ఝరి – 88 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

“ఇల్లొదిలి వెళ్ళిపొమ్మంటే ఎవరూ తేలిగ్గా తీసుకోరు పిన్నీ! వాసు చాలా సున్నితం. వాడికి కోపంకూడా ఎక్కువే. వాడికి కౌంటర్‍బేలన్సు సుధీర్. సుధీర్ ఇప్పుడు ప్రాక్టీసు, వుద్యోగం, అమెరికా వెళ్ళే ప్రయత్నాలల్లో తలమునకలుగా వున్నాడు. పెళ్ళికూడా అయింది. ఈ విషయాల్లో తలదూర్చే టైముండదు. రాణా విషయంలో ఏం జరిగిందో మీకు తెలీదా? వాడూ, రవిమామయ్యా కలిసి అనుకుంటే రాణాని దార్లో పెట్టకపోదురా? వదిలేసాడు. గాలికి తిరుగుతున్నాడు రాణా. ఇంకోసారి ఇలా మాట్లాడద్దు. అన్నదమ్ములిద్దరూ ఒక ప్రాణంలా బతికారు ఇప్పటిదాకా. వాళ్లని విడగొట్టకు ఇలాంటి మాటలతో. మాధవ్ మీచేత అనిపిస్తున్నాడనుకుంటున్నాడు వాసు” అన్నాడు ప్రహ్లాద్.
“మాధవ్‍కి అంత తెలివి వుంటే బానే వుండేది” అతని చివరిమాటలకి జవాబుగా అంది పద్మ.
“వాడిమీద కొత్తగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది మీకిద్దరికీ? పిన్నీ! తెలుసుకోలేనంత తెలివితక్కువవాళ్ళం కాదు. వాళ్ల యింటిమీద మనకి కలలుండకూడదు. ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేస్తేనే అందరికీ బావుంటుంది” పైకి మామూలుగానే వున్నా ప్రహ్లాద్ గొంతులో కాస్త కాఠిన్యం తొంగిచూసింది. పద్మ చిన్నబుచ్చుకుంది.
మాధురి మొత్తం సంభాషణ వింది. ఇతనేమిటి, వాసుని వెనకేసుకుని వస్తాడు, గీతని బతిమాలతాడు? వాళ్ళతనికి కజిన్స్ మాత్రమే. నీలిమ తనకి స్వంత చెల్లెలు. తోడల్లుడుకాబట్టి మాధవ్ ఇంకా దగ్గిర. చేతనైతే వాసుని వప్పించాలి. గీత నోరుమూయించాలి. అంతేగానీ, ఈవిడ్ని బెదిరిస్తాడేంటి? ఇందులో ప్రహ్లాద్‍కి అర్థమైందేమిటి? అది తనకెందుకు చెప్పలేదు?
గీతమాటల్ని మననం చేసుకుంది. ఎంత గర్వం ఆమెకి! ప్రేమించి చేసుకుందనా? ఇద్దరు పిల్లలనా? ఇద్దరూ మగపిల్లలనా? నీలిమకి పిల్లల్లేరనా? సొంత సంపాదన వుందనా? ఆ యిల్లు వదిలిపెట్టేది లేదని ఎంత నిర్మొహమాటంగా చెప్పింది! అంతంత ప్రేమలున్నాయని చెప్పుకుంటారు, మాధవ్‍కోసం ఆ పాతకొంప వదులుకోలేదా? కనీసం పౌరుషం లేదా, వెళ్ళమంటుంటే ఇల్లు పట్టుకుని వేలాడటానికి? పంతమా? అందరి అండా వుందనా? ఉక్రోషంతో రగిలిపోయింది. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వం ఆమెది. ఇప్పటిదాకా అలా ఎవర్నీ సాధించి నెగ్గే అవకాశం ఎప్పుడూ దొరకలేదు. తనలో తను రగిలిపోయేది. పెత్తండ్రిపినతండ్రి పిల్లల్తో సమానఫాయిదాలో చుట్టరికాలు సాగలేదు. వీళ్ళ చెయ్యి కొంచెం కింద వుండేది. ఇప్పుడిక సాధించడానికి టార్గెట్‍లా గీత దొరికింది. మనుషుల ఈ మనస్తత్వాలేవీ ఐదునిముషాల పరిచయంలోనూ పదినిముషాల పెళ్ళిచూపుల్లోనూ బయటపడవు. పరిచయాలు, పెళ్ళిచూపులు- ఒక నిర్దుష్టమైన కాలక్షేపం, ఇచ్చిపుచ్చుకోవటాలు, పెళ్ళి అనే అవసరాల వెనక దాక్కుంటాయి. అవి తీరాక బటపడటానికి అవకాశాలని వెతుక్కుంటాయి.
