సింక్ దగ్గరకెళ్లాను. ఏడవడంతో వుబ్బి వుంది నా ముఖం. కళ్లు కూడా ఎర్రబడ్డాయి. పైపు తిప్పాను. చల్లటినీళ్లు అరచేతిలో పడగానే ఎక్కడికో వెళ్లిపోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. ముఖం కడుక్కుని, తల దువ్వుకుని చీర మార్చుకున్నాను.
ఇప్పుడేం చెయ్యాలి? ఇక్కడే వుండి పోరాటం చెయ్యటం. ఎవరితో? ప్రమీలాదేవి బంధువులందరితోనా? అది సాధ్యపడేదేనా? ఆమె అన్నట్టు నన్ను పిలిచి నచ్చజెప్పక్కర్లేదు. పిల్లల్ని ఎలాగా తెప్పించుకున్నారు. ఇక మిగిలింది నేను. ఇంట్లోంచీ బైటికి నెట్టెయ్యటం క్షణంలో పని. అది చెయ్యలేదంటే నాకు ఇంకా అవకాశం మిగిలి వున్నట్టే. అసలు మనిషే నన్ను దూరంపెట్టినతర్వాత అర్థంలేని పోరాటం చేస్తూ ఇక్కడ వుండాల్సిన అవసరం లేదు.
తెలివిగా ఆలోచించి పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవడంమీదనే నా ఆలోచనంతా కేంద్రీకరించాను. దానికి ముందు నాకు కొంత ఆసరా కావాలి. ఇలాంటప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇల్లొదిలిపెట్టి వచ్చేసిన యిన్నేళ్ళలో ఒక్కసారికూడా నాగురించి పట్టించుకోని అమ్మానాన్నలదగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనమాత్రం అసలే రాలేదు. ఫ్రెండ్స్… అంతే, నేను చదివిన కాలేజీ గుర్తొచ్చింది. నాతో చదివినవాళ్లెవరేనా ఒకరిద్దరు అక్కడ సెటిలైవుండచ్చు. వాళ్లలో నన్ను అభిమానించే వాళ్లుండచ్చు. జీవితాన్ని ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలి.
నా విలువ… లక్షకాదు… డబ్బుకాదు. నా అసలు విలువేంటో చెప్పాలి రాజ్‌కి. అతనికోసం నేనెంత విలువైనవి వదులుకున్నానో ప్రమీలాదేవికి తెలియచేయాలి. రాజ్నీ ఆమెనీ విడదీసి అతన్ని నావైపుకి తిప్పుకున్నానని ఆమె భావన. అందుకే నానుంచీ పిల్లల్ని విడగొట్టి, వాళ్లకి తను చేరువై, తద్వారా తమ మధ్య దూరాన్ని చెరుపుకోవాలని ఆమె ప్రణాళిక. కానీ రసహీనమైన ఆమె సహచర్యంనుంచీ వికర్షించబడ్డాకే అతను నాకు దగ్గరయ్యాడని యిద్దరూ గ్రహించాలి.
స్థిరనిశ్చయంతో సూట్‌కేసు అందుకుని బీరువా తీసాను. అందులో దొంతర్లు దొంతర్లుగా షిఫాన్ చీరలు, జార్జెట్ చీరలు… రాజ్ దుకాణాలన్నీ గాలించి కొన్నవి. తేలిగ్గా వుంటాయని నేనిష్టపడేదాన్ని. వాటిలో అప్పుడే వికసించిన పువ్వులా వుంటానని అతను ఇష్టపడేవాడు. చేతికి అందిన నాలుగు జతల్ని సూట్‌కేసులో పడేసి టక్కున బీరువా మూసేసాను. పిల్లల బీరువాకేసి తలతిప్పి కూడా చూడలేదు. చూస్తే అక్కడొక దుఃఖపు సుడి నన్ను ముంచెత్తుతుందని తెలుసు.
