(ఆంధ్రభూమి దినపత్రిక ఉగాది నవలలపోటీలో ద్వితీయబహుమతి పొందిన నవల. 18.5.2006 నుంచి 30.6.2006 వరకు ప్రచురించబడింది)
పెళ్ళి అనేది స్త్రీ పురుష సంబంధాలని నిర్దేశించే లక్ష్మణరేఖైతే నా జీవితం ఆ రేఖకి అవతలివైపున మొదలైంది. పెళ్లితో స్త్రీకి జీవితం మొదలవుతుందంటారు. రాజ్‍మోహన్‍తో నా పరిచయం అలాంటి ప్రారంభం. అందులోని అసహజత నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
దాదాపు నెలైంది రాజ్‍మోహన్‍కి హార్టెటాక్ వచ్చి. అతన్ని హాస్పిటల్లో చేర్చారట. ఐసీయూలో వుంచారట. సర్జరీ, డిశ్చార్జి కూడా అయి యింటికి తిరిగొచ్చాడని తెలిసింది. కానీ యిప్పటిదాకా నాతో ఆ విషయం ఎవరూ చెప్పలేదు. నన్ను చూడటానికి రమ్మనలేదు. నాకుగా వెళ్లాలంటే ఏదో సంకోచం… ఆ యింటి తలుపులు నాకోసం తెరుచుకోవని.
నిశ్చింతగా వున్న జీవితం ఒక్కసారి కుదుపుకి లోనైంది. అప్పటిదాకా అతని ప్రేమని తప్ప మరే విషయాన్నీ పట్టించుకోని నాలో సన్నగా భయం… భవిష్యత్తు ఎలా వుండబోతోందోనని. పిల్లలు తండ్రికోసం బాగా బెంగపెట్టుకున్నారు. చిన్నది, సుమకి జ్వరం వస్తోంది. ఒక్కసారి వచ్చి వెళ్తానని అతని పర్సనల్ నెంబర్‍కి చేస్తున్నాను. ఎవరూ ఎత్తడం లేదు. ఎత్తినా నాపేరు విని పెట్టేస్తున్నారు. జవాబు ఇవ్వడం లేదు. ఏడుపు వస్తోంది. నేను ఏడిస్తే సుధ, సుమ బెంగపడతారని నాలోనే దిగమింగుతున్నాను.
ఏమనుకుంటున్నారు వీళ్లు నా గురించి? నేనొకదాన్ని వున్నానని ఎవరికైనా గుర్తుందా? ఎవరికీ కాకపోయినా, కనీసం రాజ్‍కి? నాది మాత్రం మనసు కాదా? నాకుమాత్రం బాధలేదా? కళ్లలో నీళ్లు తిరిగాయి. మళ్లీ అంతలోనే ఆందోళన. ఆస్తులకీ, ఆదాయాలకీ సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నీ యీపాటికి తీసేసుకుని వుంటారు. నన్నూ, పిల్లల్నీ ఏం చెయ్యబోతున్నారో? నేను డబ్బుమనిషిని కాదు. ఆస్తులు అక్కర్లేదు. అతన్నుంచీ ఎప్పుడూ డబ్బు ఆశించలేదు. అన్నీ అతనే చూసుకునేవాడు. కానీ మనిషికి బ్రతకాల్సిన అవసరం వుండి, బతుకులెక్కలన్నీ డబ్బు భాషలోనే జరుగుతున్నపుడు అది లేకుండా ఎలా? అదికూడా ఆరేళ్ల సుదీర్ఘమైన అంతఃపురవాసం తర్వాత. భవిష్యత్తు చీకట్లోంచి వేలాడుతున్న జీబూతంలా భయపెడ్తోంది.
అతనికోసం యిల్లొదిలిపెట్టేసి వచ్చిన యిన్నేళ్లకి మొట్టమొదటిసారిగా నేను చేసిన పని ఎంత అనుచితమైనదో గ్రహించాను. అందులో అసంబద్ధతే కాదు, లోకవిరుద్ధమైనవి ఎన్నో వున్నాయి. లేకపోతే భర్త మృత్యునీడల్లో తారట్లాడుతుంటే భార్యాపిల్లలు అతన్ని చూడకుండా వుండటమనేది ఎవరి విషయంలోనూ జరిగివుండదు.
అసలింతకీ నేనతని భార్యనేనా?
కాకపోతే దుష్యంతుడికి శకుంతల… ఆమెకి పుట్టిన భరతుడు… అతనిద్వారా నిలచిన భరతవంశం…
అర్జునుడికి సుభద్ర… ఆమెకి కలిగిన అభిమన్యుడు… అతని భార్య ఉత్తర, వాళ్ల కొడుకు పరీక్షిత్తు నిలిపిన కురువంశం…
ఇవన్నీ మనం చదువుకోవడం, అన్నీ అర్థరహితమైనవే.
