వాళ్లిద్దరూ ప్రేమికులు. ఆ ప్రేమ వయసు ఏడాది. ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామనుకుంటున్నారు. వాళ్లమధ్య అసంకల్పితంగా మొదలైన ఆ చర్య పూర్తయింది. ఇద్దరికీ అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.
భార్గవ నుంచీ విడివడి దూరంగా జరిగింది నీల. బిడియంగా తల దించుకుంది. పల్చటి సిగ్గుతెర ఆమె ముఖంమీద పరుచుకుంది. అతను చిన్నగా నవ్వాడు. ఆ క్షణాన అతని మనసులో ఏమీ లేదు. నిష్కల్మషంగా ఉంది. తను కొద్దిక్షణాల క్రిందట పొందిన అనుభూతి అతని అణువణువునా కదిలి తరంగాల్లా ఎగిసిపడుతోంది.
“కోణార్కలో వెళ్తున్నాను. వారం తర్వాత వస్తాను” అన్నాడు.
“అన్ని రోజులా?” బెంగగా అంది. “మీవాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారా?” బేలగా అడిగింది.
“ఒప్పిస్తాను” స్థిరంగా అన్నాడు. కొద్దిసేపుండి వెళ్లిపోయాడు.
సరిగ్గా పదీనలభయ్యైదుకి కోణార్క ఎక్స్‌ప్రెస్‍లో ఉన్నాడు భార్గవ. సూదిమొనంత చీలిక మొదలైంది మనసులో. లావాలా ఎగజిమ్మసాగాయి ఆలోచనలు. ఉదయపు సంఘటన యొక్క మరో పార్శ్వాన్ని దర్శిస్తున్నాడతను.
అలా ఎలా ఒప్పుకోకలిగింది నీల? ఎప్పుడూ డీసెంటుగా చుడీదార్ డ్రెస్సుల్లో హుందాగా ఉండే నీల… తను వస్తున్నాడని ఫోన్ చేశాక కూడా నైటీలోనే ఉండిపోయిందెందుకు? ఇలా జరుగుతుందని ముందే ఊహించిందా? ఇలా జరగాలని ఆశించిందా? ఛ.. ఛ., అతనికేమిటో ఇబ్బందిగా అనిపించింది.
పెళ్లికిముందు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్తారు. ఎంత క్లోజుఫ్రెండునైనా భుజంమీద చెయ్యికూడా వెయ్యనివ్వరని తెలుసు. తన చెల్లెలికి తల్లి అలాగే చెప్తుంది. మరి నీల? తమవి కులాలు ఒకటి కావు. పెళ్లికి తనింట్లోవాళ్లు ఒప్పుకోరనే సందేహం ఉంది. అందుకని ఇలా బైండ్ చెయ్యాలనుకుందా? ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అసహ్యం కూడా మొదలైంది.
తన బంధువుల పరిధిలోగానీ పరిచయస్తుల్లోగానీ ఎవరూ ఇలా ఉండరు. ఉద్యోగం చేసుకుంటూ, వంటరిగా ఫ్లాట్‍లో ఉండరు. పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని పెళ్లవకుండా వేరే ఊళ్లకి పంపరు. పంపినా ఏ బంధువుల ఇంటిలోనే ఉంచుతారు తప్పించి, ఇలా విడిగా ఉంచరు. ఆడపిల్ల ఉద్యోగం, సంపాదనా ప్రధానం కావు. చదువు అవగానే పెళ్లి చేసి పంపే ఏర్పాట్లు చేస్తారు. మరి ఈ నీలేమిటి ఇలా? ఒక్కర్తీ ఫ్లాట్లో ఉంటోంది. ఎందుకని అడిగితే తల్లిదండ్రులో అన్నదమ్ములో కజిన్సో ఎవరో ఒకరు వస్తునే వుంటారని చెప్పింది. కాదేమో! ఇలాంటి ఎఫేర్స్ తనకింకా ఉన్నాయేమో! తనతోటే మొదలుకాదేమో! పర్సనాలిటీ, చదువు, ఉద్యోగం… అన్నీ ఉన్న తనని పెళ్లి కోసం ప్రావోక్ చేసి ట్రాప్ చేసిందేమో! ఎన్నో అనుమానాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. మర్నాటికి రైలు ముంబై చేరుకుంది.
