ఝరి 11-20 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

అక్కడినుంచి యింటికొచ్చాడు. అరుణ తర్వాత నిర్మల. ఆమెకి యిద్దరూ కూతుళ్ళు. మహతి, రవళి. మహతి గీతకన్నా పెద్ద. రవళికన్నా గీత కొంచెం చిన్న. ఇద్దరూ యింకా చదువుతున్నారు. నిర్మల తర్వాతిది సంధ్య. ఆమె కొడుకు రాణా- రణధీర్. ఇంటరు రెండుసార్లు తప్పి ఎలాగో గట్టెక్కాడు. బాడ్మింటన్ ఆడతాడు. స్నేహితుల్నేసుకుని తిరుగుతాడు. అతనికి గీతని అడగలేడు. వసంత్ ఆఖరి చెల్లెలి కొడుకు. గీతకన్నా కొన్ని నెలలు పెద్ద. కానీ…
తను చేసినది తప్పా? డిగ్రీతో గీత చదువు ఆపకుండా ఇంకా చదివించాల్సిందా? చదివించాక? అప్పుడేనా చెయ్యాల్సిందేకదా? వాసుని గీత చేసుకుంటానంటే చాలనుకున్నాడు మొదట. ప్రమీల దగ్గిరకి వెళ్ళాక ఆలోచనలు మారాయి. వాసు, సుధీర్ ఇద్దరిమధ్యా తేలడం లేదు.
“ఏమిటంత ఆలోచన?” అడిగింది యశోద.
“త్రిమూర్తులన్నయ్య దగ్గిరకి వెళ్ళొస్తాను” అన్నాడు. ఇలాంటి సందిగ్ధాలున్నప్పుడు అలా వెళ్లటం రామారావుకి అలవాటే. ఇద్దరూ స్వంత అన్నదమ్ములు కారు. దైవికమైన బంధం వాళ్ళది.
త్రిమూర్తులు పదోతరగతి చదువుతున్నప్పుడు రామారావు ఒకటో తరగతిలో చేరాడు. స్కూళ్ళు తెరిచి నాలుగైదురోజులైందేమో! ఇంటర్వెల్లో చిన్నక్లాసుల పిల్లలంతా అల్లరల్లరిగా పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. రామారావు పరిగెడుతూ కాళ్ళు ఒకదానికి యింకొకటి తట్టుకుని పడ్డాడు. పడ్డం బానే పడ్డాడు. మోకాళ్ళు చెక్కుకుపోయాయి. లేవకుండా పెద్దగా ఏడుస్తున్నాడు. త్రిమూర్తులు దూరాన్నుంచీ చూసాడు. చప్పుని వచ్చి లేవదీసి ఎత్తుకున్నాడు.
“అయ్యో! పెద్దదెబ్బ తగిలిందే!” అంటూ వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. రంగమ్మ చూసి, “ఎవరి పిల్లాడివి నాయనా? బానే దెబ్బ తగిలించుకున్నావే?” అంటూ ఓదార్చి, కాలు కడిగి, పసుపు అద్దింది. చేతిలో యింత బెల్లంముక్క పెట్టి, వాళ్ళింట్లో వదిలి పెట్టి రమ్మని కొడుక్కి చెప్పింది. అలా మొదలైంది వాళ్ల అనుబంధం. అది త్రిమూర్తుల్లో పేరుకుని వున్న కసిని కడిగేసింది.
ఒకళ్ళ భుజంమీద మరొకళ్ళు చేతులు వేసుకుని, ఒకరినొకరు అతుక్కుపోయినట్టు తిరిగే ఓ యిద్దరు మగపిల్లలు అతనికి అక్కడక్కడా ఎదురుపడుతుంటారు. వాళ్లది రామారావు వయసు. వాళ్లని చూస్తే త్రిమూర్తులులో కోపం, కసి. గురిచూసి రాయి వాళ్ళమీదికి విసుర్తాడు. ఇద్దర్లో ఎవరో ఒకరికి తగుల్తుంది. వాళ్ళు పారిపోతారు. తమని చూస్తే అతను కొడతాడని వాళ్ళకి తెలుసు. అందుకని తప్పించుకుని తప్పించుకుని తిరుగుతారు. అతను ఈ సందులో కనిపిస్తే వాళ్ళు మరో సందులోకి పారిపోతారు. ఐనా ఈ దెబ్బలు అప్పుడో యిప్పుడో తప్పవు.
“ఆ పిల్లవెధవల్ని అలా కొట్టకు నాయనా!” అంది రంగమ్మ ఒకసారి. శంకరయ్య నేరుగా కొడుక్కి చెప్పలేక ఆవిడకి చెప్పాడు. త్రిమూర్తులి భయానికే వాళ్ళనింకా స్కూల్లో వెయ్యలేదు. ఈ యేడు త్రిమూర్తులి స్కూలు చదువైతే వెయ్యచ్చని ఆగాడు.
“ఏం?” అడిగాడు త్రిమూర్తులు.
“వాళ్ళు మీ నాన్నగారికి యిష్టులు” అంది, కొడుకులని చెప్పలేక.
“నేను కాదా?” అని అడిగాడతను.
“నిన్నూ బానే చూసుకుంటున్నారుకదా? అన్నీ అమర్చుతున్నారు. ఏదడిగినా కాదనట్లేదు”
“ఐతే?”
ఆ తిక్క తగ్గింది అతన్లో రామారావుని చూసాక. అతన్ని ఎత్తుకోవడం, అతన్ని నవ్వించడం, అతన్తో కబుర్లు చెప్పడం. స్కూల్‍ఫైనలంతా అతని చుట్టే తిరిగాడు. స్నేహితులు వెక్కిరించేవారు, “నీ చిటికెనవేలంత లేడు, వాడితో నీకేంట్రా?” అని.
పట్టించుకునేవాడు కాదు. స్కూలు వదిలిపెట్టేసినా రామారావు వాళ్ళింటికి వెళ్ళేవాడు. తర్వాత రామారావుకి చెల్లెళ్ళ గుంపు తయారైంది. కొన్నాళ్ళు రామారావు వాళ్లతోనే ఆడేడు. మున్సిపల్ గ్రౌండుకి వెళ్ళి ఆడటం మొదలుపెట్టాక మళ్ళీ త్రిమూర్తులి ప్రాపకం మొదలైంది. రామారావు తండ్రి చనిపోయినప్పుడు అతను ఖర్చుల వూబిలో కూరుకుపోకుండా త్రిమూర్తులే బాధ్యతంతా మీదేసుకుని బయటపడేసాడు. ఆ సందర్భంగా రామారావు బంధువులకి కోపాలుకూడా వచ్చాయి.
తర్వాతి ప్రకరణం రామారావు చెల్లెళ్ల పెళ్ళిళ్ళు. పద్ధెనిమిదేళ్ళు మొదలుకుని పదేళ్ళ వయసుదాకా ఆరుగురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళూ ఇవి అతని బాధ్యతలు. గవర్నమెంటు వుద్యోగం వుంది. ఈ బాధ్యతలకోసం అతని తండ్రి కొంత డబ్బు దాచాడు.
తండ్రి పోయిన ఏడాదిలోపు చేస్తే కన్యాదానఫలం దక్కుతుందని బియ్యెస్సీ చదువుతుండగా ప్రమీలకి పెళ్ళి చేసాడు. పెళ్ళయ్యాక పుట్టింట్లోనే వుండి చదువు పూర్తి చేసింది. తర్వాత వుద్యోగంలోకూడా చేరింది. రామారవు మేనమామ కన్యాదానం చేసాడు. పెళ్ళి మరీ పీనాసితనంగా చేసారని మగపెళ్ళివాళ్ళకన్నా ఎక్కువగా ఆయనే పేర్లు పెట్టాడు. పెళ్ళికి డబ్బుపెత్తనం తనకివ్వలేదని ఆయన బాధ.
“ఇంక నువ్వు చేసుకో” అంది తల్లి, ఏటిసూతకం తీరాక.
త్రిమూర్తులు వద్దన్నాడు. “ఈ కుటుంబం, బరువు బాధ్యతలూ నీవి. వచ్చే పిల్లకేం సంబంధం వుంటుంది? సర్దుకుపోతే పర్వాలేదుగానీ లేనిపోతే ఎన్నో సమస్యలు కదా? ఈలోగా మీకు పిల్లలు పుట్టుకొస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఇటు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, ఖర్చులు. పెళ్లనేది పెద్దబాధ్యత. మెళ్ళో పుస్తె కట్టి తీసుకొచ్చి యింట్లో పడేసి చాకిరీ చెయ్యమనడానికి పెళ్ళి చేసుకోకూడదు. ఇప్పటికే ఒక బాధ్యత వుండగా మరొకటి ఎత్తుకోవడం సరైనది కాదు” అన్నాడు. నిజమేననిపించింది రామారావుకి. జీవితం వుద్వేగాలతోటీ, ప్రలోభాలతోటీ కాకుండా ఒక స్పష్టమైన అవగాహనతో నడిపిస్తే అందంగా వుంటుంది. అలాంటి అందమైన దార్లోకి పంపించాడు త్రిమూర్తులు అతన్ని.
చెల్లెళ్ళ పెళ్ళిళ్ళపట్ల పెద్ద ఆశలూ కోరికలూ లేవు రామారావుకి. శాఖ కలవడం, గోత్రాలు నప్పడం, చిన్నదో పెద్దదో వుద్యోగం వుండటం.ఈ మూడే అతను చూసినది. అవంతీపురం స్కూల్లోనూ, కాలేజిలోనూ చదివి వెళ్ళిన మగపిల్లందర్నీ జల్లెడ వేసి పట్టుకున్నాడు త్రిమూర్తులు. అప్పటికే బట్టల వ్యాపారంలో వున్నాడతను. తన దగ్గిర కొనడానికి వచ్చేవాళ్ల దగ్గిర వాకబు చేసేవాడు. అందరూ అక్కడక్కడివాళ్ళే. చుట్టుపక్కల పల్లెటూళ్ళలో కుటుంబాలవాళ్ళు. చేతిలో డబ్బు పట్టుకుని పెద్ద ఆశలకి పోకుండా వెతికితే సంబంధాలు తేలిగ్గానే దొరికాయి.
ఒక సమయంలో క్లరికల్ వుద్యోగాలూ, టీచరు వుద్యోగాలూ తేలిగ్గానే దొరికేవి. పోస్టాఫీసు, రైల్వేలు, టెలిగ్రాఫ్ డిపార్టుమెంట్లు వుద్యోగావకాశాలు బాగా కల్పించేవి. అనేక ప్రైవేటు సంస్థలు చిరుద్యోగాలకి ఆలవాలంగా వుండేవి. అవికాక అవంతీపురం రాజావారి సంస్థలు కొన్ని వుండేవి. వాటిల్లో స్థానికులనే తీసుకునేవారు. ఎన్నేళ్ళు ప్రయత్నించినా వుద్యోగం రాని దురదృష్టవంతులు వుండవచ్చు, కానీ దొరికిన అదృష్టవంతులనిమాత్రం దొరికించుకునేవాడు త్రిమూర్తులు. పదేళ్లలో ఐదుగురికి చేసేసాడు రామారావు. నసుగుతూనో సణుగుతూనో మేనమామ పీటలమీద కూర్చునేవాడు. ఆఖరిచెల్లెలి దగ్గిర ఎదురుదెబ్బ తగిలింది రామారావుకి.
అక్కల పెళ్ళిళ్ళు చూసింది పద్మ. ఎంత క్లుప్తంగా జరిగాయో, పెళ్ళిళ్ళయాక వాళ్ళు ఎలా పైసపైసకీ చూసుకుంటూ గడుపుతున్నారో ఆమె మనసుకి హత్తుకుపోయింది.
“నేను పీజీ చదువుతాను. ఉద్యోగం చేస్తాను” అంది తల్లితో. ఆవిడ తిట్టింది.
“నిన్నిప్పుడు పట్నంలో పెట్టి చదివించేవాళ్ళెవరు? నువ్వే ఎమ్మే చదివితే మళ్ళీ అంత చదివినవాడిని తీసుకురావద్దూ? వాడి దగ్గర అంత డబ్బు పోగేసుకుని కూర్చున్నాడనుకుంటున్నావా? బుద్ధిగా చూసిన సంబంధం చేసుకుని వెళ్ళు. పెళ్లయాక నీ యిష్టం, వచ్చేవాడి యిష్టం” అంది.
“ఐతే నాకు మంచి సంబంధమన్నా చూడమను. అక్కావాళ్ళందర్నీ చూస్తున్నాను, ఏం సుఖపడుతున్నారో, ఎంత సుఖపడుతున్నారో” విసురుగా అందామె.
“పైసపైస పోగుచేసుకుంటున్నారు. పైకొస్తారు. ఎవరూ అన్నీ అమర్చిపెట్టరుకదా? మీ నాన్న వున్నా ఇంతకన్నా చేసేవాళ్ళు కాదు. అక్కలంతా వాడు చెప్పినట్టు విన్నారు. నువ్వుకూడా విను. వాడిని బాధపెట్టకు” అందావిడ.
“ఉ<హు< నేను డాక్టర్నితప్ప చేసుకోను” నెమ్మదిగా బయటపడింది. కలలు. మనుషుల్ని భూమ్మీద నిలవనివ్వవు. ఆకాశానికి నిచ్చెన వేయిస్తాయి. ఆవిడ ఎన్నివిధాలుగానో నచ్చజెప్పింది.
“నన్ను చదివించండి. లేదా పెద్ద సంబధమన్నా తీసుకురండి” అని మొండికి కూర్చుంది. ఆవిడ తలపట్టుకుంది. కొడుక్కి చెప్పింది. ఆవిడకి సిగ్గుగా వుంది. కొడుకు తను పెళ్ళి మానుకుని కూర్చుని ఆడపిల్లలందర్నీ ఒకరితర్వాత ఒకర్ని పంపిస్తుంటే ఈ పిల్ల ఇలా ఎదురుతిరగడం. పెద్దచదువులు చదివేవాళ్ళు రెండురకాలు వుంటారు. బాగా డబ్బుండి, అవకాశం వున్నవాళ్ళు మొదటితరహా. పిల్లలు చదువుతామని పట్టుబడితేనో, బాగా చదువుతున్నారని ముచ్చటపడో అప్పులు చేసీ, పుస్తీపూసా తాకట్టు పెట్టీ చదివించేవాళ్ళు ఇంకొకతరహా. డబ్బున్నవాళ్ళు చిన్నసంబంధాలవైపుకి రారు. నానాగడ్డీ కరిచి పిల్లల్ని చదివించినవాళ్ళు అంతకంతా కట్నం రూపంలో రాబట్టుకుందామని అనుకుంటారు. అందుకు రామారావు తూగలేడు. ఇప్పటిదాకా అల్లుళ్ళందరికీ ఒకేలాంటి మర్యాదలూ పెట్టుపోతలూ జరిగాయి. ఆ వరస మారిస్తే అది ఇంకో వివాదానికి దారితీయచ్చు. చెల్లెల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వివరించాడు.
“ఆదర్శాలకోసమో, దేశాన్ని వుద్ధరించడానికో ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోరు. అలాంటి పెళ్ళిళ్ళు ఒక వుద్యమంలా వచ్చి ఆగిపోతాయి. అలా పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు ఎలా వున్నారో ఏమయ్యారో ఏ చరిత్రా చెప్పదు. అలాంటి బాహ్యకారణాలకి చేసుకున్న పెళ్ళిళ్ళు నిలవ్వు. నిన్నుగా యిష్టపడి ఏ రాజకుమారుడో రావటానికి మనకి వున్న సర్కిల్లో అలాంటివాడినెవరినేనా చూసావా నువ్వు?” అడిగాడు.
“కట్నం చేతిలో పట్టుకుని వెతికితే దొరుకుతాయి. అక్కావాళ్ళకిలా కాదు. నువ్వు ఇవ్వక్కర్లేదు. నేను చదువుకుని వుద్యోగం చేసి సంపాదించుకుని దాచుకుంటాను” అంది పద్మ. రామారావుకి మనసు చివుక్కుమంది. స్పష్టమైన అవగాహన తప్ప ఇలాంటి ఆవేశాలు జీవితాన్ని నడపకూడనేది అతనికి త్రిమూర్తులు దగ్గిర నేర్చుకున్న నిజం. విషయం త్రిమూర్తులుదాకా వెళ్ళింది.
“పోనీలే రామూ, తన పెళ్ళికని దాచిందేదో పెట్టి చదివించు. ఉద్యోగం చేస్తానంటోంది చెయ్యనివ్వు. ఆ< జీతం ఎంతొస్తుంది పద్మా? అనుకోవడానికేకదా, వెయ్యొస్తుందనుకుందాం. డాక్టరో యింజనీరో కావాలంటే లక్ష కట్నం అడుగుతాడు. పదేళ్ళు దాచుకుంటే సరిపోతుంది. అప్పటికి నీ వయసు ముప్పైలు దాటి నలభైలకి చేరుతుంది. ఈ వృద్ధకన్యని చేసుకోవడానికి వృద్ధబాలుడిని వెతకాలి. అంతేకదా?” అన్నాడు నవ్వుతూ. నిజం ఒకటే వుంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. గ్రహించాలి. పద్మకి అర్థమైంది. అన్నయ్య తలుచుకుంటే అన్నీ సాధ్యపడతాయిగానీ చెయ్యడు. ఆయన చెయ్యాలనుకున్నా ఈ త్రిమూర్తులు చెయ్యనివ్వడు అనుకుంది పద్మ. ఆ విషయం మరో రెండేళ్ళకి నిర్ధారణకూడా చేసుకుంది.
రామారావు చూసిన సంబంధం వప్పుకోక పద్మకి తప్పలేదు. ఐతే త్రిమూర్తులు మరో ప్రతిపాదన చేసాడు.
“ఇంక నీ దీక్ష వదిలిపెట్టి నువ్వుకూడా చేసేసుకోకూడదూ? సంబంధం సిద్ధంగా వుంది” అన్నాడు. రామారావు తల్లి సంతోషించింది.
యశోదకి పాతికేళ్ళుంటాయి. కుజదోషం వుంది. అందుకు పెళ్ళవలేదు. రామారావుకి కూడా వుంది. దాంతో ఇద్దరికీ కుదిరిపోయింది. రామారావుకి లేకపోయినా పెట్టుడుజాతకంతో చేయించేసేవాడు త్రిమూర్తులు. అతనికి ఈ జాతకాలమీద నమ్మకం లేదు. దేవుడనేవాడు తలుచుకున్నాడంటే దానికి తిరుగు వుండదు, అది పూర్వజన్మ కర్మఫలం, దాన్ని అనుభవించక తప్పదనేది అతని వాదన. ముందు రామారావు, యశోదల పెళ్లైంది. మరో నెలకి పద్మ పెళ్లైంది.
ఒక్కసారి ఇవన్నీ రామారావుకి గుర్తొచ్చాయి. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సమస్యల్లోంచీ తనని బయటపడేసాడు. దారి చూపించాడు త్రిమూర్తులు. ఇప్పుడు గీత విషయంకూడా ఆయనే సలహా యివ్వగలడని బయల్దేరాడు.
“సమస్యనేది తెరిచిన తలుపులాంటిది. పరిష్కారం దొరకగానే దాన్ని మూసెయ్యాలి. లేకపోతే కొత్తకొత్త పరిష్కారాలు పుట్టుకొచ్చి మనని స్థిమితంగా వుంచవు. నువ్వు వాటిల్లో దేన్నో ఒకదాన్నిమాత్రమే పాటించగలప్పుడు తొందరగా తలుపు మూసెయ్యడమే మంచిది” అన్నాడు త్రిమూర్తులు. “వాసుని అనుకున్నాక మళ్ళీ ప్రమీలని ఎందుకు కదిలించావు?” అడిగాడు అతను చెప్పినదంతా విని.
“ఇంటికి పెద్దదికదా, దానికి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం బావోదని కదిలించాను” అన్నాడు రామారావు. “వాసు సంబంధం అనుకుని గీతకి అన్యాయం చేస్తున్నానేమో! అందరూ వాళ్ళ పిల్లల్ని పెద్దపెద్ద చదువులు చదివిస్తుంటే నేను దీన్ని బియ్యేతో మానిపించాను. దీనితోటివాళ్లంతా చదువుకుంటుంటే ఇదేమో వుద్యోగంలో చేరింది”
“ఇది మారు ఆలోచనకదూ?” అడిగాడు త్రిమూర్తులు. “ప్రమీల చెప్పిన రెండు ఆప్షన్సూ చూద్దాం. సుధీర్ చదువయ్యేదాకా గీతకి చెయ్యకుండా ఆపుతావనుకో, చదువయ్యాక అతని మనసు మారదని నమ్మకమేమిటి? పీటలమీద పెళ్ళిళ్ళే తప్పిపోతున్నాయి. డాక్టరు చదివినవాడు వుత్తి బియ్యే చదివిన పిల్లని చేసుకుంటాడా? ఆగితే నాలుగేళ్ళూ ఆగి, సుధీర్‍దికూడా ఒక సంబంధం, కుదిరితే కుదుర్తుంది, లేకపోతే లేదనుకోవాలి. వాసు అప్పటిదాకా వుంటాడా? సుధీర్ చెప్పబోయే నిర్ణయంకోసం అతనెందుకు ఆగుతాడు? ఇంకో పిల్లని చేసేసుకుంటాడు. అంటే చేతిలో వున్న సంబంధం వదులుకున్నట్టే నువ్వు. ఇక రెండోమార్గంగురించి ఆలోచిద్దాం. ఇల్లమ్మి, డబ్బు ఖర్చుపెట్టి అతన్ని చదివిస్తావు. ఏదో ప్రలోభంలో పడి నిన్ను చేసుకున్నాను, నువ్వు నాకు సరిపోవని గీతని అప్పుడుకూడా అనచ్చు. ఇప్పుడు నీకు మారుఆలోచనలు వచ్చినట్టు అతనికీ రావచ్చుకదా? నీ యిల్లమ్మి అతన్ని చదివించడమేమిట్రా? తెలివితక్కువ మాటలు. ఇల్లమ్మేసి ఎక్కడుంటావు? కృష్ణనేం చేస్తావు? ఇవన్నీ బాగా డబ్బున్నవాళ్ళ వ్యవహారాలు. ఇన్నాళ్ళూ లేని ఆలోచన ఇప్పుడెందుకొచ్చింది ప్రమీలకి? నువ్వు కూతురి పెళ్ళి చేస్తానన్నావు. అది విని ముగ్గురుపిల్లల చదువుకదా, ఒకరి ఖర్చు నీమీద పెడదామనుకుంది. అంతే ” తేల్చేసాడు.
రామారావుకి మబ్బువిడ్డట్టైంది. దూదిపింజలా తేలిపోయాడు. ఇంటికెళ్ళాక జరిగిందంతా యశోదకి చెప్పాడు. ఆమె అతన్ని ఎగాదిగా చూసింది. “వాళ్ళపిల్లాడు. వాళ్ళిష్టం. ఎంతేనా చెప్పించుకుంటారు. మనపిల్ల, మనిష్టం. తోచిన సంబంధం చేసుకుంటాం. పెద్దావిడని చెప్పడానికి వెళ్తే పెద్దరికం బాగానే నిలబెట్టుకుంది మీ చెల్లెలు” అంది.


“అంత స్నేహంగా తిరుగుతారు, బంధుత్వం ఎందుకు కలుపుకోలేదు?” అని రామారావునీ, త్రిమూర్తులినీ చాలామంది అడిగారు. కారణం శాఖాబేధం. మహాసముద్రంలో వచ్చి చేరే ఎన్నో నదులలాగ సమాజాన్ని పరిపుష్టం చేసే చిన్నచిన్న సమూహాలు చాలా వుంటాయి. విడివిడిగా వున్నప్పుడే నదుల వునికి. సముద్రంలో చేరితే అంతా ఒకటే. మనుషుల్లో కూడా ఈ బేధాబేధాలు అనివార్యంగా వుంటాయి. మృత్యుసముద్రంలో మనుషులంతా ఒకటే.
బతికే ప్రాంతం, అక్కడి వనరులు, పాలనావ్యవస్థ అతను నమ్మే సిద్ధాంతాలు, కొలిచే దేవుళ్ళు మనిషికి, అతనికీ అతని సమూహానికీ జీవనశైలిని యిస్తాయి. ఇది సాంప్రదాయంగా పరివర్తనం చెందుతుంది. ఇప్పుడు మొత్తం సమాజం లౌకికమైన వృత్తుల్లోనే వుంది. ఐనా మూలాలలో వున్నవాటిని వదులుకోలేకపోతున్నారు.
రామారావు, త్రిమూర్తులు బ్రాహ్మణ్యం అనే వృక్షానికి చెరో కొమ్మమీదా నిలబడివున్నారు. ఒకరు వైదీకులు, మరొకరు నియోగులు. శాఖాంతరాలు ఇంకా పాటిస్తున్నరోజులవి.


