ఝరి – 90 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

“మీరు వెళ్ళిపోయినంతమాత్రాన ఇల్లు మాధవ్‍ది ఐపోదు. ఇది మా తాత కట్టించిన యిల్లు. మాకు పుట్టిల్లు. మేమున్నాం ఇంకా. మేం వచ్చిపోతుంటాం. మా తమ్ముడూ మరదలూ వున్నారు. వాళ్ళెక్కడికి పోతారు? ఇంట్లో తులసికికూడా పాలుంటుంది. అదెందుకు వూరుకుంటుంది? చదువుకుని వుద్యోగం చేస్తున్నావేమో, నీకివన్నీ తెలీవా? జవాబుచెప్పలేవా? ఎవరో ఏదో అన్నారని ఏడవటానికి చిన్నపిల్లవా? నీకు పాతికేళ్ళు లేవూ?” అంది వాసు మేనత్త, విజ్జెమ్మ అలా అన్నాక.
గీత కళ్ళు తుడుచుకుని, తనేమందో చెప్పింది.
“బాగానే చెప్పావు. మరింక ఏడుపు దేనికి? అలా ఏడవకూడదు. ఏడుస్తున్నవాళ్లని ఇంకాస్త ఏడిపించబుద్ధౌతుంది. గీతా! గట్టిగా వుండాలి. అప్పుడే సంపాదించుకున్నవి నిలబడతాయి. ఇక్కడ లేనివాళ్ళెవరూ లేరు. ఎవరికి వుండేవి వాళ్ళకే వున్నాయి. మాధవ్‍కేం తక్కువ? వాడిచేత ఖర్చే పెట్టనివ్వడుకదా, అన్నగారు? ఏం చేస్తున్నాడు జీతం పైసలు? మామగారికిస్తున్నాడా? ఇంకోమారు ఎవరి నోటంటేనా వానికేమీ లేదంటే ఇదేమాట అడగాలి. నువ్వే అడగాలి. అనేసి ఎక్కడ పుట్టిన మాటల్ని అక్కడే తుంచేసెయ్యాలి. ఆడవాళ్ళమధ్య వచ్చినమాటలు మగవాళ్లదాకా పోనివ్వద్దు. అంత పెద్ద గొడవైతే వాళ్ళకే తెలుస్తాయి. నువ్వు వాసుకేమీ చెప్పద్దు. అన్నదమ్ములమధ్య గొడవ పెట్టినదానివౌతావు. వాళ్ళిద్దరికీ ఎలా తెలియాలో అలానే తెలుస్తాయి. లే… లేచి మొహం కడుక్కో. అందరు వచ్చే టైమైంది. నువ్వు తినేసి కూర్చో. మళ్ళీ వాడు లేస్తాడు” అంది. భర్త చిన్నతనాన్నే పోవడంతో ఇలాంటివి ఎన్నో పడిందావిడ. గొడవలన్నీ అయాక తేటబారిన కుటుంబాన్ని చూసి తులసిని యిచ్చారు వీళ్ళు. ఈ గీతని చూస్తే తెల్లటివన్నీ పాలు, నల్లటివన్నీ నీళ్ళు అని నమ్ముతుంది. అందరూ తనవాళ్ళే అనుకుంటుంది. ఒక మనిషిని “మన” అనుకోవడానికి ఎవరి లెక్కలు వాళ్లకే వుంటాయి. ఏ లెక్కలూ లేకుండా నిర్మోహంగా అనుకుంటే అది దెబ్బతీస్తుంది. దీనికి తెలివి మప్పాలి… అనుకుంది. లేకుంటే వాసుని ఇబ్బందిలో పడేస్తుంది.
