తిరస్కృతులు – 10 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

“పెళ్లంటే యిదేనా, ప్రభాకర్?” అడిగాను విహ్వలంగా. నాకెందుకో ప్రమీలాదేవి గుర్తొచ్చింది ఆ క్షణాన. రాజ్ జీవితంలోకి ప్రవేశించిన నేను ఆమెకోణంలోంచీ నాకే కనిపించాను.
“అంతేనేమో!” అన్నాడు. “కలవని మనసులు… కలవని అవసరాలు… ఎప్పటికీ పెరగని అనుబంధం… అంతేనేమో!” అని, “దాన్ని మళ్లీ పంపించకుండా వుండివుంటే బ్రతికేది కావచ్చు. కానీ అలాంటి బ్రతుక్కన్నా అక్కడి చావేనయమనిపించింది మా అమ్మానాన్నలకి, అది చచ్చిపోయిందన్న వార్త విన్నాక మా నాన్నగారిలో పశ్చాత్తాపం మొదలైంది. డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఇంక మళ్లీ తేరుకోలేదు” మళ్లీ తనే అన్నాడు.
“నువ్వు తిరగబడలేదా?” అడిగాను.
“అప్పుడు మా వయసులెంతని? దానికి పద్ధెనిమిది, నాకు పంథొమ్మిది”
“…”
“సరిగ్గా మా చెల్లిలాంటి నిస్సహాయ పరిస్థితుల్లోనే వున్నావనిపించేవు వసంతా, ఆరోజు రైల్లో నిన్ను చూడగానే”
“అలా ఎందుకనిపించింది ప్రభాకర్?” నా గొంతు వణికింది.
“నువ్వున్న అసహజమైన పరిస్థితులచేత. ఎవరూ తెలీని వూళ్లోకి ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక ఆడపిల్ల వంటరిగా వచ్చిందంటే దానర్థం ఏమిటి? నీకు మేమేదో చేసామని కాదు. మనిషి మానసికంగా బలహీనపడే స్థితి ఒకటి వచ్చినప్పుడు చిన్నపాటి సానుకూల స్పందన… ఒకింత నైతికస్థయిర్యం యివ్వగలిగితే చాలు, అతడా పరిస్థితినించీ బైటపడతాడు. ఆరోజుని మా చెల్లెలికి యివ్వలేనిది నీకు యిచ్చాం అంతే”
“నిజమే ప్రభాకర్. ఆరోజుని మీయింట్లో ఆశ్రయం దొరక్కపోతే చాలా యిబ్బందులు పడేదాన్ని” వప్పుకున్నాను. నిజాయితీగా. అతను నవ్వేసాడు.
“నువ్వా? ఇబ్బందిపడటమా? నెవ్వర్. ఏ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లోనో దిగేసేదానివి… తప్పుగా అనుకోకు. ఎక్కడిది నీకింత ధైర్యం? నీ బోల్డ్‌నెస్ చూస్తే ఎవరికీ నీ గురించి తప్పుగా ఆలోచించాలనిపించదు. అమ్మాయిలంతా నీలా వుంటే చాలా బావుంటుంది. కదూ?” అన్నాడు ఆరాధనగా.
నా గుండె బరువెక్కింది. అతను చిన్నగా నవ్వి, నా భుజాలచుట్టూ చెయ్యేసి అన్నాడు. “బాధని మనసులో దాచుకుంటే కఠినశిలలా అలాగే వుండిపోతుంది. దాన్ని మాటల్లో వ్యక్తపరిస్తే మంచులా కరిగిపోతుంది. మనసెంతో తేలికపడుతుంది”
నాకు కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. అతనికి దగ్గరగా జరిగి నా భుజంమీద వున్న అతని చేతిని కళ్లమీద వుంచుకున్నాను. నా కంటితడి తగిలిన తన అరచేతిని అలా చేసుకుంటూ వుండిపోయాడు చాలాసేపు.
