ఝరి – 77 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

లక్ష్మిది నిగూఢమైన దు:ఖం. గీత పైకి కనపడని ఓదార్పు ఆమెకి. కొడుకులకన్నా ఎక్కువగా ఆమెమీదే ఆధారపడుతుంది. వాళ్ళకి ఏదీ చెప్పుకోలేదు. గీత అన్నీ అర్థమైనట్టే వుంటుంది. అన్నగారితో ఏదైనా చెప్పుకుంటే, “నేనేం చెయ్యగలనమ్మా? అశక్తుడిని” అని తనూ కంటతడి పెట్టుకుంటాడు. బాధపడతాడు. గీత అలా కాదు. వంటికీ, మనసుకీ హాయినిస్తూ మెల్లగా సాగే ప్రవాహం. ఆమె వచ్చి పక్కన కూర్చుంటే, నేనున్నాననే ధైర్యం దొరుకుతుంది. ఒక రక్షణకవచంలో వున్నట్టుంటుంది. వెయ్యికళ్ళతో అన్నీ గమనించుకుంటుంది. ప్రతి చిన్న కదలికా ఆమె కన్నులని దాటిపోవు. ఒక సమస్య వున్నప్పుడు, దాన్ని గురించి చెప్పక్కర్లేకుండానే తెలిసిన మనిషి తోడుంటే వుండే సౌలభ్యం అది.
నీలిమమీద లక్ష్మికి ఆక్షేపణ ఏమీ లేదు. చిన్నపిల్ల. చక్కటిది. మాధవ్ ఏరికోరి చేసుకున్నాడు. కానీ గీత తనకి అవిభాజ్యమనిపిస్తుంది. ఆ తొమ్మిది కుటుంబాల మనుషులూ, ఎవరు ఎలా వుంటారో, ఎవరికి ఏ బాధలూ, సంతోషాలూ వున్నాయో ఇవన్నీ ఆమెకి సహజంగా తెలుసు. ఏ మూసలోనైనా ఇమిడిపోగలదు. ఇవ్వవలసిన గౌరవం ఇవ్వగలదు, తీసుకోగలిగే చనువు తీసుకోగలదు. హద్దులూ తెలుసు, వాటిని కొద్దిగా దాటి వెనక్కి రావటమూ తెలుసు. నీలిమ పరాయింటినుంచీ వచ్చింది. గీతకూడా పరాయిదే ఐతే అన్ని కుటుంబాల్లోనూ అవ్యక్తంగా వుండే ఈ సూక్ష్మవిషయాలు వ్యక్తపడేవి కాదు. గీతకి కనిపించేవి నీలిమకి కనిపించవు. తెలియవు. కనిపించవూ, తెలియవూ కాబట్టి అర్థమవ్వవు. ఒకరు చెప్పేవి కాదు. ఈ అమరిక ఇద్దరి స్పందనల్లో తేడాగా స్థిరపడి, ప్రవర్తనగా కనిపిస్తోంది.
ఇళ్ళలో గొడవ చాలావరకూ వంటింటిపని దగ్గిర మొదలౌతుంది. అందరూ ఒకరికొకరు అనువుగా చేసుకుంటే ఒకళ్ళపని ముగ్గురిమధ్య సర్దుబాటై తేలికపడుతుంది. తండ్రిలో వున్న అననుకూలత నీలిమలోనూ వుంది. రెండురోజులు మాధవ్‍కోసం అన్నీ మళ్ళీ వండి, కళ్ళు తేలేసి, లక్ష్మితో అనేసింది.
“తనకి వేడిగా చేసిపెట్టాలని సరదాపడ్డానుకానీ, మీరన్నట్టు గేస్ దండగ. అందరికీ కలిపి పొద్దునే చేసేసుకుంటాం” అంది. ఆ అమ్మాయి వుమ్మడిలో కలవటానికి ఇబ్బందిపడుతోందని గ్రహించింది లక్ష్మి, ఆమె తల్లికిలాగే. పొద్దుటివంట గీత చేస్తోంది కాబట్టి రాత్రి తను చేస్తానంది. అలా అన్న మొదటిరోజే చుక్కలు చూపించింది గీతకి. ఆమె పుట్టింట్లో తొమ్మిదైతేగానీ తినరు. అదే పద్ధతిలో ఇక్కడా మాధవ్ వచ్చాక మొదలుపెడదామనుకుంది.
