తిరస్కృతులు – 31 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

“అలా చూస్తావేంటి? కపాడియాకి సీరియస్‍గా వుందని తెలిసి వచ్చాను. రాత్రి పార్టీకి వెళ్లొస్తుంటే దార్లో కారాపి ఎవరో ఎటాక్ చేసారట. ఆర్జేడి ఆస్పత్రిలో అడ్మిటయ్యాడట” అన్నాడు.
నివ్వెరబోయి చూసాను.
“ఎప్పుడో కాలేజిరోజుల్లో ఇలాంటివి చేసేవాళ్ళం, చేయించేవాళ్ళం. ఈ వయసులోకూడా అవసరం పడతాయనుకోలేదు. అంత ఆశ్చర్యపోకు. నాకు ప్రతీదీ తెలుస్తుంది. నిన్న నువ్వు వెళ్ళినచోట కనీసం సగంమందికి నువ్వెవరో తెలుసు. నిన్న జరిగింది నాదాకా రావటం చాలా చిన్న విషయం…” అంటూనే సీరియస్‍గా మారిపోయాడు.
“వసంతా! ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది. ఇంక చాలు. ఇక్కడితో ఆపు. కోపం స్వంతనాశనానికి దారి తియ్యకూడదు. ఇలాంటి విషయాలు నీతో మాట్లాడటం నాకు ఇష్టం వుండదు. నీకుగా గ్రహిస్తావనుకుంటే అలా చెయ్యట్లేదు. ఆరోజు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా వెళ్ళిపోయావు. గుడ్డిగా ప్రభాకర్‍వాళ్ళింట్లో దిగావు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వన్నావే, రేటు కట్టి నిన్ను పంపించానని, అలాంటి రేటు కట్టి నిన్ను విడిపించుకోవలసి వచ్చేది”
“…”
“అదేకాదు, చంద్రలేఖకి నువ్వెవరో తెలీదు. తెలిసుంటే అక్కడే చాలా గొడవలైపోయేవి. ప్రమీల పోయాక మాయింట్లో నీ విషయంలో చాలా చర్చ జరిగింది. చంద్రలేఖ, ప్రమీల కజిన్స్. వాళ్ళద్వారా నీగురించీ, ప్రభాకర్‍గురించీ అన్నీ తెలిసాయి. నువ్వు నడిపిన కన్సల్టెన్సీ, దాని వెనుకున్న నీ తెలివీ ఇవన్నీ అక్కర్లేనివయాయి. నేను నిన్ను ఆమధ్యకి తీసుకెళ్ళలేనివిధంగా పరిస్థితి మారిపోయింది. మనిద్దరిమధ్యా వుండే అవగాహన వేరు. అదే కోణంలోంచీ అందరూ నిన్ను అర్థం చేసుకుంటారని ఆశించకు. నీచుట్టూ నువ్వు… నువ్వే నడవలేనివిధంగా ముళ్ళకంపలు పరుచుకుంటున్నావు. ఇక్కడికి వస్తున్నట్టు ఒక్కమాట నాకు చెప్పకుండా బయల్దేరావు. మా బిజినెస్‍లూ, ఇండస్ట్రీలూ ముంబై బేస్‍‍డ్. నా ఫ్రెండ్సందరికీ ప్రమీలెవరో నువ్వెవరో తెలుసు. అందులో చాలామందికి ప్రమీల బ్రదర్స్‌కూడా తెలుసు. మనిద్దరం విడిపోయాం, నీకు నా సపోర్ట్ లేదనే విషయం బైటికి వస్తేమాత్రం నిన్నిలాగే చూస్తారు. ఇవాళ నువ్వు, రేపు మన పిల్లలు… వింటున్నావా? వాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుతున్నావు…”
“రాజ్!”
“నువ్వేం చెప్పద్దు. వినంతే. నీకోపం నామీద, ప్రమీలమీద. ప్రమీల లేదు. ఇక మిగిలింది నేను. దాన్ని నావరకే వుంచు. ఎదురు చెప్పద్దు. పిల్లలని హాస్టల్లో వేస్తాను. నువ్వు చదువు కంటిన్యూ చెయ్యి. ఎంతవరకూ కావాలంటే అంతవరకూ, ఎక్కడంటే అక్కడ చదివిస్తాను. ఇక్కడినుంచీ మాత్రం వెళ్ళిపొండి. లేదా నా ఫ్లాట్‍లోకి మూవ్ అవండి” చాలా కచ్చితంగా చెప్పాడు.
