ఝరి – 78 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

గీతకి పెళ్లై ఇప్పటికి ఐదేళ్లైంది. ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు. ఎవరు ఎలా వుండబోతున్నారో రూపుకడుతున్నట్టే వుంది. మాధవ్ తప్ప అందరికీ పిల్లలు. ప్రహ్లాద్‍కీ, వసంత్‍‍కీ కూతుళ్ళు. సుమతికి కొడుకు. సమీరకీ, తులసికీకూడా పుట్టేసారు. ప్రవల్లికకి సంబంధాలు చూస్తున్నారు. పెద్దపెద్ద సంబంధాలకీ, డబ్బున్న సంబంధాలకీ వెళ్తుంటే నివ్వెరబోయి చూస్తుంది మాధురి. పిల్లలని ఇంత అపురూపంగా చూసుకుంటారా అని ఆశ్చర్యం.
అంతా బుజ్జిబుజ్జి పిల్లల్నేసుకుని తిరుగుతున్నారు. పెద్దవాళ్ళకి చేతినిండా పని. కొత్తగా నాన్నలుగానూ, మేనమామలుగానూ అవతారం ఎత్తిన మగపిల్లలు ఈ పిల్లలందర్నీ ఎత్తుకుని మోస్తున్నారు. తాతలు సరేసరి. అదో కొత్త హోదాలా వుంది అందరికీ.
సుమతి కొడుక్కి జలుబు చేసింది. ముక్కూనోరూ ఏకప్రవాహంలా కారుతోంది. కాసేపు వాడిని ఎత్తుకున్నాక కర్చీఫ్‍తోపాటు జోకి అందించింది.
“అదేమిటే, పాపం? వాడికి ముక్కు కారుతోందికదా?” అని సుమంత్ కోప్పడితే-
“ఏం, బొబ్బ పోసి, పౌడర్లు రాసి, ముక్కూమూతీ తుడిచి మీ చేతిలో పెడితేనేగానీ ఎత్తుకోరా?” అని దెబ్బలాడింది.
వాసు బాగా పొడుగు. అటూయిటూ వెళ్తుంటే మంటపం అలంకరణకి కట్టిన పూలదండలూ, తోరణాలూ తలకి తగుల్తున్నాయి. మొదట సరదాగా కేరింతలు కొట్టి, తర్వాత అవి తనకి తగలట్లేదని మయూఖ్ ఏడుపు మొదలు పెట్టాడు. వాసు ఎత్తుకోబోతుంటే-
“అమ్మనికూడా ఎత్తుకో, అమ్మకీ తగలట్లేదు” అన్నాడు. వాసు తల పట్టుకున్నాడు. ఎవరేనా విన్నారేమోనని చుట్టూ చూసుకున్నాడు.
మాధురి కూతురు ఏడుస్తుంటే చాక్లెట్ బార్ చేతిలో పెట్టి “నాన్న దగ్గిరకి పో. నా చీర పాడౌతుంది” అని పంపేసింది. అప్పటిదాకా పాస్టెల్ కలర్ షర్టులు వేసేవాడల్లా ప్రహ్లాద్ ఈ పిల్ల పుట్టాక నలుపుమీద ఎర్రగళ్ళూ, ఎరుపుమీద నీలంగళ్ళకి మారిపోయాడు.
పద్మకీ, భర్తకీ మానసమీద కోపం. మనవరాలిని ఎత్తుకుని దింపరు. ఇద్దరు మనవల్నీ చెరొకళ్ళూ ఎత్తుకుని తిరుగుతారు.
