తిరస్కృతులు – 9 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

“ఎందుకంత సింపుల్‍గా వుండటం? నాలుగు డబ్బులు వచ్చాయంటే చీరలు, నగలు కొనేసుకుని, ఇల్లంతా సామాన్లతో నింపేసుకునేవాళ్ళని చాలామందిని చూసాను. ఈ గదికూడా చూడు, ఏమీ లేవు. ఇంకాస్త సౌకర్యంగా వుండచ్చుగా?””
“నాకిలాగే బావుంటుంది. ఐనా సౌకర్యాలకేం తక్కువ? పడుకోవటానికి మంచం వుంది. కూర్చోవడానికి కుర్చీలు, వంటకి గేస్ స్టవ్వు, కుక్కరు వున్నాయి. ఇంకేం కావాలి?” అడుగుతూ, జుత్తుని నాట్‍గా సెట్‍చేసి-
“పద, వెళ్దాం” అని నేనే ముందు బయల్దేరాను, యింకా వుంటే యింకేం ప్రశ్నలు వేస్తాడోనని. ఈ మధ్య ప్రభాకర్‍కి నామీద బాగా శ్రద్ధ ఎక్కువైంది. ప్రతిదీ గమనిస్తున్నాడు. అలాగని చనువు తీసుకోడు. ఒక గమనికలా, సలహాలా చెప్తాడంతే.
“మైకేల్ వాళ్లేరి? ఇంకా రాలేదా?” బైటికొచ్చి చుట్టూ చూస్తూ అడిగాను. మైకేల్ కూర్చోవలసినచోట రామకృష్ణ అనే యింకొకతనున్నాడు.
“మైక్‍కి కొద్దిగా పనుందట మేడం” నన్ను చూసి గౌరవంగా లేచి నిల్చుని చెప్పాడు. ఇతను మైకేల్‍కి అసిస్టెంటు.
చదువుకి రెండు ప్రయోజనాలు వుంటాయి. ఉపాధి, విద్వత్తు. కేవలం విద్వత్తుకోసమే చదివేవాళ్ళు చాలా అరుదుగా వుంటారు. వాళ్ళ కుటుంబంలో వుండే వృత్తి వ్యాపారాలకి సంబంధించిన చదువు చదివేవాళ్ళు ఇంకొద్దిమంది వుంటారు. మిగిలినవాళ్ళంతా ఉపాధికోసమే చదువుతారు. ఐతే వుపాధి చదువులు పూర్తిగా తల్లిదండ్రుల శక్తి, వెసులుబాటుమీద ఆధారపడి వుంటాయి. పిల్లలకి చిన్నప్పట్నుంచీ కూడా కొద్దోగొప్పో సంపాదించుకోగలిగే అవకాశం స్కూళ్ళు, కాలేజిలు కల్పించాలి. ఉచితభోజనాలు, ఇతర వుచితాలు తాత్కాలిక వుపశమనాన్ని యిస్తాయి తప్ప, బతుకుల్ని నిలబెట్టవు. చిన్నపిల్లల్ని చూసుకునే పెద్ద వయసు ఆడపిల్లలు, వర్షాకాలాల్లో తల్లిదండ్రుల వెంట పొలం పనులకి వెళ్ళేపిల్లలు, బీడీలు చుట్టే, అగరొత్తులు చేసే పిల్లలు, శివకాశీ పిల్లలు వీళ్ళంతా అనుక్షణం తమ అవసరాలని సమాజానికి చెప్తునే వుంటారు. సమమైన పరిష్కారం ఎవరూ చూపించరు. నా దగ్గిరకి వచ్చే పిల్లలని చూస్తే ఇవన్నీ అర్థమౌతాయి. లేమి, తాగుబోతు తండ్రులు… ఇలా రకరకాల కథల్లా అనిపించినా, మౌలికమైన అంశం ఒక్కటే. బాధ్యతారాహిత్యం… ముందు దేశానిదీ, తరువాత సమాజానిదీ, ఆ తర్వాత కుటుంబానిదీ.
“లూసీ, మేరీ కూడా రాలేదే?” అడిగాను.
