ఐస్‍క్రీమ్ కొన్నాడు రామారావు.
“మనం ఇక్కడికొచ్చామని చెప్తే తమ్ముడు గొడవ చేస్తాడు” అంది తన కోన్ అందుకుని తింటూ.


“అప్పుల బాధ భరించలేక అవంతీపురానికి చెందిన విశాల, వెంకట్రావు అనే దంపతుల ఆత్మహత్య” అనే వార్త అన్ని టీవీ చానెల్స్‌లో వస్తోంది. పక్కని వేరే విండోలో విజువల్స్… వాళ్ళు వురి వేసుకున్నవీ, పోలీసులు ప్రాథమిక పరిశోధన చేస్తున్నవీ, చాలామంది జనం ఇంటిమీదికొచ్చి అరుస్తూ, తిడుతున్నవీ…
అప్పుడు సమయం పగలు పదిన్నర.


ఒకే ఒక్క సంఘటన అప్పటిదాకా సవ్యంగా సాగిపోతున్న జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. అలాంటి సంఘటనకి సంబంధించిన సంకేతాలేవో అందుతున్నట్టు పొద్దుటినుంచే మనసెందుకో ముసురు పట్టినట్టుంది అమృతకి. గజిబిజిగా ఎన్నో ఆలోచనలు. ఏ ఒక్క ఆలోచనలోనూ స్పష్టత లేదు. దానికితోడు చూసుకోకుండా తప్పు కమాండ్ ఇవ్వడంతో కొంత డాటా డిలిటైపోయింది. అది రిట్రీవ్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే సిస్టం హ్యాంగ్ అవుతోంది.
సడెన్‍గా వాట్సాప్‍లో మెసేజి… స్వప్న దగ్గర్నుంచి.
“నువ్వు వెంటనే బయలుదేరి హాస్టల్‍కి వచ్చేసేయ్” అని. స్వప్న ఈవేళ ఆఫీసుకి రాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది.
“ఎందుకే, వర్క్ ఫ్రమ్ హోం?” అంటే-
“లేజీ” అని నవ్వొకటి.
“క్రేజీ” జవాబు ఇచ్చి ఒక్కతే బయల్దేరి వచ్చేసింది అమృత. ఇద్దరూ ఒకే ఆఫీసు, ఒకే హాస్టల్, ఒకే రూమ్. ఇద్దరికీ ఏడాది స్నేహం. ఒకేసారి వుద్యోగంలో చేరారు. ఎందుకో చాలా నచ్చింది అమృత, స్వప్నకి. స్నేహం చెయ్యాలనిపించింది. ఆమెకూడా అలాగే అల్లుకుపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి జంటకవుల్లా తిరుగుతారు. మెట్రోలో సీటు ఆపి, పక్కకి చూసినప్పుడూ, దిగాక ఆటో ఎక్కగానే వెంటనే అది కదిలినప్పుడూ స్వప్న వెంట లేకపోవడం తెలిసింది అమృతకి. ఇప్పుడు ఆఫీసుకి రాగానే తిరిగి వచ్చెయ్యమని.
“బయల్దేరావా?” మళ్లీ మెసేజి.
“ఏమైంది? నీకేమైనా వంట్లో బాగాలేదా?”
“కాదుగానీ. వెంటనే బయల్దేరిపో అమృతా! ఇక్కడికొచ్చాక చెప్తాను”
అమృతకంతా అయోమయంగా వుంది. వచ్చెయ్యమంటోంది. కారణం చెప్పదు. ఫోన్లో మాట్లాడితే ఏదేనా అనుకోనిది జరిగి ఆదుర్దా వుంటే గొంతు వణుకులోనూ, ఏ కడుపునొప్పో వస్తే గొంతు నొక్కిపట్టడంలోనూ తెలుస్తుంది. ఈ రెండూ కాని భావమేదో వ్యక్తమౌతోంది గొంతులో. వెంటనే సీట్లోంచీ లేచి ఇవతలికి వచ్చి ఫోన్ చెయ్యబోతుంటే హెచ్చార్ మేనేజర్ భరత్‍నుంచి మెసేజి… రమ్మని. వెళ్ళింది. అతని ముఖంలోకూడా ఏదో అర్థం కాని భావం.