తెల్లారి మూడైంది. అంతా కలతబారిన మనసులతోనే ఒకరొకరుగా నిద్రలోకి జారుకున్నారు. గీతకి మరీ అంత గాఢమైన నిద్రపట్టలేదుగానీ వుండుండి మేలుకుంటూ మగతలోకి జారుతోంది.
ఒక్క క్షణంకూడా కనురెప్ప మూతపడనిది రామారావుకే. మహతి తల్లి నిర్మల తప్ప తన తల్లి కన్న సంతతి అందరూ బతికే వున్నారు. ఆమె గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు మిగిలివున్నారు. ప్రమీల, లక్ష్మి, పద్మల భర్తలు పోయారు. “అవంతీపురంవాళ్ళ రైలుబళ్ళు ప్లాట్‍ఫారంమీదికి వచ్చి ఆగివున్నాయి. దేవుడు ఎవరికి పచ్చజండా వూపితే వాళ్ళు ముందుకి సాగడమే” అంటుంది ప్రమీల.
చేసుకున్నప్పుడు చిన్నసంబంధాలే ఐనా అంతా పైకొచ్చారు. బేంకు బేలన్సుల్లోనూ, స్థిరాస్తుల్లోనూ తేడా తప్పిస్తే తనింటి కుదురులోంచీ వచ్చినవాళ్లందరి జీవితాలూ ఒకేలా వున్నాయి. ముగ్గురు, ఇద్దరు, ఒకరు పిల్లలు. వాళ్ళని చదివించడం, అమెరికా పంపడం, వీళ్ళు సంపాదించుకున్న డబ్బులు, పిల్లలు పంపే డబ్బులు. వెనుకటితరాలవాళ్ళు అనుభవించిన యిబ్బందులు లేవు. అప్పుడు కష్టాలనుకున్నవీ లేవు. అన్నీ బావున్నప్పుడు గీత ఎందుకిలా చేసింది? అదే ప్రశ్న, పదేపదే వెంటాడుతూ.
నెమ్మదిగా లేచి ఆమె పడుక్కున్న గదిలోకి వెళ్ళాడు. విశాలమైన పడగ్గది. గీతకి చెరోవైపునీ యశోదా, మహతీ పడుక్కుని వున్నారు. ఆ మంచానికి తలవైపు మరో మంచంమీద వాసు పడుక్కుని వున్నాడు. మిగిలినవాళ్ళు ఇంకోగదిలో వున్నట్టున్నారు.
కాళ్లవైపుని ఖాళీ వుంటే కూతురికీ మహతికీ మధ్యని సర్దుకుని కూర్చున్నాడు. అందరూ యాభైలు దాటినవాళ్ళే. ఒకప్పుడైతే ఇంట్లో అంతా పిల్లలే వుండేవాళ్ళు. జీవితం అనే నాటకం పరిసమాప్తికి వస్తున్నట్టనిపింది. తనకి యిన్నేళ్లకి అనిపించినది గీతకి అప్పుడే అనిపించిందా? ప్రేమలు, మమకారాలు, బంధాలు, అనుబంధాలు, కోపతాపాలు, అలకలు, చిక్కుముళ్ళలా వుండేవి ఒకప్పుడు. ఇప్పుడా ముళ్ళేవీ కనిపించట్లేదు. సీదాగా వున్న దారం ఒక్కటే కొనసాగుతూ కనిపించింది.
ఏం మిగిలింది యిళ్ళలో? ఈ అవంతీపురంలో? కొడిగట్టిన దీపాల్లా ఇంటికి ఒకరో ఇద్దరో పెద్దవాళ్ళు. ఇండియాలో వున్నా, బయటిదేశాల్లో వున్నా కదిలిరాలేనంత బలంగా పిల్లలని చుట్టుకున్న ఉద్యోగపాశాలు. ప్రైవేటుస్కూళ్ల వరదలో కొనవూపిరితో కొట్టుకుపోతున్న రాజావారి స్కూలు. బియ్యేలూ, ఎమ్మేలూ ఎవరూ చదవక ఉండనా, మూతపడనా అన్నట్టు చూస్తున్న రాజావారి కాలేజి. వాటిచుట్టూ రాజకీయాలు. డంపింగు యార్డులా మారిందని గిరీష్ చెప్పిన మునిసిపల్ గ్రౌండు. నిర్మానుష్యమైన రోడ్లు. ఇవన్నీ తామంతా నడిచి వచ్చినవే. తమందరి జీవితాలనీ ఆనందాలతో నింపినవే. మరిప్పుడెందుకు ఆ శక్తిని పోగొట్టుకున్నాయి? తమ పాదముద్రలు చెరిగిపోయే కాలం వచ్చింది. దాని పేరు మార్పైతే అది సంతోషాన్ని నింపాలిగానీ, ఈ బాధేమిటి?
“ఇక్కడ కూర్చున్నారేమిటి?” నిద్రలో పక్కకి వొరుగుతూ సగం మెలకువతో అతన్ని చూసి అడిగి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది యశోద. లేచి యివతలికి వచ్చాడతను.


“ఏమిటి, నిన్నంతా యిండియానుంచీ ఒకటే కాల్స్?” అడిగింది రమ, సుధీర్‍ని. అతనే చెప్తాడని రోజంతా ఆగింది. ఆమెకూడా డాక్టరే. ఎవరికివారే బిజీగా వుంటారు. కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి ఇప్పటికి తీరిక చిక్కింది.
“గీత సూసైడ్ చేసుకోబోయింది” అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా చూసింది. తర్వాత అతినెమ్మదిగా అడిగింది, ఎప్పట్నుంచో దాచుకున్న ప్రశ్నని.
“నీకు తనంటే యిష్టంకదూ?”
అతను వులిక్కిపడ్డాడు. కళ్ళలో తడబాటు. వెంటనే సర్దుకున్నాడు.
“ఇష్టమంటే? ప్రత్యేకమైన యిష్టం ఏం వుంటుంది? మామయ్య కూతురు. మేము చాలామంది కజిన్స్‌మి. తరుచు కలుసుకునేవాళ్ళం. పదకొండుమందిమి కలిసి తిరిగేవాళ్ళం. మిగతావాళ్ళు మరీ పిల్లలు. వాళ్ళు మా చుట్టూ వుపగ్రహాల్లా తిరిగేవాళ్ళు. మళ్ళీ మాలో మాకు గ్రూపులు. ప్రహ్లాద్, సుమతి పుస్తకాలు బాగా చదివేవారు. మహతీ, గీతా, రవళీ అలా చెవులు కొరుక్కుంటూ వుండేవారు. ప్రహ్లాద్ బైటికొచ్చినప్పుడు ఎత్తుజోళ్ళేసుకుని మాతో వుండేవాడు. ఇంటికొచ్చాక వాడి గ్రూపు వేరే వుండేది. వాడికి హైట్ కాంప్లెక్స్ బాగా వుండేది. వాసు గొడుగుకర్రలా, మేమంతా దానిచుట్టు వుండే చువ్వల్లా వుండేవాళ్ళం. వాడు మంచి హైటు. ఆరూ రెండు.” అంటూ ఏవేవో మాట్లాడాడు.
“ఇడియట్. నా ప్రశ్న దాటెయ్యడానికి యిదంతా చెప్తున్నావా?” చిరుకోపంతో అడిగింది రమ.
అతను బలహీనంగా నవ్వాడు.
“ఫస్ట్ క్రష్. మామయ్య కూతురుకదా, అదో డ్యూటీలా అందరం తనని ప్రేమించేసాం. అది మాత్రం వాసుని చేసుకుంటానని చెప్పింది. వాడూ తనని తప్పించి ఇంకొకర్ని చేసుకోనని చెప్పేసాడట. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. పెద్దయాక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదే లేదు, ఎప్పుడంత ప్రేమలో పడ్డారా అని” అన్నాడు.
ఫస్ట్ క్రష్. చిన్నగా నవ్వొచ్చింది రమకి. ఆడపిల్లలకేనా, మగపిల్లలకేనా తప్పదు. లింగస్పృహ కలిగాక హార్మోన్ల ప్రభావంవలన మొదట్లో మనసు అలజడిగా వుంటుంది. మనసుకి ఎవరేనా నచ్చితే అదే ప్రేమ అనేసుకునే అమాయకత్వం వుంటుంది. క్రమంగా ఆ యిష్టాలు మారతాయి. జీవితంలో చేరుకోవలిసిన గమ్యం ఏమిటో అర్థమౌతుంది. అప్పుడీ యిష్టాలవీ వెనకపడతాయి. వాటికి ప్రాధాన్యత యిస్తే, ఆ ఆసక్తులు మనిషిని అక్కడే ఆపుతాయి. ఎదగనివ్వవు. అందుకే వాటిని జయించాలి.
సుధీర్ ఆమె చేతిని అందుకుని మృదువుగా పెదాలకి తాకించుకున్నాడు. “నిన్ను మోసం చెయ్యలేదు రమా! వాసు నాకు తమ్ముడు. తమ్ముడి భార్యని మనసులో వుంచుకునేంత మూర్ఖుడిని కాదు. ఇంక యిష్టమంటావా, గీత నా చిన్నప్పటి ఫ్రెండు, కజిన్” అన్నాడు.
“సిల్లీ! అదేం లేదు. అలాంటిదేం లేదు. ఆమె పేరు చెప్పగానే నీలో చాలా మార్పొస్తుంది. ఎన్నోసార్లు అడగాలనుకుని నువ్వేమనుకుంటావోనని అడగలేదు. నిన్నట్నుంచీ నువ్వు పడుతున్న టెన్షన్ చూసాక అడగాలనిపించి అడిగాను. నేను గీతని చూసానుకదా, ఆమెని యిష్టపడకుండా ఎవరూ వుండలేరు” అంది, అతని చేతిని గట్టిగా పట్టుకుని. ఆమె మనసు తేలికపడింది. ఒక అనుమానం వుంటుంది. అది నివృత్తి కావాలని కోరుకుంటాం. ఆ నివృత్తి మనకి అనువుగానే వుండాలనీ కోరుకుంటాం. రమ కోరుకున్నట్టే అతను చెప్పాడుగాబట్టి ఆమె మనసు తేలికపడింది.
కానీ అతనికి తెలుసు, తనలోని ఒక చిన్నభాగం ఎక్కడో పోయిందనీ, అది పోగొట్టుకోగా మిగిలిన తనే ఆమెకి పరిపూర్ణమైన మనిషిలా పరిచయమయ్యాడు, అలానే అనిపిస్తున్నాడనీ. ఈ రహస్యాన్ని గుర్తించిన మరోవ్యక్తి మహతి.
“ఇండియా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. నువ్వూ రాకూడదూ? మహతి కూతురు మేఘన బావుంటుంది. ఫోటోస్‍లో చూసాను. ముంబైలో పుట్టి పెరిగింది. వ్యాస్‍కి నప్పుతుంది. నువ్వూ చూడచ్చు దాన్ని. నీకూ, వాడికీ నచ్చితే ముందుకి వెళ్దాం” అన్నాడు. ఆమె తలూపింది. వేదవ్యాస్- వ్యాస్ వాళ్ళ పెద్ద కొడుకు. ధరహాస్- హాస్ రెండోవాడు. ఇద్దరికీ అక్కడే వుద్యోగాలు.
“అమ్మ విషయంకూడా ఆలోచించాలి. ఎక్కడికీ రాదు. ఒక్కర్తే వుంటోంది. సూపర్ సీనియర్స్ బేచి అందర్నీ ఒకచోట చేర్చితే బావుంటుందని వాసు ఒకసారి అన్నాడు. ఎవరిళ్ళలో వాళ్ళు మహరాజులూ, మహరాణులూను. ఎవరికీ వాళ్ళ సామ్రాజ్యాలు వదిలిపెట్టి రావాలని లేదట” అన్నాడు. దానికీ తలూపింది రమ.
మేఘనగురించి చాలా ప్రశ్నలడిగింది. అతని సెల్లో వున్న ఫొటోలు చూసింది. కొన్ని ఆశలని నింపుకుని వధువు అన్వేషణకి సిద్ధపడింది. అవేం పెద్ద ఆశలు కావు. కొడుకు పెళ్ళి చిరకాలం వుండాలని, కొడుకూ కోడలూ తమ కుటుంబంలోని వుపభాగంగా వుండాలని, గొడవలు తలెత్తకూడదని, ఇలాంటివే. సగటు కోరికలు.
అతనికి గుడ్‍నైట్ చెప్పి తను నిద్రకి వుపక్రమించింది రమ. అతను మాత్రం ఏవో ఆలోచనల్లో కొట్టుకుపోయాడు. గీతని మర్చిపోయాడా తను, ఈ యిన్నేళ్ళలో ఎప్పుడేనా? లేదు. తనలోంచీ వెళ్ళిపోయిన మనిషి, గీత జ్ఞాపకాలని వెంటబెట్టుకుని అప్పుడప్పుడు తిరిగివస్తుంటాడు. బాల్యం, కలిసి ఆడుకున్న, తిరిగిన రోజులు గుర్తొస్తాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. మనసు ఒక దీనమైన స్థితిలోకి చేరుకుంటుంది. గీతకి సన్నిహితంగా, స్నేహితుడిలా మెసిలిన ఆ రోజులు మళ్ళీ వచ్చేస్తే బావుండునని వుంటుంది. అప్పట్లో కలిసి వుండాలని ఎలాంటి ఆకాంక్షా లేదు. విడిపోతామన్న భయమూ లేదు. తనూ, మహతీ, మిగిలినవాళ్ళూ చదువుకుంటున్నారు. వాసుకీ, గీతకీ వుద్యోగాలు వచ్చాయి. అదేం పెద్దవిషయంలా అనిపించలేదు. చదువుల తర్వాతి అధ్యాయంలా అనిపించింది. పెళ్ళిగురించి ఏమీ అనుకోలేదు. గీత ఆడపిల్లకాబట్టి తొందరగా పెళ్ళి చేసేస్తారనీ వూహించలేదు. హఠాత్తుగా వురమని పిడుగులా వచ్చింది ఆ ప్రతిపాదన.
“సాయంత్రం రాము వచ్చాడు. కూతురికి పెళ్ళి చేస్తాడట” అంది తన తల్లి, తండ్రితో ఆరోజు భోజనాలప్పుడు. ఆ గొంతు ఇప్పటికీ తనకి వినిపిస్తునే వుంటుంది. పక్కని నిలబడి ఆవిడ అంటున్నట్టూ తను వింటున్నట్టూ వుంటుంది.
భార్య చెప్పింది విన్నాడు గురుమూర్తి. సుధీర్ తినడం ఆపేసాడు.
“సుధీర్ని అల్లుడిని చేసుకుని చదివించుకోమన్నాను” అంది.
“ఎమ్మెస్ చెప్పించడం ఆయనవల్లనేం ఔతుంది?” కొంచెం చులకనగా అన్నాడు. భార్యాభర్తలిద్దరూ వుద్యోగాలు చేసి సంపాదించుకుని ఒకస్థాయికి చేరుకున్నాక ఆయనకి కొంచెం గర్వం వచ్చింది. అందులోనూ పిల్లలకి మంచి చదువులుకూడా రావటంతో కాళ్ళు నేలమీద ఆనడం లేదు.
“ఎందుకు చదివించలేడు? తలుచుకుంటే సాధ్యం కానిదేముంది?” అంది ప్రమీల.
“నన్ను మామయ్య చదివించడమేమిటమ్మా?” చప్పుని కలగజేసుకున్నాడు సుధీర్.
“మరి?” అడిగింది ప్రమీల. ” నీకు తెలీదు సుధీర్! చిన్నవాడివి, చిన్నవాడిలాగే వుండు. డాక్టరల్లుడంటే వూరికే రాడు. అలాగని కట్నం యిమ్మని అడగలేంకదా?” అంది.
“నాకు గీతంటే యిష్టం. నా చదువు యిష్యూ కావటం నాకిష్టం లేదు. ఎంబీబియెస్‍తో ఆపేస్తాను. ప్రాక్టీస్ మొదలుపెడతాను” అన్నాడు.
“రెండురూపాయలూ, ఐదురూపాయలూ ఫీజు తీసుకుంటూ ఆరెంపీలతో పోటీ పడతావా? రేయ్, తెలివితక్కువగా మాట్లాడకు” అన్నాడు గురుమూర్తి. సుధీర్ తండ్రికి ఎదురు మాట్లాడలేకపోయాడు.
“చెల్లికి కాకుండానే చేసుకుంటావా? అది రిసెర్చికూడా చేస్తానంటోంది. ఎంబీబీయెస్‍తో ఆపేసి, దాని చదువయ్యేదాకా ఏం చేస్తావు? మీ ముగ్గురి పేర్లముందూ డాక్టర్ అని చూసుకోవాలని నాన్న కోరిక. తాంబూలాలు పుచ్చుకుని ఆగుతాం. అందరి చదువులూ అయ్యాక పెళ్ళి. మామయ్య నీ చదువుకి ఖర్చుపెడితే గీతకి పెట్టుకున్నట్టు కాదా? నీ హోదా దానిది కాదా? పెద్దవాళ్ల లెక్కలు యిలాగే వుంటాయి” అంది ప్రమీల.
అతను తినడం ఆపి చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. ప్రమీల కొడుకు వెంట వెళ్ళింది.
“నాకు గీతంటే చాలా యిష్టం అమ్మా! ప్లీజ్, అర్థం చేసుకోండి. మామయ్య చదివించలేనంటే వాళ్ళకి నో చెప్పేస్తారా?” అడిగాడు.
“అలా ఎందుకంటాడురా? ఇలాంటి సంబంధం ఎందుకు వదులుకుంటాడు? ఏవో ఒక తిప్పలు పడతాడు. ఇప్పుడు కష్టమనిపించినా, ఆ తర్వాత పిల్లల సుఖపడుతుంటే చూసేది ఆయనేకదా?” అని కొడుకు ముఖంలోకి చూసి, “ఈరోజేకదా, ప్రస్తావన వచ్చింది, కాస్త ఆగు సుధీర్. మనం కొంచెం బెట్టుగా వుండాలి. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నేనేనా మామయ్య పెట్టగలడని తెలిసే అడుగుతున్నాను. లేకపోతే అడగను. నా పుట్టింట్లో ఏం వుందో నాకు తెలీదా? పెళ్ళి అన్నాడు కాబట్టి అడిగాను. ఇన్నాళ్ళూ అడిగానా? ఆడపిల్లలకి పెళ్లప్పుడు పెట్టుకోవడం సహజం. గీత వాళ్ల కూతురు. పెట్టుకుంటారు. అవన్నీ నీకు అనవసరం. నీ చదువేదో నువ్వు చూసుకో” అని వెళ్ళిపోయింది.
ఇద్దరు వుద్యోగాలు చేస్తూ తమ చదువులకి డబ్బు సమకూర్చడానికి కిందుమీదులౌతున్నారు తల్లీతండ్రీ. ఒక్క జీతంతో మేనమామ ఎలా ఖర్చుపెట్టగలడో అర్థమవలేదు అతనికి. చదివిస్తే అమ్మానాన్నలు చదివించాలిగానీ, ఆయన చెప్పించడమేమిటి? అసలు అలాంటి ఆలోచన అమ్మకి ఎలా వచ్చింది అసహ్యంగా? అంత చదివించలేకపోతే ఇక్కడితో ఆపెయ్యాలి. తనకి ఎమ్మెస్, చెల్లికి డాక్టరేట్ అవసరమా? అంతగా సరదా వుంటే తను కాస్త కుదురుకుని తమ్ముడికి చెప్పించవచ్చుననిపించింది సుధీర్‍కి తల్లి అంత చెప్పాకకూడా. మాటల్ని ఎంత జాగ్రత్తగా పేర్చినా, వాటి వెనుక నిగూఢంగా మనసులో వుండే భావాన్ని దాచలేదు. తల్లిలో స్వార్థంలాంటిది కనిపించింది సుధీర్‍కి.
“ఏమంటాడు?” అడిగాడు గురుమూర్తి.
“ఏముంది? గీతంటే నాకిష్టం, దానికోసం చదువు ఆపేస్తానంటాడు. ఈ ప్రేమలేమిటోగానీ, పిల్లలని చెడగొట్టడానికే వచ్చాయి. అసలు అన్నయ్యకి అదేం బుద్ధి? దానికేం పాతికలు మించిపోయాయా, ఇప్పుడే పెళ్ళి చేసెయ్యడానికి? ” అని చిరచిరలాడింది.
“గీత భలే వుంటుందమ్మా! అందుకే వాడు మనసు పారేసుకున్నాడు. దాన్నింక వదిన అనాలేమో! గీత, పిలక జడల పీత అనడానికి లేదు. ఐనా, మనింట్లో చదువులకోసం మామయ్యావాళ్లనీ పెళ్ళి ఆపుకోమనడం బాలేదు” కిచకిచలాడాడు రెండోకొడుకు సుమంత్. ప్రమీల కోపం పట్టలేక అతని వీపుమీద ఒక్క చరుపు చరిచింది. ఆమె చేతికున్న మట్టిగాజులు రెండు విరిగాయి.
“చెయ్యి నొప్పెట్టిందామ్మా?” మళ్ళీ కిచకిచలు.
మర్నాడు రవి వచ్చాడు. అతనో ఆలిండియా రేడియో. అందరిళ్ళకీ తిరుగుతూ అక్కడి వార్తలు ఇక్కడా యిక్కడి వార్తలు అక్కడా చేరవేస్తూ వుంటాడు.
“ఏమిటి, పెద్దస్వాములవారేదో శుభకార్యం తలపెట్టారట?” అన్నాడు వస్తూనే. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకోసం రామారావు పెళ్ళి వాయిదా వేసుకోవడం అతనికి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అదంత అవసరం లేనిదని అతని భావన. అందుకే అలా అంటాడు అన్నగారిని.
“అప్పుడే నీదాకా వచ్చిందా?” అడిగింది ప్రమీల.
“అరుణ చెప్పింది” అన్నాడు.
“నేను అన్నదాంట్లో తప్పేం వుందో చెప్పరా! దండిగా కట్నం యివ్వకపోతే డాక్టరు అల్లుడు వస్తాడా? ఉన్నదంతా పుస్తీపుడకాతోసహా అమ్మి మా సరదాలన్నీ చంపుకుని మరీ పిల్లలని చదివిస్తున్నాం. అందులో ఒకతి ఆడపిల్ల. దానికి తగ్గ సంబంధం తేవాలంటే వాళ్ళుమాత్రం వుత్తిగా చేసుకుంటారా? స్వంతఅన్నగారిని, అందులోనూ మనకి ఎంతో చేసినవాడిని కట్నం యిమ్మని అడగలేను. అందుకే సుధీర్ చదువులో సాయం చెయ్యమన్నాను. గీత నాకు పరాయిదా? వీడు ఇక్కడితో చదువాపేస్తే దాని వుద్యోగంమీద ఆధారపడి బతకాలి యిద్దరూ. అదెంత వుద్యోగమని? ఫ్యూచరు ఏం వుంటుంది వాళ్ళకి? అవసరమా, అంత కష్టపడటం? సుధీర్‍గాడేమో వాళ్లని అలా అడగడం తప్పంటాడు. పెళ్ళిమాత్రం దాన్నే చేసుకుంటాడట” అంది ఆరోపణగా.
“ఆయనేమన్నాడు?” అడిగాడు రవి.
“ఆలోచించుకుని చెప్తానని వెళ్ళాడు” అంది.
“ఆలోచనా లేదు, ఏమీ లేదు. ఆ త్రిమూర్తులు దగ్గిరకి వెళ్తాడు. ఆయనెంత చెప్తే యీయనకి అంత” అన్నాడు నిరసనగా. తమ కుటుంబవిషయాల్లో త్రిమూర్తులి జోక్యం రవికి నచ్చదు. తనకి పిల్లనిచ్చిన మేనమామ వున్నాడు. ఆయన తమ్ముడేకాక, అక్కల భర్తలున్నారు. వీళ్ళెవర్నీ అడక్కుండా, ఎవర్నీ దగ్గిరకి రానివ్వకుండా బైటివాడైన త్రిమూర్తులి చుట్టూ తిరుగుతుంటాడు, రామారావని కోపం.
అందరికన్నా ఆఖరివాడు రవి. తండ్రి పోయినప్పటికి ఏడాది. అప్పటి పరిస్థితులు స్వయంగా చూడలేదు. చూసినంతవరకేనా అర్థం చేసుకునే వయసు లేదు. పెళ్ళి విషయంలో పద్మ చేసిన గొడవతో అతనికి అభిప్రాయాలంటూ ఏర్పడటం మొదలైంది. ఆరుగురూ అతనికి అక్కలే. అన్న వాళ్ళకి చెయ్యాల్సినవి సరిగ్గా చెయ్యలేదనుకుంటాడు. కనీసం వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే వీలుకూడా యివ్వలేదని అతని భావన. చదివించి వుద్యోగాల్లో పెట్టేస్తే వాళ్ళది వాళ్ళు చూసుకునేవాళ్ళని యిప్పటికాలానికి అప్పటి పరిస్థితులని అన్వయించుకుంటాడు.