“మనిద్దరమే వెళ్తున్నాం”” నా వెనకే వస్తూ ప్రభాకర్ జవాబిచ్చాడు. నేను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాను. ఆశ్చర్యానికి జవాబు దొరకలేదు. ఇద్దరం వెళ్లి కార్లో కూర్చున్నాం. ప్రభాకర్ స్టీరింగ్ తీసుకున్నాడు. ఈమధ్యనే డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్నాడు. కారు స్మూత్‍గా వెళ్తోంది. ప్రభాకర్ చాలా కామ్‍గా వున్నాడు. అది మైకేల్ లేకపోవడంచేత అనుకున్నానుగానీ అతడు తన మనసుతో సంఘర్షిస్తున్నాడని అనుకోలేదు.
“ఏంటి ప్రభాకర్, మాట్లాడ్డంలేదు?” మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను.
“ఈ సంపాదనా… యీకారు… ఇదంతా నిజమేనా అనే అనుమానం వస్తోంది” అన్నాడు తలతిప్పి నాకేసి ఆరాధనగా చూస్తూ.
“దానికింత ఆలోచన అక్కర్లేదు. అలాంటి అనుమానం వచ్చినప్పుడల్లా గిల్లి చూసుకుంటే చాలు” పరిహాసంగా అన్నాను. అతను పట్టించుకోలేదు.
“నువ్వు పరిచయమయేదాకా తెలీదు, డబ్బు యింత తేలిగ్గా సంపాదించవచ్చని”
“తేలిగ్గా ఎందుకైంది? ముగ్గురం పగలనకా రాత్రనకా ఎంత కష్టపడుతున్నాం?”
“తగిన ప్రతిఫలం వుంటుందంటే కష్టపడటానికి ఎవరూ వెనకాడరు”
“డబ్బు సంపాదించాలనే ఏకాగ్రతతో కూడిన పట్టుదల వుంటే సాధించవచ్చు. డబ్బు సంపాదించాల్సిన అవసరం నాకు చాలా వుంది”
“దేనికి వసంతా?”
“దేనికేమిటి? నువ్వెందుకు సంపాదిస్తున్నావో చెప్పు”
“నేను మగవాడిని. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వుంది. అలాగే మైకేల్‍కి కూడా. మరి నీకు?”
“నాకూ అలాంటి బాధ్యతలే ఏవో వున్నాయనుకో”
“ఏంటవి?”
మాట దాటేసాను. ఇంత ఫ్రీగా మాట్లాడుతున్న యితన్ని మోసం చేస్తున్నానన్న బాధ వుందిగానీ యితను కూడా ప్రమీలాదేవి చూసిన కోణంలోంచే చూసి మగవాడూ, నాకు ఆశ్రయం యిచ్చినవాడూ కాబట్టి మరోలాంటి చొరవ తీసుకుంటే ఎలాగన్న భయం నన్నేదీ చెప్పకుండా ఆపింది. హోటల్ ముందు ఆపాడు.
“డిన్నర్ చేద్దాం” అన్నాడు.
“అదేంటి, వాళ్లనొదిలేసి?” అన్నాను మైకేల్‍వాళ్ల గురించి. అతను మాట్లాడకుండా లోపలికి దారితీసాడు. నాకు అనుసరించక తప్పింది కాదు. మెనూ ఆర్డరిచ్చాక అడిగాడు.
“నాగురించి నీ అభిప్రాయం ఏమిటి వసంతా?”
అటువంటి ప్రశ్న ఏ సందర్భంలో వస్తుందో తెలీనంత, అమాయకురాలినీ, అనుభవహీనురాలినీ కాను. ఇంట్లో వుండి బోర్ కొట్టి యిక్కడికి వచ్చామనుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్న యిలా తోసుకు వచ్చేస్తుందనుకోలేదు. నాకు యిద్దరు పిల్లలని ఆలోచిస్తున్నానుగానీ, ఆ విషయాన్ని ఎదుటివారు గుర్తించేంత వయసుగానీ, శారీరకమార్పులుగానీ లేవనీ, కనీసం బాహ్యచిహ్నంగా మంగళసూత్రం కూడా లేదనీ ఎప్పుడూ అనుకోలేదు. పనిగట్టుకుని నా విషయాలు చెప్పడం దేనికని భావిస్తూ వచ్చాను. వీళ్లింత దాపరికం లేకుండా అన్నీ చెప్తుంటే నేనన్నీ దాస్తున్నానన్న అపరాథభావన తప్ప యిలాంటి అనూహ్యపరిస్థితి యీలోపలే ఎదురౌతుందని వూహించలేదు.