“నువ్వే వస్తావని చూస్తున్నాను. స్వప్న నీకింకా కాల్ చెయ్యలేదా? నాకు ఇప్పుడే చేసింది. నిన్ను వెంటనే పంపమని అడిగింది. నువ్వు వెళ్ళు” అన్నాడు. ఇలాంటివి కార్పొరేట్ రంగంలో అసలు జరగవు. స్వప్న రాలేదు. తనుకూడా పర్మిషనో లీవో అడిగితే లెక్కకట్టేస్తారని తటపటాయిస్తోంది. అలాంటిది భరత్ అతనంతట అతనే వెళ్లమనటం?!!!
“తను… తను బాగానే వుందా?” అడిగాను. ఆమె గొంతులో వణుకు.
“మీ హాస్టల్ ఎక్కడ?”
చెప్పింది.
“నాకూ అటు పనుంది. నిన్ను దింపి వెళిపోతాను” అని లేచాడు.
“ప్లీజ్! చెప్పు. తనెలా వుంది?”
“తనకేం కాలేదు అమృతా! ” అతను ఆమెకేసి చూడకుండా తలదించుకుని సిస్టం షడౌన్ చేస్తూ చెప్పాడు. ఇద్దరూ ఇవతలికి వచ్చారు. అతను కారు తీసాడు. ఆమె పక్కన కూర్చుంది.
హైటెక్‍సిటీ…చందానగర్…మియాపుర్…కూకట్‍పల్లి… మెయిన్‍రోడ్డుమీంచీ మలుపు తీసుకున్నాడు. హాస్టల్ వచ్చాక కారు ఆపి, వచ్చినట్టు స్వప్నకి ఫోన్ చేసి, అప్పుడు నెమ్మదిగా అమృతతో చెప్పాడు, “మీ పేరెంట్స్ ఇద్దరికీ యాక్సిడెంట్ అయిందట…”
తలమీద పిడుగు పడ్డట్టైంది ఆమెకి. దిగకుండా అలాగే కూర్చుండిపోయింది.
స్వప్న లోపలినుంచి వచ్చింది. డోర్ తీసి, భుజంమీద చెయ్యేసింది. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంది అమృత. ఆ ఆసరాతోనే కార్లోంచీ దిగింది.
“నేనూ వుండనా? నా హెల్ప్ కావాలా? నువ్వు చూసుకోగలవా?” అడిగాడు భరత్, స్వప్నని.
“నేను చూసుకుంటాను. ఇద్దరం కలిసి వాళ్ల ప్లేస్‍కి వెళ్లిపోతాం” ఆమె జవాబిచ్చింది.
భరత్ కొంచెం తికమకపడ్డాడు. “ఆర్యూ ష్యూర్? నేను కూడా వస్తాను” అన్నాడు.
“అవసరం లేదు భరత్. వాళ్ళ ప్లేస్‍కి టాక్సీ బుక్ చేస్తాను. అరగంటలో వెళ్ళిపోతాం” అంది.
“సరే మరి. ఏ హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడగండి. అమృతా! ధైర్యంగా వుండు. మీ తల్లిదండ్రులకి ఏమీ కాదు. తొందర్లోనే కోలుకుంటారు… మరైతే నేను వెళ్తాను…” అతను కారు వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడనటంకన్నా స్వప్న పంపించేసిందనటం సరైనది. కారు ఇలా కదిలిందో లేదో, అమృత చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది స్వప్న. సిట్టింగ్ లాంజిలోకి వెళ్ళగానే బేగ్‍లోంచీ రిమోట్ వెతికి తీసి, టీవీ ఆన్ చేసింది. యాక్సిడెంటు చాలా పెద్దదా? చిన్నదైతే టీవీలో రాదు. ఎలా వున్నారు వాళ్ళిద్దరూ? అమృతలో సన్నగా వణుకు. కళ్ళు టీవీ స్క్రీన్‍కి అప్పజెప్పింది. తనకి భరత్ చెప్పినదానికి భిన్నంగా….
“అప్పుల బాధ భరించలేక వెంకటాపుర్‍కి చెందిన విశాల, వెంకట్రావు అనే దంపతుల ఆత్మహత్య” అనే వార్త స్క్రోలౌతోంది. పక్కని విజువల్స్… ఆ యిద్దరూ ఆమె అమ్మా, నాన్న!!
చుట్టూ వున్న ప్రపంచం గిర్రుని తిరుగుతున్నట్టు అనిపించింది అమృతకి.