“అన్నీ వివరంగా చెప్తాను ప్రభాకర్! మన పెళ్ళి ఏ విధంగానూ సాధ్యపడదు. దయచేసి అర్థం చేసుకో” నెమ్మదిగా అన్నాను.
ఇంతలో యిల్లొచ్చింది. రుమాలుతో ముఖం తుడుచుకుని దిగాను. నా వెనకాలే అతనూ వచ్చాడు. లోపలికి రాలేదు. వాళ్ల పోర్షన్లోకి వెళ్లిపోయాడు. మైకేల్ వచ్చి వున్నాడు. తన సీట్లో కూర్చుని ఏవో బిల్లులు లెక్కచూస్తున్నాడు. అవసరం = డబ్బు+సేవ అనే సూత్రం ఎప్పుడూ కూడా బాగా వర్కౌట్ అవుతుంది.
మైకేల్ నాకేసి కుతూహలంగా చూసాడు. నాకర్థమైంది. ప్రభాకర్ యిలా అడుగుతాడని అతనికి ముందే తెలుసని. అదే అడిగాను.
“ప్రభాకర్‍కి యిలాంటి అభిప్రాయం వుందని నీకు తెలుసా మైకేల్?” నా ప్రశ్నకి అతను వెంటనే జవాబివ్వలేదు. ముందున్న కాగితాలు సరిచేస్తూ వుండిపోయాడు.
“చెప్పు మైకేల్! అలాంటి అభిప్రాయం అతన్లో కలిగేలా ఎప్పుడేనా ప్రవర్తించానా?”” నా గొంతు వణికింది.
“నీ ప్రవర్తనలోనూ లోపం లేదు. ప్రభాకర్ అలా అడగడంలోనూ తప్పులేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనేది వాడి కోరికే కాదు, నా ఆకాంక్ష కూడా”” అని కొద్దిక్షణాలు ఆగి మళ్లీ తనే అన్నాడు. “నువ్వు నాకన్నా చిన్నదానివిగాబట్టి చేతులెత్తి నమస్కరించడంలేదు. కానీ నీకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా మా యింట్లో ఒక్కరోజు కూడా గడవదు. జీతమంతా తాగుడికే ఖర్చుచేసి యింట్లో రణరంగం సృష్టించే నాన్న… నిస్సహాయంగా ఏడ్చే అమ్మ, పెళ్లికెదిగిన యిద్దరు చెల్లెళ్లు… ప్రతిక్షణం ఎంత టెన్షన్‍గా వుండేదో తెలుసా? ఆరోజుని ప్రభాకర్ నా దగ్గరకొచ్చి తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏదో కన్సల్టెన్సీ పెడుతుందనీ నన్నందులో చేరమనీ అడిగినప్పుడు అంతా సిల్లీగా అనిపించింది. కానీ నువ్వు చకచక లెక్కలవీ చెప్తుంటే కొంత నమ్మకం, ఆశ కలిగాయి. ఈ కన్సల్టెన్సీ కొనసాగే అవకాశాలున్నాయని అర్ధమైంది. అప్పుడు కూడా అయిష్టంగానే, నువ్విచ్చే జీతం చూసే చేరాను. వసంతా! వెయ్యి రూపాయలనేది చాలా చిన్న మొత్తం. కానీ కుటుంబబాధ్యతలు వుండి, సంపాదించే మార్గం లేక అల్లల్లాడేవాళ్లకి ఆ చిన్న మొత్తానికే వున్న విలువ చాలా ఎక్కువ. నీ దగ్గరకి రాకముందు ఎంతమందికి ఎన్ని దండాలు పెడితే ఆపాటి డబ్బు చేతికొచ్చేదో తెలుసా? ఎంత చేసినా డబ్బుగా ఎవరూ ఇవ్వరు. బిర్యానీ పొట్లం, తాగడానికి సారాపేకెట్టు ఇలా వుంటాయి పేమెంట్లు”
ఇదంతా నాకు తెలీని విషయం. ఒక కొత్త ప్రపంచం. ఎలాంటి సొఫిస్టికేషన్ వుండదు. దానికి ఇతను ఒక కిటికీలాంటివాడు. తొంగిచూడచ్చు.
