ఝరి – 85 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

“మీ యింటికి చేసాను. నువ్వు ఇక్కడున్నావని గీత చెప్తే మళ్ళి ఇక్కడికి చేసాను” అన్నాడాయన. అక్కడికి చేసి, మళ్ళీ ఇక్కడికి చేసాడంటే ఏదో ముఖ్యమైన వ్యవహారమే అయుంటుందనుకున్నాడు వాసు. అతని ఊహ నిజమే. వాళ్ళ వూరికి ఇరవై కిలోమీటర్లదూరంలో వున్న చిన్నపల్లెలో పదిహేడెకరాల ఏకఖండిక పొలం అమ్మకానికి వుందట.
“మా అన్నదమ్ములిద్దరం చెరి నాలుగెకరాలూ తీసుకుంటుంన్నాం వాసూ! అంతకన్నా కొనలేం. మిగిలింది మీ అన్నదమ్ములిద్దరూ తీసుకుంటారా? కెనాల్‍కింది భూమి. ముందుముందు రేట్లు బాగా పెరుగుతాయి. అక్కరేదనుకుంటే నాలుగైదేళ్ళయాక అమ్మెయ్యచ్చు. కౌలుకివ్వడం అవీ నేను చూసుకుంటాను. వాళ్ళకి ఇంకో బేరం వుంది. అందుకని తొందరపెడుతున్నారు” అన్నాడు. ఒక తమాషాయైన ఆలోచన వాసు మనసులో కదిలింది. మయూఖ్ పుట్టినప్పుడు గీతకి వాళ్ల నాన్న స్థలం ఇచ్చాడు, ఇప్పుడు తను పొలం ఇస్తేనని. ఆలోచించుకుని కాసేపట్లో చెప్తానన్నాడు వాసు.
“కొనడం మంచిదేరా! డబ్బురూపంలో దాచుకుని ఏం లాభం? నేనూ కలిసేవాడిని, కానీ పిల్లల చదువులున్నాయి. అదయ్యాక పెళ్ళిళ్ళు చెయ్యాలి. కాబట్టి, ఇప్పటప్పట్లో ఏం చెయ్యలేను” అన్నాడు రవి. కమలాకర్‍గారికి ఫోన్ చేసాడు వాసు. ఆయనకూడా తీసుకొమ్మనే అన్నాడు. కొన్ని పనులు సంకల్పమాత్రాన జరిగిపోతాయి. వాసుకి అలా జరిగితే మాధవ్‍నిమాత్రం తీసుకోకుండా ఆపింది నీలిమ.
“వాళ్ళు మీ వదినకి మేనమామలు. ఆవిడకోసం చేస్తారు. మనం ఆమధ్యలోకి వెళ్ళడం ఎందుకు? మనకి వాళ్ళెందుకు చేస్తారు? కౌలూ అవీ సరిగ్గా ఇవ్వకపోతే ఎవరిని అడుగుతారు? చుట్టరికాలూ, చిన్నప్పటిస్నేహాలూ డబ్బుదగ్గిర కాదు” అంది.
“అలా ఎందుకు చేస్తారు? వాళ్ళు మంచివాళ్ళు. నాలుగైదుసార్లు వాళ్ళింటికికూడా వెళ్ళాం. ఒకసారి నువ్వూ వచ్చావు” అన్నాడు మాధవ్.
“తులసినీ, గీతనీ ఒక్కలా చూసేవారు… ఆ రికార్డంతా మళ్ళీ వెయ్యకండి. ఇద్దర్నీ ఒక్కలా ఎందుకు చూస్తారు? ఆ భ్రమలోంచీ బైటికి రండి ముందు. పంక్తిలో అవమానపరచకపోతే ఎదుటివాళ్ళు మనని తమతో సమానంగా చూసారనుకుంటాం. సంస్కారం వున్నవాళ్లెవరూ అలా అవమానపరచరు. వాళ్ళూ అంతే. మీ వదినకి పెట్టినదాంట్లో తులసికి ఎన్నోవంతు పెట్టారు?”