నన్ను తీసికెళ్లడానికి రాజ్‍మోహన్ యింటినుంచి కారొచ్చింది. అదతనిది కాదు. ప్రమీలాదేవిది. డ్రైవరు కూడా ఆమె మనిషే. అంటే… ఆమె పంపించిందన్నమాట!
“ఎలా వుంది వారికి?” కార్లో కూర్చుంటూ అడిగాను. అలా అడగకుండా వుండలేకపోయాను. డ్రైవరు నా ప్రశ్నకి జవాబివ్వలేదు. తల తిప్పి మాత్రం చూసాడు. అతని చూపుల్లో అసహనంతో కూడిన చులకనభావం. యజమానుల అభిప్రాయాలు పనివారిలో ప్రతిబింబిస్తాయా? నమ్మకస్తులంటే ఇదేనా? నాకు చివుక్కుమంది. ఇతనే… రాజ్ నా పక్కన వుంటే వంగి సెల్యూట్ కొట్టేవాడు. గౌరవం అనేది మనిషి వున్న పరిస్థితినిబట్టి ఎలా మారుతుందో అర్థమైంది.
అక్కడ ఎలావుందో! నా అణువణువునా భయం ప్రవేశించింది. కారు రాజప్రాసాదంలాంటి ఆవరణలో ప్రవేశించింది. అక్కడింకా చాలా కార్లు, స్కూటర్లు, రకరకాల వాహనాలు ఆగివున్నాయి. అతనిది చాలా పెద్దకుటుంబం. అన్నదమ్ములతో కలిసి ఉమ్మడి వ్యాపారం. దూరంనుంచీ చూడటమేగానీ నేనెప్పుడూ యిక్కడికి రాలేదు. ఇంత హడావిడి చూసి నా భయం పెరిగిపోయింది. అతన్ని ఆఖరిసారి చూడటానికా, నేనొచ్చినది? మంచుతరంగం నా నిలువెల్లా పాకినట్టు వణికిపోయాను. ఉద్వేగాన్ని తట్టుకోలేక అరచేతుల్లో ముఖాన్ని దాచుకున్నాను. చిన్న కుదుపుతో కారు ఆగడాన్ని గుర్తించి సర్దుకున్నాను. నాకు తెలుసు, నేనిక్కడ ఏడ్చినా, బాధని ప్రదర్శించినా అది నటనగానే గుర్తింపబడుతుందని.
కారు డోర్ తెరుచుకుని దిగగానే నాకోసం ఎదురు చూస్తున్న వ్యక్తి నన్ను లోపలికి తీసుకెళ్లాడు. ముందుగది దాటుకుని విశాలమైన హాల్లో కొంతదూరం నడిచాక కుడివైపుని రాజ్ గది. హాల్లో గుంపులుగుంపులుగా మనుషులున్నారు. నన్ను చూసి మాటలాపేసారు. వాళ్లలో కుతూహలం. అందరికీ నా గురించి తెలుసు. కొందరికి నేను తెలుసు. చాలా కొద్దిమంది నాకు తెలుసు. రాజ్ బిజినెస్ టూర్లకి వెళ్లినపుడు పరిచయం. కానీ నేనెవర్నో తెలీనట్టు వుండిపోయారు. అంతమంది చూపులు ఒక్కసారి నామీద పడేసరికి చాలా యిబ్బందనిపించింది. వాళ్లలో ముఖ్యంగా రాజ్ బంధువులు శూలాల్లాంటి చూపుల్తో ద్వేషంగా చూస్తున్నారు. అది నాకు వెనకనుంచీ కూడా తెలుస్తోంది.
అందర్నీ దాటుకుని రాజ్ గదిలోకి అడుగుపెట్టాకగానీ నాకు వూపిరి దొరకలేదు. అదేనా అతన్నక్కడ చూసాకే. లేకపోతే ఆ గదీ, అక్కడి ఐశ్వర్యంకూడా నాకు అపరిచితమైనవే. ఎంత పెద్ద గది! చలువరాతి నేల… గోడలకి డిస్టెంపరు… ఖరీదైన రోజ్‍వుడ్ ఫర్నిచర్… గోడలకి పెద్దపెద్ద రేక్స్, వాటినిండా రకరకాల పుస్తకాలు… అంతా విలాసవంతమైన వాతావరణం. ఆమధ్యలో సోఫాలో విశ్రాంతిగా కూర్చున్న రాజ్… అతన్నలా చూడగానే నాకెంతో సంతోషం కలిగింది. ఇన్నిరోజులుగా నేను అనుభవించిన వేదన, యిక్కడికొచ్చిన ఈ క్షణందాకా పడ్డ టెన్షన్ మంచులా కరిగిపోయాయి.
