ఝరి 21 to 30 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

పధ్నాలుగేళ్ళొచ్చినా మహతి పెద్దదవ్వకపోవడం నిర్మలకి పీడకలలా మారిపోయింది. ఆ పిల్లకి అవాంచితరోమాల సమస్య వుండేది. అందుకు నిత్యం పసుపు రుద్దిరుద్ది పెట్టేది. నలుగు పెట్టించేది. ఆమెకి తెలుసు, లోపల్నుంచీ వున్న సమస్యలకి పైపై పూతలు, లేపనాలు పనిచెయ్యవని. ఐనా సాంత్వనకోసం చేసేది. ఒకటే టెన్షను. ఈ పిల్ల సరిగానే పుట్టిందా? ఏదేనా సమస్యా? కళ్ళముందు కనిపిస్తున్నదే సమస్యా? లేక ఇది పైపైని ఇలా కనిపించి లోలోపలికి విస్తరించి వుందా? ఎంతలోపలికి? ఎన్నో భయాలు. డాక్టరు దగ్గిరకి తీసుకెళ్ళింది. ఇంకొన్నాళ్ళు చూద్దామంది ఆవిడ.
తల్లికి కాస్త వోదార్పు కలిగిస్తూ పదిహేను వెళ్తుంటే మహతి మెచ్యూరైంది. మహతి కాలేదని రవళికి ఫంక్షను చెయ్యలేదు నిర్మల.
“అదేమిటే, అది బాధపడదూ” అని అక్కచెల్లెళ్ళందరూ అడిగితే,
“వేడుక జరగలేదన్న బాధకన్నా, అవకరం వుందేమోనన్న బాధ పెద్దది. చేస్తే ఇద్దరికీ కలిపి చేస్తాను. లేకపోతే ఇద్దరికీ లేదు. ఒకళ్లకోసం మరొకరు సర్దుకోవడం ఇప్పట్నుంచే రావాలి” అని జవాబిచ్చింది. ఇప్పుడు ఇద్దరికీ కలిపి చేసింది. కానీ సమస్య అక్కడితో ఆగిపోలేదు. హార్మోన్ల అసమతుల్యతతో మహతి జీవితాంతం పోరాడుతునే వుంది.
గౌన్లు, స్కర్టుల్లో తిరిగిన పిల్లలంతా వోణీల్లోకి మారటం, తామంతా ఏదో పెద్దవాళ్ళైనట్టు అన్నదమ్ములమీద పెత్తనం చెయ్యడం మొదలైంది. మగపిల్లల్లోకూడా మార్పులు వచ్చాయి. గొంతు మారటం, మేకగడ్డాలతో మొదలై మీసాలూ గడ్డాలూ రావటం, పొడుగవటం అన్నీను. అంతా కలిసి గీతని చూసే కోణం భిన్నంగా వుండేది. ముఖ్యంగా వాసు. ఎప్పుడు జరిగిందో, ఇద్దరిమధ్యా మాటలు ఆగిపోయాయి. పక్కపక్కని కూర్చున్నా, అతనితో నేరుగా మాట్లాడేది కాదు. మాట తడబడేది. కళ్ళూ వాలిపోయేవి. ఆమెతో మాట్లాడాలంటే అతనికీ గొంతుకేదో అడ్డంపడ్డట్టు వుండేది.
లక్ష్మి పిల్లలందరినీ ఏదో ఒక కారణానికి తన యింటికి పిలిచేది. తన పిల్లల పుట్టినరోజులు, జనవరి ఒకటికి, హోలీకి అందరూ వచ్చేవారు. అట్లతద్ది ఆడపిల్లలకి ప్రత్యేకం.
“మీరంతా పెద్దయ్యారు. ఒకళ్ళమీద ఒకళ్ళు పడకూడదు. మేమలా పడంకదా? దూరంగా కూర్చుని మాట్లాడుకోవాలి. హుందాగా వుండాలి. ఊరికే గట్టిగట్టిగా నవ్వకూడదు” అంటూ మెత్తమెత్తగా చెప్తుంది. వోణీ వూరికే జారిపోకుండా రెండు ఫ్రిల్స్ పెట్టుకుని పిన్నుపెట్టుకోవడం నేర్పింది.
“పమిట అలా నడుంచుట్టూ తిప్పుకుని బిగించి దోపడం ఒక్కటేకాదు, కూర్చున్నప్పుడు ఎడమచేతికిందనుంచీ తీసుకుని వళ్ళో పరిచినట్టు వేసుకోవాలి” అంది. ఆడపిల్లల శరీరం అప్పటికి ఇంకా ఎగ్జిబిట్ కాదు. అందం ముఖాన్నిబట్టి, వంటిరంగునిబట్టి నిర్ణయించబడేది. ఎవరేనా తేరిపారి తమని చూస్తున్నట్టు గమనిస్తే అమ్మాయిలు భయపడేవారు, అసహ్యించుకునేవారు.
యువర్ రెడ్ ఇస్ నాట్ మై రెడ్. నీకు ఎరుపుగా అనిపించింది నాకు ఎరుపుగా తోచకపోవచ్చు. కానీ నువ్వు ఎరుపంటున్నావుకాబట్టి దాన్ని నేనూ ఎరుపని వప్పుకుంటాను. అప్పుడు అది ఎరుపుగా స్థిరీకరించబడుతుంది. సంఘంగా మనుషులు వుండాలంటే ఇది అవసరం. దృశ్యాన్ని చూసే కోణం మనిషి మనిషికీ మారుతుంది. సభ్యత అనేది అందరూ కలిసి స్థిరీకరించాల్సిన విషయం. అప్పటికి అందరూ ఎంతోకొంత పెద్దవాళ్లయ్యారు. సినిమాల్లో చూసీ, పుస్తకాల్లో చదివీ, ఇంట్లో అమ్మానాన్నలని చూసీ, కొద్దికొద్దిగా జీవితానికి అన్వయించుకోవడం వచ్చింది.
సుమతి, ప్రహ్లాద్ పుస్తకాలపురుగులు. కలిసారంటే ఇద్దరికీ లోకం తెలీదు. బాలమిత్ర, చందమామ, దాచేపల్లివాళ్ల పుస్తకాలతోపాటు, విశాలాంధ్రవాళ్ళు అమ్మే రష్యన్ పుస్తకాలు చదువుతారు. ఇప్పుడిప్పుడే చిన్నచిన్న నవలలు చదవటంకూడా మొదలుపెట్టారు. ఇటు గురుమూర్తి, అటు నందకిషోర్ చాలా జాగ్రత్తగా ఎంచెంచి పిల్లలకి పుస్తకాలు కొనిస్తారు. పుస్తకాలతో ప్రపంచం విస్తృతమయ్యే విషయం ఎంత నిజమో, అసలు వునికిలోనే లేని, లేదా నిద్రాణంగా వున్న భావాలు అంకురిస్తాయన్నదికూడా అంతే నిజం. అవి ఒకొక్కసారి జీవితాలని మలుపుతిప్పే చోదకశక్తులౌతాయి. పుస్తకం అనేది మరొకరి భావం. మనది కాదు. పరిణతి లేనప్పుడు చదివేవాళ్ళు ఆ భావాలని స్వంతం చేసుకుంటారు. వ్యక్తులుగా పరాయీకరణ చెందుతారు. లేతవయసు పిల్లలు ఉద్యమాల్లోకి వెళ్ళారన్నా, ఆడపిల్లలు ప్రేమనుకుని ఇళ్ళొదిలి వెళ్ళిపోయారన్నా చాలావరకూ ఇదే కారణం. పరిణతి వచ్చి, మంచిచెడ్డల విచక్షణ తెలిసిన వయసులో అర్థంచేసుకోవడం, ప్రభావితం కావడంమాత్రమే వుంటుంది. వాళ్ళు వాళ్ళుగానే వుంటారు. ఈ తేడావల్లనే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి జెనరల్ రీడింగ్‍లో ఆసక్తి కల్పించరు. గీత, మహతికూడా చదువుతారుకానీ వీళ్ళంత కాదు. మిగతా మగపిల్లలెవరికీ ఆసక్తి లేదు. వాళ్లకి ఎంతసేపూ ఆటలు.
“గీత భలే తయారైందికదూ?” అన్నాడు రాణా ఒకమాటు. అతను వాళ్ళ గ్రూపులోంచీ కొద్దికొద్దిగా తప్పుకుంటున్నాడు. ఇతరస్నేహాలు పట్టాడు. సుధీర్ చురుగ్గా చూసాడు. వాసుకికూడా అతను అలా అనడం నచ్చలేదు. అందరు ఆడపిల్లలూ మారారు. ఒక్క గీతగురించి అనడమేమిటి? అతనికి చాలా కష్టంగా అనిపించింది. తనన్నమాట యిద్దరికీ నచ్చలేదని గ్రహించి రాణా అక్కడినుంచీ జారుకున్నాడు.
“గీతగురించి అలా అంటాడేమిట్రా? తప్పుకదూ? అది వినలేదుగానీ, వినుంటే వాడి గుడ్లు పీకేసేది. ఆమధ్యనోసారి నేనూ సుమంత్ వుత్తినే సైకిల్ తొక్కుకుంటూ రివర్‍సైడ్ వెళ్ళాంరా! అక్కడ వీళ్ళ నాన్న మరొకావిడతో కనిపించాడు. నన్ను చూసి కంగారుపడిపోయి, చూసింది ఎవరికీ చెప్పద్దన్నాడు. నాకెందుకో తప్పుగా అనిపించింది. సంధ్యపిన్ని దగ్గరికి వెళ్ళాను. పిన్నికి చెప్తే చాలాసేపు ఏడ్చింది. ఏడ్చి, తనూ అలానే అంది. ఎవరికీ చెప్పద్దని ప్రామిస్ చేయించుకుంది. నాకస్సలు అర్థం కాలేదు” అన్నాడు.
“నీకవేవీ అర్థం చేసుకోవలసిన అవసరం లేదుగానీ, చెప్పనని పిన్నికి ప్రామిస్ చేసి, మళ్ళీ చెప్తున్నావేం, సుధీర్? ఎక్కడ చూసినవి అక్కడ, ఎక్కడ విన్నవి అక్కడ మర్చిపోవాలి. పిల్లలుకదా, పిల్లల్లాగే వుండాలి. పెద్దవాళ్ల విషయాల్లో తలదూర్చద్దు. వాడా రాణా ఏడి? వెళ్ళిపోయాడా? ఇంకోసారి రానివ్వు, చెప్తాను” అంది అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి.
“సారీ పిన్నీ!” అన్నాడు సుధీర్.
“ఇకమీదట రాణాని ఇటు తీసుకురావద్దు. మగపిల్లలంతా రవిమామ ఇంట్లో కలుసుకోండి. గీతామహీవాళ్ళకీ యిబ్బంది కలిగించద్దు” వాసుకి చెప్పింది. అతను తలూపాడు.
సంధ్య యింట్లో గొడవ ఇప్పటిది కాదు. పదేళ్ళక్రితం యిలాంటి సంఘటన జరిగి, అందరికీ తెలిసింది. రామారావు, త్రిమూర్తులనీ, గురుమూర్తినీ తీసుకుని వెళ్ళి నిలదీసాడు. సంధ్య భర్త తప్పుచేసినట్టు వప్పుకుని మరోసారి చెయ్యనని మాట యిచ్చాడు. ఆమాట నిలబెట్టుకోలేదన్నమాట. అప్పట్నుంచీ జరుగుతునే వుందా? ఇది మరోసంఘటన మాత్రమేనా? సంధ్య ఎందుకు దాచిపెడుతోంది? ఎవరికీ చెప్పద్దని సుధీర్‍తో అనడమేమిటి? ఎన్నో ఆలోచనలు లక్ష్మిలో.
“ఏమిటి చెయ్యను? చూసీచూడనట్టు వదిలేసాను. నాన్న లేడు. పుట్టిల్లు లేదు. ఆర్ధికస్వాతంత్ర్యం లేదు. అన్నయ్య ఎంతకని చూస్తాడు? వాడి కుటుంబం వాడికే వుంది ” అని ఏడ్చింది సంధ్య, తరవాతెప్పుడో వాళ్ళింటికి వెళ్ళి నిలదీసిన లక్ష్మితో.
“బావ బాధ్యత పట్టకుండా వుంటే నువ్వు సర్దుకుపోవట్లేదా? అంతేనే! సంపాదించుకుంటున్న ప్రమీలకి తప్పిందా, వాళ్ళాయన దాష్టీకం? ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని నిర్మలని వాళ్ళాయన అనడా? చదువుకుంటానని ఎంత ఏడ్చినా పద్మ మాట విన్నాడా దాని భర్త? నందకిషోర్‍బావలా ఎవరుంటారు? ఎందరుంటారు? పెళ్ళిళ్ళు చేసి పంపేదాకానే పెద్దవాళ్ళ బాధ్యత. ఆ తర్వాత మన జీవితాలు మనమే చూసుకోవాలి. నాన్న వుంటేమాత్రం ఏం చెయ్యగలడు? అతన్ని మందలిస్తారు. అతను తప్పని వప్పుకుంటారు. ఇంకోసారి చెయ్యనంటారు. చేస్తునే వుంటారు. అంతేకదా? పదేళ్ళక్రితం అన్నయ్య చేసిందీ అదే. అతను నన్నూ, రాణానీ బానే చూసుకుంటున్నారు. బైటి వ్యవహారాలు ఇంటిదాకా రావు. అంతే. ఇంక వదిలేసెయ్” తనే మళ్ళీ అంది.
సంధ్య చెప్పింది నిజమే. చదువు, డబ్బు, అండదండలు- వుండటం, లేకపోవటం అనే రెండు విషయాలమీదా మాత్రమే స్త్రీ వైవాహికజీవితం ఆధారపడి వుండదు. ఆమె అతన్ని భరించగలదా, లేదా అనే విషయానికికూడా అంతే ప్రాధాన్యత వుంటుంది.


కాలం మరికొంచెం ముందుకి సాగింది. ఒక స్కూలు, ఒక కాలేజి అనే ఫ్రేంలోంచీ పిల్లలంతా విడుదలయ్యారు. ఒకొక్కరి ప్రయాణం ఒకొక్కదారిలో మొదలైంది. దారులు కలిసింది మాత్రం వాసు, గీతల విషయంలోనే.
సుమతి మాస్టర్స్‌లో చేరింది. రిసెర్చి చేసే ఆలోచనలో వుంది. డిగ్రీ చదువుతున్నప్పుడు సుధీర్ మెడికల్ ఎంట్రెన్స్ క్రాక్ చేసాడు. ఆ పక్కసంవత్సరం సుమంత్ కూడా మెడిసిన్లో చేరాడు. ప్రహ్లాద్ బీకాంలో చేరాడు. సియ్యే చెయ్యమని తండ్రి ప్రోత్సహిస్తున్నాడు. వాసు పద్ధెనిమిదేళ్ళు నిండగానే ఎంప్లాయ్‍మెంటు ఎక్స్చేంజిలో రిజిస్టర్ చేసుకున్నాడు. తమ యింటి పరిస్థితులనిబట్టి తమ్ముడినీ, చెల్లినీ తల్లికి వదిలిపెట్టి హాస్టల్లో వుండి మాస్టర్స్ చదవటం అతనికి యిష్టంలేకపోయింది. రోజూ వెళ్ళిరావటంకూడా కష్టమే. రెగులర్‍గా డిగ్రీ పూర్తిచేసి, వుద్యోగం చేస్తూ, ప్రైవేటుగా ఎమ్మే చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈలోగా ఖాళీగా వుండటం దేనికని స్టేట్‍గవర్నమెంటులో టెంపరరీ వేకెన్సీ వుంటే అందులో చేరాడు. అదే పర్మనెంటైంది. దాని వెనక రామారావు కృషి వుంది. రాణా ఇంటరు డింకీలు కొట్టి, మొత్తానికి డిగ్రీలో చేరాడు. వసంత్ యింజనీరింగ్ చేస్తున్నాడు. బాగా చదువుకుని వుద్యోగాలు సంపాదించుకునేదాకా పెళ్ళి ప్రసక్తి లేదని మహతి, రవళిల విషయంలో నిర్మల కచ్చితంగా చెప్పేసింది.
“మా అక్కచెల్లెళ్ళం బాగా చదువుకుని వుద్యోగాలు చెయ్యాలని ఎంతో ఆశపడ్డాం. కానీ కుదరలేదు. మీరు చదివితే సంతోషిస్తాం” అని పైకి అన్నా, వుద్యోగం అనేది మహతికి చాలా అవసరం అనేది ఆమెకి తెలుసు. ప్రతీనెలా సమస్యతో బాధపడే ఆ పిల్లకి ప్రయాసపడి పెళ్ళిచేసినా ఎంతవరకూ అది నిలుస్తుందో తెలీదు.
గీత యింట్లో అలాంటి చర్చలేం లేవుగానీ హాస్టల్లో పెట్టి కూతుర్ని పైకి చదివించలేనని రామారావుకి తెలుసు. డిగ్రీ ఎగ్జామ్స్‌కిముందు ఫ్రెండుతో కలిసి సరదాగా అప్లై చేసిన వుద్యోగం పరీక్షలవకుండానే వచ్చేసింది. సెలవుపెట్టుకుని పరీక్షలు రాసింది.
“నీకు ఉద్యోగం దేనికమ్మా?” అని రామారావు అంటే,
“సరదాగా కొన్నాళ్ళు చేస్తాను నాన్నా!” అంది గారంగా.
దారులు వేరవడం అందరికీ తెలుస్తోంది. ఇదివరకట్లా తరుచు కలుసుకోవడానికి కుదరడం లేదు. ఇళ్ళలో పుట్టినరోజులు చేసుకునే వయసు దాటింది. అవికాక అడుగుపెట్టినచోటల్లా కొత్తపరిచయాలు, స్నేహాలు, ప్రలోభాలు. ఏవీ బలపడలేదు. కానీ వున్నాయి. పాతబంధాలని గుర్తుచేస్తూ.
“చాలారోజులైంది మనందరం కలుసుకుని. ఈ ఆదివారం కోటకి వెళ్దాం. సాయంత్రందాకా అక్కడే గడిపి, సినిమా చూసేసి ఇంటికొద్దాం. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో! రోజూ సిటీ వెళ్ళి రావడం కష్టమౌతోంది. చదువుమీద ఫోకస్ తగ్గుతోంది. ముగ్గుర్నీ హాస్టల్లో పెట్టి చదివించలేరు నాన్న. సుమతినంటే తప్పదు. అందుకని ఫ్రెండ్స్‌తో కలిసి ఇద్దరం రూం తీసుకోవాలనుకుంటున్నాం ” అన్నాడు సుధీర్, వాసుతో. అతను తలూపాడు. అందరికీ వార్తలు వెళ్ళిపోయాయి. ఎవరికివాళ్ళు బయల్దేరిపోయి కోటదగ్గిర కలుసుకుందామనుకున్నారు.
అనుకున్నట్టే కోటదగ్గిరకి అందరూ చేరారు. రాణా ఇంకా రాలేదు. అతనికోసం చూస్తూ, మాట్లాడుకుంటూ బయటే నిలబడ్డారు. ఆడపిల్లలందరిదీ చీరలుకట్టే వయసు. చీరల్లో వచ్చారు.
“ఏంటమ్మా! ఇలా షాకిచ్చారు? బాగ్దాదు బానిసపిల్లలు చీరలు కట్టడమేమిటి?” అన్నాడు సుధీర్.
“అప్పుడనుకున్నాం కదరా? వీళ్ళింక బ్రహ్మరాక్షసులైపోవడానికి టైం వచ్చేసింది” అన్నాడు మాధవ్.
గీత ఎర్రగా చూసింది. తమ వెనక వాళ్ళేదో అనుకున్నారనేగానీ ఏం అనుకున్నారో వీళ్ళకి తెలీదు.
“గీతా! ఇక్కడ ఫైటింగొద్దమ్మా! ఎవరేనా చూస్తే బావోదు” అన్నాడు సుమంత్ భుజాలు తడుముకుంటూ. ఆమె కోపంగా ఏదో అనబోతుంటే ఎవరో ఒకతను వాళ్ళముందునించీ వెళ్తూ, “నమస్తే! గీతా మేడమ్” అన్నాడు. ఆమె సర్దుకుని తిరిగి విష్ చేసింది.
“గీతామేడమ్!” మాధవ్ పడీపడీ నవ్వాడు.
“ఔన్రా! ఆఫీసులో అలానే పిలుచుకుంటాం. నాన్న ఫ్రెండ్స్ కొంతమంది వున్నారు. వాళ్ళు నన్ను పేరు పెట్టి పిలిచినా, ఆఫీసులో వాళ్ళని అంకుల్ అని పిలిస్తే బావోదన్నారు. మగవాళ్ళని సర్ అంటాం. మమ్మల్ని వాళ్ళు మేడమ్ అంటారు” అంది గీత. నిజానికి పేర్లు పెట్టి పిలుచుకోవడం అలవాటై ఆ పిలుపులు మొదట్లో నచ్చేవి కాదు. ఇప్పుడు అలవాటైపోయాయి.
“గీతా! మీకు ఆఫీసులో పనేం వుంటుందే?” అడిగాడు సుధీర్. అంతా నెమ్మదిగా వేళాకోళాలు ఆపి, మాటల్లో పడ్డారు. తను చేసే స్టాఫ్ సెక్షనుగురించీ అందులో వుండే పనిగురించి కొద్దిగా చెప్పింది. వాసు టైం చూసుకున్నాడు. రాణా యింకా రాలేదు.
“రాణానికూడా రమ్మన్నాం. వాడింకా రాలేదు. ఒక్కడూ వస్తే ఫర్వాలేదు. ఫ్రెండ్సుతో వస్తేమాత్రం మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపొండి” ఉన్నట్టుండి ప్రహ్లాద్ అన్నాడు. అతనలా అంటునే వున్నాడు, దూరంగా రెండు మోటార్‍సైకిళ్ళు వస్తూ కనిపించాయి. అందులో ఒకటి రాణాది. అమ్మాయిలు చెయ్యూపి కోటవైపుకి కదిలారు. కాసేపటికి రెండుబైకులూ నేరుగా వచ్చి సుధీర్‍వాళ్లముందు ఆగాయి. ఒకదానిమీంచీ యిద్దరూ మరోదానిమీంచీ ముగ్గురూ మొత్తం ఐదుగురు దిగారు. అంతా ఎక్కడో ఒకచోట కలిసినవాళ్ళే. ఒకరికొకరు తెలిసినవాళ్ళే. కొత్తగా పరిచయాలు అవసరం లేకపోయాయి.
“వీళ్ళేరిరా? గీతని చూద్దామనే వచ్చాను” అన్నాడు రాణా.
“గీతని ప్రత్యేకంగా చూడ్డానికేముంది?” అన్నాడు సుమంత్.
“జాబ్‍లో చేరిందటకదా? అప్పట్నుంచీ చూళ్ళేదు” అన్నాడు రాణా.
“మేం వచ్చేసరికే నలుగురూ లోపలికి వెళ్ళిపోయారు. నీకోసం మేం యిక్కడ నిలబడ్డాం” అన్నాడు సుధీర్ తొణక్కుండా. బెల్‍బాటమ్ ఫాంటులు, మాసినగెడ్డాలు, హిప్పీకట్‍లతో జులాయుల్లా వున్న అతని ఫ్రెండ్సుని చూస్తే చికాగ్గా అనిపించింది. కజిన్స్ అందరం కలుసుకుందామని చెప్తే ఫ్రెండ్సుని తీసుకొచ్చాడు, పైగా గీతని చూడాలట. సుమతీ, మహీవాళ్లకి మాత్రం ఈ అనవసర పరిచయాలు దేనికి? ఎవరికి వాళ్ళకే కోపం వచ్చింది.
“మరైతే లోపలికి వెళ్దాం. వాళ్ళెక్కడున్నారో చూద్దాం” అన్నాడు రాణా వుత్సాహంగా.
“ఏముందిరా, చిన్నప్పట్నుంచీ చూసిన కోటేగదా? ఒక మీటింగ్ పాయింటులా ఇక్కడికి వచ్చాం. వాళ్ళేమో మాకోసం వుండకుండా లోపలికి వెళ్ళిపోయారు. ఇంకోసారి కలవచ్చులే. టీ తాగుదాం. పదండి” అన్నాడు సుధీర్. అందరూ బైటికి నడిచారు. వాళ్ళు కావాలనే తనని లోపలికి వెళ్ళకుండా ఆపుతున్నాడని అర్థమైంది రాణాకి.
