ఝరి – 84 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

పుణ్యం… పాపం… ఆ పసిపిల్లలేం చేసుకుని వుంటారు? గీతకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆబగా అన్నం తింటున్న యమున రూపం కళ్ళముందునుంచీ తొలగిపోవడంలేదు. “ఎందుకో ఏడుపొస్తోంది మామ్మా!” అంది.
“ఎందుకే? తిన్నదరక్కా?” అని తిట్టిందావిడ.
“ఏముందీ? యమునని చూసిందికదూ? కన్నీటికుండలు నెత్తిమీదికెక్కాయి. ఏమే గీతా! ఆ పిల్ల కోరి వాడిని చేసుకుంది. ఆడపిల్ల అంత తెగబడకూడదు. తండ్రి పెళ్ళిచెయ్యగలడు, చెయ్యలేడు. దానంతట అది వెతుక్కోవడమేనా? ఏమంత వయసు మీరిపోయిందనే? పట్టుమని పాతికేళ్ళు లేవు. అలాంటి బుద్ధితక్కువపనులు చేస్తే బతుకులు ఇలానే అఘోరిస్తాయి. వడ్డూ పొడవూ చూసి భ్రమలో పడిపోయింది. శరీరం ఎదిగినట్టు వాడికి బుర్ర ఎదగలేదు. బాధ్యత తెలీదు. ఎదిగిన కొడుకుని ఏ తల్లిదండ్రులుమాత్రం ఎంతకని పోషిస్తారు? అక్కడికీ దుబాయ్ వెళ్తానంటే డబ్బిచ్చారు. కొన్నాళ్ళు స్నేహితులతో కలిసి వ్యాపారం వెలగబెట్టాడు. వ్యాపారమే మునిగిందో, స్నేహితులే ముంచారోగానీ డబ్బైతే వదిలింది. ఇప్పుడు మళ్ళీ మొదలెడతానంటున్నాడు. వాళ్ళిద్దరూ పెళ్ళికిముందు ఏం ఏడ్చారో! పెళ్ళయాక నాలుగు నెలలు కలిసున్నారేమో! ఆ పిల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. వాళ్ళ జీవితాలు వాళ్ళవి. దాని పద్ధతిలో అది బతుకుతుంది. నీలా నాలా వుండదు. ఎక్కడేనా కలిస్తే పలకరిస్తాం. మనింటి పిల్లలని ముద్దుచేస్తాం. పదో పాతికో కలిగింది చేతిలో పెడతాం. అంతే” అంది లక్ష్మి. గీత ఆలోచనలకి అక్కడొక కామా పడింది. కానీ అన్నం తింటుంటే యమున రూపం, పాలు తాగుతుంటే పిల్లల కీచు ఏడ్పులు గుర్తొచ్చి ఆమెని భయపెట్టాయి. ప్రశాంతంగా వుండనివ్వలేదు.
రాత్రి భోజనాలవేళ లక్ష్మి చెప్పింది, యమున వచ్చి వెళ్ళిన విషయం.
“రాణాకూడా వచ్చాడామ్మా?” అడిగాడు వాసు కొంచెం కోపంగా.
“వాళ్ళు వెళ్ళేముందు వచ్చి వాళ్ళని బస్సెక్కించి మళ్ళీ వచ్చాడు. ఐదునిముషాలుండి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ వుందికదూ, అందుకు వచ్చాడు” అంది లక్ష్మి.
“చిన్నప్పుడు అందరు ఒక ప్రాణంలా పెరిగారుకదరా? వాడినలా ఎలా వదిలేసారు?” అంది విజ్జెమ్మ బాధపడుతూ.
“మేం పనికిరాలేదు అమ్మమ్మా, వాడికి. చెత్తవెధవల్తో తిరిగేవాడు. ఇప్పటికీ అంతే. వాళ్ళే వాడికి సర్వం” అన్నాడు మాధవ్.