“మీ నాన్నకీ రవికీ ఎందుకు మాటల్లేవని ఎప్పుడూ నువ్వు అడుగుతుంటావుకదా? తాతయ్య చచ్చిపోయినప్పుడు వాడికి ఏడాది. అన్నీ ఐపోయాయనుకుంటుంటే పుట్టాడు. స్కూల్‍ఫైనలుదాకా మిగతావాళ్లలాగే చదివాడు. పచ్చగా మగ్గిన మామిడిపండులా వుండేవాడు. చదువులో చురుగ్గా వుండేవాడు. వాడిమీద మా పెద్దతమ్ముడి దృష్టిపడింది. తీసుకెళ్ళి పై చదువులు చెప్పించి అల్లుడిని చేసుకుంటానన్నాడు. ఆరోజుల్లో అందరికీ గంపెడేసిమంది పిల్లలుండేవారు. మేనమామలు చదివించి పిల్లనివ్వడం, పెద్దనాన్న చిన్నాన్నలు చేరదియ్యడం ఇలాంటివి చాలానే జరిగేవి. అప్పట్లో రాజావారి కాలేజీలో బియ్యే అంటే చాలా గొప్ప. మగపిల్లల మెడమీద ఎప్పుడూ కత్తి వేలాడుతూ వుండేది. ఎనిమిది, స్కూల్‍ఫైనలు, పియ్యూసీ ఇలా ఏక్కడో ఒకచోట ఆగిపోయి సంపాదనలు వెతుక్కోవలసిన పరిస్థితి. మీ అత్తలని చదివించడమంటే అందరూ ఎదిగిపోయి వున్నారు. పెళ్ళిళ్ళు చెయ్యాలికదమ్మా? ఒకొక్కళ్ళకీ చేసి వూపిరిపీల్చుకుందుకు వాళ్ళని చదువులో పెట్టాడు మీ నాన్న. అదీ వానాకాలం చదువులా వెళ్ళినప్పుడు వెళ్ళి, లేనప్పుడు లేకా ఎలాగో పట్టా తెచ్చుకుని వచ్చారు. ఒక్క ప్రమీలే… దానికే ఎందుకు తోచిందో లేక వాళ్ళాయనే అన్నాడో వుద్యోగంలో చేరింది.
సరే, రవిని పెద్దచదువదీ చదివిస్తానని తీసుకెళ్ళాడా, వీడు ఇంజనీరు చదువుతానన్నాడు. ఆయన గొప్పగా ఫీజులవీ కట్టి చేర్పించాడు. కూతురికి ఇంజనీరు అల్లుడొస్తాడని కలలు కన్నాడు. మా మరదలు సన్నసన్నగా ఎగేసింది-
మొత్తం ఫీజులు మనం ఎక్కడ కట్టగలం? ఆ డబ్బు కట్నంగా ఇస్తే అంతకంతా చదువుకుని, ఆస్తిపాస్తులున్న అల్లుడే వస్తాడు- అని.
మీ తాత ఎప్పుడో రాసిన విల్లు సంపాదించారు. ఇల్లు మీ నాన్నకీ, ఇంటిపక్కనీ, వెనకా వున్న స్థలం మిగిలిన పిల్లలకీ అని రాసాడాయన. రాయడం మంచిదైంది. లేకపోతే నిలవనీడకూడా వుంచేవారు కాదు. తన వాటా తనకి పంచిస్తే అమ్ముకుని చదువుకుంటానని రవిచేత చెప్పించారు. వాడు మనింటి పిల్లాడిలా కాకుండా వాళ్ళ పిల్లాడిలా మాట్లాడాడు.
నాకున్న తెలివికి ఇంజనీరింగు చదవాలని ఎంతో కోరిక. నువ్వు పట్టించుకోలేదు. ఇక్కడే వుంటే నీలాగే ఏ గుమస్తానో అయ్యేవాడిని. పావలాకీ బేడకీ లెక్కలు వేసుకుంటూ బతకాల్సి వచ్చేది. కుసుమని నాకిచ్చేవారు కాదు. నువ్వు నీ బాధ్యతనుంచీ తప్పించుకుంటే, మేనమామకాబట్టి ఆయన చేరదీసి చదివించి పిల్లనిస్తున్నాడు- అన్నాడు.