గీత మనసులో వుదయించిన ప్రశ్న. ఈ అందరిమధ్యా రాణా భార్యస్థానం ఎక్కడ? మామ్మ అత్తని తిట్టింది. ఆవిడ తన చేతుల్లో ఏమీ లేదనేసింది. రాణా భార్యపట్ల ఈ కుటుంబానికిగానీ , తమందరికీగానీ ఎలాంటి బాధ్యతా లేదా? వాడు దుర్మార్గుడైతే వాడి భార్యకి శిక్ష వేస్తే ఎలా? గీత మనసులో దు:ఖం సుళ్ళు తిరుగుతోంది. తనకి ముందు అదే డెలివరీబల్లమీద చనిపోయిన హరిచందన గుర్తొచ్చింది. ఆమె చనిపోయాక సర్వం కోల్పోయినట్టు మిగిలిన కమలాకర్, వసుంధర దంపతులు గుర్తొచ్చారు. తన చేతుల్లోకి వచ్చి ప్రాణాన్ని నిలుపుకున్న హరిచందన్ గుర్తొచ్చాడు. మనసంతా వికలమైంది.
అందరూ ఇక్కడే వున్నారు. అడిగేస్తే సరిపోతుందని అనుకుంది.
బయటికి అనేముందే అన్నీ ఆలోచించుకుంటుంది గీత. ఈ ప్రక్రియంతా చకచక జరిగిపోతుంది. నాన్చడం వుండదు. ఆమె అన్నది నచ్చలేదని విమర్శించేవాళ్ళు ఇప్పటిదాకా ఎవరూ లేరు. అందుకే సంకోచించలేదు. నెమ్మదిగా అంది.
“కొన్నాళ్ళకిందట నీలిమతో ఒకమాట అన్నాను-
మాయింటి మగపిల్లల భార్యలు పరాయివాళ్ళు కారని. మిమ్మల్నిబట్టి మా విలువా, లేక పెళ్ళి చేసుకుని వచ్చినందుకు కుటుంబంలో మీతో సమానంగా మాకూ స్థానం వుంటుందా?” అడిగింది. ఏవో మాట్లాడుకుంటున్నవాళ్లంతా ఆగిపోయారు. ఎవరికీ ఆ ప్రశ్న అర్థమవ్వలేదు.
“కాస్త అర్థమయ్యేలా చెప్పవే” అన్నాడు ప్రహ్లాద్.
మాధురీవాళ్ళు అక్కచెల్లెళ్ళు ముగ్గురూ కుతూహలంగా చూసారు.
“వాడు వెధవే, కాదనను. అలాంటివాడిని నమ్మి తొందరపడటం ఆ పిల్లది తప్పే. అదీ కాదనను. అందుకు తనని అలా వదిలెయ్యడమేనా? మనది ఏకకుటుంబమని అందరికీ గొప్పగా చెప్పుకుంటాం. మనలో మనకి సాయం చేసుకుంటాం. ఈ మనంలో ఆమెకి చోటులేదా?” గీత ఎవర్నిగురించి అంటోందో అందరికీ అర్థమైంది. మగపిల్లలందరి ముఖాల్లో అదోరకమైన భావం వ్యక్తమైంది. ఒకళ్లకేసి ఒకళ్ళు చూసుకున్నారు.
“ఇక్కడ జరగట్లేదని మామ్మ వాళ్ళ నాన్నని పిలిపించి ఆమెని పంపేసింది. వాళ్ళు బాగా పేదవాళ్ళు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయన ప్రైవేటు వైద్యం చేయించలేడు. గవర్నమెంటు హాస్పిటల్‍కి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. డాక్టర్లు బాగానే చూస్తుండవచ్చు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ, ఎక్విప్‍మెంటు వుండవు. మందులు వుండవు. రాసిస్తాం, కొనుక్కోమంటారు. ఆయన కొనలేడు. నాకైతే అలాంటి వైద్యం చేయిస్తారా? ఇక్కడ ముగ్గురు డాక్టర్లున్నారు. డిసిప్లిన్స్ ఏవేనా కావచ్చు. కానీ కనీసపు వైద్యం చేయించుకోలేక ఒకమ్మాయి చచ్చిపోవడమనేదాన్ని మీ ముగ్గురూ వప్పుకోగలరా?” సూటిగా అడిగింది. “మందులూ, సరైన తిండీ లేకపోతే కనలేక చచ్చిపోతుంది యమున. అప్పుడా పిల్లల పరిస్థితేమిటి? పొట్టలో వున్న పిల్లలకికూడా ఏవో కాంప్లికేషన్సట. ఎలా పుడతారు వాళ్ళు? జబ్బులతోనా? ఏదేనా దారి ఆలోచించండి. మూడు నిండు ప్రాణాలు. మనందరికీ వుద్యోగాలున్నాయి. అందరం తలోకొంతా వేసుకుని వాళ్లకి సాయం చేద్దాం. ఆ పిల్లని ఈ విపత్తులోంచీ బైటపడేద్దాం.