“రేపు బారసాలకి అంతా వస్తారుకదా, సంధ్యనీ, దాని భర్తనీ అందర్లో పెట్టి నిలదీస్తాను. ఇష్టమో కష్టమో పెళ్ళంటూ చేసుకున్నాక దానికి కట్టుబడి వుండాలి. రెండుచేతులూ కలిస్తేనేగా, చప్పట్లు? తప్పంటూ జరిగిందంటే అందులో ఆడా మగా ఇద్దరి పాత్రా వుంటుంది. వీడేమో దులపరించుకుని తిరుగుతున్నాడు, అదేమో నెల బాలింతరాలు…వెళ్ళి సంపాదించుకొచ్చి, పిల్లల్ని పోషించుకోవాలా? మనింటా వంటా ఇలాంటివి లేవు” అందావిడ.
“అవన్నీ వద్దులే, అమ్మమ్మా! రవి మామయ్యతో చెప్పిద్దాం. సుమతీ, మహీ, సమీరా, తులసీవాళ్లంతా వస్తారు. కొత్తకోడళ్ళుంటారు. బావగార్లముందూ, ఆడపిల్లలముందూ గొడవెందుకు? ఇంటిపరువు తీసుకోవడం దేనికి? విడిగా మాట్లాడుకుందాం” అన్నాడు వాసు. భోజనాలయ్యాయి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు.
“ఏదేనా చెయ్యాలనుకుంటే చెయ్యి. అంతేగానీ ప్రపంచభారమంతా నువ్వే మోస్తున్నట్టు తిరక్క” అన్నాడు వాసు గీతతో.
“అలా కనిపిస్తున్నానా?” అడిగిందామె.
“నీగురించి నాకు తెలీదా తల్లీ? పరామర్శకి వెళ్ళి ఇంకో కొడుకుని ఎత్తుకొచ్చావు”
“వాళ్ళవాళ్ళంతా వుండగా మనం ఎందుకు చెయ్యాలన్నది ప్రశ్న”
“అప్పుడే వదిలెయ్యాల్సింది. తలదూర్చావు”
“అలా ఎలా? తిండీ లేక, వైద్యమూ లేక చచ్చిపోయేది యమున”
“ఇప్పుడా పిల్లలూ అంతే. ఎవరూ పట్టించుకోక, ఆకలి తీరక…” ఆగిపోయాడు.
“ప్లీజ్ వాసూ, అలా అనకు” ఆమెకి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
“ఎక్కువగా ఆలోచించకు. ఏం చెయ్యాలో రవి మామయ్యని కలిసి ఆలోచిస్తాను. ఎలాగా మయూని స్కూల్లో వేస్తూ వాడికి తోడుగా వుండేలా ఇంకో పిల్లాడి చదువు ఎత్తుకుందామనుకున్నాం. అదేదో ఇప్పుడే మొదలుపెడదాం. పాలడబ్బాలకి పెద్ద ఖర్చవదులే. ఇద్దరికీ బోల్డంత సర్వీసు ముందుంది. మన సంపాదనలో తరిగిపోయేది లేదు” అన్నాడు.
“కమలాకర్‍గారు ఫోన్ చేసి, మాట్లాడారు. ఇక్కడ వీడు చేస్తున్నట్టే అక్కడ వాడూ బాగా అల్లరి చేస్తున్నాడట” అంది గీత.
“బారసాలకి రమ్మందాం” అన్నాడు.
“ఆవిడ కదిలే స్థితిలో లేదట. సైకియాట్రిస్టుకి చూపిస్తున్నారట. మనమే వీలుచూసుకుని వెళ్ళి చూసి రావాలి” అంది.
అవతలగదిలో నీలిమ మాధవ్‍తో అంటోంది.
“మీ వదిన సాక్షాత్తు అమ్మవారేనట. కాళ్ళకి దణ్ణాలూ… ఆహాలూ వోహోలూ”
“ఏం? ఆవిడేదైనా ఎర్రటి పట్టుచీర కట్టుకుని, ఇంత కుంకంబొట్టు మెత్తుకుని కూర్చుందా?” పకపక నవ్వాడు మాధవ్.