జరిగినవన్నీ సుస్పష్టంగానే వున్నాయి. కళ్ళముందే వున్నాయి. అర్థమౌతున్నాయికూడా. భ్రమలు తొలగించుకోవలసినది నేనే. అదికూడా అర్థమౌతోంది. మొదట్నుంచీ ఒకేలా గడిస్తే బతకడానికి నాదైన పద్ధతి నాకుండేది. అలాంటిది నాకేమీ లేదు. ఇప్పుడింక అతని పిల్లలు, నా పిల్లలు… వాళ్ళ చుట్టే మా జీవితాలు తిరగాలి. లేచి వెళ్ళి మొహం కడుక్కుని కాఫీ తెచ్చుకున్నాను. అతనికీ యిచ్చాను. కాలం గడుస్తోంది.


తీసుకున్న నిర్ణయందగ్గరే కాలం ఆగిపోదు. ముందుకి సాగుతుంది. నిర్ణయాన్ని అనుభవంగా మారుస్తుంది. కొత్త అనుభవాలనికూడా సృష్టిస్తుంది. మా ముగ్గురి దారులూ చీలిపోయాయి. ఆడపిల్లలు హాస్టల్లో. నేను చదువు, వుద్యోగం, కెరీర్ వేటలో. రాజ్ మగపిల్లలతో. ఇద్దరం మళ్ళీ కలుసుకోలేదు. అతను పంతంగానే వున్నాడు. అన్నిటినుంచీ విడివడిపోతున్నాను. ముంబైనుంచీ బెంగళూరు మారాను. అమ్మావాళ్ళూ నాతోనే వుంటారు.
అన్నీ యిలా జరిగినా రాజ్‍కోసం నామనసులో ఎక్కడో మర్మర్… చిన్న ధ్వని… చిన్నప్పుడు సుమచేసే గునుపులా.
ఆ వ్యక్తి నాకు చెందడు. నాకు స్థానంలేని మరెక్కడో వుంటాడు. నాపట్ల పూర్తి అయిష్టం వున్న వ్యక్తుల సమూహం అతని కుటుంబం. ఆ స్పృహ నన్ను నియంత్రిస్తోంది. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళం పిల్లల్ని చూసి వస్తున్నాం. మేమిద్దరం కలుసుకునే సందర్భం తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాను.
“నాన్న మా స్కూలుకి వచ్చారు. మమ్మల్ని బైటికి తీసుకెళ్ళారు” అనే చిన్న సంతోషాలనుంచీ పరిస్థితులని అర్థం చేసుకునే స్థాయికి వాళ్ళు ఎదుగుతున్నారు.
“ఇంద్రనీల్, గగన్… వాళ్ళు మాకు అన్నయ్యలని నాన్న చెప్పారు. నీల్ బాగా పెద్ద. గగన్ నా అంత వుంటాడు. వాళ్ళని ముందు ఒక రిసార్టులో దింపి, మమ్మల్నీ అక్కడికి తీసుకెళ్ళారు. నాన్న చెప్పారని అన్నయ్యా అని పిలవబోతే, మేం మీకు అన్నయ్యలం కాదు, అలా పిలవద్దని చెప్పాడు నీల్. నాన్న ఏదో అనబోయారు.
వాళ్ళు మీకు ఇంపార్టెంట్. మాకు కాదు. ఇంకెప్పుడూ మా నలుగుర్నీ కలపకండి- అన్నాడు నీల్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. నాన్న మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేసారు” అంది సుధ.
విన్నాను.
“నాన్న వాళ్ల ఫాంహౌసుకి తీసుకెళ్ళారు. అక్కడ బామ్మ, తాతయ్య, బాబాయ్‍లు ఇంకా చాలామంది వున్నారు. ఒక్కరుకూడా మాతో మాట్లాడలేదమ్మా! చాలా ఏడుపొచ్చింది. మా స్కూల్లోనో హాస్టల్లోనో లేదంటే నాన్నదగ్గిరో, నీదగ్గిరో వుండాలిగానీ, వాళ్ళందరిదగ్గిరకీ మేమెందుకు వెళ్ళాలి? నాన్నకి చెప్పేసాం. మమ్మల్ని అలా ఎక్కడికీ తీసుకెళ్లద్దని” మరో సంఘటన.
అదీ విన్నాను. సన్నటి బాధ.
“నాన్న మన దగ్గిర ఎందుకు వుండరు? మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోరు? ” ఇవి చివరికి తలెత్తిన ప్రశ్నలు.
“పెద్దౌతే తెలుస్తాయి. అప్పటిదాకా నాన్న మాట వినండి. ఇంకే ఆలోచనలూ వద్దు. బాగా చదువుకోండి ” నెమ్మదిగా చెప్పాను. స్వీకృతి, తిరస్కృతి… ఇవి చట్టానికీ హక్కులకీ సంబంధించినవో, ధర్మానికి సంబంధించినవో నాకు తెలీలేదు.


