“పెళ్ళవకుండా అతను వాళ్ళకేమీ కాడు. ఎలా పెడతాడు? ఆపాటి తెలీదా?”
“ఇంకోసారి నీ విషయాలు నా దగ్గిరెత్తావంటే చంపేస్తాను. నీలాంటి యిడియట్ దగ్గర వాళ్లని వదిలిపెట్టి వూరుకోవడానికి నేనేమీ తెలివితక్కువవాడిని కాదు. వాళ్ల మంచిచెడ్డలు నీకన్నా నాకే బాగా తెలుసు. నేనొచ్చి వాళ్లని చూసుకుంటూనే వుంటాను. నువ్వు లేకపోయినా నేనుంటాను. వింటున్నావా? నువ్వేదో వాళ్లకోసం కుటుంబాన్ని సృష్టిస్తున్నాననే భ్రమలో వున్నావు. స్వర్గంలో వున్నానని భ్రమపడుతున్నావు. అదొట్టి త్రిశంకుస్వర్గం. అందులో సుఖంలేదు”
“రాజ్! ఇప్పటిదాకా యిది మనిద్దరికే సంబంధించిన విషయం. మూడో వ్యక్తి తలదూరిస్తే బాగుండదు. అసహ్యంగా వుంటుంది””
“ఐతే వాళ్లని నాకు తిప్పిపంపెయ్”
“అలాంటప్పుడు నా దగ్గిరకెందుకు పంపించావు?”
“నువ్వు నన్ను బెదిరిస్తున్నావనుకున్నాను. వాళ్లని చూసేనా నీ నిర్ణయాన్ని మార్చుకుని తిరిగొచ్చేస్తావనుకున్నాను”
“ఛ… .నీకు లేకపోయినా నాకుంది… సిగ్గు. పొమ్మని మెడపట్టుకుని గెంటించుకున్నాక మళ్లీ వస్తానని ఎలాగనుకున్నావ్?”
“షటప్” అతను డిస్కనెక్ట్ చేసేసాడు.
రాజ్ చాలా పట్టుదలగల మనిషి! ఆ విషయం చాలా నిజం. ఏది తలుచుకుంటే అది చేసి తీరతాడు. దీనికి పరిష్కారం?
పెళ్లి యింక వారంలోకి వచ్చింది. రుక్మిణమ్మగారు నా ప్లాట్‌కి వచ్చింది. కూర్చోమన్నాను. కూర్చోలేదు. నిలబడే మాట్లాడింది. పిల్లలు స్కూలుకి వెళ్లారు. ఆ సమయంలో రావటం కొంత మంచిదే అయిందని మొదట అనిపించినా, ఆవిడ వాళ్ళని చూసేసి వుంటే ఇంక ఈ దాపరికాలు అవసరం వుండవనికూడా అనిపించింది.
“నీ నిర్ణయం మార్చుకోవా?” ఉపోద్ఘాతమేమీ లేకుండా సూటిగా అడిగింది. నాకామె మీద జాలి కలగలేదు. ప్రభాకర్ నన్ను చాలా యిష్టపడి చేసుకుంటున్నాడు. అందులో అతని స్వార్థం కూడా వుండవచ్చు. అతనంత దృఢంగానూ యిష్టపడి తీసుకున్న నిర్ణయాన్ని మార్చాలని యీవిడకెందుకింత పట్టుదల? నేను ఆవిడకేసి తీక్షణంగా చూసాను. నా చూపుల్ని తట్టుకోలేనట్టు తల తిప్పింది.
“మీరు యీ విషయాన్ని ప్రభాకర్తోటే ఎందుకు మాట్లాడకూడదు?” అడిగాను.
“వాడు నామాట వినడంలేదు” అంది.