రాజ్ వాళ్లకి అన్యాయం జరగనివ్వడు… నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఐనా న్యాయమో అన్యాయమో జరిగేదాకా నేనూరుకోను. ధనమదాన్ని ధనబలంతోటే జయిస్తాను. ముల్లుని ముల్లుతోనే తీస్తాను. ఆ కుదిర్తే బేరం… లేకపోతే మార్పిడి. డబ్బు సంపాదించాలనే ఏకాగ్రతతో కూడిన పట్టుదల వుంటే దాన్ని సంపాదించడం పెద్ద కష్టం కాదు. పట్టుదలగలవాళ్లు వ్యాపారస్తులౌతే మిగిలినవాళ్లు వినియోగదారులౌతారు.
ముందుగా నాకొక ఆధారం… అది దొరికితే ….
చిన్నప్పట్నుంచీ హాస్టల్స్‌లో పెరగడంవలన విలక్షణమైన మనస్తత్వం అలవడింది నాకు. కష్టాలూ సమస్యలూ నా ఆత్మనిబ్బరాన్ని ఎప్పుడూ చెదరగొట్టలేదు. ఒకవైపు వాటికి స్పందిస్తూనే క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటాను. ఆలోచిస్తూనే ఇంటికి తాళం పెట్టి యివతలికొచ్చేరికి నేనొచ్చిన కారు ఇంకా అలాగే వుంది. డ్రైవరు ఎదురు చూస్తున్నట్టు గేటుముందున్న గద్దెమీద కూర్చున్నాడు. అతన్నలా చూసి నేను ఆశ్చర్యపోతే నా చేతిలో చిన్న సూట్‌కేసు మాత్రమే వుండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతని మాట ప్రకారం నేను ప్రయాణమైనందుకు సంతోషంలాంటిది అతని ముఖంలో క్షణంసేపు లీలగా కదిలింది. తన యజమాని జీవితంలోంచీ నేను తప్పుకుంటున్నందుకేమో ఆ సంతోషం… అనే భావనకూడా అదే క్షణాన నాకు కలిగింది.
తాళం చెవి యిచ్చి, “వెళ్లిపోయావనుకున్నాను దాసూ! సరే! ఈ చెవి అయ్యగారికివ్వు” అన్నాను.
“మళ్లీ ఎప్పుడొస్తారు?” అడిగాడు.
“ఇంక రాను”” స్థిరంగా చెప్పాను.
“అమ్మా, వూరొదిలిపెట్టి వెళ్తున్నారా? నేనలా అనలేదు. కొద్దిరోజులు… అంటే రాజ్మోహన్బాబుకి నయమయేదాకా ఎటేనా వెళ్తే మంచిదని” బాధపడ్డాడు. “మీరు నోరులేనివాళ్లమ్మా! అందుకే యింత అన్యాయం చేస్తున్నారు. మరొకరు మరొకరైతే ఆ సారు మంచితనం చూసి అసలింటికే ఎసరుపెట్టేవాళ్లు” అన్నాడు. అలా అనేందుకు అతనేం మొహమాటపడలేదు. మొదటిసారి చాలా స్పష్టంగా అర్థమైంది, నా గురించి ఎవరేనా యిలాగే మాట్లాడుకుంటారని.
“ఎక్కండమ్మా!” అన్నాడు దాసు. నా వుదాసీనత చూసి యింకేం మాట్లాడలేదు. ఎక్కి కూర్చున్నాను. స్టేషన్ చేరేసరికి ఏదో రైలాగివుంది. నేనే వెళ్లి టికెట్టు తెచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో అతనికీ, అతనిద్వారా మిగిలినవాళ్లకీ తెలీడం యిష్టంలేదు. దానికి ప్రత్యేకమైన కారణం లేదు.
నేను టికెట్‌కోసం వెళ్లినపుడు అతనింక వెళ్లిపోతాడనుకున్నాను. కానీ నాతో రైలుదాకా వచ్చాడు. సీటు వెతుక్కుని కూర్చున్నాక జేబులోంచి కవరు తీసి వచ్చాడు. అది చాలా బరువుగా వుంది.