“హలో! హౌ ఆర్యూ?” చిరునవ్వుతో తనే అడిగాడు. మనిషి యిదివరకటిమీద ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ బిజినెస్ టూర్లు, వ్యవహారాలతో నలిగిపోయి వుండేవాడు. ఈనెలరోజుల విశ్రాంతితో కొద్దిగా తేరుకున్నట్టున్నాడు. ఒక్కొక్కప్పుడు అనారోగ్యమే మనపాలిట వరమౌతుంది. కానీ అతను పలకరించినతీరు నాకేదో దూరాన్ని నిర్దేశించినట్లైంది.
“పిల్లలెలా వున్నారు? స్కూలు కెళ్లారా?” అడిగాడు. తలూపాను. వాళ్లనెందుకు తీసుకురాలేదని అడుగుతాడనుకున్నాను. అడగలేదు.
“బెంగ పెట్టుకున్నారా? నాకూ అలానే వుంది. చూడాలని చాలా అనిపిస్తోంది. ఐనా యిప్పుడు కాదులే. వాళ్లని తీసుకురావద్దని నేనే చెప్పాలనుకున్నాను. ప్రమీల నీతో మాట్లాడుతుందట. పిల్లలెదురుగా ఎందుకు అవన్నీ?”” అన్నాడు. ప్రమీలంటే ప్రమీలాదేవి. అతని భార్య. మొదటి భార్య. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే లీగల్ భార్య.
నేను రాజ్‍కేసి సూటిగా చూసాను. అంతకుముందు మా యిద్దరికీ సంబంధించిన విషయాలన్నీ అతనే నిర్ణయించేవాడు. ఇప్పుడా అధికారాలు అతని చెయ్యి దాటాయా? నా ఆలోచనలు అంతకుమించి వెళ్లలేదు. అసలేం జరగబోతోందనే విషయం నా వూహకి అందనిది.
“కూర్చో వసంతా!” నా చూపుల్ని తప్పించుకుంటూ అన్నాడు.
కూర్చున్నాను.
“నీ ఆరోగ్యం ఎలావుంది?” ఆరాటంగా అడిగాను. అతను భుజాలు ఎగరేశాడు.
“చూస్తున్నావుగా? ఐదు లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకున్నాక బావుండకేం చేస్తుంది? ఐతే టెన్షన్లు తగ్గించుకోమన్నారు డాక్టర్లు. అలా ప్రమీలాదేవి ఖైదులో బందీనైపోయాను. అన్నీ తనే చూసుకుంటోంది. చాలా కేపబుల్” అన్నాడు.
నాకతన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నన్నూ పిల్లల్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి వుండలేకపోయేవాడు. అలాంటి వ్యక్తిలో ఎంతమార్పు? ఇంత నిబ్బరంగా ఎలా వుండగలుగుతున్నాడు? “
“నేను నీకొక్కసారైనా గుర్తురాలేదా?” రోషంగా అడిగాను. అతను నవ్వేసాడు. నేను కన్నీళ్లపుకునే ప్రయత్నంలో తల దించుకున్నాను. లేచి నెమ్మదిగా నా దగ్గరకొచ్చాడు. వెనగ్గా నిలబడి భుజాలమీద చేతులేసి, మంద్రస్వరంతో అడిగాడు.
“గుర్తురాలేదని ఎందుకనుకుంటున్నావు?”
చాలారోజుల తర్వాత అతని స్పర్శ… మృత్యువు ఆలింగనాన్ని పొందిన అతని స్పర్శ… దిగ్గుమని తలతిప్పి వెనక్కి చూసాను. అతను షర్టు వేసుకోలేదు. షాల్ కూడా సరిగా కప్పుకోలేదు. ఛాతీమీద ఆపరేషన్ తాలూకూ గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంక నిగ్రహించుకోవడం నావలన కాలేదు. భుజాలమీంచీ అతని చేతుల్ని లాక్కుని వాటిలో ముఖం దాచుకుని బావురుమని ఏడ్చేసాను. అతను ఓదారుస్తూ వుండిపోయాడు.
“రాజ్! నీ డబ్బు చూసి నేను ప్రేమించలేదు. నాకు నీ డబ్బూ, ఆస్తీ ఏదీ వద్దు. ఎందులోనూ వాటాకి రాను. నన్ను దూరం చేయకు”” ఎక్కెక్కిపడ్తూ అన్నాను. అతను మాట్లాడలేదు. ఆ మౌనం వెనకాల ఏదో వుందనిగాని వుండచ్చనిగానీ నేననుకోలేదు. అసలతన్నిగానీ అతని ప్రేమనిగానీ ఎప్పుడూ అనుమానించలేదు. ఇప్పుడు కూడా. అతన్నుంచీ ఎప్పుడూ ఏదీ ఆశించలేదు. నాకు మాత్రం అతనంటే ప్రేమ. పిచ్చి ప్రేమ.