అమ్మమ్మ చనిపోయింది. అమ్మావాళ్ళని అటు పంపించి పిల్లలని తీసుకురావటానికి వాళ్ళ స్కూలుకి వెళ్ళాను. రాజ్ అప్పటికే అక్కడికి వచ్చి వున్నాడు. చాలాకాలం తర్వాత అతన్ని చూడటం.
“ఎలా వున్నావు? పిల్లలెలా వున్నారు?” అడిగాను.
“అందరం బానే వున్నాం” అన్నాడు.
అతనికి ఈ వార్త ఎలా తెలుసు? కొండపల్లితోటీ అమ్మమ్మతోటీ కాంటాక్ట్‌లో వున్నాడా? అతన్ని చూసాను. నా మనసు చదివినట్టుగా అతను తలూపాడు. నలుగురం కలిసి కొండపల్లి వెళ్ళాము. పిల్లల మనసుల్లో వున్న ఎన్నో ప్రశ్నలని ఈ ప్రయాణం కొంతకాలం శాంతింపజేస్తుంది. అప్పటికే అమ్మానాన్న, ప్రశాంతా, తన భర్త వచ్చారు. పెద్దమ్మ రాలేనంది. ఇంక పెద్దగా వచ్చేవాళ్ళెవరూ లేరు.
రాజ్ నాన్నతో స్మశానందాకా వెళ్ళి అంత్యక్రియలు అయేదాకా ఉన్నాడు. అతన్ని ఇదంతా చేయిస్తున్నదేమిటి? అమ్మమ్మతో అతనికి అనుబంధం వుందా? కష్టంలో వున్నప్పుడు నాకు ఆశ్రయమిచ్చి, మా జీవితాలు వైఫల్యానికి నిర్వచనం కాకుండా వుండే ప్రాసెస్‍లో సాయపడినందుకు కృతజ్ఞత చూపిస్తున్నాడా? లేక నలుగుర్లో నా గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నమా? అన్నీను. అనేది నాకు తోచిన జవాబు.
“చిన్నప్పుడు మనిద్దరం అలానే వుండేవాళ్ళం కదూ?” పిల్లలు అతని చెరోచెయ్యీ పట్టుకుని తిరుగుతూ వుంటే ప్రశాంత అంది.
“మనిద్దరం అక్కచెల్లెళ్ళమని నీకు గుర్తున్నందుకు సంతోషం” చురుగ్గా అన్నాను.
“అదేమిటి? ” అంది తను.
రాజ్ తిరుగు ప్రయాణమయాడు.
“పిల్లల్ని నేను డ్రాప్ చెయ్యనా? నువ్వు తీసుకెళ్తావా?” అడిగాడు నా దగ్గిరకి వచ్చి.
“తీసుకెళ్ళు” అన్నాను. నా చేతిని చేతిలోకి తీసుకుని అలాగే నిలబడ్డాడు.
“వాళ్ళూ, వీళ్ళూ బాగానే వున్నారు. మొక్కకి వున్న వేరువేరు రెమ్మల్లా. కలుసుకోరు వసంతా! ఎప్పటికీ కలుసుకోరు. మనంకూడా దూరం జరుగుతున్నామననిపిస్తోంది. ఫోన్ చెయ్యవు, మాట్లాడవు. ఎందుకు? ఇంత కోపం నామీద? ఎప్పటికీ తగ్గదా అది?” అన్నాడు.
“కోపమని చెప్పానా?”
“మరెందుకీ దూరం?”
“ఏం చదువుకున్నావు నువ్వు? నీకసలు సర్టిఫికెట్ ఎలా యిచ్చారు? అడిగిందే అడుగుతావు? ” అన్నాను. “నలుగురు పిల్లలు. వాళ్ళకోసం. ముందు మగపిల్లలు పెద్దవనీ. వాళ్ళ బాధ్యత తీరితే తర్వాత వీళ్ళకి చెయ్యాల్సింది మనమేకదా? చిన్నాడిమాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేను. అంత ద్వేషం వాళ్ళకేకాదు, ఎవరికీ మంచిది కాదు” అన్నాను.
“నలుగురూ కలిసిపోతారనుకున్నాను. లార్డులు వాళ్ళు, ప్రిన్సెస్‍లు వీళ్ళు. ఎవరూ తగ్గట్లేదు”
“క్వీన్ మదర్ వుంది కదా?” అన్నాను నవ్వి. అతనికి వ్యంగ్యం అర్థమైంది. తనూ నవ్వి, “అన్నీ మోసేస్తూ వుంటారా?” అని అడిగాడు. మనసులు కొంచెం తేలికపడ్డాయి.