ప్రమీలకి అతను అన్నని చులకనగా మాట్లాడటం నచ్చలేదు. అన్న అని చెప్పుకోవడమేగానీ, తనకన్నా ఏడాదే పెద్ద. ఆ పంథొమ్మిదేళ్ళ పిల్లవాడూ ఇంత కుటుంబాన్నీ వొడ్డుకి చేర్చిన వైనం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పటికీ. అతనికి అండగా నిలబడి, త్రిమూర్తులు అన్నమాటలు మర్చిపోలేదు.
తన తండ్రికి ఆస్తులేం లేవు. వంశపారంపర్యంగా వచ్చిన ఆయుర్వేదవైద్యం చేసేవాడు. అదే జీవనోపాధి. హస్తవాసి మంచిదన్న పేరుండేది. రాజావారి కుటుంబానికి ఇతనే వైద్యుడు. వాళ్ళేదో కొద్దిగా యిచ్చేవారు. అలాంటివి ఇంకో రెండుమూడు ధనికకుటుంబాలుండేవి. వాళ్ళూ యిచ్చేవారు. అదే నికరాదాయం. తల్లి ఒక్కర్తే కూతురవటం, ఆవిడ కుటుంబం పెద్దది కావటంతో అమ్మమ్మ బియ్యం పంపేది. ఉండటానికో యిల్లుండేది. ఆరుగురు ఆడపిల్లలని తినీ తినకా పావలా అర్ధా మిగిల్చి, పోగుచేసి, పోస్టాఫీసులో దాచేవాడు తండ్రి. ఎంత గడ్డుపరిస్థితి వచ్చినా అందులోంచీ తీసేవాడు కాదు. దాన్నిగురించే త్రిమూర్తులు అన్నది, “ఆరుగురు ఆడపిల్లల వుమ్మడిసొత్తు” అని.
పెద్ద మొత్తమేమీ కాదు. ఐనా అన్నకి ధైర్యాన్నిచ్చింది. కొంత చేతిలో వుంది, ఇంకొంత కలిపితే ఓ పనైపోతుందనే నమ్మకాన్ని యిచ్చింది. ఐదువందలు కట్నం యిచ్చి, భర్తకి వాచీ వుంగరం పెట్టాడు తన పెళ్ళికి. తనకి చెవులకీ, ముక్కుకీ పెట్టి కన్యధారపోసారు. పెళ్ళికి కన్యాదానం పీటలమీద కూర్చున్నందుకు మేనమామ పెట్టిన నసకూడా మర్చిపోలేదు ప్రమీల.
“దిక్కుమాలినవాళ్ళ పెళ్ళి. ఉన్నదేదో దాచేసుకున్నారు. ఇంత కనాకష్టంగా ఎవరూ చెయ్యరు. ఎంత లేనివాడూకూడా ఇలా కక్కుర్తిపడడు. ఇంట్లోవాళ్ళని మానేసి, బైటివాళ్లని నమ్మితే యిలానే వుంటుంది. తనింట్లో పెళ్ళిళ్ళు యిలానే చేసాడా, ఆ త్రిమూర్తులు?” అంటూ చాలా గొడవచేసాడు. చాలాకాలం తనూ అలానే అనుకుంది.
“కొబ్బరాకుల బూరాలు వూదించి పెళ్ళి చేసాడు మీ అన్న” అని గురుమూర్తీ అంటాడు.
తన తరవాతిది లక్ష్మి. లక్ష్మి అత్తగారికి తన తండ్రి వైద్యం చేసి పార్శ్వనొప్పి తగ్గించాడట. ఆ కృతజ్ఞతతో వాళ్ళు కట్నం ఏమీ అడక్కుండా చేసుకున్నారు. నిర్మలది వుభయఖర్చుల పెళ్ళి. మిగిలిన ముగ్గురివీకూడా క్లుప్తంగానే జరిగాయి. ఆడపిల్లలని గౌరవంగా యిల్లు దాటించడానికి అన్న తన గౌరవాన్నీ, అభిజాత్యాన్నీ, పౌరుషాన్నీ అన్నిటినీ పణంగా పెట్టేసాడు. ఒక వుద్యమంలా చేసాడు. ఈరోజుని తనకి పూర్తిగా అర్థమైంది, ఆరోజుని అన్న నిలబెట్టిన దీపాలే తామంతా అని.
“ఏదోలేరా, రాముని మొదట్నుంచీ చెయ్యిపట్టుకుని నడిపించింది త్రిమూర్తులు. ఆయనకి వీడంటే ఎందుకో అంత ప్రేమ. ఇద్దరూ కలిసి అందరికీ మంచే చేసారు. చేసిందంతా చేయించుకుని మాటలు అనడం దేనికి?” అంది. మనసులోంచీ వచ్చే కృతజ్ఞత వేరు, వాస్తవంగా ఎదుర్కోవలసిన అనుభవం వేరు. కొడుకుని చదివించగలిగినంత చదివించి, ప్రయోజకుడిని చేసి, “నీ కూతుర్ని కట్నం లేకుండా చేసుకుంటాను” అనడం కృతజ్ఞత ఔతుంది. ఆమెకి అంత స్వతంత్రం లేదు. కుటుంబంలోనూ, ఆలోచనలపరంగానూ కూడా.
గురుమూర్తికి కొడుకులమీద చాలా ఆశలున్నాయి. సుధీర్ పెళ్ళికి వచ్చిన కట్నంతో సుమతి పెళ్ళి చెయ్యాలి. అదొక ముడి. రామారావు, సుధీర్ చదువు ఖర్చంతా పెట్టుకుంటానంటే ప్రమీల భర్తని కొంత వంగదీయగలదు. అలాకూడా రామారావు పెళ్ళి యిప్పుడే చేద్దామంటే సుమతి పెళ్ళికి వెతుక్కోవాలి. ముందుగా అతని దగ్గిరే కొంతడబ్బు తీసుకుని సర్దుబాటు చేసుకోవాలి. ఇది మరోముడి. రిసెర్చి చెయ్యాలన్న కోరిక తామే ఎక్కించి, అది మానేసి పెళ్ళి చేసుకోవాలంటే కూతురు వింటుందా? అది మరో ముడి. పోనీ వదిలేద్దామా అంటే సుధీర్ గీతనే చేసుకుంటానని చెప్పేసాడు. గురుమూర్తి అతని ఆలోచనల్లో అతనున్నాడు.
రవి భుజాలు ఎగరేసాడు.
“మీ అందర్లాంటి సంతృప్తప్రాణిని కాదు నేను. కాబట్టే ఈరోజుని యిలా వున్నాను. సర్లే. అవన్నీ ఆయనకి అర్థం కావు. నేను అట్నుంచీ నరుక్కొస్తాను” అన్నాడు.
“అంటే?” అడిగింది ప్రమీల.
“గీతతో మాట్లాడతాను. సుధీర్ని తప్ప యింకెవర్నీ చేసుకోనని దానిచేత అనిపిస్తే ఆయనే దిగొస్తాడు. జరగాల్సినవన్నీ వాటంతట అవే జరుగుతాయి”
“ఏమోరా! నాకు ఎటూ తోచట్లేదు. చేస్తున్నది తప్పో వొప్పో అర్థమవట్లేదు. కానీ ఇంతంత ఖర్చులు పెట్టి పిల్లల్ని చదివించాక ఎంతో కొంత తిరిగి రావాలని వుంటుంది. కట్నాలు తీసుకోవద్దంటారుగానీ ఈ ఖర్చుల్లోంచీ, అప్పుల్లోంచీ బైటపడాలంటే తీసుకోక తప్పదు. పిల్లల్ని చదివించి మేం అడుక్కుతినలేంకదా? ఆదర్శాలు మాట్లాడటం తేలిక” తనకి తను సర్ది చెప్పుకుంటున్నట్టు అంది. సరిగ్గా యిదే పద్మకి రామారావు చెప్పినది.


అప్పుడే లంచి చేసి వచ్చి సీట్లో కూర్చుంది గీత. వచ్చి ఎదురుగా నిలబడ్డ పినతండ్రిని చూసి ఆశ్చర్యపడింది. వాళ్ళిళ్ళల్లోనూ, వీళ్ళిళ్ళల్లోనూ కలుసుకోవటాన్నిమించి ప్రత్యేకమైన రాకపోకల్లేవు అతనికీ వాళ్ళకీ. ఆ కలిసినప్పుడుకూడా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోరు. ఒకళ్ళున్నచోట ఇంకొకరు వుండరు. పక్కకి తప్పుకుంటారు. రవిది కొంత అహంభావం. రామారావుది గాయపడ్డ అభిమానం. గీతని బానే పలకరిస్తాడు రవి. ఒకటిరెండుసార్లు మిగతావాళ్లతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిందికూడా. రామారావు అభ్యంతరపెట్టలేదు.
“పూర్తిగా తెంపుకోవటం దేనికి?” అంది యశోదకూడా.
“ఏంటి బాబాయ్ యిలా వచ్చావు? ఏదేనా పనా?” అడిగింది గీత.
“పనే. మాయింటికి వెళ్దాం. నీతో మాట్లాడాలి. పర్మిషన్ తీసుకుంటావా?” అన్నాడు. ఆమెకి అర్థమవలేదు. ఏదేనా వుంటే ఇక్కడే చెప్పచ్చు, సీటుదగ్గరో, పక్కకి వెళ్ళి క్లబ్‍రూంలోనో కూర్చుని. ఇంటిదాకా ఎందుకు? అంత ముఖ్యమైన విషయాలు తనతో ఏముంటాయి అనుకుంది. కానీ అడగలేదు.
“సగంపూట సీయల్ పెడతాను. అట్నుంచి యింటికెళ్ళిపోతాను” అని అప్లికేషన్ రాసి యిచ్చి వచ్చింది. అతని స్కూటర్‍మీద యిద్దరూ వెళ్ళారు. రవి భార్య కుసుమ. ఆమెకూడా గీతలాగానే కాస్త ఆశ్చర్యపోయింది ఈ రాకకి. ఇద్దరూ ఎక్కడ కలిసారు? రవి వాళ్ళింటికి వెళ్ళడు. మరి ఆఫీసునించీ తీసుకొచ్చాడా? ఏదో వుందని అర్థమైందిగానీ గీతలాగే బయటపడలేదు.
“ఏమే, అమ్మా నాన్నా బావున్నారా? తమ్ముడెలా చదువుతున్నాడు? తెలీనివేవైనా వుంటే వచ్చి బాబాయ్‍ని అడిగి తెలుసుకోవచ్చుకదా? వాడసలు రానే రాడేమిటి?” అని పలకరించింది. ఆమెది మేనరికం. రవికి మేనమామ కూతురు. బంధుత్వాల్లో శతృత్వం పాటించడం కష్టం. ఈ విషయంలో రవి వంటరివాడు. అన్నతో శతృత్వాన్ని అతనొక్కడే పాటిస్తున్నాడు. కుసుమ రాకపోకల్లో అంటీముట్టనట్టు వుంటుంది. అనుబంధాల్లోమాత్రం అతుక్కుపోయినట్టే.
వాళ్ల పిల్లలగురించి అడిగింది గీత. రవికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ ఇంకా స్కూలుచదువుల్లోనే వున్నారు.
“ఆఫీసునించీ వస్తున్నావా? అన్నం పెట్టనా? కాసేపాగి తింటావా?” అడిగింది.
“నా లంచి ఐపోయింది పిన్నీ! మీరిద్దరు తినెయ్యండి. నేను కూర్చుంటాను. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చాడు బాబాయ్” అంది గీత. అదేమిటో కుసుమకీ తెలీదు. ఆ పిల్లతో అంత వ్యవహారాలేం వుంటాయి?
“బాక్స్‌లో తిన్నదాంతో కడుపెక్కడ నిండుతుందే? కొంచెం పెరుగన్నం తిను. పోనీ వుప్మా చెయ్యనా?” కుసుమలో ప్రేమ. మేనత్త పెద్దకొడుకు రామారావు. ఆయన కూతురు. ఒకవైపుని రక్తస్పర్శ. మరోవైపుని ప్రేమ. గీతకి ఆ ప్రేమ తెలుసు. అనుభవమే. పంతాలు మగవాళ్ల మధ్యని. మధ్యవాళ్ళు ఎగేసేవి.
“అవేం వద్దు పిన్నీ! అమ్మ బాక్స్‌నిండా బాగానే సర్దుతుంది. మీరు తినెయ్యండి” మరోసారి చెప్పింది.
ఆమెకి ప్లేటునిండా జంతికలూ, రెండు కజ్జికాయలూ పెట్టిచ్చి, భార్యాభర్తలిద్దరూ భోజనానికి కూర్చున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుంది గీతకూడా. ఇలా బల్లముందు కూర్చుని తినడం ఇంకా కొత్త గీతకి. ఆఫీసులో వేరు. ఇంట్లో పీటలమీదే కూర్చుని తింటారు. రామారావనేకాదు, అందరిళ్ళలోనూ అదే పద్ధతి. ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. రవి యిల్లు అధునాతనంగా వుంది. పెద్దరేడియో, టూ ఇన్ వన్, కేసెట్లు అన్నీ వింతగా చూసింది. బ్లాక్ అండ్ వైట్ టీవీ, సెమీవాషింగ్ మిషన్ కూడా వుంది. ఫోనుకి అప్లైచేసాడట. ఇక్కడ చూసి మిగిలినవాళ్ళుకూడా డెకొలం మంచాలు, గేస్ స్టవ్, భోజనాల బల్ల, కుక్కర్లు, మిక్సీలు,టీవీలు అమర్చుకుంటున్నారు. అవి స్టేటస్ సింబల్స్‌గా మారాయి. ఫోన్‍కి అప్లై చేస్తున్నారు.
“నీకు ఎన్నేళ్ళే గీతా?” వున్నట్టుండి అడిగాడు రవి.
“అదేమిటి, నీకు తెలీదా?” ఎదురు అడిగింది ఆమె.
“నాకు తెలీకేమి? నీకు గుర్తుందో లేదోనని”
“అర్థం కాలేదు”
“మీ నాన్న నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాడట? ఇప్పుడే పెళ్ళేమిటమ్మా? చక్కగా చదువుకోక ఈ వుద్యోగం దేనికి అసలు?” అడిగాడు.
“నాన్నకి ఇవన్నీ తెలీదా?”
“మీ నాన్నకేం తెలుసో నాకెందుకు తెలీదుగానీ? సరే, పెళ్ళనుకుంటున్నారుకాబట్టి నా మాట విను. ప్రమీలకి నిన్ను సుధీర్‍కి చేసుకోవాలని వుంది. వాడు చక్కగా డాక్టరు. చదువైందంటే బోల్డు సంపాదన. హాయిగా బతకచ్చు. మీ నాన్నకి చెప్పు, సుధీర్ని చేసుకుంటానని” అన్నాడు.
గీత అతనికేసి సూటిగా చూసింది. వాసుగురించి తండ్రితో చెప్పినప్పటి సిగ్గు ఇప్పుడు లేదు. అక్కడ అనుభూతి. తండ్రిముందు మనసు వ్యక్తీకరించడం. ఇక్కడిది వ్యవహారం. ఆమె ఆలోచనలన్నీ స్పష్టంగానే వున్నాయి.
“నాకు సుధీర్ గురించి అలాంటి ఆలోచన లేదు బాబాయ్! మాకూ వాళ్లకీ చాలా తేడా వుంది. అతని అమ్మానాన్నలిద్దరూ వుద్యోగస్తులు. బాగా సంపాదిస్తారు. సుధీర్‍వాళ్ళ చదువులమీద చాలా ఖర్చుపెడుతున్నారు. పీజీకూడా చేస్తాడట అతను. ఇంకా ఖర్చుకదా? వాళ్ళు బాగా కట్నం అడుగుతారేమో! మా నాన్న అంత కట్నం యివ్వలేడు” అంది. ఆమె అంత బాహాటంగా అంటుందని వూహించని రవి కంగుతిన్నాడు. కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని అర్థమైంది. కుసుమకూడా ఆశ్చర్యపోయింది ఆ పిల్ల పరిణతికి.
“మేనరికాల్లో కట్నాలేం వుండవు. వాడి చదువులో సాయం చెయ్యమంటుంది అత్త. స్వంత అన్నకదా, ఆపాటి అడగడంలో తప్పేం వుంది? మీ నాన్నమాత్రం కాదంటాడా? నీమంచికే కదా? చిన్నపిల్లవి, నీకు తెలీదు” అన్నాడు రవి.
“పీజీ అంటే ఖర్చు లక్షల్లో వుంటుందనుకుంటా. నాన్నవల్ల కాదు”
“ఇల్లుందికదే, అమ్మేస్తాడు. ఆడపిల్ల పెళ్ళికి అమ్మటంలో తప్పు లేదు. మనలాంటి యిళ్ళలో అంతే. దాంతో కృష్ణ చదువుకూడా ఐపోతుంది”
“ఇల్లమ్మేస్తే అమ్మావాళ్లెక్కడుంటారు?”
“కొన్నాళ్ళు అద్దె యింట్లో వుంటారు. కృష్ణకి వుద్యోగం వచ్చాక మళ్ళీ కొనుక్కుంటారు”
“అప్పుడది తమ్ముడిది ఔతుంది. నాకు పుట్టిల్లంటూ వుండదు. నాన్నకి కాలికింద నేలా, నిలవ నీడా వుండవు. నేను ఆయనకి కూతుర్ని. తమ్ముడినో, చెల్లెలినో కాదు, పెళ్ళై వెళ్ళిపోగానే నాదారి నాదనుకోవడానికి”
రవి ముఖం నల్లబడింది. ఇంక చెప్పడానికి మాటలు దొరకలేదు.
“నాకు ఎవరంటే యిష్టమోనని నాన్న అడిగారు. వాసు పేరు చెప్పాను” అంది నెమ్మదిగా. తల దించుకుని. తండ్రి తనని అడిగిన మర్నాడు లక్ష్మి తమింటికి వచ్చిందని తెలుసు గీతకి. ఐతే వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలీదు. రవికి పాయింటు దొరికినట్టైంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని వాసు పేరు చెప్పిందనుకున్నాడు.
“వాడుకూడా నువ్వు సుధీర్ గురించి అన్నట్టే అనచ్చుకదే?” అడిగాడు.
అది అనుకోని ప్రశ్న గీతకి. నిలువునా చలించిపోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అసలలాంటి వూహే ఆమెకి రాలేదు. తనకి అనిపించినట్టే వాసుకీ వుంటుందనుకుంది. తనకి కలిగినది ప్రేమనే ఆలోచనకూడా ఆమెకి లేదు. ఆమెకి తెలిసి ప్రేమ అనేది పుస్తకాల్లోని విషయమే. తండ్రి తనని అడిగినట్టే అతన్నీ అడుగుతాడు, అంతటితో ఐపోయినట్టేనని భావించింది. వాసు కాదంటే? కళ్లలోంచీ నీళ్ళు చెంపలమీదికి కారడం మొదలైంది. ఆ కన్నీళ్ళు చూసి రవి నిరుత్తరుడయ్యాడు. కుసుమ కంగారుగా లేచి వచ్చింది.
“గీతా! ఏడుపెందుకే? బాబాయ్ ఏదో తమాషాకి అన్నాడు. మీ నాన్న అడగాలేగానీ, వాసు నిన్ను ఎగరేసుకుపోడూ? నీకేం తక్కువని? వాడెందుకు కాదంటాడు?” అంది రెండోచేత్తో దగ్గిరకి తీసుకుని. అదే చేత్తో కన్నీళ్ళు కూడా తుడిచింది. గీతకూడా సర్దుకుంది.
“ఏమో పిన్నీ! అసలలా అనుకోలేకపోతున్నాను. నాకు తనంటే చాలా యిష్టం” అంది బేలగా. పమిటతో ముఖం గట్టిగా తుడుచుకుంది.
“బొట్టూ, కాటుకా చీరకొంగుకి అంటుకుంటాయి. ఆఫీసుకి కట్టుకునే చీర. అలా పాడుచేసుకుంటారా? మొహం చూడు, ఎలా అలుక్కుపోయిందో! కళ్ళచుట్టూ కాటుక అంటుకుంది. బొట్టు చెరిగిపోయింది. వెళ్ళు, బాత్రూంలో మొహం కడుక్కుని రా!” అని పంపింది.
“చిన్నపిల్ల. దాని దగ్గిర ఆమాటలన్నీ ఎందుకు? ఆడపిల్లని కంటతడి పెట్టించారు. ఏదేనా వుంటే పెద్దాయనతో అనాలిగానీ? ఐనా లక్ష్మి వీళ్ళకి మిగతావాళ్లకన్నా బాగా దగ్గిర. లక్ష్మి భర్త యింట్లోంచీ వెళ్ళిపోయినప్పుడు వెతికించి తీసుకొచ్చిందీ, తర్వాత వాళ్ళ కుటుంబానికి అండగా వున్నదీ ఆయనేకదా? ఆయన మీ అన్నదమ్ములిద్దరి వాటాలూ కొనుక్కున్నప్పుడు లక్ష్మి డబ్బు సర్దిందనికూడా విన్నాను. ఆ సందర్భంగా ఇలాంటి మాటలేవేనా అనుకున్నారేమో!” అని కోప్పడింది సన్నటిగొంతుతో.
రవి జవాబిచ్చేలోపల గీత వచ్చేసింది. వీళ్ళ భోజనాలు అయ్యాయి.
“సాయంత్రందాకా వుండకూడదూ?” రవి మళ్ళీ ఆఫీసుకి బయల్దేరుతుంటే తనూ వెళ్తానని లేచిన గీతతో అంది కుసుమ.
“లేదు పిన్నీ! వెళ్తాను” అంది.
“ఇక్కడ జరిగినవేవి మనసులో పెట్టుకోకు. సుధీర్‍తో నీ పెళ్లైతే బావుంటుందని బాబాయ్ అనుకున్నారు. నువ్వేమో వాసుగురించి అన్నావు. వాడూ తక్కువేం కాదు. చక్కగా చెయ్యెత్తు మనిషి. ఎప్పుడూ నవ్వుతూ వుంటాడు. మీ నాన్నకి చెప్పావుగా, ఆయన అన్నీ చూసుకుంటాడు” అంది, బొట్టు పెట్టి సాగనంపుతూ.


రవికి దిగ్భ్రాంతిగా వుంది. ఆశ్చర్యంలోంచీ యింకా తేరుకోలేకపోతున్నాడు. తనదీ ప్రేమవివాహమే. ఎన్నో ప్రేమలు చూసాడు. కానీ యిలాంటి ప్రేమ కాదు. వాసు నిన్ను కాదంటే అన్న ప్రశ్నకే చలించిపోయింది గీత. అప్పటి ఆమె రూపం కళ్లముందునించీ చెదిరిపోవటం లేదు. అంతంత యిష్టాలు వుంటాయా, మనుషులమధ్య? వాసుకికూడా అలానే అనిపిస్తే దీన్ని ప్రేమ అంటారని నిర్వచనంగా చెప్పుకోవచ్చు. తండ్రిగురించి మాత్రం? ఎలాంటి ప్రలోభం లేకుండా చెప్పేసింది. అంతేకాదు, నేను కూతుర్ని, తమ్ముడినో చెల్లెల్నో కాదని చురక కూడా అంటించింది. అతనికి కోపం, నవ్వూ, ఆశ్చర్యం, అన్నకూతురిపట్ల మురిపెం ఏకకాలంలో కలిగాయి. ప్రమీలకి జవాబేం చెప్పాలి? రెండురోజులు తప్పించాడు. మూడోరోజుని ఆఫీసునించీ ఫోన్ చేసి చెప్పింది ఆమె.
“నువ్వు చెప్పింది ఏమైంది? ఇంటికి ఒకసారి రా!” అని. వెళ్లక తప్పలేదు.
“దానికి వాసుమీద ప్రేమగా వుందక్కా!” అన్నాడు ఇంక తప్పదన్నట్టు. జరిగింది చెప్పాడు.
వీపుమీద ఛెళ్ళుమని చరిచినట్టైంది ప్రమీలకి. అన్నయ్య తనతో ఏమన్నాడు? తనేం అర్థం చేసుకుంది? గీతకి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాననీ, లక్ష్మి కొడుక్కి అడిగిందనీ చెప్పి అభిప్రాయం అడిగాడు. అంతే! సుధీర్ ఆయన దృష్టిలో లేడు. వాడు అందుబాటులో లేడని ముందే నిర్ణయించుకున్నాడు. ఆయనకి కలలు కనడం రాదు. తండ్రి అకాలమరణం ఆ శక్తిని చంపేసింది. గీతనికూడా ఆయనకి అనువుగానే పెంచాడు. తమకి తండ్రి పెద్దగా మిగిల్చి యిచ్చినదేమీ లేదు. పదేళ్ళకిపైన పెళ్ళి వాయిదా వేసుకుని, తను సంపాదించిన ప్రతిపైసనీ దానికి జమకూర్చి, తమ పెళ్ళిళ్ళు చేసి పంపాడు. ఆఫీసయాక దుకాణాల్లో పద్దులు రాయటంలాంటి బైటపనులు చేసేవాడు. పిల్లలకి ట్యూషన్లు చెప్పేవాడు. కొద్దోగొప్పో అదనంగా సంపాదించేవాడు. తండ్రి చేసిన వైద్యం ఆయనకి రాలేదు. పట్టు చిక్కలేదు. తోచినదార్లో సంపాదించుకొచ్చాడు.