గీత తనకీ మరదలే. అప్పుడేదో సరదాకి ఒక్కమాట అంటే అది పట్టుకుని, దానిమీద తనకొక్కడికే హక్కున్నట్టు చేస్తాడేంటి వీడు? తను వెళ్ళాలనుకుంటే గీత యింటికి వెళ్ళలేడా? మామయ్య వద్దంటాడా? ఏదో అనబోయేలోగా అతని ఫ్రెండ్సులో ఒకతను రాజేష్ అన్నాడు.
“నువ్వు డాక్టరువటకదరా, సుధీర్?” అని.
“ఇంకా డాక్టర్నవలేదు. చదువుతున్నాను. ఇన్‍టర్న్‌షిప్ అవాలి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలి, అప్పుడు డాక్టర్నయేది” సుధీర్ జవాబిచ్చాడు.
“అప్పుడేనా నువ్వు డాక్టరువే ఔతావుగానీ ఇంజనీరువైతే కావుకదా?” అన్నాడతను.
“గుడ్ జోక్” అన్నాడు వాసు నవ్వి.
“కాదురా! మీ డాక్టర్లూ, సిస్టర్లూ క్లోజుగా తిరుగుతారటకదా?”
సుధీర్ ముఖం ఎర్రబడింది. “అలాంటిదేం వుండదు. మా చదువులు మావి. వాళ్ల చదువులు, వుద్యోగాలు వాళ్ళవి” అన్నాడు కోపం అణుచుకుని.
“చెవిలో పువ్వులు పెట్టకమ్మా! బోల్డన్ని కథలు విన్నాం” అన్నాడు రాజేష్. సుధీర్ తమాయించుకుని జవాబిచ్చేలోగా మరిన్ని ప్రశ్నలు.
“మీరు పేషేంట్లని చూస్తారా? ఆడపేషేంట్లని ఆడడాక్టర్లు చూస్తారా? మీరే చూస్తారా? ఐనా లేడీడాక్టర్లు ఎంతమంది వుంటార్లే? మీకే ఆ కేసులన్నీ. ఒరే, వాళ్ల చెయ్యీ అదీ పట్టుకుని చూస్తుంటే ఏమీ అనిపించదా?”
“ఇంక ఆపరా! ఏం మాట్లాడతావురా, నువ్వు? ఆడపిల్లల్తో వేషాలెయ్యడానికైతే ఇంత కష్టపడి మెడికల్ కాలేజిలో సీటు సంపాదించుకోవడం దేనికి? ఏ బజార్లోకెళ్ళినా కనపడతారు, వెంటపడితే మూతిపళ్ళూ రాలగొడతారు. ఒక్కపూట అన్నం తినకపోతే మలమల్లాడిపోతాం. అంత ఆకలిని తీర్చే అన్నం ఎంత కష్టపడితే పుడుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? వంటిమీద బట్ట లేకపోతే మనకి గౌరవం, మర్యాదా వుండవు. నేతకారుడిగురించి ఎప్పుడేనా తలుచుకున్నావా? ఇవేవీ అక్కర్లేదుగానీ ఓ… ఆడపిల్లలగురించి మాత్రం తెగ ఆలోచనలు. అరేయ్, ఎవ్వరికేనా అమ్మ ఒక్కరే వుంటుంది. నాన్న ఒక్కరే వుంటారు. భార్య కూడా ఒకర్తే వుంటుంది. మన పుట్టుక మనచేతుల్లో లేనట్టే భార్య రాకడకూడా మన చేతుల్లో వుండదు ” అన్నాడు సుధీర్.
“వాడేదో జోగ్గా అంటే అంతకోపం దేనికిరా? ” అన్నాడు రాణా.
“ఇవేం జోక్స్?” సుధీర్ ముఖం ఇంకా ఎర్రగానే వుంది.
“నాకు తెలుసురా! మీరంతా నన్ను సెపరేట్‍గా చూస్తున్నారు. మీ అన్నదమ్ములంతంత చదువూ నాకు లేదు, వాసులా వుద్యోగమూ లేదు. అందుకేకదా?”
“అరేయ్! అవేం మాటలు? సెపరేట్‍గా చూసేట్టైతే ఎందుకు పిలుస్తాం?” రాణా సుధీర్ని వుద్దేశించి అన్నా ప్రహ్లాద్ కలగజేసుకున్నాడు.
“తప్పదుగాబట్టి పిలిచారు. మీకెవ్వరికీ నేను రావడం యిష్టం లేదు. అందుకే గీతా, మహీవాళ్ళు నాకోసం ఆగకుండా లోపలికెళ్ళిపోయారు. సారీరా! మేం వెళ్ళిపోతాం. మీరు సరదాగా తిరగండి” అన్నాడు రాణా బైక్ స్టాండు తీస్తూ.
“రాణా! వాళ్ళు మాకోసంకూడా ఆగకుండా వెళ్ళిపోయార్రా! ఐనా మనకి ఆడపిల్లల్తో కబుర్లేం వుంటాయ్? అందుకే మేమూ పట్టించుకోలేదు. నీకోసం చూస్తూ వుండిపోయాం” సుమంత్ అతని చెయ్యిపట్టుకుని సర్దిచెప్పబోయాడు.
“వద్దులేరా! నువ్వో డాక్టరువి, మీ అన్నో డాక్టరు. నా లెవెల్ ఇది. మేం సరదాకో, తెలుసుకోవాలనో ఏదేనా అన్నా తప్పనిపిస్తుంది” చెయ్యి విడిపించుకుని బైక్ స్టార్ట్ చేసాడు.
“రాణా! అంత కోపం దేనికిరా? మనింట్లోనూ బోల్డంతమంది ఆడపిల్లలున్నారు. బైటి అమ్మాయిలగురించి అలా అనేసరికి నచ్చలేదు” అన్నాడు సుధీర్. అతను అంటునే వున్నాడు, వచ్చిన ఐదుగురూ బైకులు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. పెద్ద గాలిదుమారం వెలిసినట్టైంది.
“హోప్‍లెస్” అన్నాడు సుధీర్.
“అసలు మనదే పొరపాటు. వాడు మనని వొదిలేసి వేరేవాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడే ఆపాల్సింది” అన్నాడు వాసు.
“వాడి ఆలోచనేమిటి? ఆ గేంగ్ అందర్నీ తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చెయ్యాలనా? బుద్ధుందా, అసలు వాడికి?” అన్నాడు సుమంత్.
“సంధ్య పిన్నిది తప్పు. బాబాయ్‍మీద తిరగబడాల్సింది. ఆయన వేరే ఆవిడతో నాకు కనిపించినట్టు వీడికీ కనిపించే వుంటాడు. ఇంక వీడికి ఎథిక్స్, వేల్యూస్ అంటే ఎలా తెలుస్తాయి? ఈసారెప్పుడో వెళ్ళి ఆయనతో పెట్టుకుంటాను” అన్నాడు సుధీర్. అతని కళ్ళలో తడి కదిలింది. అది రాణాపట్ల బాధచేత. వాసు అతని చేతిని పట్టుకుని నొక్కి వదిలాడు. ఇక్కడ జరిగినవేవీ తెలీవు లోపలున్నవాళ్ళకి. టిక్కెట్లు కొనుక్కుని నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. కాసేపు తిరిగారు.
“ఎన్నిసార్లు చూసినా కోట విసుగు రాదు” అంది రవళి.
“నాకైతే వచ్చినప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంది” అంది గీత.
“చదువెందుకు ఆపేసావే గీతూ?” అడిగింది సుమతి.
“అమ్మానాన్నల్ని వదిలిపెట్టి వుండలేను”
“నాన్నకూచి. మేమంతా వుండట్లేదా?”
“లేదులే సుమతీ! నాన్న నన్ను హాస్టల్లో పెట్టి చదివించలేరు. ఇంకా తమ్ముడి చదువుంది. చాలా చిన్నప్పట్నుంచే కుటుంబాన్ని చూసుకున్నారుకదా, రిటైర్‍మెంటుమూడ్‍కి వచ్చేసారు. తొందరగా బాధ్యతలు తీర్చుకుని విశ్రాంతిగా వుండాలనుకుంటున్నారు” అంది గీత నెమ్మదిగా.
“అదికాదే, ఈ రెండేళ్ళు కష్టపడితే ఎమ్మే ఐపోతుందికదా?” అంది మహతి.
“తర్వాత?” గీత ప్రశ్న.
“సంబంధాలు చూస్తున్నారా? ఈ అపూర్వసోదరుల్లో ఎవరికేనా అనుకున్నారా?” అడిగింది రవళి. ఆ ప్రశ్న ఇంట్లో నిషిద్ధం. అలాంటి మాటలు పెద్దవాళ్ళుకూడా మాట్లాడుకోరు. పిల్లలంతా పెరిగి పెద్దయ్యాక ఆలోచించాల్సిన విషయాన్ని ఇప్పుడే చర్చించడం ఎవరికీ యిష్టం లేదు. అంతమంది మగపిల్లలమధ్య గీతని టాస్ చెయ్యడం పెద్దవాళ్ళెవరికీ యిష్టం లేకపోయింది. ఎప్పట్నుంచో లోలోపలి కుతుహలంగా వుండిపోయిన ప్రశ్నని ఇంకా దాచలేక బైటపెట్టేసింది రవళి. మిగిలిన యిద్దరూ కుతూహలంగా చూసారు. తమతో కలిసి తిరుగుతున్నవాళ్లలో ఇద్దరు పెళ్ళిచేసుకుని భార్యాభర్తలుగా మారటమనే వూహ తమాషాగా అనిపించింది.
గీత ముఖం ఎర్రబడింది. “పోవే! చదువు ఆపేస్తే పెళ్ళి చేసేసుకోవాలేంటి? కొన్నాళ్ళు జాబ్ చేద్దామనుకున్నాను. మీరంతా నాకన్నా పెద్దేకదా? మీకు అవకుండా నాకు పెళ్ళేంటి?” అంది. ఇంతలో సుధీర్‍వాళ్ళూ వచ్చారక్కడికి. సుధీర్ ఇంకా కోపంగానే వున్నాడు.
“రాణా ఏడీ? రాలేదా, వాడు?” అడిగింది సుమతి.
“చెత్తవెధవల్ని వెంటేసుకుని తిరుగుతాడు. ఏదేనా అంటే కోపం ఒకటి” అన్నాడు తిరస్కారంగా. మాధవ్ క్లుప్తంగా జరిగింది చెప్పాడు.
“చిన్నప్పుడు వీళ్ళిద్దరితోపాటు వాడినీ కొట్టేసి వుంటే బావుండేదిరా! పొరపాటు చేసాను” అంది సుమతి. అంతా కలిసి కోటంతా తిరిగారు.
“నువ్వూ, వాసూ మాట్లాడుకోరేమిటే? ఎప్పుడూ చూడలేదు మీరు మాట్లాడుకోవడం” అంది రవళి వున్నట్టుండి గీతతో. తమ రహస్యం ఏదో బైటపడ్డట్టు యిద్దరూ వులిక్కిపడ్డారు.
“పలకపుల్లల పంచాయితీ ఒకటి వుండేదిలే, వీళ్ళ మధ్యని. ఇంకా మెంటేన్ చేస్తున్నట్టున్నారు” అన్నాడు సుమంత్.
“ఏమిట్రా, అది? నాకు తెలీనే తెలీదు” అడిగింది రవళి.
“బాగా చిన్నప్పుడులే. గీత పలకా, పుల్లా పెట్టుకుని బుద్ధిగా అక్షరాలు దిద్దుతోంది. వాసు దగ్గర కూర్చుని దిద్దబెట్టబోయాడు. పుల్ల విరిగిపోయింది. నా పుల్ల అతికిస్తావా లేదాని అది ఏడుపు” నవ్వుతూ అంది సుమతి.
“అప్పుడే కొత్తపుల్ల అత్తని అడిగి యిచ్చేసాను” వాసు ఆమె నవ్వులో శృతికలిపాడు.
“దాన్ని ఏడిపించకండ్రా బాబూ! గాడిద కూసినా వూరుకోదని వాళ్ళమ్మ కోప్పడేది. ఔనే గీతా, గాడిదలు ఎలా కూస్తాయి? ఏడ్చినదానివీ, వూరుకున్నదానివీ నీకే తెలియాలి” అన్నాడు సుమంత్.
“ఇంటికి పదండ్రా, మీ అందరి సంగతీ చూసుకుంటాను” అంది గీత.
“కొట్టేస్తావేమిటే? మా సుమతివల్లే కాలేదు”
“పదండ్రా, సినిమాకి టైమౌతుంది. ఏదేనా తినేసి వెళ్దాం” అన్నాడు సుధీర్. అందరూ బైటికి వచ్చినప్పుడు ఒక రూల్ పాటిస్తారు. ఏకేవీ. ఎవరి ఖర్చులు వాళ్లవి. అందరూ తలో పదో, ఇరవయ్యో, లెక్కేసుకుని సుధీర్ చేతిలో పెట్టేస్తారు. హోటల్లో దోశ తిని, సినిమా చూసారు. అందరికీ రాణా విషయం లోలోపల కదుల్తునే వుంది.
“ఎలీట్ లెవెన్ అనుకున్నాం మన బేచిని. వీడొక్కడే మందలోంచీ తప్పిపోయిన గొర్రెపిల్లలా తయారయ్యాడు” బాధపడ్డాడు సుధీర్ ఇంటర్వెల్లో.
సినిమా అయాక ప్రహ్లాద్ గీతనీ, సుమంత్ మహతీ రవళీవాళ్ళనీ యిళ్ళదగ్గర దింపడానికి ఆటోలు మాట్లాడుకున్నారు. సుమతిని తీసుకుని సుధీర్ బయల్దేరాడు. వెళ్ళేముందు వాసుతో అన్నాడు, “రేపు రాణావాళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నాను. రాణా అలా వెళ్ళిపోవడం చాలా బాధనిపిస్తోంది. వాడితో మాట్లాడి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వూ వస్తావా?” అడిగాడు. వాసు సరేనన్నాడు.
మర్నాడు సాయంత్రం ఇద్దరూ వాసు యింట్లో కలుసుకుని అక్కడినుంచీ రాణా యింటికి వెళ్ళారు. అతను లేడు. సంధ్య యిద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించింది. ముందురోజు కొడుకు అర్థమయ్యీ కానట్టు చెప్పిన విషయాలకీ వీళ్ళిలా రావడానికీ సంబంధం వుందని గ్రహించింది. మామూలు కబుర్లయాక, నెమ్మదిగా విషయం ఎత్తాడు సుధీర్.
“ఈమధ్య ఎవరి విషయాల్లో వాళ్లం పడిపోయి కలుసుకుని చాలారోజులైందని అలా కోటవైపుకి వెళ్ళి, అట్నించీ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం పిన్నీ! రాణానీ రమ్మన్నాం. వాడొక్కడూ రావొచ్చుకదా, నలుగురు ఫ్రెండ్సుని వెంటబెట్టుకుని వచ్చాడు” అన్నాడు.
“సుమతీవాళ్ళూ మగపిల్లల్తో మాట్లాడనివాళ్ళేం కాదుకదరా? కాలేజిల్లో బోల్డంతమంది పరిచయం ఔతారు. గీతౌతే వుద్యోగమే చేస్తోంది. మీరు కలుపుకోవట్లేదని నిన్నంతా బాధపడ్డాడు వాడు” అంది సంధ్య.
“కాలేజిల్లో క్లాస్‍మేట్స్‌తో మాట్లాడ్డమంటే అదొక కామన్ ప్లాట్‍ఫాం. తప్పదు. ఇలా పరిచయం చెయ్యడం మా పరిచయాలని వాళ్ళమీద ఇంపోజ్ చెయ్యడం కాదా? స్నేహాలనేవి ఆబ్లిగేటరీగా కాకుండా సహజంగా జరగాలి. మాదొక గ్రూపు. మేం పదకొండుమందే అందులో వుండాలి. మా ఫ్రెండ్సందరినీ పనిగట్టుకుని వాళ్లకి పరిచయం చెయ్యడం దేనికి? ” సూటిగా అడిగాడు.
“వాడెవరితో తిరుగుతున్నాడో కొంచెం గమనించు పిన్నీ!” అన్నాడు వాసు.
“సర్లేరా! వాడొచ్చేదాకా వుండండి. వచ్చాక మీరే మాట్లాడుదురుగాని. టీ తాగుతారా? చెయ్యనా?” లేచి లోపలికి వెళ్ళింది. స్టౌమీద టీకి నీళ్ళు పడేసి నిలబడిందిగానీ మనసు నిలకడగా లేదు. వచ్చినవాళ్ళు యిద్దర్లో ఒకడు డాక్టరు, ఇంకొకడు గవర్నమెంటు వుద్యోగం సంపాదించుకున్నాడు. తన కొడుకు ఎంతసేపూ ఫ్రెండ్సుని వెంటేసుకుని తిరుగుతాడు. ఇప్పటికింకా డిగ్రీ అవలేదు. మొదట్లో చిన్న రాజీగా వుండిన భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకుందుకు రాణాని విపరీతమైన గారం చేస్తాడు. వాడు చెయ్యిజారుతున్నాడా? దారితప్పుతున్నాడా? చదవకపోవటం, చదువులో మొద్దుతనం వేరు, చెడుస్నేహాలు వేరు. తను తప్పు చేసిందా? భర్తగురించి మొదటిసారి బైటపడ్డప్పుడే తిరగబడి యింట్లోంచీ వెళ్ళిపోవాల్సిందేమో! పెళ్ళిళ్ళే కనాకష్టంగా చేసిన అన్న తనని చేరదీస్తాడా అనుకుందిగానీ, శక్తికి మించిన బాధ్యతలు వున్న వ్యక్తి, ఆర్భాటంకన్నా బాధ్యతకి ఎక్కువ విలువ యిస్తాడని గ్రహించలేకపోయింది. ఏదైనా కాలం చేతిలోంచి జారిపోయింది. కళ్ళలోంచీ నీళ్ళు జారిపోయాయి. వెనకనుంచీ భుజంమీద చెయ్యిపడితే వులిక్కిపడింది. చప్పుని కళ్ళుతుడుచుకుని వెనక్కి తిరిగింది.
సుధీర్.
“బాధపడకు పిన్నీ! వాడితో మేం మాట్లాడతాం” అన్నాడు హాల్లోకి నడిపించుకు వస్తూ. టీ కప్పుల్తో ఇద్దరూ హాల్లోకి వచ్చేసరికి రాణా వచ్చాడు. వెంట ఎవరూ లేరు. తన కప్పు అతనికి యిచ్చి, తనకి తెచ్చుకుందుకని లోపలికి వెళ్ళి ఇంక బయటికి రాలేదు సంధ్య. నిన్న జరిగిన గొడవకి జవాబులా వాళ్ళిద్దరూ రావడం రాణా అహాన్ని బాగా సంతృప్తిపరిచింది.
“నిన్న అలా వెళ్ళిపోయావేంట్రా?” అన్నాడు వాసు. ఇద్దరూ అతన్ని కార్నర్ చెయ్యడం మొదలుపెట్టారు.
“మన ఫ్రెండ్స్‌ని సుమతీవాళ్ళకీ పరిచయం చెయ్యడం దేనికిరా? ఇక్కడితో ఈ పరిచయాలు ఆగవుకదా? రోడ్డుమీదెక్కడో కనిపిస్తారు. పలకరిస్తారు. ఇష్టం వున్నా లేకపోయినా మన స్నేహితులనే మొహమాటంతో వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు అడ్వాన్సౌతారు. నువ్వనచ్చు, సుమతీవాళ్ళు కాలేజీల్లో మగవాళ్ళతో మాట్లాడరా, మడికట్టుకుని వుంటారా అని. అవి వాళ్ళ పరిచయాలు. ఎక్కడితో ఆపాలో వాళ్లకి పూర్తి స్వేచ్చ వుంటుంది. ఇంకా ఏదేనా సమస్య వస్తే మనకి చెప్తారు. మనమే సమస్యల్ని సృష్టిస్తే ఎలారా? మగపిల్లల మనస్తత్వాలూ, ఆలోచనలూ ఎలా వుంటాయో మనకి తెలుస్తాయిగానీ అమ్మాయిలకేం తెలుస్తాయిరా? వాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. బైట ఒకలా, యింట్లో ఒకలా వుండటం వాళ్ళకి రాదు. గర్ల్స్‌టాక్ ఎలా వుంటుందో మనకి తెలీనిది కాదు. అదిగదిగో, ఆ పిల్లడు హేండ్‍సమ్‍గా వున్నాడు, వీడు బలే హైటున్నాడు అని దారినపోయే మగపిల్లలని కామెంటు చేసిన అమ్మాయిల్ని నువ్వు చూసావా? మరి మనం? బైట మాట్లాడిన మాటలు యింట్లో మాట్లాడతామా?” సూటిగా అడిగాడు సుధీర్.
రాణా జవాబివ్వలేదు. తన తప్పు అర్థమౌతోంది. వప్పుకోలేకపోతున్నాడు.
“రాజేశ్ నిన్న నాతో మాట్లాడిన మాటలు యింట్లో అమ్మానాన్నలముందు మాట్లాడగలడా? హాస్పిటల్లో సిస్టర్స్ గురించి చులకనగా మాట్లాడినవాళ్ళు ఆఫీసులో పనిచేసే, కాలేజిల్లో చదివే అమ్మాయిలగురించి మాట్లాడరా? మనింట్లో యిందరు ఆడపిల్లలని పెట్టుకుని అలాంటి మాటలు విని ఎలా వూరుకుంటాం? మిగతావాళ్ళ విషయం పెద్దవాళ్ళు చూసుకుంటారుగానీ వీళ్ళు నలుగురూ మన బాధ్యతరా! చిన్నప్పట్నుంచీ మనతో కలిసి తిరిగారు. మనమీద నమ్మకాన్ని పెంచుకున్నారు”
రాణా తలదించుకున్నాడు. “సారీరా! నేను యింత దూరం ఆలోచించలేదు” అన్నాడు గొణిగినట్టు.
సుధీర్ లేచి వచ్చి అతని పక్కని కూర్చున్నాడు. “అరేయ్, నీతో కలవద్దనుకుంటే నిన్ను రమ్మని ఎందుకు పిలుస్తాం? నీకు తెలీకుండా మేం వెళ్ళిపోవచ్చుకదా?ఎలీట్ లెవెన్ అనుకున్నాం మనం. ఎప్పటికీ విడిపోకూడదని చిన్నప్పుడు ఎన్నోసార్లు ఒట్లు పెట్టుకున్నాం. వదిలేస్తామేమిట్రా, నిన్ను? అలా ఎలా అనుకున్నావు? నిన్న అందరం చాలా ఫీలయ్యాం తెలుసా? ఆ డిగ్రీ పూర్తి చేసెయ్యరా! ఏదో ఒక జాబ్‍లో కుదురుకో. నీకిలాంటి కాంప్లెక్స్ వుండదు” అన్నాడు ఆప్యాయంగా.
“అందరం కలిసేందుకు మళ్ళీ ప్లాన్ చేద్దాంరా, రాణా!” అన్నాడు వాసు.
ఇద్దరూ వెళ్ళడానికి లేచారు.
“వస్తాంరా మరి. టచ్‍లో వుండు. నేనూ సుమంత్ సిటీకి మూవైపోతున్నాం. కాలేజి దగ్గిరే రూమ్ తీసుకుని వుండమంటున్నారు నాన్న. ప్రహ్లాద్‍కూడా మాతో జాయినౌతాడనుకుంటా. వసంత్ ఎంటెక్ చేస్తాడట. సీటు ఎక్కడ వస్తుందో! సిటీలోనే వస్తే మేం నలుగురం అక్కడ తేలతాం. వాడు వెళ్ళేలోగా మళ్ళీ ఒకసారి కలుద్దాం” అన్నాడు సుధీర్. వాసు రాణాకి షేక్‍హాండ్ యిచ్చాడు.
“పిన్నీ మేం వస్తాం” అని లోపలికి కేకపెట్టాడు. ఆమె రాగానే మరోసారి చెప్పి బయల్దేరారు.
మనసులో బాధ వుంటుంది. దాన్ని సరైన పదాలలో సరైన స్వరంలో వ్యక్తపరిస్తేనే ఎదుటివాళ్లకి అర్థమవ్వాల్సిన తీరులో అర్థమౌతుంది.
“నీతోటి పిల్లలు. పెద్దచదువులు ఒకడికీ, వుద్యోగం మరొకడికీ. నువ్వు వాళ్ళచేత చెప్పించుకునే పరిస్థితిలోకి వచ్చావు. బాగా చదివితే నిన్ను మాత్రం చదివించరా నాన్న? ఎవర్ని వెంటబెట్టుకుని వెళ్ళావు నిన్న?” అడిగింది సంధ్య. తల్లి మాటలు గుచ్చుకున్నాయి రాణాకి. తప్పుదారిలో అర్థమయ్యాయి.