నాకన్నా దాదాపు పదిహేనేళ్లు పెద్దవాడైన రాజ్‍తో నా పరిచయం గోవాలో జరిగింది. ఫ్రెండ్స్‌తో గోవా ఎక్స్‌కర్షన్‍కి వెళ్లాను. ఇతనక్కడికి బిజినెస్ పనిమీద వచ్చాడు. ఒక చిన్న పరిచయం… అంతే! అతను నన్ను మాయ చేసేసాడు. ఒక రాత్రంతా గోవా బీచిలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం.
వెన్నెల అందం… చీకటి సొగసు… చిరునవ్వు మెరుపు… యివి ప్రేమికులకే తెలుస్తాయి. ఆ ప్రేమనేది ఎప్పుడు పుడ్తుందో తెలీదు. దాని లోతెంతో తెలీదు. పుట్టాక దాని తీవ్రత పెరుగుతుంది. దిగినకొద్దీ లోతు పెరుగుతూనే వుంటుంది. నిజమైన ప్రేమలో లోపలికి కూరుకుపోవడమేగానీ బైటికి రావడం వుండదు.
మా ఎక్స్‌కర్షన్ ముగిసింది. అతనూ తిరిగి వెళ్లిపోవాలి. ఎన్నో స్వీట్ నథింగ్స్ చెప్పుకున్నాం. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయాక కూడా నాకు పగలూ రాత్రీ అతని ధ్యాసే. అతనికి అప్పటికే పెళ్లైందేమోనన్న ఆలోచన రాలేదు. అతని విరహంలో వేగిపోయాను. అతని స్పర్శకోసం తనువు తహతహలాడేది. అతని గొంతు, అతని చూపు… ఈ అన్నిటికోసం అణువణువూ తపించిపోయేది. ఇంక నిలువరించుకోలేక ఒకరోజు ఉదయాన్నే అన్ని బంధాలూ తెంచేసుకుని అతని దగ్గరికి వెళ్లిపోయాను. ముందు తెల్లబోయాడు. నన్ను తిరిగి వెళ్లిపొమ్మన్నాడు. భౌతికమైన, సామాజికమైన కట్టుబాట్లకి అతీతంగా వున్న నా పట్టుదల చూసి కరిగిపోయాడు.
నాకోసం ఒక యిల్లు… అందులో అతను, నేను. అతనికి వేరే కుటుంబం వుంది. అక్కడికి వెళ్లి రెండేసి రోజులు వుండిపోయేవాడు. అక్కడికి వెళ్ళేప్పుడు నిరుత్సాహంగా వెళ్ళేవాడు. ఇక్కడ వున్నప్పుడు సంతోషంగా వున్నా, మళ్ళీ ఆ నిరుత్సాహం ఒక అలలా తిరిగితిరిగి వచ్చేది. అవేవీ నాకు పట్టేవికాదు. అసలతన్నుంచీ నేనేదైనా ఆశించినప్పుడుకద!
గదిబైట అడుగుల చప్పుడు విని ఆలోచనల్లోంచీ తేరుకున్నాను. రాజ్ నన్నొదిలేసి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. నేను కూడా రుమాలుతో ముఖం తుడుచుకుని సర్దుకుని కూర్చున్నాను. పనివాడొచ్చాడు. అతని చేతుల్లో ట్రే వుంది. అందులో గాజుగ్లాసులో పళ్లరసం, కప్పులో టీ వున్నాయి. పళ్లరసం రాజ్‍కి ఇచ్చి టీ కప్పు నా ముందున్న టీపాయ్‍మీద వుంచాడు.
“అమ్మగారొస్తున్నారు”” చెప్పేసి వెళ్లాడు. నాకు నెర్వస్‍గా అనిపించింది. ప్రమీలాదేవిని నేనెప్పుడూ కలుసుకోలేదు. రాజ్ దగ్గిర ఫొటో చూసానంతే. పెద్ద అందంగా లేదు. కానీ యీ యింటికీ, అతని జీవితానికీ మహారాణి. ఏం మాట్లాడుతుందో నాతో? ఎందుకు పిలిపించింది? ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు అలాంటి అవసరం ఎందుకొచ్చింది? లేక అవకాశం తీసుకుందా? రాజ్ ఎందుకు వప్పుకున్నాడు? మా విషయంలో ఆమె ప్రమేయమేమిటి? అనేక ప్రశ్నలు నా మెదడులో హోరెత్తిపోతుంటే… సరిగ్గా అదే సమయానికి తలుపు దగ్గర సన్నగా మువ్వల చప్పుడు వినిపించింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.