“అలా కుదరదులే నీలిమా! మయూఖ్ అంతసేపు వుండలేడు. వాడిదవగానే అందరం తినేస్తాం. వాడిని పడుక్కోబెడితే నాకింకా పనుంటుంది” అంది గీత వంటకి వుపక్రమిస్తూ.
“ఏమిటది?” అడిగింది నీలిమ నిరుత్సాహాన్ని అణుచుకుంటూ.
“నేను డిగ్రీతో చదువు ఆపేసి వుద్యోగంలో చేరిపోయాను. ఎమ్మేకి కట్టాను. వెంటనే పెళ్ళవటం, మయూఖ్ పుట్టడం వీటితో ఎప్పటికప్పుడు అవట్లేదు. అదిప్పుడు చేస్తున్నాను… మళ్ళీ ఆటంకాలు రాకుండా” అంది. అన్నీ ఓపెన్‍గా చెప్పేస్తుంది గీత. మనసులో ఏదీ దాచుకోదు. దాచుకుని లౌక్యం చూపించదగ్గ విషయాలని అనిపించదు. ఎదుటివాళ్ళు తను చెప్పేవి జీర్ణించుకుంటున్నారా లేదా అనేదికూడా ఆమెకి పట్టదు.
అక్కచెల్లెళ్ళిద్దరూ కలిసో, వసంత్ ఇటువైపు వచ్చినప్పుడు మానసనికూడా కలుపుకునో బైటికి ప్రోగ్రాం పెట్టుకుంటారు. ముఖ్యంగా వసంత్ భార్యని తీసుకుని తల్లిదండ్రులదగ్గిరకి వచ్చినప్పుడు ఈ కలుసుకోవటాలు ఎక్కువగా వుంటాయి. ఆడపిల్లలకి తమ మూడు జంటలే కలిసి వెళ్ళాలని కోరిక. అలాంటి ప్రోగ్రామ్ వుందనగానే ప్రహ్లాద్, వసంత్ వాసుకి ముందు చెప్తారు. మాధవ్‍కి అసలతన్ని తమ మధ్యనుంచీ తప్పించాలన్న ఆలోచనే వుండదు. నీలిమకి గీతని తమతో రమ్మనక తప్పనిపరిస్థితి. గీతకికూడా వాళ్ళమధ్యని ఇరుకిరుగ్గా వుంటుంది. ఆమెతో వాళ్ళు కలుపుగోలుగా వుండరు. ఆమె పరాయిదన్న స్పృహతో మర్యాదగా మాట్లాడుతున్నట్టు చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక వయసువాళ్ళమధ్య అడ్డుగోడలెందుకు మొలుచుకుని వస్తున్నాయో గీతకి అర్థమవ్వదు. అదీకాక ఒక చీరకోసమో, మేచింగ్ గాజులు, ఫాల్స్‌కోసమో గంటలతరబడి షాపింగ్. అది ఆమెకి నచ్చదు.
రెండుసార్లు వెళ్ళాక వాసుతో చెప్పేసింది,
“ఇకమీద నేనిలా రాను బావా! బోల్డంత టైం వేస్టౌతోంది. ఇటేమో మయూఖ్‍ని అత్తదగ్గిర వదిలిపెడుతున్నాను. ఆఫీసయ్యాకకూడా వాడిని వదిలిపెట్టి వుండటమంటే బావుండట్లేదు” అనేసింది.
“వాళ్లకీ అక్కచెల్లెళ్ళూ తోడల్లుళ్ళూ కలిసి వెళ్ళాలని వుంటుందేమో! మనం మానేద్దాం. మరీ తప్పించుకుంటున్నట్టుకాక మధ్యలో ఎప్పుడో ఒకసారి వెళ్తే సరిపోతుంది” అన్నాడు వాసు.
“మాధవ్ అన్నాడా?” అనుమానంగా అడిగింది గీత.