ఆయన పెద్దకొడుకైతే తను పెద్దకూతురు. ఉద్యోగం చేస్తోంది. ఎప్పుడూ అతని బాధ్యతని పంచుకోలేదు. కనీసం యిప్పుడేనా-
“లక్ష్మి కొడుకేనా, నా కొడుకు నీకు పనికిరాడా? వాడి చదువవ్వనీ. గీతని నా కోడల్ని చేసుకుంటాను” అనగలిగిందా తను? అలా అనుంటే, భరోసా యిచ్చి వుంటే గీత వాసునే చేసుకుంటానన్నా దానికి నచ్చజెప్పి వుండేవాడేమో! ఇప్పటికిప్పుడు పెళ్ళి చెయ్యాలని ఆయన కోరినా, గీతకి వుద్యోగం వుంది. దాని జీతం అది సంపాదించుకుంటూ వుండేది. తమకి ఎలానూ భారం అయ్యేదికాదు. తమ ఖర్చులేం పెరిగేవికాదు. అంతా యథావిధిగా జరిగిపోయేది. సుధీర్ ముందుగా అనుకున్నట్టే చదువుకునేవాడు. ఏ మార్పూ వుండేది కాదు. ఆశపడింది. అత్యాశ. అన్నదగ్గిర లౌక్యం చూపించింది. గురుమూర్తి మొదట వప్పుకునేవాడు కాదు. తనూ, సుధీర్ కలిసి గట్టిగా అడిగితే వప్పుకునేవాడేమో! తనకే ఆ ఆలోచన లేనప్పుడు, అతన్ని అనుకోవడం తప్పు.
“తమ్ముడినో, చెల్లెలినో కాదు, పెళ్ళై వెళ్ళిపోగానే నాదారి నాదనుకోవడానికి” అందట గీత. చిన్నదైనా అందరికీ బుద్ధి వచ్చేలా చెప్పింది. అందరూ తలో చెయ్యీ వేస్తేనేకదా, బాధ్యతలూ, బరువులూ తీరేదనుకుంది తన గురించి తను. అన్నకీ అంతేకదా? తల వంగిపోయింది ప్రమీలకి. రవికి ఇలాంటివి అర్థం కావు.
“పోన్లేవే! ప్రాప్తం లేదనుకోవాలి. అది వాసు మాట ఎత్తకపోతే ఎలాగేనా వప్పించేవాడిని. వాడినే చేసుకుంటానన్నాక, ఇంక సుధీర్‍కెలా అడుగుతాను?” అన్నాడు ఓదార్పుగా.


జ్ఞాపకాల్లోంచీ బైటికి వచ్చాడు సుధీర్. గీతకి సంబంధించి అతని మనసులో నాటుకుపోయినవి ఆ రెండుమూడు విషయాలే.
తనకి విషయం తెలిసింది. ఎప్పటికీ కలిసి తిరిగే మనుషులమధ్య ప్రేమ అంత తేలిగ్గా బయటపడదు. తను గీతని ప్రేమిస్తున్నాడని గుర్తించలేదు. ఆ ప్రేమని ఆస్వాదించలేదు. ఆ భావన కలగడం, దానికొక అసాధ్యత ఏర్పడటం ఒకేసారి జరిగాయి. తల్లితో మాట్లాడ్డం మానేసాడు. ఆవిడ మేనమామతో అలా అమానుషమైన బేరాలు చెయ్యకూడదని అనిపించింది. అప్పటిదాకా ఫ్రెండ్సుతో రూంలో వుంటూ యింటికి వచ్చి వెళ్ళేవాడల్లా ఇంటికి అసలు రావడం మానేసాడు. పైకి చదవాలనిపించలేదు. లెక్కవేసుకుంటే ఆ ఖర్చులు, వాటికోసం అప్పులు అనవసరం అనిపించాయి. ప్రతివాళ్ళకీ ప్రతీదీ సాధ్యపడదు.
మనిషికి ఆదాయాన్నిబట్టి జీవనప్రమాణాలుంటాయి. అతని తెలివినీ, చుట్టూ వున్న సమాజాన్నీ, ఆలోచనావిధానాన్నీబట్టి ఆదాయవనరులు ఏర్పడతాయి. దానికి వ్యవస్థని తప్పుపట్టలేం. ప్రతిదానికీ పునాది ఎక్కడో వుంటుంది. పైకి కనిపించే పరిస్థితులన్నీ పునాదిగా పడ్డ ఆ సంఘటనకి పర్యవసానాలే. తన తాతముత్తాతల్లో డబ్బు సంపాదించుకునే, అందుబాటులోకి వచ్చిన అవకాశాలని ఆర్థికవనరుగా మార్చుకోగలిగే, నేర్పు లేకపోవచ్చు. అసలు అలాంటి అవకాశాలే రాకపోవచ్చు. రామారావుని చూస్తున్నాడు. ఆయన పరిస్థితుల్లోకి వొదిగిపోయాడు. రవి పరిస్థితులకి ఎదురీదాడు. ఇలాంటి బేధాలు వాళ్ళ జీవితాలనేకాక, వాళ్ళ తర్వాతి తరాల జీవితాలనికూడా శాసిస్తాయి.
డిగ్రీ చేతికి రాగానే కోపరేటివ్ హాస్పిటల్లో ఖాళీ వుంటే చేరిపోయాడు సుధీర్. పెళ్ళి చేసుకోవద్దనుకున్నాడు. అది సాధ్యపడలేదు. తను చేసుకుంటేగానీ సుమంత్ చేసుకోనన్నాడు. అప్పటికే అతను తోటిడాక్టరుతో పీకల్లోతు ప్రేమలో వున్నాడు. అవతలి అమ్మాయి ఎందుకు ఆగుతుంది, అసలు పెళ్ళే చేసుకోనన్నవాడి తమ్ముడికోసం? తప్పనిసరై తలవొగ్గాడు.
ఇండియాలో అభ్యర్ధులు ఎక్కువ, సీట్లు తక్కువ. ఇక్కడ సీట్లెక్కువ, చదివేవాళ్ళు తక్కువ. మామగారి ప్రోద్బలంతో ఇక్కడికి చేరారు. రమమీద తనకి ప్రేమలేదని కాదు. ఈ ప్రేమ మౌలికత వేరు. ప్రేమ అనేది పుష్పకవిమానంలాంటిది. ఎందరినేనా ఎక్కించుకుంటుంది. ఎవరి స్థానం వాళ్ళది.
సుధీర్ పక్కమీద అస్థిమితంగా కదిలాడు. పక్కని రమ మంచి నిద్రలో వుంది. బాబ్ చేయించుకున్న జుత్తు ఆమె ముఖంమీద పడుతుంటే సర్ది నిద్రకి ప్రయత్నించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మూసుకున్న కనురెప్పలమీద నాట్యం మొదలుపెట్టింది.
అంత ప్రేమించి వాసుని చేసుకున్న గీత ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంది? కారణం జీవనశైలా? ఏదేనా అనూహ్య సంఘటనా? అర్థమవక మనసంతా చికాగ్గా అనిపించింది.


తెల్లవారే సమయం. నెమ్మదిగా మంచం దిగింది గీత. వాసు నిద్రలో వున్నాడు. ఆమె అలికిడికి అతనూ లేచాడు.
“ఏం కావాలి గీతూ?” అడిగాడు. అతని చెయ్యి పట్టుకుంది. ఇద్దరూ ఇవతలికి వచ్చారు. ముందుగది దాటుకుని వరండాలోకి వచ్చి, అరుగుమీద కూర్చున్నారు.
“సో? ఎలా వుంది అనుభవం? నేనూ ప్రయత్నించొచ్చా?” అడిగాడు. ఆమె జవాబివ్వలేదు. అతని చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకుని దగ్గరగా జరిగి తాకుతూ కూర్చుంది.
“ఏం జరిగిందసలు? చెప్తేకదా, తెలిసేది?” అడిగాడు. ఆమె తల దించుకుంది. అతనింక తర్కించలేదు. ఇద్దరూ అలానే కూర్చున్నారు చాలాసేపు. తులసి లేచి వచ్చింది. ఎవరు లేచినా నేరుగా ఆ అరుగుమీదికే వచ్చి కూర్చుంటారు. తన వునికిని తెలియజేస్తూ చిన్నగా దగ్గింది.
“రామ్మా!” అన్నాడు వాసు. లోపలికి వెళ్ళడానికి గీత లేచింది.
“ఓయ్, వంటింట్లోకి వెళ్ళకు. చరణ్ లేచాడు. కాఫీలూ టీలూ చూసుకుంటాడు. మహతి అందరికీ ఇడ్లీ ఆర్డరు పెట్టేస్తానంది. వంటాయన్ని కాస్త ఆలస్యంగా రమ్మంది అమ్మ. ఇంట్లో పెద్దగా సరుకులేం వున్నట్టు లేవు. బిగ్‍బాస్కెట్ పెడతాను. వాళ్ళు అరగంటలో తెచ్చిస్తున్నారు. నువ్వు వెళ్ళి పడుక్కో. మామయ్య లేస్తే మాట్లాడు. రాత్రి నీ మంచందగ్గిర చాలాసేపు కూర్చున్నాడు” వెనకనుంచీ చెప్పింది తులసి. గీత ఆగి, విని, తలూపి, లోపలికి వెళ్ళింది. మహతి ఎదురొచ్చింది.
“బ్రష్ చేసుకో, కాఫీ తాగుదువుగాని. ఎలా వుంది వొంట్లో?” అనడిగింది. జవాబివ్వలేదు గీత. ఒక్కనిముషం వూరుకుని, “మహీ! నిన్ను ఎవరేనా ప్రేమించానని చెప్పారా? నీ భర్త కాదు. బైటివాళ్ళు” అడిగింది.
మహతి తెల్లబోయింది. “ఏమైంది? ఏం జరిగింది? నీతో ఎవరేనా అన్నారా? అందుకే ఈ పని చేసావా?” గబగబ అడిగింది. గీత జవాబివ్వలేదు. వాళ్ళగదిలోకి వెళ్ళిపోయి పక్కమీద వాలిపోయింది. కోపం, అసహ్యం, వుక్రోషం ఆమెని ముంచెత్తాయి. మహతి వెనకాలే వచ్చింది.
“చెప్పు గీతూ! ఎవరలా అన్నది? ఐనా మనమేం ప్రేమ కబుర్లు వినే వయసులో లేముకదా? అంత బుద్ధితక్కువ మనిషెవరు?” అడిగింది, పక్కని కూర్చుని.
“నన్ను యిప్పుడేం అడగద్దు. అదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాలున్నాయి. ఎలా చెప్పాలో ఆలోచించుకున్నాక నేనే చెప్తాను” అంది గీత.
“పిరికిదాన్లా ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేసావు?”
“నాకా నిముషంలో అనిపించింది. మనుషులంతా విలువలు వదిలేసి చచ్చిపోతున్నారనిపించింది”
“సరే, నీకు తోచినప్పుడే చెప్పు. కానీ ఇంకోసారి యిలా భయపెట్టవుకదా? ఒకళ్ళకోసం మనం ఎందుకు చావాలి చెప్పు? మనవాళ్ళెందుకు ఏడవాలి? వాసు, అమ్మ, నాన్న, పిల్లలు, వీళ్ళందరికన్నా ఆ వెధవ అన్నమాటలు ఎక్కువయ్యాయా?”
చరణ్ కాఫీ కప్పుల్తో వచ్చాడు. వాళ్ల సంభాషణ ఆగిపోయింది. గీత బ్రష్ చేసుకోవడానికి వెళ్ళింది.


“వదిన ఏమైనా చెప్పిందా?” అవతల తులసి వాసుని అడిగింది. అతను తల అడ్డంగా వూపాడు.
“మహి వుందికదా, తెలుసుకుంటుందిలే. వాళ్ళిద్దరికీ మధ్య దాపరికాలు వుండవు” అన్నాడు. అదే అతని ధైర్యం. “నీ వొంట్లో ఎలా వుంది?” వెంటనే చెల్లెల్ని అడిగాడు.
“బానే వుంది. జీవం చచ్చిపోయిన కట్టెలా స్థిరపడ్డాను” అంది. వాసుకి మనసు మెలిపెట్టినట్టైంది.
“అలా ఎందుకు అనుకుంటున్నావే? నరకంలోంచీ బైటపడ్డావు. ఇంక జాగ్రత్తలు తీసుకుంటూ వుంటే సరిపోతుంది” బాధపడ్డాడు. ఉద్వేగంతో చెల్లెలి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళు చెమర్చాయి.
ఎదుటివాళ్ళంటే మనకి ఎంత ఇష్టమైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళ బాధ వాళ్ళదే. వాళ్ళు గిలగిల్లాడుతుంటే పక్కని నిలబడి కళ్ళనీళ్ళు నింపుకోవడం తప్ప యింకేదీ చెయ్యలేం. తులసికి కేన్సరు వచ్చినప్పుడు జరిగింది అదే. ఇద్దరన్నలమీద అపురూపంగా పెరిగినది, ఆమె. భర్తకీ ప్రేమే. అందరూ తల్లడిల్లిపోయారు. లేతసత్యవరపు ఆకులా సున్నితంగా వుండే మనిషి, కీమోలు జరిగి, శరీరమంతా ధ్వంసమై, జుత్తంతా వూడిపోయి, తిండి తినలేక అవస్థపడుతుంటే,
“ఇవన్నీ చూడటానికేనా, నేను బతికున్నది?” అని నెత్తి కొట్టుకుని ఏడ్చేది లక్ష్మి. రాత్రులు నిద్రపట్టేది కాదు తనకి. చిన్నప్పుడు తామంతా కలిసి ఆడుకున్న ఆటలు, పంచుకున్న ప్రేమలు గుర్తొచ్చేవి. తనతో సమానంగా బాధపడింది గీత. వాళ్ళ పిల్లలు చరణ్, చేతన్ సరేసరి. తనకి తను కన్నీళ్ళు తుడుచుకోవటం, పిల్లల్ని ఓదార్చడం, అటు మేనమామ, యిటు తల్లి – వీళ్ళని సముదాయించడం, ఇవన్నీ రోజులోని ఇరవైనాలుగుగంటల్లో నిండిపోయి, చోటుచాలక క్రిక్కిరిసిపోయి, అప్పటిదాకా అందరూ కలిసి అనుభవించిన సంతోషకరమైన రోజులన్నీ అదృశ్యమై, కొత్తమలుపులోకి అడుగుపెట్టినట్టైంది.
“నాలో ఏదో సమూలమైన మార్పు వచ్చిందన్నయ్యా! నాకే తెలీడం లేదు. ఇదివరకు నచ్చినవీ, ఆస్వాదించినవీ ఇప్పుడు నచ్చట్లేదు. విముఖత కలిగిస్తున్నాయి. ప్రపంచంమీంచీ ముఖం తిప్పుకుని నా లోలోపలికి చూసుకోవాలనిపిస్తోంది. ఇంకో మనిషి వునికి భరించలేకపోతున్నాను” అంది నెమ్మదిగా. ఆమె చెప్తున్న ఏ వునికో గ్రహించాడు వాసు.
“బావ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా?” అడగలేక అడిగాడు.
“అలాంటి పరిస్థితి రాకూడదని నా ఆలోచన”
అప్పటికి కొద్దిరోజుల కిందట తులసి భర్త వాసుతో మాట్లాడాడు. “కేన్సరు వచ్చింది, తగ్గింది. నార్మల్ లైఫ్ గడపడానికి మీ చెల్లెలికిగల బాధేంటో తెలీడంలేదు బావా! ఎంతమందికి వచ్చి తగ్గలేదు, మామూలుగా తిరగడం లేదు? విడిపోదామంటుంది” అనేది అతని కంప్లెయింటు.
అతను చెడ్డవాడనీ, అతనికి భార్యపట్ల ప్రేమలేదని కాదు. శృంగారం అనేది పెళ్ళితో ముడిపడి వున్న తప్పనిసరి బాధ్యత అనే నమ్మకం చాలామంది మగవాళ్లలో లోతుగా పాతుకుపోయి వుంది. ఈమధ్య కోర్టు తీర్పులుకూడా అలానే వస్తున్నాయి. భర్త అడిగినప్పుడు కాదనకూడదని. అదేమైనా వస్తువా? అటకమీదనుంచో డబ్బాలోంచో తీసిచ్చేదా? మనసు సహకరించాలి. ఆడవాళ్లకి మనసు వుంటుందనీ, యిష్టనిష్టాలు వుంటాయనీ ఎందరికి తెలుసు? ఎందరు వప్పుకుంటారు?
ఆడా, మగా కోరికల్లో భౌతికంగా తేడా వుంటుంది. ప్రకృతిధర్మంతోటీ పునరుత్పత్తితోటీ ముడిపడివున్నదాన్ని వినోదంగా మార్చుకున్నాడు పురుషుడు. కావ్యాలూ, ప్రబంధాలూ రాసుకున్నాడు. ఆడవారినికూడా మార్చుకొమ్మని ఇప్పుడు ప్రోద్బలం చేస్తున్నాడు. బలవంతం చేస్తున్నాడు. బహుభార్యత్వం, దేవదాసీవ్యవస్థా నిషిద్ధమై ఆ బహుభార్యల భారమంతా ఉన్న ఒక్కదానిమీదా పడుతోంది. సమాజంలో ఎప్పుడూ జరిగేది అర్ధన్యాయమే. ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందనేది స్పష్టంగా విడివడని సందిగ్ధమే. న్యాయాన్యాయాలు వైయక్తికం. అందరూ రొట్టెలే ఎలా తినరో, అందరికీ వంకాయంటే ఇష్టం వుండాలనే సహజసూత్రం ఎలా వుండదో, అంత వ్యక్తిగతం ఈ సహజన్యాయాలు.
మార్కెట్లో ఆలోచనలు మగవారివి. వాళ్ళు కొంతమంది ఆడవారి భావజాలాన్ని ప్రభావితం చేసి వదులుతారు. అవి సాలెగూట్లా అందర్నీ చుట్టుకుంటాయి. స్త్రీపురుష సంబంధాలనికూడా ఆ జాలం కమ్మేసింది. శృంగారం అనేది ప్రాకృతిక అవసరం కాకుండా దైనందిన అవసరంగా మారిపోయింది. తిథివారనక్షత్రాలెవరూ పాటించడం లేదు. శృంగారం చెయ్యకపోతే భార్య తనని వదిలిపెట్టి వెళ్ళిపోతుందని మగవాడికి భయం. తామిద్దరినీ కలిపి వుంచేది అదొక్కటే అనుకునేవాళ్ళు వున్నారు. ఆమె ఎడాన్ని కోరుకున్నా ఆడవారి మాటలకి అర్థాలు వేరని అన్వయించుకుంటారు. తులసి భర్తకి విడాకులు యివ్వడం యిష్టం లేదు. వైవాహిక జీవితంమీద భార్యకి విముఖత కలిగిందనే విషయం అతను గ్రహించాడు. తప్పనిసరైన విషయంలో ఇంకాస్త వ్యవధి తీసుకునేనా సర్దుకుపోయేదానికి విడిపోవడం, కుటుంబాన్ని బైటపడేసుకోవడం దేనికని అతని అభిప్రాయం. పిల్లలముందు చులకనైపోతానని భయం. ఎవరికి తప్పనిసరి? తనకా, ఆమెకా? అనే ప్రశ్నలు వేసుకుంటే అతనికే తెలుస్తుంది. కానీ ఆ ప్రశ్నలని అతను ఎదుర్కోలేదు. కాదంటే తులసిమాత్రం ఎంతకాలం ముక్కుమూసుకుని సన్యాసినిలా బతుకుతుంది? అని ఎదురు అడుగుతాడు.
“అంతా మామూలుగానే వుందనుకుంటున్నారు తను. వదినకి అంత ప్రమాదం తప్పినందుకు మనం ఏది మానేసాం? తిండా? నిద్రా? ఒకటి రెండురోజులు దినచర్య మారుతుంది. మళ్ళీ రొటీన్లో పడతాం. కానీ వదినలో పెనుతుఫాను చెలరేగుతూ వుంటుంది. మనకి అర్థమవదు. తను మామూలుగానే తిరుగుతూ వుంటుంది. అంతా మామూలైపోయిందనుకుంటాం. నేనేనా అంతే. ఈ అన్ని అవసరాల్లాగే మరొకటీను. బావకి. నాకు కాదు. నలుగుర్లో పరువుపోతుందని ఆయన భయం. యాభయ్యేళ్ళు పైబడ్డ మనిషి. మరో పాతికేళ్ళేనా బతుకుతారేమో! నావెంట తిరుగుతూ, నన్ను మార్చే, ఏమార్చే ప్రయత్నం చేస్తూ ఎన్నేళ్ళు గడుపుతారు? గౌరవంగా విడిపోతే మంచిదనిపించింది” అంది తులసి. ఆమె చెప్పలేనివి, చెప్పలేకపోయినవీ చాలా వున్నాయి.
“ఇక్కడికి వచ్చేస్తావా? ఒక్కదానివీ ఎందుకు, పిల్లలు కూడా దగ్గిరుండనప్పుడు?”
“వచ్చి వెళ్తుంటాను. అక్కడే వుంటాను. తనే వేరే యింట్లోకి వెళ్తారు. మార్పు తన జీవితంలోకదా?” అంది.
“నీ యిష్టం చెల్లీ!” అన్నాడు వాసు.
జీవితం కారణం కాదు, పర్యవసానం. ఒకొక్కసారి ఏది దేని పర్యవసానమో తెలుస్తునే వుంటుంది. నివారించే అవకాశం మాత్రం వుండదు.
“మనింట్లోకూడా యిలాంటిదే జరిగింది. నిశబ్దంగా మనింటి గోడల్లో కలిసిపోయింది” తులసి అంటుంటే, లక్ష్మికూడా వచ్చి కూర్చుంది. అన్నచెల్లెళ్ళిద్దరూ మాటలు ఆపేసారు. తులసి తల్లితో మాటల్లో పడితే వాసు అక్కడే తలకింద రెండుచేతులూ పెట్టుకుని వెల్లకిల పడుకున్నాడు. ఆరోజురాత్రి ఒక్కడూ మోసిన బరువుకీ, ఇక్కడ ఇందరితో పంచుకోవడానికీ మధ్యనున్న తేడా అర్థమై మనసు తేలికపడింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. తల్లీకూతుళ్ళిద్దరూ మాటలాపేసి లోపలికి వెళ్ళారు.


సూర్యుడు త్రిమూర్తులి యింట్లో కూడా వుదయించాడు. వాసు యింట్లో విషాదం తెరిపినపడింది. ఇక్కడింకా తుదీ మొదలూ కనిపించట్లేదు. తన పనులన్నీ చేసుకుని తయారయాక అమృతని నిద్రలేపింది రోహిణి. రాత్రంతా ఏడుస్తునే వుంది ఆ అమ్మాయి. తెల్లవారాక సొమ్మసిల్లినట్టు పడుకుంది. లేపాలనిపించలేదు రోహిణికి. కానీ తప్పదు.
“అమృతా! లే. అమ్మానాన్నల దగ్గిరకి వెళ్దాం” అంది నెమ్మదిగా. ఆ మాట మనసులోపల ఎక్కడో తాకినట్టు వెంటనే లేచి కూర్చుంది అమృత. దుర్గమ్మతో కిందకి వెళ్ళి ముఖం కడుక్కుంది. కాఫీ యిస్తే వద్దనకుండా తాగింది. వాళ్ల వెనకే వెళ్ళింది రోహిణి. అప్పటికి ప్రయాణానికి ఏర్పాట్లన్నీ చేసింది రోహిణి తోడికోడలు.
“నన్నూ రమ్మంటావా, అక్కా?” అని అడిగింది. వద్దంది రోహిణి. ఆర్భాటమేమీ లేకుండా జరపాల్సిన కార్యక్రమం. ఇంకా చెప్పాలంటే రహస్యంగా జరగాలి. ఎవరేనా వచ్చి గొడవ చేసి ఆపితే కష్టం.