వచ్చిన అతిథుల్లో బయటివాళ్ళు చాలామంది పేరుపెట్టెయ్యగానే భోజనాలు చేసి వెళ్ళిపోయారు. సాయంత్రం తొట్లో పెట్టే కార్యక్రమానికి రామారావు కుటుంబం, కొందరు అతిముఖ్యమైనవాళ్ళు మాత్రమే మిగిలారు. లక్ష్మి ఇంటి చుట్టుపక్కలవాళ్ళు పేరంటానికి వచ్చారు. ఎప్పుడో దశాబ్దాలనాడు తాత పడుక్కున్న వుయ్యాలని విహంగ్ వేడుకగా అధిష్టించాడు. పిల్లవాడికి చేస్తున్న చదివింపులనీ, ఇంటికి వచ్చినవాళ్ళకి జరుగుతున్న మర్యాదలనీ ఒకమూలనుంచీ డేగకళ్లతో గమనిస్తున్నాడు కుటుంబరావు. ఆయనది మొదట్నుంచీ కింది చెయ్యే తప్ప పెట్టుమనస్తత్వం కాదు.
“వీళ్ళ జమీందారీ పోకళ్ళు మండిపోను. వచ్చేవాళ్ళు వస్తారు, వాళ్ల తాహతుకీ వీళ్ళతో వుండే మొహమాటానికీ తగ్గట్టు పెడతారు. అంతకంతా తిరిగి పెట్టగలమా? ఇంటికొచ్చినవాళ్ళందరికీ చీరలూ సారెలూ ఏమిటి? ఇలాగైతే ఈ కుటుంబం నిలబడుతుందీ? ఇలా దానధర్మాలు చేసి నామరూపాల్లేకుండా కొట్టుకుపోయినవాళ్లని ఎందర్ని చూడలేదు?” అని గిజగిజలాడిపోయాడు. పక్కని భార్యేనా కూతుళ్ళేనా వుంటే బైటికే అంటున్నాడు. భార్యైతే ఎవరేనా విన్నారేమోనని భయపడుతూ చుట్టూ చూస్తోంది. కూతుళ్ళు మాత్రం విషంలా ఆమాటల్ని మనసుల్లోకి ఎక్కించుకుంటున్నారు. ఆయన లెక్కలో ఖర్చు వియ్యపురాలిది, రాబడి గీతది. గీత, నీలిమకి ప్రత్యర్థిలా బరిలో నిలబడి కనిపిస్తోంది.
రాత్రౌతుంటే త్రిమూర్తులి మనవడు మాధవరావు భార్యనీ, పిల్లల్నీ తీసుకుని వచ్చాడు. ముగ్గురు పిల్లలతనికి. వాళ్ళ చిన్నకొడుకు విజయ్‍కి ఏడాది. మాధవరావు మాధవ్ క్లాస్‍మేటు. ఇద్దరి పేర్లూ ఒకటే కావటంతో మాస్టర్లు తికమకపడేవారు. వీళ్ళు కాక అమ్మాయిల్లో ఒకరు, అబ్బాయిల్లో ఒకరు వెంకటరమణ అనే పేరుగలవారు వుండేవారు. ఒకళ్ళని పిలిస్తే ఆ యిద్దరో, ఈ యిద్దరో లేచి నిలబడేవారు. ఆడ వెంకటరమణా, మగ వెంకటరమణా అని వాళ్ళనీ, పొట్టి మాధవ్, పొడుగు మాధవ్ అని వీళ్ళనీ పిలిచేవారు. మాధవరావుకన్నా మాధవ్ ఎత్తుతక్కువ. ఇద్దరు మాధవ్‍లూ ఒకరినొకరు చూసుకుని, ఆ విషయాలు గుర్తుతెచ్చుకుని నవ్వుకున్నారు. ఎప్పుడు కలిసినా వాళ్లకి ముందు గుర్తొచ్చేవి అవే.
అతిథుల్ని చూసి ఇంట్లో అందరూ హడావిడిపడుతుంటే కుటుంబరావు ఆరా తీసాడు.