“ఇపుడిదంతా ఎందుకు చెప్తున్నావు?”
“ఆ పాయింటుకే వస్తున్నాను. నీ ఆర్గనైజింగ్ కెపాసిటీకి నేను ఆశ్చర్యపడని సందర్భం లేదు. నువ్వెవరో బాగా డబ్బున్న అమ్మాయివనీ, యింట్లో దెబ్బలాడి వచ్చి యిలా వుంటున్నావనీ అనుకున్నాం మొదట్లో. కానీ ప్రతిక్షణం నీ కళ్లలో కదలాడే విషాదం, కనిపించే వెతుకులాట, నీ వయసు అమ్మాయిలకి అసాధారణమైన నీ సీరియస్‍నెస్… ఇవన్నీ చూసాక నువ్వు జీవితంలో మోసపోయి వుంటావని గ్రహించాం. ఐనా ప్రభాకర్ తనకి నీ గతంతో సంబంధం లేదన్నాడు. వాడు చాలా మంచివాడు. నిజాయితీపరుడు. మీ యిద్దరూ పెళ్లి చేసుకుంటే ఈ కన్సల్టెన్సీ ఎప్పుడు
మూతపడుతుందోననే టెన్షన్ మాకుండదు “
“మై…కే…ల్!!”
“ఎంతోమంది పిల్లలు మైక్, మాకేదైనా పనిచెప్తావా? అని వస్తుంటారు. అక్షరాస్యతకోసం పోరాటాలు చేస్తుంటాం. కానీ చిన్నచిన్న చేతులుకూడా పిడికెడు గింజలు సంపాదించితేగానీ దినం గడవని సమాజం మనది. మధ్యాహ్నం భోజనం పెడతారు. స్కూలుకి వెళ్తేనే. ఎందరు స్కూళ్ళకి వెళ్ళగలరు వసంతా? కటికపేదరికంలో మగ్గే, తాగుబోతుతనంతో కునారిల్లే, మగవాడిననే అహంకారంతో మిడిసిపడే ఎందరు తండ్రులు తమ పిల్లలు స్కూలుకి వెళ్ళే అవకాశాలు కల్పించగలరంటావు? మన కన్సల్టెన్సీకోసం చేస్తూ చదువుకుంటున్నవాళ్లు ఎంతోమంది. వాళ్లందరికోసం…”
“…”
“ఎవరో ముఠాని తయారుచేస్తే అందులో చేరే కూలీలు, యింకెవరో సంస్థని మొదలుపెడితే అందులో గుమాస్తాలుగా చేరేవాళ్లు… అందరూ ఆర్గనైజర్లు కారు, కాలేరు. అందరిలోనూ ఒకేలాంటి తెలివితేటలూ, నైపుణ్యాలూ వుండవు. ఏ యిద్దర్లోనైనా అలాంటి సారూప్యత వున్నా, వాళ్లిద్దరికీ ఒకేలాంటి అవకాశాలుండవు. ఆలోచించు వసంతా! నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావు. మేం బతుకుతున్నాం. మాకోసం… మీరిద్దరూ పెళ్ళిచేసుకోండి. ఆలోచించు… కాదనకుండా వుండేందుకు… మరి నే వెళ్లగలనా? గుడ్‍నైట్” అతను వెళ్లిపోయాడు.