తల్లిదండ్రులతో అతనింక నీల గురించి ప్రస్తావించలేదు. వారం అనుకున్న సెలవుని మరొక వారం పొడిగించుకుని అక్కడే రెండుమూడు ఇంటర్వ్యూలు ఎటెండయ్యాడు. ఒకదాంట్లో సెలక్టయ్యాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేసి అందులో చేరిపోయాడు. ఒక రాత్రికి రాత్రి వెళ్లి ఎవరికీ తెలీకుండా తన సామాన్లన్నీ తెచ్చుకుని వచ్చేశాడు.
అతని తల్లిదండ్రులకి ఇదేం అర్థం కాలేదు. అతను బైటెక్కడో ఉద్యోగం చేస్తున్నంతకాలం వాళ్లకి కొద్దిగా భయం ఉండేది ఎవరేనా అమ్మాయిని ప్రేమించానని హఠాత్తుగా చెప్పేస్తాడేమోనని. ఇప్పుడా భయం పూర్తిగా కాకపోయినా కొంతవరకూ తీరిపోయింది.
భార్గవ వెళ్లిన దగ్గర్నుంచీ అతని ఫోన్‍కోసం ఎదురుచూసింది నీల. ఒక్క ఫోన్‍కూడా చెయ్యలేదు భార్గవ. తనెప్పుడూ చేసే నెంబరుకి చేస్తే కనెక్టవ్వలేదు. వారం తర్వాత అతనొస్తాడని ఎదురుచూసింది నీల. అతను రాలేదు. సిమ్‍కార్డు మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడేమోననే అనుమానం సన్నగా మొదలైంది. కొద్దిరోజులు గడిచే సరికి దృఢపడింది.
ఎందుకిలా చేశాడు? అందరు మగవాళ్లలాగే ఇతనూనా? అవకాశం తీసుకుని వదిలేశాడా? నమ్మలేకపోతోంది. మరి పెళ్లి మాటలు?
“నా కొలీగ్‍ద్వారా వచ్చింది. నీ చదువు, ఉద్యోగం చూసి వాళ్లంతట వాళ్లే కబురు పెట్టారు. చాలా మంచి మేచి. నీకూ ఇష్టమైతే మాట్లాడదాం” నీల తండ్రి ప్రతిపాదన.
నీలలో సందిగ్ధం. భార్గవకోసం ఇంకా ఎదురుచూడాలా తను? ఇంకా ఆ ఆశ ఉందా? మనసులో ఏమూలో మొదలైన నైరాశ్యం నిలువెల్లా ఆవరిస్తున్న భావన కలిగింది. తను మోసపోయిందా? అతన్ని నమ్మి… ప్రేమలో పడి మోసపోయిన ఎందరో ఆడపిల్లల్లాగే తనూ మోసపోయిందా? అతన్ని రెసిస్ట్ చేసి ఉండాల్సిందా? మోటుగా తోసేసి, గాయపరిచి తనని తను కాపాడుకోవలసి ఉండెనా? కానీ ఆ క్షణాన అతను తనని ప్రేమించిన వ్యక్తి అనే తప్పించి మరో ఆలోచన రాలేదు. ఆత్మీయుడనిపించాడుగానీ విషం చిమ్ముతున్నట్టుగా అనిపించలేదు. చాలా లవబుల్‍గా అనిపించాడు. అదంతా పూర్తిగా తనదే తప్పా? ఆమెకి బాధనిపించలేదు. రోషంగా అనిపించింది.
లోతుగా ఆలోచిస్తే భార్గవ ఇంక రాడని అర్థ మైంది. అతని కంపెనీకి ఫోన్ చేస్తే ఆ విషయం నిర్ధారణైంది. తండ్రికి సమ్మతిని తెలిపింది.