“తాతయ్య సరుకు పనిమీద నార్త్ వెళ్ళారు గీతా! రావటానికి నెలేనా పట్టచ్చు. వచ్చాక ఈ కొత్తమనవడిని చూసుకోవటానికి వస్తారు” అన్నాడు మాధవరావు. త్రిమూర్తులు ఇంట్లోంచీ ఎంతో ముఖ్యమైనవారింటికి తప్ప వెళ్ళరు. వాళ్ళకి వూపిరిసలపనన్ని వ్యవహారాలు. త్రిమూర్తులు అనేక మార్గాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. ఎక్కడికైనా తీరికచేసుకుని వెళ్ళాల్సిందేతప్ప తీరిగ్గా వెళ్ళడం వుండదు అతనింట్లో ఎవరికీను. అలాంటిది ఆయన ఎక్కడో వుండి, వెళ్లమని ప్రత్యేకంగా ఫోన్‍చేసి చెప్తే వచ్చారు మాధవరావు, రోహిణి. త్రిమూర్తులు అంతటి ప్రాధాన్యత ఇచ్చిన గీతని కుతూహలంగా చూసింది రోహిణి. ముదురునీలంరంగు పట్టుచీరలో తెల్లగా కాస్త లావుగా ఐనా వుంగరాలజుత్తుతో అందంగా వున్న రోహిణిని గీతకూడా అలానే చూసింది. తర్వాతికాలంలో అనేక సందర్భాల్లో కలుసుకున్నా ఇద్దరిమధ్యా పెద్దగా స్నేహం పెరగలేదు. ఎవరి సర్కిల్స్‌లోంచీ వాళ్ళు బయటికి రాలేకపోవడం మొదటికారణం కావచ్చు. భోజనాలవీ చెయ్యలేదు వాళ్ళు. బలవంతంమీద ఫలహారాలు తిన్నారు. అటూయిటూ పెట్టుపోతలయ్యాయి. వస్తామని చెప్పి లేచారు.
వాళ్లని సాగనంపి ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. రాత్రి భోజనాలయ్యాయి. మర్నాడు సినిమాహాల్లో కలుద్దామని చెప్పుకుని అందరూ వెళ్ళిపోయారు.
“ఇక్కడ వండించేస్తాను. మళ్ళీ మీ యిళ్ళలో వంటలవీ పెట్టుకోకండి. మార్నింగ్‍షో చూసి తిరిగివెళ్ళి వండుకునేసరికి ఆలస్యమౌతుంది” అంది లక్ష్మి.
“అందరం తలోటీ వండి తెచ్చేస్తాంలేవే” అంది అరుణ. “అల్లుళ్ళున్నారుకదే? కాస్త పాతబడనీ” అంది లక్ష్మి.
కుటుంబరావూ, భార్యాకూడా బయల్దేరుతుంటే ఆపేసింది. “తొందరేమీ లేదుగా? రెండురోజులు వుండి వెళ్ళండి” అంది. నీలిమకూడా అంది. నిజానికి ఇక్కడే వుండి, జరిగేవన్నీ ఇంకా చూడాలని కుటుంబరావుకే వుంది. అందుకే మరోసారి అనిపించుకోలేదు.
“బారసాలకి రెండురోజులు భోజనాలా? ఒక్క పురిటికి ముగ్గురు బైటిమనుషులు నెలలతరబడి కూర్చుని తినడమా? ధర్మసత్రం కాదుకదా మీ యిల్లు? మాధురీ, మానసా కనలేదా? ఈ అమ్మాయొక్కర్తేనా? ఐనా రెండో పురుడు అత్తవారింట్లో పొయ్యాలని ఏ శాస్త్రం చెప్పింది? అన్నగారికి ఖర్చు తప్పించాలనుకుందేమో మీ అత్తగారు! ఈ విషయం ఇక్కడితో ఐపోయిందా? రేపు అక్కావాళ్ళ విషయంలో ఏం చేస్తారో నేను చూస్తానుకదా? నీలిమా! ఇలాగైతే కొంప కొల్లేరౌతుంది. నువ్వు నడుం బిగించి దారికి తీసుకురాకపోతే ఈ యిల్లుకూడా మిగలదు, చెప్తున్నాను” అన్నాడు కుటుంబరావు కూతురిని పక్కకి తీసుకెళ్ళి. మాధవ్ పదివేలిచ్చిన విషయం చెప్పింది నీలిమ.