“ఎవరూ లేదమ్మా! రాజేష్, మోహన్‍వాళ్ళు. కోటకేకదాని వస్తామన్నారు” తేలిగ్గా అనేసాడు.
“ఆడపిల్లల విషయంలో బాధ్యతగా వుండాలికదా? ఇంకోసారి యిలా చెయ్యకు. బావోదు” అంది సంధ్య. జరిగింది రాత్రి భర్తతో చెప్పింది. మరీ అంత వివరంగా కాకపోయినా, కొడుకు స్నేహాలగురించి భర్తకి తెలియాలని. తెలిసో తెలియకో, తెలివితక్కువగానో, తెలివి ఎక్కువయ్యో పెద్దవాళ్ళు అనేమాటలు పిల్లల మనసుల్లో కోటలు నిర్మించుకుని కూర్చుంటాయి. అతను భార్య మాటల్ని అంత సీరియస్‍గా తీసుకోలేదు. పైగా,
“మీ అన్నయ్య ఎలాగా కట్నాలివ్వలేడు. అందుకే కూతుర్ని వుద్యోగంలో పెట్టాడు. మీ అక్కచెల్లెళ్ళలో ఒకళ్ళకి అసలు కట్నమే యివ్వలేదు. ఇంకొకళ్లది వుభయఖర్చుల పెళ్ళి. మన పెళ్ళిమాత్రం ఏమంత గొప్పగా జరిగిందని? మనవాడికిచ్చి చేస్తారేమో అడుగు. ఎలాగా గీతకి వుద్యోగం వుంది. పెళ్ళి చేస్తే వీడికీ బాధ్యత తెలుస్తుంది” అన్నాడు హనుమంతరావు. కొడుకుని దార్లో పెట్టమంటే అతను యిచ్చే సలహా ఇదా? తోటిపిల్లలకి వున్న బాధ్యత వీడికి లేదా? అప్పటిదాకా అతని ప్రవర్తనతో ఎంతో విసిగిపోయి, పెళుసుబారిన సంధ్య మనసు విరిగిపోయింది.
వాసుని యింట్లో దింపేసి వెళ్ళిపోయాడు సుధీర్. వాసు లోపలికి వెళ్ళేసరికి అతని నాయనమ్మ వచ్చి వుంది. ఆవిడకి వాసు తండ్రికాక ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరూ ఆయనకి అక్కలు. ఇద్దరికీ భర్తలు లేరు. పెద్దామెకి పిల్లలుకూడా లేరు. రెండో ఆమెకి ఇద్దరు కూతుళ్ళు. వాసుకన్నా పెద్దవాళ్ళు. పెళ్ళిళ్ళయ్యాయి. చిన్నవయసులోనే చేసేసారు. పదేసేళ్ళ పిల్లలుకూడా. వాసు నాయనమ్మ, ఆవిడ ఇద్దరుకూతుళ్ళు కలిసి చిన్నకూతురి యింట్లో వుంటారు. చూడాలనిపించినప్పుడు యిక్కడికి వచ్చి నెలో రెండునెలలో వుండి వెళ్ళిపోతుంది పెద్దావిడ.
“ఎప్పుడొచ్చావు మామ్మా?” ప్రేమగా అడిగాడు వాసు.
“నీమీదికి ధ్యాస మళ్ళిందిరా! కూర్చో. గడకర్రలా ఎదిగావు. నీ ఎదురుగా నిలబడితేనే నాకు నీమొహం కనిపించదు. నువ్వు నిలబడి, నేను కూర్చుంటే కనిపిస్తుందా?” అందావిడ. అతను నవ్వుతూ వెళ్ళి ఆవిడ పక్కని కూర్చున్నాడు.
“ఉద్యోగం బావుందా? కష్టమౌతోందా? వేళకి తింటున్నావా?” అడిగింది. అన్నిటికీ జవాబు చెప్పాడు.
“పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావురా?” ఆవిడ ప్రశ్న మొదట అర్థమవలేదు. అర్థమయ్యాక సిగ్గుపడ్డాడు.
“తొందరేముంది? సుధీర్, రాణా అందరూ వున్నారుకదా?” అన్నాడు.
“మీరు స్వంత అన్నదమ్ములు కారుకదరా? ఎవరింట్లో వీలునిబట్టి వాళ్ళు చేసుకుంటారు. చదువైంది. ఉద్యోగం వచ్చింది. పెళ్ళికూడా చేసుకుంటే మాకు కాస్త సందడి వుంటుంది. మునిమనవణ్ణెత్తుకుని సన్మానం చేయించుకోవాలనుంది నాకు” అందావిడ.
“మునిమనవలున్నారుకదా, మీకు?” అడిగింది లక్ష్మి తనుకూడా వచ్చి కూర్చుని. కొడుకేం చెప్తాడోనని ఆతృతగా వుంది.
“అది ముత్తవ్వ సన్మానం. తాతమ్మ సన్మానం వద్దా?” అడిగింది. లక్ష్మి నవ్వేసింది.
“ఏరా, మాట్లాడవేం?” అడిగింది కొడుకుని.
“గీతని చేసుకుంటానమ్మా! నాకు తనంటే యిష్టం” అన్నాడు వాసు నెమ్మదిగా. ఒక బలమైన నిశబ్దం అక్కడ పరుచుకుంది. విన్నదాన్ని ఆకళింపు చేసుకుని వూపిరి పీల్చుకోవడానికి అది తప్పనిసరైంది. లక్ష్మికీ మనసులో అలాంటి ఆలోచన వుందిగానీ దాని వెంట కొన్ని సంకోచాలుకూడా వున్నాయి.
“మంచి ఆలోచనే. నీ అన్న కూతురైతే ఇంట్లో కలిసిపోతుంది. మాధవ్‍కి ఎలాగా బైటనే చూసుకోవాలి. వీడికి వరసైనపిల్ల వున్నప్పుడు వదులుకోకూడదు ” అంది పెద్దావిడ.
“నిజమేకానీ” ఆగింది లక్ష్మి. వాసు వూపిరి బిగబట్టాడు.
“చదువైన వెంటనే పెళ్ళిప్రయత్నాలు మొదలుపెట్టకుండా వుద్యోగంలో పెట్టాడు అన్నయ్య దాన్ని. వాళ్లకి వేరే ఆలోచన వుందేమో! సుధీర్ చదువవ్వడంకోసం ఆగారేమోనని” అంది. తన బతుకు చూస్తూకూడా అన్నయ్య ఈ యింటికి పిల్లని ఇస్తాడా అనే సందిగ్ధంకూడా వుంది. అది పైకి అనలేదు. లోపలే దాచుకుంది. తల్లి మాటలకి వాసు ముఖం కళతప్పింది. ఇద్దర్నీ చూసింది వాసు నాయనమ్మ.
“అదేదో అడిగితే తెలిసిపోతుందికదా? నువ్వన్నదే నిజమైతే మరో సంబంధానికి వెళ్తాం” అంది.
“ఏరా, వాసూ! వింటున్నావా? వాళ్లకి మన సంబంధం నచ్చకపోతే నువ్వింక ఆ విషయాన్ని మర్చిపోవాలి. అదే పట్టుకుని కూర్చోకూడదు” లక్ష్మి హెచ్చరించింది. వాసు తలూపి అక్కడినుంచీ వెళ్ళిపోయాడు.
లైటేనా వేసుకోకుండా గదిలో ఒక్కడూ కూర్చుండిపోయాడు. అతని మనసంతా చాలా అలజడిగా వుంది. ఇప్పటిదాకా ఎవరింట్లోనూ పెళ్ళిప్రస్తావన రాలేదు. గీతని ఎవరు పెళ్ళిచేసుకోవాలనేది చూచాయగానేనా చర్చకి రాలేదు. తనకిమాత్రం ఎప్పట్నుంచో మనసులో లీలగా వుండేది ఎప్పటికీ గీత సహచర్యం కావాలని. సుధీర్ మాటే ఎందుకొచ్చింది? ప్రహ్లాద్ విషయం ఎందుకు రాలేదు? సుధీర్ని చేసుకుంటుందా గీత? వాడు డాక్టరు. అందుకేనా? గీత తనతో మాట్లాడ్డం మానేసి చాలాకాలమైంది. ఎందుకు చేసిందలా? సుధీర్‍తో బాగానే మాట్లాడుతుంది. మిగిలినవాళ్ళతోనూ బానే వుంటుంది. తనొక్కడితోనే మాట్లాడదు. తను నచ్చలేదా? తనంటే యిష్టంలేదా? చిన్నప్పుడు బానే వుండేదికదా? తన వెంటవెంటే తిరిగేది? అతని మనసు విలవిల్లాడింది.
“లైటేనా వేసుకోకుండా ఒక్కడివీ కూర్చున్నావేంరా? మామ్మెప్పుడు వచ్చింది? కొబ్బరుండలు తెచ్చింది. బావున్నాయి. తింటావా? ఇదుగో” అంటూ మాధవ్ వచ్చేదాకా అలాగే ఒక్కడూ వున్నాడు.
“అదేమిట్రా? అలావున్నావు? రాణాని కలుద్దామనుకున్నారు. వెళ్ళారా? వాడితో గొడవైందా?” అడిగాడు ఆతృతగా.
“గొడవేం లేదురా! తలనొప్పిగా వుంది. లైట్ తీసేసి వెళ్ళు. నేను పడుక్కుంటాను” అన్నాడు వాసు.
మాధవ్ వింతగా చూసి లైటు తీసేసి అక్కడినుంచీ వెళ్ళాడు. “వాడలా వున్నాడేంటమ్మా?” అడిగాడు తల్లిని.
లక్ష్మి, అత్తగారు ముఖాలు చూసుకున్నారు. మరేం పర్వాలేదన్నట్టు చూపుల్తోటే ధైర్యం చెప్పింది ఆవిడ. కానీ లక్ష్మికి తెలుసు, మగపిల్లలు ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్‍గా వుంటారు. మనసు చెదిరితే దారికి రారు. జీవితాలు అస్తవ్యస్తం చేసుకుంటారు. ఆడపిల్లల్లా గుంభనగా వుంచుకోవడం, ఓర్చుకోవడం రాదు.
“భగవంతుడా!” అనుకుంది.


అన్న యింటి సందు మొదట్లో గీతని దింపేసి వెళ్ళాడు రవి. అతనింట్లో జరిగిన మాటలు గీత మనసుని బాగా కలతపరిచాయి. వాసు తనని చేసుకోడా? మరెవర్ని చేసుకుంటాడు? తనుకాక ఇంట్లో వరసైన పిల్లలు ఇంకెవరున్నారు? అతను మాట్లాడే మాటకోసం వొళ్లంతా చెవులు చేసుకుని ఎదురుచూస్తుంది తను. కానీ అతను మాట్లాడడు. ఎందుకు? తనంటే యిష్టం లేదా? అత్త కోప్పడుతుందనా? మనసంతా మబ్బులు ముసురుకున్నట్టైంది. ఆఫీసువేళకన్నా ముందే చిన్నబోయిన ముఖంతో ఇంటికొచ్చిన కూతుర్ని చూసి కంగారుపడింది యశోద.
“ఏమైందే? అలా వున్నావేం” అని అడిగింది.
“రవి బాబాయ్ వాళ్ళింటికి తీసుకెళ్ళాడు” అంది.
“మీ ఆఫీసుకొచ్చాడా?”
“వచ్చి తీసుకెళ్ళాడు. సుధీర్ని చేసుకోవాలట నేను. వాసుని చేసుకుంటానని చెప్పాను. వాడు చేసుకోనంటే ఏం చేస్తావని అడిగాడు” తల్లిని వెనకనుంచీ అల్లుకుని, ఆవిడ వీపులో ముఖం దాచుకుని, అక్కడ ఆపిన ఏడుపుని ఇక్కడ కొనసాగించింది.
“వాడేమిటి? అతను అనాలి. మీరు పెద్దాళ్లవలేదూ? ఎందుకు చేసుకోడట వాసు? రవితో చెప్పాడటనా చేసుకోనని? ఐనా ఈ ఏడుపేమిటి? నీ పెళ్ళి నువ్వే చేసేసుకుంటావా? వాసుని చేసుకుంటానని నువ్వూ, నిన్ను చేసుకుంటానని అతనూ అనేసుకోవటమేనా? ఎప్పుడు అనుకున్నారు అలాగ? ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారా? పెద్దాళ్ళం మాట్లాడుకోనక్కర్లేదా? ఇప్పుడేకదా, పెళ్ళిమాట అనుకున్నది? చిన్నపిల్లవి, తొందర దేనికి? మామ్మ రావాలికదా? తిరుపతి వెళ్ళినావిడ రావద్దూ?” అని కోప్పడింది యశోద. రామారావు తల్లి రెండోకొడుకు కుటుంబంతో తిరుపతి వెళ్ళింది. ఇంకోరోజో రెండురోజులో పడుతుంది తిరిగిరావడానికి.
తల్లిమాటల్లో గీతకి కావల్సిన వివరం దొరికింది. మనసులోకి అమృతం చిన్న ధారగా వొలికింది. “మేమేం మాట్లాడుకోలేదు. నాతో తను మాట్లాడడు” తల్లి అభియోగానికి కోపంగా జవాబిచ్చింది.
“మాట్లాడుకోకపోతే ఒకళ్ళ విషయం ఇంకొకళ్ళకి ఎలా తెలిసింది? హంసరాయబారాలు పంపుకున్నారా?” అంతే కోపంగా అడిగిందావిడ.
“లేదని చెప్పానుకదా? మేం మాట్లాడుకోం. మానేసి చాలాకాలమైంది. అత్త ఒకసారి కోప్పడింది. అప్పట్నుంచీ మానేసాడు. మరోకారణానికి నేనూ మానేసాను” అంది. ఆ కారణం ఏంటో చెప్పలేదు. యశోదకి ఏమీ అర్థంకాలేదు. మాట్లాడుకోకపోవటమేమిటి? ఒకళ్ళకోసం ఒకళ్ళు ఈ ఏడుపులేమిటి?
“మీ కారణాలూ, కాకారకాయలూ నాకక్కర్లేదు. వాసునే చేసుకుందువుగాని. మామ్మ వచ్చి, పెద్దవాళ్లం కూర్చుని మాట్లాడుకునేదాకా మా పరువు నిలబెట్టు” అల్టిమేటమ్ యిచ్చింది. ఆవిడకి ఇలాంటి విషయాలు తెలీవు. అర్థమవ్వవు. ఎంతకీ పెళ్ళవకపోతే రుక్మిణీకళ్యాణం చదివించేది తల్లి. అదొక పారాయణంలా చదువుకునేదిగానీ, రుక్మిణీదేవిలా తెగింపు చెయ్యాలన్న సూక్ష్మాన్ని గ్రహించలేదు.


తల్లి వచ్చాక ఆవిడతో జరిగినవన్నీ చర్చించి లక్ష్మితో నిర్ణయం చెప్పడానికి వారంరోజులు టైము తీసుకున్నాడు రామారావు. అప్పటికే పావులు కదిలాయనీ, గీత మనసు ఆవిష్కృతమైందనీ వాసుకి తెలీదు. ఆ వారం నరకమే కనిపించింది. ఏడ్చాడో, తిండి తిన్నాడో, నిద్రపోయాడో, ఏం చేసాడో చుట్టూ వున్నవాళ్ళకి తెలిసిందిగానీ అతనికి స్పృహే లేదు. గుండె కొట్టుకునే వేగం పెరిగింది. కాలం రోజుల్లో కాకుండా నిముషాలూ క్షణాల్లో కదలడం తెలిసింది. ఇంటికి ఎవరు వచ్చినా, ఆవిషయం చెప్తారేమోనని చెవులు ముందుకి రిక్కాయి. వళ్ళంతా తామే అయ్యాయి.
చిన్న సమాచారం, తావి తెలీనిచోటినుంచి వచ్చిన పరిమళంలా, అలసిపోయిన శరీరానికి తాకిన చల్లటిగాలిలా వచ్చి సేదతీర్చింది.
“స్వాములవారి కూతురు నీ కొడుకుకోసం తపస్సు చేస్తోంది” అన్నాడు రవి, వార్త మోసుకొచ్చి. ప్రమీల నిరుత్సాహపడ్డం, గీత అలా అనడం అతని వేగాన్ని కొంచెం తగ్గించాయి. అందుకే అతనూ ఆగాడు.
“ప్రమీలకీ వుంటుందికదా ఆశ, అన్నకూతుర్ని కోడలిని చేసుకోవాలని. గీతకి పెళ్ళిచెయ్యాలనుకుంటున్నట్టు ఆయన వచ్చి అనగానే నన్ను పిలిచి చెప్పింది. వెంటనే గీతని మాయింటికి తీసుకెళ్ళి కుసుమా, నేనూ దగ్గర కూర్చోబెట్టుకుని అడిగాము. వాసు అంటే యిష్టమని చెప్పింది. నీ యిష్టం సరేనమ్మా, వాడికీ అలాంటిది వుండాలికదా అని అడిగితే, ఆ మాటకే తల్లడిల్లిపోయిందది ” అన్నాడు రవి.
“నిజమేనా?” అడిగింది లక్ష్మి అపనమ్మకంగా.
“ఆయనకికూడా అలాంటి అభిప్రాయమే వున్నట్టుంది. దాన్ని వాసుకి చేసుకో లక్ష్మీ! కట్నానికీ దానికీ చూడకు. ఆయన ఎంత యివ్వగలడో యివ్వనీ. నాలుగో ఐదో తక్కువపడితే నేను చూసుకుంటాను” అన్నాడతను.
“మాటలు నేర్చావు పిల్లగా! మీ అక్కకి తీసుకున్నామా? కొబ్బరిబోండంతో పిల్లని తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నాం. మా మగపిల్లలకి కట్నాలు తీసుకోం. వాళ్ళే సంపాదించుకుంటారు అన్నీను. ఇక్కడ మాకు లేనిదేంటి? మీరిచ్చిన కట్నంతో కొనేవేం వున్నాయ్? నీ అన్నకూతురికి వుద్యోగం లేదా? వాసుకి లేదా? వాళ్లకి కావల్సినవి వాళ్ళు కొనుక్కోరా” అంది పెద్దావిడ.
ప్రమీలకీ, లక్ష్మికీ మధ్య తేడా స్పష్టంగా కనిపించింది రవికి. అందుకోలేనంత ఎత్తుకి ఎగురుతున్నాంకాబట్టి మమ్మల్ని లేపేవాళ్ళు కావాలి అంది ప్రమీల. ఉన్నంతలో మేం సంతృప్తిగానే వున్నాంకాబట్టి మరో మనిషికి నిశ్చింతగా చోటివ్వగలం అనేది యిక్కడి మాట.
“కట్నాలమాటా, కానుకలమాటా పక్కన పెట్టి ముందు నీ మేనల్లుడికి యీ కబురు చెప్పిరా! వారంరోజుల్నించీ మనలోకంలో లేడు” నిండుగా నవ్వుతూ అంది లక్ష్మి. “సుధీర్‍కి చేసుకుంటారేమోరా అన్నాను మాటవరసకి. అంతే, మొహం ముడుచుకుని తిరుగుతున్నాడు”
“వాడి పరిస్థితికూడా అలాగే వుంది” అనబోయి అక్కడ అవసరంలేని ఆ మాటలని నాలుక చివర్నుంచీ వెనక్కి పంపేసాడు.


పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. ప్రమీల రేపిన సందిగ్ధాన్ని కాల్లో దిగిన ముల్లుని మొదలుకంటా పీకేసినట్టు త్రిమూర్తులు పరిష్కారం చేసాడు. వేరే ఆటంకం ఏమి కనిపించలేదు రామారావుకి. తల్లి తిరుపతినుంచి రాగానే మంచిది చూసుకుని, ప్రసాదం పట్టుకుని ఆవిడ్ని, భార్యని వెంటబెట్టుకుని లక్ష్మి ఇంటికి బయలుదేరాడు. వ్యవహారం నడిపించడానికి ముగ్గురుగా కలిసి వెళ్ళకూడదని కృష్ణని నాలుగో మనిషిగా లెక్కవేసుకున్నాడు. గీత ఒక్కర్తే ఇంట్లో వుండిపోయింది. ఇది పూర్తిగా వాళ్ళింటికి సంబంధించిన వ్యవహారం కాబట్టి త్రిమూర్తులు రానన్నాడు. రామారావు చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళూ చేసి, అతనూ ఓ యింటివాడయ్యాక తను ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం తగ్గించాడు. రామారావుమాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. నిర్లక్ష్యం చెయ్యలేదు. అతనికి చెప్పి, సలహా తీసుకునిగానీ ఏ పనీ చెయ్యడు.
You can fool some of the people all of the time, and all of the people some of the time, but you can not fool all of the people all of the time-
దీన్నే కాస్త పాజిటివ్‍గా మార్చితే-
ఒక వ్యక్తి కొంతమందితో అన్ని సమయాలలో వ్యవహారం చెయ్యగలడు. అందరితో కొన్ని వ్యవహారాలు చెయ్యగలడు. కానీ అందరితో అన్ని వ్యవహారాలూ చెయ్యలేడు. అందుకే ఇంటిపెద్దలు, శ్రేయోభిలాషులు, మధ్యవర్తులలాంటివారు అవసరమౌతారు.
రామారావుకి ఇది పూర్తిగా వర్తిస్తుంది. అతనికి పెద్దగా వ్యవహారదక్షత లేదు. త్రిమూర్తుల వెనుక నిలబడి చెల్లెళ్ళపెళ్ళిళ్ళు, తదితర కార్యక్రమాలు అయాయనిపించాడు.అతను ఎక్కడా తడబడకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు త్రిమూర్తులు. అతను ఇచ్చే సలహాలని తన అభిప్రాయాలుగా యింట్లో చలామణీ చేస్తాడు రామారావు. ఇప్పుడుకూడా త్రిముర్తులు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు.
“ఇదుగో, వాళ్ళు అడిగినవాటికన్నిటికీ వప్పేసుకోకు. కూతురి పెళ్ళి వేడుగ్గా చేసుకోవాలని వుండటం సహజం. తాతముత్తాతలు యిచ్చిన ఆస్తులుంటే వాటిని కరిగించి అలాగే చేసుకోవచ్చు. మనకి అలాంటివేమీ లేవు, కష్టార్జితాలే కాబట్టి ఆచితూచి అడుగు వెయ్యాలి. ఆర్భాటాలకి ఖర్చుపెట్టిన డబ్బు ఎవ్వరికీ ఎందుకూ కలిసి రాదు. నువ్వూ తినవు, నీ పిల్లలూ తినరు. మధ్యవాళ్ళెవరికేనా వుపయోగపడుతుందా అంటే అదీ వుండదు. నీ చెల్లెళ్ళప్పటికీ, ఇప్పటికీ నీ పరిస్థితి పెద్దగా ఏమీ మారలేదు. పెళ్ళి క్లుప్తంగా చెయ్యి. మీ తదనంతరం మిగిలిందేదేనా వుంటే గీతకీ వాటా వేస్తానను” అన్నాడు. రామారావు తలూపాడు. ఇలా దగ్గర కూర్చుండబెట్టుకుని మంచిచెడ్డల్ని లోతుగా చూసి, సలహా యిచ్చేవాళ్ళు ఎవరుంటారని అతననుకుంటే స్వంతతమ్ముళ్ళు, కన్నపిల్లలే మాట వినని రోజుల్లో ఈ అమాయకుడు తనని లక్ష్మణస్వామిలా అనుసరిస్తున్నాడని త్రిమూర్తులు అనుకుంటాడు. పెద్దవాళ్ళ సలహా, ఆదరణ లేకపోవడం ఎవరికేనా వ్యక్తపడని వెల్తి.
అదొక్కటే కాదు, లోకవిదితమైన మరికొన్ని విషయాలుకూడా మాట్లాడాడు త్రిమూర్తులు.