“ప్ర…భా… క…ర్!”
“ప్లీజ్ వసంతా! మరోలా అనుకోకు. వంటరి ఆడపిల్లవని చనువు తీసుకుంటున్నానని భావించకు. కచ్చితంగా చెప్పాలంటే… మధ్యతరగతిలో పుట్టాను. ఓడిపోవటమో రాజీపడి సర్దుకుపోవడమో తప్ప గెలుపు నాకు తెలీదు. గెలవనేమోననే భయంతో ఏ అడుగూ ముందుకి వెయ్యలేదు. నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తలుచుకోవాలేగానీ మనిషి సాధించలేనిది వుండదనే భావన నాలో మొదలైంది.”
“…”
“నిజానికి నీతో యీ విషయం మాట్లాడటానికి చాలా సంకోచించాను. నువ్వేమనుకుంటావోనని భయపడ్డాను. కానీ యీ సంపాదన, అది యిచ్చే సంతృప్తి, ఆత్మవిశ్వాసం ఎప్పటికీ కావాలనుంది. నువ్వు తోడుంటే ఎన్నో సాధించగలననిపిస్తోంది” అతని మాటల్లో, కలల్లో తేలిపోతున్న అతని మనసు కనిపించింది.
“నా గురించి ఏమీ తెలుసుకోకుండానే?”” చప్పుని కలగజేసుకున్నాను.
“ప్రత్యేకించి తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. నువ్వు పుట్టి పాతికేళ్ళు దాటి వుంటుంది. నీకంటూ ఓ గతం తప్పకుండా వుంటుంది. వంటరిగా బ్రతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చావు. వచ్చి వెళ్లిపోతావనుకున్నానుగానీ యిక్కడే వుండి స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి ఆ గతం చేదు అనుభవాలతో నిండి వుంటుందనుకుంటున్నాను. దాన్నిబట్టి నీ వ్యక్తిత్వాన్ని నేను నిర్ణయించలేను. కొన్ని సంఘటనల ఆధారంగా మనిషిని అంచనా వేసే పద్ధతికి నేను వ్యతిరేకని”
“కానీ ప్రభాకర్… నేను నీకు నాగురించి ఏమీ చెప్పలేదు. నువ్వు చూస్తున్నది నీకుగా నిర్మించుకున్న ఇమేజిని”
“కావచ్చు. నువ్వు పరిచయమైన యీ కొద్దిరోజుల్లోనూ నిన్ను బాగా గమనించాను. నీ క్రమశిక్షణ, పట్టుదల, మేనేజిమెంటుస్కిల్స్, నిన్ను తక్కువగా అంచనా వెయ్యనివ్వడంలేదు.”
“కానీ నా గతం”
“నీ గతం చెడ్డదైతే దాని ప్రభావం వర్తమానం మీద పడకుండా చూడు చాలు”
“అది కాదు…”
“నేననుకోవడం, నువ్వు జీవితంలో బాగా దెబ్బతిని వుంటావని. వాస్తవానికి నాకీ సమాజంలో స్థిరపడి వున్న విలువలమీద నమ్మకంలేదు. మనకి సంతోషాన్నివ్వని, మన వికాసానికీ ప్రగతికీ ఏమాత్రం దోహదపడని, మన స్వేచ్ఛని అరికట్టే యీ విలువల్ని లెక్కచేయాల్సిన అవసరంలేదు. నన్నొక వ్యక్తిగా సమాజం ముందు నిలబెట్టావు. నాలో విశ్వాసాన్ని నింపావు. నీతోడుంటే యింకా ఏవో సాధించగలననే నమ్మకాన్ని కలిగించావు. నీమీద ప్రేమ కలగడానికి ఈ మూడూ చాలనుకుంటా. కావాలంటే దీనికి నువ్వు మెటీరియలిస్టిక్ ప్రేమ అని పేరుపెట్టుకో”.