“ప్రమీలమ్మగారు యివ్వమన్నారు” అన్నాడు. తెరిచాను. వంద రూపాయల నోట్లకట్ట! చిన్న వుత్తరం వుంది. సంబోధన లేదు. కిందని సంతకం కూడా లేదు. అదామె హృదయానికి ప్రతిబింబం. ఆమె అహంభావాన్ని చూపించే దర్పణం. తనకి ఏం కావాలో తనకే తెలీనితనానికి నిలువెత్తు నిదర్శనం.
…నీమీద నాకు కోపం వున్నమాట నిజమే. కానీ ఇంతదూరం నడిచి వచ్చాక నీకు అన్యాయం చేయాలని నా కోరిక కాదు. అలాగని నాకు నేనూ అన్యాయం చేసుకోలేను. నీమీద నా కోపం, అసహిష్ణుతా తగ్గవు. మనిద్దరి మధ్యా నలిగి రాజ్‌కి ఏదైనా జరిగితే తట్టుకోలేను. ఎవర్నో ప్రేమించిన వ్యక్తితో సహజీవనంకన్నా మనని ప్రేమించని వ్యక్తి వైధవ్యాన్ని మొయ్యటం ఇంకా కష్టం. అందుకని అతన్ని బ్రతికించుకోవాలని నా ప్రయత్నం…..
రైలు కూత కూసింది. ఇంకా కొంచెం వుత్తరం మిగిలింది. నేనూ కొంత రాయాలి. నా దగ్గర కాగితం లేదు. ఇదే ఉత్తరానికి వెనకవైపు రాయాలి. అంటే దీన్ని పూర్తిగా చదవాలి.
…ఈ డబ్బు వుంచుకో. చెక్ ఎన్కాష్ అయ్యేదాకా నీ తక్షణ అవసరాలకి ఉపయోగపడుతుంది. నీ పిల్లలు నా దగ్గిర క్షేమంగా వుంటారు. వాళ్లని మర్చిపోయి నీ జీవితాన్ని చక్కదిద్దుకో…
ఉత్తరాన్ని వెనక్కి తిప్పాను. డ్రైవరు జేబులో కనిపించిన పెన్ను అడిగి తీసుకుని గబగబ రాసాను.
…నా జీవితానికి రాజ్ సాక్షిగా మీరు కట్టిన వెలని తీసుకుని వెళ్తున్నాను. లక్షా పదివేలు… చంపుకున్న ఆత్మాభిమానం… మోసపోయిన ప్రేమ… మళ్లీ తొందర్లోనే కలుసుకుంటాము. తనదికాని బాధ్యత బరువనిపిస్తుంది ఎవరికైనా. ఆరోజుని మానవవిలువల మార్కెట్లో మరోసారి బేరం చేసుకుందాం…
-వసంత
రైలు కదుల్తోంది. డ్రైవరు దాంతోపాటుగా నడుస్తున్నాడు. చీటీ అతని చేతిలో పెట్టి, పెన్ను తిరిగిస్తూ చెప్పాను.“”ఆమెకే యివ్వు” అని.
రైలు వేగం పెరిగింది. ఆ వూరితో నాకున్న అనుబంధం తెగిపోయింది. వచ్చేటపుడు వంటరిగానే వచ్చాను. తిరిగి వంటరిగానే వెళ్తున్నాను. ఒక మనిషి నిస్సహాయుడిగా వున్నపుడు… కనీసం అతని బాధని అర్థం చేసుకోవటం అటుంచి వినేవాళ్లుకూడా లేనప్పుడు కలిగే నిర్వేదంలాంటిది కలిగింది.