ఆ తర్వాత వాళ్ళు కలిసి కాపురం చేస్తారా, లేదా, తల్లీపిల్లలూ ఎలా బతుకుతారు అనేది మనకి అనవసరం” అంది. ఎవరూ ఏమీ జవాబివ్వలేకపోయారు.
అసలు అలాంటి ప్రతిపాదన… అందరూ కలిసి నిలబడి ఇంకొకరికి సాయం చెయ్యడంలాంటిది అక్కచెల్లెళ్ళు ముగ్గురికీ కొత్త. ఊపిరి ఆగినట్టైంది, మిగతావాళ్ళు ఏమంటారా అన్న వుత్కంఠతో. ముందుగా తేరుకున్నది సుధీర్.
“ఎవరం అంత దూరం ఆలోచించలేదు గీతా! రాణా మామగారు తీసుకెళ్ళాడు, చూసుకుంటాడని అనుకున్నాం. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మనసు కష్టపెట్టుకోకు. నీకు తనతో పోలికేమిటి?” అన్నాడు.
ఎవరో వచ్చి గీతని పిలిచారు. లేచి వెళ్ళింది. ఒక ఆలోచనని అక్కడ వదిలి. అందరి మెదళ్ళలో నాటి.
వాసు కమలాకర్‍గారింటి వుదంతం చెప్పాడు.
“నాకు చాలా భయం వేసింది. పూర్తిగా మనకి తెలీని విషయాలివి. పెద్దవాళ్ళుకూడా మనతో ఏదీ చెప్పరు. డెలివరీ టైంలో మనింట్లో ఎవరూ చనిపోయిన వివరం లేదు. అసలెందుకు పెళ్ళి చేసుకున్నాను? నేను చేసుకోకపోతే తనమానాన్న తను బతికేది అనిపించింది. గీత చావుకి నేను కారణం ఔతానా? డెలివరీ అయ్యి తను క్షేమంగా బైటపడుతుందా? మళ్ళీ తనని చూస్తానా? ఎన్నో సందేహాలు. చాలామంది పెద్దవాళ్ళున్నారు మాచుట్టూ. ధైర్యం చెప్తున్నారు. కోప్పడుతున్నారు. కానీ ఎవరిచేతుల్లో ఏమీ ఉండదనే అవగాహనకూడా దానితోపాటే వుంది” అన్నాడు వాసు.
“నీకలాంటి భయం వున్నప్పుడు నాతో ఒక్కమాట చెప్తే హాస్పిటల్ మార్చేవాళ్లం బావా! గైనిక్ చాలా మంచావిడ. వేరే హాస్పిటల్‍కి రమ్మంటే వచ్చేది” అన్నాడు జోగేశ్వర్రావు.
“అలా అడగచ్చని తెలీలేదు” అన్నాడు వాసు. ఇలాంటి విషయాలు అందరూ కూర్చుని ఇంత మామూలుగా మాట్లాడుకుంటే ఆశ్చర్యం వేసింది నీలిమకి. అక్కడ వుండచ్చా, వెళ్ళిపోవాలా అనేది అర్థం కాలేదు. సుమతి వుందని వుండిపోయింది. ఆమె లేస్తే మిగిలిన యిద్దరూ అనుసరించేవారు.