మీ నాన్నకూడా నీలాగే వెలతెలబోయాడు. ఎలాగోలా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసాడు, ఆ చేసినవేవీ గొప్ప సంబంధాలు కావుగాబట్టి తమ్ముళ్ళిద్దరూ అంది వస్తే ఆడపిల్లల మంచీచెడు చూసుకుంటూ అందరూ ఒకచోటే వుంటారనుకున్నాడు. మా తమ్ముడూవాళ్ళూ అదే విషయాన్ని మరోలా ఆలోచించారు. ఇక్కడుంటే బాధ్యతలన్నీ చుట్టుకుంటాయని వాళ్లకి అనిపించింది. కుసుమ ఒక్కర్తే కూతురు. తెగతెంపులు చేసి తీసుకుపోదామని వాళ్ళ ఆలోచన. ఆ చారెడు స్థలం వదులుకోవచ్చుకదా? అప్పట్లో స్థలాలకి ధరేం వుంది? మూడువేలో నాలుగువేలో. అమ్మితే ఎవరో బైటివాడు… ఎలాంటివాడో తెలీనివాడు వచ్చి పొరుగున కూర్చుంటాడు. ఇంట్లో నిండా ఆడపిల్లలు… వెల కట్టించి వాడిచేతిలో పెట్టి పంపాడు మీ నాన్న. డబ్బెక్కడిదనుకున్నావు? లక్ష్మి సగం, మీ అమ్మమ్మ సగం సర్దారు. మళ్ళీ వడ్డీపైసలతో ఎవరిది వాళ్లకి తిరిగిచ్చేసాడు. నిండా ఖర్చులు… అందరికీ పెళ్ళిళ్ళయాయి. పురుళ్ళు, బారసాలలు… ఇల్లంతా ఎలా వుందంటే అలా వుంది. పొద్దున్న నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని బయటికి వెళ్తే ఎక్కడెక్కడో ఏవేవో చేసి జీతంమీద మరో నాలుగుపైసలు తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాడు. మీ అమ్మ చుట్టుపక్కలవాళ్ళ బట్టలు కుట్టేది. బంగారుతల్లే అది. నేను ఏ పూర్వజన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే ఈరోజుని అది నా కుటుంబంలో సగభాగమై నోరు మెదపకుండా నిభాయించుకుని వచ్చింది.
కానీ రాము వాళ్ళ మేనమామని ఆరోజుని అడిగిందీ, ఆరోజునించీ ఈరోజుదాకా వాడిని బాధిస్తున్నదీ… ఒకటే ప్రశ్న-
నేనూ నీకు మేనల్లుడినే, నన్నూ నువ్వు ఎత్తి పెంచావుకదా, ఎందుకీ తేడా- అని.
గీతూ! ఎవరు ఎవరి మనసుకి దగ్గిరౌతారో తెలీదు. పుట్టినప్పట్నుంచీ వున్న లెక్కలన్నీ ఒక్కసారి మారిపోతాయి. మాధవ్ నీకు మరిదవడంకన్నా పెద్దచుట్టరికం వసంత్‍కి తోడల్లుడవడం. మనింట్లో మీ అత్తలందరూ ఎలా సఖ్యతగా వుంటారో వీళ్ళు ముగ్గురాడపిల్లలూ అలానే వుండాలనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ బంధం బలపడుతున్నప్పుడు మరికొన్ని బంధాలు విచ్చుకుపోవటం తప్పదు. అది కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు గట్టిగా వుండాలి. మీ పెట్టుపోతలకి ఆశపడే స్థితిలో ఎవరూ లేరు. అసూయపడటం తప్పించి.