“కొందరి దగ్గర గారాలూ, ఇంకొందరికి దానాలూ… అందరూ ఆమె చూపుడువేలి చుట్టూ తిరుగుతారు”
“నువ్వూ ఇచ్చావుకదా? కాళ్ళుముందు పెట్టి దణ్ణం పెట్టమనాల్సింది” అన్నాడు ఇంకా నవ్వుతునే. చురచుర చూసింది నీలిమ. ఇతనికి ప్రతీదీ వేళాకోళమే. “అడిగి దణ్ణం పెట్టించుకోవల్సినంత ఖర్మ నాకు పట్టలేదు. పెట్టేవాళ్ళకీ, పెట్టించుకునేవాళ్ళకీ వుండాలి ఆ జ్ఞానం” విసురుగా అంది. అతను నవ్వుతునే వున్నాడు.
“ఔను, రాణా బావగారితో మీకేంటి గొడవ?” అడిగింది.
“మా రహస్యాలన్నీ చెప్పించేస్తావేంటి కొంపతీసి? పదకొండుమంది పిల్లలం, పాతిక ముప్పయ్యేళ్ళపాటు ఒక్కగుంపుగా తిరిగామంటే ఎన్ని వుంటాయి?”
“ఏమిటో అవి?”
“చెప్పక తప్పదా?”
“దాచుకోండైతే”
“రాణా గీతనేదో అన్నాడు. వీళ్ళిద్దరూ వాళ్ళింటికెళ్ళి దెబ్బలాడి వచ్చారు. రవి మామయ్యకి తెలిసి చితక్కొట్టేసాడు”
“ఈ యాంగిల్‍కూడా వుందా, ఆవిడ లవ్‍స్టోరీలో? మీ అన్నయ్యా వదినా చిన్నప్పట్నుంచీ కలిసి తిరిగేవారా? వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారని మీకందరికీ తెలుసా?” కుతూహలంగా అడిగింది. లక్ష్మిని అప్పుడెప్పుడో అడిగినవే, ఇతన్ని మళ్ళీ అడిగింది.
“అలాంటిదేం లేదు. సడెన్‍గా పెళ్ళి ప్రస్తావన వచ్చింది. ఇద్దరూ ఒకళ్ళ పేరొకళ్ళు చెప్పారు”
“అంతేనా?!”
“అంతకన్నా ఏం వుంటుంది? మనిద్దరికీ మధ్యనిమాత్రం ఏం జరిగింది?”
“గొడవ వాళ్ళకి మధ్యని. మధ్యలో మీరెందుకు మాట్లాడకపోవటం?”
“మనమూ వాళ్ళూ ఏమిటి? గీత మా వదిన. మా పదకొండుమందిదీ ఒకటే మాట. అందులో తప్పుచేసింది వాడు. మిగిలినవాళ్ళం వాడిని ఎక్స్‌పెల్ చేసాం”
“సుమతి వదిన అతన్తో మాట్లాడుతుంది”
“మాట్లాడ్డమంటే? ఇందాకా నేను మాట్లాడలేదా? అలాగే. అవసరమైతే మాట్లాడుతుంది. ఎదురుపడితే మాట్లాడుతుంది. వాసూ, సుధీర్ తప్ప మిగతా అందరం తనకన్నా చిన్నవాళ్ళం. ఆ చనువుతో కోప్పడుతుంది, చరుస్తుందికూడా”
“తను మీ వదినతో ఎందుకు మాట్లాడదు?”
మాధవ్ ముఖంలో నవ్వు మాయమైంది. చెప్పాలా వద్దా అనే సందిగ్ధం. ఎందుకు, ఈ అనవసర కుతుహలం? మరొకళ్ళ జీవితంలోకి తొంగిచూడటం? చెప్పకపోతే అలుగుతుంది. మరోవిధంగా తెలుసుకుంటుంది. ఎవరో ఒకళ్ళు చెప్తారు. దానికన్నా తనే చెప్పడం మేలు.