ప్రభాకర్ మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచాయి. ఎంతో అమాయకంగా, సాత్వికంగా వుండే యితను యింత లోతుగా ఆలోచించగలడని అనుకోలేదు. ఆత్మవిశ్వాసం మనిషికి స్వతంత్రమైన ఆలోచనాసరళిని ఏర్పరుస్తుందేమో! ఆత్మవిశ్వాసమంటే నాలుగు డబ్బులు సంపాదించుకుని, కారు కొనుక్కుని తిరగడంకాదు. నలుగుర్లో గౌరవాన్నిచ్చే జీవనశైలి ఏర్పడటం. ఒకప్పుడు అందరి యిళ్లకీ కూరగాయలు ఇచ్చిన ప్రభాకర్, అదే వ్యాపారాన్ని నేను కొంచెం విస్తృతంగా ఆర్గనైజ్ చేసేసరికి సంఘంలో గౌరవాన్ని సంపాదించుకోగలిగాడు. అతనికది గొప్ప విజయమే. నన్ను వ్యాపారభాగస్వామిగానే కాక, జీవితభాగస్వామిగా కూడా కోరుకోవడం అతని కోణంలోంచీ చూస్తే చాలా కరెక్టు. చాలా సరైన నిర్ణయం. మరి నావైపునుంచీ? నా గమ్యంవేరు. నా ఆలోచనలు వేరు. ఎలా చెప్పాలితనికి? ఆలోచనలో నిమగ్నమయ్యాను.
మనసులో వున్నది బైట పెట్టేశాక ప్రభాకర్ చాలా ఫ్రీగా వున్నాడు. స్వతంత్రంగా అన్నీ నా ప్లేట్లో వేస్తున్నాడు.
“వద్దు… వద్దు… ఏమిటిది? తినగలననే?” చెయ్యి అడ్డం పెట్టాను. నిజానికి నా మనసు తిండిమీద లేదు. అతను నన్ను చాలా నిశబ్దంగా కల్లోలపరిచేడు. నిశ్చలంగా వున్న నది అట్టడుగునెక్కడో వున్న అగ్నిపర్వతాలు బ్రద్దలైనట్టుంది. రాజ్ గుర్తొస్తున్నాడు. అతని తిరస్కారం, అతను చేసిన ద్రోహం, ప్రమీలాదేవి అహంభావం గుర్తొస్తున్నాయి. ఆమె మాటలు, ఆమె చేసిన అవమానం మండిస్తున్నాయి. వాటన్నిటినీ తొక్కేసుకుంటూ పిల్లలు, వాళ్లకి దూరంగా వున్నానన్న బాధ నా నిలువెల్లా పాకి నన్ను కుదిపేసింది. పిల్లల తర్వాత అంత పసిమనసుతో నాకు చేరువగా వచ్చిన వ్యక్తి ప్రభాకర్. బాధపడతాడని బలవంతంగా అన్నీ తిని ఐందనిపించి లేచాను.
నా వెనకే సింక్ దగ్గరికి వచ్చాడు. చెయ్యి కడుక్కుంటుంటే నన్నే చూస్తూ నిలబడ్డాడు. “
“ఆలోచించు వసంతా! ఆరోజు రైలు దిగినప్పటి నీ నిస్సహాయత నాకింకా గుర్తుంది. నీకు ఆశ్రయం, రక్షణా కావాలి. నాకు నీ సహకారం కావాలి. మనిద్దరి దారులూ ఒకటైతే అవన్నీ చాలా సహజసిద్ధంగా జరిగిపోతాయి” అని ఒక్కక్షణం ఆగాడు. తర్వాత –
“నీకు నా ప్రతిపాదనని తిరస్కరించటానికి బలమైన కారణం ఏదైనా వుంటే నేనేమీ అనుకోను. ఆ కారణాలు… లేదా నీ సమస్యలు నాతో చెప్తే పరిష్కరించగలనేమో చూస్తాను. లేకపోయినా నీ స్నేహితుడిగా వుంటాను. ఈ ప్రతిపాదన గురించి మర్చిపోదాం. కానైతే… స్నేహితులు ఎప్పటికేనా విడిపోతారు. ఎవరి దారి వారిదౌతుంది. మనిద్దరిదారులూ అలా విడిపోవటం నాకిష్టంలేదు” చెప్పాడు.