శేఖర్‍కూడా రవిలాగే చేసాడు. ఇల్లు కొనుక్కుంటాను డబ్బుకావాలన్నాడు. వాడి టయానికి ధరలూ పెరిగాయి. మీ నాన్నదగ్గిర అంత డబ్బూ లేకపోయింది. మన పక్కవాళ్ళు, వీడు సగం సగం తీసుకున్నారు. పిందె రాలిపోయిందనుకున్నాడు మీ నాన్న వీడి విషయంలో. కానీ పెద్దవాళ్ల తప్పుల్ని పిల్లలు క్షమించలేరు. మా తమ్ముడితో కలిసి చేసినదానికి వాడు రవికి మళ్ళీ దగ్గిరవలేకపోయాడు. అదొక ఓటమికదూ, వాడికి? పచ్చగా పందిరి వేస్తే కాసిన కాపులోంచీ జాతికాయని ఏరుకుని తెంపుకుపోవటం?” అంది విజ్జెమ్మ.
గీత విభ్రాంతిగా వింది. “నాన్న అంత బాధపడ్డారా?” అంది ఆశ్చర్యంగా.
“ఔనమ్మా! చాలా బాధపడ్డాడు. మామయ్య చదివించాడుగాబట్టి ఈరోజుని ఇలా వున్నానంటాడు రవి. కుసుమ మంచిది. పెళ్లప్పటికి దాని వయసెంతని? పద్ధెనిమిది. వాడు చదువుతుండగానే చేసేసారు. వెళ్లకపోతే మా అమ్మ బాధపడుతుందని వెళ్ళాను. కానీ ఆవిడా మా తమ్ముడిలానే మాట్లాడింది. రవిని వుద్ధరించినట్టు చెప్పుకుంది. అప్పటిదాకా నాది పెద్ద సంసారమని బియ్యం పంపేది. ఇకమీదట పంపవద్దని చెప్పేసి వచ్చాను. గీతూ! మనుషులందరికీ తెలివితేటలు వుంటాయి. అవకాశాలు అందరికీ దొరకవు. పరిస్థితులు వాళ్ళని మాయలా కప్పేసి వుంటాయి. దాన్ని చీల్చుకుని బయటికి రావడమంటే నిన్ను నువ్వు కొంత వదులుకోవడం. కొన్ని బంధాలు తెంచుకోవడం. వాడికి వుద్యోగం వచ్చి, మామ ప్రాపకంలోంచీ బైటికి అడుగుపెట్టాక, కుసుమకీ కాస్త వయసొచ్చి నెమ్మదిగా పరిస్థితులని అర్థంచేసుకుని వాడిని చాలా మార్చింది. దానికి రామూ అంటే చాలా ప్రేమ. ఇప్పుడు సుమతి తిరుగుతుందే, వాడి చెయ్యిపట్టుకుని, అలా తిరిగేది ఈ గొడవలు రాకముందు. ఎంతమందిని ఎత్తిమోసిన చెయ్యమ్మా, అది? ఎంత ప్రేమని పంచిన గుండె వాడిది? రవి విషయంలో కరుడుగట్టిపోయింది” కళ్ళు తుడుచుకుందావిడ.
“గీతా! మామ్మ ఇవన్నీ ఎందుకు చెప్తోందనుకున్నావు? మనుషులంటే ప్రేమలేకాదు, స్వార్థాలుకూడా వుంటాయి. ఎవరిది వాళ్ళు చూసుకున్నప్పుడు అది స్వార్థమనికూడా అనిపించదు. మనకి నష్టం జరిగినప్పుడే అర్థమౌతుంది. అలా జరక్కుండా ముందే జాగ్రత్తగా వుండాలి. దాన్నే తెలివంటారు. ఎవ్వరిమాటలూ మీరు లెక్కచెయ్యద్దు. మీ నాన్నంటే మాకు చాలా గౌరవం. నా తమ్ముని కుటుంబాన్ని నిలబెట్టాడు. ఇంకెంత చేస్తానని విసుక్కోకుండా అక్కుని జేర్చుకున్నాడు. మగపిల్లల్ని దారితప్పకుండా చూసాడు. మేం ముగ్గురం