సీట్లో వెనక్కివాలి పుస్తకం తీసాను. నోట్లకట్ట యింకా నా వొళ్లో అలాగే వుంది. దాన్ని బ్యాగ్‌లోకి తోసి పుస్తకంలో తలదూర్చాను. అక్షరాలని కళ్లు చూస్తున్నా నా మనసు వాటిమీద నిలవడంలేదు. ఎటెటో పోతోంది. చాలాసేపు అలాగే కూర్చున్నాక నా పక్కసీట్లో కూర్చున్నావిడ అంది, “”బేగు జాగ్రత్తమ్మా! అందరూ చూసేలా చాలా డబ్బు పెట్టావు. స్టేషనొస్తోంది. ఎవరైనా లాక్కుపోతారు” అని.
“ఏ వూరెళ్లాలమ్మా?” అడిగింది.
ఆవిడని పరిశీల నగా చూసాను. యాభైయేళ్లకి పైబడి వుంటాయి. కొంచెం లావుగా మామూలు ఎత్తుతో వుంది. చేతులకి ఆరేసి మట్టిగాజులూ వాటికి ఒకవైపుని ఒకొక్క బంగారుగాజూ వున్నాయి. మెడలో సూత్రాలగొలుసూ నల్లపూసలదండా వున్నాయి. మాటల్లో ఆప్యాయతా, ఎవరినైనాసరే అభిమానంగా పలకరించే మనస్తత్వం కనిపిస్తున్నాయి. అమ్మ గుర్తొచ్చింది నాకు. కష్టం కలిగినప్పుడు ఎవరికైనా తల్లి గుర్తొస్తుందంటారు. ఈ యిన్నేళ్లలో అమ్మ యింత యిదిగా గుర్తురావడం ఇదే మొదటిసారి.
“నా మాట వినిపించుకోవడంలేదు. ఏ వూరెళ్లాలమ్మా “నువ్వు?” రెట్టించింది ఆవిడ చనువుగా. చెప్పాను. మా సంభాషణ యింకొంచెం ముందుకి సాగింది. అమ్మానాన్నల గురించి అడిగింది. క్లుప్తంగా చెప్పాను. “మాది వరంగలే. వరంగల్లులో ఎక్కడికెళ్లాలి. నువ్వు? అక్కడ బంధువులున్నారా? దేనికి వెళ్తున్నావు? ఏం పని? ఒక్క దానివే వెళ్తున్నావా? స్టేషనుకి ఎవరైనా వస్తారా?” ఇన్ని ప్రశ్నలు వేసింది. ఆవిడ పేరు రుక్మిణమ్మనీ, మా ఎదుటిసీట్లో కూర్చున్నది ఆవిడ కొడుకనీ, అతని పేరు ప్రభాకర్ అనీ మాటల్లో గ్రహించాను. నేను పుస్తకం మూసి పక్కని పెట్టగానే అందుకోసమే ఎదురుచూస్తున్నట్టుగా అడిగి తీసుకుని తిరగెయ్యసాగాడు.
నేనావిడ ప్రశ్నలకి వెంటనే జవాబు చెప్పలేకపోయాను. ఎవరైనా అడిగితే చెప్పాలనుకుని ముందు తయారుచేసి పెట్టుకున్న జవాబులేవీ నాదగ్గర. ఆవిడ ముఖం చూస్తూ అబద్దాలు చెప్పాలనిపించలేదు. కానీ తప్పదు. నేనిప్పుడు కొంత గౌరవాన్ని పోగుచేసుకోవాలి. ఇంతకాలం నాకీ సమాజం అవసరం లేకపోయింది. దాన్ని నేను పట్టించుకోలేదు. ఇప్పుడలా కాదు. నా ఆధారం సమాజమే ఔతుంది. ఇప్పటికే నేను అది నిర్ణయించిన హద్దుల్ని అతిక్రమించాను కాబట్టి కనీసం ఒక ఫాల్స్ యిమేజిని ఏర్పరచుకోవాలి.
అందుకే నన్ను నేను కూడదీసుకుని చెప్పాను. “ఉద్యోగ ప్రయత్నంమీద వెళ్తున్నానాంటీ” అని. అలా చెప్తున్నప్పుడు ఆవిడ చూపులు నా చూపుల్తో కలవకుండా జాగ్రత్తపడ్డాను.