శ్యామ్మోహన్ కర్మకి బ్రాహ్మలనీ, సాయానికి మనుషులనీ తీసుకుని వెళ్ళిపోయాడట. వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటుంటే తను డెడ్‍బాడీస్
హాస్పిటల్‍నుంచీ తీసుకొస్తానని చెప్పాడు. రోహిణి, అమృత, దుర్గమ్మ, విజయ్ ఒకదాంట్లోనూ, మాధవరావు, ఇద్దరు తమ్ముళ్ళు, డ్రైవరు, పనివాడు, ఇంకోదాంట్లోనూ మొత్తం రెండు కార్లలో బయల్దేరారు. తనకీ, దుర్గమ్మకీ మధ్యని అమృతని కూర్చోబెట్టుకుంది రోహిణి. కారు ఎక్కేముందు అమృతని ఆగి చూసాడు విజయ్. ముఖం వుబ్బి, కళ్ళు ఎర్రగా మూసుకుపోయినట్టుగా వున్నాయి. ఎలా తట్టుకుంటుంది ఇంత దు:ఖాన్ని వంటరిగా? పదిమంది చుట్టూ వుండి ఓదార్చితేనే తీరని కష్టం మనిషి పోతే కలిగే దు:ఖం. అందులోనూ పోయింది ఆమె తల్లిదండ్రులు. ఇద్దరూ, ఒకటేసారి. ఆమె చిన్నిగుండె ఎలా భరిస్తుందోననుకుంటే మనసు వొడిపెట్టినట్టైంది అతనికి.
రెండుకార్లూ ముందుకి దూసుకుపోతున్నాయి. వీళ్ళు పితృవనం చేరుకునేసరికి పార్థివశరీరాలు రెండూ వచ్చేసి వున్నాయి. ఒక గద్దెమీద పడుకోబెట్టారు. ముక్కు పైభాగందాకా తెల్లటిబట్టతో కప్పేసి వున్నాయి. ఆరోజుని వీళ్ళది ఒక్కటే కార్యక్రమం. అమృత బంధువులు ఎవరూ రాలేదు. వెంకట్రావుకి ఇద్దరు అన్నలున్నా, వాళ్ళు ఈ విషయం తెలీనట్టే వుండిపోయారు. అమృత స్వప్నతో అన్నదే నిజం.
ముందు రోహిణి, వెనుక అమృత, దుర్గమ్మ దిగారు. అమృత చెయ్యి పట్టుకోమన్నట్టు సౌంజ్ఞచేసింది రోహిణి దుర్గమ్మకి. వళ్లంతా నిలువునా కంపిస్తుండగా, అడుగులు తడబడుతూ వుంటే వెళ్ళి అమ్మానాన్నల తలవైపుకి కూలబడింది అమృత. వణుకుతున్న చేతుల్తో తల్లి నుదురు తాకింది. వళ్ళు జలదరించింది. టీవీలో చూసిన విజువల్స్ కళ్లముందు కదిలాయి. ఏదో భయం వెన్నులోంచీ పుట్టుకొచ్చి నిలువునా వణికించింది. ఒక భయాన్ని మనసులో వూహించుకోవడానికీ, ఆ భయానకదృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికీ తేడా వుంటుంది. తల్లీ, తండ్రీ ఇంక లేరన్న వాస్తవం ఆమె మనసుకి ఇంకింది. స్తంబించిన ఆలోచనలన్నీ నెమ్మదిగా చైతన్యాన్ని అందుకున్నాయి. ఒక ప్రవాహంలా సుళ్ళు తిరుగుతున్నాయి.
“రామ్మా!” అంది దుర్గమ్మ.
నోట్లో బియ్యం వెయ్యడానికి లేదు, కాళ్లదగ్గిర పువ్వులు పెట్టి దణ్నం పెట్టడానికీ లేదు. తలదగ్గిరే బియ్యం వేసి, తెల్లదుప్పటీమీద పువ్వులుంచి దణ్ణం పెట్టుకుని వచ్చి కార్లో కూర్చుంది అమృత. అడుగు ముందుకి పడలేదు రోహిణికి. ఎన్నో చావులు చూసిందిగానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. బతికినంతకాలం అవనీ, ఇవనీ ఎన్నో తాపత్రయాలు పడతారు మనుషులు. చివరికి అయ్యేది పిడికెడు బూడిద. లేదా భూమి అడుగున ఇంత ఎముకలపోగు. ఆ విషయం అందరికీ తెలిసిందే ఐనా, అర్థంకాని తాపత్రయాలు.
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికారముద్రికల్ అంతరించే
ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న చిత్రలేఖకుని కుంచియ నశించె
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణమై దృష్టులొలయ అవనిపాలించు భస్మ సింహాసనంబు
_అన్నారు జాషువా.
కవి చెప్పిన అంతటి మహానుభావులూ దేనికీ ఆగకుండా తరలివెళ్ళిపోయారు. భస్మసింహాసనానికి ఒక రేణువై జమకూడారు. కొండంత ఆశలు ప్రోదిచేసుకుని, ఏదీ పొందకుండా వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ.
వెంకట్రావు తనకన్నా పెద్దవాడే. భర్తతోటివాడు. కానీ మేథకుడు. అమాయకంగా వుండేవాడు. ఎందుకో తెలీదు. “అక్కయ్యా!” అని నోరారా పిలిచేవాడు. ఆ పిలుపులోని అభిమానం రోజురోజుకీ చిక్కబడుతున్నట్టు అనిపించేది. అతను అక్కా అన్నాడని తను పేరుపెట్టి పిలవలేకపోయేది. అన్నయ్యా అనేది.
“ఇదేం చుట్టరికం?” అని నవ్వేవాడు మాధవరావు.
విశాలకి మళ్ళీ ఆ ప్రేమ లేదు. కలుపుకోవాలని ఎంత ప్రయత్నించినా దూరంగానే వుండేది. అసూయపడేది. ద్వేషం పెంచుకుంది. ఏం మిగిల్చుకుంది? విధ్వంసంవైపుకి ప్రయాణం చేసింది. భార్యాభర్తలు ఒకరి జీవితాన్ని మరొకరు ఎంత ప్రభావితం చేస్తారు? ఒకరు రహదారిగా మారితే మరొకరు ఆ దారంట నడుస్తారు. అంత అనివార్యత్వం వుండేచోట ఎంత ఆలోచన, వివేచన వుండాలి? ఇప్పుడీ పిల్ల భవిష్యత్తు ఏమి కాబోతోంది? అప్పుల విషయం పక్కనబెడితే ఈ అనుభవం తర్వాత అమృత మామూలుగా బతకగలదా? తను ఇలా, విశాల మరోలా వుండటానికి కారణం తమ అదృష్టాలా లేక ఆలోచనలా? ఆలోచనలమీద తన లోపలా, తన చుట్టూ బయటా వున్న నియంత్రణా?
“మనసు వెళ్ళమన్నచోటికల్లా బుద్ధి ప్రయాణం కట్టకూడదమ్మా!” అన్నాడు విజయ్, తల్లి పక్కన నిలబడి. “అమృతమీద జాలి వేస్తోంది”
“ఆ జాలితోటేకదా, మీ నాన్న వెళ్ళి వెంటబెట్టుకుని వచ్చారు?”
“నీకిష్టం లేదా?”
“ఒకొక్కప్పుడు వైయక్తిక యిష్టాయిష్టాలకి ఎలాంటి విలువా వుండదు విజయ్! జరిగేవాటి పర్యవసానాల వెనుక వుండే భయాలు ఆ యిష్టాలని డామినేట్ చేస్తాయి. చూడు, అంకుల్ అన్నదమ్ములు రాలేదు. వాళ్ళకి ఇతనంటే ప్రేమలేదంటావా? ఉంది. అణిచేసుకున్నారు. పోనీ బాధ్యత లేదంటావా?అదీ వుంది. తప్పించుకున్నారు” అంది. అతను తలూపాడు. మాధవరావు పిలిస్తే ఇద్దరూ వెళ్ళి బియ్యం, పూలు పెట్టి వచ్చారు.
“ఇంక మీరు వెళ్ళిపొండి” అన్నాడు. అందరూ సర్దుకున్నాక కారు మళ్ళీ తిరుగుముఖం పట్టింది.
రెండు నిండు జీవితాలు, ఇంకా ఎన్నో యేళ్ళు బతికి కృశించవలసిన పరిపూర్ణదేహాలు పిడికెడు బూడిదగా మారనున్న వైనం రోహిణి మనసుని కలచివేసింది. అమృత మనసైతే ముందటి స్తబ్దత అనే కృష్ణబిలాన్ని దాటుకుని ఇవేళ్టి వుప్పెనల్లో కొట్టుకుపోతోంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది రోహిణి. గట్టిగా పట్టుకుంది. తరువాత చెయ్యి వదిలిపెట్టి భుజాలచూట్టూ చెయ్యేసి మనిషినే దగ్గరికి తీసుకుంది.
“ఓర్చుకో అమృతా! జీవితం దేనికో ఒకదానికి పర్యవసానంగానే మన ముందుకి వస్తుంది. అలా వచ్చినప్పుడుమాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. అలా వచ్చినదాన్నే కారణం అనుకుని తొలగించడానికో, పరిష్కరించడానికో చూస్తాం. అలాంటి ప్రయత్నం నీ తల్లిదండ్రులు చెయ్యడంవలన అది పర్యవసానంగా నీ ముందుకి వచ్చింది. ధైర్యంగా నిలబడు. మేమంతా నీ వెనుక వున్నాం” అంది. ఆవిడ గొంతు వణికింది. “జన్మజన్మల రుణాలు తీర్చుకోవడానికి మనం వివిధబంధాలమధ్య పుడతాం. వాళ్ళ రుణాలు తీరి, ఆ వ్యక్తులు వెళ్ళిపోతారు. మనకి మళ్ళీ కనిపించరు. చిన్నప్పుడు నీతో ఆడుకుని, నీకో చిరునవ్వో, చిన్నచాక్లెట్టో ఇచ్చిన అమ్మాయి నీకు మళ్ళీ కలవదు. అంటే ఆ రుణం అక్కడితో తీరిపోయినట్టే. అమ్మానాన్నల రుణం ఇక్కడ తీరింది. నీకు మాతో ముడిపడింది. ఇది మరో రుణం అనుకో. వాళ్ళ నిష్క్రమణానికి పర్యవసానం అనుకో. ఆగిపోవాలని అనుకోకు”
మౌనంగా వింది అమృత. తనని చుట్టుకున్న ఆ చెయ్యి ఆమె మనసులోకి చిన్నవెలుతురు కిరణాన్ని పంపింది. సీట్లో వెనక్కివాలి కళ్ళుమూసుకుంది. మూసుకున్న రెప్పలకిందినుంచీ కన్నీళ్ళు ధారలుకట్టాయి. విజయ్ తలతిప్పి వెనక్కి చూసాడు.
“ముందుకి చూస్తూ డ్రైవ్ చెయ్యి” అంది రోహిణి. అప్పుడు చూసింది అమృత అతన్ని. ఒక్క క్షణంపాటు రెప్పలెత్తి. ఇద్దరి చూపులూ తృటిమాత్రాన కలుసుకుని విడిపోయాయి. కళ్యాణవేదికమీద వధూవరులిద్దరిమధ్యా తెర తీసినప్పుడు కలిసిన చూపుల బలం ఇక్కడకూడా వుంది. కానీ తనున్న స్థితిలో ఆమె దాన్ని గుర్తించలేదు. కన్నీటిపొర వెనుకనుంచీ అతన్ని చూసిన ఆ క్షణం ఆమె స్మృతిపథంలో అతిగోప్యంగా శాశ్వతంగా వుండిపోయింది.
ఇల్లు చేరుకున్నారు. ఒక పోలీస్ కాన్‍స్టేబుల్ వాళ్ళకోసం ఎదురుచూస్తున్నాడు. అమృతని స్టేషనుకి తీసుకురమ్మని వాళ్ళ సీఐ ఆర్డరట. అమృతకేసి చూసింది రోహిణి. అసలే దు:ఖంతో వున్న ఆ పిల్లముఖం పూర్తిగా పాలిపోయింది.
“ఎందుకు?” అతికష్టమ్మీద అడిగింది అమృత. పోలీసుస్టేషనంటే సహజంగా ప్రజల్లో వుండే భయం ఆమెలోనూ వుంది. నిత్యం నేరస్తులని డీల్ చెయ్యడం, పైనుంచీ, బయటినుంచీ అనేక స్థాయుల్లో వచ్చే వత్తిడి, అవిద్య నేరస్తుల్లో తెచ్చే మూర్ఖత్వం, జనాభాకి సరిపడ్డంతమంది సిబ్బంది లేకపోవటం పోలీసులు కౄరంగా ప్రవర్తించడానికి కొన్ని కారణాలు. వీటియొక్క పర్యవసానంమాత్రమే బయటికి కనిపించేది. జనాన్ని భయపెట్టేది అదే.
“ఇప్పుడే అంత్యక్రియలు చేసుకుని వచ్చాం. స్నానం చేసుకుని బయల్దేరతాం. నేను తీసుకునివస్తానని మీ సార్‍కి చెప్పు” అన్నాడు విజయ్. కాన్‌స్టేబుల్ వెళ్ళలేదు. అలాగే నిలబడ్డాడు.
“వెంటబెట్టుకుని రమ్మన్నారు సార్” అన్నాడు భయంగా.
“నేను మాట్లాడతాను మీ సార్‍తో” అని పోన్ చేసి మాట్లాడి, గంట టైమ్ తీసుకున్నాడు విజయ్. కాన్‍స్టేబుల్ కూర్చుంటానన్నాడు.
“అమృతా! భయపడటానికేం లేదు. మామూలుగానైతే అమ్మానాన్నల అప్పులతో పిల్లలకి సంబంధం వుండదు. ఇక్కడ ప్రజలడబ్బు వుంది కాబట్టి ఫ్రాడ్ కిందికి వస్తుంది. నీ ఇన్వాల్వ్‌మెంటు వుందేమో తెలుసుకోవడానికి పిలుస్తారు. అది వాళ్ళ బాధ్యత. భయపడక్కర్లేదు. నేను నీతో వస్తాను. శ్యామ్ అంకుల్ కూడా వస్తారు. నీకు ఆ డబ్బుతో సంబంధం లేదు. నువ్వు దాన్ని వాడుకోలేదు. అదే చెప్పు. జరిగినవి జరిగినట్టు చెప్పు” అన్నాడు విజయ్. ఆమె నీళ్ళు నిండిన కళ్ళతో అతనికి చేతులెత్తి జోడించింది.
“నోనో” ఆమెని వారించి, తల్లివైపు తిరిగి, ఆమె సంగతి చూసుకొమ్మని సైగచేసి, శ్యాంమోహన్‍కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆయన స్టేషనుకి వస్తానన్నాడు. అమృత బాధ్యత దుర్గమ్మకి అప్పజెప్పి తను స్నానం చేసి వచ్చింది రోహిణి. మిగతావాళ్ళుకూడా స్నానాలు చేసాక, భోజనాలకి కూర్చున్నారు. సూతకం వుండటంచేత అమృతకి టేబుల్ విడిగా వేసారు. దుర్గమ్మ ఆమె దగ్గర నిలబడి చూసుకుంటోంది. వద్దనీ, తినననీ అనలేదు అమృత. ఒకటికి రెండుసార్లు చెప్పించుకుని వాళ్లని ఇబ్బందిపెట్టాలనిపించలేదు. కొద్దిగా తిని ఆగిపోయింది.
“ఇంకొంచెం తిను అమృతా! నువ్వసలు అన్నం తిని ఎన్నాళ్లైంది? నీరసం వస్తుంది. తినమ్మా!” అంది రోహిణి. ఆ అమ్మాయికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గొంతు పూడుకుపోయింది. బలవంతంమీద మరో రెండుముద్దలు లోపలికి తోసింది. ఆమె స్థితి అర్థం చేసుకుని ఇంక బలవంతం చెయ్యలేదు రోహిణి. అసలీ పిల్ల తేరుకుంటుందా అనిపించింది ఆమెకి. అమృత మనసులో మాత్రం గొప్ప మార్పు జరుగుతోంది. ఇలా ఎవరి జీవితం వుండదు. ఏ తల్లిదండ్రులూ పిల్లలని ఇలాంటి విషమపరిస్థితుల్లోకి నెట్టరు. తమ ఓటమిని కడుపున పుట్టిన పిల్లల మెడకి చుట్టరు. తను ఏం చెయ్యాలని వాళ్ళు ఆశించారు? ఈ అప్పులు తను తీర్చగలదా? ఈ పరిస్థితుల్లోంచీ బైటపడి నిలదొక్కుకుంటే కదా, ఏదేనా చెయ్యగలిగేది?
రోహిణికూడా అవే మాటల్ని మరోకోణంలోంచీ చెప్పింది.
“అమ్మావాళ్ళూ నిన్ను దూరంగా పంపించి పెంచడం నీ మంచికే అనుకో అమృతా! ఇందులోంచీ బైటపడి ఊపిరిపీల్చుకోవడాన్ని గురించి ఆలోచించు. మిగతావాటి సాధ్యాసాధ్యాలు, నైతికానైతికాలు మిగతావాళ్ళు చూసుకుంటారు” అంది. విజయ్ అమృతని వెంటబెట్టుకుని బయల్దేరాడు. కాన్‌స్టేబుల్ అనుసరించాడు. ఎలా మాట్లాడాలో ఎంత స్థిరంగా, తొణక్కుండా మాట్లాడాలో దార్లో చెప్పాడు విజయ్.
“అమృతా! ఒక్క విషయం నిజాయితీగా ఆలోచించుకో. ఈ సంబంధమైన డబ్బేమైనా నీ అకౌంట్లో వెయ్యటం, తియ్యటం చేసారా? అది జరిగితే నువ్వూ ఇరుక్కుంటావు. అలాంటివేవీ లేవని మామయ్య నాన్నకి రాసిన వుత్తరంలో చెప్పడంచేత మేమంతా నమ్మి నీవెనక నిలబడ్డాం. పెద్దతాతయ్యకూడా అన్నిటికన్నా ముఖ్యంగా నీకేమీ కాకూడదనే ఆలోచించారు. నిజానికి మనదగ్గిర జరిగే ఆర్థిక నేరాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఐనప్పటికీ నేరం నేరమే. అక్కడా ఇక్కడా ఒకటే చట్టం అమలౌతుంది. పోతే పెద్ద నేరస్తులకి పలుకుబడీ, తప్పించుకునే అవకాశాలూ ఎక్కువగా వుంటాయి. మనలాంటివాళ్ళని నేరాల్లో ఇరికించడానికి ఏ చిన్నపాయింటూ వదలరు. ఈ కేసులు పోలీసులు, కోర్టులు పరిష్కరించిన కేసుల గణాంకాలు చూపించుకోవటానికి బాగా వుపకరిస్తాయి” అన్నాడు.
పోలీసు కేసన్న భయం అమృతని చాలా భయపెట్టింది. చిగురాకులా వణికిపోయింది. “నాకు ఈ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు
విజయ్‍గారూ! నన్ను దూరం పెట్టారు అమ్మా, నాన్నా! నా చదువుకీ, అవసరాలకీ కావల్సిన డబ్బుకూడా వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు బాగా పొదుపుచేసి డబ్బు కూడబెడితే పెద్దకట్నం ఇచ్చి గొప్ప అల్లుడిని తీసుకురావచ్చనేది ఆవిడ. ఆడపిల్లలకి అదో నరకం. ఏమీ ఖర్చుపెట్టరు. తిండికూడా సరిగ్గా పెట్టరు. నాన్నది గవర్నమెంటు వుద్యోగం కావటంచేత, స్కాలర్‍షిప్పులవీ వచ్చేవి కాదు. నాకు జాబ్ వచ్చాకకూడా స్టడీలోనుకి కట్టుకునేదాన్ని. మిగిలినడబ్బుకి లెక్కలడిగేది అమ్మ” అంది అమృత.
విజయ్ ఆమె కళ్లలోకి సూటిగా చూసాడు. తను ఎలాంటిమాటలు అతన్తో చెప్పిందో అర్థమై అతని చూపుల్ని ఎదుర్కోలేకపోయింది. మరి పెద్దవాళ్ళమధ్య తమ పెళ్ళిప్రస్తావన ఎలా వచ్చింది? అతని భృకుటి ముడిపడింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ చెరొకలా ఆలోచించి వుంటారని గ్రహించాడు. మనసు తేలికపడింది. అంతకన్నా దూరం ఆలోచించడానికి ఇది సందర్భంకాదని ఆలోచనలు అక్కడితో ఆగాయి.
వీళ్ళు వెళ్ళేసరికి శ్యామ్మోహన్ అక్కడికి చేరుకున్నాడు. మూడుగంటలసేపు అమృతని గ్రిల్లింగ్ చేసారు.
“నేను చిన్నప్పట్నుంచీ హాస్టల్స్‌లోనే పెరిగాను. సెలవుల్లో వెళ్ళినా నా ఫ్రెండ్సుతో నేనుండేదాన్ని. అమ్మ నన్నొక అడ్డంగా అనుకునేది. ఎందుకూ, సెలవులివ్వగానే ఇంటికి పరిగెత్తుకురావటం? ఏ ఫ్రెండింటికో వెళ్ళి, నాలుగురోజులుండి రావచ్చుకదా అనేది. అలా ఎలా వెళ్తాం అని నేను వాదించేదాన్ని. ఐ పిటీ హిమ్. మై డాడ్. ఆయన మాట అమ్మ వినేదికాదు. అసలు లక్ష్యపెట్టేదికాదు. ఆమె ఏం చేసేదో, ఆమె యాక్టివిటీస్ ఏమిటో నాకు తెలీదు. ఇంటరువరకూ చదువు చెప్పించారు. బీటెక్‍లో స్టడీలోన్ తీసుకున్నాను. నేనే తీర్చుకుంటున్నాను. ఇంకా లోన్ బేలెన్స్ వుంది. నా బేంకు డీటెయిల్స్ ఇస్తాను. చెక్ చేసుకొండి” అంది స్పష్టంగా. ఎన్ని రకాలుగా తిప్పితిప్పి అడిగినా అదే సమాధానం చెప్పింది. ఒకరకమైన తెగింపు వచ్చింది ఆమెలో. కొన్ని ప్రశ్నలకి శ్యామ్మోహన్ అభ్యంతరపెట్టాడు.
“సారీ సర్! మా ఫార్మాలిటీస్ మేము పాటించాలి” అన్నాడు సీఐ చివరికి. ఫార్మాలిటీస్ పేరుతో పోలీసులు ఎంతదాకా వెళ్తారో శ్యామ్మోహన్‍కిగానీ విజయ్‍కిగానీ తెలీనిది కాదు. తాము వెనక లేకపోతే అమృత పరిస్థితి మరోలా వుండేది. కేసులో ఆమె పాత్రకూడా వుందని అరెస్ట్ చేసి లోపల వేసేవారు. కేసంతా ఆమె చుట్టూ అల్లుకునేది.
ముగ్గురూ ఇవతలికి వచ్చారు. పితృవనంనుంచీ నేరుగా వచ్చాడుగాబట్టి ఇంకెవరింటికీ వెళ్ళకూడదని శ్యామ్మోహన్ ఇంటికి వెళ్ళిపోయాడు. విజయ్, అమృతా యింటికి వచ్చారు. ఎదురుచూస్తూ కూర్చునుంది రోహిణి. జరిగిన విషయాలు చెప్పాడు విజయ్. అమృతని దుర్గమ్మకి అప్పగించింది రోహిణి. విజయ్ మరోసారి స్నానం చేసాడు.
“ఈ పదిరోజులూ నీవెంటే వుంటుంది దుర్గమ్మ. నేను రాత్రి వచ్చి నీదగ్గిరే పడుకుంటాను. పనులుంటాయికదమ్మా?” అంది రోహిణి అమృతతో అనునయంగా. అమృత తలూపింది.
మూడురకాల మైల పాటిస్తారు త్రిమూర్తులి యింట్లో. దేనికి దానికే వేరువేరు గదులున్నాయి. మూడుగదులకీ మూడు ప్రత్యేకమైన పేర్లు పెట్టించాడు ఆయన. సౌహార్ద్రం, నవపల్లవం, సంతాపం. సంతాపంలోకి తీసుకెళ్ళింది దుర్గమ్మ, అమృతని.
సౌహార్ద్రం, నెలసరిలో ఆడవాళ్ళు విశ్రాంతిగా కూర్చోవడానికి. ఆ మూడురోజులూ త్రిమూర్తులి యింట్లో ఆడవాళ్ళకి పూర్తి విశ్రాంతే. ఇన్ని బాదం ఆకులు, మోదుగాకులు ముందేసుకుని విస్తళ్ళు కుడుతూ కూర్చునేవారు రోహిణి అత్తగార్లు. రోహిణితరంవాళ్ళు పత్రికలు, నవలలు చదివేవారు. వాళ్ళ పిల్లలు, కోడళ్ళు కంప్యూటర్లు, టీవీలు పెట్టుకుని కూర్చుంటున్నారు. నవపల్లవంలో తప్ప మిగిలిన రెండుగదుల్లోనూ టీవీలున్నాయి.