“మీ నాన్న వైద్యం చేసేవాడు. కలిగినవాళ్ళు ఎంతోకొంత ముట్టచెప్పేవాళ్ళు. లేనివాళ్ళకికూడా ఆయన వైద్యం చేసాడు. వాళ్ళొక దణ్ణం పెట్టేవారు. ఒకడున్నాడంటే డబ్బు యివ్వలేక, మీ వీధీ వాకిలీ శుభ్రంగా తుడిచి మొక్కలకి పాదులు చేసి వెళ్ళి తన కృతజ్ఞతని చూపించుకునేవాడు. ఇంకొకడు వాడి దొడ్లోనో తోటలోనో కాసిన సొరకాయో, బీరకాయో తెచ్చి యింట్లో పడేసేవాడు. ఇలా వుండేవి ఆ రోజులు. అలాగే నడిచిపోయాయి. అప్పుడు ఇవ్వడానికి అందరి దగ్గరా ఏదో ఒకటి వుండేది. ఇప్పుడా పరిస్థితి మారింది. డబ్బు తప్ప మరో మారకం లేదు. మీ యింట్లో అందరూ వుద్యోగస్తులు. నీ కూతురుకూడా వుద్యోగస్తురాలైంది. అన్ని లెక్కలకీ డబ్బే కావాలి. మీ తొమ్మిది కుటుంబాలవాళ్ళూ ఏదీ పండించరు. అలాంటి యింకో పాతిక కుటుంబాలని నీతరంలోనే మీరు తయారుచేస్తారు. వీళ్ళందరూ డబ్బులు పెట్టుకునే అన్నీ సాగించుకోవాలి. ఎంత డబ్బున్నా చాలదు. సుఖంగా సాగుతున్న జీవితాల్లో మనతరంలో ఈ మార్పులు వచ్చాయి. ముందుముందు ఇంకా వస్తాయి. వీటిని తట్టుకుని నిలబడాలంటే పిల్లలకి మనం కొంత వెసులుబాటు చేసే బాధ్యత తీసుకోవాలి. అందుకే ముందుచూపుగా పెళ్ళిఖర్చు పెంచుకోవద్దని చెప్పేది. ఇది మనసులో వుంచుకుని పరిస్థితులనిబట్టి నిర్ణయం తీసుకో. మరీ జటిలంగా వుంటే ఆలోచించుకుని చెప్తానను. లక్ష్మి, అత్తగారు చాలా సరళమైన మనుషులు. అంతా సవ్యంగానే జరుగుతుందిలే, వెళ్ళిరా!” అని ఆశీర్వదించి పంపాడు.
“మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పారేమిటి? ఏమైనా అనుకోడూ?” అంది అక్కడే వుండి అంతా వున్న ఆయన భార్య.
“తండ్రి, పెద్దన్నలాంటివాళ్ళు మన వెనక వుండి మంచిచెడులు చూస్తే వుండే సుఖం మీ ఆడవాళ్ళకి అర్థంకాదులే. ఎందుకంటే మీకన్నా ఐదేళ్ళో పదేళ్ళో పెద్దైనవాడిని చేసుకుని, సర్వం నీవే దిక్కని భారమంతా వాడి భుజానికి తగిలిస్తారు. నాకేమో తండ్రి వుండీ లేనివాడయాడు. వాడికేమో, ఎదగాల్సిన వయసులో అండదండగా వుండాల్సిన మనిషి అసలే లేకుండా పోయాడు ” అన్నాడు. ఆవిడ కాదనలేదు.


ముందుగా లక్ష్మి అత్తగారికి తనొచ్చిన విషయం చెప్పాడు రామారావు. విజ్జెమ్మ వియ్యపురాలిని పరామర్శ చేసి, మనవరాలిని దగ్గిరకి తీసుకుని ముద్దుచేసింది.
లక్ష్మి భర్తకి ఇలాంటి విషయాలేవీ పట్టవు. ఆయన సంసారం అనే తెప్పలో ఒక కాలూ, వైరాగ్యం అనే దాంట్లో రెండోకాలూ పెట్టి ప్రయాణం చేస్తున్న మనిషి. తనొచ్చిన కారణం ఆయనతో అంటే, “నాదేమీ లేదు బావా! మా అమ్మకీ మీ చెల్లెలికీ ఎలా నచ్చితే అలా చేయండి” అన్నాడు.
రామారావు నిట్టూర్చాడు. భక్తి అనేది జీవితానికి ఒక ఆభరణంలాంటిది. సంసారులకి తగుమోతాదులో ఉంటే వినయం, వందనం, వివేకం ఇస్తుంది. ఒక వ్యాపకాన్నికూడా కల్పిస్తుంది. మూఢభక్తి ఆభరణమే తనైన జీవితం. అందులో జీవం ఉండదు. లక్ష్మి భర్త లక్షణంగా పెళ్లిచేసుకుని ముగ్గురు పిల్లలతండ్రై ఈ ప్రభావంలో కొట్టుకుని పోతున్నాడు. సంసారం అనే బంధాన్ని ఎప్పుడో వదిలేశాడు.
కొన్నేళ్ళక్రితం ఇంట్లోంచీ వెళ్ళిపోయాడు. వెతికిపట్టుకొచ్చి, ఆయన స్థానంలో ఆయన్ని కుదేసారు. అందరూ గట్టిగా పట్టుకుని ఆపుతున్నారు. భక్తిసమావేశాలు, భజనలు, క్యాంపులు… ఇదే అతని జీవితం. పుస్తకాలు చదువుతాడు. ప్రవచనాలు రాస్తాడు. అతనిది మరో ప్రపంచం. జీతం మాత్రం తెచ్చి లక్ష్మి చేతిలో పెట్టి ఖర్చులకని కొంత తీసుకుంటాడు. తేడావస్తే అతని తల్లీ, అక్కలూ వూరుకోరు. లక్ష్మికి వాళ్ళే పెట్టని కోట, కొండంత అండ. ఆపైన రామారావు సాంత్వన. స్వంతిల్లుంది. డబ్బు యిబ్బందులేవీ లేవు. జీవితం సాఫీగానే నడిచిపోతుంది. అదొక ఎత్తైతే ఎన్నో నిద్రలేని రాత్రులు లక్ష్మి కన్నీళ్ళని గుండెల్లోకి వంపుకుంది. భర్తల్లేని మిగిలిన ఆడవాళ్లకీ, భర్త వుండీ లేనట్టుండే తనకీ పెద్దగా తేడా కనిపించదు ఆమెకి.
పిల్లలు పెద్దవాళ్లవటం, కొడుకు పెళ్లి ముందుకొచ్చి సాకారంగా నిలబడ్డా అతనిలో పెద్దగా చలనం లేదు. ఇలాంటి యింట్లో కూతుర్ని యివ్వచ్చా అన్న సందేహం యశోదకి వుండేదిగానీ, వాసు ఆ సందేహాన్ని తీర్చేసాడు. చాలా బాధ్యతగా వుంటాడతను.
చెల్లెళ్ళ కుటుంబాల్లోని ఈ వ్యక్తులని చూసినప్పుడు రామారావుకి మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. నందకిషోర్ తప్ప అందర్లోనూ ఏదో ఒక అహంభావమో, భార్యాపిల్లలకి యిబ్బంది కలిగించే అంశమో వుంటుంది. వాళ్ళ జీవితాన్ని తనే ఇలాంటి నిప్పులగుండాల్లోకి నెట్టానని బాధపడతాడు. ఐనాకూడా బావమరుదులని గొప్పవాళ్లనక తప్పదు. నూటికి తొంభైమంది మగవాళ్ళు అలాగే ఉంటారు. ఏ కొద్దిమందికో తప్ప సంస్కారం పూజ్యం. తమకేం కావాలి, ఎందుకు పెళ్ళి చేసుకున్నామన్న స్పష్టత పూజ్యం. అలాంటప్పుడు ఎవర్నని తప్పుపట్టగలడు?
“ఇంటికి పెద్దవారు మీరు లేకుండా పెళ్లి మాటలు ఎలా నడుస్తాయి? రండి బావగారూ! వచ్చి కూర్చోండి” అన్నాడు రామారావు. అనడమే కాదు, ఆయన చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రెండో విడత పలకరింపులయ్యాయి.
కృష్ణని తులసి లోపలికి తీసుకెళ్ళింది. ఇద్దరూ, చెస్, చైనీస్ చెక్కర్ పరుచుకుని కూర్చున్నారు. ఇద్దరూ ఒక వయసువాళ్ళు. ఒకటే స్కూలుగానీ సెక్షన్లు వేరు. అటూయిటూగా ఈ వయసువాళ్ళొక ఎనిమిదిమంది ఆ కుటుంబంలో. ఐతే వాళ్ళ మధ్య పెద్దపిల్లలమధ్య వున్నంత కలివిడితనం లేదు. కలిస్తే ఆడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు. ఒకళ్ళిళ్ళకి మరొకరు వెళ్ళడం, గుంపుగా కలిసి తిరగడం లేదు. ఇందులో యిద్దరే మగపిల్లలు. మిగతా ఆరుగురూ అమ్మాయిలు. మొదటిబేచిలో మగపిల్లలు ఎక్కువకావడంతో తిరగడం ఎక్కువైంది.
తులసి చాలా నెమ్మదైనది. సున్నితంగా జాజిమొగ్గలా వుంటుంది. చిన్నమేనత్త పోలిక అంటారు. అంత నాజూకైన అమ్మాయి ఆ తొమ్మిదికుటుంబాలలోనూ మరొకరు లేరు.
“ఆ గులాబీపువ్వుకీ నీకూ తేడాలేదే! జళ్ళో పెట్టేసుకుంటాను” అంటుంది రవళి.
“ఇంత నాజూగ్గా వుంటే ఎలాగే? ఎండలోకెళ్తే కందిపోయి, నాలుగడుగులు వేస్తే అలిసిపోతే ఎలా? కిందటి జన్మలో అవంతీపురంకోట మీదేనేమిటి?” అంటుంది గీత. వాసూ, మాధవ్ చెల్లెల్ని ప్రాణంలా చూసుకుంటారు. ఇంట్లో అపురూపమైనది ఏదైనా వుంటే అగ్రభాగం ఆమెదే. వాసు మొదటి సంపాదన ఆమెకే యిచ్చాడు.
“దీనికేదైనా చెవులకి చేయించమ్మా!” అని తల్లికి చెప్పి.
ఒక కుటుంబం, అందులోనివాళ్ళు ఎవరెవర్నో పెళ్ళి చేసుకోవటం, పుట్టే పిల్లలు మనవాళ్ళే అనిపించడం ఒకవైపు, వాళ్ల రూపురేఖావిలాసాలు కొత్తగా అనిపించడం మరోవైపు. విశ్వం అంతా ఈ బాంధవ్యాలు అల్లుకునిపోయి వుంటాయి. ఒక పొదనుంచీ వచ్చిన తీగలే దూరానికి పాకినప్పుడు అవి ఆ పొదవి కాదనిపిస్తాయి. ఇంకొన్ని దూరపునేలలో వేళ్ళూనుకుని కొత్త వునికిని సృష్టించుకుంటాయి. మనిషి శరీరాన్ని ఒక పొదరిల్లు అనుకుంటే అందులోని జన్యువులు తీగలై ఎక్కడెక్కడికో సాగి వుంటాయి. మూలం మాత్రం ఒకదగ్గిరే.
వాసు, మాధవ్ యింట్లో లేరు. గ్రౌండుకి వెళ్ళారు. వీళ్ళిలా వస్తారని వాళ్ళకి తెలీదు. కొద్దిసేపు మామూలు కబుర్లయ్యాయి. వియ్యపురాళ్ళిద్దరూ తిరుపతి ప్రయాణం విషయాలు చెప్పుకున్నారు. లక్ష్మి అందరికీ మంచినీళ్ళు, కాఫీలు తెచ్చిచ్చింది. కృష్ణకీ, తులసికీ తినడానికి పెట్టింది.
“మామయ్యావాళ్ళూ ఏదో ముఖ్యమైన పనిమీద వచ్చారు. మీరిద్దరు కూర్చుని ఆడుకోండి, చదువుకోండి. మామధ్యకి రావద్దు. తెలిసిందా? ” అని హెచ్చరించింది. ఇద్దరూ తలూపారు. తర్వాత నింపాదిగా అన్నాడు రామారావు.
“వాసుకి గీతనిచ్చి చేయాలనేది నాకు ఎప్పటినుంచో ఉన్న కోరిక బావా! నాతర్వాత ఇంటికి పెద్దది ప్రమీల. దాంతోకూడా ఒక మాట చెప్పాలని ఆగాను. అంతేతప్ప మరేమీ లేదు. ఇక్కడ నా చెల్లెలిని ఇచ్చాను. అది సంతోషంగానే ఉంది. నా కూతురుకూడా సంతోషంగా ఉంటుందని నమ్మకం నాకుంది. అది కాక పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. మిగతావి కూడా మాట్లాడుకుంటే బావుంటుందని నా ఆలోచన” అన్నాడు.
“ప్రమీల కొడుక్కి అడగలేదా? సుధీర్‍కూడా వయసేకదా?” అడిగింది లక్ష్మి అత్తగారు.
“వాళ్ళు అడిగినమాట నిజమే. వాడింకా పైకి చదువుతాడట. అంతకాలం మేం ఆగలేం. గీతమాత్రం మీ మనవణ్ణే చేసుకుంటానని కూర్చుంది అత్తయ్యగారూ!” అన్నాడు రామారావు. మాటలు మరికాస్త ముందుకి సాగాయి.
లక్ష్మి అత్తగారు తన మాటమీద నిలబడింది. “మా ఇంట్లో మగపిల్లలకి కట్నాలు తీసుకోము. పెళ్ళికి ఆర్భాటాలూ వద్దు. పిల్లలిద్దరూ సుఖంగా వుంటే చాలు. మీరేమైనా పెట్టాలనుకుంటే మీ పిల్లకి పెట్టుకోండి. అయినా ఇద్దరూ సంపాదించుకుంటున్నారు. అన్ని మనమే ముద్దచేసి తినిపిస్తే వాళ్లకి అరిగించుకునే శక్తి ఉండాలి కదా!” అంది. ఆవిడ విజ్ఞతకి రెండుచేతులూ ఎత్తి దండం పెట్టాడు రామారావు.
ఎంతమంది ఇలా ఆలోచిస్తారు? అందరూ ఇలా ఆలోచిస్తే ఆడపిల్లల పెళ్లిళ్లు సమస్య కానే కావు. తన ఇంటికి వచ్చిన అల్లుళ్లంతా గొప్పవాళ్ళనే చెప్పుకోవాలి. ఎప్పుడూ తనని ఇబ్బంది పెట్టలేదు. తాహుతుకి మించి కోరికలు కోరలేదు. వాళ్ళ వ్యక్తిత్వాలతో యిళ్ళలో వచ్చే సమస్యలు, చెల్లెళ్ళు ఎదుర్కొంటున్న యిబ్బందులు ముందుగా వూహించలేనివి. అవి డబ్బుతో ముడిపడిలేనివి. వేలకివేలు కట్నాలిచ్చి కూడా అత్తారిళ్ళలో ఆరళ్ళు పడినవాళ్ళు తన తరంలోనూ వున్నారు, యిప్పుడూ వున్నారు. అది వ్యక్తిగతలోపం కాదు. వ్యవస్థాగతమైన లోపం. మనుషులు సరిగ్గా ఎలా పెరగాలో స్పష్టంగా చెప్పలేని వ్యవస్థ వలన వచ్చిన లోపం. మనవి ద్వంద్వప్రమాణాలు. పురాణాలకథలు చెప్తాం. ఆ కథల్లోని లోపాలని మనమే ప్రశ్నిస్తాం. మనకి విస్తృతమైన చరిత్ర వుంది. అసంఖ్యాకమైనన్ని గ్రంథాలు వున్నాయి. వాటి తాళం సంస్కృతం అనే భాషగా వుంది. ఆ భాష వచ్చిన పండితులకి లౌకికవిద్య రాదు. లౌకికవిద్య నేర్చినవారికి భాష రాదు. లౌకిక విద్య నేర్పేది వేరు, సంస్కృతి నేర్పేది వేరు. ఈ అగడ్త పూడ్చే ప్రయత్నం చేసినప్పుడుగానీ ద్వంద్వప్రమాణత్వం తగ్గదు. మనదైన మనస్తత్వంతో, మనది కాని, మనకి నప్పని జీవితం గడపడంలోని సంక్లిష్టత వదుల్చుకుని, తప్పొప్పులు సరిదిద్దుకుని, నిగ్గుతేలే అవకాశాలన్నీ ఈ అసంబద్ధత దగ్గర ఇరుక్కుపోయి వున్నాయి.
“మీ మంచితనానికి నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణి. వాసుతోపాటు మాధవ్‍కూడా ఉన్నాడు. వాడికి వచ్చే పిల్లముందు గీతగానీ వాసుగానీ చిన్నతనం పడకూడదు. మాకేదో ఉందని కాదు. తాహతుకు తగ్గట్టు ఎంతో కొంత పిల్లలకి పెట్టుకుంటాం. మీరు కాదనకూడదు” అన్నాడు. ఆవిడ అభ్యంతరం పెట్టలేదు సిద్ధాంతాలు ఎవరి వాళ్ళకి, ఎక్కడివరకు అక్కడికే అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. తర్వాత మరీ ముఖ్యమైన, తప్పనిసరైన పెట్టుపోతల గురించి మాట్లాడుకున్నారు. కట్నకానుకలేవీ లేవుకాబట్టి ఎవరి ఖర్చులు వాళ్ళవన్న వప్పందం చేసుకున్నారు. బట్టలవీ ఎవరికివాళ్ళు కొనుక్కుని రెండోవాళ్లకిచ్చి పెట్టించుకోవాలని అనుకున్నారు. అక్కడికి పెళ్లిమాటలు అయ్యాయి.
“అన్నయ్యా! వాసు నా పెద్దకొడుకు. పెద్దకొడుకు ఏ అమ్మకేనా శ్రీరామచంద్రుడేకదా? వాడిపెళ్ళి గురించి నాకు ఎన్నో ఆశలున్నాయి. మన ఇంట్లో పెళ్లిళ్లన్నీ హడావిడిగా జరిగాయి. వీళ్ళ పెళ్లిలో పద్ధతులన్నీ పాటిద్దాం. పెళ్లనేది కేవలం వేడుక కాదు. చక్కటి భవిష్యతరాన్ని అందించే వేదికకూడా” అంది లక్ష్మి.
“నువ్వెలా చెప్తే అలా లక్ష్మీ!” అన్నాడు రామారావు.
అక్కడ తులసి, కృష్ణ చెప్పుకోగలిగినన్ని కబుర్లు చెప్పుకుని, ఆడుకోగలిగినన్ని ఆటలు ఆడుకుని, దీపాలు పెట్టే వేళయేదాకా చెట్లకి వున్న కాయా కసరూ కోసుకుని తిన్నారు. టేకుచెట్టు లేత చిగురుకోసి అరచేతిలో వేసి నలిపితే ఎలా ఎర్రగా పండుతుందో చూపించింది తులసి. చెట్టు చిగుళ్లన్నీ యిద్దరూ కోసిపోసారు. పచ్చగులాబీ మొక్క ఒకటే వుందంటే దాని కొమ్మ వంచి అంటుపెట్టాడు కృష్ణ. ఎర్రగులాబీకీ, పచ్చగులాబీకీ కలిపి అంటుకడితే ఏం జరుగుతుందో చూద్దామని అదికూడా అంటుకట్టాడు. కనకాంబరం మొక్కలమీద నీళ్ళు చల్లి, విత్తనాలు పేల్తుంటే తమాషా చూసారు. ఇంక విసుగెత్తి చెరో మంచంమీదా పడి నిద్రపోయే టైముకి కృష్ణకి యింటికి వెళ్దామన్న కబురొచ్చింది. ఇంటికి వచ్చారు నలుగురూ.
వాళ్ళు యింట్లోంచీ వెళ్ళిందీ తిరిగొచ్చిందీ మొత్తం మూడుగంటలు. ఈ కొద్ది వ్యవధిలో ఒక విషప్పురుగు గీతముందు ప్రత్యక్షమైంది. కాస్త విషం చిమ్మి వెళ్ళింది. ఆ తర్వాతకూడా అది కనిపిస్తునే వుంది. ఏమీ హాని చెయ్యలేదుగానీ ఆమెని జీవితానందాన్ని పూర్తిగా అనుభవించనీకుండా మధ్యమధ్యలో దర్శనం యిచ్చింది. తాము తిరిగొచ్చేసరికి నవ్వుతూనో, సిగ్గుపడుతూనో, కనీకనిపించని ఆతృత చూపిస్తూనో తలుపు తీస్తుందనుకున్న కూతురు కాస్త కలతగా వుండటం రామారావుని కలవరపెట్టింది.
“ఏమైందే? అలా వున్నావు?” అడిగాడు.
గీతలో సందిగ్ధం. చెప్పాలా, వద్దా? చెప్తే తండ్రి ఆ పురుగుని దూరంగా విసిరిపారేస్తాడా? ఇంకొద్దిరోజుల్లో పెళ్ళి జరగబోతున్నప్పుడు అది అవసరమా? తను స్పష్టంగా చెప్పేసాకకూడా ఇంకా అతనలా మాట్లాడతాడా? చెప్పద్దనే నిర్ణయం తీసుకుంది.
“ఏమీ లేదు నాన్నా! కొద్దిగా తలనొప్పి. అంతే” అంది.
“పెద్దాళ్ళ విషయాల్లోకి దూరిపోతే తలనొప్పులేనా వస్తాయి, ఇంకే నొప్పులేనా వస్తాయి. మేం వెళ్ళి మాట్లాడాం కాబట్టి మర్యాదగా వుంది” అంది యశోద.
“పోమ్మా! నేను వాసుతో ఏం చెప్పలేదంటే వినవు” అని విసుక్కుని లోపలికి వెళ్ళిపోయింది గీత.
రాత్రి భోజనాలదగ్గిరకూడా గీత అంత చురుగ్గా లేదు. యశోద, రామారావు డాబామీదికి వెళ్ళిపోయారు. గీతకి పెట్టాల్సినవాటిగురించీ, పెళ్ళిఖర్చులగురించీ చర్చించుకోవటానికి. తనదగ్గిర ఎలాగా డబ్బులేదు, వ్యవహారం చెయ్యాల్సింది వాళ్ళేకాబట్టి విజ్జెమ్మ కలగజేసుకోలేదు. చెప్పాల్సినవి ఏవేనా వుంటే వాళ్ళే చెప్తారు. ఆవిడ్ని ఉపేక్షించరు. విజయో, విద్యో అయుంటుంది ఆవిడ పేరు. పేరుతో పిలిచేవాళ్ళంటూ ఎవరూ లేరుకాబట్టి అది మరుగునపడిపోయింది. అమ్మ, అమ్మమ్మ, మామ్మ, వదినగారు, అత్తగారు, చెల్లెమ్మాలాంటి పది-పాతిక పిలుపులకి అలవాటుపడిపోయింది ఆవిడ.
తనూ తులసీ మాట్లాడుకున్నవీ, ఆడుకున్నవీ అక్కకి పూసగుచ్చాడు కృష్ణ. అక్కాతమ్ముళ్ళిద్దరికీ ఐదేళ్ళ తేడా. ఇద్దరికీ మధ్యని పడుకుంది విజ్జెమ్మ. కృష్ణ మాటలాపేసి నిద్రలోకి జారిపోయాడు. గీతకి నిద్ర పట్టలేదు.
“మామ్మా! మనుషులంతా ఒకలాగే పుడతారు, ఒకలాంటి మనుషులమధ్యే పెరుగుతారు. ఐనా కొందరు మంచిగానూ కొందరు చెడ్డగానూ ఎందుకుంటారు?” అడిగింది.
“జన్మజన్మ వాసనలు మనని వదలవు గీతా! అందుకే మంచిగా వుండమనీ, మంచిపనులు చెయ్యమనీ, ఒకళ్ళకి హాని చెయ్యద్దనీ పెద్దవాళ్ళం మీకు పదేపదే చెప్తూ వుంటాం. పాపపుణ్యాలమాట ఎలా వున్నా, వదిలించుకోవాలనుకున్నా, చెడుకర్మల ఫలం మనని వదలదు” అందావిడ. “ఎందుకమ్మా? ఏమైంది? మేం వెళ్ళేప్పుడు బాగానే వున్నావు. వచ్చేసరికి అదోలా వున్నావు. ఎవరేనా వచ్చారా? ఏమైనా అన్నారా? బంగారుతల్లివి, నిన్ను అనేవాళ్ళెవరే?” అడిగింది. గీతలో మళ్ళీ సందిగ్ధం చెప్పాలా వద్దా అని.
“వచ్చే జన్మలో మళ్ళీ అందరం కలిసే పుడతామా?” సాలోచనగా అడిగింది.