“డెలివరీ అయ్యి, వాళ్ళిద్దర్నీ కళ్ళతో చూసాకకూడా నాకు నమ్మకం కలగలేదు” అన్నాడు వాసు.
“అందరికీ ప్రాణాపాయం వుండదు. అలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. లేకపోతే మనుషులే వుండరుకదా?” అన్నాడు జో.
“తనకి ఆఫీసులో చేరేదాకా చెప్పలేదు ఆ విషయాన్ని. అసలు అలా జరుగచ్చన్న వూహకూడా లేదేమో షాకైపోయింది. చావంటే ఏమిటి? చచ్చిపోతే ఏమౌతాను? ఎక్కడికి వెళ్తాను? ఒకేలాంటి సందర్భంలో ఆమె చచ్చిపోవడానికీ, నేను బతికి వుండడానికీ కారణం ఏమిటి? నేను చచ్చిపోతే మయూఖ్ ఏమైపోతాడు? ఇలాంటి ప్రశ్నలతో సతమతమైపోయేది. నన్నడిగేది. ఎంత నచ్చచెప్పినా వినేదికాదు. మా నాన్నచేతకూడా చెప్పించాను. ఆ వుద్వేగం తగ్గడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడీ విషయంలో తను మళ్ళీ డిస్ట్రబౌతోంది. ఇష్టమైతే అందరం కలిసి చేద్దాం. లేకపోతే మేమిద్దరం చూసుకుంటాం” అన్నాడు వాసు.
“మొదట్నుంచీ తనంతేకదా? మనసుకి ఏదేనా ఎక్కడమేగానీ దిగడం వుండేది కాదు” అంది సుమతి. ఆ అనడంలో కొంచెం కఠినత్వం వుంది. ఎవరూ గుర్తించలేదు. వాసు పట్టుకున్నాడు.
“చిన్నప్పడు అనుకునేవాళ్ళంకదా? అందరం కలిసి పెద్దయ్యాక ఏదో చెయ్యాలని. చేసేద్దాం” అన్నాడు మాధవ్.
“సరేరా, నువ్వన్నట్టు అందరం తలోచెయ్యీ వేసి, యమునని ఈ సమస్యలోంచీ బైటపడేద్దాం. వాసు అరేయ్, మీవి రెండు చేతులు” అంది సుమతి సర్దుకుని, వాతావరణాన్ని కాస్త తేలికపరుస్తూ.
గీత, రవళి కలిసి వచ్చారు.
“మహీ ఏదే? దాన్నీ తీసుకురాకపోయావా?” అడిగింది సుమతి రవళిని.
“రాత్రిముహూర్తం కదే, మేలుకుని వుండాలని ఇప్పుడు నిద్రపోతోంది” అంది రవళి. అంతా మామూలు మూడ్‍లోకి వచ్చారు.
నీలిమకి అక్కడ వుండాలనిపించలేదు. లేచి నెమ్మదిగా అక్కడినుంచీ వచ్చేసింది. ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళకి వూరికే కార్డులు అచ్చేసుకుని అందర్నీ పిలవరు. పిలుపులు చాలా క్లుప్తంగా వుంటాయి. అందుకే పెళ్ళిహాలులో రద్దీ లేదు. మంటపం అలంకరణలు నడుస్తున్నాయి. ఇంకా ఆమె తల్లిదండ్రులు రాలేదు. ముహుర్తం టైముకి వస్తారేమో! ఒక మూలకి వెళ్ళి కూర్చుంది. కాస్త దూరంగా అర్చన, పల్లవి చేతులుపట్టుకుని వప్పులకుప్ప తిరుగుతున్నారు. మయూఖ్ వాళ్ళ కాళ్లకి అడ్డంపడుతున్నాడు. ఇంకా ఎవరెవరో పనులమీద తిరుగుతున్నారు. అదంతా తనకి చెందని ప్రపంచం అనిపించింది. తులసి, మానస, సమీర తనకన్నా చిన్నవాళ్ళు. వాళ్ళు ముగ్గురికీ పిల్లలు పుట్టి తనకి ఇంకా పుట్టకపోవడం ఆమెలో అసహనాన్ని నింపుతోంది. ఆ విషయంలో ఆమెకి ఒక ఓదార్పులాంటిది కావాలి. అది ఎలాంటిదో ఆమెకే తెలీదు. మాధవ్‍నుంచీ రావాలని కోరిక.