“ఛ… అదేం లేదు. వాళ్ళక్కచెల్లెళ్ళు ముగ్గురికీ మనం వుండటాన్న ఫ్రీగా లేనట్టుంది. మనకేనా అంతేకదా, మన పదకొండుమందిమధ్యా వున్న చనువు వీళ్ళతో ఎలా వస్తుంది? చిన్నప్పటి స్నేహాలకీ చుట్టరికాలకీ తేడా వుండదూ?”
అందరికీ చెందటాన్నించీ కొందరికి అక్కర్లేనితనంలోకి వెళ్లడంలో తేడా తెలుస్తోంది ఇద్దరికీ. ఏదో అర్థమవని బాధ ఆమెని ఆవహిస్తోంది. ఐతే వాసు బైటపడడు. ఆమెకి అర్థమౌతుంది. మరోసారి మాధురి చీరల షాపింగ్‍కి వెళ్తూ తమనీ రమ్మందని నీలిమ చెప్పినప్పుడు గీత అనేసింది.
“నాకు షాపింగ్ పెద్దగా ఆసక్తి వుండదు నీలిమా! నాకోసం ఎప్పుడూ నేను కొనుక్కోలేదుకూడా” అంది.
“చీరలే కొనుక్కోవా?” ఆశ్చర్యంగా, అపనమ్మకంగా అడిగింది నీలిమ. ఆ అడిగినతీరుకి నవ్వేసింది గీత.
“మా అమ్మమ్మావాళ్ళు, అమ్మ, అత్త, బావ ఇందరున్నారు కొనివ్వడానికి. ఇంకా నేనేం కొంటాను? ఇవికాక మనిళ్ళలో ఏవో ఒక ఫంక్షన్లు. రెండు పెట్టెలనిండా చీరలున్నాయి. కొత్తవే చాలా వున్నాయి. అసలు ఇన్ని చీరలు వుండటమే నాకు చిరాగ్గా వుంటుంది” అంది.
“అమ్మా, అత్తగారూవాళ్ళూ సరే, ఒకళ్ళు పెట్టిన చీరలు ఏం బావుంటాయి?”
“ఇందులో పైవాళ్ళెవరు? మనిళ్ళలో ఫంక్షన్సుకి అరుణత్త, మా అమ్మా సెలక్ట్ చేస్తారు”
“మీ అందరి విషయంలో తేడా చూపించరేమోగానీ కోడళ్లం పైవాళ్లమేకదా?” దాచుకోలేకపోయింది నీలిమ.
“మా యింటి మగపిల్లల భార్యలు పైవాళ్ళెందుకౌతారు?”’అంది గీత.
సంభాషణ ఆగిపోయింది. గీత వెళ్ళలేదు. ఆమె రాకపోతేనే తేలిగ్గా వుంటుందనుకున్న నీలిమ అంత ప్రశాంతంగా వుండలేకపోయింది. అందరూ ఆమెకి అన్నీ కొనిస్తారు. కొనివ్వడానికి పెద్ద ఆస్తులు వుండక్కర్లేదు. విలువైన వస్తువు కానక్కర్లేదు. పెరట్లో పూసిన పువ్వు, చెట్టుకి కాసిన కాయ, ఇంట్లో వండుకున్న వంట… ప్రేమతో ఇస్తారు. ఈమె అంత ప్రేమతోనూ తీసుకుంటుంది.
జీతం తెచ్చుకుంటుంది. ఆమె జీతం ఆమెదే. ఇద్దరి జీతాలైనా ఇంటికోసం ఖర్చుపెట్టగా ఎప్పుడూ చూడలేదు. ఖర్చులన్నీ అత్తగారివే.
గీత తండ్రిది పెద్ద వుద్యోగమేమీ కాదు. చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడ్డారట. తన తండ్రీ పడ్డాడు. కానీ తన తండ్రికి లేని గౌరవం, మర్యాద గీత తండ్రికి ఎందుకు దొరుకుతున్నాయి? గీతనెందుకు అందరూ అంత ప్రేమగా చూడటం? ఆమె ఈ అన్నిళ్ళలోనూ పెద్దకోడలేంటి? పెత్తనమంతా ఆమెకే అప్పగిస్తారు, ఇంతమంది పెద్దవాళ్ళుండి ఆమె చూసుకోవడమేంటి? ఆరణి కర్రలు రాచుకున్నట్టు అక్కచెల్లెళ్ళ మనసులు రాచుకుని నిప్పు పుడుతోంది. దానిపేరు అసూయ.
ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తునే వుంటారు. రవి కూతుళ్ళు అర్చన, పల్లవి. ఇద్దరూ జోడు గుర్రాల్లా పరిగెత్తుకొస్తారు తండ్రితో. ఒక గులాబిపువ్వో, జామకాయో చేత్తో పట్టుకుని. గీతకి ఒకరికన్నా ఒకరు ముందు ఇవ్వాలని పోటీ పడతారు. శేఖర్ పిల్లలు వీణ, సంతోష్. వచ్చినదగ్గిర్నుంచీ వీణ మాధవ్‍కీ సంతోష్ గీతకీ అతుక్కుపోతారు. అతను కృష్ణకన్నా చిన్నవాడు. గీతకి చెప్పే విషయాలకి అంతు వుండదు. వినటంలో ఆమె చూపించే ఓపికకీ అంతుండదు. తులసి, ప్రవల్లిక, సమీర… గీతని వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఏమిటీ ప్రేమ? తనమీద వీళ్లకి ఎందుకుండదు అలాంటి ప్రేమ? తనూ అక్కో వదినో ఔతుంది వీళ్ళకి. కానీ దూరదూరంగా వుంటారు. మాటల్లో కలుపుకుంటారుగానీ, ప్రత్యేకం తనతోటే మాటలనేవి వుండవు. గీతతో రహస్యాలుంటాయి, చెవుల్లో గుసగుసలుంటాయి. గలగల, కిలకిల, కిచకిచ నవ్వులుంటాయి. వీళ్ళు తనని ఇంత దూరంగా వుంచుతున్నారని మాధవ్‍కి తెలీదా?
ఉన్నట్టుండి రవళి వచ్చింది. రైల్వేలో జాబ్‍కి రాతపరిక్షలో పాసైందట. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గైడెన్స్‌కోసం వచ్చింది. గీత, లక్ష్మీ హాల్లో వున్నారు.
“మహీనికూడా తీసుకు రావల్సిందే. దాన్ని చూసి చాలారోజులైంది” అంది లక్ష్మి.
“దాన్నసలు నాన్న బతకనిస్తున్నాడా ఆమ్మా? వద్దామనే బయల్దేరింది.
నీకన్నా చిన్నవాళ్ళు, గీతకీ, మాధవ్‍కీ పెళ్ళిళ్ళయ్యాయి, వాళ్ళింటికి వెళ్లడానికి సిగ్గులేదూ- అన్నారు. అది పాపం ఆగిపోయింది.
ఆయన మాటలకేం? ఎప్పుడూ వుండేవే. రావే- అని ఎంత చెప్పినా ఇంక రాలేదు. అమ్మా చెప్పింది” అంది రవళి. ఆమె గొంతు విని నీలిమ వాళ్ళ గదిలోంచీ వచ్చింది. ఇక్కడుండేది గీత, లక్ష్మే అన్న పాత అలవాటుతో రాగానే అనేసింది. లోపల నీలిమ వుందని అనుకోలేదు. అంటున్నదల్లా నీలిమని చూసి ఆగిపోయి నాలిక్కరుచుకుంది. నీలిమా చూసింది, గీతా చూసింది.
“పైవాళ్ళెవరు? నీలిమేగా, చెప్పు” అంది గీత. అదొక హెచ్చరిక. చెప్పేది మధ్యలో ఆపద్దనీ, అతిగా చెప్పద్దనీకూడా.