పెళ్లిచూపుల్లో శరత్‍ని చూసింది. అతనికి జరిగిపోయిన సంఘటన గురించి చెప్పాలా? వద్దా? సందిగ్ధం. ఇంకా ఎటూ నిర్ణయించుకోలేకపోయింది.
“ఇవాళ పార్టీ ఇస్తున్నాను. మన క్లోజ్ సర్కిల్ ఐదారుగురమే. సాయంత్రం ఇక్కడినుంచీ డైరెక్టుగా వెళ్లిపోదాం” అన్నాడు శరత్.
“సందర్భం ఏమిటి?” అడిగేడు భార్గవ. ఇద్దరూ ఈ కొత్తకంపెనీలో కొత్తగా స్నేహితులయారు.
శరత్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఎప్పుడూ లేని కొత్తభావం. భార్గవకి అర్థమైంది. “కంగ్రాట్స్” నవ్వుతూ చెప్పాడు.
“నిన్న పెళ్లిచూపులయ్యాయి. అమ్మాయి అందరికీ నచ్చింది. ఎమ్‍సియ్యే చదివింది. న్యూ ఎరా సాఫ్ట్‌వేర్ సాల్యూషన్స్‌లో చేస్తోంది. ఇరవైవేలు జీతం” వివరాలు చెప్పాడు.
భార్గవ భృకుటి ముడివడింది.
అదేం గమనించకుండా శరత్ చెప్పుకుపోయాడు. “తన పేరు నీల. చాలా బావుంటుంది”
భార్గవ భౄముడి విడింది. అప్పుడు గమనించాడు శరత్ అతను అనీజీగా ఉండటాన్ని.
“ఏమైంది?” వింతగా అడిగాడు.
“చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను”
“ఏమిటి?”
“నీదగ్గర తన ఫోటో ఉందా? ఒకసారి నిర్ధారించుకున్నాక చెప్తాను”
పెళ్లిచూపులకి వాళ్ళు పంపించిన ఫోటో ఇచ్చాడు శరత్. ఆ ఫోటో నీలదే. తనెరిగిన.. తన్నెరిగిన నీలదే.
“ఈ సంబంధం వదిలి పెట్టెయ్” క్లుప్తంగా అన్నాడు.
“ఎందుకు?’
భార్గవ ఏదీ దాచలేదు. “మేమిద్దరం ఏడాదిపాటు ప్రేమించుకున్నాం. పెద్దవాళ్లతో మా పెళ్లి గురించి మాట్లాడాలి. వారంరోజులు లీవుపెట్టాను. ఆఫీసులో కొద్దిగా పని మిగిలింది. అది పూర్తి చేసి ట్రైనెక్కి మా ఊరు వెళ్లాలనుకున్నాను. వెళ్లేముందు తనని కలిసి వెళ్లాలనిపించింది. ఉదయం ఐదు… టైం. అప్పుడు నిద్రకళ్లతో… నైటీలో నన్ను రిసీవ్ చేసుకుంది. కొద్దిగా మోహపడ్డాను. తను నన్ను ఆపవలసింది. కానీ తనుకూడా తొందరపడింది. ఆ ఆతృత, కోరిక… ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆడపిల్లల్లో సహజంగా ఉండే బిడియం ఏమాత్రం చూపించలేదు. తనకి ఇలాంటిది కొత్త కాదేమోననిపించింది. నాది అనుమానమే కావచ్చు. కానీ అంత నిగ్రహం లేని మనిషి రేపు పెళ్లయ్యాక ఇంకెవర్తినేనా తొందరపడితే?”