మంచిగా చూడటం అంటే మాధవ్‍కి బాగానే తెలుసు. నీలిమ అన్నట్టు పంక్తిలో గౌరవించడమే మన దగ్గిర సమానత్వం. ఆస్తులెవరూ పంచి యివ్వరు. వాళ్లతో కలిసి పొలం తీసుకోవడం నీలిమకి ఇష్టం లేదనే విషయం గ్రహించాడు. ఆగిపోయాడు. అతను ఆగిపోవటం ఆమెకి ఒక విజయంలా అనిపించింది. కానీ అదొక తప్పు నిర్ణయమనీ, దానివలన అన్నకీ తనకీ స్థాయీబేధం ఏర్పడుతుందనీ వూహించలేకపోయాడు. బేరసారాలన్నీ అయ్యాకే విషయం వాసుదాకా వచ్చింది. అతనికి పని తేలికైంది. తల్లికి చెప్పి, రామారావుని వెంటబెట్టుకుని వెళ్ళి అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంటు రాసుకుని వచ్చాడు. గీతచేతకూడా జీపీయఫ్ అడ్వాన్సు పెట్టించాడు. పొలం కొనడానికని అడిగితే పీయఫ్ అడ్వాన్సు ఇవ్వరు. వైద్యకారణాలు చూపించి అప్లై చెయ్యాలి. ఎక్కడో గుచ్చుకుంది ఆమెకి. షేర్లలో పెట్టిందికూడా వెనక్కి తీసుకున్నాడు వాసు. అదీకాక అప్పటిదాకా నిండునదుల్లా డబ్బుతో తొణికిసలాడుతున్న అకౌంట్సన్నీ ఒక్కసారి ఖాళీ అవటంచేత కలవరపడింది.
“నెల తిరిగేసరికి జీతాలొస్తాయి. మళ్ళీ ఎంతలో దాచుకుంటాం?” అని ఓదార్చాడు. వీళ్ళ నాలుగెకరాలు పోను మిగిలిన భూమి బైటివాళ్ళు తీసుకున్నారు. అది తమింట్లోనే కలిస్తే బావుంటుందని అతనికి అనిపించినా సుధీర్‍తో మొదలుపెట్టి వసంత్‍దాకా ఎవరి కారణాలు వాళ్లకే వున్నాయి తీసుకోకపోవడానికి. ముందు గీతకి కానుకగా తీసుకుందామని అనుకున్నాడు. అదంత బావుండదని తల్లి పేరుమీద రిజిస్టరు చెయ్యాలనుకున్నాడు. ఎవరి పేర్న వుంటేనేం అనిపించింది.
“నా పేరెందుకురా?” అంది లక్ష్మి వినగానే. అందులో అసహజమేమీ లేదు. కానీ వాసు బైటికి వెళ్ళాలన్న ప్రస్తావన వచ్చినప్పట్నుంచీ నీలిమని నమ్మలేకపోతోంది. ఆమె మనసు చదివినట్టు కలగజేసుకుంది వాసు మేనత్త.
“మళ్ళీ రేపెలా వెనక్కి తీసుకుంటావ్ వాసూ? వదినకి నువ్వొక్కడివే కొడుకువి కాదు. మాధవ్, తులసి మంచివాళ్ళే. రేపు మీ పిల్లలు పెద్దౌతారు. పెళ్ళిళ్ళౌతాయి. బయటివాళ్ళు ఇంటివ్యవహారాల్లోకి వస్తారు. పంపకాలల్లో ఎక్కువతక్కువైలైనట్టు వాళ్ళకి అనిపించదా? వాళ్ళకి ఇవన్నీ తెలీవుకదా? అమ్మమీద ప్రేమ వుంటే ఇంత బంగారం కొనిపెట్టు, ఆమె పెట్టుకుంటుంది, ఎవరికేనా ఇచ్చుకుంటుంది. నాలుగు చీరలు కొనివ్వు. డబ్బివ్వు. ఆమెకి నచ్చినట్టు చేసుకుంటుంది. ఆస్తిలెక్కలుమాత్రం ఎప్పుడేనా తెగ్గొట్టుకునేలా వుండాలి” అంది. జీవితం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి అడుగూ ఆచితూచి వెయ్యాలి. కనీసం మొదట్లో కొంత ప్రయాణం అలా చెయ్యాలి. ఆ తర్వాతే నడక సాఫీగా సాగుతుంది. ముందుతరంవాళ్ళ అనుభవం, లోకజ్ఞత ఆ నడక నేర్పిస్తాయి.