మగవాడు భార్య పుట్టింటి చుట్టాలని వెంటేసుకుని తిరుగుతూ వుంటే వోర్చుకోలేడు. ఆమె తనని నిర్లక్ష్యం చేస్తోందని బాధపడిపోతాడు. అలాంటి ఫీలింగ్సే ఆడవారికీ వుంటాయి. మాధవ్ తన చుట్టూ తిరగాలి. తన వెంటే వుండాలి. తనతో మాట్లాడాలి. ఈ చుట్టాలూ, స్నేహితులూ ఎంత ఆప్తులైనా అదంతా పెళ్ళికి ముందు. తను రానప్పుడు. వీళ్ళలో ఎవరూ తనకి ఎవరూ ఏమీ కారు. చుట్టరికాలన్నీ అతన్నిబట్టే. అలాంటి మనిషి అంతమంది మధ్య తనని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? అని కోపం వచ్చింది.
నీలిమ రావటం చూసి చెల్లెలి చెయ్యిపట్టుకుని లేవదీసి వెంటపెట్టుకుని వచ్చేసింది మాధురి.
“ఇక్కడ కూర్చున్నావేమే? ” అడిగింది నీలిమని. ముగ్గురూ సర్దుకుని కూర్చున్నారు.
“ఏం మనుషులే బాబూ! పెద్దా చిన్నా అందరూ ఒకటే. వాళ్లలో వాళ్ళే తప్ప ఎవ్వరినీ కలుపుకోరు. ఎప్పటెప్పటి విషయాలో మాట్లాడుకుంటారు. అక్కడికి వీళ్ళొక్కరికే చిన్నతనాలున్నట్టు, ముద్దుమురిపాలు జరిగినట్టు ఒకటే డప్పుకొట్టుకోవడం” అంది ఆమే మళ్ళీ. నిరసనగా.
“మనకి ఈ తలనెప్పి ఎప్పుడో ఒకసారి. దీనికైతే నిత్యం నట్టింట్లోనేకదా?” అంది మానస నవ్వి.
“ఆవిడ పెత్తనమేమిటే, అందరిమీదాను? ఆమె అడగడం, అన్నిటికీ వీళ్ళంతా తలూపడం… నాకైతే చిరాకేసింది. రాణాగారి భార్యకి మనమంతా కలిసి వైద్యం చేయించడమేమిటి? రెండుజీతాలవాళ్ళు, మా బావగారూ తోటికోడలూను. ఎలాగేనా తగలేసుకోవచ్చు. మనందర్నీ ఇందులోకి లాగటమేమిటి?” చిరచిరగా అంది నీలిమ. ఆమె మనసంతా అప్రసన్నతతో నిండి వుంది.
మానస ఇంట్లో వ్యవహారాలమీదికి పోయింది వాళ్ళ సంభాషణ. కట్నం తేలేదని పద్మకీ భర్తకీ వున్న కోపాన్ని ఆమెమీద ఏదో ఒకలా చూపిస్తునే వుంటారు. వసంత్ పట్టించుకోడు. పట్టించుకోకుండా వుండటం ఎలాగో మానసకి తెలీదు. తనూ ఒకటో రెండో మాటలు సన్నసన్నగా అంటుంది. పెద్ద గొడవౌతుంది. వసంత్ ఆమెనే కోప్పడతాడు.