“ఇక్కడొద్దు. రూంలోకి వెళ్దాం పద” అని రిమోట్‍కూడా తనతో తెచ్చేసింది స్వప్న. అమృత యాంత్రికంగా ఆమెని అనుసరించింది. జరుగుతున్నదానితో తనకి సంబంధం తెగిపోయినట్టూ, ఏ కలలోనో వున్నట్టూ అనిపించింది. మెదడు మొద్దుబారిపోయింది. రూంలోకి వెళ్ళగానే తలుపు వేసేసింది స్వప్న.
“నువ్వు ఆఫీసుకి వెళ్ళాక కాసేపు టైంపాస్‍కని టీవీ పెట్టాను. ఈ న్యూస్ స్క్రోలౌతోంది. చానెల్ మార్చి చూసాను. అన్ని చానెల్సూ కవర్ చేస్తున్నాయి. వెంటనే టీవీ ఆఫ్ చేసి, రిమోట్ ఎవరికీ కనిపించకుండా పెట్టాను. లక్కీగా వార్డెన్ లేదు. ఎటో వెళ్ళింది. ఉంటే టీవీ వదలదు. భరత్‍కికూడా ఇదంతా చెప్పలేదు. అమృతా! ఇది మామూలు విషయంకాదు. అందరికీ తెలిస్తే చాలా అసహ్యంగా వుంటుంది. తలో మాటా అంటారు. ఏం చెయ్యాలోకూడా తోచదు. ఈ విషయంలో ముందుగా స్పందించాల్సినది నువ్వు. ఏం చెయ్యాలనుకుంటున్నావు?” అడిగింది.
“ఏం చెయ్యాలో తెలీటంలేదు”
“మీకు బంధువులెవరూ లేరా? “
“అమ్మ చిన్నప్పుడే తాతయ్య పోయారట. ఆయన డెత్ బెనిఫిట్స్, కంపాషనేట్ గ్రౌండ్స్‌మీద వుద్యోగం అమ్మమ్మకి ఇచ్చారట. ఎదిగిన కొడుకు చనిపోయాడు, బాధ్యతలు అలాగే వున్నాయి, వుద్యోగం తీసుకుని డబ్బు వాళ్ళకిమ్మని తాతయ్యవైపువాళ్ళు అడిగారట. అమ్మమ్మ వాళ్ళందరినీ వెళ్ళగొట్టి మళ్ళీ దగ్గరికి చేరనివ్వకుండా చేసిందట. ఆవిడ పోయినప్పుడుకూడా వాళ్ళెవరూ రాలేదు. నాన్న వుండగానే అమ్మకూడా అచ్చం అలాగే చేసిందట. సో ఎవరూ లేరన్నట్టే” అభావంగా చెప్పింది.
“మరేం చేద్దామనే? అసలీ అప్పులేమిటి? వాళ్ళకి నువ్వొక్కదానివేగా?” అయోమయంగా అడిగింది స్వప్న.
“నాకూ తెలీదు. నేను టెన్త్ క్లాసప్పట్నుంచీ హాస్టల్స్‌లోనే వుండి చదువుకున్నాను. నాన్న టీచరు. అమ్మ ఏవేవో చేసేది. చీరల వ్యాపారం చేసేది. చిట్టీలు నడిపేది. వడ్డీలకి అప్పులిచ్చేది. నన్ను షేర్లగురించి అడిగారు కొన్నాళ్ళక్రితం. వీటిగురించి నేను లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు” యాంత్రికమైన జవాబు. ఎవరిగురించో చెప్తున్నట్టు నిర్వికారంగా చెప్తుంటే స్వప్న భయంగా చూసింది.
“అమృతా! ఏం చేస్తావు? ఎంతోసేపు ఈ నిజాన్ని దాచలేవు. పొద్దున్న అంతా ఆఫీసుకెళ్ళే హడావిడిలో వున్నారుకాబట్టి ఎవరూ చూడలేదు. సాయంత్రానికి అంతా గుప్పుమనిపోతుంది”
“వెళ్తాను. వెళ్ళకుండా ఎలా?”
“ఆడపిల్లవి, ఒక్కదానివీ అక్కడికి ఎలా వెళ్తావే? ఎవరేనా అడ్వకేట్‍ సలహా తీసుకో”
“నీకెవరేనా తెలుసా?”
ఆమె జవాబు చెప్పేలోగా తలుపుమీద చిన్నగా చప్పుడైంది.
“అమృతా మేడమ్! మీకు కొరియర్ వచ్చింది” ఆయా చెప్పింది.