“బంధువులెవరూ లేరా? మరైతే ఎక్కడుంటావు?” ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది.
“ఇల్లు వెతుక్కోవాలి” చెప్పాను.
ఆవిడ సుదీర్ఘంగా విశ్వసించింది. “రోజులు చాలా మారిపోయాయి. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే యింటికి మహాలక్ష్మి పుట్టిందని కంటికి రెప్పలా
చూసుకునేవారు. ఒంటరిగా ఎక్కడికి పంపేవారుకాదు రెండిళ్ల పరువు ప్రతిష్టలకి ఆమెని ప్రతీకగా భావించేవారు. ఆ రోజులు వెళ్లిపోయాయి. ఆడపిల్లని అసలు పుట్టనివ్వడంలేదు. కడుపులోనే చంపేస్తున్నారు. ఒకవేళ తప్పిదప్పి పుట్టినా అమ్మేసుకుంటున్నారు. ఎవరో కడుపుతీపిగల తల్లులూ, కరుణగల తండ్రులూ తమకి పుట్టిన పిల్లల్ని ప్రేమగా పెంచుకున్నా, ఎవడి కళ్లోపడి దాన్ని ప్రేమించానని వెంటపడి నాశనంచేసేదాకా నిద్రపోడు. అదీ దాటి పెళ్ళిదాకా వస్తే నిలువునా కిరసనాయిలు పోసి చంపడమో లేక దానంతట అదే ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పించడమో చేస్తున్నారు ఈ మగమహారాజులు. అది చాలక ఉద్యోగాలవేట… సంపాదన… ఎట్నుంచీ ఎటు వెళ్తున్నామో తెలీడం లేదు” అంది. అంటుంటే ఆవిడ గొంతు వణికింది.
ప్రభాకర్ పుస్తకం పడేసి వచ్చి ఆవిడ పక్కని కూర్చున్నాడు. ఓదారుస్తున్నట్టు భుజం చుట్టూ చెయ్యేసాడు. వాళ్లిద్దరికే అర్థమైన భాష. చాలసేపు మామధ్యన యింకేం మాటలు జరగలేదు. ఒక విషాదంలాంటిది చోటుచేసుకుంది.
“ఊరుకాని వూళ్లో ఒక్కదానివీ ఎక్కడుంటావు? మాతో రాకూడదూ? ఇంట్లో ఒక గది విడిగా వుంటుంది. అందులో నువ్వండవచ్చు” కొంతసేపటికి సర్దుకుని అందావిడ. ప్రభాకర్ కూడా చూపుల్తో అదే భావాన్ని వ్యక్తపరిచాడు.
ఆలోచించాను. రైలు దిగాక హోటల్లో రూము తీసుకోవాలి. అంతకంటే వెళ్లగలిగే చోటు లేదు. ఆ తర్వాత పాతస్నేహితుల్ని వెతుక్కోవాలి. అప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఎన్ని రోజులు పడుతుందో! హోటల్లోకన్నా వీళ్లింట్లో వుండటం బెటరేమో! మోసం వుంటుందా? ఏమో! హోటల్లో వంటరిగా వుండటంకన్నా ప్రమాదం కాదేమో! నాకిప్పుడు కావల్సినది వంటరితనం కాదు. మనుషుల తోడు. అనునయం కూడా కావాలో అక్కర్లేదో అప్పటికప్పుడు తెలియలేదుగానీ నేను తిన్న దెబ్బ చాలా పెద్దదని గడ్డకట్టుకుపోయిన నా భావాలు చెప్తున్నాయి.
అడగ్గానే వెంట వచ్చేస్తానంటే ఏమనుకుంటారో అనే సంకోచం వెనక్కిలాగింది. కానీ… తెగిన ఈ గాలిపటాన్ని ఎక్కడో ఒకచోట ముడివెయ్యాలి. కొంచెం మొహమాటపడుతూనే నా సమ్మతిని వ్యక్తపరిచాను.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.