బిల్లు పే చేసి యివతలికొచ్చాం. నా మౌనాన్ని అతను భరించలేకపోతున్నాడు. ఏదో ఒకటి మాట్లాడమని నోటితో అనకపోయినా అతని కదలికలు, వుచ్ఛ్వాసనిశ్వాసాలూ చెప్తున్నాయి.
“నీ మంచితనానికి కృతజ్ఞతలు ప్రభాకర్. నన్ను సరిగానే అర్థం చేసుకున్నావు. నా గురించి నీకన్నీ చెప్తాను. కానీ యిపుడే కాదు. ఇంకా టైంకావాలి. నేనీ వూరొచ్చింది డబ్బు సంపాదించుకుని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడటానికి మాత్రం కాదు. నీలో యిలాంటి ఆలోచన కలుగుతుందని ఏమాత్రం వూహించగలిగినా మొదట్లోనే తుంచేసేదాన్ని. నువ్వు మనసు మార్చుకోవడానికి ప్రయత్నించు ” అన్నాను తలదించుకుని. అతను నవ్వాడు. నిరాశపడలేదు. సమయం ఇంకా నా చేతిలోనే వుందని అనుకుంటున్నానుగానీ అది మరోవైపునించీ కుదించుకుపోతోందని నాకు ఆ క్షణాన తెలీలేదు.
“నా నిర్ణయం మారదు. చిన్నపిల్లల ప్రేమకథలు చూసి చూసి ప్రేమ అనే పదాన్ని వాడాలంటే చాలా అపరిపక్వంగా అనిపిస్తోంది. లేకపోతే ఐ లవ్యూ అని లక్షసార్లు చెప్పేవాడిని. నీక్కావాల్సినంత టైం తీసుకో. యస్ చెప్పటానికి ప్రయత్నించు. నువ్వు లేని జీవితాన్ని వూహించుకోలేకపోతున్నాను” అన్నాడు. తర్వాత ఆ విషయం వదిలేసి యింకేవేవో చెప్పసాగాడు. తన చిన్నతనం, చదువు… చనిపోయిన చెల్లెలు… మైకేల్‍తో తన స్నేహం …ఇంకా ఎన్నిటి గురించో మాట్లాడాడు.
ప్రభాకర్ చెల్లెలికి చిన్నవయసులోనే పెళ్లిచేసారట. చాలా మంచి సంబంధమని, పెద్దలంతా కలిసి చేసిన ఆ పెళ్లి దారుణంగా విఫలమైంది. కట్నం చాల్లేదనీ, పెళ్లిలో మర్యాదలు సరిగా జరపలేదనీ ఆ అమ్మాయిని అత్తవారింట్లో బాగా బాధపెట్టేవారట. తట్టుకోలేక అక్కడినుంచీ పారిపోయి వచ్చేదట. వచ్చినప్పుడల్లా ప్రభాకర్ తండ్రి కొంత డబ్బిచ్చి, తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చేవాడట. అలా తిరిగి వెళ్లినపుడు ఒకసారికీ శిక్ష పెరిగిపోయి ఆఖరిసారి తిరిగెళ్లాక తట్టులేక తనకి విముక్తి లేదని నిర్ధారించుకునో ఆ అమ్మాయి ప్రాణం తీసుకుందట.
ఆ విషయాలు చెప్తున్నప్పుడు ప్రభాకర్ గొంతు వణికింది. కళ్లలో నీళ్లు తిరిగాయి.