స్వప్న లేచి వెళ్ళి తలుపు తీసి వుత్తరం తీసుకుని తెచ్చి అమృతకి యిచ్చింది. కవరుపైన చేతిరాత అమృత తండ్రిది. చెయ్యి వణికింది. అపనమ్మకం… వుత్తరం నాన్నదైతే తను చూసిన వార్త?
“ఎక్కడినుంచి?” స్వప్న అడిగింది.
“నాన్న దగ్గర్నుంచి”
ఆమెలో కూడా ఆశ్చర్యం.
కవరు చింపి, నాలుగు మడతలున్న కాగితాన్ని బయటికి తీసింది అమృత.
అమృతా!
ఆశ్చర్యపోతున్నావా? నువ్వు చూసిన వార్త నిజం. ఈ వుత్తరం కూడా నిజమే. ఈరోజు వుదయం ప్రాణం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, రాత్రి నీకు ఈ వుత్తరాన్ని పోస్ట్ చేసాను. మేము ఎండమావుల వెనుక పరిగెత్తాము. ఇంక పరిగెత్తలేక అలిసిపోయి పరుగు ఆపేద్దామనుకున్నాం. ఇంతకన్నా నీకు ఈ విషయంలో ఏమీ చెప్పలేను. క్రమంగా నీకే తెలుస్తాయి. మాధవరావు మామయ్య వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఎంతవరకూ తను నీకు సాయపడగలడో తెలీదుగానీ, సాయం మాత్రం చేస్తాడు. తనెలా చెప్తే అలా చెయ్యి. తనొచ్చేదాకా హాస్టల్ గదిలోంచీ ఇవతలికి రాకు. ఆఫీసుకి కూడా వెళ్ళకు.
నాన్న
ఇందులో తొమ్మిదిమంది అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ వున్న వుమ్మడికుటుంబానికి సంబంధించిన కథ ఒకటి, దానికి అంత:సూత్రంగా అంతే పెద్దదైన మరోకుటుంబానికి సంబంధించిన కథ మరొకటి సమాంతరంగా నడుస్తాయి. చాలా పాత్రలు వస్తాయి. అందుకని పాఠకుల సౌలభ్యంకోసం కిందన ఇస్తున్నాను.
1 వాసు, గీత భార్యాభర్తలు. మేనరికపు పెళ్ళి. మయూఖ్, విహంగ్ కొడుకులు.
2 రామారావు, యశోద గీత తల్లిదండ్రులు. వాళ్ళకి గీత, కృష్ణ అనే ఇద్దరు పిల్లలు. కృష్ణ ఆస్ట్రేలియాలో వుంటాడు.
3 ప్రమీల- రామారావు పెద్దచెల్లెలు. గురుమూర్తి ఆమె భర్త. సుధీర్, సుమతి, సుమంత్ వాళ్ళ పిల్లలు.
4 లక్ష్మి- రామారావు రెండో చెల్లెలు. ఆమె భర్త రామకృష్ణ. వాసు, మాధవ్, తులసి వాళ్ళ పిల్లలు.
తులసి పిల్లలు చరణ్, చేతన్ .
5 నిర్మల- రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి కూతుళ్ళు
6 అరుణ – రామారావు నాలుగో చెల్లెలు. నందకిషోర్ ఆమె భర్త. ప్రహ్లాద్, ప్రవల్లిక సంతానం.
7 సంధ్య – రామారావు ఐదో చెల్లెలు. శంకర్ ఆమె భర్త. రాణా కొడుకు.
8 పద్మ – రామారావు చిన్న చెల్లెలు. రాజారావు ఆమె భర్త. వసంత్, సమీర పిల్లలు
9 శేఖర్ – రామారావు పెద్ద తమ్ముడు. విజయ అతని భార్య. సంతోష్, వీణ పిల్లలు.
10 రవి రామారావు చిన్నతమ్ముడు. కుసుమ అతని భార్య. అర్చన, పల్లవి కూతుళ్ళు.
11 విజ్జెమ్మ – రామారావు తల్లి
12 గిరీష్ డాక్టరు, వాసు క్లాస్‌మేట్
13 రుక్మిణమ్మ వాసూవాళ్ళ పొరుగింటావిడ.
14 వేణు వాసూవాళ్ళకి పరిచయం వున్న డ్రైవరు
15 అమృత – వెంకట్రావు, విశాలల కూతురు.
16 స్వప్న – అమృత స్నేహితురాలు