ప్రభాకర్ మొదట్నుంచీ నాపట్ల యిష్టాన్నీ ఆసక్తినీ చూపించాడు. ఆ రెండూ యిలాంటి ప్రతిపాదనకి దారి తీస్తాయనుకోలేదు. ఇప్పుడా ప్రతిపాదన యీ కన్సల్టెన్సీ కొనసాగింపు సమస్యగా రూపుదిద్దుకుంది. రాజ్‍తో నేను చెయ్యబోయే యుద్ధం ఎలా ముగుస్తుందో తెలీదు. అసలు ప్రారంభమేకాని యుద్ధం. ఈ ప్రభాకర్‍గానీ మైకేల్‍గాగానీ వాళ్లంతట వాళ్లు ఏదీ చెయ్యలేరు. వెనకాల ఎవరో ఒకరుండి నడిపించాలి. ఈ పెళ్ళి విషయం పక్కన వుంచితే అటువంటివాళ్లు రాజ్ విషయంలో నాకేదో చెయ్యగలరనేది సందేహాస్పదమే. నేనసలు ప్రభాకర్‍ని చేసుకోగలనా? రాజమోహన్ ప్రేమే వూపిరిగా బ్రతికిన నేను ప్రభాకర్ స్పర్శ భరించగలనా? పెళ్లి చేసుకోవడమంటే పిల్లల దగ్గిరకి నాదారి మూసుకుపోతుంది. ఆ అంకానికి శాశ్వతంగా తెరపడుతుంది. ఇదంతా యిలా జరగాలని ఆశించే ప్రమీలాదేవి పిల్లల్ని లాక్కుందా?
ఇప్పటివరకూ ఇదంతా నాకు మాత్రమే పరిమితమైనది. నాణానికి ఒకవైపు మాత్రమే. నా గురించి తెలిసాక ప్రభాకర్ ఆలోచన ఎలా వుంటుంది? నా గతంతో సంబంధం లేదని యిప్పుడు ఏమీ తెలీకముందు అన్నంత తేలికకాదు, అన్నీ తెలిసాక అలా అనడం.
మగవాడు గుంభనగా వుంటే మేరునగధీరుడనీ మరోటనీ కీర్తించే సమాజం ఆడవారి విషయంలోమాత్రం ఏముందో తెలుసుకునేదాకా వూరుకోదు. ఎందుకు ప్రభాకర్‍కి ఈ ప్రేమ, పెళ్ళీ ఆలోచన పుట్టాలి? ఆడవారిని చూస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయా? సాయం, కృతజ్ఞత, ప్రతిసాయం, నిలదొక్కుకోవటంకదా, మామధ్య వుండాల్సినది? నిస్సహాయంగా అనిపించింది.
ఒక్కసారి భయంకరమైన నిస్పృహ నన్ను ఆవహించింది. రాజ్, నేను పెళ్లి చేసుకోలేదు. ఇలా విడిపోతామనీ అనుకోలేదు. స్నేహం చేస్తూ ఎవరూ జీవితాంతం విడిపోమనే ఒప్పందం చేసుకోరు. పెళ్ళి చేసుకున్నవాళ్ళు చేసుకుంటారు. ధర్మార్థకామమోక్షాలలో ఆ స్త్రీ చెయ్యి విడవనని మగవాడు ప్రమాణం చేస్తాడు. ఆమె మనసా కర్మణా వాచా అతన్ని అనుసరిస్తుంది. వాస్తవం వేరేలా వుండచ్చు. కానీ వప్పందాలు మాటల్లోనూ, మంత్రాల్లోనూ, మనసుల్లోనూ ఇంకిపోయి, ఇమిడిపోయి వుంటాయి. చట్టాల్లోనూ వుంటాయి. కానీ, స్నేహం చేస్తున్నప్పుడూ, ప్రేమించుకుంటున్నప్పుడూ మనసు పొందే అనుభూతి ప్రకృతి వడంబడిక. అది శాశ్వతమైనదే అయినా చట్టబద్ధత వుండదు. అందుకే నేను రాజ్‍ని మర్చిపోలేకపోతున్నాను.
“వసూ!”” అని ఎక్కణ్నుంచో అతను పిలుస్తున్నట్టే వుంటుంది.