“అబ్బ! మీ అన్నమీదా వదినమీదా ఈగ వాలనివ్వరు ఎవరూ. ఎన్ని కాపలాలో!” అంది నీలిమ ఏకాంతంలో.
“అత్త చెప్పింది మనకీ వర్తిస్తుందికదా?”అన్నాడు మాధవ్. అతనెప్పుడూ ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. రామారావు, వాసు చెప్పినట్టు చేసుకుపోవడమేతప్ప ఇలా తర్కించడం రాదు. నీలిమ ఇలా మాత్లాడుతుంటే కొత్తగా అనిపిస్తుందతనికి.
యమున వచ్చివెళ్ళడం, పొలంకోసం తిరగడం, ఇద్దరి ఆఫీసుల్లో పీయఫ్ లోన్లు పెట్టడం, బేంకు బేలన్సులు చూసుకోవడం, డెలివరీకీ, బారసాలకీ డబ్బు సిద్ధం చేసుకోవడం చాలా తిరుగుడైంది వాసుకి నాలుగైదురోజులు. పుట్టబోయే విహంగ్‍కూడా అతనవన్నీ సరిచూసుకుని కాస్త వూపిరి పీల్చుకునే సందిచ్చి తను భూమ్మీదికి వచ్చేస్తున్నట్టు ప్రకటన చేసాడు. తెల్లారి రెండింటికి ఈ లోకంలోకి రావడానికి హడావిడి మొదలుపెట్టాడు వాడు. వాసు రెండు ఆటోలు తీసుకొచ్చాడు. మొదటి ఆటోలో యశోద, లక్ష్మి, గీత వెళ్తే వాసు వెనక బైకుమీద వెళ్ళాడు. ఇంకో ఆటోలో విజ్జెమ్మ, వాసు మేనత్త ఎక్కారు. మయూఖ్‍కి తోడుగా నీలిమ ఇంట్లోనే వుంది.
“ఇంతమంది దేనికి? ఏం చేస్తారు? డాక్టరు రానిస్తుందీ?” ఆశ్చర్యంగా అడిగిందామె.
“ఇదేం చూసావు? మయూగాడి టీమ్ ఇంకా పెద్దది. డాక్టరు తెలిసినావిడే. నర్సు ఓ గదిలో వీళ్లందర్నీ మాట్లాడకుండా కూర్చోమంటుంది. వీళ్ళు నోళ్ళమీద వేళ్ళు వేసుకుని బడిపిల్లల్లా కూర్చుంటారు” అన్నాడు మాధవ్ గట్టిగా నవ్వి. “డెలివరీ అవగానే అత్తని ఇక్కడ దింపి, నిన్ను తీసుకెళ్తాను” అని తనూ వెళ్ళాడతను. నీలిమ ఇంట్లోకి వచ్చి లక్ష్మి పడుకునేచోటులోకి మయూఖ్‍ని జరిపి పక్కని తను పడుక్కుంది. నిద్ర రాలేదు. వాడి స్పర్శ వెచ్చగా తగుల్తోంది. నిద్రలో దేనికో నవ్వుతున్నాడు. ఎంతో సమ్మోహనమైన నవ్వు. రెప్పవెయ్యకుండా చూస్తూ వుండిపోయింది. నెమ్మదిగా కదలిక… ఆమె మనసులో.
ఎందుకు తనకి ఇలా జరిగింది? పసిపిల్లల మైమరపులకి దూరమైంది? పిల్లలసలు పుడతారా? పుట్టరా? పుట్టకపోతే తన జీవితానికి అర్థం ఏమిటి? మాధవ్ పెద్ద మేనత్తని చూస్తోంది. ఆవిడ బాల్య వితంతువు. పిల్లల్లేరు. చెల్లెలి పిల్లల్నీ, తమ్ముడిపిల్లల్నీ పెంచుతూ గడిపిందట. ఎవరికి ఏ అవసరం వున్నా ఆవిడ వెళ్తుంది. ఆవిడ పాతతరం మనిషి. మరి తన జీవితం ఎలా వుండబోతోంది? గీత పిల్లల్ని పెంచడం, మాధురీ, మానసలకి అవసరాలొచ్చినప్పుడు వెళ్ళి తల్లికి సాయంగా నిలబడటం, అంతేనా అన్న ప్రశ్నతో మొదలై మనసులోని బాధంతా కన్నీటిరూపంలో బయటికి వచ్చింది. ఆమె ఎంతగానో కోరుకున్న ఏకాంతం అది. ఆ ఏకాంతంలోకి చాలా దు:ఖాన్ని వంపింది. ఇంకా మనసనే పాత్ర ఖాళీ అవట్లేదు. ఎంత సమయం గడిచిందో తెలీలేదు.