“ఏదో సంబంధం చూసారుకదే, వాళ్ళకి నచ్చిందనికూడా అన్నారట. ఎంతదాకా వచ్చింది?” అడిగింది లక్ష్మి. కొంచెం ఇబ్బందిపడింది రవళి. చెప్పకుండా వుండటానికి వీలులేని పరిస్థితి. అసలే వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళకీ కాస్త గర్వం వుందని చిన్న అపప్రథ వుంది. నీలిమ ఇదంతా గ్రహించుకుంది. అక్కడినుంచీ వెళ్ళిపోనా అనుకుంది. మళ్ళీ ఎందుకు వెళ్ళాలని పంతగించుకుంది.
“కట్నందగ్గిర బిగదీసుకుని వున్నారు ఆమ్మా! నాన్నకి అదే కోపం.
కుదిరిన సంబంధం వదులుకోవద్దు. డబ్బు కావాలంటే అందరం కలిసి సర్దుతాం. తర్వాత లెక్కలు చూసుకోవచ్చు- అన్నాడు రవి మామ.
నా కూతురి పెళ్ళి నేను చేసుకోగలను. మీరంతా చందాలేసుకుని చెయ్యక్కర్లేదు- అన్నారు. దాంతో మామకి కోపం వచ్చింది.
చందాలమీద పెళ్ళి చేయ్యాల్సిన స్థితిలో నా మేనకోడలు లేదని నాకూ తెలుసులెండి బావా! మాకూ బాధ్యత వుంటుందిగా, ఓ చెయ్యి వేస్తామని చెప్తున్నాను. సంబంధం వదులుకోకండి- అని గట్టిగా చెప్పి వెళ్ళాడు.
ఈయన కాస్త కోపం తగ్గించుకుంటే కుదిరినట్టే” నెమ్మదిగా అంది రవళి. మహతికి సంబంధం కుదుర్తోందంటే గీత ముఖం వికసించింది.
“దాని మొహం చూడు. పెళ్ళికళ ముందు ఇక్కడే వచ్చేసింది” అంది లక్ష్మి నవ్వి.
వాసు, మాధవ్ ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. విషయం విని,
“ఇప్పుడు మళ్ళీ గోడలు దూకాలేంటే?” అన్నాడు మాధవ్ పకపక నవ్వి. చిన్నప్పటి అనుభవాలు గుర్తుచేసుకుని.
“పోరా! మీరు గోడలు దూకితేనే మేం పరీక్షలు పాసయ్యామేమిటి? మీకు దూకాలనిపించి దూకారు” అంది రవళి.
“అదేమిటి?” అడిగింది నీలిమ. వాసు చెప్పాడు. గీత అలిగింది. అన్నదమ్ములిద్దరూ పడీపడీ నవ్వారు. తులసి పెళ్ళై వెళ్ళిపోయాక అన్నదమ్ములిద్దరూ బాగా బెంగపడ్డారు. అలవాటుపడటానికి కాస్త టైం పట్టింది. ఇంత చైతన్యం, ఇన్నిన్ని నవ్వులు ఈమధ్య ఇంట్లో లేవు. నీలిమకి అదంతా కొత్తకొత్తగా అనిపించింది. తనతో వున్నప్పటికీ ఇప్పటికీ మాధవ్ ప్రవర్తనకూడా భిన్నంగా వుంది. వీళ్ళు నలుగురు కలిస్తేనే ఇలా వుంటే అందరూ కలిస్తే ఎలా వుండేదో వూహించుకునే ప్రయత్నం చేసింది. ఊహకి అందలేదు.
రవళి రెండురోజులుంది వాళ్ళింట్లో. మాధవ్, వాసూ చెప్పగలిగినవన్నీ చెప్పారు. ముగ్గురూ ఆఫీసులకి వెళ్ళిపోయినా చదువుతూనూ, లక్ష్మితో మాట్లాడుతూనూ, మయూఖ్‍ని ఆడిస్తూనూ వుండిపోయింది తప్ప చనువుగా వచ్చి నీలిమ గదిలో కూర్చుని మాట్లాడలేదు రవళి. నీలిమ ఇవతలికి వచ్చినప్పుడు మాత్రం కలుపుగోలుగానే మాట్లాడింది.
“వదినా!” అంటుంటే,
“చిన్నదేకదే, పేరుపెట్టి పిలువు తప్పులేదు” అంది లక్ష్మి. చనువనేది వరసల్లోనూ పిలుపుల్లోనూ వుండదు.