పైకి చూస్తే త్రిమూర్తులిది చాదస్తంగా అనిపిస్తుంది. పాటించేవాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకి వుంటాయి. అనేక ఆరోగ్యసమస్యలు, వొంటినుంచీ వచ్చే వాసన, ఉండుండి ఒక్కసారి ప్రవాహంలా హెవీగా బ్లీడింగ్ కావటం ఇలా ఎవరి కారణం వాళ్ళది. ఆ మూడురోజులూ దూరంగా వుండటానికే చాలామంది యిష్టపడతారు. అది అనాగరికమని ముద్ర వేస్తున్నారుగాబట్టి ఆడవాళ్ళు అలా అనాగరికంగా వుండలేక స్నానం చేసి కలిసిపోతున్నారు. ఇంట్లోకి రావటమంటూ వచ్చాక పనులు తప్పట్లేదు. ఐన వెంటనే తలతడపడం వలన వచ్చే అనారోగ్యాలు కొందరికి అదనం. వాళ్ళకి ఆ మూడురోజులూ విశ్రాంతి యివ్వటానికి మారుగా, దాన్నొక దురాచారమని వాళ్ళచేతే అనిపించి, నడిపించుకుంటున్నారు సమాజంలో. ఇది మరో సమస్యకి దారితీసింది. అలాంటి సమయంలో మామూలుగా తిరగడానికి అనువుగా వుండే సేనిటరీ నేప్‍కిన్లు మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడ్డాయి.
రకరకాల రసాయనాలు, తొంభైశాతం ప్లాస్టిక్ వాడి తయారు చేసే ఈ నేప్‍కిన్లు 1993లో భారతదేశంలోకి వచ్చాయి. ఇవి నెలసరి సమస్యలకి పరిష్కారం కాదు. సౌకర్యాన్ని మాత్రమే యిస్తాయి. ఏటా కొన్ని బిలియన్ల వాడేసిన నేప్‍కిన్లు దేశంలోని చెత్తకి తోడౌతున్నాయి. ఆడవాళ్ల దగ్గరనుంచీ విశ్రాంతిని లాక్కుని వాళ్ల నెలసరిని మార్కెట్‍గా మార్చి, ప్రపంచాన్ని భయంకరమైన చెత్తతో నింపుతున్నారు. “మూడురోజులు మేం చెయ్యకపోతే యిల్లు నడిపించలేరా?” అని తిరగబడటానికి బదులు ఆ మూడురోజుల విశ్రాంతిని ఆధునికత పేరుతో వదులుకుంటున్నారు ఆడవాళ్ళు. అలా వదులుకుని, ఆఫీసుల్లో రుతుక్రమసెలవుకోసం పోరాడుతున్నారు. వీరు సంపాదించేది తమకోసం, తమ కుటుంబంకోసం. సెలవు గవర్నమెంటు ఇవ్వాలి, ఆ సెలవులో పని పక్కసీట్లవాళ్ళు చెయ్యాలి!
నవపల్లవం ప్రసూతి గది. కొత్తశిశువుకి ఆహ్వానం పలికేగది. మూడోది సంతాపం. ఈ మూడుగదులూ అందరూ తిరిగేలా, కూర్చుని కబుర్లు చెప్పుకునేలాగా వుంటాయి. ఎవరూ ఎవర్నీ వంటరిగా వదిలిపెట్టరు. వాళ్లని అటు వెళ్లనిచ్చి, తను మండువాయింటికి వెళ్ళింది రోహిణి. ఐదుగురు తోడికోడళ్ళూ అక్కడే వున్నారు.
“అంతా ఐపోయిందా?” అడిగింది అసలు అత్తగారు. ఆమె తలూపింది.
“పిల్ల యిక్కడే వుందా? వాళ్లవాళ్లెవరూ రాలేదా?”
“లేదు. వదిలేసినట్టే వున్నారు. లేకపోతే మనం చూసుకుంటున్నామని తెలిసిందేమో!” అంది రోహిణి.
ఏవో మాటలు సాగాయి. వెంకట్రావు, విశాలలగురించీ మాట్లాడుకున్నారు. అనేకవిషయాల్లో వివిధవ్యక్తులకి రకరకాల అభిప్రాయాలుంటాయి. కొన్ని విషయాల్లోమాత్రం అందరి అభిప్రాయం ఒకటే వుంటుంది. కూతురిగురించేనా ఆలోచించకుండా వాళ్ళిద్దరూ అలా ఎలా చేసారన్నదే అందరి ప్రశ్న.
“విజయ్‍కిగానీ చేసుకునే ఆలోచన వుందా?” పెద్దావిడ హఠాత్తుగా అడిగింది. అంత నేరుగా అడిగేసరికి ఏం చెప్పాలో రోహిణికి తోచలేదు.
“ఇంతకుముందు అనుకున్నాంకానీ, ఇప్పుడింక ఎలా కుదుర్తుందో తెలీదు” అంది నెమ్మదిగా.
“మగతనం అంటే అదేకదూ? అన్నీ బావుండి, వాళ్ళూ మీరూ అనుకుని పిల్లలిద్దర్నీ పీటలమీద కూర్చోబెట్టి పెళ్ళిచెయ్యడంలో గొప్పేం వుంది? విజయ్‍కి ఆ పిల్లంటే యిష్టం వుంటే తనని కష్టాల్లోంచీ బైటపడెయ్యమను”
“మరోరకం కష్టాలంటే తీర్చచ్చు. ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. బైట అడుగుపెడితే ఆ పిల్లని బతకనివ్వరు” అంది రెండో ఆవిడ.
“అప్పులకీ ఆస్తులకీ చెల్లుపెట్టాక తర్వాత ఆలోచించాల్సిన సంగతి”
“ఏదో ఒకటిచేసి చెల్లుపెట్టినా, డబ్బుపోగొట్టుకున్నవాళ్ల శాపనార్ధాలు నిత్యం తగుల్తునే వుంటాయి ” అంది రోహిణి. అవేమిటో నిప్పుమంటల్లా అనిపిస్తున్నాయి ఆమెకి ఇప్పుడే.
“పెద్దాయన వున్నారుకదా? ఆలోచిస్తారులే” అంది పెద్దావిడ. రోహిణికి తెలుసు, త్రిమూర్తులు ఏం నిర్ణయిస్తాడో. పూర్తిగా కాకపోయినా కొంతేనా వూహించగలిగింది. మనసులో కాస్తకాస్తగా వున్న అప్రసన్నత కాస్త చిక్కబడింది. ఒక మనిషికి సాయం చెయ్యడం వేరు, వాళ్ళ కష్టాన్ని పూర్తిగా మనమీదికి బదలాయించుకోవడం వేరు.


సంతాపంలో తనకి చూపించిన చెక్కమంచంమీద కూర్చుంది అమృత. మంచంమీద తడిపి ఆరేసుకునేలాంటి బొంత, దుప్పటి వున్నాయి. చెక్క సోఫాసెట్టు, జరుపుకునేందుకు వీలుగా కుర్చీలు, షెల్ఫ్, అందులో కొన్ని పుస్తకాలు, పత్రికలు వున్నాయి. గోడకి చిన్న టీవీ బిగించి వుంది. అవంతీ ఎస్టేట్స్‌లోని ప్రతి అంశం, ప్రతి అణువు త్రిమూర్తులి అభిరుచికీ, శ్రద్ధకీ, ఇంట్లోవాళ్ళపట్ల అతనికి వుండే ప్రేమ, ఆదరాభిమానాలకీ అద్దంపడతాయి. అదృష్టవశాత్తు అతను చూసినవి మూడే చావులు. పట్టినవి మూడే సూతకాలు. పెట్టేవి మూడే ఆబ్దికాలు. మొదట తండ్రి, తర్వాత దశాబ్దాల తర్వాత తల్లి, ఆపైన దశాబ్దంకిందట భార్య చనిపోయారు. సూతకాలన్నీ బయటినుంచీ వచ్చిన కోడళ్ళకే. స్నానంతో విడిచిపోయేవి, పక్షిణీ పట్టాల్సినవి. వేరువేరు కుటుంబాలనుంచీ చిన్నచిన్న నీటిపాయల్లా వచ్చి ఈ కుటుంబంలో కలిసిన ఆడవారివి.
తన సామాన్లు అక్కడ చూసేసరికి చాలా విషయాలు గుర్తొచ్చాయి అమృతకి. దు:ఖంతో నిలువెలా వణికిపోయింది. క్రమంగా తెప్పరిల్లింది. తనకి తనే ధైర్యం చెప్పుకుంది. తనకంటూ ఎవరూ లేరు. వీళ్ళ సాయంతో ఇందులోంచీ బైటపడాలి. అంతూదరీ కనిపించని అప్పుల సముద్రంలో అదెలా సాధ్యపడుతుందో తెలీలేదు. మిణుకుమిణుకుమంటున్న దీపంలాంటి ఒక చిన్న ఆశ ఈ ఆసరా. అంతే.
ఫోన్ తీసింది. చార్జి లేదు. చార్జరు తీసి పట్టుకుని ప్లగ్‍కోసం చూస్తుంటే దుర్గమ్మ తీసుకుని కనెక్ట్ చేసింది. మరో విషయం గుర్తొచ్చింది. రోహిణిని పిలవమనబోయి ఆగింది. రాత్రి ఆవిడ వస్తానంది, అప్పుడు చెప్పచ్చుగానీ అంతసేపు వుండాలనిపించలేదు. లోపల్నుంచీ ఒక ఆత్రమేదో తరుముకొస్తోంది.
“విజయ్‍గారిని ఒకమాటు రమ్మంటారా దుర్గమ్మా?” అడిగింది సంకోచిస్తూ. దుర్గమ్మ వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి విజయ్ ప్రసూనతో బేరాలడుతున్నాడు. “అక్కా! ప్లీజ్ అక్కా!” అంటున్నాడు.
“నీ అంత ఫూల్ మరొకడు వుండడు. ఆ పిల్లని ప్రేమించడమేమిట్రా? కోరి కష్టాలు తెచ్చుకోవడం కాకపోతే?” అందామె.
“అమృత నాకు చాలాకాలంనుంచీ తెలుసు. కానీ మేం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మాయిద్దరికీ మధ్య చనువులేదు. ఆమెకి జరిగింది చిన్నవిషయం కాదు. నేను ఆమెకి ఎలాంటి ఓదార్పూ యివ్వలేను. అమృతతో పరిచయం పెంచుకుని, నువ్వే తనని మామూలు మనిషిని చెయ్యాలి. అది నీవల్లే ఔతుంది. నీ ఫ్రెండ్స్ సైకాలజిస్టెవరేనా వుంటే వాళ్లనికూడా పరిచయం చెయ్యి. తనకి చాలా సపోర్టు కావాలి” అన్నాడు.
“విజయ్, ఫ్రెండుగా ఎంతేనా చేస్తాను. ఆమె పరిస్థితికి నాకూ జాలి వుంది. దాన్ని బంధుత్వంగా మార్చాలనుకోకు. అది సాధ్యపడదు. పెద్దనాన్నకూడా ఒక బాధ్యతగానే తీసుకొచ్చారు. త్రిమూర్తులు తాతయ్యకూడా ఆడపిల్లని చూసి వప్పుకున్నారు. గొడవంతా సద్దుమణిగాక ఎక్కడికో పంపేస్తారు. మందిసొమ్ము దోచుకుని తిరిగినవాళ్ళ పిల్లతో సంబంధానికి ఇంట్లో ఎవరూ వప్పుకోరు” అంది హెచ్చరికగా. విజయ్ తెలుసునన్నట్టు తలూపాడు.
సరిగ్గా అప్పుడే దుర్గమ్మ వచ్చింది. అమృత అతన్ని రమ్మన్న విషయం చెప్పింది.
“పద, నేనూ వస్తాను” అంది ప్రసూన. ఇద్దరూ వెళ్ళారు. వాళ్ళు మాట్లాడుకుంటారని దుర్గమ్మ ఆగిపోయింది. వాళ్లంత వెంటనే వస్తారనుకోలేదు అమృత. “సారీ! మీకు యిబ్బంది కలిగించాను. మీ అమ్మగారు రాత్రికి ఇక్కడికి వస్తానన్నారు. అంతదాకా కూడా ఆగలేకపోయాను” అంది తలదించుకుని విజయ్‍తో. ఆమె మనస్థితి అర్థం చేసుకోగలిగాడు.
“పర్వాలేదు” అన్నాడు. ప్రసూనని ఆమె చూసిన పరిస్థితి వేరు. గుర్తుపట్టలేకపోయింది. అక్కాతమ్ముళ్ళిద్దరూ ఇద్దరూ కుర్చీలు జరుపుకుని కూర్చున్నారు.
“ఎలా వుంది అమృతా, నీకిప్పుడు?” అడిగింది ప్రసూన వుపోద్ఘాతంగా. ఆ ప్రశ్నని పట్టించుకోలేదు అమృత. మనసులో ఏదో తరుముకొస్తున్నట్టుగా వుంది.
“ఇది మా లాకర్ కీ. పదిహేనురోజులక్రితం అమ్మ హైదరాబాద్‍లో ఒక పెళ్ళికి వచ్చినప్పుడు లాకర్లోంచీ కొన్ని వస్తువులేవో తీసుకుంది. పెళ్ళినుంచి వచ్చాక తీసుకుంటానని కీ నాదగ్గర పెట్టి మర్చిపోయింది” అంది గబగబ. అతనికి తాళం యిచ్చింది. “యాభైతులాలవరకూ వుండచ్చు ఆమె బంగారం. ఒక బిస్కెట్ కూడా కొన్నట్టు గుర్తు” అంది.
“వాళ్ళిద్దరి అకౌంట్సన్నీ ఫ్రీజ్ అయ్యాయి. లాకర్ తెరవడానికి పర్మిషన్ తీసుకోవాలనుకుంటాను. శ్యాం అంకుల్‍కి చెప్తాను”
“నాన్న గవర్నమెంటు సర్వీస్ చేస్తూ చనిపోయారు. ఆయనకి పెన్షనరీ బెనిఫిట్స్ వస్తాయి. అవికూడా ఇరవైముప్పై వుండచ్చు” గబగబ అంది.
“నువ్వు టెన్షన్ పడకు అమృతా!” అన్నాడు విజయ్.
“కాదు, నన్ను చెప్పనివ్వండి. ఆలస్యం చెయ్యడం మంచిదికాదు. మా తాతగారికి కొద్దిగా పొలం వుంది. అందులో మాకూ వాటా వుంది. ఐవేజు పంపించలేదనీ వీళ్ళూ, బాధ్యతలేం తీసుకోలేదుకాబట్టి ఎందుకు పంపాలని వాళ్ళూ గొడవపడేవాళ్ళు” అని ఇంక చెప్పడానికి ఏమీలేదన్నట్టు ఆగిపోయింది.
“ఇంట్లో చనిపోయారుకాబట్టి యిల్లెవరూ కొనరు. ఇక్కడికి తీసుకొచ్చారు మామయ్య. డబ్బు తీర్చకపోతే మీకు చెడ్డపేరు వస్తుంది. నన్ను నడిబజార్లో పెట్టి అమ్మేసినా మిగిలిన డబ్బు తీర్చలేను” అంది అస్పష్టంగా. దు:ఖం తరుముకొచ్చింది. చేతుల్లో ముఖం దాచుకుంది. ప్రసూన చప్పుని ఆమెని దగ్గరికి తీసుకుంది.
“చూడు, నిన్నలా నడిబజార్లో వదిలెయ్యడం ఇష్టంలేకేకదా, పెద్దనాన్న ఇక్కడికి తీసుకొచ్చింది. అలాంటి మాటలు మాట్లాడకు. కృతజ్ఞత, బాధ ఇవేవీ నిన్నీ కష్టంలోంచీ బైటపడెయ్యలేవు. నీ ఆలోచన తప్ప ఇంకేదీ అందుకు వుపకరించదు. ఐనా తొందరేం లేదు. నిదానంగా ఆలోచించు. ఇంకా ఏవేనా గుర్తొస్తాయేమో చూడు. మీ యింటివిషయాలు నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరు. మీ అమ్మావాళ్ళూ డబ్బు ఏం చేసేవారో, ఎవరికేనా నమ్మి యిచ్చేవారా, ఎక్కడేనా పెట్టుబడి పెట్టేవారా ఆలోచించు. విలాసంగా ఖర్చుచేసేవారా? ” అడిగింది.
అమృత తమ మధ్యకి రాకపోతే యీ విషయంతో ఎవరికీ ఎలాంటి సంబంధం వుండేది కాదు. కానీ ఆమె తమ మధ్యని వుంది. విజయ్ యిష్టాన్ని చూపిస్తున్నాడు. పట్టనట్టు వుండటం ఎలా? తనో మరొకరో అమృతతో స్నేహంగా వుండకపోతే విజయ్ నేరుగా ఇన్వాల్వ్ ఔతాడు. దాన్ని తప్పించడానికేనా తను ఆమెతో స్నేహం పెంచుకోక తప్పదు. విజయ్ ప్రేమ పెళ్ళికి దారితీయకపోవచ్చు. అనుబంధం పెంచుకోవడం, దాన్ని తుంచుకునేందుకు ప్రయాసపడటం అతని జీవితంలో అవసరం లేనివి. అందుకు తనే హద్దుగీతమీద నిలబడాలి. అతను ఇటు మొగ్గకుండా ఆపాలి.


ఏ సంఘటనా జరిగిన దగ్గర కాలం ఆగిపోదు. దాన్ని వెనక్కి నెడుతూ కాలం తను ముందుకి సాగుతుంది. మనిషిని కూడా తోసుకెళ్తుంది. కొత్త సంఘటనలు మొదలౌతాయి. కొన్ని ముంచెత్తేవీ, ఇంకొన్ని గతిని మార్చేవీ. తులసి ఇంకొన్నాళ్ళు వుంటాననడంతో చరణ్ బెంగుళూరు వెళ్ళిపోయాడు. మహతి ఇంట్లోనే డీటీపీ వర్కు చేస్తుంది. వెబ్‍డిజైనింగ్ కూడా చేస్తుంది. ఆర్గనైజ్‍డ్‍గా కంపెనీ పెట్టుకోలేదు. కొంత మెటీరియల్ తనతో తెచ్చుకుంది. ఇక్కడినుంచీ చేసుకోగలదు. ఇంకొన్నాళ్ళున్నా సమస్య లేదు. ఫోన్లూ కంప్యూటర్లమీదే వ్యవహారం కాబట్టి సమస్య లేదు.
గీతని చూడటానికి ఎవరో ఒకరు వస్తునే వున్నారు. అరుణనీ, సంధ్యనీ రాణా తీసుకొచ్చి వదిలాడు. తల్లి ఎంత చెప్పినా లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడు. వయసు ఇబ్బందులచేత ప్రమీల రాలేనంది. రామారావు పెద్దతమ్ముడు శేఖర్, భార్య ఇక్కడ లేరు. పద్మ కాశీయాత్రలో వుండి రాలేకపోయింది. సుధీర్, రమాకూడా ఇండియా వచ్చారు. రమ తల్లిదండ్రులది ముంబాయి. రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోవాలని సుధీర్‍కి ఎంతగా వున్నా, వాస్తవిక ప్రాథమ్యాలు వేరే వున్నాయి. వాటిని పాటించక తప్పలేదు.
“ఎందుకిలా చేసావు గీతా?” అని అరుణ మృదువుగా అడిగితే, సంధ్య “బుద్ధుందా, నీకసలు?” అని గట్టిగా కేకలేసింది. సంధ్యని ఒక చూపు చూసింది గీత.
“చాలాకాలం బతికేసాననిపించింది !” అంది చూపు ఆమెమీంచీ తిప్పుకుని బలహీనంగా నవ్వి.
“నువ్వే అలా అంటే మేమంతా ఏం చెప్పాలే?” అంది యశోద. ఆవిడ కళ్ళు నీటిచెలమలయ్యాయి. పమిటకొంగుతో వత్తుకుంది.
అక్కడ సీనియరు సిటిజెన్స్ బేచి ఒకటి, యాభైకి అటూయిటూ వున్న బేచి మరొకటి వున్నాయి. ప్రమీలకీ, లక్ష్మికీ పిల్లలు ఆలస్యంగా పుట్టడంవలన వాసు, సుధీర్ కూడా అరవైలోపే వున్నారు. లేకపోతే రవి తర్వాతి వరసలో వీళ్ళు చేరేవాళ్ళు.
“ఇంత చప్పుని రిటైర్మెంటు ఎందుకు తీసుకున్నావు? కనీసం వాసు రిటైరయ్యేదాకానేనా ఆగాల్సింది. ఉద్యోగం చేసేవాళ్ళకి ఖాళీగా వుండటం కష్టమనిపిస్తుంది” అంది అరుణ. మెనోపాజ్, తులసి అనారోగ్యం, ఇంకొన్ని సమస్యలు, ఆఫీసులో వత్తిడి అన్నీ ఒక్కసారి కలిసి వచ్చాయి గీతకి. లీవు దొరకని పరిస్థితి. దాంతో బాధ్యతలన్నీ తీరాయని వీఆర్ తీసేసుకుంది.
మాటలమీద వెంకట్రావు, విశాలల ప్రస్తావన వచ్చింది.
“రెండులక్షలు మునిగాను. వడ్డీ ఎక్కువ యిస్తామంటే వాళ్లదగ్గిర పెట్టాను” అంది సంధ్య.
“నేనూ చీటీలో చేరాను” అంది అరుణ.
“అన్నయ్య త్రిమూర్తులిని అంత గొప్పచేసి చెప్తాడు. ఆయనమాట జవదాటడు. ఇప్పుడా పెద్దమనిషి ఏం చేసాడో తెలుసా? వాళ్ల పిల్లని తెచ్చి తనింట్లో పెట్టుకున్నాడట. ఆ పిల్లని అంత కాపాడాడంటే జరిగినదాంట్లో ఆయన చెయ్యికూడా వున్నట్టేకదా?” అంది సంధ్య. ఆమాట రామారావు విన్నాడు. వినాలనే సంధ్యకూడా అంది. అతనికి కోపం వచ్చింది. బీపీ పెరిగిపోయింది. ఆపైన పెద్దవయసు. ఆవేశం అదుపులో వుంచుకోలేకపోతున్నాడు. తాగుతున్న కాఫీగ్లాసు అలాగే వదిలేసి చెప్పులేసుకుని బయల్దేరాడు, త్రిమూర్తులు యింటికి, అదేమిటో తేల్చుకుంటానని. అదీకాక గీత విషయం ఆయనతో చెప్పాలనే తపన ఒకటి నిలవనివ్వటంలేదు. ఒక్కడూ ఎక్కడికీ వెళ్ళలేని నిస్సహాయత అగ్నికి ఆజ్యం పోసినట్టు కోపాన్ని పెంచుతోంది. యశోద ఏదో చెప్పబోయేంతట్లో ఆయన గడపదాటేసాడు. మనిషి నిలువునా గడకర్రలా వూగిపోతున్నాడు.
“మామయ్యా! ఉండు, నేనూ వస్తున్నాను” అని వాసు వెంట పరిగెత్తాడు. అప్పటికే ఆయన సందుమలుపుదాకా వెళ్ళి యింక నడవలేక రొప్పుతూ అక్కడ వున్న ఎప్పటిదో వంతెన గట్టుమీద కూలబడ్డాడు. ఆ వంతెనకి చాలా ప్రసిద్ధి వుంది. ఒకప్పుడు దానికిందనుంచీ తపస్వినీనది కాలువ పారేది. నదిమీద ఆనకట్ట కట్టాక కాలువ ఎండిపోయింది. నీళ్ళు మరోవైపుకి మళ్ళాయి. వర్షం పడ్డప్పుడు నిండుతుంది. ఎందుకనో ఆ గట్టు కొట్టెయ్యకుండా వుంచారు. పిల్లలకి ఆ గట్టుతో గొప్ప అనుబంధం వుండేది. రివ్వుమని సైకిళ్ళు తొక్కుకుంటూ వచ్చి, ఆ మలుపుదగ్గిర ఆగి, గట్టుకి కాలు దాటుపెట్టుకుని నిలబడి అలుపు తీర్చుకునేవారు. స్కూలుబేగులు దానిమీద పడేసి, కబుర్లు చెప్పుకునేవారు.
“పద, యింటికి” అన్నాడు నెమ్మదిగా.
“మనిల్లు నిలబెట్టింది త్రిమూర్తులేకదా? ఆయన సలహా సంప్రదింపులు లేకపోతే నేనేం చెయ్యగలిగేవాడిని? సంధ్య చూడు, ఎలా అందో!” అన్నాడు కళ్ళమ్మట నీళ్ళునింపుకుని.
“అలా అన్నందుకు పిన్నితో దెబ్బలాడదాం పద” అన్నాడు చెయ్యిపట్టుకుని లేవదీస్తూ.
“నేను యిక్కడే కూర్చుంటాను. కారు తీసుకురా, వెళ్దాం. అదేమిటో తేల్చుకుంటాను” అన్నాడు రామారావు పట్టుదలగా.