“ఏ జన్మ రుణాలు ఆ జన్మలోనే తీరుతాయి. కర్మమాత్రమే వెంట వస్తుంది. ఆ కర్మకి అటుకొసన వుండే మనుషులు వాళ్ళ రుణాలు తీర్చుకోవడానికి లేదా అందుకోవడానికి కొత్తజన్మలో మనకి బంధుమితృలౌతారు. చిన్నపిల్లవి, ఇవన్నీ నీకెందుకు? అత్త, అమ్మమ్మగారు ఎంత సంతోషపడ్డారో తెలుసా? వాళ్ళు చాలా మంచివాళ్ళు. అత్తప్పుడు కట్నం తీసుకోలేదు. నీకూ వద్దన్నారు” అంది మాటమార్చి.
“కట్నం తీసుకోవట్లేదుగాబట్టి మంచివాళ్ళా?” గీత అడిగింది.
“నా మనవడికేమే, బంగారం” అందావిడ. వాసు ప్రస్తావనతో గీత చెంపలు ఎర్రబడ్డాయి.
“ఈ సంబంధం వప్పుకుని చాలా మంచిపని చేసావు గీతూ! ప్రమీలత్తావాళ్ళకి మనం తూగలేం. పిల్లల్ని ఎత్తుభారం చదువులు చదివిస్తున్నారు. బోల్డన్ని అప్పులు చేస్తున్నారు. అవన్నీ మీ నాన్న నెత్తిన పడతాయి. వాడు నలిగిపోతాడు. కృష్ణకీ ఏమీ మిగలదు. తల్లీతండ్రీ పడే కష్టం తెలుసుకోవాలమ్మా, పిల్లలు. నీలాంటి కూతుర్ని కన్నాడు. మీ నాన్న అదృష్టవంతుడు” అంది.
సమాజం నడిచే తీరులో ప్రేమ, యిష్టం ఇవన్నీ చిన్నవిషయాలు. డబ్బు ముందు ఎలాంటి ప్రాధాన్యతా లేనివి. వాసు, గీత ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు యిష్టపడ్డారనేది రామారావుకి మిగతా చెల్లెళ్ళూ, బావగార్లముందు చెడ్డపేరు రాకుండా వుండేందుకు వుపయోగపడింది. అదే మనిషి, చేతినిండా డబ్బుండి వుంటే సుధీర్‍నే అల్లుడిని చేసుకునేవాడేమో! వాసుకేం వుంది, సుధీర్ చక్కగా డాక్టరని కూతురికి నచ్చచెప్పేవాడేమో! లేదా డబ్బున్న యింటి ఆడపిల్లగా గీత ఆలోచనలే మరోలా వుండేవేమో!
డాబామీద భార్యాభర్తలిద్దరికీ చర్చలు నడుస్తున్నాయి. డాబా అని రామారావుదేం అధునాతన కట్టడం కాదు. ఇల్లు, స్థలం పెద్దవే. ఇల్లంతా గూనపెంకు. ముందు రెండుగదులుమాత్రం మిద్దె. దాన్నే వీళ్ళు డాబా అనేది. దాని వెనక ఒక కథ వుంది. దూరపుబంధువులెవరో పిల్లల్లేకపోతే రామారావు తాతని పెంపు తీసుకున్నారు. వాళ్ళు బాగా ధనవంతులు. ఆయన పెంపు వెళ్ళాక వాళ్లకి పిల్లలు పుట్టారు. పిల్లవాడిని తిరిగిపంపించేసారు. ఐతే అలా పంపిస్తూ ఒక మంచిపని చేసారు. స్థలాలకీ, ఇళ్ళకీ ఎలాంటి విలువా లేని రోజుల్లో వూరికి చివర్న విసిరేసినట్టుండే యీ యింటిని వాళ్ళు చిన్నధరకి వేలంపాటలో కొన్నారు. నిరుపయోగంగా వున్న ఆ యింటిని అతని పేర్న పెట్టారు. వీళ్ళూ చాలాకాలం వదిలేసి, అన్యాక్రాంతం కాకుండా వుండేందుకు రామారావు తండ్రికాలంలో వచ్చి చేరారు. ఆయనకి గంపెడుమంది పిల్లలు కావడంతో యిల్లు బాగానే వుపయోగానికి వచ్చింది. పెంకు తిరగేయించుకుంటూనూ, చిన్నచిన్న మరమ్మత్తులు చేయించుకుంటూనూ నెట్టుకొస్తున్నాడు రామారావు.
“వాళ్ళు కట్నం వద్దన్నారని మనం అసలేం పెట్టకపోతే బావుండదు. నాకు మావాళ్ళు పెట్టిన చంద్రహారం పెట్టేస్తాను. అదో ఐదుకాసులు. జత గాజులు, సూత్రాలగొలుసు, శతమానం చేయిస్తే సరిపోతుంది. దాని మెళ్ళో వున్న చిన్నగొలుసు చెరిపించి ఇంకాస్త వేసి, సూత్రాలగొలుసు చేయిద్దాం. అతనికి వెండికంచం, గ్లాసు, భటువు కొనాలి. దాని జీతం వాడకుండా పక్కని పెట్టి చీటీ వేస్తున్నాను. అది పాడి మా అమ్మ చేతికిస్తే చేయిస్తుంది. చీటీ నెమ్మదిగా కట్టుకుందాం. ఇక పెళ్ళి ఖర్చులకి చూసుకోవాలి” అంది యశోద ఆ బాధ్యత అతని భుజాన్న వేస్తూ.
“అందరూ వుద్యోగస్తులేకాబట్టి అన్ని ఆఫీసులవాళ్ళూ వస్తారు. ఇంటిపక్క స్థలంలో పందిరి వేసి చెయ్యడం కుదరదు. మంటపమో, సత్రమో మాట్లాడుకోవాలి. భోజనాల ఖర్చు, దీనికి పట్టుచీర, మరో రెండు కాస్త ఖరీదైన చీరలు, మీ చెల్లెళ్ళకుటుంబాలకి బట్టలు, మంగళహారతి, ఇవన్నీ చూసుకోవాలి. మీ చెల్లెలు సాంప్రదాయంగా చెయ్యాలంటోంది. అదేమిటో నాకు తెలీదు. అన్నిటికీ కలిపి ఇంకో పాతికో ముప్పయ్యో తప్పదు” అంది. చెల్లెళ్ళపెళ్ళిలా కాదిది. ఏది వుంటే దాంతో సరిపెట్టడం కాదు. పట్టుచీర, నగలు లేకుండానే వాళ్ళ పెళ్ళిళ్ళయాయి. ఇంట్లో యింట్లో వేడుకల్లా జరిగిపోయాయి. పప్పన్నం, పులిహార, బూరెతో సరిపోయింది. భార్య సగం బరువు మోస్తానన్నా గిజగిజలాడాడు రామారావు.
“ఖాళీగా వున్న స్థలం బేరం పెడదాం” అన్నాడు.
ఆమె చురుగ్గా చూసింది. “అలా చేస్తే నలుగుర్లో నవ్వులపాలౌతాం” అంది. “అదీకాక, అటు లక్ష్మి, ఇటు గీతకూడా బాధపడతారు. నిదానంగా ఆలోచించండి. ఇంక నిద్రొస్తోంది, పడుకుందాం” అని లేచింది.
మరుసటిరోజు భార్యాభర్తలిద్దరూ ప్రమీల యింటికి బయల్దేరారు. వాళ్లకి కోపాలు రాకుండా చూసుకోవలసిన బాధ్యతొకటి వుంది రామారావుకి.


మనసులో ఎలాంటి వుద్దేశమూ పెట్టుకోకుండా ఒక సహజన్యాయంలా రవి యింట్లో గీత అన్నమాటలు అన్ని కుటుంబాలవాళ్లకీ తెలిసాయి. చురుక్కుమని తగిలాయి. సుధీర్ని పెళ్ళిచేసుకోకపోవటానికి కారణాలుగా బైటికివచ్చాయి. ఐతే గీత వాసుని చేసుకోవాలనుకున్నది ఈ సాధ్యాసాధ్యాలన్నీ బేరీజువేసుకుని కాదు. ఆమెకి వాసుపట్ల వున్నది మనసులోంచీ, అంత:కరణంలోంచీ వచ్చిన యిష్టం. అతనికి ఆమె ప్రాణనాడి. ఐతే యీ ప్రహసనం అంతట్లో గీత, వాసు ఒకర్నొకరు యిష్టపడ్డారన్నది అప్రస్తుతమైన విషయంలా మారిపోయింది. ప్రమీల అడిగినంత ఖర్చుకి రామారావు ముందుకి రాలేక కూతురిచేత వాసు విషయం అనిపించాడన్నది కచ్చితమైన నిజంలా స్థిరపడిపోయింది గురుమూర్తికి. గీతచేత ఎందుకు చెప్పించాలి? గీత ఎందుకు చెప్పాలి? రామారావే నేరుగా అనచ్చుకదా? అనే కోపం రవ్వంత మొదలైంది. రవి చెప్పిన విషయాలు ప్రమీల కొంత నమ్మింది. ఇంకొంత భర్తవైపు మొగ్గుచూపింది.
రామారావు, యశోద వచ్చినప్పుడు ప్రమీల, భర్త, పిల్లలు అందరూ హాల్లోనే కూచుని వున్నారు. వీళ్ళ రాక అనుకున్నదే. పెద్ద ఆశ్చర్యాలేమీ లేకుండా స్వాగతించారు.
“బావగారూ! మీరు నన్ను మన్నించాలి. నాకున్నది ఒక్కతే కూతురు. వాసైనా, సుధీరైనా నాకొక్కటే. ఇద్దరూ నా మేనల్లుళ్ళే. ప్రమీల అడిగినదికూడా సమంజసమైన కోరికే. మేనల్లుడిని చదివించుకుని పిల్లనిచ్చుకున్న సందర్భం మనింట్లోనే వుంది. రవికి అలాగే జరిగింది. మీకు తెలీనిది కాదు. అల్లుడు పెద్ద డాక్టరంటే నాకూ గర్వంగానే వుండేది. కానీ, గీత వాసుని చేసుకుంటానని పట్టుబట్టింది. నాతో మామూలుగా అందేమోననుకున్నాను. కానీ రవి యింట్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసినదే. ఎవరికి ఎవరు రాసిపెట్టి వుంటారో చెప్పలేం. మీరు పెద్దమనసు చేసుకుని నాకొక అన్నగారిలా శుభకార్యానికి సహకారం అందించాలి” పలకరింపులయ్యాక, రామారావు గురుమూర్తితో. ఆడబడుచులముందు యశోద ఎక్కువగా మాట్లాడదు. అవడానికి రామారావు చెల్లెళ్ళైనా, ఈమెకన్నా మొదటిముగ్గురూ పెద్దవాళ్ళే. నిర్మలకీ, అరుణకీ మధ్యన వుంటుంది ఆమె వయసు. అదొక బెరుకు. అందులో ప్రమీల వుద్యోగంకూడా చేస్తోందని ఇంకాస్త. వాళ్లపరంగా నచ్చనివి ఏవేనా వుంటే రామారావుకి చెప్తుంది. అతను అటూయిటూ సర్ది చెప్పుకుంటాడు.
ఇప్పుడు సుమతిని దగ్గిరకి తీసుకుని కూర్చుంది. “ఎలా చదువుతున్నావే? ఐపోతుందా ఈ సంవత్సరంతో?” అడిగింది.
“అప్పుడే ఎక్కడత్తా! ఇప్పుడు పీజీ ఔతుంది. తర్వాత ఇంకో నాలుగేళ్ళు కనీసం” అంది.
మనసులో చెలరేగుతున్న సంచలనం ముఖం అద్దం పట్టకుండా వుండేందుకు ఎవరికి వాళ్ళు కష్టపడ్డారు. సుధీర్‍ది ఇంకా పెద్ద కష్టం. రామారావు చెప్పేదాకా ఆగి, అవగానే లేచాడు.
“కంగ్రాట్స్ మామయ్యా!” అంటూ వెళ్లబోతుంటే ఆపి చెయ్యందుకుని పక్కని కూర్చోబెట్టుకున్నాడు.
“సుధీర్! నువ్వుకూడా మనసులో ఏదీ పెట్టుకోకూడదు. మీరంతా కలిసి పెరిగిన పిల్లలు. వాళ్ళిద్దరికీ ముడిపడి వుంది. అంతే. అంతకన్నా నేను చెప్పలేను. నీకోసంకూడా ఎక్కడో ఒక బంగారుతల్లి ఎదురుచూస్తూ వుంటుంది” అన్నాడు ప్రేమగా.
“అలాంటిదేం లేదు మామయ్యా! వాళ్ళిద్దరూ పైవాళ్ళేం కాదుగా?” అన్నాడు సుధీర్ నెమ్మదిగా.
“కుదిర్చేసుకున్నారా అన్నయ్యా? మాటలూ అవీ అయ్యాయా?” అడిగింది ప్రమీల. రామారావు తలూపాడు.
“ఎవరెవరు వెళ్ళారు? త్రిముర్తులుగారు వచ్చారా?” ఆరాగా అడిగింది.
“లేదు ప్రమీలా! మనింటి విషయంకదా, తీసుకెళ్ళలేదు. లక్ష్మి తనంతట తను మా యింటికి వచ్చి అడిగింది. అందుకని నేనూ యింక నేరుగా మాట్లాడేసాను ” అంటూ అక్కడ జరిగిన వివరాలు చెప్పాడు.
“వాళ్ళు కట్నం అక్కర్లేదన్నారు ప్రమీలా! నావొక్కడిదే నిర్ణయమైతే మీ అందరికీ చేసినట్టే దానికీ చేసి పంపిద్దును. కానీ వదినకి కొంచెం ఘనంగా చేసుకోవాలని వుంది. ఆవిడకి ఆవిడ పుట్టింటివాళ్ళు పెట్టినవి దానికి పెడతానంది. పైన ఇంకాకొద్దిగా కొనవలిసినవి వుంటాయి. పెళ్ళిఖర్చులకి చూసుకోవాలి. పాతికముప్పైవేలేనా కావాలి. ఇంటికి ఆనుకుని వున్న ఖాళీజాగా అమ్మేద్దామంటే తను వద్దంది. ప్రావిడెంటుఫండులో ఏమీ లేదు. ఎప్పటికప్పుడు తీసేస్తున్నాను. ఒక చీటీ వుంది. అది పాడతాను. ఇకపోతే నాన్నలాగే ఆయన మీకోసం దాచినట్టు గీత పుట్టినప్పట్నుంచీ పదీ, పాతికా దాచినవి కొంత పోగుపడ్డాయి. అదెంత వుందో చూసుకోవాలి. మిగిలినది ఎక్కడేనా అప్పు తెచ్చి, కొద్దికొద్దిగా తీరుస్తూ, రిటైరుమెంటుదాకా నెట్టుకెళ్ళాలి. ఇదంతా గీతకి తెలీకూడదు. తెలిస్తే ఈ ఖర్చంతా ఎందుకని గొడవచేస్తుంది. లక్ష్మిముందూ ఎబ్బెరికంగా వుంటుంది” దాపరికం లేకుండా లెక్కలన్నీ చెప్పేసాడు. ప్రమీల అన్నగారికేసి తదేకంగా చూసింది. కడుపులో ఏదో కదిలినట్టైంది. అభిమానపడడు. పౌరుషపడడు. ఎవరినుంచీ ఆశించడు. పని అవ్వడం ముఖ్యం అన్నట్టు ఏదీ పట్టించుకోడు. ఎన్ని లెక్కలు పెడుతున్నాడు! ఎక్కడెక్కడినుంచో కొసలు లాక్కొచ్చి డబ్బు సమకూర్చడానికి ముళ్ళు పెడుతున్నాడు.
“ఆ లెక్కలన్నీ ఇప్పుడు అవసరమా?” చిరుకోపంతో అంది యశోద.
“పోనీలే యశోదా! మాతో కాకపోతే ఇంకెవర్తో చెప్తాడు! ఇదే ఆఖరుపెళ్ళి. దీంతో మీ బాధ్యతలు తీరతాయి” అంది ప్రమీల.
“అప్పుడే ఎక్కడ? కృష్ణ చదువయ్యి వుద్యోగం రావాలి. అప్పుడుకదా, నిశ్చింత!” అన్నాడు రామారావు. గురుమూర్తికూడా కలగజేసుకుని మాట్లాడాడు. “మేమంతా వున్నాం. మీరేం కంగారుపడకండి. అన్నీ సవ్యంగా జరుగుతాయి” అన్నాడు. చేసినా చెయ్యకపోయినా ఆ భరోసా చాలు రామారావుకి. లేకపోతే ఈ అలిగే అల్లుళ్ళని సాగదియ్యడం అతనికి సాధ్యపడేదికాదు. అతనిమీద కోపం తెచ్చుకుని లాభంలేదని వాళ్ళకీ తెలుసు. ఏదైనా వుంటేకదా, అలగటాలూ, సాధించుకోవటాలూ. భార్యలదగ్గిర కొంచెం అసంతృప్తి చూపిస్తారు. అక్కడితో సరి.
ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన ఆడపిల్లలు అత్తింటి గొడుగుకింద తోటికోడళ్ళుగా, దేవుడిచ్చిన అక్కచెల్లెళ్ళుగా కొంతవరకేనా కలిసిమెలిసి వుండగలరు. అంతమంది మగపిల్లలు తోడల్లుళ్ళుగా కలిసివుండటం కష్టమే. ఆడవాళ్లది సంపాదించుకుని దాచుకోవాలన్నంతవరకూ వూహమాత్రమే. ఆలోచనవరకే. అది లోలోపలి స్వయంపాకం. మగవాళ్ళది ఆచరణ. తోడల్లుళ్ళు కలవలేకపోవడానికి అదికూడా ఒక కారణం. రామారావు తమకి పెట్టడం మాట అటుంచి అతనే తమని అడక్కుండా వుంటే చాలనుకున్నాడు గురుమూర్తి. ఈ భయం వుండటంచేత అతను మిగతావాళ్ళని తనచుట్టూ తిప్పుకోలేకపోయాడు. పెళ్ళైన చాలాకాలందాకా అతను ప్రమీల జీతంలో పైసపైసకీ లెక్కకట్టుకునేవాడు. తనకి తెలీకుండా పుట్టింటివాళ్ళకి పెడుతోందేమోనని అతనింట్లో తల్లి తెగ నిఘాపెట్టేది. ఇప్పుడు అతని తల్లి లేదు. పాతికేళ్ళ వైవాహికజీవితంలో ప్రమీలే అలా అన్నదమ్ముడికి సాయం చెయ్యకుండా వుండేలా అలవాటుపడిపోయింది.
“ఈయన మాటలకేమి వదినా, డబ్బు దానికదే పుడుతుంది. అందరూ తలో చెయ్యీ వేసి శుభకార్యం ఐందనిపించాలి. మా పెళ్లయేసరికే మీ అందరికీ ఐపోయాయి. పద్మ పెళ్ళి మా చేతులమీదే జరిగినా, అప్పుడు నాకంత అనుభవం లేదు. పెద్దవారు, మీరు, అన్నయ్యగారు మా వెనక నిలబడి యిదంతా ఐందనిపించాలి” అంది యశోద.
“త్రిమూర్తులున్నాడుకదా?” అంది ప్రమీల నవ్వుతూ. అది చురక. రామారావుకి. గురుమూర్తికి ప్రమోదం.
“ఆయనా? ఈయన పొరపాట్లేవేనా చేస్తే మొట్టికాయలు వెయ్యడానికి పనికొస్తారు. అంతే. వేడుకంటే ఆడపిల్లలదే మరి. మీ చెల్లెలు అన్నీ పద్ధతిగా చెయ్యాలంది. మనసుల్లో ఏవీ పెట్టుకోకుండా అందరూ నిలబడాలి. మా బలం, బలగం మీరే. మరి వస్తాం” అంటూ లేచి నిలబడింది యశోద. రామారావు అనుసరించాడు. వాళ్ళని సాగనంపి వచ్చారు భార్యాభర్తలు. ఇద్దరి మనసులకీ ముసురు కమ్మినట్టే వుంది. చేసింది తప్పా, వప్పా? పర్యవసానం కళ్ళముందు కనిపిస్తున్నా ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారు. తన వయసులో సగంకూడా లేనిపిల్ల, తన కళ్ళముందు పుట్టి పెరిగిన పిల్ల తీసుకున్న నిర్ణయం ఒక చెంపదెబ్బలాగే అనిపించింది ప్రమీలకి. గురుమూర్తి బయటపడలేదు. అంతే.
వాళ్ళు తిరిగివచ్చేసరికి సుధీర్ ఇంకా అక్కడే కూర్చుని వున్నాడు. కూర్చున్నచోటికి అతుక్కుపోయి సర్వం కోల్పోయినట్టు చూస్తున్నాడు.
“నేను ఆరోజే చెప్పానమ్మా! ఇలాంటి విషయాల్లో ఫెయిర్‍గా వుండాలని. నువ్వు వినలేదు. మన కళ్ళు వాళ్ళ యింటిమీద పడ్డాయనుకున్నారు. వాళ్ళ నాన్నకి నిలవనీడ లేకుండా చేస్తున్నామని భయపడింది గీత. అది వాసుని చేసుకోవటం ఒక్కటే కాదమ్మా, ఇలాంటి ఆలోచనతో చేసుకుంటోంది చూడు, అదెంత బాధగా వుందో తెలుసా?” అన్నాడు నిలదీస్తున్నట్టు.
“అంత తప్పేం చేసాంరా, ఒక ఆడపిల్లకోసం మమ్మల్ని నిలదీస్తున్నావు? మేం ఏం చేసినా మీ మంచికోసమేకదా? ముందు నీ చదువు గట్టెక్కితే కృష్ణని వదిలేస్తామా? నీ ప్రవర్తన మాకెంత బాధ కలిగిస్తోందో తెలుస్తోందా? ” కోపంగా అంది ప్రమీల.
“నా చదువొక్కటేనా? చెల్లి చదువు, పెళ్ళి. తమ్ముడి చదువు. ఈ వరసలో కృష్ణ ఎక్కడుంటాడు? బానే ఆలోచించుకున్నారమ్మా, వాళ్ళు” తగ్గకుండా అన్నాడు సుధీర్.
“షేమ్ ఆన్ యూ సుధీర్. ఇంతంత చదువుకున్నావు. ఎందుకురా ఆ చదువు, చట్టుబండలవను? నువ్వు యిష్టంలేదని తెగేసి చెప్పిన పిల్లకోసం అమ్మానాన్నల్ని నిందిస్తున్నావు. ఇప్పుడు ఖర్చుపెట్టట్లేదా మీ మామయ్య? లెక్కలన్నీ చెప్పాడుకదా? మరీ లేనివాళ్ళైతే కాదుకదా? ఆ పిల్ల నిన్నే చేసుకుంటానంటే అప్పుడూ పెట్టేవాడు. పిల్లలకోసం కాక దేనికిరా, ఈ సంపాదనలూ, యిళ్ళూ వాకిళ్ళూను? మేం అడిగిందిమాత్రం మూటకట్టుకుని దాచుకోవడానికా? ఈ చాలీచాలని మధ్యతరగతిబతుకుల్లోంచీ మిమ్మల్ని దాటించాలని నానాగడ్డీ కరిచి చదివిస్తున్నాం. ప్రయోజకుడివయ్యావనుకుంటే ఈరోజుకి మమ్మల్ని నిలదీసేంతవాడివయ్యావు” అని, గురుమూర్తి విసురుగా లేచి చెప్పులేసుకుని బైటికి వెళ్ళిపోయాడు. సుధీర్‍కూడా తనగదిలోకి వెళ్ళిపోయాడు. వెంట వెళ్లమన్నట్టు కూతురికి సౌంజ్ఞచేసింది ప్రమీల. సుమతి వెళ్ళింది. సుమంత్ వెళ్లబోతూ ఆగాడు.
స్టడీ టేబుల్‍ముందు కూర్చుని టేబుల్‍మీద తలవాల్చుకుని వున్నాడు సుధీర్.
“సుధీర్!” నెమ్మదిగా పిలిచింది.
“ఐపోయింది సుమతీ! గీత ఇంక నా జీవితంలో వుండదు. మనింట్లో వుండదు. నాకేమీ కాదు. తమ్ముడి భార్య. పిన్నికోడలు. అంతే. ఎప్పుడేనా బయటివాళ్ళలాగా కలుసుకోవటమే. హద్దుల్లో వుండి మర్యాదగా మాట్లాడుకోవటమే. తట్టుకోలేకపోతున్నానే” అని చిన్నపిల్లవాడిలా ఏడ్చేసాడు. ఇటువంటి పరిస్థితిని సుమతి వూహించలేదు. అందరూ కలిసి తిరగడం, నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ గడపడమే జరిగింది యింతదాకా. కాస్త ముందో వెనుకో అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతాయన్న వూహా వుంది. గీత పెళ్ళి ఈ మలుపు తీసుకుంటుందనుకోలేదు. ఆమె వాసుని చేసుకుంటాననడం ఒక ఆశ్చర్యం. సుధీర్ యిలా ఆమెకోసం బాధపడ్డం మరీ ఆశ్చర్యం. ఇంతంత యిష్టాలని వీళ్ళు ఎలా దాచుకున్నారు?