“అమ్మా!” అని సుమ అంటున్నట్టే వుంటుంది. సుధ కిలకిల నవ్వుతున్నట్టే అనిపిస్తుంది. ఎలా వున్నారో పిల్లలిద్దరూ? ఆరోజుని ఓటమిని వప్పుకున్నట్టు ఎలా వచ్చేసాను? ఏడిచో, అరిచో, దెబ్బలాడో నాతో వాళ్లని ఎందుకు తెచ్చుకోలేదు? అంత నిస్సహాయత ఎక్కడ్నుంచి వచ్చింది?
నా నైతికబలం, మనోధైర్యం అన్నీ అతనే. అలాంటి వ్యక్తి కొట్టిన దెబ్బ నన్ను అశక్తురాలిని చేసింది. అందుకే ఏమీ చెయ్యలేకపోయాను. నా వెనుక ఆ జీవితపు తలుపులు మూసుకుపోయాయి.
నా ఆలోచనల్లోంచీ ప్రభాకర్, అతని ప్రతిపాదన అన్నీ తొలగిపోయి నాకు నేను ఒంటరిగా మిగిలిపోయాను.
సూట్‍కేసులో చీరల అడుగున జాగ్రత్తగా దాచిన ఆల్బం తీసి ఒక్కొక్క ఫోటో చూస్తూ ఆపుకోలేనంతగా ఏడ్చేసాను. ఏడ్చేడ్చి అలసిపోయి మంచంమీద ఒక మూలకి ముడుచుకుని పడుక్కున్నాను. గదంతా మరింత విశాలంగా అనిపించి, కాసేపటికి ఆ గదే ప్రపంచమంతా విస్తరించినట్లైంది. అంత విశాలమైనచోట నా వంటరితనం విశ్వరూపం దాల్చి మరింతగా నన్నాక్రమించింది. దు:ఖం. నిలువునా కుదిపేసేంత దు:ఖం… ఎప్పటికో నిద్రపట్టింది.
ఉదయం ప్రభాకర్ వచ్చి తలుపు తట్టాడు. మెళకువ వచ్చింది. ఆల్బం సూట్‍కేసులో పెట్టేసి తలుపు తీసాను. అతను నాకు అభిముఖంగా నిలబడి, ముఖం లోకి చూస్తూ, “రాత్రంతా ఏడ్చావా?” అడిగాడు
తలదించుకున్నాను. మళ్లీ వుబికివచ్చేలా వున్నాయి కన్నీళ్లు.
“అంతగా డిస్టర్బ్ చేసానా నిన్ను? ఇప్పటిదాకా నువ్వు దాటేస్తూ వచ్చావు. అసలెవరు వసంతా నువ్వు?””
“గాలికి కొట్టుకొచ్చిన గడ్డిపోచని. ఎండమావిని. వెంటపడితే మిగిలేదంటూ ఏదీ వుండదు” అన్నాను. నా గొంతులో నాకే భయంకొల్పేంత కాఠిన్యం.
అతనొక్క క్షణంసేపు నన్ను వింతగా చూసాడు. తర్వాత నవ్వేసి “”రాత్రంతా ఏడ్చి నువ్వు తెలుసుకున్న నిజం యిదన్నమాట! వెరీగుడ్” అన్నాడు అదే నవ్వుతో, ఇంతలో మైకేల్ వచ్చాడు. అలా నిలబడ్డ మా యిద్దర్నీ చూసి చిరునవ్వుతో విష్ చేసాడు.
“రా, మైకేల్ కూర్చో. ఇప్పుడే వస్తాను” అంటూ వెనక్కి తిరిగి పెరట్లోకి వెళ్లాను. నేను బ్రష్ చేసుకుని తిరిగొచ్చేసరికి కాఫీ రెడీగా వుంది. మైకేల్ యిలాంటి చిన్న చిన్న పనులు యిష్టంగా చేస్తాడు. థాంక్స్ చెప్పి కప్పు అందుకుని వాళ్లిద్దరికీ ఎదురుగా కూర్చున్నాను.