“ఇస్తున్నట్టు నాకు తెలీదు. ఇచ్చేసాక చెప్పారు. అదో పెద్ద డ్రామాలే” అంది.
“మీ దగ్గిర్నుంచీ పదివేలు పట్టించారా? తిరిగొస్తాయీ? చెయ్యిదాటిన డబ్బూ, గోడకి వేసిన సున్నం ఒకటే. మీ ఆయన వట్టి అమాయకుడు. ఏదీ తెలీదు. నువ్వుకూడా ఇలా వుంటే ఎలానే? గొడవచెయ్యద్దూ, ఎందుకిచ్చావని? వాళ్ళిద్దరిగురించీ నాకే బెంగా లేదు. మానసకూడా వాళ్ళ మామని బానే అదుపులో పెట్టింది. నీగురించే నాకు బెంగ” అన్నాడు. అప్పటిదాకా భర్తకి ఎలాంటి మద్దతూ పలకని ఆయన భార్యకూడా ఈ పదివేలమాట విని కొంచెం ఆయనవైపు తూగింది.
“ఏమో నాన్నా! నామాట ఎవరూ వినరు, పట్టించుకోరు. మా తోటికోడలిమాటే చెల్లుతుంది అన్నిటికీ. మాయింట్లో రోజూ కత్తిమీద సాములాగే వుంటుంది. వంట ఆవిడిష్టం, వడ్డన ఆవిడిష్టం. ఏం తినాలో, ఎలా వుండాలో ఆవిడే చెప్తుంది. ఆవిడేం చేసినా మా అత్తగారు మాట్లాడదు. మీ అల్లుడూ అంతే. పొద్దున్నే లేచి ముందు ఇంతన్నం వుడకేసి పడేస్తుంది. అన్నాలు తిని ఆఫీసుకెళ్ళడం నేనిక్కడే చూస్తున్నాను. టిఫెను తిని బాక్సుల్లో అన్నాలు పెట్టుకునేవాళ్ళం మనింట్లో. వీళ్ళలా కాదు. పదింటికి భోజనం చేసి బాక్సుల్లో టిఫెను తీసికెళ్తారు. నా టైమొచ్చేసరికి అన్నీ మిగుళ్ళే. చల్లారిపోయి వుంటాయి. అలా కాదన్నానని నా వంట నన్ను వండుకొమ్మన్నారు. అదీ అయింది కొన్నాళ్ళు ” అంది నీలిమ కన్నీళ్ళు పెట్టుకుని. ఎప్పటెప్పటి విషయాలో గుర్తుతెచ్చుకుని చెప్పింది. మనసులో ఎన్నాళ్ళుగానో పేరుకుపోయిన అసంతృప్తిని పొరలుపొరలుగా విడదీసి పరిచింది. తండ్రితో ఇంత చొరవగా ఇంతకుముందెప్పుడూ మాట్లాడలేదు. ఆయనకూడా ముగ్గురాడపిల్లలని ప్రపంచభారం అంతా తనే మోస్తున్నట్టు బాధపడి వూరికే పిల్లల్ని కసురుకునేవాడు. ఇది కొత్త సామరస్యం.
“అంత పదింటికి అన్నమేం దిగుతుందే?” ఆశ్చర్యంగా అడిగాడు. ఈ వివరాలన్నీ పూసగుచ్చినట్టు భార్య తెలుసుకుని తనకి చెప్పాలని అనుకుంటాడు. అంత గుచ్చిగుచ్చి అడగటం ఆవిడకి రాదు. చాలా విషయాలు వుపేక్షించదగ్గవనిపిస్తుంది. ఏ యింటికి తగ్గ పద్ధతులు ఆయింట్లో వుంటాయి. అవి బైటినుంచీ వచ్చేవాళ్ళకోసం ఒక్కసారిగా మారవు. అలాంటి విషయాల్లో మగవాళ్ళు తలదూర్చినప్పుడు హుందాతనం లోపిస్తుంది. మాధవ్ రావడంతో సంభాషణ ఆగిపోయింది.
“ఇక్కడ కూర్చున్నారేంటి? లోపల అందరూ వున్నారు. పదండి. నీలూ! మనగదిలోకి తీసుకెళ్ళచ్చుకదా? ఇద్దరూ కాస్త విశ్రాంతి తీసుకునేవారు” అన్నాడు. అంతా కలిసి లోపలికి వెళ్ళారు.