“పెద్దవాళ్ళు, ఒకమాటంటే ఓర్చుకోలేవా? నాన్న వద్దంటుంటే వినకుండా నిన్ను చేసుకున్నాను. ఆ అసంతృప్తి వుంటుందికదా? నాలుగురోజు వచ్చి వుండి వెళ్తాం. ఈ నాలుగురోజులకే గొడవపడాలా?” అంటాడు.
“ఏమోనక్కా! గొడవంతా తిరిగితిరిగి గీతావాళ్ళదగ్గిరే వచ్చి ఆగుతుంది. కట్నం లేదని వదిలేసారా, ఆమెకి బంగారం పెట్టి, స్థలం ఇచ్చారని ఎత్తి చూపిస్తారు. ఉంటే నాన్నమాత్రం ఇవ్వడా?” అంది.
“కట్నం వద్దంటేనేకదా, సంబంధానికి వెళ్ళాం? ఇప్పుడు కొత్తగా ఏమిటి? నాన్నకి చెప్పాలన్నా, నీకొక్కదానికీ యిస్తే మిగతావాళ్ళు వూరుకుంటారే? అసలు మన ముగ్గుర్నీ ఒకచోట ఇవ్వటమే తప్పు. ఎక్కడ దేన్ని సరిచెయ్యాలన్నా, ముగ్గురుకీ కలిపి చుట్టుకుంటుంది” అంది మాధురి. ఎవరి సమస్య వాళ్ళది. తమ ముగ్గుర్నీ ఒకేచోట ఇవ్వడం తప్పని వీళ్ళకి అనిపించినట్టే అలా తెచ్చుకోవడం తప్పని వాళ్ళకీ అనిపించేరోజు ముందుంది. అక్కచెల్లెళ్ళు చాలాసేపు అవే విషయాలు మాట్లాడుకున్నారు.
పదినిముషాలకి భార్యని వెతుక్కుంటూ ప్రహ్లాద్ వచ్చాడు.
“ముగ్గురు ఇక్కడ కూర్చున్నారా?” అన్నాడు. హేవింగ్ యువర్ టైం అనేది అతని భావన.
“లేకపోతే? విసుగుపుట్టి చస్తున్నాం” అంది మాధురి కొంచెం పెడసరంగా. ఇప్పుడిప్పుడే అలాంటివి రుచికి తగుల్తున్నాయి ప్రహ్లాద్‍కి.
“చాలారోజులకి అందరం ఒక్కచోట కలిసాం. టైం తెలీడం లేదు. ఐనా మాపక్కని కూర్చుని, మామాటలు వింటూ బోరుకొడుతోందంటే ఎలాగే?” అన్నాడు.
“మా ఖర్మానికి మమ్మల్నొదిలేసి, మీదార్న మీరు కబుర్లు చెప్పుకుంటుంటే మా కాలక్షేపం మేం చేసుకోవాలనా, బావా?” చురుగ్గా అడిగింది నీలిమ. ఆ చురుకు బానే తగిలింది ప్రహ్లాద్‍కి.
“ముగ్గురం ఇంటికెళ్ళిపోయి ముహుర్తం టైముకి వద్దామనుకున్నాం” అంది మానస.
ప్రహ్లాద్ వెళ్ళి, మిగిలిన ఇద్దర్నీ తీసుకొచ్చాడు. ఆరుగురూ కాసేపు కూర్చుని మాట్లాడుకునేసరికి మళ్ళీ సమీకరణాలు మారాయి.
రాత్రికి పెళ్ళీ, హడావిడీ అయ్యి, ఎవరిళ్లకి వాళ్ళు తిరిగొచ్చేసరికి, గీత జీవితంలో వురుము వురిమి మంగలంమీద పడ్డదనిపించేలాంటి మార్పు మొదలైంది.