శరత్ ముఖం ఎర్రబడింది. కేరక్టర్ లేని వ్యక్తి… అలాంటామెని అందం, జీతం చూసి ప్రలోభపడి తను చేసుకోవాలనుకున్నాడు. ఆమె వైపునించీ జరిగింది కూడా పొరపాటే అయితే… కనీసం ఆమె అలా అనుకుంటుంటే తనతో ఆ విషయం చెప్పి ఉండాలి. కానీ చెప్పలేదు. దాచిపెట్టి చేసుకోవాలనుకుంటోంది. మోసగించి చేసుకుందామనుకుంది. అతనిలో కసి.
“నీలా! నేను మిమ్మల్ని చేసుకోవాలనుకోవటంలేదు” ఫోన్ చేసి చెప్పాడు. ఆ కసి గొంతులో ప్రతిధ్వనించింది.
” ఎందుకు?
” కుడిమోకాలిమీద పుట్టుమచ్చ ఉన్నమ్మాయి పెళ్లికి పనికిరాదట”
“ఎలా తెలిసింది?”
“భార్గవ నా ఫ్రెండు” అతను ఫోన్ పెట్టేశాడు. ఆమె గాయపడి ఉంటుందనుకున్నాడు. చాలా సంతోషం కలిగింది. నీలకి అంతా అర్థమైంది. సంబంధం తప్పిపోయింది.
ఇంట్లో చెప్పింది. “కొన్నాళ్లు నాకు సంబంధాలు చూడకండి నాన్నా!” అంది. అవమానం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రశ్నార్థకంగా చూశాడు. ఇంకా అవమానంగా అనిపించింది.
జవాబు చెప్పలేని పరిస్థితి… తను సృష్టించుకున్నదే. చాలా బాధనిపించింది. తలదించుకుంది. అక్కడినుంచీ వెళ్లిపోయింది.
“ఇంతకాలం మీరు పెళ్లేందుకు చేసుకోలేదు?” కుతూహలంగా అడిగాడు ప్రహ్లాద్. ఈమధ్యకాలంలో అతను నీలకి చాలా సన్నిహితంగా వచ్చాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. దాన్ని ప్రేమని ఆమె అనుకోవటంలేదు. అతననుకుంటున్నాడు. అందుకే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఆమె అంతరంగాన్ని శోధించే ప్రయత్నం చేస్తాడు.
“నేను చేసింది ఒకే ఒక్క పొరపాటు. అతన్ని ప్రేమించటం. ప్రేమించానుగాబట్టి నమ్మాను. నమ్మానుకాబట్టి రాకూడని టైములో రానిచ్చాను. అతను నా మనిషని నమ్మాను. అతనివలన నాకు హాని జరుగుతుందని అనుకోలేదు. అతను నన్ను నమ్మలేకపోయాడు. కనిపించిన ప్రతిమగవాడితో పోతానని భయపడ్డాడు. కానీ నాకలాంటి ఆలోచన రాలేదు. కనిపించిన ప్రతి అమ్మాయితో అఫేర్స్ నడిపే వ్యక్తిగా అతన్నిగురించి అనుకోలేకపోయాను. ఆడవాళ్లని అంటారుగానీ మగవాళ్లే పెద్ద సెంటిమెంటల్‍ఫూల్స్. వాళ్లు చేసే న్యాయానికీ అన్యాయానికీ మధ్య హద్దుగీత గీసేది కేవలం మంగళసూత్రమేనంటే నాకు ఆశ్చర్యమనిపిస్తుంది” అంది నీల. “ఆ సంఘటన జరగకుండా ఉండి ఉంటే మేం సఫల ప్రేమికులుగా ఉండేవాళ్లమనుకుంటా. మా పెళ్లికూడా జరిగేది కావచ్చు”
“దాన్ని పొరపాటని అనుకుంటున్నారా?” కుతూహలంగా అడిగాడు ప్రహ్లాద్.
“ఔను” స్థిరంగా వచ్చింది నీల జవాబు.
“సరిదిద్దుకోవాలనుకుంటున్నారా?!!”
“ఆ అవకాశం లేదు”
“ఏం?”
“అతను తన సర్కిల్లో అందరికీ నాగురించి చెడ్డగా ప్రచారం చేశాడు”
“నన్ను చేసుకోగలరా?””