అందరూ అలిసిపోయి వుండటంతో తొందరగా నిద్రలు పట్టేసాయి. మర్నాడు లేచి కాఫీఫలహారాలు కానిచ్చుకుని సినిమా ప్రయాణానికి తయారయ్యారు. విజ్జెమ్మ, వాసు పెద్దమేనత్త గీతకి తోడుగా వుంటామన్నారు. లక్ష్మి, యశోద తాముకూడా ఆగిపోతామన్నారు.
“ఇంతోటి ఒక్క పిల్లాడికి ఇంతమంది కాపలానా?” అని కోప్పడి పంపించారు. నిజానికి వాసు పెద్దమేనత్తనికూడా వెళ్ళమనే అంది విజ్జెమ్మ. ఆవిడ తనకి సినిమాలు చూసే అలవాటు లేదంది.
“పోనీ నువ్వెళ్ళచ్చుగా అత్తా! ” అని ఆవిడంటే విజ్జెమ్మ తనకి సినిమాలు నచ్చవనేసింది.
“ఏముందమ్మా, ఆ సినిమాల్లో? ఆడామగా అలా తోటలమ్మటా దొడ్లమ్మటా పాటలు పాడుకుంటూ తిరగడం, లేదంటే కంటికి కడివెడేసిచొప్పున ఆడాళ్ళు కన్నీళ్ళు కార్చడం. కష్టాలొస్తే పదిమంది తలోచెయ్యీ అందించి ఆ మనిషిని బైటపడెయ్యద్దూ? తలో రాయీ విసిరినట్టు చూపిస్తారు. నాకన్నా, నీకన్నా పెద్ద కష్టాలు పడ్డవాళ్ళున్నారా? మనం కన్నీళ్ళు తుడుచుకుని వాటిల్లోంచీ ఇవతలికి రాలేదూ? మనకి మనవాళ్ళు సాయాలు చెయ్యలేదూ? అలాంటివి చూపించాలి. జనానికి సాటివారికి సాయంచెయ్యాలని తెలుస్తుంది. ఏడ్చేడ్చి చివర్లో మగాళ్ళ కాళ్ళమీద పడితే ఏమొచ్చు?” అంది.
“వదిన రావట్లేదా?” అడిగాడు మాధవ్ అక్కడికొచ్చి. వాళ్ళ సంభాషణ ఆగింది.
“అదెలా వస్తుందిరా?” అందావిడ.
“తనని వదిలేసి మేమంతా వెళ్ళామని పిల్లిశాపాలు పెడుతుంది. ఈవిడ శాపాలకి బండి టైర్లో గాలి దిగిపోవడమో ఏదో జరుగుతుంది” అన్నాడు మాధవ్ పకపక నవ్వి.
“పోనీ నేనూ వుండిపోనా?” అడిగాడు వాసు గీతని.
“కుసుమ పిన్నిని గుర్తుచేసుకో. ఇంకో పుష్కరకాలందాకా తనకి టైంపాస్” అంది గీత.
“అయ్యబాబోయ్! నిజమే” అన్నాడు వాసు.
అందరూ తయారయ్యారు. వాసు రెండోమేనత్తా, పిల్లలూ, అల్లుళ్ళూ, మనవలూ, తులసీ, భర్తా, కుటుంబరావూ, ఆయన భార్య, యశోద, లక్ష్మి, రామారావు… ఇలా చాలామందే అయారు. అందర్నీ ఆటోల్లో ఎక్కించి, రామారావుని వాసూ, నీలిమని మాధవ్, వెనక ఎక్కించుకుని బైకులమీద బయల్దేరారు. అల్లుడి వెనక బైకెక్కి వెళ్తున్న రామారావుని చూసి కుటుంబరావుకి కాస్త అసూయలాంటిది కలిగింది. తనని ఏ అల్లుడూ అలా ఎక్కించుకోడు. ఎవరికివాళ్ళే భార్యల్ని ఎక్కించుకుని వెళ్తారు. తామిద్దరినీ ఆటోలో కుదేస్తారు. నీలిమ తల్లి, లక్ష్మి, యశోద ఒకదాంట్లో ఎక్కారు. నీలిమ తల్లి ముభావంగా వుంది. జరుగుతున్నదంతా చూస్తుంటే అప్పుచేసి పప్పుకూడు తింటున్నట్టు అనిపించింది. లక్ష్మి కుటుంబంమీద వున్న విలువ తగ్గింది.