“కాదు. గట్టిగా మీరే చెప్పలేకపోతున్నారు. నన్ను కాదంటే అతని ఫ్యూచరు పాడౌతుందేమోనన్న భయం మీలో అంతర్గతంగా వుంది. దానికి రేపేప్పుడేనా అతను మిమ్మల్ని తప్పుపడతాడేమోనని భయపడుతున్నారు. నేనుగా అతని దార్లోంచీ తొలగిపోతే మీ బాంధవ్యం దెబ్బతినదు”” అన్నాను కటువుగా. ఒకవైపు రాజ్… మరోవైపు రుక్మిణమ్మగారు… ఇంకోవైపు తండ్రి కావాలంటూ పిల్లలు… అన్నిటికీ తటస్థంగా వుండే ప్రభాకర్… తెలీకుండానే నాలో ఒక అభద్రతాభావం చోటుచేసుకుంది.
టెన్షన్ పెరుగుతోంది. దానితో యిదివరకటి సున్నితత్వం స్థానే స్వల్పంగా కాఠిన్యం…. కానీ అర్థమవుతోంది. మనుషులు మనుషులుగా బ్రతకడమనే ఫాంటసీలోంచీ కృత్రిమవిలువల్లోకి జారిపోతున్నాను. నేనంత కటువుగా వుంటానని అనుకోలేదేమో, రుక్మిణమ్మగారు దెబ్బతినట్టు చూసింది.
“చూడండి ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకోకూడదని మీకు అనిపించవచ్చు. అందులో తప్పేముందని నేనాలోచిస్తాను. మీకు నేనెంత దూరమో నాకు మీరూ అంతే, ఇద్దరం స్త్రీలమే అయినా మన స్థానాల్లో వున్న తేడా మనిదర్నీ ఒకేలా ఆలోచించకుండా చేస్తోంది. నన్ను చేసుకోమని ప్రభాకర్‌ని నేను అడగలేదు. అతనే ఈ ప్రతిపాదన తెచ్చాడు. వెనక్కి తీసుకునే అవకాశం అతనికి వుంది. మీరు అతనితోనే మాట్లాడండి. నాతో అనలేనివి కూడా అతనితో చెప్పవచ్చు. మీ భయాలవీ క్లియర్‌గా చెప్పండి. సబబుగా అనిపిస్తే అతనే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. నేనెప్పుడూ అతన్ని బలవంతం చెయ్యలేదు. అతనెలా నిర్ణయించినా నేను కట్టుబడే వుంటాను. ఇప్పుడు తన నిర్ణయాన్ని
మార్చుకున్నాసరే!” చాలా స్పష్టంగా చెప్పాను.
ఆవిడ వెళ్లిపోయింది.
జరిగినదాన్ని అవలోకించుకునే టైం లేకుండా పిల్లలు తిరిగొచ్చేసారు, ఏదో బంద్ వుంటే స్కూల్‌కి సెలవు ఇచ్చారట. యూనిఫామ్ మార్చుకుని బేగ్ ఒక మూలక విసిరేసి ఒకటే గెంతుతున్నారు. ప్రభాకర్ వచ్చాడు. తల్లి యిక్కడికొచ్చిన విషయం అతనికి తెలిసినట్లు లేదు. మా పెళ్ళి ఏర్పాట్ల గురించి చెప్తుంటే నిరాసక్తంగా వింటున్నాను. సివిల్మేరేజి చేసుకుందామని నేనన్నాను. తర్వాత చిన్న రిసెప్షను. అతనికి గుడిలో సాంప్రదాయంగా చేసుకోవాలని వుంది. నన్ను సాంప్రదాయికమైన పెళ్ళికూతురిగా చూడాలని అతని కోరిక. తను చూసిన పెళ్ళిళ్ళంత గొప్పగా కాకపోయినా, ఒక ప్రత్యేకవిషయంలా, వేడుకగా అందరిముందూ చేసుకోవాలని వుంది.