ఆడవాళ్ళం. మగదక్షత లేదు. ఈ పెద్దమనిషి ఇల్లొదిలేసి వెళ్ళిపోయాడు. మేమే ఐతే ఏమీ చెయ్యలేకపోదుము. విన్నావుకదా, అన్నీ మనసులో పెట్టుకో. ఇక లే. అన్నం తిందువు” అంది. గీత లేవబోయేంతట్లో పిల్లవాడు లేచేసాడు. ముందు బద్ధకంగా కదిలి, వళ్ళు విరుచుకుని, కొన్ని అవశిష్టాలని ఏకకాలంలో కానిచ్చుకుని ఇంటిపైకప్పు ఎగరగొట్టే కార్యక్రమం మొదలుపెట్టాడు. వాడి ఆకలి తీర్చి, గీత భోజనం చేసేసరికి సినిమా అయి అందరూ తిరిగొచ్చారు. అందరూ అంటే? మనుషులూ, వారి చుట్టూ వుండే భావావరణం సృష్టించే ప్రకంపనాలు…
భోజనాలయ్యాయి. ముందు మగవాళ్ళూ, పిల్లలూ- తర్వాత ఆడవాళ్ళూ తిన్నారు. విజ్జెమ్మ, లక్ష్మి, యశోద, నీలిమ ఆఖరికి వుండిపోయారు. కూతురూ వియ్యపురాలూ వుండిపోయారని తనూ ఆగింది నీలిమ తల్లి. వీళ్ళు తిని, వంటిల్లు సర్దుతుంటే గీత వచ్చింది.
“నిన్న ఆఖర్న ఎవరో వచ్చారు చూడు, వాళ్ళీ డబ్బులు విహీ చేతిలో పెట్టారు. నీకివ్వడం మర్చిపోయాను”అంది.
“నీ దగ్గిరే వుంచు. వాడికొచ్చిన చదివింపులన్నీ ఈ డబ్బాలో పెట్టాను. కాసేపయాక వీలు చూసుకుని ఎవరెవరు ఏం పెట్టారో పద్దుపుస్తకంలో రాసేద్దువుగాని. మళ్ళీ మర్చిపోతాం” అంది లక్ష్మి. గీత మళ్ళీ తనగదిలోకి వెళ్ళిపోయింది.
భోజనాలైన వెంటనే చాలామంది వెళ్ళిపోయారు. వాసు చిన్న మేనత్త, ఆవిడ కుటుంబం, తులసి, భర్త, అత్తమామలు కలిసి బయల్దేరారు. వాళ్లతోపాటు వాసు పెద్దమేనత్తకూడా ప్రయాణమైంది. అక్కచెల్లెళ్ళిద్దరికీ చక్కటి పేర్లున్నాయి. పెద్దావిడ సక్కూబాయి, చిన్నావిడ కృష్ణవేణి. వాళ్ళ సామాన్లవీ తీసుకుని, బస్సెక్కించి రావటానికి బయల్దేరారు వాసూ, మాధవ్. వాళ్లందరినీ పంపించి తల్లిదండ్రులు కూర్చున్నదగ్గరికి వచ్చింది నీలిమ.
“ఈ మందంతా ఎవరే?” కూతురిగదిలో విశ్రమించిన కుటుంబరావు అడిగాడు కాస్త వెటకారంగా.
“దీని ఆడబడుచు తులసి లేదూ, ఆ అమ్మాయి అత్తగారూ, ఆవిడ తోటికోడలూ, తోటికోడలి చెల్లెలూ, కుటుంబం” అంది నీలిమ తల్లి.
“ఈ ఫంక్షనుకి వాళ్ళంతా దేనికి? వాళ్లకీ జరిగాయా, రాచమర్యాదలు?” కాస్త కోపంగా అడిగాడు.
తండ్రి కోపం చూసి నీలిమ నవ్వింది. “అమ్మకి సరిగ్గా చెప్పడం రాలేదు నాన్నా! మా అత్తగారికి ఇద్దరు ఆడబడుచులు. అందులో పెద్దావిడ … అంటే మా యింట్లో వచ్చి వుందే… ఆవిడ తోటికోడలి కొడుక్కి ఇచ్చి చేసారు తులసిని. ఇంకొకావిడ మా అత్తగారి రెండో ఆడబడుచు” వివరించింది.