వాళ్ళు ముగ్గురూ వెళ్ళిపోయారు.
అమ్మమ్మ చనిపోయేముందు విల్లు రాసింది. తన డబ్బు ప్రశాంతకీ, ఇంటిపక్క స్థలం పెద్దమ్మకీ, ఇల్లు నాకూ రాసింది. ప్రశాంత భర్త గొడవపడ్డాడు. అమ్మ రిటైరైనప్పుడు వచ్చి కొంత డబ్బు తీసుకెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు గొడవ.
“ఇంటికీ డబ్బుకీ పోలికేమిటి? డబ్బు చెరిసగం తీసుకుంటాం. ఇల్లూ చెరిసగం తీసుకుంటాం. అలాకాదంటే డబ్బే తనని తీసుకుని యిల్లు మాకిమ్మనండి” అన్నాడు తన భర్త. పెద్దమ్మావాళ్ళు ఇక్కడ వుండరు. వాళ్ళు స్థలాన్ని క్లెయిం చెయ్యరు. నేనైతే అదికూడా కొనుక్కుని కలుపుకోవటమో అమ్మి డబ్బుచేసి వాళ్ళకి పంపడమో చేస్తాను. కానీ అతని ఆలోచన వేరు. ఎవరూ అడగరుకాబట్టి కలిపేసుకొవచ్చని. నాన్న జాబ్‍లో వున్న రోజుల్లో అతనిలో ఇలాంటి అంశాలే పాజిటివ్‍గా కనిపించి వుంటాయి. ఇప్పుడు మాత్రం చికాకుపడుతున్నారు.
“పెద్దావిడ తన కోరికేమిటో విల్లులో స్పష్టంగా రాసింది. అలాగే జరగాలి” అన్నారు.
“వసంతకి ఏం తక్కువ? వాళ్ళాయనకి కోట్లలో ఆస్థి వుంది. ఈ యిల్లు తనేం చేసుకుంటుంది?” అన్నాడు ఆయన అనే పదాన్ని నొక్కి చెప్పి, కొంచెం వక్రంగా నాకేసి చూస్తూ. రాజ్ చెప్పిన ప్రపంచం ఇదేకదా?
“ఏమ్మా, ఏమంటావ్?” అని అడిగారు నాన్న అతని గొడవ భరించలేక.
ఇల్లు నాకే కాదు, రాజ్‍కికూడా ముఖ్యమైనదే. దారీ తెన్నూ లేకుండా తిరుగుతున్న నాకు ఒక దిశానిర్దేశనం చేసిన చోటది. ప్రమీలాదేవి ఆఖరిరోజు గడిపిన యిల్లది. మా ముగ్గురిజీవితాలనీ ఏకప్రవాహంలోకి చేర్చిన చోటు. నాపిల్లలని తనెంత జాగ్రత్తగా చూసిందో చెప్పి, ఆమె పిల్లలపట్ల నాకున్న బాధ్యతని అన్యాపదేశంగా చెప్పిన చోటు. వదులుకునే వుద్దేశ్యం నాకు లేదు. వాళ్ళకి మరికొంచెం డబ్బిచ్చి సర్ది పంపించారు నాన్న. ఊరి శివాలయం పూజారిగారికి ఇల్లు అప్పగించి మళ్ళీ బెంగుళూరు వచ్చాము.
కాలం ఇంకా ముందుకి సాగింది.
ఆ తర్వాతిది ఒక ఫోన్ కాల్. మరికొన్ని సంవత్సరాల తర్వాత.
“మీతో మాట్లాడాలి. ఎప్పుడు, ఎక్కడ కుదురుతుంది?” అనడిగాడు.
“ఇంట్లో కలుద్దామా?” అడిగాను.
“వద్దు. బయట ఎక్కడేనా”
అతనికి నాతో అనుబంధం పెంచుకోవటం ఇష్టంలేదని అర్థమైంది. ఇద్దరం అవంతీస్‍లో కలుద్దామని చెప్పాను. అనుకున్నట్టే ఆ ఆదివారం అతన్ని కలిసాను. ఇరవయ్యైదేళ్ళ యువకుడు. చిన్న గెడ్డం, రిమ్‍లెస్ కళ్ళద్దాలు… రాజ్‍మోహన్ చిన్నప్పుడు అలానే వుండేవాడా? ఏమో! ప్రమీలాదేవి పోలికలు కనిపిస్తున్నాయి.