“సుధీర్‍కి గీతని అడిగారు. గీత చేసుకోనంది. అదే కోపం” క్లుప్తంగా అన్నాడు. నీలిమ అపనమ్మకంగా చూసింది. ఏమంత అందంగా వుండని గీతని రాజకుమారుడిలాంటి సుధీర్‍కా? అతనికో సుమంత్‍కో ముందు తననీ, తర్వాత మానసనీ అడగాలనుకుని అందుకోలేమని వూరుకున్నాడు తండ్రి. అలాంటిది గీతని వాళ్ళు అడగడం, ఆమె కాదనటమూనా?!! నిజమేనా?!!
“మీ అన్నయ్యతో బానే మాట్లాడుతుందిగా?”
“అమ్మా! తల్లీ! మాలో మాకు ఎన్ని గొడవలూ కోపాలూ వున్నా అవేం సీరియస్ కాదు. వాసు తనకి అన్న. వాడిమీద పెత్తనం చేస్తుంది. గీత వదిన, తను ఆడబడుచు. అందుకు ఈవిణ్ణి సాధిస్తోంది. ఇద్దరూ మాయింట్లో మహారాణులు. అమ్మావాళ్ళవైపునించీ అది పెద్దమనవరాలు. మామయ్యల పిల్లల్లో గీత. ఈవిడెంతో ఎంతో అదీ అంతే. ఇద్దరూ సమవుజ్జీలు. అది మాట్లాడకుండా సాధిస్తే ఇది నోరు తెరవకుండా పుల్లలు పెడుతుంది” అన్నాడు. అని,
“చిన్నప్పటి స్నేహాలు ఒకళ్ళమీద ఒకళ్ళకి అధికారాన్నివ్వవు నీలూ! అవసరం వస్తే ప్రాణం పెడతాయి తప్ప అతిక్రమణలు చెయ్యనీవు. సరదాగా కలుసుకుని మాట్లాడుకోవడానికీ, ఒక డైవర్షన్‍లాగా… స్ట్రెస్ బస్టర్‍లాగా అంతే. పీర్‍గ్రూపనేది మనిషికి చాలా అవసరం. మనింట్లోనే ఇందరం వున్నాం. బయటి స్నేహాలు అవసరం లేదు. నీకు ఎవరితో కంఫర్టబుల్‍గా వుంటుందో వాళ్ళతో ఓపెన్‍గా మాట్లాడ్డం మొదలుపెట్టు. గీత చెడ్డది కాదు. తనకి కల్మషం తెలీదు. నీమీద తనకి ఎలాంటి కంప్లెయింట్సూ లేవు. తనని అందరూ ఇష్టపడటానికి కారణం మన కుటుంబంలో తన స్థానం. పెద్దమామయ్య కూతురు, వాసుని చేసుకుందని. వాసంటేకూడా అందరికీ ఇష్టం. వీళ్ళిద్దరనేకాదు, మనింట్లో పిల్లలందరికీ ఒకళ్లనొకళ్ళు ఇష్టపడటమే నేర్పించారు. ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలం అమడపిల్లల్లా పెరిగాం” అన్నాడు అనునయంగా.
నీలిమకి అతను చెప్పినవి సంతృప్తినివ్వలేదు. ఇంకా వివరంగా, పూసగుచ్చినట్టు తెలుసుకోవాలనుంటుంది. అప్పుడేకదా, అతనికీ తనకీ అరమరికలు లేకుండా వుండేది? ఏదీ పూర్తిగా చెప్పకుండా అన్నీ దాచుకుంటే ఎలా? అతను చెప్పిన- గీతని కలుపుకుపోవటమనేది అసలు నచ్చలేదు. నీడలా అందర్నీ, అన్నిటినీ గీత ఆక్రమించేస్తూ వుంటే ఆ చీకట్లోకి తను వెళ్ళటం జరిగేపనికాదు. తొమ్మిదిమంది మగపిల్లలూ, పదిమంది ఆడపిల్లలూ వున్న ఈ కుటుంబంలో తన వునికి ఎక్కడ? కేంద్రకంలాంటి గీతని దూరంగా జరిపితేగానీ తనకి పట్టుదొరకదు. తనలో ఏర్పడ్డ వెల్తిలోకి మరికాస్త ద్వేషాన్ని వంపుకుంది నీలిమ.