“ఇప్పుడేకదా నువ్వు నన్ను అడిగింది, రేపు నిన్నాయన దగ్గరికి తీసుకెళ్తాను. నా మాటంటే మాటే. ముందు యింటికి రా” అన్నాడు వాసు. అప్పటికి కాస్త చల్లబడి, అతన్ని అనుసరించాడు రామారావు. ఆయన్ని చూసాక యశోద తేలిగ్గా నిశ్వసించింది.
“బేంకులోనో, పోస్టాఫీసులోనో దాచుకోక, మోసాలు జరుగుతున్నాయని ఎవరెంత చెప్పినా వినక, ప్రైవేటు చీటీలు, డిపాజిట్లు ఎందుకు కట్టారు పిన్నీ, ఇద్దరూ చదువుకున్నవాళ్ళేకదా?” అడిగాడు వాసు. ఇలాంటి సమాంతరవ్యవస్థలు మనదేశంనిండా నిండిపోయి వున్నాయి. కోటిరూపాయలకి ఎకరా పొలం కొని, లక్షకో రెండులక్షలకో రిజిస్టరు చేయించుకుంటారు. ఏదేనా తేడా వచ్చి అమ్మినవాడిమీద కోర్టుకి వెళ్తే తిరిగొచ్చేది ఆ లక్షా రెండులక్షలే. ఐనాసరే, అదే పద్ధతి. అదేమంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా ఎక్కువంటారు. స్థలాలూ అంతే. కేపిటల్ గెయిన్స్ టాక్స్ అమ్మేవాళ్ళకీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంపుడ్యూటీ కొనేవాళ్ళకీ తగ్గుతాయని చూసుకుంటారు.అందరూ సరిగా రిజిస్టేషన్ చేయించుకుంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చి, ఇలాంటి ఎక్కువలన్నీ తగ్గుతాయి. కానీ ఇవి చెట్టుముందా, విత్తుముందాలాంటి ప్రశ్నలు. ఏదేనా తేడా వచ్చి అమ్మినవాడిమీద కోర్టుకి వెళ్తే తిరిగొచ్చేది ఆ లక్షా రెండులక్షలే. ఐనాసరే, అదే పద్ధతి.
“బేంకులూ, పోస్టాఫీసులూ, వడ్డీలేం యిస్తున్నాయిరా? లక్ష వేస్తే ఆరువందలు రావటం గగనమౌతోంది. వీళ్ళు తెలిసినవాళ్ళని నమ్మాను” అంది సంధ్య.
“నమ్మితేనేకద పిన్నీ, మోసం చెయ్యగలిగేది?” అడిగింది మహతి.
“రాణాకి సరైన వుద్యోగం లేదు. పది వ్యాపారాలు చేసాడు, పాతిక దివాలాలు తీసాడు. ఆపైన మా అనారోగ్యాలు, వైద్యాలు. వాడి భార్య, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఎంతోకొంత వాళ్ళకి పంపాలి. రిటైర్మెంటు డబ్బంతా ఖర్చైపోయింది. బాబాయ్ పెన్షనొక్కటే ఆధారం. ఎందరం బతకాలి అందులో? తెలిసినవాళ్ళని నమ్మి వీళ్ళదగ్గిర దాచాను” సంధ్య బాధపడింది. నిజానికి వాళ్ల పరిస్థితి బాగా లేదు. రెండులక్షలనేది ఆమెకి చాలా పెద్దమొత్తం. అందుకే కోపమంతా త్రిమూర్తులిమీదికి మళ్ళింది. నిజానికి అమృతని ఆయన చేరదియ్యనంతమాత్రాన ఆమెకి వచ్చే లాభం ఏమీ లేదు.
“నందగోపాల్‍కి అతను పరిచయం. చాలాయేళ్ళనుంచీ చీటీలు వేస్తున్నాం. ఎప్పుడూ మధ్యలో తీసుకోలేదు. ఆఖరిదాకా వుండేవాళ్ళం. మంచి లాభం వచ్చేది” అంది అరుణ.
“మీకు లాభం వచ్చిందంటే మరెవరో నష్టపోయినట్టేకద పిన్నీ?” అడిగింది మహతి.
“అలా వుండదే. మరీ వీటితోటే అవసరాలు గడుపుకునేవాళ్ళ విషయం నేను చెప్పలేనుగానీ, పద్మకూతురు ఫ్లాటు కొన్నప్పుడు రెండోమూడో చీటీలు మధ్యలో పాడి తీసుకుంది. బేంకులోను ఆరులక్షలేనా తగ్గింది దానికి. ఆ ఫ్లాటుధర రెట్టింపైంది. ఆ లాభంముందు ఈ నష్టం ఎంత?” అంది అరుణ. ప్రతివాళ్ళూ ఎంతోకొంత లాభం తీసుకోవాలనుకుంటున్నారు. ఆ లాభం ఎక్కడినుంచీ వస్తోంది? వ్యవస్థని మోసం చెస్తే వస్తోంది. ఈ సమాంతరవ్యవస్థలన్నీ దేశ ఆర్థికవ్యవస్థని మోసగించేవే.
ప్రజలు చేసే ప్రతిలావాదేవీలోనూ మనకి వుపాధీ, రక్షణా కల్పించే ప్రభుత్వానికి పాలు వుంటుంది. ఉద్యోగస్తులు జీతం తీసుకుంటూ ఇన్‍కం టాక్స్ కడతారు. మిగిలిన డబ్బులో ఖర్చుపెట్టినదానిమీద జీయస్టీ, బేంకులో దాచినదానిమీద వచ్చే వడ్డీపై మళ్ళీ ఇన్‍కం టాక్స్ కడతారు. దాచుకున్నదాంతో స్థిరాస్తి కొన్నప్పుడు స్టాంపుడ్యూటీ, రిజిస్టేషన్ చార్జీలు, జీయస్టీ కడతారు. ఆ యింట్లోనే వుంటే ఇంటద్దె అలవెన్సుమీద ప్రభుత్వం యిచ్చే పన్ను మినహాయింపు పోయి, అది ఆదాయానికి కలుస్తుంది. ఇల్లు అద్దెకిచ్చినా అది ఆదాయమే.
ఒకవేళ అవసరంపడి ఆ యింటిని అమ్మితే లాంగ్‍టర్మ్ లేదా షార్ట్‌టర్మ్ కేపిటల్ గెయిన్స్ కడతారు. వాళ్ళు కట్టిన యీ పన్నులన్నీ మౌలికసదుపాయాలు, రక్షణ, ఇంకా అనేకరూపాల్లో తిరిగి రావాలి. కానీ… వీధిచివర రోజూ వేలల్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, పేవ్‍మెంట్లమీద, రోడ్డుపక్క దుకాణాల్లోనూ అమ్మకాలు చేసేవాళ్ళు, చీటీలూ అవీ నడుపుతూ లక్షల్లోనూ, కోట్లల్లోనూ డబ్బు తిప్పేవాళ్ళు, ప్రభుత్వోద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేసేవాళ్ళు… ఇంకా ఎంతోమంది పన్నులు కట్టరు. ఇవికాక అనుత్పాదక వ్యయం, పాలనాపరమైన ఖర్చులు చాలా వుంటాయి. ఆదాయానికి తగ్గ పన్నులు కట్టకపోగా ప్రభుత్వం నిస్సహాయులకి ఇచ్చే వుచితాలన్నిటినీ రెండుచేతులా అందుకుంటారు. అందుకని టేక్స్‌పేయర్స్‌కి అందాల్సినవి అందట్లేదు. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. ఒక వ్యక్తిగానీ, ఒక కుటుంబంగానీ పరిష్కరించేవి కాదు. అందుకే పైపై లాభందగ్గర ఆగిపోతున్నారు జనం. ఒకప్పుడు వాసుకి ఇలాంటివాటిమీద చాలా ఆవేశం వుండేది. ఇప్పుడది తగ్గింది.
లంచం తీసుకునేవాడితోపాటు వాడి పై ఆఫీసర్నీ పట్టుకోవాలి. కిందివాడు లంచం తీసుకున్నాడంటే అది పైవాడి వైఫల్యం. దేవాలయాల్లో హుండీలు తీసేసి, ఎవరికీ తెలీకుండా, ఎక్కడినుంచీ వచ్చిందో చెప్పకుండా వేలూ, లక్షలూ హుండీల్లో పడకుండా ఆపితే పాపాలని భక్తితో కడిగేసుకోవడం ఆగుతుంది. రోడ్లేసిన కాంట్రాక్టరు పేరు, ఫోన్ నెంబరు సైన్‍‍బోర్డుల్లో పెడితే ప్రజలు తిడతారనే భయం వుంటుంది… ఇలాంటి చాలా ఆలోచనలతో సతమతమయ్యేవాడు. ఆ ఆలోచనలు ఆచరణకి సాధ్యపడవని అర్థమయ్యే వయసొచ్చాక అందరిలాగే ఒకరకమైన వుదాశీనముద్ర యిచ్చేసాడు. రాత్రి చాలాసేపటిదాకా అవే విషయాలు మాట్లాడుకున్నారు.
భోజనాలై పడుక్కునేముందు గీతకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నెంబరు చూసి కట్ చేసింది. ఫోను శబ్దానికి యథాలాపంగా ఆమెవైపు చూసిన వాసు ఆమె ముఖంలో అలజడి గమనించాడు. పక్కనే వున్న మహతికి కళ్లతో సౌంజ్ఞ చేసాడు. ఆమె తలూపింది. రెండుసార్లు కట్ చేసినా మళ్ళీ కాల్ రావడంతో ఫోన్ తీసుకుని దూరంగా వెళ్ళింది. ఆమెని వెళ్ళనిచ్చి తనూ అనుసరించింది మహతి. ఒక మంచుగడ్డ కరగకుండా స్థిరపడిపోయింది యింట్లో. దాన్ని పగలగొట్టాలి.
“నన్నొదిలెయ్! నాకు నువ్వంటే ఎలాంటి యిష్టం లేదు. ఎప్పుడూ లేదు. వాసూ నేనూ ఒకరినొకరం యిష్టపడి చేసుకున్నాం. ఆవిషయం అందరికీ తెలుసు” అంటోంది గీత ఆమె వెళ్ళేసరికి.
“మరైతే ఆత్మహత్య ఎందుకు చేసుకోబోయావు?” పరిహాసంతో కూడిన గొంతు అస్పష్టంగా ఎవరిదో గుర్తుపట్టే వీలు లేకుండా మహతి వున్న దూరానికి వినిపించింది. గీత ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి మహతి. అతి చేరువలో.
“ఎవరు?” అడిగింది.
జవాబివ్వకుండా ఆమె చేతిలో ఫోన్ పెట్టింది గీత.
ఆఖరి కాల్ చూసింది. సేవ్ చేసి లేని నెంబరు. ట్రూకాలర్‍లో వెతికింది. శశి అని వుంది. ఛ… ఇదేంటి? ఆడవాళ్ళుకూడానా? గొంతు మగగొంతులా వినిపించింది? వళ్ళు జలదరించింది. వెంటనే కాల్ బేక్ చేసింది.
“హలో!” ఆడగొంతు.
“ఇంతకుముందు ఈ నెంబరునించీ కాల్ వచ్చింది. ఎవరు మీరు?” మహతి గొంతు కటువుగా వుంది.
“రాంగ్ నెంబర్” వెంటనే కటైపోయింది. మళ్ళీ చేస్తే స్విచాఫ్ అయింది.
“ఎవరు గీతూ?” అడిగింది. అప్పటికే చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది ఆమె.
“చెప్పవే! ఎన్నాళ్ళు దాస్తావు? నువ్వేం చిన్నపిల్లవి కాదుకదా, ఇలాంటి విషయాలకి ఏడవడానికి?” కసిరింది.
“ఇంటినిండా వరసైన మగపిల్లలు. వాళ్లమధ్య నేను ఒక్కదాన్ని. ఎవరో ఒకళ్ళనేకదా, నేను చేసుకోగలిగేది? నాన్న నన్ను అడిగారు. నా యిష్టాన్ని చెప్పాను. ఐనా ఎప్పటిమాట? మా పెళ్ళై ముప్పయ్యేళ్ళపైనే” అంది గీత. మహతి భృకుటి ముడిపడింది. అప్పటెప్పటి విషయాన్నో పట్టుకుని ఇప్పుడు గీతని సతాయిస్తున్నదెవరు? తమ మధ్యని అంత సంస్కారం లేకుండా బతుకుతున్న పయోముఖవిషకుంభం ఎవరు? సుధీర్? అతనొక్కడే గీతకోసం ఏడ్చిందీ, మనసు పాడుచేసుకున్నదీ. అతనేనా? ఆమెకి మరో కారణం కనిపించలేదు. అసహ్యం కలిగింది.
“అలా జావకారిపోకు. నీకు వాసు నచ్చాడు. అది నీ యిష్టం. అంతే. మరొకరికి అడిగే హక్కులేదు. ఆలోచించుకుంటానని చెప్పి, వాడిదగ్గర టైం బార్గెయిన్ చెయ్యి. వస్తున్నాడుకదా, సుధీర్, చూసుకుందాం” అంది మహతి. ఆమె ఒకందుకు సుధీర్ విషయం అంది, గీతకి మరొకందుకు అర్థమైంది. తర్వాత లోపలికి వెళ్ళింది మహతి. వాసు పక్కని కూర్చుంది. వాసుని ఎదుర్కోలేక గీత బెడ్‍రూమ్‍లోకి వెళ్ళి పడుకుంది. ఇద్దరిమధ్యా ఎలాంటి దాపరికాలూ లేవు. ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పగలిగేదేనా? ఎన్నిసార్లు ఇలాంటి సమస్య తనకి ఎదురైందో అన్నిసార్లూ అతనికి చెప్పింది. పరిష్కరించుకుంది. కానీ ఇంకాఇంకా అదే జరుగుతుంటే అతనికి చెప్పాలన్నా, తనుగా ఏదో ఒకటి చెయ్యాలన్నా విసుగుపుట్టేస్తోంది.అవతలిమనిషికి సిగ్గులేకపోయినా, తనకి వుందికదా?
ఎక్కడినుంచీ కాల్? గీత ఎందుకు తనదగ్గర దాస్తోంది? తమ మధ్య యిప్పటిదాకా ఎలాంటి రహస్యాలూ లేవు. కొత్తగా ఇప్పుడెందుకు? గీత ఆత్మహత్యాప్రయత్నానికి ఆ ఫోన్‍కాల్ వ్యక్తే కారణమా? ఎవరు? ఏం చెప్పి బెదిరిస్తున్నాడు? ఆలోచనలతో వుక్కిరిబిక్కిరైపోయాడు వాసు. తనకీ గీతకీమధ్య కొత్తగా దూరం ఏర్పడినట్టు అనిపించింది. తనకి తను అపరిచితుడిలా, గీత ఎవరో తెలీని వ్యక్తిలా అనిపించాడు. ఆ రాత్రంతా అవే ఆలోచనలు.
మర్నాడు వుదయం అతను లేచేసరికల్లా రామారావు తయారైపోయి వున్నాడు, త్రిమూర్తులి యింటికి వెళ్ళడానికి. యశోద తలకొట్టుకుంది. వాసుకి ఇంక తప్పలేదు. టిఫెన్ చేసి బయల్దేరారు. వీళ్ళు వెళ్ళేవరకు త్రిమూర్తులు అవశిష్టాలన్నీ కానిచ్చుకుని నీరెండ తగిలేచోట విశ్రాంతిగా కూర్చుని వున్నాడు.
“ఏమిట్రా, ఇలా వచ్చావు?” అడిగాడాయన. ఇద్దరూ తమంతట తాము యిల్లుకదలలేనంత పెద్దవాళ్లైపోయారు. కలుసుకుని చాలాకాలం కావడంతో ఇద్దరి కళ్ళూ మెరిసాయి. వచ్చినపని తాత్కాలికంగా మర్చిపోయాడు రామారావు. అతనికి చాలా విషయాలు గుర్తుండవు. వయసుతోపాటు బాగా మతిమరుపు వచ్చింది. త్రిమూర్తులి ఆరోగ్యం గురించి, తిండిగురించి ప్రశ్నలు వేసాడు. హఠాత్తుగా ఆయన కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
“గీత చూసావా, ఎలాంటిపని చేసిందో!” అన్నాడు. పదిమందికి వోదార్పునిచ్చే స్థాయిలోనూ, వయసులోనూ వున్నా తమకి కష్టం రాగానే కూడా వోదార్పు కోరుకుంటారు మనుషులు. రామారావుకి అలాంటి వోదార్పు త్రిమూర్తులిదగ్గిర దొరుకుతుంది. అతను తల్లడిల్లిపోతూ చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా విన్నాడాయన.
“అమ్మాయి ఎందుకలా చేసింది వాసూ? జాగ్రత్తగా చూసుకో. వచ్చి చూసి ఏదేనా చెప్పాలన్నా ఈ కుర్చీ వదిలిపెట్టి ఎక్కడికీ వచ్చే వయసు కాదు నాది” అని తనూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన మాటలతో గీత మళ్ళీ దగ్గిరైనట్టనిపించింది వాసుకి. తన కోపం అర్థం లేనిది. చెప్పలేకపోతోందేమో గీత? ఒకొక్కసారి ఎంత తీవ్రమైన బాధకీ మాటలు దొరకవు. దొరికిన మాటలుకూడా పెదవిదాటి రావటానికి ఎన్నో పొరలని దాటాలి. అలాంటివి ఏవైనా గీతకి అడ్డుపడుతున్నాయేమో! స్నేహితురాలైన మహతికే చెప్పలేకపోతోందంటే, మగవాడైన తనకి చెప్పడానికి ఇంకా కష్టంగా వుండచ్చు. గీత ఆరోగ్యసమస్యలు అమ్మకి తెలిసినట్టు తనకి తెలీవు. అలాగే ఇదీను. ఇలా అనుకున్నాక రాత్రినుంచీ వున్న కోపం తగ్గింది. భావాలే, మనుషులమధ్య దగ్గరితనాన్నీ, దూరాన్నీ పెంచేవి. సంఘటనలు కాదు.
అటునించీ ఎవరో వెళ్తుంటే కాఫీ పంపించమని చెప్పాడు త్రిమూర్తులు. రామారావుకి చక్కెర లేకుండా. అంత గుర్తు ఆయనకి ప్రతివిషయం. కాఫీతోపాటు విజయ్ వచ్చాడు, వాసుని కలవడానికి.
“హెలో అంకుల్!” అని పలకరించాడు. రామారావుకి నమస్కరించాడు.
సోషల్ యాక్టివిటీస్‍లో వాసు, విజయ్ కలుస్తారు. రోడ్లకి అటూయిటూ చెట్లు పెట్టే విషయంలో కార్పొరేటర్‍తో కొంచెం గొడవైంది. ఖర్చు తక్కువనో, డబ్బుకి లాలూచీపడో సప్తపర్ణి చెట్లు తెప్పించి పెట్టించబోయాడు కార్పొరేటరు. అవి ఆరోగ్యానికి మంచివికావు, వాటి పుప్పొడిరేణువులవలన అలెర్జీలు, వుబ్బసం వస్తాయని పరిశోధనల్లో తేలింది, వద్దని ప్రజలు గొడవచేసారు. విజయ్, వాసు, మరికొందరు సోషల్ యాక్టివిస్టులవలన ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్ళి, వాటిబదులుగా వేప, రావి చెట్లు పెట్టారు.
“వాట్ నెక్స్ట్?” అడిగాడు వాసు.
“మునిసిపల్ గ్రౌండుని డంపింగ్ యార్డుగా మారుస్తారట. అది ఆపాలి” అన్నాడు విజయ్. అదే విషయంమీద మాట్లాడిన గిరీష్ ఫోన్‍నెంబరు, వివరాలు ఇచ్చి కలవమన్నాడు వాసు. ఒకచోట మనుషులు స్థిరంగా వుంటుంటే ఆ ప్రదేశంమీద మనిషికి ప్రేమపుడుతుంది. దాన్ని తన వునికిలో భాగంగా స్వీకరిస్తాడు. తరతరాలుగా ఇక్కడే వుంటున్నవాళ్లలో అలాంటి ప్రేమ వుంది. అవంతీపురం, కోట, నది అన్నీ తమవన్న భావన వాళ్లతోపాటుగా బతుకుతోంది.
“ఇంక వెళ్దాం” అని లేచాడు రామారావు.
“నువ్వొచ్చిన పని మర్చిపోయావు” గుర్తుచేసాడు వాసు. లేకపోతే మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చి పదమంటాడు.
“బానే గుర్తుచేసావు” వాసుతో అని, “వెంకట్రావు, విశాలల విషయం. వాళ్ల పిల్లని నువ్వు తీసుకొచ్చి యింట్లో పెట్టుకున్నావట?” అడిగాడు రామారావు త్రిమూర్తులిని. వెళ్లబోతున్న విజయ్ ఆగాడు.
“లేకపోతే? ఐనింటి ఆడపిల్లని నడిబజార్లో వదిలేస్తామా? ఐనా యిది మాధవ తీసుకున్న నిర్ణయం. మంచిదేకాబట్టి నేను సరేనన్నాను” త్రిమూర్తులికి అకారణంగా కోపం వచ్చింది.
“అదికాదన్నయ్యా! నీ వుద్దేశం మంచిదేకానీ స్వలాభంకోసం చేస్తున్నావనుకుంటున్నారు. అనవసరంగా నీకెందుకు చెడ్డపేరు? ఆ పిల్లని ఎటేనా దూరంగా పంపించెయ్యకూడదూ?”
“పంపించేస్తే వచ్చిన చెడ్డపేరు తుడిచిపెట్టుకుపోతుందా?”
“డబ్బు పోగొట్టుకున్నవాళ్ళు అనకుండా వుంటారా?”
“ఎవరి డబ్బూ ఎక్కడికీ పోదు. పదిమంది సంతానం నాకు. డబ్భైమంది సంతతి వున్న కుటుంబం నాది. ఒక్క ఆడపిల్లని కాపాడలేమా?”
“వాళ్ళు తగలేసిన డబ్బంతా నీ పిల్లలచేత పెట్టిస్తావా?”
విజయ్ కలగజేసుకున్నాడు. “అమృతని యిష్టపడ్డవాళ్ళు పెట్టుకుంటారులే తాతయ్యా!” అన్నాడు.
“అమృతా, ఆ పిల్ల పేరు? గరళం అని మార్చుకుంటే సరిపోతుంది. అంత తెలివితక్కువవాళ్ళూ, చేతకానివాళ్ళూ ఎవరుంటారోయ్, విషాన్ని మింగడానికి?” పౌరుషంగా అడిగాడు రామారావు.
“వెనక ఆస్తుల్లేకపోతే బతకలేమనుకునే తరం మీది. కట్టుబట్టలతో ఇంట్లోంచీ నడిచి వెళ్ళి కోటీశ్వరులై నిలబడ్డ తరం మాది. మనిషి శక్తిమీదకన్నా ఆస్తులమీద ఎక్కువ నమ్మకం వుంటే ఎలా తాతయ్యా?” అడిగాడు విజయ్. రామారావుకి అతని అంతరంగం అర్థమవలేదు. వాసు సూచనాప్రాయంగా గ్రహించాడు.
“తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లకా శిక్ష?” అడిగాడు త్రిమూర్తులు.
“అరుణా, సంధ్యా వాళ్లదగ్గిర డబ్బు పెట్టారట. ఆడపిల్లలిద్దరూ నట్టింట కూర్చుని నిన్ను ఆడిపోసుకుంటే నాకు కష్టంగా అనిపించింది” అన్నాడు రామారావు అలిగినట్టు.
“కొంచెం ఓపిక పట్టమనండి తాతయ్యా! ఎవరి డబ్బూ ఎక్కడికీ పోదు. మధ్యలో పాడుకుని డబ్బు తీసుకున్న చీటీలుకూడా వున్నాయి. వాళ్ళందరి దగ్గరా వాయిదాలు రాబట్టాలి. ఆ లెక్కలన్నీ వేస్తున్నారు. ఆడిటర్ని పిలుచుకున్నాడు శ్యాం అంకుల్ ” అన్నాడు విజయ్. “అనుకున్నంత పెద్దమొత్తం వుండదు. డైల్యూటైపోతుంది. అమృత తల్లిదండ్రులేనా చనిపోయేముందు ఒక్కమాట ఎవరితోనేనా అనివుంటే ఇంత అనర్ధం జరిగేదికాదు”
ఎవరో చేసిన అనాలోచిత చర్యకి విజయ్ జీవితం పర్యవసానం కాబోతోందా? అన్న ప్రశ్న తలెత్తింది వాసులో. అదే సమయాన్న మరో అలోచనకూడా కలిగింది. గీత విషయంలో తనకి సుధీర్ పోటీ అనుకున్నాడు. వాడు తనకన్నా బెటర్ పొజిషన్లో వున్నాడుకాబట్టి మామయ్యావాళ్ళూ అటే ఆసక్తి చూపిస్తారనే భయం వుండేది. అదే జరిగి గీత సుధీర్ని చేసుకుని వుంటే ఆ బాధ తను తట్టుకోగలిగేవాడా? తప్పదుగాబట్టి సంఘంకోసం, ఇంట్లోవాళ్ళకోసం జీవచ్ఛవంలా బతికేసేవాడేమో, కానీ ఇప్పుడున్నట్టుమాత్రం కాదు. ముళ్ళమధ్యనుంచేనా వికసించడమే గులాబీ లక్షణం. ప్రేమ లక్షణంకూడా అదే. విజయ్ అమృతని చేసుకోవాల్ని అనుకుంటే డబ్బు దానికి ఆటంకం కాకూడదు.