“సుధీర్!” అతని పక్కకి కుర్చీ లాక్కుని కూర్చుంది. “గీత మనింటికి కోడలిగా వస్తుందంటే మాకూ సంతోషంగానే వుండేదికదా? కానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు యిష్టపడి చేసుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వేం చెయ్యగలవు? ఒక్క నిముషం దానిగురించి ఆలోచించు. చిన్నప్పట్నుంచీ చాలా సాదాగా పెరిగింది. మనకి వున్న కంఫర్ట్స్ ఏవీ వుండేవి కాదు దానికి. ఇదంతా ఇండైరెక్టుగా మనందరికోసమేకదా? అందుకే దాన్ని అమ్మావాళ్ళూ నెత్తిన పెట్టుకుని చూసుకునేది. మనకికూడా ఏం చెప్పేవారు? దాన్ని ప్రేమగా చూసుకోవాలని. అది వాసుని యిష్టపడింది. దాని కోరిక తీర్చాల్సిన బాధ్యత మనకి లేదా? మనింట్లో యిలాంటి గొడవ జరిగిందని తెలిస్తే వాసు దాన్ని చేసుకుంటాడా? చేసుకున్నా యిద్దరూ సంతోషంగా వుంటారా? ఏదో తప్పు జరిగినట్టు జీవితమంతా బాధపడరా? నువ్వే ఆలోచించు. వాసు మాత్రం? వాడూ మన కజినే కదా? వాడు నీకోసం మనసు మార్చుకుంటే అది బావుంటుందా? అప్పుడు నువ్వు గీతని చేసుకుని సంతోషంగా వుండగలవా? కొన్ని నిర్ణయాలు జరిగిపోతాయి. వాటిని సమూలంగా మార్చితే ఎదురయ్యే పరిస్థితులు అంత సానుకూలంగా వుండవు” అంది నెమ్మదిగా.
నిస్సహాయంగా చూసాడు సుధీర్. “అది వాసుని యిష్టపడటం వట్టిమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుకోగా ఎప్పుడూ చూడలేదు నేను. ఎప్పుడు చెప్పుకున్నారు ఒకళ్లంటే ఒకళ్ళకి యిష్టమని? కనీసం మనందర్లో ఎవరో ఒకరికి తెలియాలికదా? అమ్మ అలా అనకూడదు. వాళ్ల నాన్న ఎక్కడ వప్పేసుకుంటాడో, ఎక్కడ ఆయనకి కష్టమౌతుందోనని నిర్ణయం తీసేసుకుంది. చిన్నప్పుడూ అంతే. కృష్ణమీద ఈగ వాలనిచ్చేదికాదు. అది గీతే. దాని ఆలోచనలు అలానే వుంటాయి. చాలా స్పష్టంగా వుంటాయి. వాటిల్లో ఎలాంటి తడబాటూ వుండదు” అన్నాడు.
మనుషులు తమకి చాలా విషయాలు తెలుసనుకుంటారు. తమ పరోక్షంలో జరిగిన విషయాలనికూడా వూహించి ఆ వూహలే నిజమనుకుంటారు. తమకి అనుకూలంగా మార్చుకుంటారు. వాటిల్లో వుండేది అర్ధసత్యమన్న విషయం ఎప్పటికోగానీ తెలీదు. అసలు తెలీకపోవచ్చు కూడా. సుధీర్‍ది యిప్పుడలాంటి పరిస్థితి.
“సరే, నువ్వన్నదే నిజమనుకుందాం. ఇప్పుడది తనమాట వెనక్కి తీసుకుంటుందా? అలా తీసుకున్నాక నువ్వు చేసుకుంటావా? నీ మనసులో ఒక అనుమానంలాగో, అపరాథభావనలాగో వుండదూ? వాసుని పక్కకి తప్పించి దాన్ని పెళ్ళాడానని గర్వంగా చెప్పుకుంటావా? అలా పెరగలేదు మనం. నీ విషయం తెలిస్తే వాసుకీ అలానే వుంటుంది. ముల్లుతో సహజీవనం ఎవరూ చెయ్యరు. గీతకి వరసైన పిల్లలు మీరిందరుండగా ఎప్పుడూ మనిళ్ళలో ఎవరికిచ్చి చెయ్యాలన్న సంభాషణ జరగలేదు. ఇంతమందిమధ్య దాన్ని ఒక తాయిలంలా నిలబెట్టడం ఇష్టంలేక. చిన్నప్పుడే పేర్లు పెట్టేసి వుండచ్చు. పెద్దయ్యాక వాళ్ల యిష్టాలు మారితే? వాడు అప్రయోజకుడైతే? ఇన్ని ఆలోచించే, యింత సంస్కారం వుండే కుటుంబం మనది. నువ్వు సమస్యవి కావద్దు” అంది నచ్చజెప్తున్నట్టు. అతను కాస్త తేరుకున్నాడు.
“చాలా పెద్దవాళ్లైపోయారే మీరంతా” అన్నాడు చిన్నగా నవ్వి. కళ్ల తడి యింకా ఆరలేదు.
“నాన్న చాలా బాధపడుతున్నారు. ఎప్పుడేనా ఆయన్ని ఎదిరించి మాట్లాడామా? నీకు నచ్చకపోయినా, అమ్మావాళ్ళది తప్పనిపించినా కూడా అలా మాట్లాడకు. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అమ్మానాన్నలతో దెబ్బలాడి ఇంకొంత డేమేజి చేసుకుందామా? మాకు చెప్పాల్సినవాడివి, నువ్వేంట్రా, ఇలా?” అంది. అతను తలూపాడు.
మొత్తం యింట్లో మూడు పడగ్గదులు. అన్నదమ్ములిద్దరికీ కలిపి ఒక గది వుంది. తల్లీకూతుళ్ళిద్దరికీ కలిపి ఒకటి. గురుమూర్తికి ఒకటి. ఒకొక్కసారి కొడుకుల దగ్గిర పడుక్కుంటాడతను. మరోసారి పిల్లలు ముగ్గురితో రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడతాడు. ఇప్పుడేదో యింట్లో చీలిక వచ్చినట్టైంది. ఎవరి గదుల్లో వాళ్ళు వుండిపోయారు. రాత్రి సుమంత్ చాలాసేపు ఈ విషయమే సుధీర్‍తో మాట్లాడాడు.
“అన్నా! గీత, వాసూ ఇద్దరూ పైవాళ్ళు కాదు. పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనది. మనం నేర్చుకున్న చదువుది. ఇది పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్ళి కాదు. నేను రవిమామయ్యని అడిగి, విషయాలన్నీ తెలుసుకున్నాను” అని అనుక్రమణికంతా యిచ్చాడు. “నలుగురు మరదళ్ళు నీకుంటే ఎవర్ని చేసుకోవాలనే ఛాయిస్ నీకుంటుంది. ఇప్పుడు ఛాయిస్ తనది. తన నిర్ణయం మనం గౌరవించాలి. కట్నం తీసుకోవడానికీ, మన ఖర్చులు అవతలివాళ్లమీద రుద్దడానికీ నేనూ వ్యతిరేకమే. అమ్మావాళ్ళూ అలా ఆశించడం తప్పే. కాదనను. కానీ మనకోసం తలకిమించిన బరువు మోస్తున్నారు. కొంచెం వెసులుబాటు కావాలనుకున్నారు. మామయ్య గీతకి ఇంకా మంచి జీవితం ఇవ్వచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. నేను ఇంకా చదువుతాననో, ఇల్లూవాకిలీ అమ్మేసేనా సుధీర్‍తో పెళ్ళి చెయ్యమనో అడిగిందా అది? చదువు ఆపేసి వుద్యోగంలో చేరిపోయింది. వాసుని చేసుకుంటోంది. తన తండ్రికి గీత యిచ్చిన గౌరవం అది. మనంకూడా మన అమ్మానాన్నలకి ఆ గౌరవం యివ్వద్దా? నాకు ప్రేమగురించీ, నువ్వు పడుతున్న బాధగురించీ తెలుసు. తెలీదనుకోకు. కానీ అది బయటికి రాకూడదు. గీతకోసం. వాసుకోసం” అన్నాడు.
ఎవరు చెప్పినా అదేమాట. మరుసటిరోజు ప్రమీలకూడా కొడుకుతో అంది. “సుధీర్, ఆవేశం తగ్గించుకో. మీరు పెద్దపిల్లలయ్యారు. సమాజం పోకడ తెలుసుకోవాలి. తన భార్యని మరొకడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడంటే ఏ మగవాడూ సహించలేడు. ఎంతటి సంస్కారమూ మట్టిలో కలిసిపోతుంది. ఇలాంటి విషయం బైటికి వస్తే వాసు దాన్ని చేసుకోడు. చేసుకున్నా ఏలుకోడు. దాని జీవితం పాడుచెయ్యకు. ఇక్కడ జరిగినవి ఇక్కడ మర్చిపో. ఎప్పట్లాగే వుండు. ఈ పెళ్లైపోయిందంటే నీ చదువు నీది. నీ వుద్యోగం నీది. పెళ్ళిళ్ళకీ వేడుకలకీ తప్ప మీరు మళ్ళీ కలుసుకునే సందర్భాలు పెద్దగా వుండవు. వాటికేనా నువ్వు రావాలనుకుంటేనే. నన్ను నువ్వు క్షమించనక్కర్లేదు. ఈ ఒక్కసాయం చెయ్యి, చాలు. అది నా అన్న కూతురు. నాకు జీవితాన్నిచ్చిన మనిషి వాడు” అంది కన్నీళ్ళతో. రాత్రంతా చాలాసేపు ఏడ్చిందని అర్థమైంది సుధీర్‍కి. ఆమెని ఓదార్చాలని అనిపించలేదు. సాదాగా తలూపాడు. కొత్తప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు అనిపించింది. మనసు చంపుకోవటం, ఏమీ జరగనట్టు నటించడం నేర్చుకోవాలి. తనకి పరిచితమైన ప్రపంచం దూరం జరుగుతున్నట్టనిపిస్తోంది. మనసు తనలోంచీ వెళ్ళిపోయి వట్టి శరీరం మాత్రమే మిగిలినట్టు, అంతా కలలా వుంది. వాస్తవంగా జరుగుతున్నట్టు లేదు.
కొడుకు చూపులోనూ ప్రవర్తనలోనూ వచ్చిన మార్పు ప్రమీలని కలవరపెట్టింది. వీడికి గీతంటే అంత యిష్టమా? ఏమిటీ యిష్టం? దాని రూపురేఖలు ఎప్పుడూ తనకి పొడగట్టలేదు. గీతకి వాసంటే యిష్టం పుట్టడమేమిటి? కలివిడిగా తిరిగిన పిల్లల్లో ఈ వేరువేరు ప్రేమలేమిటి? అసలు ప్రేమంటే ఏమిటి? ఇన్నేళ్ళు కాపురం చేసినా, గురుమూర్తికి ఏదేనా అనారోగ్యం వస్తే సాటిమనిషిగా కొంతా, భార్యగా కాస్తెక్కువో బాధపడింది తప్పిస్తే ఇలా తల్లడిల్లలేదు. తాము ఒకరికొకరు లభ్యమయ్యారు, విడిపోవడానికి వీలులేని బంధాలు తమమధ్య ఏర్పడ్డాయన్న భరోసానా? అలభ్యత మరో పేరు ప్రేమా?
ఈ చదువు సుధీర్ కోరుకోలేదు. తమ ప్రోద్బలంమీద చదువుతున్నాడు. అతననేకాదు, ఏ పిల్లలూకూడా తల్లితండ్రుల ప్రోద్బలం, కొన్నిచోట్ల బలవంతం లేకపోతే చదవరు. చదవలేరు. చదువు, చదువుకునే స్థలాలు వైతరణిలాంటివి. సీనియర్ల రేగింగు, తోటిపిల్లలు కాస్త తక్కువస్థాయిలో ఏడిపించడం, సమాజంలోని మొరటుతనం పరిచయంకావడం, డబ్బు సరిపోని ఎన్నో ప్రలోభాలమధ్య స్నేహితుల ప్రేమస్పర్శతో దాన్ని దాటతారు. ఇప్పుడీ అలభ్యత ఆ వైతరణికి కొనసాగింపు కాబోతోందా? ఆమెకి మనసంతా కలచివేసింది.
“నాన్నా! ఇలా జరుగుతుందనుకోలేదు. అన్నయ్య ఆలోచించుకుని చెప్తానన్నాడు. నేనుకూడా మారు ఆలోచన చేద్దామనుకున్నాను. నాన్నతో మాట్లాడి మధ్యేమార్గంగా ఏదేనా చెయ్యాలనుకున్నాను. ఒక ప్రతిపాదన నేనే చేసి అందులోంచీ పూర్తిగా నేనే వెనక్కి తిరగలేనుకదా? అన్నయ్య ఏకపక్షంగా యిలా చేస్తాడనుకోలేదు” అంది కన్నీళ్ళపర్యంతమై. రాత్రి సుధీర్‍కి చెప్పిన విషయాలే మళ్ళీ తల్లికి చెప్పాడు సుమంత్.
“అమ్మా! ఇందులో మామయ్య చేసినదీ, నువ్వు తప్పుచేసినట్టు బాధపడాల్సినదీ ఏమీలేదు. పెళ్ళినిర్ణయం పూర్తిగా ఆయన ఒక్కరిదే కాదు. కాదు. గీత, వాసు అనుకున్నారు, ఆయన సరేనన్నాడు. మనం పెళ్ళికి ప్రిపేర్డ్‌గా లేము. వాసుకి వాళ్ళింట్లో పెళ్ళి చెయ్యాలనుకున్నారు. ఉన్నట్టుండి మామయ్య అనేసరికి మనదగ్గిర జవాబు లేకపోయింది” అన్నాడు. ఐనా తల్లీకొడుకులు యిద్దర్లో ఎవరూ సమాధానపడలేకపోయారు.
“వాడిని ఒక్కడినీ వదలద్దు సుమంత్! ఇరవైనాలుగ్గంటలూ అంటిపెట్టుకునే వుండు ” అని హెచ్చరించింది సుధీర్ చాటుగా. “మీమీదే మా ప్రాణాలన్ని పెట్టుకుని బతుకుతుంటే మా తలరాతలు మీరిలా రాస్తున్నారు” అంది.


స్త్రీపురుషసంగమం అనే పుప్పొడిరేణువులని కప్పివుంచే వొత్తైన పూరెక్కల దొంతరలాంటివి పెళ్ళీ, వేడుకలూ. పెళ్ళి హడావిడి మొదలైంది. ప్రమీల యింట్లోని దు:ఖం, భయం ఏవీ ఆ యింటిని దాటి రాలేదు. ఆ నాలుగ్గోడలమధ్యే ఆగిపోయాయి. ఎవరి జీవితం వాళ్లదే. ఎవరి ప్రయాణం మరొకరికోసం ఆగదు. తోబుట్టువులు, స్నేహితులు అందరూ సహప్రయాణీకులు. కొద్దిసేపు కలిసి ప్రయాణించినా ఎవరి గమ్యం వాళ్లది. ఎవరి ప్రయణానుభవాలు, అనుభూతులు వాళ్ళవి.


అప్పటిదాకా నవోత్సాహంతో సాగిన జ్ఞాపకాల జడి ఒక్కసారి ఆగిపోయింది. కొరడా అంచు తాకినట్టు చురుక్కుమంది వాసుకి ఎక్కడో. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. తను అనుకున్నది నిజమేనా? ఎవరి గమ్యం వాళ్లదేనా? ఎవరో ఒకరికే తప్ప రెండోవాళ్లకి సాధ్యపడని అవకాశం ఒకటి వుంటే? అప్పుడుకూడానా?
మనోవేగం అపరిమితమైనది. కొన్నేళ్ళ జీవితసారాన్ని ఒక్క సెకనులో మనోనేత్రంముందు ఆవిష్కరించగలదు. వాసు చూసిన ఈ గతపుచిత్రంలో అతని ప్రత్యక్షానుభవాలున్నాయి. కేవలం తోకే కనిపించి, ఆ జంతువేదో వూహించుకుని దాని లక్షణాలేవో తెలుసుకున్నప్పటి విజ్ఞానసారం వుంది. అంటే అతని జీవితంమీద ప్రభావం చూపిన మరొకళ్ల పరోక్షానుభవాలు, అవి యిలా జరిగివుండటంచేతనే దాని పర్యవసానం ఈ రూపంలో తనదాకా వచ్చిందనుకోవటం వుంది. సుధీర్ ఇంట్లో ఏం జరిగిందో కచ్చితంగా అతనికి తెలీదు. కానీ కొద్దిగా పొడగట్టిన వూహైతే వుంది.
“మహీ!” అని పిలిచాడు. ఆ పిలవటంలో ఒక ఆవేశం. నమ్మలేనితనం. లోపలెక్కడో వున్న మహతి విని, వచ్చింది. ఆమెకేసి సూటిగా చూసాడు.
“సుధీర్?!!” అనుమానంగా అడిగాడు.
“అనుకుంటున్నాను” నెమ్మదిగా అంది.
“గీత చెప్పిందా?”
“ఇంకా లేదు. చాలా విషయాలు చెప్పాలంది”
“వాడు ఇలాంటివాడనుకోలేదు. అంతా జరిగిపోయిన యిన్నేళ్ళయాక యిప్పుడుకూడానా?” ఏమనాలో తోచలేదు వాసుకి. “మా పెళ్ళిప్రస్తావన వచ్చినప్పుడు అమ్మ అంది, వాడికిగానీ ఇస్తారేమో, వాడి చదువయేదాకా ఖాళీగా వుంచడం దేనికని గీతని వుద్యోగంలో చేర్చారేమోనని. బాధపడ్డాను. మాయింట్లోలాగే వాళ్ళింట్లోకూడా జరిగిందని చూచాయగా తెలిసింది. నువ్వు చేసుకో అంటే నువ్వు చేసుకో అని ఒకళ్లం త్యాగంచేసి తప్పుకోవడానికి ఇది సినిమా కాదు జీవితం. గీత యిష్టపడాలి. దాని యిష్టంతోటే మాపెళ్ళి జరిగింది. పెళ్ళనుకున్నప్పట్నుంచీ వాడిలో మార్పు గమనించాను. తర్వాత వాళ్ళు అన్నదమ్ములిద్దరూ, సుమతీ మాకు దూరం జరిగారు. అదంతా సహజంగా జరిగిపోయింది. పెళ్ళిళ్ళయాయి. ఎవరి వుద్యోగాలు, జీవితాలు వాళ్లవన్నట్టుగా. బంధువుల్లా ఫంక్షన్స్‌కి కలుసుకోవటమే. వాడు భార్యతో బైటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటర్నెటు, సోషల్‍నెట్‍వర్కు, వాట్సాప్ వచ్చాక గ్రూపులు కావడం, చాట్ చేసుకోవడం మొదలై, అందరం టచ్‍లోకి వచ్చాము. పిల్లలు పెద్దవాళ్ళయారు, పాతస్నేహాలు వూపందుకున్నాయి. ఎప్పుడు మొదలైంది ఇలా? ఏం కావాలి వాడికి? ఇన్నేళ్ళ కోపం మనసులో పెట్టుకుని ఇప్పుడు తీర్చుకుంటున్నాడా? ఐనా గీత నాదగ్గిర దాచడమేమిటి?” అన్నాడు అసహనంగా. అతని మనసు డోలాయమానంగా వుంది. గీత తనదగ్గిర దాస్తోందన్న కోపం మళ్ళీ వచ్చింది.
“అందరికీ ఎదిగిన పిల్లలున్నారు. బైటపడితే అసహ్యంగా వుంటుందని చూస్తోందేమో వాసూ! అదెప్పుడూ సమస్యగురించి ఆలోచించదు. పరిష్కారాన్నిగురించే ఆలోచిస్తుంది”
“చావు పరిష్కారమా?”
“కాదు. గీత ఈ నిర్ణయం వెనక యింకే కారణాలున్నాయో తెలీదు. తను చెప్తానంది. తొందరపడకు” అంది మహతి.
“ఒకవైపు తులసి, మరోవైపు గీత, ఇప్పుడు వీడు. ఎలా వేగనే, వీళ్ళతో?”
“నేను కాదా, సమస్య? దాన్ని దాటించారుకదా, అలాగే. వాసూ! కేవలం ఒక్క సంఘటనో, ఒక ఆలోచనో అదాటుగా మనిషిని చావువైపుకి నెట్టవు. ఒక ఆలోచన ఎన్నో ఏళ్ళు సాగిసాగి వుంటుంది. లేదా ఎన్నో పరిస్థితులు పోగుచేసిన నిస్సహాయత వుంటుంది”
“అప్పుడు తను తీసుకున్న నిర్ణయం తప్పని యిప్పుడనుకుంటోందా? సరిచేసుకునే అవకాశం లేదని చచ్చిపోవాలనుకుందా? ” అతని ప్రశ్నలు.
“వాసూ!!!” తెల్లబోయింది. తన మాటలు ఇలా అర్థమయ్యాయా?
“నాకు తనమీద కోపం లేదు. రోడ్ నాట్ టేకెన్ అనేది మనని ప్రలోభపెట్టే అవకాశం ఎప్పుడూ వుంటుంది”
“నోరు గట్టిగా మూసుకుని కూర్చో. ఈ మాటలు విందంటే అది మనకి మరో అవకాశం యివ్వదు” కోపంగా అంది మహతి.


ప్రత్తిపాడునించీ వచ్చే వార్తకోసం ఎదురుచూస్తున్నాడు త్రిమూర్తులు. పెద్దకొడుక్కి చెప్పాడు, తన చెల్లెలు వుంటే తీసుకురమ్మని. ఆవిడని తమ యింటి ఆడపిల్లనీ, చెల్లెలనీ అనుకోవడం ఇదే మొదటిసారి. తన తండ్రికి రెండోయింట్లో కలిగిన యిద్దరు మగపిల్లలతర్వాత పుట్టిన ఆడపిల్లలిద్దర్లో ఈమె చిన్నది. ఆ మగపిల్లలిద్దరూ కొంచెం పెరిగి స్కూలుకి వెళ్ళడం మొదలయ్యాక ఈ పిల్లలిద్దరూ కలిసి కనిపించేవారు. రోడ్డు పక్కని పొదల్లో గొబ్బిపూలు కోసుకుంటూనో, వాక్కాయలు ఏరుకుంటూనో తిరిగేవారు. తనకి అప్పటికే పెళ్ళైంది. ఒకళ్ళో ఇద్దరో పిల్లలుకూడా. మేనమామ కూతుర్నే చేసుకున్నాడు. మేనమామకి తమ వూళ్ళోకూడా వ్యవసాయం వుండేది. అందుకని తరుచు వచ్చిపోతుండేవాడు. ఆయన వెంట తనూ పొలాలమ్మట వెళ్ళేవాడు.
“ఇక్కడేం చేస్తున్నారే? ఆడపిల్లలు ఇలా తిరక్కూడదు. పొండి యింటికి” ఆ పిల్లలు కనిపించినప్పుడు కేకలేసి, “ఇదుగో, ఏవేనా కొనుక్కోండి” అని ఒక పైసో, పరకో వాళ్లముందుకి విసిరేవాడు. వాళ్ళు దాన్ని ఏరుకుని వెళ్ళిపోవటం ఇప్పటికీ త్రిమూర్తులి కళ్లకి కట్టినట్టుండే జ్ఞాపకం. ఆ పిల్లలు తన తండ్రికి పుట్టినవాళ్ళు. తమింట్లోనే పుడితే గౌరవం మరోలా వుండేది. ఎత్తుకోవడాలూ, ముద్దుచెయ్యడాలూ వుండేవి. ఇక్కడ వాళ్ళకి దొరికింది ముద్దూమురిపెం కాదు. బిచ్చగాళ్ళకి కాస్తెక్కువ గౌరవం. అంతే. ఇలాంటి సామాజిక సమీకరణాలు ఎలా ఏర్పడతాయి? వీటిని ఏర్పడకుండా ఎందుకు ఆపలేకపోయాడు తన మేనమామ? చెల్లెలి జీవితానికి చీడపురుగులా పట్టిన ఆ స్త్రీని ఎలా వుపేక్షించగలిగాడు? కళ్ళెదుట యిలాంటి అరాచకం జరుగుతుంటే తల్లి ఎలా భరిస్తోంది? ఇలాంటి ప్రశ్నలన్నీ తన మెదడులో తలెత్తేవి. అవి ప్రశ్నలే. అది తన తల్లిదండ్రులకి మాత్రమే సంబంధించిన విషయంలోకి మూడోవ్యక్తిగా తొంగిచూసినప్పుడు ఎదురైన ప్రశ్నలు అవి.
