రచయిత ఉత్తరాంధ్రనివాసి. వీరి జీవితకాలం 3.7.1927 – 6.5.2000. 300కి పైగా కథలు, 32 చిన్నాపెద్దా నవలలు, 5 నాటికలు రాసారు. వీరి పుణ్యభూమి నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, బలివాడ కాంతారావు కథలు అనే సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చాయి. ఇంకా ఎన్నో రచనలకు అనేక సాహితీ పురస్కారాలు, అవార్డులు లబించాయి. ఈ నవలని నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించడమేకాక అనేక ఇతరభాషల్లోకి అనువదించి, ప్రచురించింది. మొదటి ప్రచురణ సంవత్సరం 1961.
2001లో పుస్తకం వెల 75 రూపాయలు.
చరిత్ర ఎందుకు, సాహిత్యం ఎందుకు అనే ప్రశ్నలు ఈమధ్య తరుచుగా ఎదురౌతున్నాయి.ఈ దేశంలో పేదరికం ఎలా మొదలైంది అనేది మేథావులని వేధించే అతి పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సరైన జవాబులు నవలలో దొరుకుతాయి.
స్వతంత్రం వచ్చిన కొత్తరోజుల్లో నవల ప్రారంభమౌతుంది. వంశధారానది వొడ్డున వున్న నవిరి అనే గ్రామం కథావేదిక. డబ్బువాడకంలేకుండా ఇచ్చి పుచ్చుకుంటూ పరస్పరం సహకరించుకునే గ్రామీణజనం యొక్క బతుకులు స్వాతంత్ర్యం వచ్చాక ఒక అత్యంతసహజమైన రీతిలో మార్పు చెందడం, ఆ గ్రామంలోని పుల్లయ్య అనే యువకుడి జీవితం స్వావలంబననుంచీ, నేరచరిత్రలోకి దిగజారిన, వున్నంతలో తోటివారికి పెట్టి తాను తినే మనస్తత్వంగల ఇతని భార్య నీలమ్మ యాచకురాలు కావటానికి దారితీసిన, పరిస్థితులని రచయిత చాలా హృద్యంగా, ఎక్కడా తానుగానీ, తన అభిప్రాయాలుగానీ కనిపించకుండా ఒక ద్రష్టలా చెప్పుకుపోతారు. డబ్బున్నవాడు వుండచ్చు, వాడు డబ్బుని పోగుచేసుకోవచ్చు, కానీ లేనివాడి కడుపుకూడా నిండాలనేది నవల చెప్పిన సామాజికసూక్ష్మం. ఆకలి లేకపోతే నేరం వుండదు. ఒక పెద్ద నేరవ్యవస్థని నడిపించి బలోపేతం చేసేది కడుపునిండని చిన్నచిన్నవ్యక్తులు. వీరి కడుపు నిండితే ఆ వ్యవస్థ బలహీనపడుతుంది. కుప్పకూలుతుంది.
1760- 1840 పారిశ్రామిక విప్లవకాలం. ఇంగ్లాండులో మొదలైన ఆవిష్కరణల పరంపర అక్కడితో ఆగకుండా భారతదేశానికీ వచ్చింది. యంత్రాలు తయారయ్యాయికాబట్టి పరిశ్రమలు పెట్టడం, వాటిని పనిచేయించడానికి కార్మికులని తయారుచెయ్యడం, వారికోసం పట్టణాలు- మురికివాడలు సృష్టించడం, పరిశ్రమల్లో తయారైన అధిక వుత్పత్తికోసం మార్కెట్ ప్రలోభాలని సృష్టించడం, ప్రజలందరికీ సమానమైన హక్కుగల ప్రకృతివనరులమీద స్వంతలాభాలు ఆర్జించడం… ఇదంతా ఒక చట్రంలా బిగుసుకుని మనుషుల్ని పట్టి వుంచే పరిస్థితి మొదలైంది. అప్పటివరకూ భూమితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతివారికీ ఎంతోకొంత అనుబంధం వుండేది. కొందరు పెద్దకమతాలవారు, వారి దగ్గర కౌలుకి చేసుకునేవారు, చిన్న రైతులు, వ్యవసాయకూలీలు, సమాజానికి అవసరమైన వస్తువులో, సేవలో ఇస్తూ, రైతుకొలిచే ధాన్యంమీద ఆధారపడే చేతివృత్తులవారు, వుండేవారు. వస్తుమార్పిడి తప్ప ద్రవ్యవినియోగం చాలా తక్కువగా వుండే కాలం అది. పరాయిపాలనలో వచ్చిన మార్పుని దేశీయప్రభుత్వం పూర్తిచేసింది. విదేశీయులనించీ అధికారాన్ని బదలాయింపు చేసుకున్న కొత్తప్రభుత్వం తమకి ఏదో చేస్తుందని ఆశించిన ప్రజల ఆశలు అడియాసలౌతాయి.
పట్టణాలూ, పరిశ్రమలూ వచ్చాక ఒక వర్గంవారికి వ్యవసాయంతో లంకె పూర్తిగా తెగిపోయింది. వారు చేసే వుత్పత్తులు ధనికులకి లాభాలు ఆర్జించిపెట్టడానికి తప్ప కడుపు నిండడానికి వుపయోగపడవు. తను వుత్పత్తి చేసినదాన్ని వారితో పంచుకోవలసిన బాధ్యత రైతుమీద పడుతుంది. ఈ అదనపు బాధ్యతకి కరువుకాటకాలు, కొత్తగా మొదలైన డబ్బు వినియోగం తోడౌతాయి. వ్యవసాయేతర రంగంలో వున్నవారికోసం, కరువుకాటకాల ముందస్తు జాగ్రత్తకోసం ప్రభుత్వం ధాన్యసేకరణ (ప్రొక్యూర్మెంటు) మొదలుపెడుతుంది. అందులోని అవకతవకలు, అవినీతి నల్లవ్యాపారాలకి దారితీస్తాయి. కొత్తగా మొదలైన రాజకీయాలు భూమికి కొత్తవిలువని ఇస్తాయి. పెద్దరైతులు, నిర్ణయం తీసుకోగలిగే వెసులుబాటుగలవారు ధనికులుగా పైకి ఎదుగుతుంటే అలాంటి అవకాశంలేని మామూలు మనుషుల జీవితాల్లో జరిగే విధ్వంసం మనసుని కలిచివేస్తుంది. వ్యవసాయంతో సంబంధాన్ని తుంచేసేవిధంగా తీసుకున్న ప్రతి నిర్ణయం, చిన్నరైతుల, కౌలుదార్ల స్థితిగతుల్ని తలకిందులు చేస్తుంది. తెలుగువారి జీవితాలనే చూపించినప్పటికీకూడా మొత్తం నవల భారతీయసమాజంలోని అత్యంత కీలకదశని ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది.
ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. రచయిత తనకోసం తను రాయరు. తన అభిప్రాయాలు, అభినివేశం ఇతరులని చేరాలని రచనలు చేస్తారు. మాండలీకంలో రాసేవారికి ఈ నవల ఒక కరదీపికగా చెప్పుకోవచ్చు. కళింగాంధ్ర యాస వినిపిస్తునే, అందరికీ అర్థమయేలా రాసారు రచయిత.
వస్తువు, శైలి, భాషలాంటి అనేక కోణాల్లోంచీ తప్పక చదవాల్సిన నవల దగాపడిన తమ్ముడు.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.