చిన్నగా నవ్వాను.
అతను బదులుగా నవ్వి, చిన్న పూలబోకే ఇచ్చాడు.
“థేంక్స్” తీసుకున్నాను. బేగ్‍లోంచీ చాక్‍లెట్ బార్ తీసి ఇచ్చాను. అతను నవ్వుతూ అందుకున్నాడు. ఇద్దరికీ కాఫీ తెచ్చాడు. మౌనంగా తాగుతున్నాం. ఏం చదివాడో, ఏం చేస్తున్నాడో అడిగాను. క్లుప్తంగా చెప్పాడు. రాజ్‍గురించి అడగాలనిపించింది. అడగలేకపోయాను.
“ఆరోజు మీతో అలా మాట్లాడకుండా వుండాల్సింది. అందుకు సారీ చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను” అన్నాడు నెమ్మదిగా.
“ఫర్వాలేదు”
“మా అమ్మకి అలా జరగకుండా వుండల్సింది. డాడ్ షుడ్ హావ్ బీన్ ఫెయిత్‍ఫుల్ టు హెర్. మా చిన్నతనంనుంచీ కూడా మేము మా డాడ్ ప్రేమని పూర్తిగా అనుభవించలేకపోయాము. అది ఆయన తప్పు. అందుకు మిమ్మల్ని తప్పుపట్టే అధికారం నాకు లేదు. నేను మీతో అలా మాట్లాడకూడదు. అయామ్ సారీ ఫర్ దట్” అన్నాడతను కుర్చీలోంచీ లేస్తూ. తనెందుకు సారీ చెప్పాడో స్పష్టతనిస్తూ.
అర్థమైంది. అతను ప్రమీలాదేవి కొడుకనీ, నేను వసంతననీ సారీ చెప్పలేదు. తను తప్పు చేసినందుకు చెప్పాడు. అతను వెళ్ళిపోవటాన్ని చూస్తూ కూర్చున్నాను. తరువాత నేనూ లేచాను.
కొన్నాళ్ళకి శివాలయం పూజారిగారినుంచీ ఫోన్.
“అమ్మా! ఒకాయనెవరో నెలకోమాటు వచ్చి తాళాలు అడిగి తీసుకుని యింట్లో గంటసేపు కూర్చుని వెళ్తున్నారు. ఇలా రెండుమాట్లు జరిగింది. మీకు చెప్తే మంచిదని చేసాను” అన్నాడాయన. ఆ యింట్లో మేం వుంటున్నది లేదు. నెలకోసారి పూజారిగారే శుభ్రం చేయించి తాళం వేస్తున్నారు. ఏవేనా రిపేర్లుంటే నాన్న మధ్యలో వెళ్ళి చేయించి వస్తున్నారు. జీవితపు చరమాంకంలో ఏదో ఒకరోజు వెళ్ళి అక్కడ వుంటానని నాకు నమ్మకం. అందుకే అంత జాగ్రత్తగా కాపాడటం. ఆ రోజు వచ్చేసిందా?
వర్క్ ఫ్రం హోం తీసుకుని కొండపల్లి బయల్దేరాను.
నెలరోజుల ఎదురుచూపు. వాకిట్లో చిరపరిచితమైన అడుగుల చప్పుడు. తలుపు తీసాను. అతని కళ్ళలో ఆశ్చర్యం.
“నువ్విక్కడ?”
చిన్నగా నవ్వి లోపలికి దారితీసాను.
“గగన్ పెళ్ళికూడా ఐపోయింది. వాడు అబ్రాడ్ వెళ్ళిపోయాడు. నీల్‍కి అన్నీ అప్పగించేసాను. వాడొక మాటన్నాడు.
అమ్మ విషయంలో జరిగినదానికి మీలో గిల్ట్ లేదు. అమ్మ ఎంత బాధపడిందో, పోవటానికి కొన్నిరోజులముందు ఎలా ఏడ్చిందో మీరు మర్చిపోయారు. ఆవిడనీ ఆ పిల్లలనీ వదిలిపెట్టలేదు. మర్చిపోలేదు. అది మీ అసలైన కుటుంబం అనుకుంటూ ఒక ట్రస్టీలా మాత్రమే మాతో వున్నారు. మీకు మీరే సంకెళ్ళు వేసుకున్నారు. ఇంక వాటి అవసరం లేదు -అని.
నువ్వేకాదు, నేనుకూడా వాళ్లెవరికీ అక్కర్లేదు” అన్నాడు.
అక్కడ అతని ప్రయాణం ముగిసి, నాతో ఇక్కడ మొదలైంది.
(ఐపోయింది)