ఆరోజు గడిచింది. వాసు తనేదో ఒకటి చేస్తానన్నాడుగాబట్టి గీతకి నిశ్చింతగా వుంది. అతనుకూడా ఆమె నమ్మకాన్ని వమ్ముచెయ్యలేదు. పాలడబ్బాలు కొని పంపమని డబ్బివ్వటానికి రవి యింటికి వెళ్ళాడు.
“ఎలా వుందిరా, నీ వీరప్రేమికురాలు? డేట్ ఎప్పుడిచ్చారు?” అడిగింది కుసుమ వేళాకోళంగా. వాసు సిగ్గుపడ్డాడు.
“కొత్తగా పెళ్ళైనట్టూ, ఇదే తొలిచూలన్నట్టూ అలా సిగ్గుపడతావేరా? దబాయించి ఎలా తిరగాలో ఇంకా నేర్చుకోలేదా దానిదగ్గిర? అసలు మీయిద్దర్లో ఎవరెక్కువ సిగ్గుపడతారు, నువ్వా? రౌడీరాణీయా? ” ఆటపట్టించింది.
“అత్తా!!” అన్నాడు వాసు. ఆమె నవ్వేసి, “మాట్లాడుకోండి. టిఫెన్ తెస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది. వాసు తనొచ్చినపని చెప్పాడు రవికి.
“మీకెందుకురా?” అన్నాడు రవి.
“ఆ పిల్లల్ని చూసి గీత చాలా బాధపడుతోంది. కళ్ళమ్మట నీళ్ళొక్కటే తక్కువ. పోయినసారి ఎంత హడావిడి చేసిందో నీకు తెలీనిదేముంది? ఇప్పుడు ఇదో కొత్తగొడవ. డెలివరీకి వుంది. ఈ ఆలోచనలతో ఏమి ప్రాణంమీదకి తెచ్చుకుంటుందోనని భయంగా వుంది. అమ్మమ్మేమో పంచాయితీ పెడదామంది. గీతేమో హక్కులూ లెక్కలూ అంటూ మాట్లాడుతోంది. దానికి న్యాయం అంటే కచ్చితంగా చాకుతో కోసి పండుముక్క తీసి ముందు పెట్టినట్టుండాలి. అలా ఎలా కుదుర్తుంది? టైము చూసుకుని వచ్చినట్టు అసలా అమ్మాయి మా యింటికెందుకొచ్చిందో తెలీడం లేదు. జాలిపడతామనా? వాడే పంపించినట్టున్నాడు” అన్నాడు వాసు.
“పంచాయితీ దేనికిరా? ఎవళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవాలిగానీ, చిన్నపిల్లలా కూర్చోబెట్టి నచ్చజెప్పడానికి?” నిరసనగా అన్నాడు రవి.
“నేనూ వద్దన్నాను మామయ్యా! వీడితోటి న్యూసెన్స్‌గా వుంది. టిక్కెట్టు కొని దుబాయ్ తీసుకెళ్ళి పాస్‍పోర్టు లాక్కుని వదిలేసి రావాలి వెధవని. మేమూ ఈ వూరొదిలిపెట్టం, వాడూ ఇక్కడినుంచీ కదలడు. అమీతుమీ తేల్చుకోవాలన్నట్టే వుంది వ్యవహారం” అన్నాడు వాసు. రవి నవ్వాడు.
“నేనున్నారా! మీ జోలికి వాడు రాకుండా చూసుకుంటాను. ఈ పాలడబ్బాల్లోకూడా నీ పేరొద్దు. అమ్మ పంపించిదని చెప్తాను. ఆవిడదగ్గిరా డబ్బుంటుందిగా? ఎవరో ఒకళ్లం ఇస్తుంటాం. నమ్ముతాడులే” అన్నాడు. కుసుమ దోసెలు పోసి తీసుకొచ్చింది. పిల్ల చదువులగురించి అడిగాడు వాసు. అతనక్కడ వుండగానే గీత మేనమామ ఫోన్‍చేసాడు. రవి ఎత్తి, పలకరింపులు అవగానే వాసుకి ఇచ్చాడు.