“అయాం విత్ యూ విజయ్! మీ కజిన్స్ మధ్య ఫండ్ రైజింగ్‍లాంటిదేదైనా చెయ్యాలనుకుంటే చెప్పు, నేనూ యిస్తాను. మేము బయటివాళ్ళం కాదు. ఎంత ఎక్కువమంది కలిస్తే బరువు అంత పల్చబడుతుంది. ఇచ్చేవాళ్లకి బాధ వుండదు. త్రిమూర్తులుగారి సలహావల్లనే ఆరోజు మా పెళ్ళి జరిగింది. అందుకు నేను, గీత ఎప్పుడూ రుణపడి వుంటాం. ఆ రుణం తీర్చుకోవడానికి ఇదొక అవకాశం” అన్నాడు. ఎవరూ అంత తేలిగ్గా తమ డబ్బు వదులుకోరని తెలుసు వాసుకి. అందులోనూ ఇలాంటి కారణానికి. ఒక మంచిపనికి ముందుకి వెళ్తున్నప్పుడు సహకారం యివ్వడం కనీస సామాజికధర్మం. దాన్ని పాటించాడతను.
“థేంక్యూ అంకుల్!” అన్నాడు విజయ్. ఇంక బయల్దేరిపోయారు.
“ఇప్పటితరం పిల్లల ఆలోచనలు అంతుపట్టకుండా వున్నాయి. ఇంతకీ ఆ పిల్లని తను చేసుకుంటానంటాడా, విజయ్?” దార్లో అడిగాడు రామారావు.
“అలాగనేం అనలేదుగా?”
“ఏమో! ఈ తరంవాళ్లని నమ్మలేం. ప్రేమలంటారు, ఎవర్ని తీసుకొచ్చి ముందు నిలబెడతారో తెలీకుండా వుంది. మయూఖ్‍కి పెళ్ళి చేసేదేమైనా వుందా? ముప్పైలు దాటాయి వాడికి” అడిగాడు రామారావు. “తొందరగా చేసెయ్యడం మంచిది”
“మా అప్పుడూ వున్నాయికదు మామయ్యా, ప్రేమలు? నీ కూతురు నన్నే చేసుకుంటానని చెప్పిందట?” పరిహాసంగా అడిగాడు వాసు.
“దానిమొహం. నాకు నచ్చి, నిన్ను అల్లుడిని చేసుకున్నాను. దానిమాటలు విని కాదు” అన్నాడాయన. చిన్ననవ్వొచ్చి ఆయన మొహమంతా పరుచుకుంది.
“ఐతే నేను నీ అల్లుడినేగానీ గీతభర్తని కాదంటావ్? బైట అంతా గీత మొగుణ్ననుకుంటున్నారే, మరి?”
“పోరా! సరేగానీ, మహతి కూతుర్ని నీ కొడుక్కి చేసుకోకూడదూ? పిల్ల బావుంటుంది”
“ఈసారి అవకాశం సుధీర్‍కి యిద్దాం. వాడికి మేఘనమీద బాగా వుంది”
“మీయిష్టం” తనమాట కాదన్నాడని రామారావు గొంతులో కొంచెం అసంతృప్తి వినిపించింది.
“మాయిద్దరిదీ మేనరికంకదా, మళ్ళీ దగ్గిర సంబంధానికి దేనికని అనుకుంటున్నాం” సర్దిచెప్పాడు వాసు.
ఇంటి దగ్గిరకి వచ్చేసారు. కారు ఆగాక దిగబోతూ అడిగాడు రామారావు,” గీత ఏమైనా చెప్పిందా?” అని. లేదన్నట్టు తలూపాడు వాసు. ఆరోజు ఫోన్‍కాల్ తర్వాత మహతికీ గీతకీ మధ్యని ఏదో వప్పందమైందని అతనికి అర్థమైంది. మహతి చెప్పడంకోసం చూస్తున్నాడు.
“సుధీర్ని రానీ” అంది మహతి. అతనికి నిశ్చింత వచ్చింది. గీత తనకి చెప్పకుండా దూరం పెడుతోందన్న కోపంకూడా త్రిమూర్తులి యింట్లోనే తగ్గిపోవడంతో మనసు తేలికపడింది. ఇంట్లోకి వెళ్ళారు. చాలాకాలంతర్వాత పదిమంది మనుషులుండేసరికి యిల్లంతా సందడిగా వుంది. గీతకూడా వాళ్లమధ్యని వుండడం అతనికి కొంచెం నిశ్చింతనిచ్చింది.
విజయ్ అమృతలమధ్య ప్రేమకథ వాసు మనసంతా నిండిపోయింది. మరో కొత్త ప్రేమకథ మొదలవ్వబోతోంది. ఆరోజంతా అతనికి అవే ఆలోచనలు. పిల్లల జీవితాలు పూర్తిగా వాళ్ళకే పరిమితమౌతున్నాయి. పెళ్ళికి ముందటి అనుబంధాలకీ, పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళతో వుండే సంబంధాలకీ చాలా తేడా వుంటోంది. ఇప్పుడు వచ్చే కోడళ్ళెవరూ అత్తవారిల్లు తమదనీ, అత్తమామలు తమకీ చెందుతారనీ అనుకోవట్లేదు. చెట్టుకి పండిన పండుని కోసుకుని వెళ్ళిపోయినట్టు పెళ్ళి చేసుకున్నవాడిని వెంటపెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళేదికూడా రాష్ట్రాంతరాలు, దేశాంతరాలు. వాళ్ల జీవితాల్లోని సొగసు, సౌందర్యం పెద్దవాళ్లకి అర్థంకాకుండా వుండిపోతున్నాయి. తన స్వంతతమ్ముడు, మాధవ్ ఎక్కడో వున్నాడు. కొడుకులూ అంతే. పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ల జీవితాలు వాళ్ళవి. ఈ లోగిళ్ళన్నీ ప్రపంచమేథోసంపత్తికి తమవంతు దానాలిచ్చి, రిక్తహస్తాల్లా మిగిలిపోయాయి. ఆ రిక్తహస్తాలన్నీ ఇలాంటి ప్రేమకథలకోసం ఎదురుచూస్తున్నాయి. కొన్ని చిగుళ్ళో, పూలో తుంపి ఆ చేతుల్లో నింపాలి. అతనిలో ఒక ఆలోచన చోటుచేసుకుంది.
ఆరోజంతా అతను అవే ఆలోచనల్లోనే వున్నాడు. మధ్యమధ్య జ్ఞాపకాలు చిరుజల్లులా ఆ ఆలోచనలని తడుపుతున్నాయి. మనిషికి వయసు పెరుగుతున్నకొద్దీ అతని వెనుక గతం విస్తరిస్తూ వుంటుంది. బాధ్యతలన్నీ తీరి వ్యాపకాలన్నీ ముగిసి మనసు విశ్రాంతిదశకి చేరుకోగానే జరిగిపోయిన సంఘటనలు జ్ఞాపకాలరూపంగా అందులోకి చేరుకోవడం జరుగుతుంది. వాసు వున్న దశ యిది. చిన్నప్పటి విషయాలు ఎన్నో గుర్తొచ్చాయి. అవి చాలావరకూ గీతచుట్టే అల్లుకున్నాయి.


వాసుకి వూహ తెలిసేసరికే అతనిచుట్టూ బోల్డంతమంది కజిన్స్. అందరి వూళ్ళకీ రాజావారిది ఒకటే స్కూలు. ఎలిమెంటరీ స్కూల్లో ఐదుదాకా చెప్పాక, హైస్కూలుకి పంపిస్తారు. పదేసికిలోమీటర్ల దూరంనుంచీ కూడా వచ్చేవారు పిల్లలు. సైకిళ్ళు తొక్కుతూ వచ్చేవారు. అక్కడ చదివామని గొప్పగా చెప్పుకున్న ఆఖరిబేచిలు వాళ్ళవి. తరవాత ఎక్కడికక్కడే ప్రైవేటుస్కూళ్ళు వచ్చాయి. పదకొండుమంది పిల్లలకి చేరింది వీళ్ళ జట్టు. ఒకొక్కరే స్కూల్లో చేరటం పెద్దపిల్లలు చిన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, లంచిలో అంతాకలిసి గుండ్రంగా కూర్చుని బాక్సులు తెరుచుకుని తెచ్చుకున్నవి పంచుకు తినడం. ఐదేళ్ళు ఇలా గడిచాక నెమ్మదిగా కాలేజిల దారిపట్టారు.
అలాంటి మరో జట్టు త్రిమూర్తులి యింట్లో పిల్లలది. వాళ్లది మరికాస్త పెద్దది.
“రాజావారు మీ రెండిళ్ళవాళ్ళకోసమే స్కూలు తెరిచారర్రా!” అనేవారు మాస్టర్లు సరదాగా.
స్కూలయ్యాకకూడా రామారావు కుటుంబంలో పిల్లలకి అందరిళ్ళకీ దార్లో వుండే వాసూవాళ్ళింట్లో మీటింగులుండేవి. అవికాక శుభాశుభాలకి కలుసుకునేవారు. అందరూ సిసింద్రీలు, చిచ్చుబుడ్లే ఐనా, గీత అల్లరి కాస్త ఎక్కువ వుండేది. అత్తలందరికీ ఆ పిల్లంటే గారాబం. అందుకని స్ట్రిక్ట్ వార్నింగ్ మగపిల్లందరికీ.
“అది ఆడపిల్ల. దాన్నేం అనకూడదు” అని.
“అదేనా ఆడపిల్ల? మేం కాదా?” అని మిగిలిన ఆడపిల్లలు దెబ్బలాడితే,
“అది మామయ్యకూతురు. మీరంతా అన్నలూ, చెల్లెళ్ళూ. అదిమాత్రం ఒక్కర్తే. దానికో బుజ్జి తమ్ముడు. అంతేకదా?” అనే జవాబు వచ్చేది. ఆ అలుసు చూసుకుని ఇంకాస్త ఎక్కువ అల్లరి చేసేది ఆ పిల్ల. యశోద వచ్చి ఆపాలితప్ప ఇంకెవరూ ఏమీ అనేవారు కాదు. సుమంత్ మాత్రం వూరుకునేవాడుకాదు.
“గీతా! గీతా! పిలకజెళ్ళ పీతా! నీ కొండెముక్కు కోస్తా” అని వెక్కిరించేవాడు. అమాంతం అతన్తో కలబడిపోయేది ఇద్దరూ కుస్తీపట్తి బలాబలాలు తేల్చుకునేవారు. కిందపడేసి చితక్కొట్టేసేది. ఇంతలో పిల్లలెవరో లోపల వుప్పందించేవారు. అప్పట్నుంచీ వుత్కంఠ. లోపల్నుంచీ ఎవరొస్తారాని ఎదురుచూపు. ప్రమీల వస్తే సుమంత్ వీపు పగిలేది. యశోదైతే గీత వీపు.
“మగరాయుళ్ళా వాడితో కుస్తీపడతావా? బుద్ధిలేదూ? రౌడీవా, నువ్వు?” అని అరిచేది, ఓ దెబ్బ చరిచి. వాళ్ళ గొడవ ఆపడానికి యశోదే రావాలని పిల్లలంతా లోలోపల కోరుకునేవారు. గుసగుసలుపోయేవారు.
ఆడపిల్లలు తొక్కుడుబిళ్ళ, గచ్చకాయలు, అష్టాచెమ్మా, వామనగుంటలు, చింతగింజలు ఆడుకునేవారు. ఇవన్నీ కూర్చుని ఆడుకునే ఆటలు. లేకపోతే దాగుడుమూతలు, తాడాట, ముట్టించుకునే ఆట, నేలాబండాలాంటి ఆడేవారు. లక్ష్మి వుంటే పోటీలు పెట్టి మరీ స్కిప్పింగ్ ఆడించేది. పీసీఓడీకి మంచివిరుగుడని ఆమెకి ఆయుర్వేద డాక్టరొకాయన చెప్పాడు. మగపిల్లలైతే సైకిళ్ళేసుకుని వూరిమీద పడేవారు. అందరిమధ్యనీ రెండోమూడో సైకిళ్ళుండేవి. డబుల్స్ తొక్కేవారు. ఇంకా చాలకపోతే అద్దెకి తెచ్చుకునేవారు. సాయంత్రమైతే గ్రౌండుకి వెళ్ళిపోయేవారు.
అలా కలిసి తిరుగుతూ ఆడుతూ ఎప్పుడు మార్పులొస్తున్నాయో తెలీనంత సూక్ష్మంగా ఎదిగారు. మగపిల్లలు నిక్కర్లలోంచీ ఫాంట్లలోకీ, ఆడపిల్లలు గౌన్లు వదిలేసి స్కర్టుల్లోకీ దిగారు. కొందరు మరీ బుజ్జివాళ్ళు వాళ్ళ స్థానాలల్ని ఆక్రమించారు. ప్రమీల నలుగుర్లోకీ వెళ్ళి వుద్యోగం చేసేది, సుమతిని కాస్తంత స్టైలుగా పెంచేది. ఆమెని చూసి మిగతావాళ్ళు నేర్చారు. యశోదకి అలా కాదు. నిత్యం ఖర్చులు. రామారావు ఎంత తెచ్చినా, ఇంట్లో చాలేది కాదు. ఇంట్లో ఒక వాటా అద్దెకిచ్చారు. చుట్టుపక్కలవాళ్ళ జాకెట్లు, పిల్లలకి గౌన్లు కుట్టేది. ఆ విషయం ఆడబడుచులకి తెలీకుండా వుంచుకునేది. వాళ్ళుకూడా తెలిసినా తెలీనట్టు వూరుకునేవాళ్ళు. తానులోంచీ బట్ట చింపించి గీతకి తనే గౌనో, స్కర్టో కుట్టేది. సుమతి బట్టలు పొట్టౌతే అవి మహతికో, గీతకో వెళ్ళేవి. నేరుగా యిస్తే భర్త ఆక్షేపిస్తాడని కూతురి సైజుకి సరిగ్గా సరిపోయేలా కొనేది ప్రమీల. అవి ఏడాదికల్లా పొట్టై, చేతులు మారేవి. మగపిల్లలకీ అలాంటి సర్దుబాట్లు వుండేవి. మాధవ్, సుమంత్ అన్నల బట్టలుకూడా వేసేసుకునేవారు. ఆడపిల్లలు గౌన్లు, స్కర్టులు కాక, పంజాబీ డెస్సులుకూడా వేసేవారు.
బట్టలే కాక పుస్తకాలదగ్గర కూడా సర్దుకోవడం వుండేది. టెక్స్ట్‌బుక్స్ ఒకళ్ళ తర్వాత యింకొకరికి వచ్చేవి. గవర్నమెంటు సిలబస్ కావడంతో క్లాసుపుస్తకాలు అంత తొందరగా మార్చేవారు కాదు. ఒకవేళ మారినా, ఒక సబ్జెక్టో, రెండు సబ్జెక్టులో మారేవి. ఆ రెండూ కొనుక్కుంటే సరిపోయేది. కొత్తగా ప్రింటైనప్పుడు కొన్ని పుస్తకాలు దొరికేవి కాదు. ఇద్దరుముగ్గురిమధ్య ఒక పుస్తకంతో సర్దుకునేవారు.
మోపెడు కుచ్చెళ్ళున్న స్కర్టుమీద షర్టు వేసుకుని, జేబులో ఇంకుపెన్ను పెట్టుకుని తిరిగేది గీత. ఆపిల్ల గెంతులకీ దూకుళ్ళకీ పెన్ను ఎప్పుడూ కక్కుతూ వుండేది.
“ఆ పెన్నేమిటే, తీసెయ్యవే” అని కోప్పడ్డా వినేదికాదు. నిండుగా నూనె పట్టించి గట్టిగా జడలు వేసి మధ్యకి మడిచి కట్టడమో, అటు జడ యిటు, ఇటుది అటు కట్టడమో చేసేది యశోద. అటు జడ యిటు, ఇటుది అటు మెలిక వేసి కడితే బాతుమఠం జడలంటారు. ఆ పేరు ఎలాగో మగపిల్లలకి తెలిసిపోయింది. ఇంకా అనేకవిధాలుగా జడలు వేయించుకున్నా, ఈ పేరుమాత్రం వాళ్ళకి వినోదంగా వుండేది.
“వీళ్ళ డ్రెస్సులూ వీళ్ళూ ఏమిట్రా, బాగ్దాదు బానిసపిల్లల్లా వున్నారు” అనేవాడు సుధీర్.
ఇంకో అధ్యాయం మొదలైంది. ఆడపిల్లల ఫంక్షన్లు. సుధీర్, వాసు, సుమతి, రాణా, ప్రహ్లాద్, మహతి, మాధవ్, సుమంత్, గీత, వసంత్, రవళి ఇది వాళ్ళ వరస. మొదట సుమతి మెచ్యూరైంది.
“మరీ చిన్నవయసులోనే ఐంది. ఇప్పట్నుంచీ దానికి కష్టాలు మొదలు” అని తల్లి రుక్మిణమ్మతో అనడం విన్నాడు వాసు.
“అంటే ఏమిటో?” అర్థం కాలేదు. మిగిలినవాళ్ళకీ ఆ అనుమానం వచ్చింది. వాసూవాళ్ళింటి లోపలి అరుగుమీద సమావేశం అయ్యారు మగపిల్లలు.
“పెద్దపిల్లవడం అంటే ఏమిట్రా?”
అందరి మనసుల్లోనూ వున్న ప్రశ్న, ఒకళ్ల నోట్లోంచీ బైటపడింది.
“ఏమీ లేదురా! మా చెల్లి బాత్‍రూమ్‍లోకి వెళ్ళింది. ఏమైందో మరి, పెద్దగా అరుస్తూ వచ్చి అమ్మని కౌగిలించుకుని ఏడవటం మొదలుపెట్టింది. దాన్ని వూరుకోబెట్టి తాటాకుచాప పరిచి కూర్చోబెట్టారు. మామ్మ చుట్టుపక్కలవాళ్ళని పిలుచుకొచ్చింది. ఎవరో వడ్లు తీసుకొచ్చి చాపమీద పోసారు. వాటిని నెరిపి, దుప్పటీ వేసి దాన్ని కూర్చోబెట్టి చిమ్మిలీ అవీ దంపి పెట్టారు. మాకూ పెట్టార్లే. దాన్ని ముట్టుకోకూడదని చెప్పారు” అన్నాడు సుధీర్.
“అలాకాదురా! ఇప్పుడిదాకా వీళ్ళంతా పిల్లరాకాసులన్నమాట. ఇప్పుడు పెద్దరాకాసులౌతారు. ఆ తర్వాత బ్రమ్మరాక్షసులై, అమ్మలైపోతారు” అన్నాడు ప్రహ్లాద్. పిల్లల అల్లర్లు భరించలేక చేతులకి బాగానే పనులు చెప్తారు వాళ్ల అమ్మలు.
“నిజమేరా! మా సుమతిని చూడు. చెల్లినని చెప్పేసి వాడిని చితక్కొట్టేస్తుంది. అక్కననేమో నన్ను కొట్టేస్తుంది. అది అడిగింది యిచ్చెయ్యాల్సిందే. గీత బెటర్రా బాబూ! వాళ్ల తమ్ముడు కృష్ణని ఒక్క దెబ్బకూడా కొట్టదు. వాడిని ఎవరేనా ఏమైనా అంటేకూడా వూరుకోదు” అన్నాడు సుమంత్.
“మా క్లాసేగా, అది? మొన్న పెద్ద గొడవైపోయింది. కృష్ణని ఎవరో కొట్టారట. ఇంటర్వెల్లో ఏడుస్తూ వచ్చి చెప్పాడు. గీత వాడిని వెంటబెట్టుకుని యుద్ధానికి వెళ్ళిపోయింది” అన్నాడు పద్మ కొడుకు వసంత్.
పిల్లల సంభాషణమీద ఎప్పుడూ ఒక చెవి వేసి వుంచుతుంది లక్ష్మి. ఎన్ని గ్రూపులుగా విడిపోయి ఏమూల కూర్చుని మాట్లాడుకుంటున్నా, వాళ్లకేదో తినడానికి పెడుతున్నట్టో, అక్కడేదో పనున్నట్టో వాళ్ళమధ్య తిరుగుతుంది. అంతమందీ ఒక్కచోట పోగయ్యారంటే ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని గ్రహించింది. విని విని, ఒక్క అరుపు అరిచింది,
“వెధవల్లారా! మాట్లాడింది చాలుగానీ, పొండవతలికి” అని.
“వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లాటరోయ్, మనం” అంటూ అందరూ సైకిళ్ళేసుకుని పారిపోయారు.
“అయ్యబాబోయ్! యిప్పటిదాకా వీళ్ళని పెంచింది వేరు, ఇకమీదట పెంచబోయేది వేరేలా వుంది. ఆకాశంలో వున్న చుక్కల్ని పట్టపగలే కిందకి లాక్కొచ్చిమరీ లెక్కపెట్టించేలా వున్నారు” పైకే అనుకుంది గుండెలమీద చెయ్యి వేసుకుని.
“సుమతికేమైందోనని గుండాపిండీ ఐపోతున్నారు వీళ్ళంతా. కాస్తంత వాళ్ళకేదో ఒకటి చెప్పు” అంది లక్ష్మి, పెత్తనానికి వచ్చిన రవితో మొహమాటంగా. అలాంటి విషయాలు మగవాళ్ళతో మాట్లాడేవారు కాదు.
“ప్రిపేరింగ్ ఫర్ వుమెన్‍హుడ్” అన్నాడతను, పిల్లలందర్నీ పోగేసి. “ఇప్పట్నుంచీ వాళ్ళకి చాలా స్ట్రగుల్ వుంటుంది. నెలలో మూడునాలుగురోజులు కొంచెం సమస్యగా వుంటుంది. ఆరోగ్యం బాలేకపోవడంకాదుగానీ, చిన్నపిల్లలుకదా, మేనేజి చెయ్యలేరు. వాళ్లని కొట్టడం, తిట్టడం, ఏడిపించడం అలాంటివి చెయ్యకూడదు. సాయం చెయ్యాలి. జాగ్రత్తగా చూసుకోవాలి” అని వాళ్ళ వయసుకి తగ్గట్టు చెప్పగలిగింది చెప్పాడు. అది అందరికీ మనసుకి బాగానే ఎక్కింది.
“నాజోలికి వచ్చినా, నాకేసి చూసినా, నాతో మాట్లాడినా చితక్కొట్టేస్తానంతే” అని సుమతి గట్టివార్నింగ్ ఇచ్చి, సుమంత్‍ని దొరకబుచ్చుకుని రెండు దెబ్బలు వేసేదాకా వాళ్లంతా చాలా బాధ్యతగా వున్నారు.
అన్నదమ్ములిద్దరూ ఇంట్లో సుమతికి పోటీలుపడి సేవలు చేసారు. ఆ పిల్ల కూర్చోవాలనుంటే చాలు, చెరోకుర్చీ తెచ్చి వేసారు. మంచినీళ్ళు… అనుకుందో లేదో, చెరోగ్లాసుతోనూ పట్టుకొచ్చి యిచ్చారు. తల్లి అన్న మాటలు పట్టుకుని ఆమె గెంతినా, పరిగెత్తినా హడలిపోతూ చూసారు. స్కూల్లో మిగతావాళ్ళుకూడా అంత బాధ్యతగానూ వుండబోతే చిర్రెత్తుకొచ్చింది ఆ పిల్లకి. అక్కడితో బాధ్యతల అధ్యాయం ముగిసింది.
సుమతి తర్వాత గీత, రవళీ వ్యక్తురాళ్ళయారు. మహతి అవలేదు. పిల్లలని కనడంతో అమ్మల బాధ్యత పూర్తవదు. మొదలౌతుంది. చాలా చిన్నకోరికలు వాళ్ళవి. పిల్లలు సంపూర్ణావయవాలతో పుట్టాలనీ, ఆరోగ్యంగా పెరగాలనీ, చురుగ్గా వుండాలనీ కోరుకుంటారు. చురుకుతనం అనేదానికి సమాజం ఏవైతే కొలమానంగా పెడుతుందో అందులో తమ పిల్లలు అజేయులుగా వుండాలని ఆకాంక్షిస్తారు. అప్పటి కొలమానాలు, మగపిల్లలకి చదువయ్యేసరికి వుద్యోగం రావాలి, ఆడపిల్లలకి ఎలాంటి సమస్యలూ లేకుండా వుండి తేలిగ్గా పెళ్ళవాలి.