నాకు పెద్ద ఆసక్తిగా అనిపించట్లేదు. ఆ రోజు దగ్గరపడుతున్నకొద్దీ నాలో అనీజీనెస్ పెరిగిపోతోంది. ఎక్కడో ఊపిరాడనిచోట యిరుక్కుపోతున్నట్టుగా వుంది.
నేను అన్యమనస్కంగా ఉండటాన్ని గుర్తించి, “ఏం జరిగింది? ఎందుకంత డల్‌గా వున్నావు?”” ఆతృతగా అడిగాడు.
“ఆంటీ వచ్చింది” అన్నాను.
“అమ్మా! ఇక్కడికా?!”” ఆశ్చర్యంగా అడిగాడు.
“మన పెళ్లి గురించి ఆవిడేదో భయపడ్తోంది ప్రభాకర్. అది వట్టి అయిష్టం కాదు. అదేదో తెలుసుకోవటం నీ బాధ్యత”
“ఇప్పుడా?!”” తెల్లబోయాడు.
“కనీసం యిప్పుడేనా””
“నీకు నేనంటే యిష్టంలేదా వసంతా? ఏ చిన్న సంఘటన జరిగినా నాకు దూరంగా జరగాలని ప్రయత్నిస్తున్నావు?”” సూటిగా నా కళ్లలోకి చూసి అడిగాడు. నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి. అతను చలించిపోయాడు. ఆర్తిగా నన్ను దగ్గరకి తీసుకున్నాడు.
డోర్ బెల్ మోగితే అతన్ని విడిపించుకుని వెళ్లాను. తీసేసరికి ఎదురుగా వున్న వ్యక్తిని చూసి షాకయ్యాను. రాజ్!
“నువ్వా?” దిగ్ర్భాంతిగా అడిగాను.
“స్కూలుకి వెళ్లాను. లేదంట. వాళ్లని చూసి వెళ్తాను, పిలు”” అన్నాడు.
నా వెనుకే వచ్చిన ప్రభాకర్ నన్ను దాటుకుని విసురుగా వెళ్లిపోయాడు. అతన్ని చూసిన రాజ్ ముఖం కోపంతో ఎర్రబడింది. పిడికిళ్లు బిగుసుకున్నాయి. నాకేసి తీవ్రంగా చూసాడు.
“క్రైమ్ అనేది ఎలా జరుగుతుందో తెలుసా?” అడిగాడు.
“నేను ప్రాపర్టీని కాను, క్లెయిమ్ చేసుకు సాధించుకుందుకు. నేరం చేసేనా సంపాదించుకుందుకు”
“వాళ్ళేరి?”
“ఎందుకొచ్చావ్?” కోపంగా అడిగాను.
“పిల్లల్ని పిలు” మొండిగా అన్నాడు.
“వాళ్లు రారు” అంతే మొండిగా జవాబిచ్చాను.
“వాళ్లని చూడాలనే అంత దూరాన్నుంచీ వచ్చాను.చూడకుండా వెళ్లను”
“రాజ్! ఇది నా యిల్లు. నీ పంతం పట్టుదలా యిక్కడ చెల్లవు. మీ వూళ్ళో, ప్రమీలాదేవి దగ్గర చూపించుకో””
“నన్ను రెచ్చగొట్టకు. నీకు బుద్ధి లేదు. అందుకే తెగేదాకా తీసుకొచ్చావు. ఇప్పుడింక కోర్టుకెక్కి తేల్చుకుందామా? తండ్రిగా వాళ్లని చూసే హక్కు నాకెప్పుడూ వుంటుంది. కోర్టు కూడా కాదనదు” అన్నాడు కఠినంగా. ఇది వీధిలో నిలబడి వాదించుకుని తేల్చుకునే విషయంకాదు. ఇంతదాకా వచ్చాక అతను తగ్గడు. పరిష్కారాన్ని నేనే వెతుక్కోవాలి…
మౌనంగా తొలిగి దారిచ్చాను.