“ఉప్పూ, పులుపూ తినే మగవాడు” అన్నాడు మేనమామ ఒకసారి.
“మరి మా అమ్మ?” అమాయకంగా అడిగాడు.
“వయసొస్తే నీకే తెలుస్తుంది” జవాబిచ్చాడాయన అభావంగా. వయసొచ్చాక కూడా అర్థమవ్వలేదు. ఐతే ఒక విషయం తెలిసింది. తండ్రికి ఆ స్త్రీని అనుసంధానపరిచింది ఆయనేనని. అలా ఎలా చెయ్యగలిగాడు?
భార్యాభర్తల జీవితాలు, ఆసక్తులు, సుఖదు:ఖాలు ఒకటిగా మమేకమై వుంటాయన్న ఒక బలమైన నమ్మకం వుండే వయసు. త్యాగాలు, ధర్మాధర్మాలు వినిపిస్తూ వుండే సమాజం. ఇవన్నీ జీవుడి ప్రాకృతిక అవసరాలకి ఎలాంటి సంకటం కలగనప్పుడనే విషయం అర్థంకాని స్థితి.
తనకి ముప్పయ్యేళ్ళ వయసు వున్నప్పుడు తండ్రి చనిపోయాడు. హఠాత్తుగా. పొలాన్నించీ వస్తుంటే పాము కరిచింది. ఎవరో చూసి ఇంటికి మోసుకొచ్చారు. అప్పటికే ప్రాణంపోయింది. అనుకోని మరణం. తండ్రి అవతలింట్లోవాళ్ల గురించి ఏ జాగ్రత్తా తీసుకోలేదు. నెలమాసికాలదాకా వాళ్లని పట్టించుకున్నవాళ్ళు లేరు.
ఒకరోజు మునుమాపువేళ పెద్దబ్బాయి వచ్చాడు. తనని కలవడానికి. అతన్ని అంత దగ్గరగా, సూక్ష్మంగా చూడటం అదే మొదటిసారి. తన తండ్రి నోట్లోంచీ వూడిపడ్డట్టున్నాడు. అతని పేరేమిటో? అసలు వాళ్ళింట్లో పిల్లలకి పేర్లున్నాయా? తనకి తెలీదు. మేనమామ అక్కడే వున్నాడు.
“మేము వూరొదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఇంటితాళం యిచ్చి రమ్మంది అమ్మ. ఇదుగోండి” అన్నాడతను.
“ఎక్కడికి వెళ్తున్నారు?” అడిగాడు తను కూతూహలంగా. ఎందుకు అలాంటి కుతూహలం కలిగిందో తనకే తెలీదు.
“పెద్దాపురం”
“దేనికి? పనేమైనా దొరికిందా?”
అతను నవ్వాడు. ఆ నవ్వు తన అమాయకత్వాన్నీ లోకంతెలీనితనాన్నీ ఎత్తిచూపించినట్టు అప్పుడుకాదు, ఇప్పుడనిపించింది త్రిముర్తులికి. మేనమామ తనని సరిదిద్దకుండా చూస్తూ ఎందుకు వూరుకున్నాడో!
“మా అమ్మ వీణ వాయిస్తుంది. నాన్నగారున్నప్పుడు మానేసింది. ఇప్పుడింక అదే మాకు ఆధారం. కచేరీలు చేస్తుంది” అన్నాడు. నాన్నగారు అన్నమాట తనకి గుచ్చుకుంది. వాళ్లు తన తండ్రి రక్తం అని గుర్తొచ్చి ఏదో ఇబ్బంది.
“చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు?” అదే తింగరితనం తనలో.
“మాయిళ్లలో ఆడపిల్లల్ని ఎవరూ చేసుకోరు. వాళ్లచేత గజ్జె కట్టిస్తుంది” ఎలాంటి భేషజాలూ లేని జవాబు. మీరూ మేమూ వేరనేంత స్పష్టతతో. అప్పుడు కలగజేసుకున్నాడు మేనమామ. “అరేయ్! ఏం చెయ్యాలో మీకు మీరే అనేసుకున్నారా? మీరు ఎక్కడికీ వెళ్లరు. అదే యింట్లో వుంటారు. తాళంచెవి తీసుకుని ఇంటికెళ్ళు. రేప్పొద్దున మాట్లాడతాను” అన్నాడు.
“ఇంట్లో ఏవీ లేవు. రెండురోజుల్నించీ అన్నమే వండలేదు అమ్మ” ఆ అబ్బాయి జవాబు.
“సరుకులు నిండుకుంటే వచ్చి అడగచ్చుకదరా? అంత గోరోజనమా?” ఆయనకి కోపం వచ్చింది. అతనేం జవాబివ్వలేదు. తన మేనమామ లోపలికి వెళ్ళి అరగంట తర్వాత చేతిసంచీతో వచ్చాడు. మాటలు స్పష్టంగా వినిపించలేదుగానీ తల్లితో ఏవో మాటలు జరిగాయి. ఆ అరగంటా ఆ కుర్రాడు నిలబడే వున్నాడు. కూర్చోమని తను అనలేదు. అనాలని తోచలేదు.
“ఇదుగో, ఇవి తీసుకెళ్ళు. రేప్పొద్దున్న అటొచ్చి మాట్లాడతానని చెప్పు” అన్నాడు మేనమామ.
“అన్నీ సర్దేసుకున్నాం. అమ్మావాళ్లందర్నీ అరుగుమీద కూర్చోబెట్టి వచ్చాను” అన్నాడతను.
“ఏమున్నాయేమిటి, అంత సర్దేసుకోవడానికి? సర్దుకుంటే మళ్ళీ యిప్పుకోండి” అన్నాడాయన. అతను సంచీ, తాళంచెవీ తీసుకుని వెళ్ళిపోయాడు.
రాత్రి యింట్లో చర్చ జరిగింది.
“పెద్దాపురం మనిషా ఆవిడ? ఇంతదూరం వచ్చిందే?” అడిగింది తన తల్లి. జవాబుకోసం చూడలేదు. “ఇన్నేళ్ళూ మీ బావని నమ్ముకుని బతికింది. ఎప్పుడూ ఒక్క పొల్లుమాటకూడా వినలేదు ఆవిడగురించి. ఇప్పుడావిడ బజారెక్కితే పోయేది మన పరువే. పిల్లలెవరికి పుట్టారంటే మనింటిపేరే చెప్తారు. ఆ ఆడపిల్లలకి ఏదో ఒక సంబంధం చూసి ముడిపెట్టు. మగపిల్లలంటావా, ఎలాగో ఒకలా బతికేస్తారు. ఆవిడ భుక్తికి కొన్నాళ్ళు మనం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు” అనేసి అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
“ఆ పిల్లాడన్నట్టు ఎవరు చేసుకుంటారే వాళ్ళని?” అన్న ఆయన మాట వినిపించుకోలేదు.
“చూస్తూచూస్తూ ఆడపిల్లల్ని రొంపిలోకి దింపుతామా?” లోపల్నుంచీ అంది.
పెద్దాపురంనుంచీ అవంతీపురానికి ఒక స్త్రీ ప్రయాణం. తనకేమీ కాని ఒక మగవాడిని నమ్ముకుని. తన తండ్రి మంచివాడన్నట్టా, చెడ్డవాడన్నట్టా? మనిషి మంచిచెడ్డలు నిర్ణయించేవి ఏవి? అతి చిన్నవయసులోనే మొదలై తనని స్థిమితంగా వుండనివ్వని ఆలోచనలు మనసునిండా ముసురుకున్నాయి.
అప్పటిదాకా తండ్రి వాళ్లకి ఏం పెట్టాడో, వాళ్ళేం తిన్నారో ఎవరికీ తెలీదు. ఆస్తికి తల్లి చాలా గట్టి కాపే కాసింది.
“అమాయకురాలల్లే వుంది. ఆస్తులేవీ రాయించుకోలేదు. అదో అదృష్టం. లేకపోతే నా కొడుకు మన్నుకొట్టుకుపోయేవాడు” ఆవిడ మరోసందర్భంలో అన్నమాట. ఆవిడ పట్టుదలతో ఆయన కాళ్లకి బలపాలు కట్టుకుని వెతికితే మొత్తానికి పత్తిపాడులో ఒక సంబంధం దొరికింది. నలభయ్యేళ్ళు దగ్గిరపడుతున్నతను, ఇద్దరు భార్యలు పోయినవాడు చేసుకోవడానికి ముందుకి వచ్చాడట.
“మీ గోత్రనామాలతో కన్యధార పోస్తే సమ్మతమేనన్నాడు” అన్నాడు మేనమామ.
“ఇంకానయం, అల్లుడిమర్యాదలు అక్కర్లేదూ?” పరిహాసంగా అంది తల్లి. ఆవిడ హేళన తనలోని సున్నితమైన భావనని చంపేసింది. అదొక ముఖ్యమైన, విషాదకరమైన విషయం అనిగానీ, తండ్రిని పోగొట్టుకున్న ఆ నలుగురుపిల్లలకీ ఈ భూమ్మీద సవ్యంగా బతకడానికి అవకాశాలు మిగిలిలేవనిగానీ స్ఫురణకి రాలేదు. వాళ్లకి ఏదేనా చెయ్యగలిగే అవకాశం తనకి వుందని కూడా తోచలేదు.
“తల్లికి ఇంక ఆ పిల్లతో సంబంధం వుండకూడదని కూడా చెప్పాడు” అని, “ఇలాంటిపిల్లని చేసుకున్నాడంటే ఆయనకీ పరువుతక్కువేకదమ్మా? మూడోపెళ్ళివాడనీ, నడివయసులో పడ్డాడనీ ఎవరూ పిల్లనివ్వడంలేదు. అందుకుకదా, మనవైపు చూసింది?” అన్నాడు మేనమామ.
“సర్లే, ఏదో ఒకటి. ఆ పెళ్ళేదో నువ్వూ, మీ ఆవిడే పీటలమీద కూర్చుని కానివ్వండి. మళ్ళీ మధ్యలో వీడెందుకు?” అందావిడ.
అనుకున్నట్టే గుళ్ళో పెళ్ళి జరిగింది. హంగులూ, ఆర్భాటాలూ లేకుండా అతనివైపునించీ ముగ్గురు మనుషులు, తమవైపునించీ తను, మేనమామ, ఆయన భార్య, అన్నీ చూసుకోవడానికి ఒక ముత్తైదువ, అవతలింట్లోని మగపిల్లలిద్దరు, మరో యిద్దరు ముఖ్యుల సమక్షంలో పెళ్ళి జరిగిపోయింది. తనేనా, కుతూహలంకొద్దీ వెళ్ళాడుతప్ప వెళ్ళక తప్పనిసరై కాదు. చవకపాటివి రెండు కొత్తచీరలు, భర్తపోయాడుగాబట్టి కట్టకూడదని తల్లి పక్కన పెట్టేసిన రెండు రంగుచీరలు, పసుపు, కుంకం, కాస్త చలిమిడి, అతిక్లుప్తమైన సారితో మెళ్ళో మంగళసూత్రం పడ్డరోజే వాళ్లతో తీసుకెళ్ళిపోయారు. బక్కపల్చటి నలభయ్యేళ్ళ పెద్దమనిషి, అతని పక్కని కొంగుముడితో పదిహేనేళ్ళ పిల్ల. అదొక చెదిరిపోని దృశ్యం మనసుమీద. కాలంపొరల చాటుకి జారుకున్న ఎన్నో జీవితదృశ్యాల్లాగే అదీ ఒకటి.
చెల్లెలికి తోడుగా వెళ్ళిన మగపిల్లవాడినికూడా చేతికిందకి పనికొస్తాడని అతను తనదగ్గిర వుంచేసుకున్నాడు. రెండేళ్ళో మూడేళ్ళో గడిచేక ఆ పిల్ల ఒక మగపిల్లవాడిని ప్రసవించి చనిపోతే వాడిని చూసుకుందుకని రెండోదాన్ని తీసుకెళ్ళాడు. ఆ పిల్ల అక్కడే వుండిపోయింది. వాళ్ల తల్లి కొన్నాళ్ళు బతికింది. తర్వాత దిగులుతో తీసుకుకుని పోయింది. మిగిలిన మగపిల్లాడుకూడా చెల్లెలి పంచని చేరాడు. ఆ తర్వాత వాళ్లగురించి ఆలోచించినది లేదు. తన జీవితం, తను, పెరుగుతున్న కుటుంబం, బాధ్యతలు, పిల్లలందర్నీ కలిపి వుంచాలనే బలమైన కోరిక తనని నడిపించాయి.
ఏమయ్యారు వాళ్ళు? తనే చిన్నపిల్లై, అక్కకొడుకు సంరక్షణకి వెళ్ళిన ఆ రెండోపిల్ల ఏమైంది? ఆ మగపిల్లలు? తను ఇంకొంచెం దయగా, బాధ్యతగా ప్రవర్తించి వుంటే బావుండేదేమో! తల్లి చెప్పలేదు. మేనమామ చెప్పలేదు. తనకి తోచలేదు. తన తండ్రికి ఒక అవసరంలా వచ్చిన ఆవిడ్ని ఆయనపోగానే అవసరం తీరిన వస్తువుని దుపలరించుకున్నట్టు దులపరించేసుకున్నారు. రెండోపెళ్ళి చట్టసమ్మతమైన రోజుల్లో తన తండ్రి ఆవిడ్ని ఎందుకు చేసుకోలేదు? భార్యమీద గౌరవమా? మేనమామ పడనివ్వలేదా?
తనసలు అలా ఎలా చెయ్యగలిగాడు? తిరిగితిరిగి అక్కడికే వచ్చి ఆగింది ప్రశ్న. పుట్టినవాళ్ళు నలుగురు. మిగిలినవాళ్ళు ముగ్గురు. మూడు కుటుంబాలయ్యేవారు. కనీసం ఒక పదిపాతికమంది మనుషులతో ఒక జీవధార సాగేది.


నమస్కారం. మీరెవరో నాకు తెలీదు. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మాగురించి వెతుకుతున్నారని తెలిసింది. త్రిమూర్తులుగారి కొడుకని చెప్పారు, మీరు వెతుకుతున్న విషయం మాకు చెప్పినవాళ్ళు. త్రిమూర్తులెవరని మా నానమ్మని అడిగాను. ఆవిడ ఎనభయ్యేళ్ల వృద్ధురాలు. జ్ఞాపకాల తెరలని తప్పించి చూసి చెప్పింది- అతనో రాక్షసుడు, రక్తసంబంధం తెలీని మనిషని. పూర్తిగా చెప్పమని అడిగాను. ఆవిడకి గుర్తున్నంతవరకు చెప్పింది.
అయ్యా, రాక్షసుడుగారూ!
ఈ ముసలివయసులో మా వివరాలు మీకెందుకు? అప్పుడు చేసినవాటికి యిప్పుడు మనసు చురుక్కుమంటోందా? పాపభీతి పట్టుకుందా? అరవయ్యేళ్ళో డబ్భయ్యేళ్ళో వెనక్కి వెళ్ళి ఆ నలుగురు అభాగ్యుల జీవితాలు మార్చగలిగే శక్తి మీకుందా? లేదుకదా? ఐనా చెప్తాను. విని తరించండి. పదిహేనేళ్ళ పిల్లని పెద్దనాయనమ్మని మా తాతయ్యకి యిచ్చి చేసారు. ఆవిడ మా నాన్నని ప్రసవించి చనిపోయింది. ఆవిడ చెల్లెలు నాన్నని చూసుకోవడానికి వచ్చి, తాతయ్యతో వుండిపోయింది. ముగ్గురుభార్యల్ని పోగొట్టుకున్న మా తాతయ్య ఆవిడ్ని పెళ్ళి చేసుకోలేదు. తల్లి వారడే ఆవిడకీ వచ్చింది. అర్థమైందికదా? ఇక వాళ్ల అన్నలు. తాతయ్యకి పాలెకాపుల్లా చాకిరీ చేసారు. పెళ్ళిళ్ళవలేదు. ఎవరూ పిల్లనివ్వలేదు. అసలు వాళ్ళు ఎవరనేది పెద్దసందిగ్ధం. ఇంక సంబంధం ఎలా కలుపుకుంటారు? పెద్దాయన చెల్లెలిమీది ప్రేమతో చివరిదాకా మాతోనే వున్నాడు. రెండో ఆయన యిల్లొదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో తెలీదు. మాకు మీతో సంబంధాలు పెట్టుకోవాలనిగానీ, మీరు పశ్చాత్తాపపడితే ఔదార్యంతో క్షమించాలనిగానీ ఎంతమాత్రం లేదు. మీ ఆస్తులమీద మాకు ఆశలేదు. ఇక్కడితో ఆపుదాం-
సంబోధనా, సంతకం లేని ఆ మెసేజి చదవడం పూర్తిచేసి సెల్ తిరిగిచ్చేసి, కుర్చీలో వెనక్కి వాలాడు త్రిమూర్తులు. తండ్రితో ఏం మాట్లాడటానికీ తోచలేదు రఘునాథరావుకి. ఏదో జరిగిందని తెలుసు. ఆ జరిగినదాని పూర్వపరాలు తెలీవు. ఆయనవలన జరిగిన ఒక పొరపాటుని అవతలివారు వుపేక్షించలేకపోయారని అర్థమైంది.
“పెద్దాయన చనిపోయాక డిల్లీలో వుండే ఆవిడ కొడుకు వచ్చి ఇక్కడి యిల్లూ ఆస్తులూ అమ్మి ఆవిడ్ని తీసుకెళ్ళిపోయాడట. బాధపడకండి నాన్నగారూ! మీరు చెప్పగానే మూడోవాడి కొడుకుని పంపించాను. వివరాలు తెలిస్తే చెప్పమని ఒకరిద్దరికి ఫోన్‍నెంబరు ఇచ్చి వచ్చాడు. అదేరోజు రాత్రి ఈ మెసేజి వచ్చింది” అన్నాడు.
“ఒక తప్పు జరిగినప్పుడు శిక్షకోసం ఎదురుచూడాలి తప్పితే క్షమకోసం కాదు. ఎవరో క్షమిస్తారన్న ధైర్యంతో తప్పులు జరగవు ” అన్నాడు త్రిమూర్తులు.
“మీరు తప్పుచెయ్యడమేమిటి? వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు” అన్నాడు కొడుకు.
“హక్కులు వదులుకోకపోవడమూ, త్యాగాలు చెయ్యకపోవడమూ తప్పులు కావు. నేను తప్పు చెయ్యలేదు. జరిగిందంటున్నాను. మా నాన్న మరొకావిడ్ని చేరదీసాడు. ఆవిడ్ని పెళ్ళిచేసుకుని నేరుగా యింటికి తీసుకొచ్చి వుంటే వేరు. పెళ్ళిచేసుకోలేదు. వేరే యింట్లో వుంచాడు. పిల్లలు పుడుతూ వచ్చారు. వాళ్లగురించి యిద్దరూ ఆలోచించలేదు. ఆ వ్యవహారంతో ఎంతోకొంత సంబంధం వున్న మా అమ్మ, మేనమామ వున్నారు. అక్కడికి వాళ్ళంతా మంచివాళ్ళు, పై రెండూ జరిగినందుకు నేను చెడ్డవాడినీనా? ఇక్కడితో వదిలేసెయ్. అమృతని చూసాక ఆ పిల్ల ఎందుకో మనసులో కదిలింది. పిల్లలుగా వున్నప్పుడు మనుషుల జీవితాలు గాడి తప్పకుండా ఇరుసులు బిగించాల్సింది తల్లిదండ్రులు కాదూ?” అన్నాడు త్రిమూర్తులు. ఇలా ప్రతిదాన్నీ పాలూనీళ్ళూగా విడదీస్తాడుకాబట్టే అతను ఇంత పెద్ద కుటుంబాన్నీ, దానికి సరిపడే వనరుల్నీ ఏర్పరచగలిగాడు.
“మనసుకి ఈ లెక్కలేవీ తెలీవు. దానికి దయ జాస్తి. ఊరుకోదు. వాళ్ళమీద ఇంకొంత దయచూపించి వుండాలని చెప్పింది. దానికి నచ్చజెప్పుకుని, ఆ దయని మరొకళ్ళమీద చూపించాను. రామారావుని చేరదీసాను. వాడికి అండాదండా అయ్యాను. వాడి చెల్లెళ్లకి సంబంధాలు వెతికాను. ఐనా నాకు శిక్షపడింది. మురళి అజాపజా లేకుండా పోయాడు. పేపర్లో ఇప్పించినా ప్రయోజనం లేకపోయింది” అన్నాడు.
ఆ తర్వాత ఇంక మాట్లాడకుండా వుండిపోయి, క్రమంగా మగతలోకి జారుకున్నాడు.
జరిగిందేమిటో ఇంకా వివరంగా తెలుసుకోవడానికి భార్యే శరణ్యమైంది రఘునాథరావుకి. మగవారు వాళ్ళకి వుండే వ్యవహారాలవలన ముఖ్యమైన విషయాలనిమాత్రమే ధారణ చేసి, మిగిలినవాటిని వుపేక్షిస్తారు. ఆడవారు అలాకాదు. కార్యాకారణసంబంధం, బాదరాయణ బాంధవ్యాలు అన్నీ కావాలి. అవన్నీ తెలిస్తేగానీ దేన్నీ తులనచెయ్యరు.
“రెండోఆవిడ సంతానం నలుగురు. మీ తాత పోయాక వాళ్లందర్నీ చేరదీసి మంచిచెడులు చూడలేదని, ఆడపిల్లలకి సరిగ్గా పెళ్ళిళ్ళు చెయ్యలేదనీ, మగపిల్లల్ని గాలికి వదిలేసారనీ, ఆవిడ్ని పట్టించుకోలేదనీ బంధువుల్లో అనుకునేవారు. మీ అమ్మ వున్నంతకాలం ఆడవాళ్లం కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ గుసగుసగా చెప్పుకునేవారు. మీ మామ్మకి అన్న ఒకరుండేవారు, వాళ్ళిద్దరూ చాటుగా కూర్చుని మాట్లాడుకునేవారు. కొన్ని విషయాలు తెలిసాయి, అందులోని కొన్ని అర్థమయ్యాయి. ” అంది అతని భార్య.
“అయిందేదో ఐపోయింది బావగారూ! ఇప్పుడు వాళ్ళని ఎందుకు కదిపినట్టు? ఆస్తికోసం ఏ దావాయేనా వేస్తే?” అంది ఐదుగుర్లో ఇంకోకోడలు. విషయం ఒకటి వుంటుంది. అది ఆవగింజంత వుంటుంది. కుంకుడుగింజంతదే వున్నప్పటికీ, కాలం ఛిత్రీపట్టి ఆవగింజంతో అసలు లేకుండానో చేస్తుంది. దానిచుట్టూ వూలుబంతిలా అల్లుకుని ఎన్నో వూహలు.
తన తండ్రి మంచివాడా కాదా అని ప్రశ్నించుకున్నాడు త్రిమూర్తులు ఒకరోజుని. అదే ప్రశ్న యిప్పుడీ పెద్దకొడుక్కీ ఎదురైంది. ఏదో ఒకసందర్భంలో ప్రతి ఒక్కరికీ ఎదురౌతుంది. నాన్న ధీరోదాత్తనాయకుడనే పీఠాన్ని కొంచమేనా కదపకుండా ఏ జీవితాలూ వెళ్ళవు.
“ఏమని వెళ్తారు? ఏ ఆధారాలతో వెళ్తారు? ఇదంతా మా తాతది. మా నాన్న కష్టపడి సంపాదించినది” అని తుంచేసాడతను.


ఒక రాత్రివేళ రోహిణి ఎందుకో మెలకువ వచ్చి చూస్తే రెండుకళ్ళూ యిప్పుకుని పైకప్పుకేసి చూస్తోంది అమృత.
“ఏమైందమ్మా?” అడిగింది రోహిణి.