“…?!!”
“భార్గవ నాకూ తెలుసు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి చివరికి ఇక్కడ కలుసుకున్నాం. ఇప్పుడు మేమిద్దరం చేసేది ఒకచోటే. తను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా”
“మామధ్య జరిగిన ఆ విషయాన్ని మర్చిపోగలరా?” అడిగింది నీల. తలూపాడతను.
పీటలమీద కూర్చుని బొమ్మలపెళ్లిలా చేసుకోవటానికి ప్రహ్లాద్ సిగ్గుపడ్డాడు. నీలకి కూడా అలాగే అనిపించింది. ఇద్దరికీ ముస్ఫై దాటాయి. ముఖ్యమైన వాళ్ల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి రిజిస్టర్ చేసుకున్నారు. రిసెప్షన్ మాత్రం ఘనంగా ఏర్పాటుచేశారు.
మళ్లీ నీలని కలుస్తాననుకోలేదు భార్గవ. ప్రహ్లాద్ కొలీగ్‍గా రిసెప్షన్‍కి వచ్చాడు. ఆమెని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. ప్రహ్లాద్ రిసెప్షన్‍కి రమ్మన్నాడుగానీ పెళ్లికూతురెవరో వివరాలేమీ చెప్పలేదు.
“ఎలాగా చూస్తావుగా?” అన్నాడు.
“దాచిపెట్టి చేసుకున్నావా?” ప్రహ్లాద్ ఎవర్నో రిసీవ్ చేసుకోవటానికి వెళ్లినప్పుడు అడిగాడు.
నీల నవ్వింది. “నువ్వు చెప్పి ఉంటావనుకున్నాను” పదునుగా ఉంది ఆమె జవాబు. అతని ముఖం మ్లానమైంది.
“అలా ఎలా చేసుకోగలిగావు?” మరో ప్రశ్న.
“నువ్వు చేసుకోలేదా? అలాగే. ఇంతకీ మీ ఆవిడకి చెప్పావా ఈ విషయం?”
“ఛ… ఇలాంటివి ఎవరేనా చెప్పుకుంటారా? అదేమంత గొప్ప విషయమని? అఫ్‍కోర్సు, తనకి తెలిసినా పెద్ద ప్రాబ్లం లేదులే. మగవాడిని. నువ్వే జాగ్రత్తగా ఉండాలి” అతని గొంతులో అదోలాంటి చులకనభావం.
అసహ్యం వేసింది నీలకి. అందమైన ప్రేమికుడిగా, అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తగా అతను వేసుకున్న ముసుగులు తొలగిపోయి వికృతంగా కనిపించాడు. ఇంతలో ప్రహ్లాద్ అతిథులని పెట్టుకుని రావటంతో భార్గవ పక్కకి తప్పుకున్నాడతను.
పార్టీ ముగిసింది. వచ్చినవాళ్లంతా వెళ్లిపోయారు. నీల మనసు భగ్గుమంటోంది. తను ఇంతకాలం తనగురించే ఆలోచించుకుంటూ జరిగిన చర్యలో తన పారపాటు ఎంతవరకో విశ్లేషించుకుంటూ ఉండిపోయింది. భార్గవని ఉపేక్షించింది. అతను ఇప్పటికే తన జీవితాన్ని కెలికాడు. జరిగిన దానికి పశ్చాత్తాపపడటం లేదు. తననే బెదిరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండమని. ఆమె ముఖం ఎర్రబడింది.
ప్రహ్లాద్ వచ్చాడు ఆమె దగ్గరికి. వెంటనే సర్దుకుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని స్పర్శలో ఆమెకి ఎంతో ఓదార్పూ ధైర్యం లభించాయి.
