పాతిపెట్టిన నాణెములు – విశ్వనాథ సత్యనారాయణగారు, పరిచయం – యస్. శ్రీదేవి

విశ్వనాథ సత్యనారాయణగారి జీవితకాలం 10.9.1895 – 18.10.1976. వీరు బహుముఖప్రజ్ఞాశాలి. 57 నవలల్తోపాటుగా మొత్తం 127 పుస్తకాలు రచించారు. ఇందులో పన్నెండు నవలలు పురాణవైరగ్రంథమాలపేరిట మగథరాజుల పరంపరనీ, ఆరునవలలు కాశ్మీరరాజచరిత్రనీ, మరొక ఆరునవలలు నేపాలు రాజవంశచరిత్రనీ తెలియజేస్తాయి. వీరి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. వీరు పద్మభూషణ్ పురస్కార గ్రహీత. వీరి వేయిపడగలు గ్రంథాన్ని హిందీలోకి అనువదించినందుకుగాను పీవీ నరసింహారావుగారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి పుస్తకాలన్నీ శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ సంస్థద్వారా ప్రచురించబడతాయి. ప్రస్తుతపు పుస్తకప్రతి ప్రచురణకాలం 2006. నవలలన్నిటినీ ఒక సెట్టుగా ప్రచురించినప్పుడు కొనటం జరిగింది. ఈ నవల రచనాకాలం 1964. కాశ్మీరరాజవంశ నవలల్లో ఇది రెండవది.
భారతదేశ చరిత్ర చదివినవారికి చదివినంత, నమ్మినవారికి నమ్మినంత. భారతచరిత్రలో కాశ్మీరు, నేపాలు, మగధ రాజవంశాల చరిత్రలు ప్రామాణికమైనవి.
ఐహోలు శాసనం ప్రకారం మహాభారతయుద్ధం క్రీ.పూ. 3138లో జరిగింది. యుద్ధానికి రెండుమూడు వందల సంవత్సరాలకి ముందు మొదటి గోనందుడు కాశ్మీరుని పాలించాడు. అతడికొడుకు దామోదరుడు. శ్రీకృష్ణుడి చేతిలో చనిపోయాడు. ఇతడి కొడుకు రెండవ గోనందుడు. తన తండ్రి తాతల మరణానికి కారణమైన యదువంశంపైనా, కృష్ణుడికి దాయాదులైన పాండవులమీదా కక్ష తీర్చుకుందుకు యుద్ధానికి వెళ్ళి, పరీక్షిత్తు చేతిలో చనిపోతాడు. కాశ్మీరు 1317 సంవత్సరాలు కురురాజుల పాలనలో వున్నాక లవుడనే గోనందవంశీయుడు మళ్ళీ రాజ్యాన్ని చిక్కించుకుంటాడు. ఈ పరంపరలో 611 BCE నుంచి 625 BCE మధ్యలో ఏడు సంవత్సరాలు పాలించిన తోరమాణుడనే కాశ్మీరరాజు యొక్క కాలాన్ని, వంశాన్ని నిర్ణయించడంలో జరిగిన పొరపాటు గురించి ఈ నవలలో చర్చించారు రచయిత.
కళ్హణుడి రాజతరంగిణి ప్రకారం తోరమాణుడు 642-612 BCE మధ్య కాశ్మీరుని పాలించిన శ్రేష్ఠవాహనుడు/మొదటి ప్రవరసేనుడి కొడుకు. 611-581 BCE మధ్య పాలించిన హిరణ్యుడి కవలసోదరుడు. ఇతడిని కర్కోటవంశానికి చెందినవాడిగానూ, మిహిరకులుడి తండ్రిగానూ ఆధునిక చరిత్రలో రాసి వుంది. తోరమాణుడిని చరిత్రపుటల్లోంచీ తప్పించడానికి హిరణ్యుడు యుక్తికుయుక్తులు పన్నటం, నిస్సంతుగా అతడు మరణించడం, అదేసమయానికి తోరమాణుడుకూడా చనిపోవటం, తోరమాణుడి కొడుకైన రెండో ప్రవరసేనుడు రాజవటం కథావస్తువు.
కవలసోదరులిద్దరికీ పట్టాభిషేకం చేసి, ఇద్దరినీ చెరొక సంవత్సరం వంతున పాలించమని ఆదేశిస్తాడు తండ్రి. పధ్నాలుగు సంవత్సరాలు అలా జరిగాక తండ్రి చనిపోతాడు. ఆయన చనిపోగానే తమ్ముని నిర్జనప్రదేశంలో బంధిస్తాడు హిరణ్యుడు. తోరమాణుడు తన బొమ్మ వున్న నాణాలని ముద్రించడం దానికి కారణం. అది రాజద్రోహం. దాని వెనుక వున్నది హిరణ్యుడి రాజ్యకాంక్ష. అప్పటికే నిండు గర్భవతియైన తోరమాణుడి భార్య అంజనాదేవి రాబోయే ఆపదల్ని గుర్తించి పారిపోయి యూకావతి అనే గ్రామంలో ఒక కుమ్మరివారింట్లో రహస్యంగా ప్రవరసేనుడనే మగశిశువుకి జన్మనిస్తుంది. తల్లీకొడుకులు అజ్ఞాతంగా బతుకుతుంటారు. తోరమాణుడి పాలనని చరిత్రపుటల్లోంచీ తొలగించడానికి హిరణ్యుడు అతడు ముద్రింపజేసిన నాణాలని నిషేధించి పట్టుబడినవి పట్టుబడినట్టు కరిగించేస్తుంటాడు.
తోరమాణుడు చనిపోయాడని అందరూ నమ్ముతారు. అతడి కొడుకు అజ్ఞాతంలో వున్నాడు. హిరణ్యుడు సంతానం లేకుండా చనిపోయాడు. ఉజ్జయనికి చక్రవర్తియైన విక్రమాదిత్యుడికి కాశ్మీరు సామంతరాజ్యం. చక్రవర్తి మాతృగుప్తుడనే కవిని కాశ్మీరుకి రాజుగా నియమిస్తాడు. ఈ కథ పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీనగాథాలహరిలోకూడా వుంది. మాతృగుప్తుడినుంచి తోరమాణుడి కొడుకైన రెండో ప్రవరసేనుడు రాజ్యాన్ని ఎలా పొందాడు, తోరమాణుడిని చరిత్రలో నిలపడానికి చేసిన ప్రయత్నం ఏమిటనే విషయాలమీద నవల ముగుస్తుంది.