సెలవు పెట్టి, రవళిని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళి, అదయ్యాక వాళ్ళింట్లో దింపి వచ్చాడు వాసు.
మహతికి సంబంధం కుదిరింది. పెళ్ళి పెత్తనం అంటే గీత చేతిలో డబ్బంతా పెడతారేమోననుకుంది నీలిమ. అలాంటిదేమీ కనిపించలేదు. మహతి తండ్రి నోటిదురుసు మనిషి. మిగిలిన పెళ్ళిళ్ళకన్నా ఇక్కడ ఇంకా జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. నిర్మలకోసం ఆవిడ అక్కచెల్లెళ్ళూ అన్నదమ్ములూ సర్దుకుంటారుగానీ, తోడల్లుళ్ళెందుకు సర్దుకుంటారు? ఆయనకి వూపిరిసలపనన్ని పనులు పెట్టేసి, రవినీ, విజ్జెమ్మనీ జతచేసింది గీత. మిగిలిన పనులే అందరికీ సర్దింది. పెళ్ళికి బాగా ముందే తల్లిని వాళ్ళింటికి పంపేసాడు రామారావు. ఆవిడకే నారాయణ కాస్తంత వినేది. లేకపోతే నిర్మలని నిరంతరాయంగా తిడుతునే వుంటాడు.
పెళ్ళిలో మొదటిసారి అందర్నీ ఒకచోట చూసింది నీలిమ. అంతమంది పెద్దవాళ్ళుండి పనులన్నీ చూసుకుంటూ వుంటే చెయ్యటానికేమీ లేక పదిమందో పాతికమందో వూరికే కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటం ఎలా వుంటుందో అనుభవంలోకి వచ్చింది. కానీ తాము ముగ్గురూ ఆ కుటుంబానికి స్పష్టంగా కనిపించే అతుకులానే అనిపించారు ఆమెకి .
పెళ్ళికి రాణా వచ్చాడు. అతనిప్పుడు వైఫల్యాలకి సాకారరూపం. ఎవరితోటీ కలవలేకపోయాడు. అటూయిటూ తిరిగేసి వెళ్ళిపోయాడు.
గీత పెళ్ళైన తర్వాత అతను వుద్యోగం వెతుక్కుని దుబాయ్ వెళ్ళాలనుకుని ఒక ఏజెంటుకి డబ్బు కట్టాడు. ఆ ఏజెంటు ముంబైదాకా అతన్ని రప్పించి కనిపించకుండా పోయాడు. మోసం జరిగిందని గ్రహించాడు రాణా. పోలీసు కంప్లెయింటిస్తే అదొక బోగస్ సంస్థని తేలింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు వెనక్కి రాలేదు. తర్వాత చిన్నాపెద్దా వుద్యోగాలు చేసాడు.
పెళ్ళి చేసుకుంటానని ఒకమ్మాయిని మోసం చేసి, కడుపుచేస్తే ఆ వూరివాళ్ళు కట్టుగా నిలబడి గుళ్ళో పుస్తె కట్టించారు అతనిచేత. ఇది బయటికి వచ్చిన వార్త. మగపిల్లలకే తెలిసి, ఆడపిల్లలదాకా రానిది చాలా వుంది.
సంధ్యగానీ, ఆమె భర్తగానీ ఆ అమ్మాయిని ఆదరించలేదు. అప్పటికే ప్రెగ్నెంటు. కడుపులో కవలలు. ఆర్ హెచ్ మిస్‍మేచింగ్ వుంది. ఆ అమ్మాయికి వైద్యం జరగాలి. రాణా దగ్గిర డబ్బు లేదు. విజ్జెమ్మ కూతుర్ని తిట్టింది. ఆ అమ్మాయి తండ్రికి కబురుపెడితే వచ్చి కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు. గీతకి ఈ వ్యవహారం అంతా తెలిసింది. మనసంతా కలతబారిపోయింది. తమలో ఒకడు, భార్యకి వైద్యం చేయించలేని అసమర్ధుడు. పరాయి ఆడవారిని గౌరవించలేని దుర్మార్గుడు.