భార్గవ లేఆఫ్ అయ్యాడు. అది కూడా స్లోవర్కరనే బేడ్ రిమార్కుతో. ఇంకెక్కడేనా వుద్యోగం దొరకడం చాలా కష్టం. అందులో ప్రహ్లాద్ ప్రమేయం వుందని అర్థమైంది నీలకి. భార్గవ భార్యనీ ఇద్దరు పిల్లలనీ తలుచుకుంటే బాధ కలిగింది. మనిషికి మంచిగా వుండటం ఒక సామాజిక అవసరం. తనకోసం కాకపోయినా తనవాళ్ళకోసమేనా మంచిగా వుండకపోతే కలిగే పరిణామాలు అతనితో సమంగా ఇంకా కాదంటే అతనికంటే వాళ్లే ఎక్కువగా అనుభవిస్తారు. దుష్యంతుడు తెలిసీ శకుంతలని తిరస్కరిస్తే కాళిదాసు అంతటి మహరాజుకి చెడ్డపేరు రాకూడదని కథ మార్చి రాసాడు. రాజే చెడు చేస్తే ప్రజలకి అది ప్రోత్సాహమే.
నీల దగ్గరకి వచ్చాడు అతను. ఎవరో అతని భార్యకి చెప్పారట. ఎనిమిదేళ్ల క్రితం అతనో అమ్మాయిని ప్రేమించి మోసం చేసి ఊళ్లోనుంచీ పారిపోయాడని. పగలూ రాత్రి అదే వేధింపట ఇంట్లో.
“పూర్తిగా నాశనమైపోయాను. ప్రహ్లాద్ కక్ష కట్టి చేస్తున్నాడు ఇదంతా!” అన్నాడు దాదాపుగా ఏడుస్తూ.
“నన్నొక చెడ్డ అమ్మాయిగా ఎస్టాబ్లిష్ చేశావు నువ్వు. మంచిభార్యగా మిగలాలంటే ఇవన్నీ తప్పవు. పార్టాఫ్ ద గేమ్. ప్రహ్లాద్‍కి నేనే చెప్తున్నాను ఏం చెయ్యాలో” అంది నీల.
“జరిగింది చాలు. నీకు దూరంగా వెళ్లిపోతాను. దయచేసి నన్ను మర్చిపో” అన్నాడు బ్రతిమాలుతూ.
“నిన్ను మర్చిపోకపోతే శరత్‍తో పెళ్లిచూపులకి కూర్చునేదాన్ని కాదు. కానీ నువ్వే నన్ను మర్చిపోలేదు. నీ పురుషహంకారం నన్ను మర్చిపోనివ్వలేదు. ఇద్దరం కలిసి చేసిన తప్పుకి ఎవరి వ్యక్తిగత బాధ్యత వాళ్లది. శరత్‍కి నువ్వెందుకు చెప్పావు? అలా ఎంతమందికి చెప్పావు? ఎంత బురద చల్లావు నామీద? ప్రహ్లాద్ పరిచయమవ్వకపోతే… లేదా అతనూ నీలాంటి పురుషహంకారి అయితే జీవితాంతం వంటరిగా మిగిలిపోయేదాన్ని. రగిలే జ్వాలకి గాలి తోడైనట్టు ప్రహ్లాద్ నాకు తోడయ్యాడు. మోసగాడైన వ్యక్తి పట్ల అతనికి ఎలాంటి దయా లేదు. జరిగినది చెప్పడం చెప్పకపోవటం అనేది నా సమస్య. నీది కాదు. నువ్వు చేప్పే చేసుకున్నావా? లేదుగా? ఆరోజు నీదైతే ఈ రోజు నాది. గెటెవే” అంది నీల కోపంగా.
అతను తలదించుకుని వెళ్లిపోయాడు. ఆ రాత్రే భార్యాపిల్లలని తీసుకుని ఊళ్లోంచి వెళ్లిపోయాడని తెలిసింది నీలకి. ప్రహ్లాద్ చెప్పాడు. భార్గవ రెండుసార్లు పారిపోయాడు. చేసిన పనికి బాధ్యత తీసుకోవటానికి భయపడి ఒకసారి, పర్యవసానాలని తట్టుకోలేక రెండోసారి.
(26 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 5/10/2006)

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.