అతను లోపలికి రాలేదు. “వాళ్లని పిలు” అన్నాడు.
నేను పిలవక్కర్లేకుండా ఒకళ్లనొకరు తరుముకుంటూ వచ్చి వాళ్లే అక్కడికి చేరారు.
“నాన్నా!” అపనమ్మకంగా అంటూనే వెళ్లి అతన్ని చుట్టుకుపోయారు యిద్దరూ.
“బైటికెళ్లాం” అంటూ నా జవాబుకోసం ఎదురుచూడకుండా వాళ్లని తీసుకుని వెళ్లిపోయాడు. నేను తలుపేనా వేసుకోకుండా అలాగే బెడ్రూంలోకి వచ్చి కూలబడ్డాను.
ఒకప్పుడు అతను వాళ్లని వదిలిపెట్టి వుండలేకపోయేవాడు. ఆడపిల్లలంటే చాలా యిష్టమట. ప్రమీలాదేవికి యిద్దరూ మగపిల్లలే. వీళ్లని చాలా
గారం చేసేవాడు. అది కూడా ఆమె అసూయకి కారణమై వుంటుంది. కానీ యిప్పుడు? అతనిది నిజంగా ప్రేమేనా లేక వాళ్లని అడ్డంపెట్టుకుని
నన్ను సాధించాలని చూస్తున్నాడా? ప్రేమనేది కొంత అనుభవం తర్వాత ఒకరికి మరొకరిమీద పట్టు యిస్తుందని అర్థమైంది. ఇతనిలా వచ్చి వెళ్తుంటే నేను ప్రభాకర్‌ని ఎలా చేసుకోగలను? ఇతని రాక నాకే అసంబద్దంగా అనిపిస్తుంటే ప్రభాకర్‌కి యింకెలా వుంటుంది? రుక్మిణమ్మగారు యివన్నీ యిలా జరుగుతాయని ముందే వూహించిందా? అందుకేనా, వద్దని వారిస్తోంది?
రాజ్‌కి పిల్లలపట్ల వున్నది నిజమైన ప్రేమే అయితే నా పెళ్లి విజయవంతంకాదు. అతని ప్రేమ తీవ్రత నాకు తెలుసు. చూసాను, అనుభవించాను. వాళ్లని వదిలిపెట్టి అతను వుండలేడు. అది తెలుసుకునే ప్రమీలాదేవి పిల్లల్ని నానుంచీ లాక్కుంది. అతనన్నట్టు కోర్టుకెళ్తే మైనర్ గార్డియన్‌గా
నన్ను వుంచినప్పటికీ అతన్ని మధ్యలో వచ్చి చూసుకోవడానికి అనుమతిస్తారు. ఇప్పుడతను చేస్తున్నదీ అదే.
“అతన్ని రావద్దని చెప్పలేవా?” అన్న ప్రభాకర్కీ-
“నా పిల్లల్ని నేను చూసుకుంటానంటే వద్దనడానికి మధ్యలో నువ్వెవరు?” అనే రాజ్ ఎగ్రెసివ్ జవాబుకీ-
మధ్యని నలిగేది నేనూ, అభంశుభం తెలీని పిల్లలూ. నేను నిర్ణయం తీసుకోవలసిన సరైన సమయం ఇదేననీ, ప్రభాకర్ పెళ్ళి ప్రతిపాదన తెచ్చినప్పుడు తీసుకున్నది అసందర్భమనీ అర్థమైంది. ఏం చెయ్యాలి నేనేం చెయ్యనిప్పుడు? ఆలోచనలతో నా తల పగిలిపోతోంది.