ఫోను మోగితే లేచి వెళ్ళింది. ఎత్తితే మాధవ్.
“మళ్ళీ బాబు పుట్టాడు. అత్త పోలికనుకుంటున్నారు. ఆవిడలాగే గుమ్మటంలా భలే వున్నాడు” అన్నాడు. అతని గొంతునిండా సంతోషం.
“అప్పుడే?!” నీలిమ తెల్లబోయింది. “గుమ్మటంలా బావుండడమేమిటి?”’అని నవ్వింది. “మీ వదినగానీ విందంటే తంతుంది” అని, “ఎలా వున్నారు తల్లీకొడుకులిద్దరూ?” అడిగింది.
“ఇక్కడెవరూ వెళ్ళనివ్వట్లేదుగానీ, చక్కగా వాడినెత్తుకుని ఇంటికొచ్చేసేలా వుంది” నవ్వాడతను. “కృష్ణ వస్తాడు, పాలు, కాఫీ, టీ మూడు ఫ్లాస్కుల్లో పోసి వాడితో పంపించు. నేను కాసేపట్లో వస్తాను” చెప్పాడు.
హడావిడి మొదలైంది. కాఫీటీలతోపాటు వేణ్ణీళ్ళుకూడా కాచి పెట్టింది. మయూఖ్ లేస్తే వాడికి మొహం కడిగి పాలుపట్టింది. కృష్ణ తనతో తీసుకెళ్ళాడు. మళ్ళీ ఒక్కర్తే. తల్లితో మాట్లాడాలనిపించింది. అమ్మకన్నా బలమైన ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? ఆవిడకీ బాధగానే వుంది. కానీ ఏం చెయ్యగలదు?
“బాధ వుంటుందిగానీ లోపలే దాచుకో. మీకిద్దరికీ వయసు మించిపోలేదు. పుడతారన్న ఆశ వదులుకోకు. సంకల్పబలం చాలా గట్టిది” అంటూ నాలుగుమాటలు చెప్పిందావిడ. ఆవిడ దగ్గిర్నుంచీ రీసీవరు తీసుకుని తండ్రి మాట్లాడాడు.
“ఆ టైమొస్తే పుట్టక ఎక్కడికి పోతారుగానీ, మీ బావ పొలం కొన్నాట్ట? అంత డబ్బెక్కడిదో ఏంటో తెలుసుకున్నావా? మీరెందుకు కొనలేదు? ఎకరమో రెండెకరాలో మీ పేరా పెట్టించుకోలేకపోయారా? ఇప్పుడీ పురిటికీ బారసాలకీ ఎవరు పెడుతున్నారు? ఏడుపులూ రాద్ధాంతాలూ కాదు, ఇవన్నీకూడా చూసుకోవాలి. ఉన్నదంతా వాళ్ళకే వూడ్చిపెట్టేస్తే రేపు మీరెలా బతుకుతారు? రెండుజీతాలవాళ్ళనీ, ఒంటిజీతగాడినీ ఒకేలా చూస్తే ఎలా? మీ అత్తగారికి చెప్పేవాళ్ళెవరూ లేరా? పెత్తనమంతా ఆవిడదేలావుంది. పెళపెళ్ళాడించేస్తోంది” అన్నాడు. ఆయన మాటలు నీలిమలో వున్న భావోద్వేగాలని ఒక్క దులుపు దులిపి, మనసుని ఖాళీ చేసాయి.