“ఏమీ లేదాంటీ! మీరు పడుక్కోండి. నాకు నిద్ర రావట్లేదు” అంది ఆవిడకి జవాబుగా. రోహిణి నిద్రమత్తంతా ఒక్కసారి ఎగిరిపోయింది. ఎదురుగా గోడగడియారంకేసి చూసింది. రెండు దాటింది.
“అసలు పడుక్కోలేదా, నువ్వు?” అడిగింది.
“చాలా భయంగా వుందాంటీ?” వణికింది అమృత గొంతు.
“దేనికి, భయం? మేమంతా వున్నాంకదా?” అనునయంగా అడిగింది రోహిణి.
పదోరోజు తతంగం కానిచ్చి, మైల తీరగానే సంతాపంలోంచీ తమ వాటాలోకి తీసుకొచ్చింది రోహిణి ఆమెని. విజయ్ మండువాయింట్లో వుంటానన్నాడు. ఇలాంటి సర్దుబాట్లు త్రిమూర్తులి యింట్లో అలవాటే. అమృతే నొచ్చుకుంది, వాళ్ళని యిబ్బందిపెడుతున్నానని. మాధవరావు ఒక గదిలో పడుకుంటాడు. రోహిణి అమృత యింకో గదిలో పడుకుంటారు. అందరు పలకరిస్తున్నారు ఆమెని. ఎవరూ గట్టిగా ఓదార్చి ధైర్యం చెప్పలేకపోతున్నారు. మంచిగానే వుంటారు, అందులో ఎడం. ప్రసూన అమృత వయసు పిల్లలందర్నీ పోగేసుకుని వస్తుంది. మాట్లాడాలన్న ఆసక్తి అమృతలో కలగడం లేదు. ఆమెలో చాలా మార్పొచ్చింది. బైటికి చూడటానికీ, లోలోపలాను. నిరంతరం ఏదో ఆలోచన. చచ్చిపోవాలన్న వుద్రేకం తగ్గింది. అది బతకాలన్న ఆసక్తిని పుట్టించలేదు. తెగిన గాలిపటం గాల్లో గిరికీలు కొడుతుంటే అదెక్కడ వాలుతుందా అని ఎదురుచూస్తున్నట్టు చూస్తోంది తన జీవితాన్ని తనే.
తర్వాత? అనే ప్రశ్నకి జవాబు లేదు.
స్వప్నకి ఫోన్ చేసింది. కలవలేదు. నెంబరు మనుగడలో లేదని రెండు సిమ్‍లగురించి మెసేజి వచ్చింది. ఏమైంది స్వప్నకి? ఆరోజుని తనకి అంత అండగా నిలబడిన స్వప్న మళ్ళీ ఎందుకు ఫోన్ చెయ్యలేదు? భయపడిందా? పెద్దవాళ్ళు కోప్పడ్డారా? తను మళ్ళీ ఆఫీసుకి వెళ్తే? వెళ్లగలదా? ఇదివరకట్లా పనిచెయ్యగలదా? ప్రపంచం ఆగిపోయినట్టనిపిస్తోంది, చేతివేళ్ళు కీబోర్డుమీద కదుల్తాయా? కళ్ళు స్క్రీన్‍మీద కనిపించే అంకెల్నీ అక్షరాలనీ గ్రహిస్తాయా? మెదడు అర్థం చేసుకుంటుందా? అంతా మామూలుగానే వుంటుందా? ఉ<హు< ఉండదు. ఉంటే తను హాస్టల్లోనో తమింట్లోనో వుంటుంది. ఇలా బైటిప్రపంచానికి తెలీకుండా దాక్కోదు.
“అప్పుడే పదిహేనురోజులైంది అమ్మావాళ్ళు పోయి. మూడుసార్లు పోలీస్‍స్టేషనుకి పిలిచారు. వెళ్ళాను. అక్కడ చాలా కటువుగా మాట్లాడారు. టీవీవాళ్ళు వెంటపడ్డారు. వాళ్లు చాలదన్నట్టు రెండు యూట్యూబు చానెల్స్‌లో ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టారు. ఆంటీ! విజయ్, శ్యామ్ అంకుల్ పక్కన లేకపోతే నా పరిస్థితి ఏమిటని వూహించుకోవడానికే భయం వేస్తోంది. డబ్బు కట్టకపోతే నన్ను అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా?”
చిన్నగా నిట్టూర్చింది రోహిణి. వార్తారంగంలో చాలా మార్పు వచ్చింది. న్యూస్‍పేపర్లలో ఏదేనా వార్త వస్తే దానికి చాలా విశ్వసనీయత వుండేది. వార్తలని ప్రభుత్వమే ప్రసారం చేసేది. తర్వాత ప్రైవేటు చానెళ్లు వచ్చాయి. వార్తలనికూడా వ్యాపారసంస్థలు స్పాన్సర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక యూట్యూబు చానెళ్ళు. పైసా ఖర్చులేకుండా ఎవరేనా చానెల్ పెట్టుకోవచ్చు. వీళ్ళలో చాలామందికి పెద్దపెద్ద వార్తలు స్వంతంగా సేకరించే అవకాశం వుండదు. విన్నవాటిని అర్థం చేసుకుని విశ్లేషించే తెలికిడి వుండదు. అందుకని వూహల్ని వార్తలుగా వండి వార్చేస్తున్నారు. చుట్టూ జరిగే విషయాలని భూతద్దాలు పెట్టి చూపిస్తున్నారు. ఈ చానెళ్లవారి వివరాలు, అడ్రసు ఎక్కడా వుండవు. వాళ్లని పట్టుకోవడం కష్టం. సెన్సేషనల్ వీడియోలు పెడితే, వ్యూస్, సబ్‍స్క్రిప్షన్స్ వస్తే ప్రకటనలు వచ్చి, డబ్బులొస్తాయన్న స్వాభిమతం తప్ప మరేదీ వుండదు. అమృతది చట్టపరమైన సమస్య. చట్టం వుంది. ఐనా అల్లరి బాగా జరుగుతోంది. అవంతీ ఎస్టేట్స్‌మీదా, త్రిమూర్తులిమీదా కూడా అల్లేసారు. ఇంట్లో అందరికీ కోపం వచ్చింది.
“అనవసరంగా పరువు బజార్లో పడేసారు” అన్నారు మామగారి తమ్ముళ్ళు, మిగతావాళ్ళు. అవేవీ తండ్రి ఎదురుగా అనరు. తమ దగ్గిర గొడవ చేస్తారు.
“మనమూ ఒక చానెల్ పెట్టి లైవ్ అప్‍డేట్స్ ఇద్దాం” అన్నాడు విజయ్ పరిహాసంగా. అమృతతో కలిపి అతని పేరు యింకా బైటికి రాలేదు.
ప్రసూన చెప్పింది, “వాడేంటో ఆ అమ్మాయిని యిష్టపడుతున్నాడు. అలా ఎలా కుదురుతుందని కోప్పడ్డాను. కాస్త గమనించుకో పెద్దమ్మా!” అని. రామారావు, వాసు వచ్చినప్పుడు కొడుకు అన్న మాటలు చూచాయగా తెలిసాయి. త్రిమూర్తులికీ ఆ అభిప్రాయమే వున్నట్టుంది. తన అత్తగారూ అదే అంది. ఒక్క ఈ పెళ్ళి విషయం తప్పిస్తే రోహిణికి అమృతమీద మరే ఆక్షేపణా లేదు. ఈ గొడవల్లేకపోతే పెళ్ళికీ అభ్యంతరం వుండేది కాదు. ఇది తక్షణసమస్య కాదని తెలిసినా, మధ్యమధ్యలో మనసుని ఒక మబ్బులా కమ్ముతోంది. ఆ మబ్బుని తప్పించి అంది.
“అలా జరగకూడదనేకదా, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? అమృతా! కోర్టులో చార్జిషీటు వేసేలోగానే ఆ చీటీలడబ్బు పోగుచేసే ప్రయత్నం చేస్తున్నారు. లాకర్లోని బంగారం వాల్యుయేట్ చేసారు. మీ పెద్దనాన్నలదగ్గిరకి ఈరోజో రేపో వెళ్తారు. చీటీలడబ్బు సమకూరిందంటే నువ్వు కేసులోంచీ బైటపడ్డట్టే. అమ్మానాన్నలు చేసిన అప్పులతో నీకు సంబంధం వుండదు. కొన్నాళ్ళు ఎక్కడికేనా దూరంగా పంపించేస్తారు” వివరించింది రోహిణి.
“నాలుగు కోట్లాంటీ! ఏవో సాధించాలన్న ఆరాటంతో మా అమ్మ డబ్బుకూడా పెద్దగా ఖర్చుపెట్టేది కాదు. ఇంట్లో ఖర్చులకీ ఆవిడ డబ్బు యిచ్చేది కాదు. నాన్న జీతమే అన్నిటికీను. ఎన్నో సరదాలు చంపుకున్నాను. పాకెట్‍మనీకోసం ట్యూషన్లుకూడా చెప్పాను. ఎప్పుడేనా దెబ్బలాడితే, నీకోసమేకదా, దాచేది అనేది అమ్మ. అంత డబ్బు ఎలా పుట్టించారు? ఎవరిచ్చారు? మాకున్నవన్నీ కలిపినా అంత వుండదు. పొలం రెండెకరాలో మూడెకరాలో. ఆ యిల్లు. అంతే. నాకేం అర్థమవటంలేదు” అంది. అని, “పడుక్కోండి. నామూలంగా మీరు చాలా యిబ్బందిపడుతున్నారు” అంది.
“ఏవీ ఆలోచించక చక్కగా పడుక్కో. రాసి వున్నదాన్ని ఎవరం తప్పించలేం. అన్నిటికీ ఆ దేవుడున్నాడని ఆయనమీద భరోసా పెట్టుకో” అని కళ్ళుమూసుకుంది రోహిణి. మనచేతిలో లేనిదానికి అంతకన్నా చెయ్యగలిగేదీ చెప్పగలిగేదీ ఏమి వుంటుంది?


వాసు రోడ్ నాట్ టేకెన్‍గురించి మహతితో అని వెళ్ళాడు. ఆరోజంతా బాధపడింది. మగవాళ్ళు ఇలా ఎలా ఆలోచించగలరని. వాసుకూడానా అనిపించింది. ఎంత మామూలుగా అడుగుతున్నానన్నా, అసూయ కనిపించకపోలేదు ఆ అడగటంలో.
“ఒక్కదానివీ ఇక్కడేం చేస్తున్నావే?” అడుగుతూ తనూ వచ్చి మహతి పక్కని కూర్చుంది తులసి.
“మేఘన యిటొస్తోంది. ఇప్పుడే ఫోన్ చేసింది” అంది మహతి నెమ్మదిగా.
“మంచివార్తే కదా?” సందిగ్ధంగా ఆమె ముఖంలోకి చూసింది తులసి.
“వాళ్ళ నాన్నకి ఏక్సిడెంటైందట. అతని పిల్లలు భయపడుతూ ఫోన్ చేసి చెప్తే వస్తోంది”
తులసి ఆశ్చర్యంగా చూసింది. “మహీ! అది యింకా వాళ్ళతో కాంటాక్ట్‌లో వుందా? వాళ్ళు బాగా చూసుకుంటారా?! కలుపుకుంటారా?!” గబగబ అడిగింది.
“అతను దీన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. చిన్నప్పుడు హక్కుగా వచ్చేవారు. ఇంత దూరాన్నించీ అక్కడికి రావడం బోల్డంత ఖర్చూ ప్రయాసా ఐనా వచ్చేవారు. ఒకసారి అలా వచ్చినప్పుడు దానికి వంట్లో బాగాలేక హాస్పిటల్లో చేరిస్తే తనే రాత్రంతా వుండి చూసుకున్నారు”
“ఇంటికి వస్తాడా, బావ?”
“ఉ<హు< హోటల్లో వుండేవారు. ఇప్పుడు ఇదే వెళ్తోంది. ఈ ఖర్చుల విషయమై భార్యతో గొడవయ్యేదట కూడా.
మేఘన, ఈ భూమ్మీద పుట్టడానికి ఎలాంటి చిన్న అవకాశం లేని పిల్ల. ఐనా బలవంతంగా పుట్టించాం. చివరిదాకా దాన్ని చూసుకోవలసిన బాధ్యత నాకు వుంటుంది. ఈ వొక్క విషయంలో నాకు ఎలాంటి అడ్డూ చెప్పద్దు-
-అన్నారట. తెలిసినవాళ్ళద్వారా వచ్చిన సమాచారం.
ఆ తర్వాత దీన్ని వాళ్ళింటికి తీసుకెళ్ళడం, పిల్లలకి అక్కగా పరిచయం చెయ్యడం జరిగింది. ఆమెకూడా బాగానే మాట్లాడేదట”
“మీమధ్య గొడవలు ఎందుకు వచ్చాయో దానికి తెలుసా?”
“నేనే చెప్పాను”
“ఏమంది?”
“వాళ్లని అలా మోసం చెయ్యడం తప్పుకదమ్మా? మనం నిజాయితీగా లేనప్పుడు మనకి దొరికే ఫలితంకూడా అలాగే వుంటుంది- అంది. నన్ను నేను సమర్ధించుకోలేదు. తలదించుకున్నాను. అంతే”
“మహీ!!” చప్పుని ఆమె చేతిని పట్టుకుంది తులసి.
“నో రిగ్రెట్స్. జీవితం మన చేతిలో లేని ఎన్నో కారణాలకి పర్యవసానం తులసీ! అన్‍వాంటెడ్ హెయిర్, హార్మోన్ల అసమతుల్యత, పెద్దపిల్లనవటంలో ఆలస్యం, పీరియడ్లతో సమస్యలు. అప్పట్లో మనకి యింతగా ఎక్స్‌పోజర్ లేదు. ఏ విషయాలూ పెద్దగా తెలిసేవికాదు. రవళితో పోల్చుకుని చూసుకునేదాన్ని. అది చులాగ్గా తిరిగే ప్రతిసందర్భం నాకు పెద్ద సమస్యగా వుండేది. పెళ్ళి చేసుకోనన్నాను. అలా అనిపించింది. అమ్మ అర్థంచేసుకుందిగానీ, నాకు కాకపోతే రవళికి కాదని భయం. పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయని మభ్యపెట్టింది. నమ్మాను. దాని పెళ్ళయేదాకా టేబ్లెట్లవీ వాడుతూ సమస్య బయటపడకుండా జాగ్రత్తపడితే తర్వాత చూసుకోవచ్చంది. అన్నట్టుగానే నా పెళ్లైన వెంటనే రవళికీ చేసారుగానీ, నా సమస్యలు బైటపడ్డాయి. పెద్ద గొడవైపోయింది”
“…”
“ఇంక పిల్లలకోసం గొడవ మొదలైంది. వొవ్యులేషన్‍కోసం నా వొళ్లంతా మందులతో నింపేసారు. మూడుసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా నిలవలేదు. ఆ తర్వాత మేఘన పుట్టింది. ఒక యుద్ధం, దాని తర్వాతి శాంతి. అది శాంతేనా? వయసులో వున్న మగవాడు. అతను కోరుకున్నప్పుడు నేను అందుబాటులో వుండేదాన్ని కాదు. ఇష్టంకూడా వుండేది కాదు. నా కడుపులో కాస్త స్థిరపడిందేదో మళ్ళీ తుఫానులా లేస్తుందనిపించేది. గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. ఎవరికీ చెప్పలేని సమస్య మాయిద్దరిదీ. అతనికి కోపం, అసహనం. నాలుగైదుసార్లు కొట్టారుకూడా”
“మహీ!!” తులసి గొంతులో అపనమ్మకం, కోపం. తన భవిష్యత్తు లీలగా కనిపించినట్టుకూడా అనిపించి, తీసుకున్న నిర్ణయం సరైనదేననిపించింది. అలాంటి పరిస్థితుల్లో మగవాడిని వివాహబంధాన్నుంచీ విడుదలచెయ్యడంలో తప్పులేదని అర్థమైంది. ఇదే పరిస్థితి స్త్రీకి వస్తేనన్న ప్రశ్న అడగచ్చు. స్త్రీపురుషులిద్దరూ నిలబడ్డ నేల దానికి జవాబు చెప్తుంది. ఎవరి కాలికింది నేల బలంగా వుంటుందో, వాళ్ళు తప్పునించీ మినహాయించబడతారు.
“ఇది తెగేది కాదనిపించింది. ఒక రాత్రివేళ మేఘనని తీసుకుని యింట్లోంచీ బైటపడ్డాను. ఎవరూ లేనిచోటికి దూరంగా వెళ్ళిపోవాలనిపించింది. ముంబాయికి టిక్కెట్టు తీసుకున్నాను. తర్వాత విడాకులు తీసుకున్నాం”
“ఇంత జరిగితే అది అలా ఎలా అనగలిగింది?” అడిగింది తులసి.
“మేఘన సరిగ్గానే ఆలోచించింది. నాకు ఒకటే కాలు వున్నప్పుడు ఆ ఒక్క కాలుతోనే సుఖంగా, సౌకర్యంగా బతగ్గలిగే మార్గాన్ని వెతుక్కోవాలి. అంతేకానీ రెండుకాళ్ళూ వున్నవాళ్ళతో పోల్చుకోవడం, పోటీపడటం చెయ్యకూడదు. నాది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఏ సమస్యా లేని సహజమైనచోట సమస్య వుందని అనుకుని వుండచ్చు. ఒకటిమాత్రం నిజం. నేను సరిగ్గా హేండిల్ చెయ్యలేకపోయాను. పెళ్ళి చేసుకోకుండా వుండాల్సింది. చేసుకున్నా ఒకరిద్దరు పిల్లలున్న రెండోపెళ్ళివాడిని చేసుకుంటే బావుండేదేమో! అతనికి తనూ తన పిల్లలకన్నా నా సమస్య పెద్దదిగా కనిపించేదికాదు. అంటే పెద్దగీత పక్కని గీసిన చిన్నగీతలా వుండేది. పెద్దమ్మాయికి ఆరోగ్యం సరిగ్గా వుండదు. అందుకే ఇలా చేసాం అని రవళికి సంబంధాలు చూసేప్పుడు చెప్పుకోవడానికి బావుండేది. విషయాలన్నీ దాచిపెట్టి చేసుకోవడంచేత మేఘనావాళ్ళ నాన్న అనవసరంగా నాలుగైదేళ్ళు బాధపడ్డారు. అదే మేఘన అంది” అంది మహతి.
తులసి నిట్టూర్చింది. అవతలివాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెడితేనే సమస్యేమిటో తెలిసేది. ఎదుటివాళ్ళు త్యాగం చెయ్యాలనో, సర్దుకుపోవాలనో కోరుకుంటాం. ఏది తరుచూ దొరకదో దాన్ని ఎవరూ త్యాగం చెయ్యలేరు. ఏది అరుదైనదో అదీ త్యాగం చెయ్యలేరు. ఏది గాలీ, నీరూలాగ కాలధర్మంగా అవసరమైనదో, ఏది జీవలక్షణమో, సృష్టి కొనసాగడానికి ఏది కావాలో, దేనిగురించైతే అనేక ప్రలోభాలు మనచుట్టూ వలలాగా అల్లుకుని వుండి, నిత్యం మనసుని వాటిలోకి లాగాలని చూస్తూ వుంటాయో, దేనికోసం యుద్ధాలు జరిగాయో, హత్యలు కూడా జరుగుతుంటాయో, దాన్నీ త్యాగం చెయ్యలేరు.
“ఒకసారి బావ వాసుకి కలిసారట” అంది తులసి.
“తెలుసు. వాసు చెప్పాడు” అంది మహతి.
మహతి భర్త నరేంద్రా, వాసూ ఇద్దరూ ఢిల్లీకి వెళ్ళేప్పుడు కలిసారు. ఇరవైనాలుగ్గంటల ప్రయాణం. ఇద్దరివీ ఎదురెదురు బెర్తులు. తెలీనివాళ్ళు కాదు. అతన్తో మాట్లాడ్డం వాసుకి ఇష్టంలేకపోయింది. బెర్తు మార్చుకుందామనుకున్నాడు మొదట. మళ్ళీ మానుకున్నాడు. ఇబ్బందిపడ్డా పలకరించుకుని మాట్లాడుకున్నారు. చాలా విషయాలు చర్చకి వచ్చాయి.
“పెళ్ళినీ తద్వారా ఏర్పడే బంధాన్నీ ఎలా నిర్వహించాలనే విషయం మనకి చాలామంది చెప్తారుగానీ, వాస్తవానికి ఆ నిర్వహణబాధ్యత తీసుకునేది మన భావోద్వేగాలు. మహతిపట్ల నేను కొంచెం సహనంగా, మంచిగా వుండాల్సింది. మొదట్లోనే గౌరవంగా విడిపోయి వుంటే బావుండేది. ఆ ఐదేళ్ళూ చాలా బాధపడింది. ఆమె కళ్ళలో కోపం, నిస్సహాయత, విసుగు, వాటివెనుక కదిలే కన్నీటిపొరలూ, ఇవేవీ నేను మర్చిపోలేను. ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తునే వుంటాయి. క్షమించమని చెప్పండి. నేనే కలిసి చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. తెగిపోయిన బంధానికి కొస వెతకడం దేనికని వూరుకున్నాను” అన్నాడు.
అదే విషయాన్ని మహతికి చెప్పాడు వాసు. ఒక తులనాత్మకమైన ప్రశ్నకూడా లేవదీసాడట నరేంద్ర.
“మీరంతా మహతి కజిన్సని తెలుసు. కానీ ఎవరు ఎవరో పెద్దగా గుర్తులేదు. ముంబైలో వుండే అతను?”
“… మాధవ్. నాకు తమ్ముడు”
“బావా, మా అక్కని కొట్టారా, మీరు? అని అడుగుతూ షర్టు చేతులు పైకి మడిచి నా పైపైకి రావటంలో వున్న కోపం సహేతుకమైనదే ఐతే, నా కోపంకూడా సరైనదేనని వప్పుకోవాలి. ఇప్పటి వయసుతో కాదు. అప్పటి ఆ వయసుతో, మోసపోయానన్న కోపంతో వున్న ఒక యువకుడి గురించి ఆలోచించండి. ఐతే నేను టార్గెట్ చేసింది ఒక విక్టిమ్‍ని అన్న విషయం బోధపడ్డాకమాత్రం సిగ్గుపడ్డాను”
ఈ సంభాషణ కూడా చెప్పాడు వాసు. అది విన్నాక జరిగినదాంట్లో తన తప్పులేదని కూతురితో అనలేకపోయింది మహతి.
“ఆవిడ పోయిందటకదా?” అడిగింది తులసి.
“ఔను. రెండేళ్లైంది. హైఫీవర్లో సెరిబ్రల్ హెమరేజి వచ్చి పోయిందట”
“పిల్లలు ఎంతెంతవాళ్ళు?”
“ఇంటరూ తొమ్మిదీ అనుకుంటా. వద్దే అన్నా వినదు మేఘన. ఆ పిల్లలగురించి చెప్తుంది. దానికి అందులో సంతోషం కనిపించింది. వదిలేసాను”
“పేచప్ చేసుకుంటారా మహీ? ఇంకో పాతికేళ్ళో ముప్పయ్యేళ్ళో ఒకరికొకరు తోడుగా వుంటారు”
“అతనికి నేనెవర్ని?”
“అదేంటి?”
నిజమే. తెగిపోయిన బంధం అది. నిట్టూర్చింది తులసి. తనకి ఒక ప్రబుద్ధుడు తెలుసు. మొదట ఒక పెళ్ళిచేసుకుని, కొడుకు పుట్టాక విడాకులిచ్చి వేరే పెళ్ళి చేసుకున్నాడు. కొడుకుని చూడటానికి వెళ్ళేక్రమంలో మొదటామెతో సంబంధాన్ని కొనసాగించాడు. విడాకులయ్యాకకూడా ఆమెకి ఒక కూతురు పుట్టింది. ఇటు రెండోభార్యకీ పిల్లలు. అతను పోయినప్పుడు ఆస్తులూ పంపకాల విషయమై గొడవలు వచ్చినప్పుడు ,
“ఉంచుకున్నదానికి పుట్టావు. నీకేమీ యివ్వం” అన్నారట రెండోభార్య పిల్లలు. వాళ్ళ అక్కసు అలా తీర్చుకున్నారు. స్వంత అన్నగారు మాట్లాడడు. తల్లి యేడుస్తుంది. కోర్టుకి వెళ్తే యీమెకీ అక్రమసంతానంగానైనా మిగతావాళ్లతో సమానంగా హక్కులుంటాయి. వాటా వస్తుంది. కానీ తీర్పు వాళ్ళ మనసుల్లో ప్రేమనీ, గౌరవాన్నీ నింపదు.