పిల్లల విషయాన్ని తల్లి దగ్గర దాచిపెట్టిన ప్రభాకర్ నిజంగా వాళ్ల విషయంలో నాకొచ్చే సమస్యలని పరిష్కరించడానికి చేయూతనిస్తాడా? అతనికి అంత శక్తి, సంయమనం వున్నాయా? ఏవో ప్రలోభాల ఆధారంగా తలెత్తిన ప్రేమని నిజమని అతనూ నేనూ భ్రమపడుతున్నామా? అసలు అతను ఎవరని ఈ వ్యవహారంలోకి లాగడానికి? ఎందుకు లాగబడటానికి వప్పుకుంటాడు? సమస్యల వలయంలోకి దూకడానికి కాదుగా, పెళ్లి చేసుకునేదని అనిపించి ఏదో ఒకప్పుడు చెయ్యి వదిలేస్తే? నాకు ప్రభాకర్‌ని చేసుకుని సుఖపడిపోవాలన్న ప్రలోభం ఎప్పుడూ లేదు. తాడూ బొంగరం లేనట్టు యిలా ఎంతకాలం వుండాలని చేసుకోవాలనుకున్నాను. నాకూ పిల్లలకి అతనొక చట్టపరమైన స్థానం యిస్తాడని ఆశించాను. చెడిపోయిన స్త్రీ అనే ముద్ర వేయించుకోకుండా వుండాలనుకున్నాను. కానీ…
రాజమోహన్ నన్ను యింకా వెంటాడుతూనే వున్నాడు. నాకు అతనిమీది ప్రేమ, వ్యామోహం అన్నీ చచ్చిపోయినా అతనికి నాపట్ల యింకా ఏదో వుంది. అది పురుషాహంకారం కావచ్చు. అహం దెబ్బతిన్న భావన కావచ్చు. మరేదైనా కావచ్చు. నాకతనిపట్ల ఆసక్తిలేదు. అలాగని అతను నన్నొదలడు. మా దారులు చీలిపోయినా అతనింకా కలిసే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ప్రమీలాదేవినే కాదు, ప్రభాకర్నికూడా నేను బాధపెట్టలేను. నాకు ప్రపంచమంటే ఏమిటో తెలుస్తోంది.
పిల్లలకోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ యిప్పుడు ముందు ఈ రాజ్ వ్యవహారంలోంచీ బయటికి రాకపోతే నాకు భవిష్యత్తు లేదు. పరువు ప్రతిష్టలు వుండవు. ముందు అతనికీ, ప్రభాకర్కీ దూరంగా వెళ్లిపోయి ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. చాలాసేపు ఆలోచించాక నేను వెళ్లగలిగే చోటొకటి కనిపించింది. అది ఆఖరి ఎంపిక. అంతకన్నా మరోచోటు వుండదు. పరిణామాలు ఏవిగా వున్నా, అక్కడికే వెళ్ళాలనుకున్నాను.
ఇంక ఆలస్యం చేయకుండా పేపరు తీసుకుని ప్రభాకర్‌కి వుత్తరం రాశాను.
ప్రభాకర్!
… నాకు అతన్తో పెళ్ళవలేదు. నిజమే. కానీ అదంత తేలిగ్గా తెగేది కాదు. అదొక చక్రబంధం. పిల్లలు అనే కేంద్రకం చుట్టూ ఇద్దరం పరిభ్రమిస్తున్నాం. అతన్ని నేను ఆపలేకపోతున్నాను. దయచేసి నన్ను అర్ధం చేసుకో. అతనికి పిల్లలంటే పిచ్చిప్రేమ. వాళ్లని అతను వదిలిపెట్టి వుండలేడు. కోర్టుకెళ్లేనా తన హక్కుల్ని సాధించుకుంటానని చెప్పాడు. ఈ విషయాలన్నిట్లోకి నిన్ను లాగి నీకు సంతోషం లేకుండా
చెయ్యలేను. ప్రేమ అనేదొకటి వుందని నమ్మి సంఘం నిర్దేశించిన హద్దుల్ని దాటి వెళ్లినందుకు నాకీ సమస్యలు తప్పవు. నన్ను మర్చిపో- వసంత

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.