ఇంటికి వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, ఫ్లాస్కుల్తో కాఫీలు, టీలు పాలు సరఫరా ఔతున్నాయి. ఇడ్లీలు పెట్టమని, ఉప్మా చెయ్యమని ఫర్మానాలు వస్తున్నాయి. చేసి పంపిస్తోంది. వచ్చి బాబుని చూసి వెళ్ళమన్న పిలుపు ఆమెకి రాలేదు. తనని మర్చిపోయారా? కావాలనే వుపేక్షించారా? గొడ్రాలని తనమీద ముద్ర వేసారా? అందుకే పిలవలేదా? అందరూ సరే, వస్తానన్నవాడు మాధవ్ ఏమయ్యాడు? అతన్నికూడా అవమానించారా? తండ్రిమాటలకి పిట్టల్లా ఎగిరిపోయిన ఆలోచనలూ దు:ఖాలూ మళ్ళీ వచ్చి చేరాయి. ఒక్కర్తీ కూర్చుని గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది.
పదౌతుంటే వాసు వచ్చాడు మేనత్తని తీసుకుని. “ఇందాకే రావల్సింది నీలిమా! తులసొచ్చింది. మాట్లాడుతూ కూర్చున్నాను. నువ్వెళ్ళు. ఇక్కడ నేను చూసుకుంటాలే” అందావిడ.
“పదమ్మా, వెళ్దాం” అన్నడు వాసు. అర్జెంటు ఫైల్సున్నాయని ఆఫీసునించీ మనిషొస్తే మాధవ్ వెళ్ళాడని చెప్పాడు. అందరూ చూసాక ఇంక తప్పదన్నట్టు తను గుర్తొచ్చిందనుకుంది. అపార్థం అనేదానికి మనసులో బీజం పడితే అది మొలకెత్తకుండా వుండదు. మనసెంతో ప్రతిఘటిస్తుంటే అతని వెనక బైక్ ఎక్కి కూర్చుంది.
“కోడల్ని కనిస్తావనుకుంటే మళ్ళీ మగపిల్లాడిని కన్నావు వదినా!” వెళ్ళేసరికి గునుస్తోంది తులసి గీత దగ్గిర.
“మాదే మేనరికం. మళ్ళీ ఇదోటా? నాకు కూతురు పుట్టినా నీ కొడుక్కి ఇవ్వను. అదుగో, చిన్నొదిన వచ్చింది. తనతో బేరాలాడుకో” అందామె. గర్వమా? హేళనా? నీలిమకి మామూలుగా అనిపించలేదు ఆ మాటలు. పిల్లవాడిని చూసింది. మాధవ్ అన్నట్టు బొద్దుగా వున్నాడు. మయూలా పొడుగనిపించట్లేదు. వాడు తండ్రి పోలికైతే వీడు తల్లిపోలిక కావచ్చు. అమ్మమ్మ పోలికంటే అంతేకదా!
మూడోరోజుని డిశ్చార్జై ఇంటికి వచ్చింది గీత. ఆమె తిండి, విహీ పనులు, మయూఖ్ గారాబాలు, ఇంటిపని, వచ్చివెళ్ళేవాళ్ళని చూసుకోవడం ఒకొక్కరూ మీదేసుకుని జాగ్రత్తగా చేస్తున్నారు.
మాధవ్ వాసు ఆఫీసుకి వెళ్ళి పదివేలు ఇవ్వబోయాడు. నీలిమకి అభ్యంతరం వుంటుందనుకోలేదు. స్వతంత్రించాడు.
“ఎందుకురా?” అన్నాడు వాసు తెల్లబోయి.
“ఉంచరా! బోల్డంత ఖర్చు. భూమికూడా కొన్నావు. కొంచెం కుదురుకున్నాక మళ్ళీ ఇవ్వచ్చులే” అన్నాడు మాధవ్.
“మా దగ్గిరది సరిపోతుందిరా! అన్నీ లెక్కలేసుకునే కొన్నాను”
“అంత లెక్కలేసుకునే అవసరం నీకేంట్రా? ఉండనీ. అంతగా మిగిలిపోతే హడావిడయ్యాక తిరిగి ఇచ్చేద్దువుగాని” మాధవ్ బలవంతం చేసాడు. అతన్ని చిన్నబుచ్చడం యిష్టంలేక తీసుకున్నాడు వాసు. విషయం తెలిసి, నీలిమ ముభావంగా వుండిపోయింది. “ఇచ్చేసాక చెప్పడం దేనికి? ఇచ్చేముందే ఒకమాట అనాల్సింది” అంది. ఆమె ఆక్షేపిస్తుందనుకోలేదు. అతను తెల్లబోయాడు.